Wednesday, September 28, 2011

ఊరు వాడ బతుకు - పుస్తక పరిచయం - అనంత్ ...



యువ రచయిత తొలి రచన ఊరూవాడా బతుకు వెయ్యి ఆత్మలు చెప్పుకున్న కతల కమలం. ఇటీవల తెలుగులో నచ్చిన ఆత్మకతలలో గడియారం రామకృఫ్ణ శర్మ శతపత్రం ఒకటి. గడియారం రామకృఫ్ణ శర్మ తన శ్వేతపత్రానికి ఒక్కో రెక్కా అమరుస్తున్న కాలంలో ఆయనతో నేను చాలా సార్లు ముచ్చటించాను. ముచ్చటించిన ప్రతి సందర్భంలోనూ నేనన్నది ఒకే మాట. అది నాకిప్పటికీ గ్నాపకం.
"
మీరు చరిత్ర రాయడం మానేసి గ్నాపకాలు రాయండి" అని.
"
నీవన్నంత సులభం కాదు వాటిని విడదీయడం" అన్నట్టు నవ్వారు. ఆయన అవేవీ రాయలేదు తన శతపత్రంలో.
మరోసారి కలిసినపుడు మళ్ళీ నిలదీసాను.
"
ఎన్నని రాస్తాం"- అని పెదవి విరిచారు.
"
ఏది రాయకూడదనుకుంటున్నారు మీరు" - అడిగాను
సమాధానంగా అద్భుతమైన అనిక్ డోట్స్ చెప్పారు.
"
రాయండి ఇవన్నీ"- అన్నాను.
"
ఓపిక లేదు. అనుకున్నదే రాయలేకపోతున్నాను"-అని తన పెన్షన్ క్లియరెన్స్ కోసం రాసిన పేద్ద ఉత్తరం ఇచ్చారు.
అలా శతపత్రంలో రెక్కలు తొడగని గ్నాపకాలెన్నో.
ఆ శతపత్రం తర్వాత దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన ఈ శ్వేతపత్రం చదువుతుంటే బిగ్ ఫిష్ సినిమా గుర్తుకువస్తుంది.
ఈ రెండు కథల్లాంటి ఆత్మల్లో అదొక్కటే పోలిక.
గడియారం రామకృఫ్ణ శర్మ లోకానికి తన శ్వేతపత్రం సమర్పించక ముందే అతని జీవితానికి వేల రెక్కలు తొడిగిన కమలమ్మ సెలవంటూ వెళ్ళిపోయింది.
తెల్లారిన వేళ పొడిచిన చందమామతో మొదలై కలికి గాంధారి వేళ విరిసిన కమలంతో ముగుస్తుంది దేవులపల్లి కృష్ణమూర్తి గాధ. అక్కడా ఇక్కడా రెక్కల లెక్క మాత్రం వందే. ఆ వందే మా తరమ్ కాదు.


ఇది పితృస్వామ్యం. కాబట్టే నేను సీమవాసిని అయ్యాను. కానీ ననుకన్న గొట్టుముక్కుల సామ్రాజ్యలక్ష్మిది కొల్లాపురమే. తల్లి తెలంగాణ. పిత్రార్జితమే తెలంగాణ.మగ్గాల లడీల మారు మోతల నడుత గడిచింది కోడుమూరులో నా బాల్యం. ఎమ్మిగనూరు నుంచి కోడుమూరు వరకు నేశోళ్ళే నా నేస్తులు. కొత్త సామాజిక బాధ్యత నెత్తిన వేసుకున్నట్టు పోజు కొట్టే చాలా మంది ఆత్మకతాత్మక రచయితల్లా కాకుండా నింపాదిగా, నిమ్మలంగా, సాదాసీదాగా పూసగుచ్చినట్టు గ్నాపకాలను గుర్తుకు తెస్తున్న కొత్త నేస్తమే ఈ దేవులపల్లి కృష్ణమూర్తి.


