Friday, April 4, 2014

చెట్లు నాటిన మనిషి - జా జియోనో- పునర్ముద్రణ

చెట్లు నాటిన మనిషి 

సుప్రసిద్ధ ఫ్రెంచ్‌ రచయిత జా జియోనో 1954లో రాసిన ఈ కధ        ( The Man Who Planted Trees ) ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువదించబడింది. 
లక్షలాది మందిని వృక్ష ప్రేమికులుగా మార్చింది. మొక్కలు నాటేలా వారిని ప్రోత్సహించింది. దేశదేశాల్లో అడవుల పునరుద్ధరణ కృషికి గొప్ప ఉత్తేజాన్నిచ్చింది. 

పది పేజీలు కూడా లేని ఈ చిన్న కథలో రచయిత సృష్టించిన 'ఎల్‌జియా బూఫియే' పాత్ర ప్రపంచ సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. బూఫియే ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తినిస్తూనే వున్నాడు, ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే వుంటాడు.

ఈ చిరుపుస్తకాన్ని డా. టి.వి.ఎస్‌.రామన్‌ అనువాదం చేయగా బాలసాహితి, హైదరాబాద్‌ వారు
1996లో తెలుగులో ముద్రించారు. ఆతరువాత 1998లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఈ పుస్తకాన్ని
విస్తృత స్థాయిలో జనంలోకి తీసుకెళ్లింది. కాపీలన్నీ ఎప్పుడో అయిపోయాయి. 


అయితే పర్యావరణం పట్ల ప్రజల్లో అప్పటికంటే ఇప్పుడు ఎంతో చైతన్యం పెరిగింది.
గ్లోబల్‌ వార్మింగ్‌ దుష్ఫలితాలను ప్రతీ ఒక్కరూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. ఈ దృష్ట్యా
అనేకమంది అభిమానుల  కోరిక మేరకు 'చెట్లు నాటిని మనిషి'ని హెచ్‌బిటి తిరిగి మీ ముందుకు తెచ్చింది. .
మీరు ఒక్క చెట్టైనా నాటకపోయినా 
కనీసం ఈ 'చెట్లు నాటిని మనిషి'తో కరచాలనం చేయండి. 

ఒంటి చేత్తో ఒక అడవినే సృష్టించిన 'బూఫియే' గొప్ప మనసును, 
మహత్తరమైన అతని కృషిని పదిమందికి పరిచయం చేయండి.  
రండి ఈ పచ్చటి పుస్తకం నీడలో కాసేపు సేద దీరుదాం.

చెట్లు నాటిన మనిషి
రచన: జా జియోనో 

ఆంగ్ల మూలం:  The Man Who Planted Trees- Jean Giono.
తెలుగు అనువాదం: డా. టి.వి.ఎస్‌.రామన్‌
16 పేజీలు, ధర: 10 రూపాయలు


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ నెం. 040-2352 1849
EMail ID : hyderabadbooktrust@gmail.com

Monday, March 10, 2014

చక్రాల కుర్చీ - నసీమా ప్రయాణం - పునర్ముద్రణ ...

నసీమా  హుర్‌జుక్‌ది వీరోచితమైన గాథ.
అప్పటివరకూ హాయిగా, ఆరోగ్యంగా నడిచిపోతున్న ఆమె జీవితం... పదహారేళ్ల వయసులో
ఉన్నట్టుండి ఒక్కసారిగా తలకిందులైంది.
అనూహ్యమైన అనారోగ్యం ఫలితంగా ఆమె పూర్తిగా చక్రాల కుర్చీకే అతుక్కుపోవాల్సి వచ్చింది.

లేవలేదు.
అడుగుపడదు.
అన్నింటికీ ఇతర్ల మీద ఆధారపడాలి.
తొలి రోజుల్లో ఆమె మానసికంగా పూర్తిగా కుంగిపోయింది.
నిట్టనిలువునా కుప్పకూలిపోయింది.

అయితే అనతి కాలంలోనే ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుంది.
తన వైకల్యం మీద ఆమె ఎంత ధీరోదాత్తమైన పోరాటాన్ని సాగించిందో కళ్లకు కడుతుంది ఈ పుస్తకం.

