ఇన్‌క్రెడిబుల్ గాడెస్ అన్నదే ఈ నవల పేరు!
ఈ ఇంగ్లీషు పేరుకు ఒక తెలుగు అర్థం ... క్షుద్రదేవత.
కొంతకాలం క్రితం ఒకరోజు మా ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తున్నాను. ఒక రోగి 'కన్సల్టేషన్ రూమ్' లోకి వచ్చాడు. రోగిని పరీక్షించేముందు అతని పేరు, కులం, ఊరు, వయసు వగైరా వివరాలను 'స్టాటిస్టికల్ పర్పస'్ కోసం నమోదు చేయాలి.
అవన్నీ అయ్యాక ''ఏం చేస్తుంటావు?'' అని అడిగాను.
అతడు ''అడుక్కు తింటుంటా'' అన్నాడు.
''అది సరే నీ కుల వృత్తి ఏమిటి?'' అనడిగాను.
అతడు, ''అడుక్కు తింటాం'' అన్నాడు.
''చూడు బాబూ. నేను రాసుకోవాలి. నీ కులవృత్తి ఏమిటో చెప్పు'' అన్నాను.
అతడు ''మా కులపోళ్లంతా చేసేది అదే. అందరం అడుక్కుతింటాం'' అన్నాడు.
తర్వాత తెలిసిందేమిటంటే అడుక్క తినడమే కులవృత్తిగా గల కులాలు ఈ దేశంలో డజనుకుపైగా వున్నాయట.
ఈ దేశంలో వ్యవస్థీకృతమై వున్న ఈ భ్రష్టకారి కుల వ్యవస్థ మీద పోరాటం దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి సాగుతున్నది.
ఇన్ని వేల యేండ్లుగా ఏ కులమైతే తనను అవమానాలకు, అమానవీయతకు, హైన్యతకు గురిచేస్తూ వచ్చిందో ఆ కులనామాన్ని తన పేరు చివరన నేడు దళితుడు రాసుకుంటున్నాడు.
అ లా రాసుకోవడం ద్వారా తన ఆత్మగౌరవాన్ని, తద్వారా తన సాంఘిక సమానత్వాన్ని నిర్ద్వంద్వంగా, బాహాటంగా ప్రకటించుకున్నాడు.
ఈ శతాబ్దంలో సగర్వంగా చెప్పుకోదగిన సాంఘిక చైతన్యంగా దీనిని భావించడానికి ఏమాత్రం తటపటాయించనవసరంలేదు.
ఐతే ఈ సాంఘిక చైతన్యం బాహ్యశక్తులతో పోరాడి సంపాదించింది కాదు.
వేలయేండ్లుగా తనను అంటిపెట్టుకుని వుండిన ఆత్మన్యూనతతో పోరాడి, దానిని ఛేదించి తన జీవితాన్ని మెరుగుపరచుకునే క్రమంలో నేడు దళితుడు ఒకానొక కీలకమైన మజిలీని చేరుకున్నాడు.
ఇలా సాధించుకున్న 'సాంఘిక' సమానత్వం దానికదే అతని జీవితాన్ని గుణాత్మకంగా మార్చడానికి నిర్వహించగల పాత్ర ఎంత?
ఈ ప్రశ్నకు సమాధానం ''సున్న'' అని చెప్పాల్సి వుంటుంది.
కానీ 'సున్న' కు విలువ లేదని ఏ గణిత శాస్త్రజ్ఞుడైనా అనగలడా?
అనలేడు.
సున్నాకు ముందు 'అంకె' చేరితే దానికి ఎనలేని విలువ సమకూరుతుంది. ఆ అంకె పేరే ఆర్థిక సమానత్వం.
-డా.కేశవరెడ్డి
('దళితుడి పయనం' ముందుమాట నుంచి)
....................................................
మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కేశవరెడ్డి తన చుట్టూరా వున్న సమాజంలోని నిమ్నోన్నతాల్ని, హింసా సన్నివేశాల్ని, అంతులేని యాతనతో నిండిని దీనజనుల దుఃఖ జీవితాల్నీ బాగా కళ్లు తెరచుకుని చూచిన మానవుడు.
చిన్న వయసులోనే ఒక పెద్ద ఆశయం కోసం కలం పట్టిన రచయిత.
ఏరు దాటి తెప్ప తగలేసేవాడు కాడు.
తిరుపతిలో వున్నా, పాండిచ్చేరిలో వున్నా, నిజామాబాదులో వున్నా తమ పల్లెను గురించి, అక్కడి బక్క రైతుల యొక్క బీద కూలీల స్థితిగతులను గురించి ఆలోచించే నిజాయితీపరుడు.
ఈ నవలలో రచయిత దాపరికం లేకుండా, మొగమాటానికి పోకుండా హరిజనుల జీవన సమస్యకంతా కీలకప్రాయమైన, మూలకారణమైన లోపం ఎక్కడుందో చెప్పేశాడు.
మనిషికి యితరులవల్ల జరిగే అపకారం కన్నా, తనవల్ల తనకే జరిగే అపకారం ఆత్మహత్యా సదృశమైనదని నిరూపించాడు.
గుండెల్ని పిండిచేసే సానుభూతిలో నుంచీ వెలువడిన ఒక కరుణామయమైన ఆక్రందన యీ నవల.
- మధురాంతకం రాజారాం
(పరిచయం నుంచి)
................................
ఇన్‌క్రెడిబుల్ గాడెస్ (క్షుద్రదేవత)
రచన: డా.కేశవరెడ్డి
155 పేజీలు
వెల: రూ.80/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500 067
ఫోన్ నెం. 040 2352 1849
ఇ మెయిల్: hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment