Tuesday, January 22, 2013

బొజ్జా తారకం "పంచతంత్రం" నవలపై చర్చ జనవరి 25 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ! ...

ఆహ్వానం

బొజ్జా తారకం రాసిన "పంచతంత్రం" నవల పై చర్చ నిర్వహిస్తున్నాం.


ప్రముఖ రచయితలు 

బి. కళ్యాణరావు, 
నందిగం కృష్ణారావు, 
ఎన్. వేణుగోపాల్ 
మొదలైన వారు మట్లాడతారు. 

మీరు తప్పక రండి !


తేదీ: 25 జనవరి 2013 

సాయంత్రం 5-30 కి.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, 

హైదరాబాద్ .





Monday, January 21, 2013

చాయ్, సమోస ఔర్ లామకాన్ ...




చాయ్, సమోస ఔర్ లామకాన్

భంగ్యా భూక్యా. ఇటువంటి పేర్లను విద్యావిషయకమైన బృందాల్లో వినడానికి మనం ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు. వేరే స్థలాల్లో వేరే సందర్భాల్లో వేరే కోవల్లో మాత్రమే కనిపించే పేర్లు అధికార స్థానాల్లో, జ్ఞానపీఠాల్లో, పత్రికల కాలమ్స్‌లో తరచు తారసపడితే తప్ప సమాజంలోని అహంకారాలూ అర్థసత్యాలూ అంతరించిపోవు.
ఇంగ్లీషు, విదేశీభాషల యూనివర్సిటీలో సామాజికవివక్ష అధ్యయన విభాగంలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న భూక్యా నిజాం పాలనలో లంబాడాల స్థితిగతుల మీద ఇంగ్లండ్‌లోని వార్‌విక్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. అంతర్జాతీయంగా పేరుపొందిన చరిత్రకారులతో కలసి పనిచేశారు. 2010లో ఇంగ్లీషులో వచ్చిన ఆయన పరిశోధనాగ్రంథం తెలుగు సంక్షిప్త అనువాదం జనవరి 5 హైదరాబాద్‌లో ఆవిష్క­ృతమైంది.

ఆ పుస్తకం నుంచి కోకొల్లలుగా కొత్త సత్యాలు నేర్చుకోవచ్చును. అవన్నీ ఒక ఎత్తు, పుస్తకావిష్కరణ జరిగిన వేదిక 'లామకాన్' నేర్పే కాలజ్ఞానం మరో ఎత్తు. గ్రంథకర్తకూ, ప్రచురించిన హైదరాబాద్ బుక్‌ట్రస్ట్‌వారికీ ఆ సమయంలో ఆ స్ఫురణ కలిగిందో లేదో కానీ, బంజారా హిల్స్‌లో, మేడాగూడూ కాకుండా మధ్యరకంగా, బృహత్‌శిలలను కడుపులోనే పెట్టుకుని కట్టుకున్న ఒక పొదరింటిలో భూక్యా పుస్తకావిష్కరణ జరగడం ఒక చారిత్రక న్యాయంగా తోచింది నాకు.
ఒక వైపు జివికె మహాసామ్రాజ్యం, మరో పక్కన వెంగళరావు పార్కు, తక్కిన వైపులంతా విషంలా వ్యాపించిన నవసంపన్నత, వీటి మధ్య 'లామకాన్' ఒక చెలిమె. సాహిత్యం, సంస్క­ృతి, సమాజం- ఏదైనా సరే, నలుగురు కూర్చుని మాట్లాడుకోవడానికి, పాడుకోవడానికి ఒక మంచి మనిషి అందించిన కాసింత స్థలం. అతి విలువైన అతి అరుదైన స్థలం. ఆ స్థలం ఉండబట్టే, బంజారాల చరిత్రను ఆవిష్కరించిన పుస్తకం బంజారాహిల్స్‌లో ఆవిష్క­ృతమైంది. ఆ సన్నివేశం మీటిన రహస్తంత్రి ఏమి చెబుతున్నది? ఈ దేశపు మహాజనులారా! మీరు కోల్పోయిన స్థలాలన్నిటినీ తిరిగి ఆక్రమించుకోండి, మీరు విస్మ­ృతులైన కాలాలన్నిటినీ నిద్రలేపండి!