గూగుల్ సెర్చ్ లో అస్సలు దొరకదీ గుల్ మొహర్ గ్రామం. పేరు అనంతారం. మొదటి పేజీ మొదలు పుస్తకం తిప్పుతుంటే బ్యాక్ గ్రౌండ్ లో దాసరి రాములు తన లోగొంతుకలో సన్నగా సందమామను పొడిపిస్తాడు. అదీ పొదలపొదల గట్ల మీంచి. అంతే... అక్కడి నుంచి మీకు పలు పాటలు రాసిపెట్టి వున్నాయి ఈ పుస్తకం నిండా.
పాటలే.. పాటల్.
బొట్ల బొట్ల చీర కట్టి మగ్గం ఆడిస్తూ కాపోడు అయిన తన బాయ్ ఫ్రెండ్ ను కలుసుకునేందుకు బోనగిరి వెళ్ళి అక్కడి నుంచి కాకినాడకు రైల్లో వెళ్ళి కలిసే ప్రియురాలి నోస్టాల్జిక్ బాట ఒక పాట.
తనతో నడిపే ప్రతి యవ్వారానికి ఒక రేటు పెట్టే ఒక జాణ పాటలో టారీఫ్ ని తారీఫ్ చేయకుండా ఎలా వింటాం?
నల్లది, పొట్టిది అయిన ఇంకో నల్ల పిల్ల(తమిళ అర్థంలో) -హమ్ కాలే హై తొ క్యా హువా దిల్ వాలే హై-అంటూ ఇంటికి ఇన్ వైట్ చేస్తుంది. ఎంటైస్ చేస్తుంది పాట పాడి...
బుర్రకథ, బాగోతాలు, కలుపు పాటలు, అలుపు రాకుండా రోకటి పాటలు, నిద్ర రాకుండా జాగారం పాటలు, కవ్వించే పాటలు, అణచుకున్న కోర్కెను మనసారా కైగట్టే పాటలు, పాటలే పాటలు... గాజులోడి పబ్లిసిటీ పాటలు, గాజుల కోసం పడిగాపులు కాసే అమ్మాయిల పాటలు...
ఓహ్ కృష్ణమూర్తీ నీ పాటల్....
ఆలస్యంగానయినా పాడుతున్న అరుదైన, అపురూపమైన పాటే ఈ పుస్తకం.
గ్రామాల గురించి మూల మూలనా మూరలతో కొలిచినట్టు, జాడలతో తూచి నట్టు ఈ 70+కృష్ణమూర్తి తన బాల్యం గురించి నిన్న అన్నంత తాజాగా స్వ్కేర్ ఫీట్ బై స్వ్కేర్ ఫీట్ కైకట్టడం రేర్ ఫీట్. ఇది పక్కా రెవెన్యూ వ్యూ. పల్లెల్లో కులాలు, వాటి కింది కులాలు, వాటి ఆశ్రిత కులాలు, వాళ్ళ పని విభజన. శ్రమకు విలువ చెల్లించే ఆచారాల్లాంటి బాధ్యతలూ... చిన్న చిన్న వివరాలు. చీకూ, చింతా, పస్తూ తెలియని బతుకుల పల్లె ఇంతలా తెలిసిన మాతృమూర్తి కృష్ణ మూర్తి.


ఆంధ్రా నుంచి వలస వచ్చిన ముస్లిం అమ్మాయి, పైగా పిల్ల తల్లి; ఆపై చెప్పేది ఝాన్సీ లక్ష్మి బాయి బుర్రకథ. ఆమె కథ చెప్తే అది మెగా సినిమానే. ఈమె గ్నాపకం కృష్ణమూర్తిని చాన్నాళ్ళు వెంటాడింది. ఆ పిల్ల అందం ఒక తియ్యని గ్నాపకం కృష్ణమూర్తికి.
ఇక కుడుముల పండుగకూ కుక్కల కడుపు నిండటానికీ వున్న సింబయాటిక్ సంబంధం ఒక కదిలించే గ్నాపకం. పదో తరగతి పిల్లల పైనే పోలీసు కేసుండే మరో గ్నాపకం. ఓహ్ ఏం కాలం.
బొగ్గు బస్సూ, నీడల తోలుబొమ్మలు ఆడించే బుడగ జంగాలు, ఉర్దూలో మూలికలు అమ్ముకునే వాడూ, అలా అమ్ముకోడానికి తెలుగులో తర్జుమా చేసేవాడూ. ఆ నడి రోడ్డుల దవాసాజ్ ఒక మధుర గ్నాపకం.
ఇంత మామూలు గ్నాపకాలు కూడా ఇంత బలాదూర్ గా బందిస్తాయని తెలియదు నాకు ఇంతక ముందు. కవితలు, కథలు, నవలలు ఎవరైనా రాస్తారు. కానీ, కానీకి కొరగాకుండా పోయాయనుకున్న ప్రతి గ్నాపకాన్నీ అద్భుతంగా రాసే నేర్పు తెలిసిన యువ రచయిత కృష్ణమూర్తికి పేరా పేరానా పడి పదివేల దండాలు.
ఈ ఊరు, ఈ వాడా, ఈ బతుకూ నాలో చెలరేపిన గ్నాపకాలెన్నో.


