అరుదైన కమ్యూనిస్టు
మీరు
చెప్పేదానిని జాగ్రత్తగా వినే కమ్యూనిస్టు రాజకీయ వేత్త ఎవరైనా మీకు తెలుసా?
ఒక రిక్షావాలాకు అవసరమైన శస్త్ర
చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసి, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేంతవరకు రోజంతా అతని వద్దనే ఉండే కమ్యూనిస్టు రాజకీయవేత్త
ఎవరైనా తెలుసా?
ఒక భారతీయ
పౌరునికి అర్హమైన గౌరవం ఇస్తూ రోగికి చికిత్స చేయని పక్షంలో ఏ డాక్టర్‌తోనైనా
పోట్లాడేందుకు సిద్ధపడే కమ్యూనిస్టు రాజకీయవేత్త ఎవరైనా మీకు తెలుసా?
మహిళలను ఎప్పుడూ ఏ విధంగానూ
అగౌరవపరచరని మీరు పరిపూర్ణ విశ్వాసంతో చెప్పగల కమ్యూనిస్టు రాజకీయ వేత్త ఎవరైనా మీకు
తెలుసా?
సదా జనసమ్మర్ధంతో,
వాహనాల రాకపోకల రద్దీతో ఉండే లక్డీకపూల్ వద్ద
రోడ్డు నడిమి భాగంలో నిర్లక్ష్యంగా విసరివేసిన అరటి తొక్కపై కాలు వేసి ఎవరూ
జారిపడకుండా ఉండేందుకై దాన్ని ఎత్తుకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీలో పడవేసే
మనిషి ఎవరైనా మీకు తెలుసా?
అటువంటి ఉదాత్త వ్యక్తి ఒకరు నాకు తెలుసు.
ఆయన గురువారం అర్థరాత్రి కీర్తిశేషులయ్యారు.
ఆ సజ్జనుడే, సి.కె. అని అందరూ గౌరవంగా పిలిచే సి.కె.
నారాయణ రెడ్డి.
కొన్ని వర్గాలలో చిత్తూరు జిల్లాకు చెందిన కమ్యూనిస్టు
రాజకీయవేత్తగా సుప్రసిద్ధుడు; ఇతర
వర్గాలలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచ్.బి.టి.) సంస్థాపకుడుగా సుపరిచితుడు. పాఠశాల,
కళాశాల విద్యాభ్యాసకాలంలో తనకున్న ప్రతిదీ పేదలకు
ఇచ్చివేసిన మంచివాడుగా ఆయన పేరుకెక్కారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ పేద విద్యార్థుల కోసం ఒక
హాస్టల్‌ను ఆయన ప్రారంభించారు. అప్పటికి ఆయనకు నిండా ఇరవై ఏళ్ళు కూడా ఉండవు.
క్విట్
ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికై చదువుకు స్వస్తి చెప్పారు. జయప్రకాష్
నారాయణ్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీలో కొంతకాలం పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. 1962లో పీలేరు శాసనసభ నియోజక వర్గం నుంచి
పోటీచేసి గెలిచారు. అయితే భారత్-చైనాల మధ్య యుద్ధం రావడంతో ఆయనకు కారాగారవాసం
ప్రాప్తించింది. 1967లో
చారుమజుందార్ గ్రూపులో చేరారు. 1970లో ప్రభు త్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975లో మళ్లీ జైల్లో
నిర్బంధించింది. 1977లో విడుదలైన అనంతరం ప్రగతిశీల సాహిత్యం
ప్రచురణకు సి.కె. అంకితమయ్యారు. రిచర్డ్ అలెన్, టెడ్ గోర్డన్‌ల 'ది స్కాల్‌పెల్, ది స్వోర్డ్', విలియం హింటన్ 'ఫాన్‌షెన్', మేరీ టైలర్ 'మై ఇయర్స్ ఇన్ ఏన్ ఇండియన్ ప్రిజన్', ఎడ్గార్‌స్నో రాసిన 'రెడ్ స్టార్ ఓవర్ చైనా' మొదలైన పుస్తకాలను ఆయన తెలుగులో ప్రచురించారు.
నేను ఒక నిర్దిష్ట తిరుగుబాటు దశలో
ఉన్న కాలంలో సి.కె.తో నాకు తొలుత పరిచయమైంది. అప్పుడు నా వయస్సు ఇరవై
ఐదేళ్ళు. ఒక నక్సలైట్ గ్రూపులో పనిచేసి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుల ధోరణికి విసిగిపోయి బయటికి వచ్చాను. తమ మాటే నెగ్గాలనే
మొండి పట్టుదల వారిది. ఇతరులు చెప్పేదానిని వినిపించుకొనేవారు కాదు. మహిళలను అణచివేసే
వారు. ఇతరులూ మానవులేనని గుర్తించేవారు కాదు.