ఇప్పటికీ నసీమా చక్రాల కుర్చీలోనే కూర్చుని వుండవచ్చు.
కానీ ఆమె మనలో చాలామంది కంటే ఎంతో ఉన్నతంగా ముందుకు సాగుతోంది.

తాను అంగవైకల్యాన్ని జయించడమే కాదు....
హెల్పర్స్‌ ఆఫ్‌ ది హ్యాండీకాప్డ్‌... సంస్థను స్థాపించి
ఎందరో పేద వికలాంగులకు చేయూతనిస్తోంది.
వారిని పురోగమన పథంలో నడిపిస్తోంది.

స్ఫూర్తిదాయకమైన నసీమా హుర్ జుక్ ఆత్మకథ "చక్రాల కుర్చీ"
పునర్ముద్రణ వెలువడింది. తప్పక చదవండి.

చక్రాల కుర్చీ
నసీమా ప్రయాణం
- నసీమా హుర్‌జుక్‌
తెలుగు అనువాదం: రాధా మూర్తి


222 పేజీలు, వెల: రూ.120/-






Saturday, March 1, 2014

వేగుచుక్కలు - అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం - ఎమ్‌.ఎమ్‌.వినోదిని -

వేగుచుక్కలు
అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం
- ఎమ్‌.ఎమ్‌.వినోదిని


ఈ వ్యాస సంపుటిలో తొలి తెలుగు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యులు, తొలి తెలుగు అభ్యదయ కవి వేమన, అగ్రకుల ఆధిపత్యం నుండి దేవుడిని, దైవత్వాన్ని ప్రజాపరం చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలపై సహేతుకమైన, సత్య శోధనాయుతమైన వ్యాసాలు ఉన్నాయి.

ఈ మూడే కాకుండా కక్కయ్య, సిద్ధయ్య గురించిన లఘు రచనలూ ఉన్నాయి. అన్నమయ్య, వేమన, బ్రహ్మన్న తమ దృక్పథాన్ని, తత్వాన్ని జనసామాన్యానికి యెరుకపరచడానికి కవితా రచనే బలమైన ఆయుధంగా స్వీకరించారు.

వెయ్యేళ్లకు పైగా లిఖిత చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో ప్రబంధ, పురాణకర్తల సాహిత్యం మేధావుల మస్తిష్కాలలో పదిలంగా ఉంటే - ఈ మువ్వురూ తమ సామాజిక దృక్పథంతో వెలువరించిన కవిత్వంతో అశేష జనావళికి సతత హరిత స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు. అక్షరం ముక్క రాని పామరులు సైతం ఈ ముగ్గురి కవిత్వంలోని పద్యమో, పాటో, తత్వగీతమో అడిగినదే తడవుగా వినిపిస్తారు. తరతరాలుగా నాలుక నుండి నాలుక మీదికి ఈ ముగ్గురి జవజీవ కవిత్వం, వారసత్వం సంపదగా అంది వస్తూనే ఉంది. కాల పరీక్షల్లో ఎదురు నిలిచి పురోగమిస్తూనే ఉంది. ఇంతటి ఘనమైన కాలాతీత విజయసాధనకంటే ఏ కవులైనా, ఏ తాత్వికులైనా, ఏ సంస్కర్తలైనా ఏమి ఆశించగలరు?

స్ఫటికం వంటి వాస్తవం ఏమిటంటే ఈ ముగ్గురూ రాజ ఆస్థానాలకు బయటివారే. అదే వీరి బలం. అదే వీరి విజయసాధనలోని రహస్యంకూడా.

అలాగే ఈ ముగ్గురూ తాము నమ్మిన భావజాలాన్ని ఏ సామాన్యులకైతే మనసుకు ఎక్కేటట్లు చెప్పాలనుకున్నారో ఆ పనిని జయప్రదంగా, ఫలప్రదంగా చేశారు. ఆ చెప్పడానికి ప్రజల వాడుక భాషను, సాహిత్యంలో ఆనాటి పండితులు ఉపేక్షించిన దేశీయ ఛందస్సులను స్వీకరించి అద్వితీయ ఫలితాలను సాధించారు.