మూడో తరగతిలో ఆలూరులో ఆరుబయట రాత్రిపూట రెహమాన్ సర్కస్ చూసిన గ్నాపకం. టాకీస్ లో కృష్ణమూర్తిలా నాటక చూడలేక పోయాను. కానీ ఆలూరులో గోవర్థన టాకీసులో చూసిన సింహబలుడు నా తొలి సినిమా గ్నాపకం. కోడుమూరులో పరప్ప జిన్నుకు ఎదురుగా చేలలో తెల్లార్లూ ఆడిన చింతామణి నాటకం కొంచెం సేపే చూసి పడుకున్న గ్నాపకం. నాటకం అయిపోయిన మరుసటి రోజు మల్లె పూవులా మా ఇంట్లో తిరుగుతున్న బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్ర్రిని చింతామణిగా పోల్చుకోలేని గ్నాపకం.
నేషనల్ పేనసోనిక్ టు ఇన్ వన్ లో తొలిసారి కుంతీ విలాపం పద్యాలు, వర విక్రమయంలో కాళింది, కమలల డైలాగులు, సిలోన్ నుంచి మీనాక్షి పొన్నుదురై, గౌరీ మునిరత్నం దయతలచి వినిపించిన పాటలు నా బాల్యపు గ్నాపకాలు.

మరాఠీలో మాట్లాడుకుని , కాఫీ అమ్ముకునే రంగ్రీజోళ్ళను ప్రస్తావిస్తాడు కృష్ణమూర్తి. మా కోడుమూరులో కూడా ఈ రంగ్రీజులుండే వారు. వాళ్ళను మేం రంగరాజులు అనే వాళ్ళం. ఈ కుటుంబాలు కూడా బట్టల వ్యాపారం చేసేవారు. కాఫీ అమ్ముకునే వారు. అయితే షోలాపూర్ నుంచి వచ్చిన వీళ్లను ఖత్రోళ్ళు, దగుడోళ్ళు అనికూడా అనే వాళ్ళం. వీళ్ళలో కొంత మంది కంసాలి పని చేసేవాళ్లు. ఇంకొంత మంది దర్జీ పని చేసే వాళ్ళు.


ఇక సైన్ బోర్డులు, అంగళ్ళమీద రాతలు, గోడల మీద ప్రకటనలు రాసే పెయింటర్ ఎం.హెచ్.కె గురించి కృష్ణ మూర్తి ఆప్యాయంగా రాస్తాడు. ఈ ఎం.హెచ్.కె ఎవరో నాకు తెలియదు. కానీ ఎం.హెచ్.కె లాగే సంతకం పెట్టిన మా మాస్టర్ వి.యకుమార్ నాకు గ్నాపకం వచ్చాడు చదువుతుంటే.


కర్నూలు జిల్లాలో మంత్రాలయం నుంచి శ్రీశైలం వరకు కనిపించే అన్ని సైన్ బోర్డులపైనా ధగధగ మెరిసిన పేరు బై మాస్టర్. మాస్టర్ కుంచె నుంచి ఏ కళాఖండాలూ జాలువారలేదు అప్పటి టాబ్లాయిడ్స్ లో రాసి వార్చేందుకు. మాస్టర్ అని సంతకం చేసే అతని పేరు విజయ్ కుమార్. అతను దళిత క్రిస్టియన్. మాల. టెలిఫోన్ ఎక్సేంజిలో ఆపరేటర్. మా శేషఫణి బాబాయికి బాల్యపు జిగిరి. మాస్టర్ మా జిల్లాలో ఎన్నో పెళ్ళిల్లను ఘనంగా, వైభవంగా, మధురంగా తీర్చి దిద్దిన ఫోటోగ్రాఫర్ కూడా. ఈ ప్రకాశ్ ఆర్ట్స్, ఇజ్రా బోర్డుల గుత్తాధిపత్యం, దాన్ని మింగేసిన ఫ్లెక్సీలు, వినైల్ షీట్లు రాకముందు మాస్టరే మెగాస్టార్ మా జిల్లాలో. దళితుడైనందుకు ఉద్యోగం చాలా సార్లు పోగొట్టుకున్నాడు. క్రైస్తవుడు అయినందుకు కర్నూలు జిల్లా క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటి అనే వన్ మ్యాన్ ఆర్మీని కర్నూలు జిల్లా ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా నడిపి అనేక సార్లు ప్రాణాలు పోగొట్టుకున్నంత పనిచేసుకున్నాడు. మాస్టర్ విజయ కుమార్ దగ్గర నేను స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నాను.
మాస్టర్ సైన్ బోర్డులపై చేసే సంతకం వెనుక ఒక కత వుంది. తర్వాతే అది నాకూ తెలిసింది. బోర్డులపైన బై మాస్టర్ అని చేసే సంతకం లోపల ముగ్గురు కళాకారులు దాగి వున్నారు. ఒకరు మాస్టర్ విజయ్ కుమార్. రెండు- మాస్టర్ కి ప్రాణ నేస్తుడయిన గిడ్డయ్య. మూడు- మాస్టర్ తమ్ముడు సుకుమార్. రెండు సందర్భాలలో మాస్టర్ అన్న సంతకాన్ని విజయ్ కుమార్ కాకుండా తక్కిన ఇద్దరు చేసేవాళ్ళు.


సందర్భం-1
ఆర్డర్లు ఎక్కువై మాస్టర్ మరీ బిజీ అయిపోతే అతనికి ఆసరాగా ఆ బ్రాండ్ నీడను చల్లగా చూసుకునేవారు మిగతా ఇద్దరూ-ఎక్కువ సార్లు గిడ్డయ్య, అప్పుడప్పుడు సుకుమార్.


సందర్భం- 2
మాస్టర్ విజయ్ కుమార్ కు తరచూ ఉద్యోగం ఊడేది. లేదా ట్రాన్స్ఫర్ అయ్యేది. మాస్టర్ కు విపరీతమైన ఆత్మాభిమానం. పైగా ఆర్టిస్టు. ఆపై అనార్కిస్టు. చాలాసార్లు తనపై అధికారులను ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు కింద బుక్ చేసి కులం పేరుతో కుళ్ళు జోకులు పేలుస్తూ, బూతులు తిట్టే వాళ్ళకు చెక్ పెట్టేవాడు. ఉద్యోగం వదిలి కోర్టుల చుట్టూ తిరిగి కేసులు గెలిచి కాలర్ ఎగరేసేవాడు. ఉద్యోగం ఊడటానికీ, కాలర్ ఎగరేయడానికీ మధ్య కాలంలో మాస్టర్ మరేమీ చేసేవాడు కాదు. తన తరపు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి తన కేసు ఎలా గెలవచ్చో, ఎందుకు గెలవాలో లాంటి విషయాల్లో తర్ఫీదు ఇస్తూ బైబిల్ కొటేషన్లను అవోకగా అరువు ఇచ్చేవాడు. సరిగ్గా ఇలాంటి క్రాప్ హాలిడేలో గిడ్డయ్య తన స్నేహాన్ని మాస్టర్ సంతకం పెట్టి చాటుకునేవాడు. అంత వరకూ అల్లరిగా తిరిగే సుకుమార్ కూడా ఇల్లు గడవడానికి మాస్టర్ కి ఘోస్టయ్యేవాడు.
మా జిల్లాలో సైన్ బోర్డుల్లో ఇప్పటికీ చెక్కు చెదరని సంతకం, వ్యక్తిత్వం- మా మాస్టర్ ది. కృష్ణమూర్తి గుర్తు చేసుకున్న ఎం.హెచ్.కె నాకు మాస్టర్ ని గుర్తుకు తెచ్చాడు. గ్నాపకాలు చెప్పుకునేందుకే కదా మనందరికీ ఒక నికార్సయిన సందర్భం కావాలి. అది ఇచ్చినందుకు కృష్ణమూర్తికి కృతగ్నతలు. అంతకు మించి ఇలా నా మాస్టర్ విజయ్ కుమార్ గురించి ఈ నాలుగు స్క్రీన్ ప్రింట్లు ఎక్స్పోజ్ చేసుకునేందుకు వెతుక్కోకుండానే ఒక మంచి సందర్భం ఇచ్చినందుకు కృష్ణమూర్తికి నమస్కారాలు.