సంపన్నతతో విర్రవీగుతున్న బంజారాహిల్స్‌ను ఉద్రిక్త వక్షోజాలతో పోల్చాడు తిలక్. మహానగరంలోని ఉన్నతవర్గాల కేంద్రంగా బంజారాహిల్స్ ప్రఖ్యాతినో అపఖ్యాతినో మూటగట్టుకున్నది కానీ దాని నామవాచకం వెనుక ఉన్న చారిత్రక అర్థం మరుగున పడిపోయింది. ఒకనాడు సంచారవర్తకులుగా, రవాణాదారులుగా ఉన్న లంబాడాల ఆవాస ప్రాంతాలు నేటి బంజారాహిల్స్. ఆ కొండలు ఇప్పుడు బంగారు కొండలయిన క్రమం గానీ, ఎవరెవరినుంచి చేతులు మారి అవి నేడు కొండచిలువలకు కొలువైన కథ గానీ చరిత్రలో కనిపించదు.

భంగ్యా భూక్యా- ఆ చరిత్ర డొంకను కదిలించాడు. 'లామకాన్'లో ఆ పుస్తకం గురించి చర్చించుకున్న కాసేపయినా బంజారాహిల్స్‌ను తిరిగి బంజారాలకు అంకితం చేశాడు.

'లామకాన్' ఒక సాంస్క­ృతిక బహిరంగ వేదిక కాకముందు, అది ఒక నివాసం. అప్పుడు కూడా దానిపేరు లామకానే. లామకాన్ అంటే ఇల్లులేని వారు అని అర్థం. ఇల్లు లేకపోవడం అంటే నిరాశ్రయత కాదు. సర్వవ్యాపిత్వం అని. ఇస్లామ్‌లో అల్లాకు ఉన్న అనేక నామాలలో లామకాన్ కూడా ఒకటి. నిరాకారుడైన దైవం స్థావరుడు కాదు. అన్నిటా ఉండే మహాశక్తి. జంగమతత్వానికి దగ్గరగా కనిపించే అద్భుతమైన భావన అది.
భాగ్యనగరానికి ఆభరణాల వంటి మహాశిలలను ధ్వంసం చేయకుండా, వాటిని గర్భీకరించుకుంటూ, కళాత్మకంగా, నిరాడంబరంగా నిర్మించుకున్న ఆ నివాసం మొయిద్ హసన్‌ది. హైదరాబాదీ శిలా రక్షణ ఉద్యమకారుడు, ఛాయాగ్రాహకుడు, డాక్యుమెంటరీల నిర్మాత, చిత్రకారుడు మొయిద్ హసన్. ఉర్దూ రచయిత్రి జిలానీ బానో సోదరుడు ఆయన. తన తండ్రి స్నేహితుడైన హైదరాబాద్ అద్భుత కవి మగ్దూం మొహియుద్దీన్ ఒడిలో బాల్యకౌమారాలు గడిపిన అదృష్టవంతుడు.

పదిహేనేళ్ల కిందట హసన్‌ను 'లామకాన్' లో కలిశాను. చలపతి, విజయవర్థనరావు ఉరిశిక్షల రద్దు ఉద్యమంపై ఆయన, సజయ కలిసి ఒక డాక్యుమెంటరీ నిర్మించిన సందర్భం అది. సందర్భం అదే అయినా సంభాషణ బహుముఖాలుగా సాగింది. ఆయన ఆదరణలాగే ఉన్న పరిమళభరితమైన వెచ్చటి టీ తాగాను. ఆయన స్వయంగా వండి వడ్డించిన ఆతిథ్యాన్ని స్వీకరించాను. అప్పుడప్పుడే తెలంగాణ చరిత్రపై ఆసక్తి పెంచుకుంటున్న నేను నా అజ్ఞానాన్ని, కుతూహలాన్ని ఆయనతో పంచుకున్నాను. వెలుగునీడల మర్మం తెలిసినవాడేమో, సత్యాసత్యాల మధ్య ఉండే పొరలను విప్పిచెప్పాడు. ట్యూబ్‌లైట్‌లు నిర్జీవ దీపాలని అన్నాడు. నీడలు రాని దీపం వృథా అన్నాడు. ఆయన ఇంట్లో అన్నీ గుండ్రటి ఫిలమెంట్ బల్బులే.

ఏ ఉత్తరాది నుంచో ఏడెనిమిది దశాబ్దాల కిందట వలసవచ్చిన హసన్ కుటుంబం, హైదరాబాద్‌ను ప్రాణప్రదంగా ప్రేమించింది. మఖ్‌మల్ బట్టలో చుట్టి కుట్టిన ఒక చిన్న హైదరాబాదీ శిలను చూపిస్తూ, అభివృద్ధి చేస్తున్న విధ్వంసం గురించి, జనజీవనంలో వస్తున్న శైథిల్యం గురించి హసన్ వేదనతో మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనపై ఆయనకు ఎంతటి వ్యతిరేకతో, హైదరాబాద్ చరిత్రపై, తెహజీబ్ పై ఆయనకు అంత మక్కువ. కర్కోటకుడని పేరుపొందిన ఏడో నిజాం హయాంలో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు కాలేదనే విషయం ఆయన చెబితేనే నాకు తెలిసింది. వాస్తవాలను కమ్మివేసిన అభిప్రాయాల పొరలను తొలుచుకుని చూడకపోతే చరిత్రను అర్థం చేసుకోవడం కష్టమని హసన్ నన్ను హెచ్చరించారు.

ఆయనను కలిసింది ఒక్కసారే కానీ, జ్ఞాపకం మాత్రం బలంగా మిగిలిపోయింది. 2004లో ఆయన చనిపోయినప్పుడు, ఆలస్యంగా తెలిసింది. సమాచార విప్లవ యుగంలో కూడా అన్ని వార్తలూ వేగంగా ప్రసరించవని అర్థమయింది. ఆయనను ఎవరెంత గుర్తించారో అనవసరం కానీ, ఆయన బలమైన ఆకాంక్షలు నిరాకరించలేని గుర్తింపును సాధించుకున్నాయి.
 
ఆయన అభిమతాన్ని గుర్తించిన వారసులు, ఆయన నివసించిన ఇంటిని ఒక ఊరుమ్మడి సాంస్క­ృతిక వేదికగా మలిచారు. మంచితనాన్ని పంచుకునే ఏ ప్రయత్నానికయినా ఉచితంగా దొరికే వేదిక 'లామకాన్'. మిత్రుడు రామ్మోహన్ హోలగుండి ప్రదర్శించిన నాటకాలో, మానవహక్కుల వేదిక 'సోంపేట' మీటింగో, కవి శివారెడ్డి కవిత్వాలాపనో, కచేరీలో, ఆటపాటలో బంజారాహిల్స్ రాళ్లలోపల పూలు పూయిస్తూనే ఉన్నాయి. వేడివేడి చాయ్ సమోసాల మధ్య కొత్త మెహఫిళ్లను తీర్చిదిద్దుతున్నాయి. ఎదురీతల్లో రాటుదేలిన భూక్యాల మేధావిత్వం ఒక శిఖరం. విలువలను, సమష్టిని వదలని హసన్‌ల మంచితనం మరో శిఖరం.

- కె. శ్రీనివాస్

(Adivaaram Andhra Jyothy , 20-1-2013)





Sunday, January 20, 2013

చరిత్ర'కు సవాల్ లంబాడా చరిత్ర - బత్తుల కార్తీక్ నవయాన్, ఆదివారం ఆంద్ర జ్యోతి లో ...


సింహాలనుంచి చరిత్రకారుడు ఉద్భవించేవరకు వేటగాడు చెప్పే పిట్టకథలు, కట్టుకథలే చరిత్రగా చలామణి అవుతాయన్నది ఆఫ్రికన్ సామెత. ఈ దేశంలో ఆదిమజాతులు, ఆదిమకులాలు తమ తమ చరిత్రలను తిరగరాస్తున్న సమయమిది. అంటరానితనం, అవమానాల పెనుమంటల పెనుగులాటలో నుండి తమ గతాన్ని తవ్వి 'ఇదిగో ఇదీ మా చరిత్ర' అని వర్తమాన చరిత్రకారుల డొంకతిరుగుడు వాదనలకు సవాల్ విసురుతున్న నూతన చరిత్రకారుల యుగమిది.