వేగుచుక్కలు
అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం
- ఎమ్‌.ఎమ్‌.వినోదిని


140 పేజీలు, ధర రూ. 80/-

ISBN 978-81-907377-4-6

ప్రతులకు వివరాలకు :
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌ నెం. 040-2352 1849


రచయిత్రి పరిచయం

వినోదిని గుంటూరులో పుట్టారు. ఏ.సి.కాలేజీ నుండి డిగ్రీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి ప్రాంగణం నుండి ఎం.ఎ. చేశారు. స్త్రీవాద కవిత్వంపై ఎం.ఫిల్‌ చేశారు., పిహెచ్‌.డి చేశారు. 

కుల వివక్ష నిర్మూలన, జోగిన వ్యవస్థ నిర్మూలనపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో యాక్షన్‌ ఎయిడ్‌ సంస్థతో కలిసి పనిచేశారు.
ప్రస్తుతం కడప లోని యోగి వేమన విశ్వ విద్యాలయం, తెలుగు శాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
కథ, కవిత్వం, విమర్శ రాస్తున్నారు.

దళిత స్త్రీల సమస్యలు, దళిత క్రైస్తవ జీవనంలోని వాస్తవాలు తన రచనల్లో ప్రధానంగా ప్రతిబింబిస్తున్నారు.

ప్రాచీన సాహిత్య బోధన గురించి వినోదిని రాసిన వ్యాసాలు తెలుగు సాహిత్య,లో సుదీర్ఘ చర్చను లేవనెత్తాయి. 'దాహం' పేరుతో రాసిన నాటకం ఇంగ్లీషు అనువాదం థరస్ట్‌ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆంగ్ల సాహిత్య విద్యార్థులకు సిలబస్‌గా ఉంది.

'తప్పిపోయిన కుమార్తె' కథ ఇంగ్లీషు అనువాదం ద పారబుల్‌ ఆఫ్‌ ఎ లాస్ట్‌ డాటర్‌ కేరళ విశ్వవిద్యాలం, ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ విద్యార్థులకు సిలబస్‌గా వుంది. వినోదిని రచనలు కొన్ని ఇంగ్లీషు, హిందీ, ఇతర భాషలలోకి అనువాదం అయ్యాయి.

వినోదిని రచనల ఆంగ్ల అనువాదాలు కొన్ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌, పెంగ్విన్‌ పబ్లికేషన్స్‌ ద్వారా ప్రచురణ పొందాయి. స్త్రీవాద కవిత్వం - భాష, వస్తు రూప నవీనత పేరుతో తన పిహెచ్‌.డి పరిశోధన ప్రచురితమైంది. 

.






Saturday, February 22, 2014

డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్మారకోపన్యాసాలు

అద్వితీయుడు
డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్మారకోపన్యాసాలు


భారతదేశ సమాజంలోని అసమానతలు తగ్గించేందుకూ,
పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకూ కృషిచేసిన మేధావిగా,
సామాజిక ధార్మిక రాజకీయ రంగాలన్నింటా ఆరితేరిన యోధునిగా,
సమవర్తిగా, భారత రాజ్యాంగ రచనా సంఘాధ్యక్షునిగా డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌  అద్వితీయుడు.

ఆయన చూపిన మార్గంలో పీడిత తాడిత వర్గాలు ఆత్మగౌరవంతో తమ ప్రస్థానం సాగిస్తున్నాయి..
అంబేడ్కర్‌ అధ్యయనాన్నీ, అన్వేషణనూ విశ్లేషిస్తూ
తమతమ రంగాలలో నిష్ణాతులయిన న్యాయమూర్తులూ, శాస్త్ర నిపుణులూ చేసిన ప్రసంగాల సంపుటి ఇది.

విభిన్న అంశాలపై అంబేడ్కర్‌గారి ఆలోచనలనూ సామాజిక, రాజకీయ ప్రాసంగికతనూ వివరిస్తున్న ఈ సంపుటి ఆయన భావజాలాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకుపోగలదు.



ఇందులో ...

1.డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ సామాజిక తత్వం -   ప్రొ|| ఎ. ఎం. రాజశేఖరయ్య

2.డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ రాజ్యాంగ దర్శనం - జస్టిస్‌ ఒ. చిన్నపరెడ్డి

3.విద్య -  దళిత విమోచనం : డాక్టర్‌ అంబేడ్కర్‌ దృక్పథం -  ప్రొ. జె.వి. రాఘవేంద్రరావు

4.డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ దృక్పథంలో 'స్త్రీ' -       ప్రొ. జి. హరగోపాల్‌

5.డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ రాజ్యాధికారవాదం : దళిత ఉద్యమ సమస్య- ప్రొ. గోపాల్‌గురు

6.డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ జాతీయ సమగ్రత -   జస్టిస్‌ గోపాల్‌రావు ఎక్బోటే

7.డాక్టర్‌ అంబేడ్కర్‌ సామాజిక న్యాయం - జస్టిస్‌ కొత్తపల్లి పున్నయ్య

8.డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఆర్థికాభివృద్ధి వ్యూహం : ప్రస్తుతాన్వయం - ప్రొ. జి. నాంచారయ్య

9.డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ, రాజకీయ బహుముఖ   ప్రజ్ఞను తెలిపే పదచిత్రాలు -                                 ప్రొ. ఆర్‌.వి.ఆర్‌. చంద్రశేఖరరావు

10.డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ : బౌద్ధమతం -   ప్రొ. వకుళాభరణం రామకృష్ణ

11.50 ఏళ్ళ స్వాతంత్య్రం : భారత రాజ్యాంగ విజయాలు -  జస్టిస్‌ డాక్టర్‌ మోతీలాల్‌ బి. నాయక్‌

12.డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ ''ఆదేశిక సూత్రాల'' ప్రాధాన్యం  -   డా. ఎ.బి.కె. ప్రసాద్‌

13.డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఆర్థికతత్వం - ప్రొ. కె. చక్రధరరావు

14.విద్యావేత్తగా డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ - ప్రొ. వి.ఎస్‌. ప్రసాద్‌

15.మానవ మర్యాద - డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ -  జస్టిస్‌ కె. రామస్వామి

16.ప్రపంచీకరణ  ; దళితులు - ప్రొ. డి. నరసింహారెడ్డి

17.రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ - చిన్న రాష్ట్రాలు : డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ అభిప్రాయాలు -                         ప్రొ. కొత్తపల్లి  జయశంకర్‌

18.డాక్టర్‌ అంబేడ్కర్‌ తాత్వికత : సాంఘిక మూలాలు -   ప్రొ. జి. సత్యనారాయణ

19.డాక్టర్‌ అంబేడ్కర్‌   : స్త్రీవాదం - ఆర్‌. అఖిలేశ్వరి

20.డాక్టర్‌ అంబేడ్కర్‌ దృక్పథంలో అందరికీ అందే అభివృద్ధి -   ప్రొ. టి. తిరుపతిరావు

21.సామాజిక సాధికారిత : భారతదేశంలో కులం, రాజకీయాలు,  అధికారం, అభివృద్ధి అంశాలపై ఒక పరిశీలన - ప్రొ. కె. మురళీమనోహర్‌

22.దళితులు : భూమి - కె. ఆర్‌. వేణుగోపాల్‌, ఐ.ఎ.ఎస్‌.(రి)

23.డాక్టర్‌ అంబేడ్కర్‌ దృక్పథంలో భూమి సమస్య -  పి. శివకామి, ఐ.ఎ.ఎస్‌.(వి.ఆర్‌.ఎస్‌.)

24.సమకాలీన భారతంలో కులం గతిశీలత - డాక్టర్‌ అంబేడ్కర్‌ దృక్పథం - ప్రొ. కె. శ్రీనివాసులు

25.భారతీయ గ్రామం - డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ పరిశీలన -   సతీష్‌ చందర్‌   
 



అద్వితీయుడు

అంబేడ్కర్‌ స్మారకోపన్యాసాలు 1986-2013


440 పేజీలు 
ధర : రూ.150/-

ప్రచురణకర్తలు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

డా|| బి.ఆర్‌. అంబేడ్కర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌




ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006.
ఫోన్‌ : 23521849

Email ID : hyderabadbooktrust@gmail.com


.