ఈత రాని తన దోస్త్ రెహమాన్ ని దొరోరి బావిలో కృష్ణమూర్తి ఎలా కాపాడాడో చెప్పినప్పుడు నాదీ ఒక గ్నాపకం చెప్పాలనిపిస్తోంది. నేనూ, శశి, ఖదీర్, ఉమ, విష్ణు, చిట్టి బాబాయ్(సత్య శ్రీనివాస్) తారామతి బిరాదరిపైన గ్రూప్ డాన్స్ వేసి గండిపేట చెరువుకెళ్ళి టెమ్ట్ అయ్యి ఈతకు దిగాం. గండిపేటలో అక్కడ, అప్పుడు ఈత నిషేధం. ఈత రాని విష్ణు నీళ్ళలోకి దిగలేదు. రాకున్నా ఖదీర్, శశి, చిట్టి దిగి తడిసారు. వస్తుందని దిగిన ఉమకు నీళ్ళలోకి దిగిన వెంటనే తెలియని భయమేదో వేసి తడబడ్డాడు. అప్పుడే ఈత కొట్టి ఒడ్డుకు వచ్చాను నేను. అప్పటికే ఉమ నీళ్ళలో ఉక్కిరిబిక్కిరి అయి కసిబిసి అయిపోతుంటే అదంతా ఆట అనుకుని పెద్దగా స్పందిచలేదు ఒకే ఒక్క ఈతగాడినైన నేను. గండిపేటలో ఉన్నట్టుండి లోతు ఎక్కువవుతుంది. ఉమ మునిగి పోతున్నాడు. అరుస్తున్నాడు. అదంతా ఆటలో భాగమే అనుకున్నాం అప్పటికీ అందరం. గారడీ వాడు కత్తి సాము చేస్తూ పొరపాటున కత్తి నెత్తికి తగిలి తల తెగి పడినా చప్పట్లే కదా కొడతాం. అలాగే వుండింది మాకూ ఆ రెండు క్షణాలు. కాని విష్ణుకు విషయం అర్థం అయిపోయింది. నేను వెంటనే నీళ్ళలోకి దూకి ఉమను గడ్డకు తీసుకువచ్చాను. ఉమ ప్రాణాలు కాపాడి హీరోనయ్యాను. ఈ గ్నాపకాన్ని నాలో ట్రిగ్గర్ చేసింది కృష్ణమూర్తి ఫ్రెండ్ రెహమానే. ఇవన్నీ ఇక్కడ అప్రస్తుతమే అని అనిపించవచ్చు. కానీ ఇలాంటి గ్నాపకాలను తీసి పారేయలేం. చెరిపేయనూ లేం. గొప్ప మలుపులూ, మైలురాళ్ళూ కాకపోయినా ఇవన్నీ బతికిన క్షణాలే. ఈ ఎరుక తన పుస్తకమంతా పరిచిన కృష్ణమూర్తికి సవినయ సలాములు.