ఇప్పుడు పేదలుగా, అంటరానివారుగా, కేవలం ఓటర్లుగా, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వివిధ పథకాలకోసం ఎదురు చూసే అర్భకులుగా ఉన్న ఆదిమజాతుల గత చరిత్ర ఏమిటి? నాలుగైదు వందల సంవత్సరాల క్రితం కూడా వారు ఇలాగే ఉన్నారా? వారి బ్రతుకులు ఇలాగే ఉన్నాయా? తదితర అనేక ప్రశ్నలకు ప్రస్తుతం చలామణిలో ఉన్న చరిత్రకారుల వద్ద సమాధానం లేదు. ఇది మన ప్రస్తుత విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. నిజానికి తమ తాతలు, తండ్రులు ఈ దేశంలోని అడుగుకులాలపై, జాతులపై సాగించిన అమానవీయ దోపిడీ దౌర్జన్యాలను అగ్రకుల చరిత్రకారులు చరిత్రగా రికార్డు చేయాలి. కానీ అంత నీతి, నిజాయతీ గలిగిన చరిత్రకారులు దుర్భిణీ వేసి వెతికినా దొరకరు. అందుకే అడుగుకులాలు, జాతులు తమ తమ చరిత్రలను తవ్వి తీయవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది.

ప్రొఫెసర్ భుక్యా భంగ్యా రాసిన 'నిజాంపాలనలో లంబాడాలు' (అణచబడిన సంచారులు)పుస్తకం ఆ కోవలోదే. ఇది పి.హెచ్.డి పరిశోధన గ్రంథం. మూడేళ్ల క్రితం ఇంగ్లీషులో ప్రచురించబడి ఇప్పుడు తెలుగులోకి అనువాదమైంది. అణచబడిన, అంటరాని జాతుల చరిత్రను విద్యారంగ పరిధిలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి పుస్తకం ఇది.

ఒకప్పుడు స్వయంసమృద్ధిగా రాజీలేని జీవితం గడిపిన ఆదిమజాతులు ఆ తర్వాత వెనుకబడిన జాతులుగా మిగిలిపోయాయి. ఈ దుస్థితికి వలసపాలకులే కాదు, వారితో షరీకైన స్థానిక అధికారులు కూడా ఎంతో కారణం. ఈ చారిత్రక పరిణామాన్ని పట్టి ఇచ్చేదే ఈ పుస్తకం. గతంలో పశువులద్వారా రవాణారంగాన్ని నిర్వహించిన లంబాడాలు టెక్నాలజీ ప్రవేశంతో కూలీలుగా మారిపోయారు. బ్రిటీష్ వారు తీసుకొచ్చిన చట్టాలతో నేరస్త జాతిగా ముద్రపడ్డారు. ప్రధానంగా హైదరాబాద్ డక్కన్‌లోని లంబాడా జాతి తన సాంస్కృతిక వైవిధ్యాన్ని కోల్పోయి కన్న బిడ్డలను కూడా అమ్ముకునే దుర్భర పరిస్థితులకు ఎలా లోనయ్యిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

- బత్తుల కార్తీక్ నవయాన్
 ( 20.1.2013 ఆదివారం ఆంద్ర జ్యోతి లో)

నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా, 

అనువాదం : ఆకెళ్ళ శివప్రసాద్
వెల : రూ 80, పేజీలు : 158,

ప్రతులకు :
 హైదరాబాద్ బుక్ ట్రస్ట్
040-23521849

Sunday, January 6, 2013

నిజాం పాలనలో లంబాడాలు (Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams) - భంగ్యా భుక్యా

నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా 


ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి  ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.

దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.

చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి.  ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.

దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.

- భంగ్యా భుక్యా
(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:

''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''
.............................................................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''
............................................................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''
.................................................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:

భంగ్యా భుక్యా పన్నెండేళ్ళ పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించారు. ప్రస్తుతం ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్‌ విభాగంలో చరిత్ర అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఎంఫిల్‌ చేసిన ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నుంచి అంతర్జాతీయ ఫెలోషిప్‌  సాధించి ఇంగ్లండ్‌లోని వార్‌విక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేశారు.

కులం ఆదివాసీ జాతుల చరిత్రలు, అస్తిత్వ రాజకీయాలు, జాతులు - తెగలపై రాజ్యం దాని యంత్రాంగం చూపే ప్రభావం వంటి సామాజిక ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన అధ్యనం చేస్తున్న ఆయన  లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎడిన్‌బరో, వార్‌విక్‌ తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయజీ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం మధ్య భారతంలోని గోండు జాతిపై అధ్యయనం జరుపుతున్నారు.