Thursday, February 13, 2014

Bojja Tarakam : Nela..Nagali...Moodeddulu



Bojja Tarakam : Nela..Nagali...Moodeddulu

Bojja Tarakam's book Nela,Nagali, Mudeddulu is a story of indian agrarian society.It is a literary narration of social history of dalits living for many  generations.It depicts the changing hegemonic social relations and unchanged life of dalits .It explains invariable nexus between caste,land and power.This book is a philosophical note of indian society from victims point of view.This book was published by Hyderabad Book Trust in 2008.Interestingly there is no discussion on this book so far.To understand the politics of power and hegemony of upper caste, one should read this book.

Bojja Tarakam is known as dalit leader in telugu society.He is politically active from the struggle against Karamchedu masacre to till recent agitation against Laximpeta massacre.He has written poetry, prose and essays in support of dalit struggle.Though they are powerful writings, they were discussed in lager literary and political debates.His poetry collection 'Nadi Puttina Gonthuka' is prior to dalit literary movement of eighties and nineties.In this he dismissed Gandhi and the image of "Mahatma" for not having the experience of dalit life.Kulam-Vargam(Caste-Class) is a book of political theory that charecterizes the Indian society.He explains that indian society is both caste and class ridden and also explains the relation between caste and class.As a result his struggle aims against caste and class and had a dream for casteless and classless democratic society.
Nela. Nagali..Modeddulu is how a dalit reduced to a level of domestic cattle  by not allowing him to think as a human being.In this work, he explains the evolution of Indian society and accumulation of wealth in upper caste and victimization of dalits . This is a different genre of writing in dalit literature.

- Kesavakumar, Pondicherry



Wednesday, January 29, 2014

Help Us To Bring Your Favourite HBT Books With Better Quality... An Appeal



Many of you have grown up reading some HBT books and some of you  may possible remember your favourite books - Edutaralu, Vaidyudu Leni Chota, Raktaasruvulu, Spartacus, etc, with some affection.

At HBT, we have always used a cheaper variety of  printing paper and packed the matter densely into the page so that we save on paper, and can keep the cost low. While the average reader has not complained (or maybe, not in our hearing), sometimes we ourselves, wonder - was there no other way?

Take Edutaralu. The present 200 page edition costs Rs. 100. If we use better quality paper (light-weight printing paper or 70 GSM maplitho), and retype the book with wider margins, the pages will increase to 280. With new CTP films and plates and better paper, the book will cost us roughly     Rs. 65/- copy (printing bill alone), to be priced at Rs. 150-180.

We have a proposal.
If you have a favourite HBT book, if you would like to see it in a better production (quality of paper, wider margins, better binding, maybe hard cover), and would like to contribute to this, we can bring down the price.

If we get say, Rs. 30,000, we can retain the old price of Rs. 100 for 1,000 copies. If we get more, we can retain the old price for a bigger print order. That is, your contribution helps the new reader to read the old classic in a better production.

If you like this idea, please reply on our blog, indicating which book you would like to support. Maybe if more than one person responds, it could be easier for this proposal to get off ground. We will be glad to acknowledge your support in this fashion roughly:

‘HBT gratefully acknowledges the support of X, Y and Z, which made the price of this edition low.’

- HYDERABAD BOOK TRUST
Phone No. 040-2352 1849
Mail:   gitaramaswamy@yahoo.com

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


మీకు నచ్చిన, మీరు మెచ్చిన అత్యుత్తమ హెచ్‌బిటి పుస్తకాలను మరింత అందంగా పునర్ముద్రించేందుకు చేయూతనివ్వండి !

మీలో చాలామంది హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలు చదువుతూ పెరిగిపెద్దయివుంటారు. ఆనాడు ఎంతో అభిమానంతో చదివిన ''ఏడుతరాలు'', ''వైద్యుడులేనిచోట'', ''రక్తాశృవులు'', ''స్పార్టకస్‌'' వంటి పుస్తకాలు మీలో కొందరికైనా ఇంకా గుర్తుండే వుంటాయి.