ఇక గాలి పతంగుల గ్నాపకం. ఓహ్! ఈత తర్వాత తలచుకుంటేనే నా అణువణువూ పుకించేది గాలిపటాలకే. ఒక్క కోడుమూరులో వున్నన్ని గాలిపటాలు మళ్ళీ నేనెక్కడా చూడ్లేదు. గాలి పటం అన్న పదం కర్నూలు టవున్లో కూడా ఏకవచనమే. అంతా ఒకే రకం. ఆకారం చతురస్రం. టెక్స్ట్ బుక్కుల్లో బుక్కయిన ఈ గాలిపట విశేషం పేరు మా కోడుమూరులో బుడ్దంగి. ఇదే కాక ఇంకా బుర్ బుర్ పటాకి, నక్షత్రం పటాకి, మనిషి పటాకి, చామంతి పటాకి, సూపర్ కాయితం పటాకి..... ఇవన్నీ ఎంతెంత పెద్దవో... ఎంతెంత ఎత్తుల్లో ఎగిరేవో. వీటికి సరిపడా తోకలు కట్టడం, ఎగిరేందుకు చక్కని సూత్రాలు వేయడం ఒక సైన్స్... ఒక కళ. అందకే గాలిపటానికి బహువచనంలా వుండేది మా కోడుమూరు ఆకాశం. అదీ సంక్రాంతి ముందు. ఎక్కడా మాంజా అన్న మాట కానీ , కటీ అన్న పదం కానీ తెలియని స్వచ్ఛమైన గాలిపటాల ప్రదర్శన కోడుమూరు. పరుల గాలిపటాలను కటీ చేసి చప్పట్లూ, కేరింతలూ కొట్టడం కోడుమూరుకు తెలియదు. నేను చూడనూ లేదు. ఎగరేసిన గాలి పటానికి క్యాండిల్ కట్టి పైకి పంపించి ,రాత్రంతా గుంజకు కట్టేసి పొద్దునే పళ్ళు కూడా తోముకోకుండా ఇష్టమైన నేస్తం ముఖం చూసినట్లు మురిసిపోవడం ఒక్కటే తెలుసు మాకు. గాలిపటాలు అవంతటవే ఏ అవాంతరమో సాంకేతిక లోపమో వచ్చి తెగిపోవాల్సిందే. తెంపడం తెలియని బాల్యం అది. అలా తెగిపోయిన గాలిపటాలన్నీ మా సద్ద సేన్లో దొరుకుతాయి. అందమైన వేర్వేరు ఆకారాల్లో సగర్వంగా, సమున్నతంగా గాలిపటాలను ఎగురవేసేది ఎక్కువగా నేసోళ్ళే. అయితే మేదరోళ్ళ దగ్గర ఎలాంటి బొంగు బద్దలు తెచ్చుకోవాలి, వాటిని ఎలా కోయాలి, ఎలా కట్టాలి, ఎలా కాయితాలు మూయాలి, ఎలాంటి సూత్రమేసి బుర్ బుర్ మనిపించాలి అన్న మర్మాలను నాకు నేర్పింది మాత్రం మా నాయనే. నేసోళ్ళ గాలిపటాల నైపుణ్యానికి సవాల్ గా వుండేది మా నాన్న పనితనం.


ఈ పుస్తకం ఒక మంచి village ethnography study కి మంచి నమూనా. కేంద్రీకృతకం అయిపోయిన విశ్వవిద్యాలయాల్లోని ఏ కల్చరల్ ఆంత్రొపాలజీ విభాగంలోని ఏ ఎం.ఎన్.శ్రీనివాసన్ లాంటి బోధకులకూ బోధపడని, తెలియని రాత పద్ధతి కృష్ణమూర్తిది. గోల్డు మెడలల్లో వేసుకునే ఆ విద్యార్థులు పొందాల్సిన తక్షణ తర్ఫీదు ఇదీ. టేకింగ్ సైడ్స్ల్ లో చాలా dispassionate గా వుంటూనే చెప్పే పద్ధతిలో విపరీతమైన passion కురిపిస్తాడు కృష్ణమూర్తి. Anthropology లోని observer-participant method కు applied అచ్చుపోత ఈ రచన. మహా ఘటనలను కూడా చాలా మామూలుగా matter-of-fact గాచెప్పి పాఠకులకూ. ఘటనకూ మధ్యవర్తిత్వం, సూత్రధారకత్వం (ఒక ఎరుకతో) మానిన అరుదైన రచనా శైలి ఇది. పాఠకుడికి ఎలాంటి దిశానిర్దేశం అవసరం లేదిలాంటి చారిత్రక జీవిత ఘటనా సమాహారాన్ని చెప్పుకొచ్చేటపుడు. పాఠకులు వట్టి చవట దద్దమ్మలనుకునే మేధావి రచయితలకు నివాళి ఈ శైలి. ప్రతి వచనం పుస్తకం నిండా తాజాగా, చాలా నేల బారుగా, నిటారుగా, సాదాసీదాగా కృష్ణమూర్తిలా పాండిత్యంతో ఎలాంటి దుప్పటి పంచాయితీలు లేకుండా సాగిపోతుంది. మాట అలవోకగా కదులుతుంది.
ఇది రచయితకు రమారమి 19 ఏళ్ళు నిండినపుడు ఆగిపోయే గ్నాపకాల కదంబం. అసలు 19 ఏళ్ళకు ఇంత విస్తారమైన జీవితం, అనుభవం, విపులమైన గ్నాపకం ఎలా సాధ్యం? ఎవరైనా ఎలా వడుకుతారిలా?