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా


ఆంగ్ల మూలం : Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams, Orient Blackswan, Hyderabad, 2010
తెలుగు అనువాదం : ఆకెళ్ల శివప్రసాద్‌

157 పేజీలు, వెల : రూ.80/-

ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com




Friday, December 28, 2012

భంగ్యా భుక్యా రచన "నిజాం పాలనలో లంబాడాలు" పై జనవరి 5 న లామకాన్ లొ చర్చా గోష్టి ...

భంగ్యా భుక్యా రచన "నిజాం పాలనలో లంబాడాలు" పై జనవరి 5 న లామకాన్ లొ చర్చా గోష్టి



Hyderabad Book Trust
welcomes you to the book release of Nizam Palanalo Lambadalu.


Dr. Bhangya Bhukya ‘s much acclaimed book, Subjugated Nomads: The Lambadas under the rule of the Nizams is now brought out in Telugu as Nizam Palanalo Lambadalu.

While tracing the social history of the Lambada community, the book has interesting discussions on the deployment of colonial political rationality, introduction of new market, land enclosure, criminalisation of bodies, rule of property and emergence of a new community consciousness in Hyderabad State.

The book will be released on the occasion and followed by a discussion by  
Prof. I. Tirumali of Delhi University,  
Prof. Kalpana Kannabiran, Council for Social Development, Hyderabad,  
K. Srinivas, Editor Andhra Jyoti and
Tejawath Bellaiah Naik, social activist.

    
January 05, 2013 
5:30 PM 
Saturday
at Lamakaan, 

Rd No 1, Banjara Hills, 
lane opp GVK Mall (ph 9642731329)





బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ రచనలపై కందుకూరి సెలవు సమీక్ష

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ రాసిన ''పథేర్‌ పాంచాలి'', ''అపరాజితుడు'' నవలల్ని చదివిన కందుకూరి రమేష్‌ బాబు గారి కుమార్తె 'సెలవు' వాటిపై తన స్పందనను అక్షరబద్ధం చేసింది. మీరూ చదవండి:

ప్రస్తుతం సెలవు (పేరు విలక్షణంగా వుంది కదూ) తొమ్మిదో తరగతి చదువుతోంది. తను మంచి సాహిత్యాభిమానే కాదు అద్భుతమైన ఆర్టిస్ట్ కూడా. ఇటీవల 'మంచి పుస్తకం' వాళ్లు ప్రచురించిన పిల్లల పుస్తకాలకు కొన్ని బొమ్మలను, ముఖచిత్రాలను వేసింది.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలపై మీరు కూడా సమీక్షలు రాసి పంపిస్తే మా బ్లాగులో పొందుపరుస్తాం. అందరికీ ఇదే మా ఆహ్వానం. 
 

పథేర్‌ పాంచాలి:
ఒక రెండు పసి హృదయాలు ఈ లోకాన్ని ఎలాంటి దృక్పథంతో చూసారో తెలిపేదే ఈ రచన. వాళ్లు పచ్చని పొలాలలో ఎలా ఆడుకున్నారో వివరిస్తుంది. చిన్న చిన్న వస్తువులనే ఆశ్చర్యంతో చూసే చిన్న పిల్లలు ఒక వింత వస్తువు, భూమి మీద ఎన్నడూ లేని వస్తువు వాళ్ల కళ్లముందుకు వస్తే ఎలా ఎదుర్కొన్నారో ఈ రచనలో చెప్పారు. ఇళ్లు గడవడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమపడుతుంటారు. చిన్న చిన్న దొంగతనాలతో సరిపెట్టుకునే పసి హృదయం. అ లాంటి సంఘటనలు. ఆ పసివాడు తన సోదరి చావును ఎలా ఎదుర్కొన్నాడో దాన్ని ఎలా జీర్ణించుకున్నాడో తెలిపేది. తన ఊరిని వదిలి వెళ్లలేకపోవడం. ఆ పొలాలతో చెట్లతో పుట్టలతో తనకు ఏర్పడిన అనబంధం. వేరే ఊరికి వెళ్లికూడా తనలో తన ఊరికి వున్న స్థానం ఎన్నటికీ చెరిగిపోనిది. క్రమంగా వాళ్ల నాన్న ఆరోగ్యం క్షీణిస్తుంది. తర్వాత ఆయన మరణిస్తాడు. తన తల్లి ఆ అబ్బాయిని ఎలా పెంచిందో... తను పడ్డ కష్టాలు చెప్పలేనివి. తన తల్లితో మాట్లాడటానికి తపించిపోయే ఆ పసిహృదయం... తనలోని ఆలోచనలు... అ లాంటి హృదయానికి ఊరట ఇంకో పసిహదయం. అది తనపై చూపిన ప్రేమ, కరుణ లెక్కలేనిది. ఇలాంటి పరిసరాలనుండి మళ్లీ మరొక పల్లెకు వెళ్లడం... ఇలాంటి దృక్పథంతో సాగుతుంది ఈ కథ. దాని తరువాత భాగం అపరాజితుడు.