సాధారణంగా పాఠకులకు సాధ్యమైనంత తక్కువ ధరకు పుస్తకాలను అందించాలన్న ఉద్దేశంతో మేం తక్కువ రకం కాగితం మీద, పేజీలో చిన్న అక్షరాలతో ఎక్కువ మాటర్‌ని ఇరికించి ముద్రిస్తుంటాం. సగటు పాఠకుడు ఇప్పటివరకు ఈ విషయంలో మాకేమీ ఫిర్యాదు చేయలేదు (లేదా మా దృష్టికి రాలేదు) కానీ ఒకోసారి మాకే అనిపిస్తుంటుంది దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా అని.

ఉదహరణకి ''ఏడుతరాలు'' తీసుకోండి. ప్రస్తుతం మార్కెట్‌లో వున్న 200 పేజీల ఆ పుస్తకం వెల 100 రూపాయలు. మేం గనక నాణ్యమైన కాగితాన్ని ( తక్కువ బరువుండే 70 జిఎస్‌ఎం మ్యాప్‌లిథో పేపర్‌ని)                             ఉపయోగించి, విశాలమైన మార్జిన్లతో మళ్లీ టైపుచేయించి ముద్రిస్తే పేజీల సంఖ్య 280 కి పెరుగుతుంది. కొత్త సిటిపి ఫిలిమ్‌లు, ప్లేట్లు, మంచి పేపర్‌ అంతా కలసి ముద్రణకే ఒక్కో కాపీకి 65 రూపాయలవుతుంది. మిగతా ఖర్చులు కలిపితే అమ్మకం ధర 150 నుంచి 180 రూపాయలుగా వుంటుంది.

ఇక్కడ మాకొకటి అనిపిస్తోంది...
మీరు గనక మీకు నచ్చిన ఒక హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాన్ని (నాణ్యమైన పేపర్‌, విశాలమైన మార్జిన్లు, మంచి బైడింగ్‌, వీలైతే హార్ట్‌ కవర్‌లో) అందంగా తీసుకురావడానికి మాకు కొంత విరాళం ఇవ్వగలిగితే మేము పైన పేర్కొన్న అమ్మకం ధరని గణనీయంగా తగ్గించగలుగుతాం.

ఉదాహరణకు రూ.30,000 ల విరాళం అందితే కొత్త నాణ్యమైన పుస్తకాన్ని 1000 కాపీలు ముద్రించి పాత ధరకే అంటే 100 రూపాయలకే పాఠకులకు అందించగలుగుతాం. మరింత ఎక్కువ మొత్తం ఆర్థిక సహాయం లభిస్తే ఇంకా ఎక్కువ కాపీలు ముద్రించి అదే ధరకు అందించడానికి వీలవుతుంది. అంటే మీ విరాళం ద్వారా నేటి పాఠకులకు అలనాటి క్లాసిక్‌ పుస్తకాలను మరింత అందంగా తీర్చిదిద్ది అందించడం సాధ్యమవుతుందన్నమాట.

ఈ ఆలోచన మీకు నచ్చినట్టయితే దయచేసి మీ సమాధానాన్ని మా ఈ బ్లాగులో పొందుపరచండి. ఏ పుస్తకానికి మీరు సహాయం చేయాలనుకుంటున్నారో కూడా తెలియజేయండి. ఒక పుస్తకానికి ఒకరి కంటే ఎక్కువ మంది చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చినట్టయితే మరింత సులువుగా వుంటుంది. వెంటనే ఈ బృహత్కార్యాన్ని ప్రారంభించేందుకూ వీలవుతుంది. మేం ఆ పుస్తకంలో మీరు అందించిన సహాయాన్ని ఈ కింది విధంగా ప్రస్తావిస్తాం:

''ఈ పుస్తకాన్ని తక్కువ ధరకే ఇంత అందంగా పునర్ముద్రించేందుకు ఆర్థిక సహాయం చేసిన ఫలానా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.''