కొన్ని గ్నాపకాలు మరిచిపోవడానికి గుప్పెడు గుళికల్ని మింగుతుంటాం. ఇంకోసారి గుర్తు తెచ్చుకోడానికి పిడికెడు గ్నాపకాలు కూడా మిగిలి వుండవు వెనక్కి చూసుకుంటే. కొన్నింటిని రబ్బరు పెట్టి అదేపనిగా చెరిపేసుకోవాలనీ అనుకుంటుంటాం. మరి కొన్నింటిని ఆల్కహాలిక్ డిమెన్షియాలో, ఏజింగ్ అమ్నీషియాలో, అల్జమీర్ రోగాలో, ఏ గాలో మింగేస్తున్న ఈ కాలంలో ఇసుకలో మేలు రకం రేణువులను పోట్చుకోగల నిపుణతతో గతాన్ని సైకత శిల్పంగా మలిచే ఈ మెలకువ ఎప్పటికొస్తుందో నా మటుకు నాకు.
కతకూ, నవలికకూ, నవలకూ- అసలు మనకు తెలిసిన సకల కాల్పనిక రచనా స్వరూపాలకూ అంతుపట్టని , లొంగని ఇట్లాంటి పోగులు పెట్టే సృజన శైలులకు మనం నిజంగా రుణపడి వుంటాం కథా.

-

తన బ్లాగులో రాసుకున్న ఈ సమీక్షను పునర్ముద్రించేందుకు అనుమతించిన అనంత్ గారికి కృతజ్ఞతలు. వారి ఇతర రచనలకోసం ...ఇక్కడ ... క్లిక్ చేయండి )


http://anantamu.blogspot.com/2011/09/blog-post_26.html

ఊరు వాడ బతుకు ఈ పుస్తకం గా కూడా లబిస్తుంది. ఈ పుస్తకం కోసం ... ఇక్కడ ... క్లిక్ చేయండి

ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి
ముఖచిత్రం, బొమ్మలు : లక్ష్మణ్‌ ఏలే
మొదటి ముద్రణ: మే 2009
136 పేజీలు, వెల: రూ.40

..

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ : 040 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com

..


మనుషులు చేసిన దేవుళ్ళు ఈ పుస్తకం వెలువడింది !

గత నెలలోనే ప్రచురించబడ్డ కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ "మనుషులు చేసిన దేవుళ్ళు"
ఇప్పుడు ఈ పుస్తకం గా కూడా లభిస్తోంది.
వివరాల కోసం దిగువ టైటిల్ పై క్లిక్ చేయండి:

"మనుషులు చేసిన దేవుళ్ళు"



..

Tuesday, September 27, 2011

ప్రపంచ వ్యాప్త తెలుగు పాఠకుల కోసం మరో రెండు హెచ్ బీ టీ "ఇ- పుస్తకాలు"

ఇప్పటికే అందుబాటులో వున్న
"ఊరు వాడ బతుకు",
"నేనే బలాన్ని- టిఎన్ సదాలక్ష్మి బతుకు కథ"
పుస్తకాలకు తోడు కినిగె డాట్ కాం వారి ద్వారా
మరో రెండు హెచ్ బీ టీ పుస్తకాలు
అందుబాటులోకి వచ్చాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం .
(
ఈ పుస్తకాల శీర్షికలపై క్లిక్ చేసి నేరుగా ఈ పుస్తకం వివరాలు చూడవచ్చు. )
అవి :
ఘంటారావం (అలేగ్జాందర్ ద్యుమా రచన)
అజేయుడు (విక్టర్ హ్యూగో రచన)
పుస్తకాల కోసం... " కినిగే డాట్ కాం "...వెబ్సైట్ ని సందర్శించండి

http://kinige.com/


Monday, September 26, 2011

అస్తిత్వ పోరాటం

అస్తిత్వ పోరాటం

''అడుగడుగునా నాకు చరిత్ర ఉన్నది'' ... ఇలా చాటుకోవటానికి ఎవరికైనా గుండెధైర్యం కావాలి. అంతకు మించిన పోరాట నేపథ్యం ఉండాలి. ఆ రెండూ పుష్కలంగా ఉన్నాయి కాబట్టే టి.ఎన్‌. సదాలక్ష్మి తన జీవన ప్రస్థానం గురించి అ లా వ్యాఖ్యానించుకోగలిగారు. ఒక దళిత కుటుంబంలో ... అదీ మరుగుదొడ్లు శుభ్రం చేసే 'మెహతర్‌' కులంలో పుట్టి, స్వాతంత్య్రపు తొలిదినాల్లోనే పురుషాధిక్య రాజకీయరంగంలోకి ప్రవేశించారంటేనే ఆమె ఎంత సాహసవంతురాలో అర్థమవుతుంది. పైగా అడుగడుగునా లింగ, వర్ణ వివక్షను ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలిలో స్థానం సంపాదించటమంటే మాటలు కాదు. డిప్యూటీ స్పీకర్‌ స్థానాన్ని అధిరోహించి మహిళాశక్తికి ప్రతీకగా నిలిచిన ఆమె జీవితం ఆద్యంతం స్ఫూర్తిదాయకం. ఆ మహోన్నత దళిత నాయకురాలి జీవితకథకు రచయిత్రి గోగు శ్యామల ''నేనే బలాన్ని'' పేరుతో అక్షరరూపం ఇచ్చారు.
- పున్న సుదర్శన్‌