అపరాజితుడు:
ఆ బాలుడు చదువుకునే వయస్సులో ఎలా పురోహితుడిగా మారాడో, ఏ పరిస్థితుల్లో అ లా చేయవలసి వచ్చిందో, మళ్లీ తల్లిని ఒప్పించి బడిలో చేరి స్కాలర్‌షిప్పు ఎలా సంపాదించాడో, దానితో పై చదువుకు కలకత్తా వచ్చి తన చదువును ఎలా కొనసాగించాడో తెలిపేదే ఈ రచన. ఒక్కపూట భోజనంతో, చాలీ చాలని డబ్బుతో జీవితం గడుపుతాడు. అప్పుడప్పుడు తన తల్లిని చూసివస్తూ మళ్లీ అదే జీవనంలోకి అడుగుపెడ్తుంటాడు. తన స్నేహితుడి మరణం, తన తల్లి మరణం అతని హృదయంలో ఒక మచ్చలాగా తయారయ్యింది. అనుకోకుండా అతనికి పెళ్లి అవుతుంది. తన భార్య తనకిచ్చిన ఆనందం మళ్లీ ఆమె చావుతో పోతుంది. తన నెలల కొడుకుని చూసి వచ్చి మళ్లీ తన ప్రయాణం కొనసాగిస్తాడు. తిరిగి కొడుకు దగ్గరకు వచ్చి తనతోపాటు తీసుకుని వెళ్తాడు. మళ్లీ నిశ్చిందపురానికి వెళ్లడం అక్కడ తను అనుభవించిన అనుభూతి తన కొడుకు కూడా అనుభవించాలనుకుంటాడు. వాడు కూడా తండ్రిలాగా బాల్యాన్ని ఆనందిస్తూ వాళ్ల పూర్వీకుల ఊర్లో ఎలా ఉన్నాడో వివరించేదే ఈ రచన.
.............................................................................................................................................-సెలవు
........................................................................................................................................26 12 2012



Thursday, December 13, 2012

పంచతంత్రం (నవల) రచన: బొజ్జా తారకం ...

పంచతంత్రం (నవల)  రచన: బొజ్జా తారకం ...

కారంచేడు (1985) నుంచి లక్ష్మింపేట (2012) వరకూ దళిత ఉద్యమాలలో కీలకపాత్రవహిస్తూ న్యాయపోరాటాలు చేస్తూ రాజకీయ సామాజిక రంగాలను ప్రభావితం చేస్తున్న రచయిత బొజ్జా తారకం కలం నుంచి రూపుదిద్దుకున్న ఈ నవల అట్టడుగు వర్గాల బాధామయ జీవితాలకు దర్పణం పడుతుంది.

కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే బొజ్జాతారకం గారు హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఉద్యోగానికి రాజినామా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సహవ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే ఆయన ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు.

భారత రిపబ్లికన్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మానవ హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది. వీరి రచనల్లో ''పోలీసులు అరెస్టు చేస్తే'', ''కులం-వర్గం'', ''నది పుట్టిన గొంతుక'', ''నేల నాగలి మూడెద్దులు'', ''దళితులు-రాజ్యం'' ప్రముఖమైనవి.

పంచతంత్రం నవల గురించి రచయిత మాటల్లోనే ...

'' ఈనవల ఇలా సాగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలా రాయాలనీ అనుకోలేదు. ఈయీ పాత్రలు, ఈయీ సన్నివేశాలు ఉండాలనీ అనుకోలేదు. ముగింపు ఇలా ఉండాలనీ అనుకోలేదు. వరదపొంగులా అది అ లా సాగిపోయింది. నవల ఇలా మొదలుపెట్టాలని మాత్రం అనుకున్నాను. అంతే. ఆ తర్వాత నా చేతుల్లో లేపోయింది.