సి.కె. నా భర్తకు పినతండ్రి.
నక్సలైటు పార్టీలోని వ్యవహారాలతోనే కాకుండా కుటుంబ బాంధవ్యాలతో కూడా నేను
అలసిపోయాను. ఈ బాంధవ్యాలు యువతులకు కొన్ని హద్దులు, తరచు హింసాత్మకంగా కూడా విధించేవి. పుట్టింటి
బంధనాల నుంచి తప్పించుకున్న నేను వివాహం ద్వారా మరో కుటుంబానికి సన్నిహితమవ్వడమనేది
నేను కోరుకునే చివరి విషయం.
సి.కె.తో పరిచయమైన ఏడు సంవత్సరాల
వరకు, ఆయనతో నా బాంధవ్యాన్ని
నేను అంగీకరించలేదు.
దీనికి ఆయనేమీ బాధపడలేదు. 1980లో
సి.కె. నేతృత్వంలో ఒక చిన్న బృందం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది.
హెచ్.బి.టి. ప్రచురించిన తొలి పుస్తకాలతో సి.కె., నేను కలసి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణానికీ,
ప్రతి పెద్ద గ్రామానికీ వెళ్ళాం.
కొద్ది నెలల కాలంలోనే ఆయన పట్ల నాకు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి.
ఆయన చాలా
అరుదుగా మాట్లాడేవారు. సదా ఇతరులు చెప్పేదానిని వినేవారు. ఆయన తరానికి
చెందిన ఏ కమ్యూనిస్టులోనైనా ఇదొక గొప్ప గుణం. తనను తాను మరచిపోయి పనిచేసేవారు. ఇతరులను
స్వార్థానికి ఉపయోగించుకొనే గుణం ఆయనలో ఏమాత్రం లేదు. చాలా సున్నితంగా,
మృదువుగా వ్యవహరించే వారు. తన
ప్రతిపాదనలను నిష్పాక్షికంగా చర్చించేవారు.
ముఖ్యంగా మహిళలు, పేదవారిపట్ల ఒక పరిపూర్ణ పెద్ద మనిషి
తరహాలో వ్యవహరించేవారు.
నాకుతెలిసిన కమ్యూనిస్టులలో ఇది పూర్తిగా కనరాని విషయం. సంపన్నులతో సాపేక్షంగా కఠిన వైఖరితో
వ్యవహరించడంలో ఆయన ఆనందాన్ని పొందేవారు. నిధుల సమీకరణకు మేము ఎవరి గృహానికైనా
వెళ్ళినప్పుడు ఆ గృహస్థుడు తాను కొత్తగా ఇల్లు కట్టుకున్నాననో లేదా
కుమార్తె వివాహం చేశాననే సాకుతో విరాళం ఇవ్వలేనని చెప్పినప్పుడు సి.కె.
ఊరుకునే వారు కాదు. అందుకే మీ దగ్గరికొచ్చామని స్పష్టం చేసేవారు. మీరు ఫలానా
వ్యవహారానికి ఫలానా మొత్తంలో ఖర్చుపెట్ట గలరని విన్నాము. అందుకే
మిమ్ములను అడగదలచుకున్నదానికి రెట్టింపు ఇవ్వాలని అడుగుతున్నామని సి.కె. అనేవారు.
ఆయనలోని మానవతా దృక్పథం నన్ను
విశేషంగా ఆకట్టుకొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు,
గ్రామాల్లో ప్రయాణిస్తుండగా కూడా
ఎక్కడైనా రోడ్లపై అరటి తొక్కలు కనిపడితే వాటిని తీసివేసేవారు. నిత్యం ఆస్పత్రులను
సం దర్శించి
రోగుల బాగోగులను చూస్తుండేవారు. పేదలు, అవసరంలో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా పట్టించుకొనేవారు. నాకు
తెలిసిన కమ్యూనిస్టులో కెల్లా సి.కె. చాలా చాలా భిన్నమైన, విలక్షణమైన వ్యక్తి. జంట నగరాల్లో కుక్కల
సంతతి ఎక్కువై
కుక్కకాటుకు బాధితులైన పేదల సంక్షేమాన్ని పట్టించుకొనేవారు. పేద గ్రామీణ ప్రజల
ఆరోగ్యాన్ని హరిస్తున్న ఫ్లోరోసిస్ సమస్య, పారిశ్రామిక కాలుష్య సమస్యల పరిష్కారానికి ఆయన ఇతోధిక
కృషి చేశారు. దళిత బాలబాలికలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడానికి ఆయన శ్రద్ధ
చూపారు. శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యలకు
ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పించినప్పుడు స్వయంగా మాజీ ఎమ్మెల్యే అయివుండీ ఆ నిర్ణయాన్ని సి.కె.