ఈనాడు ఆదివారం (25 సెప్టెంబర్‌ 2011) సౌజన్యంతో

Saturday, September 17, 2011

మనుషులు చేసిన దేవుళ్లు - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌



మనుషులు చేసిన దేవుళ్లు - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మత విశ్వాసాల ద్వారా సమకూరే ఉపయోగాలేవీ 'ఇన్‌హేలర్ల' స్థాయిని మించవు. వాటివల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి గానీ, సమాజపు ఆరోగ్యానికి గానీ పట్టిన 'జలుబు' ఎంతమాత్రమూ తగ్గదు. పైగా వాటి 'సైడ్‌ఎఫెక్ట్స్‌' చాలా ప్రమాదకరమైనవి.

వ్యక్తిగతంగా నిరపాయకరంగా అనిపించే నమ్మకాలు సామూహికంగా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో రోజూ ప్రపంచమంతటా జరుగుతున్న మతహింస నిరూపిస్తూనే వుంది.

ప్రాణులను సృష్టించినది దేవుడనే భావన మానవజాతి చరిత్రలో ఒక దశలో తలెత్తిన తప్పుడు నమ్మకం. మతాన్ని నమ్మడమంటే సుఖసంతోషాలూ, భద్రతాభావమూ కరువైన ప్రపంచంలో వాటిని వెతుక్కునేందుకు చేసే వ్యర్థ ప్రయత్నమే.

ఈనాటి సామాన్యుల జీవితాల్లోని సామాజిక ఆర్థిక అనిశ్చితస్థితి వారిని మరింత అయోమయానికీ, గుడ్డి నమ్మకాలకూ గురిచేస్తోందనడంలో సందేహం లేదు. ఇది కొందరి వ్యక్తిగత నమ్మకమూ, బలహీనతా కాదు.

దేవుడున్నాడని వాదించేవారికి సమాధానం చెప్పాలంటే దేవుడులేడని వాదిస్తే సరిపోదు. వారికి ఆ అపోహ ఎప్పుడు, ఎందుకు, ఎలా కలిగిందో కూడా చెప్పాలి.''

మతం అనే భావన ఎప్పుడు ఎలా పురుడుపోసుకుంది?
మతానికి గల చారిత్రక, సామాజిక, మానసికమైన మూలాలు ఎక్కడున్నాయి?
మతాల నేపథ్యం లాభనష్టాల గురించి విస్తృత అధ్యయనంతో వైజ్ఞానికంగా లోతుగా విశ్లేషించే రచన ఇది.

రచయిత: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
జననం: మద్రాసులో 1949లో
విద్యాభ్యాసం: మద్రాసు, ఆంధ్ర, ముంబయి విశ్వవిద్యాలయాల్లో
అణుభౌతికశాస్త్రంలో పి.హెచ్‌డి.
ఉద్యోగం: మొదట బాబా అణుకేంద్రంలో, ప్రస్తుతం ఇ.సి.ఐ.ఎల్‌.లో.
అభిరుచులు: శాస్త్రీయ సంగీతం, జనరంజక విజ్ఞాన రచనల్లో ఆసక్తి, అభినివేశం.
ఇతర రచనలు: జీవశాస్త్ర విజ్ఞానం, సమాజం (జనసాహితి), విశ్వాంతరాళం, మానవ పరిణామం, జీవకణాలూ, నాడీ కణాలూ (స్వేచ్ఛా సాహితి)
కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి బ్లాగును "ఇక్కడ" సందర్శించండి :
http://rohiniprasadkscience.blogspot.com

మనుషులు చేసిన దేవుళ్లు
కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
196 పేజీలు, వెల: రూ.100/-
తొలి ముద్రణ: ఆగస్ట్‌, 2011

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ : 040 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