పాత్రలు, సన్నివేశాలు, అ లా అ లా అనుకోకుండా సాగిపోయాయి. హఠాత్తుగా తెరమీదికి అనుకోని వ్యక్తులు వచ్చినట్టు చాలా పాత్రలు నవలలోకి వచ్చేశాయి. చెప్పాపెట్టకుండా బంధువులు ఇంటికి వచ్చినట్టు, తలుపు తోసుకుని లోపలికి వచ్చినట్టు ఈ పాత్రలు వచ్చేశాయి. నాకే ఆశ్చర్యం వేసింది, ఎలా వచ్చాయా అని. అయితే అన్నీ నాకు తెలిసిన పాత్రలే కాబట్టి వాళ్ల చుట్టూ, వాళ్లతో కథ అ ల్లుకుపోయాను. ఒక జీవితానికి సంబంధించిన కథ కాదిది. వేలాది, లక్షలాది జీవితాలకు సంబంధించిన గాధ, వేదన, ఆవేశం, ఆకాంక్ష. నలభై ఏళ్లుగా రాయాలనుకున్న నవల....

ఇందులోని సంఘటనలు అన్నీ గొప్పవి. సన్నివేశాలూ పాత్రలూ అంతే. అయితే వాటిని నేను పూర్తిగా చిత్రీకరించలేకపోతే లోపం నాది, పాత్రలది కాదు. ఈ పాత్రలన్నీ మనముందే తిరుగుతున్నాయి. ...''



పంచతంత్రం (నవల)
రచన: బొజ్జా తారకం
290 పేజీలు, వెల: రూ.100/-




ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌:  hyderabadbooktrust@gmail.com

Wednesday, December 5, 2012

నిర్జన వారధి కాదు నిరంతర జన వారధి - లంకా పాపిరెడ్డి ...


....
మొదట్లో ఈ పుస్తకానికి "నిర్జన వారధి" అని ఎందుకు పేరు పెట్టారు? అనిపించింది. 
మరికొన్ని పేజీలు  చదివిన తరువాత అసలు ఈ పుస్తకానికి "నిరంతర ప్రవాహం" అని పేరు పెట్టాల్సింది అనిపించింది. 
కొండపల్లి కోటేశ్వరమ్మ గారికి సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, విప్లవోద్యమంతో సంబంధం ఉండడమే కాదు "నేను ఎప్పుడూ ఉద్యమాలకు దూరంగా ఉండలేదు. ఇక ఉండబోను కూడా అని 92 సంవత్సరాల వయసులో కోటేశ్వరమ్మ చెబుతున్నప్పుడు ఆమె ఆత్మ కథ "నిర్జన వారధి" ఎలా అవుతుంది?

- లంకా పాపిరెడ్డి 
(నమస్తే తెలంగాణా, 05 డిసెంబర్ 2012 సౌజన్యంతో)


Friday, November 30, 2012

వ్యథల గూడు ...


వ్యథల గూడు

అత్యంత సాధారణ భాష, భావజాలంతో ఒక క్రమగతిలో సాగే ఈ పదహారు కథల 'కథలగూడు'లో రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి నింపాదిగా, స్థిమితంగా ఉండుండీ జీవితం మారుమూలల్లో దాగిన మానవీయ అంశాలపై అసాధారణ శక్తిగల సెర్చిలైటు వేసి, మస్తిష్కంలో వెలుగులు వెలిగిస్తాడు. ఆయా పాత్రల నిరాడంబరత్వాన్ని సాధారణమైన భాషలో పలికిస్తూ మెరుపులు మెరిపిస్తాడు.

డెబ్బై ఏళ్ళ జీవితంలో తనను వెంటాడిన జ్ఞాపకాలను, మధ్యతరగతి బతుకు వెతలను- ఒక బైరాగి తత్త్వాలను గానం చేసినట్టు కథలుగా పాడి పాఠకులకు వినిపిస్తాడు. ఒక దశలో రచయిత మాయమయ్యి ఒట్టి కథ పాఠకుడిలో అనుభూతై ధ్వనిస్తుంది. కథానంతర వ్యథ పాఠకుడి అంతరంగంలో మిగిలిపోతుంది. విస్తృతమైన రచయిత జీవితానుభవం ఈ కథలగూటిని అల్లే క్రమంలో ఒక మార్మికమైన శైలిని సాధించింది. ఆ శైలే పాఠకుణ్ణి ఈ కథలను చివరిదాకా చదివిస్తుంది. రచయితను సమూహ రచయితల నుంచి విడదీసి విభిన్నంగా నిలబెడుతుంది.