వ్యతిరేకించారు.
ఎస్.ఆర్. శంకరన్ తాను ఇద్దరు
వ్యక్తులకు భయడతానని, వారిలో
ఒకరు సి.కె. అని చెబుతుండేవారు. ఎందుకంటే సి.కె. ఏదైనా ఒక సమస్య
విషయమై శ్రద్ధ చూపితే అది పరిష్కారమయ్యేంతవరకు తదేక దీక్షతో కృషి చేసేవారని
శంకరన్ అనేవారు. హెచ్.బి.టి.కి సి.కె. సంస్థాపకుడు, హృదయం, ఆత్మ. ఆయన నాకు మార్గదర్శకుడు. నేను అన్ని
కుటుంబ బాంధవ్యాలకు దూరమయినాను కదా. ఆయన చాలా ఉదారుడు. ఆయన నాకు తండ్రి, తల్లి, స్నేహితుడు. 1994లో ఆస్పత్రిలో ఉండవలసి వచ్చినప్పుడు సి.కె. రోజూ
వచ్చి నన్ను పరామర్శిస్తుండేవారు. నేను త్వరగా కోలుకోవడానికి ఆయన
సహాయపడ్డారు.
కాలంతో పాటు నడిచిన వ్యక్తి సి.కె..
గతకాలం గురించి ఆయన ఎన్నడూ ఏదో కోల్పోయామన్న భావనతో ఆలోచించేవారు కాదు. ప్రజల్లో
నిత్యం వస్తున్న మార్పులను గమనించే వారు. గతంలో కంటే ఇప్పుడు ప్రజల్లో
చాలా మార్పులు వచ్చాయని, స్వతంత్ర
వైఖరితో మాట్లాడడానికి సాహసిస్తున్నారని ఆయన గుర్తించారు. కనుకనే తన వయస్సులో ఉన్న
ఇతరుల కంటే వర్తమాన రాజకీయాలు, ఉద్యమాల
ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించేవారు. వాటిని ప్రశంసించేవారు. ఇప్పుడు 'మంచి మనిషి'గా, 'స్వార్థరహితుడు'గా
ఉండడం ఆనవాయితీగా లేదు. విస్తృతస్థాయిలో సంబంధాలు కలిగివుండడానికి, టెలివిజన్‌లో కనిపించడానికి, ఇతరులు తన గురించి తరచూ రాసేందుకే అందరూ
శ్రద్ధ చూపుతున్నారు. సి.కె. నిజంగా మంచి మనిషి, నిస్వార్థపరుడు, మహోన్నతుడు. ఆయన నుంచి చాలా మంది స్ఫూర్తి
పొందారు. మన జీవితాలలో ఆయన సజీవుడుగా ఉంటారు.
- గీతా రామస్వామి
(ఆంద్ర జ్యోతి 7 సెప్టెంబర్ 2013 సౌజన్యంతో )
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఈరోజు కొన్ని పత్రిక లలో వచ్చిన వార్తల కత్తిరింపులు :
The Hindu 7 9 2013
‘Piler Gandhi’ dead
Challa Krishna Narayan Reddy, veteran Communist leader and
freedom fighter, popularly known as CK and ‘Piler Gandhi’, for his spartan
lifestyle, passed away here on Thursday night. He was 88 and survived by wife
Jayaprada and two daughters. In accordance with his wish, his body was donated
to Gandhi Medical College.
Born on August 1, 1925, at Challavaripalle near Piler of Chittoor
district, he discontinued his BA and joined Quit India Movement. Under the
influence of Mahatma Gandhi, he spun the charkha and used to wear pure khadi.
He joined Communist movement in 1953.
CK was elected to the AP Assembly on Communist Party ticket in
1962. He was arrested again during the Emergency. On release from prison in
1977, he began Janata Prachuranalu and Anupama Prachuranalu and
published transformative literature. He founded the Hyderabad Book Trust in
1980 along with social activist, Gita Ramaswamy.
— Special Correspondent
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
The Hans India 7 9 2013
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
Eenadu 7 9 2013
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,