కృష్ణమూర్తి కథలు రెండు, మూడు దశాబ్దాల కాలపు వ్యక్తులనూ, సంఘటనలనూ పాఠకులకు పరిచయం చేస్తాయి. కొన్ని కథల్లో మాత్రం రచయిత వృత్తి అయిన రెవెన్యూ తత్త్వం తొంగి చూసి వాటిని వ్యాసాల్లా మార్చాయి. మొత్తం మీద ఈ సంపుటిలోని కథలన్నీ రచయిత నాస్టాల్జిక్ అనుభూతుల రూపాంతరాలే. దాచేస్తే దాగని చరిత్రకు కథాకృతులే. క్షణక్షణమూ 'సత్యం' చేసుకుంటున్న ఆత్మహత్యకు ఒణికిపోతున్న మానవీయ విషాదాంతాలే.
కేవలం పాఠకులే కాదు, కొత్తగా కథలు రాసే రచయితలూ, పాత రచయితలూ... ముగ్గురూ చదవతగ్గ కథలివి. సంఘటనలను కథలుగా ఎలా మలచాలో చెప్పే గైడ్ ఈ కథల (వ్యథల) గూడు.

- డి. లెనిన్ 

కథల గూడు, దేవులపల్లి కృష్ణమూర్తి
పేజీలు : 122, వెల : రూ. 60
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-06

ఆదివారం ఆంద్ర జ్యోతి 25 నవంబర్ 2012 సౌజన్యం తో ) 

Monday, November 19, 2012

ఆప్తమిత్రుల ప్రోద్బలమే 'నిర్జన వారధి' - త్వరలో ఆంగ్ల అనువాదం: కొండపల్లి కోటేశ్వరమ్మ ...


తన జీవితంలో ప్రతి సంఘటనను గుర్తుచేస్తూ రాసిన ''నిర్జన వారధి'' పుస్తకానికి ఎంతో ఆదరణ లభించిదనీ, ఇప్పటికే రెండు సార్లు ముద్రితమై మూడో ముద్రణ త్వరలో విడుదల కాబోతున్నదనీ పీపుల్స్‌వార్‌ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య సతీమణి కొండపల్లి కోటేశ్వరమ్మ చెప్పారు.

విశాఖ నగరానికి చెందిన 'రైటర్స్‌ అకాడమీ', 'మహిళా చేతన' సంయుక్తంగా ఆదివారం పౌర గ్రంథాలయంలో ''నిర్జన వారధి'' పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కోటేశ్వరమ్మకు ఆత్మీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

నిర్జన వారధిపై ఆమె మాట్లాడుతూ, దీనిని ఆంగ్లంలోకి అనువదించడానికి కొంతమంది ముందుకొస్తున్నారని తెలిపారు. జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా ఉన్న సమయంలో ఆప్తమిత్రులు మహీధర రామ్మోహనరావు, పరకాల ప్రభాకర్‌, మానికొండ తదితరులు ఆత్మకథ రాయడానికి ప్రోత్సహించారని గుర్తుచేశారు.

కవియిత్రి విమల మాట్లాడుతూ అరుణ పతాకంపై కోటేశ్వరమ్మకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పడానికి అనేక సంఘటనలు కళ్లకు కట్టినట్టు రాశారని కొనియాడారు. రచయిత్రి మల్లీశ్వరి మాట్లాడుతూ, నిర్జనవారధి పుస్తకం కోటేశ్వరమ్మ ఆత్మకథ కాదనీ, ఒక చారిత్రక గ్రంథమనీ పేర్కొన్నారు. 'మిత్రసాహితి' వర్మ మాట్లాడుతూ సాధారణంగా వచ్చిన ఆత్మకథలకు భిన్నంగా కోటేశ్వరమ్మ రాసిన 'నిర్జనవారధి' ఉందని అభిప్రాయపడ్డారు.

(ఆంధ్రజ్యోతి, 19-11-2012 సౌజన్యంతో)

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