ఇట్లు
మీ
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ఫోన్‌ నెం. 040 2352 1849


మెయిల్‌ gitaramaswamy@yahoo.com

Monday, January 20, 2014

"మా నాయన బాలయ్య" పుస్తక పరిచయం - బత్తుల రమాసుందరి ( ప్రజా సాహితి మాసపత్రిక, నవంబర్ 2013 )

తాడికొండలో “పాడు” అని పిలవబడే చోట ‘ఆది ఆంధ్ర స్కూల్’ అని పిలిచే ప్రాధమిక పాఠశాల స్వర్ణోత్సవ కార్యక్రమం అది. స్టేజి మీద తొంభై ఏళ్ళ వృద్దుడు మాట్లాడుతున్నాడు...
ఆయన, ఆయన భార్య ఆ స్కూల్ వ్యవస్థాపకులు. ఒక ప్రైవేట్ స్కూల్ గా ప్రారంభం చేసి పాట్లో పిల్లలకు విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు ఆ భార్యా భర్తలు. తరువాత అది ప్రభుత్వ పాఠశాలగా మారింది. ఇప్పుడా పాటి నుండి ఎంతో మంది విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. (పాడు అంటే మాదిగ పల్లె అని అర్ధం).

అదే దుఖం, ఉద్వేగం “మా నాయన బాలయ్య” పుస్తకం చదువుతుంటే కలిగింది. ఇది షుమారు వంద సంవత్సరాల మాదిగల జీవన ప్రస్థానం. భారత రైల్వేలు, వాటి మొదటి దశలో బడుగు జీవుల బతుకుల్లో తెచ్చిన మార్పులు చెప్పిన చరిత్ర ఇది. కుల వివక్ష మార్చుకొన్న రూపాలను చర్చించిన జీవితం ఇది. కష్టాలలో, దారిద్ర్యంలో, అంటరానితనంలో, ఆస్తులు ఉన్నా అనుభవించనివ్వని దాస్యంలో తలంటుకొన్న కుటుంబంలో బిగుతుగా అల్లుకొన్న బంధాల అల్లిక ఇది. 

నాలుగు తరాల మాదిగల జీవితంలో వచ్చిన మార్పులను ఈ ఆత్మ కధాత్మక జీవిత చరిత్ర కూలంకషంగా చర్చించింది. వందేళ్ళ క్రితం తెలంగాణ పల్లెల్లో భూమి లేని వెట్టి చాకిరీ, దరికి రానివ్వని అస్పృశ్యత, హుందాగా బతకనివ్వని అవమానం, వెంటాడే అంటు రోగాలు నిమ్న కులాల బతుకులను అతలాకుతలం చేసాయి. చెల్లించే డబ్బులపై కూడా నీళ్ళు చిలకరించి తీసుకొనే దుర్మార్గం బుసలు కొట్టే కాలంలో ఈ ఆత్మ కధ ప్రారంభం అవుతుంది. 

చెప్పులు కుట్టే పెద నర్సయ్య పనితనానికి మెచ్చి యాభై ఎకరాల సారవంతమైన భూమిని ఇనాంగా ఇచ్చిన నిజాం నవాబు ఔదార్యాన్ని అనుభవించకుండా చేసిన అగ్రకుల, పెత్తందారీ దురహంకారం పెదనర్సయ్యను గులాంగానే ఉంచింది. అతని కొడుకు నర్సయ్య హయాంలోనూ ఆ పరిస్తితిలో మార్పేమి లేదు. ‘గత్తర’ వచ్చి చనిపోయిన భార్య శవాన్ని వీపుకి కట్టుకొని, తల్లిలేని పిల్లవాడిని వెంటబెట్టుకుని పిడెకెడు ఆత్మ గౌరవంతో బతికే మార్గం వెతుక్కుంటూ పల్లె దాటుతాడు నర్సయ్య.
బ్రిటీష్ ప్రభుత్వం తన పరిపాలనా సౌలభ్యం కోసం, వ్యాపార సంబంధాల అభివృద్ధి కోసం ఆనాడు మొదలు పెట్టిన రైల్వే పనులు అతి కష్టమైనవి. ప్రమాదభరితమైనవి. అగ్రవర్ణాలవాళ్ళు దూరంగా ఉండడం వలన ఆ కష్ట సాధ్యమైన, ప్రాణాంతకమైన పనులు దళితులకు అందుబాటులో వచ్చాయి. ఆ పనుల కోసం భారతదేశం నలుమూలలనుండి ఆ నాటి అస్పృశ్యులు వచ్చారు.

భారత రైల్వేలు కట్టించిన క్వార్టర్స్ ను, చౌకధరలకు సరఫరా చేసిన నిత్యావసర వస్తువులను వారి ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక జీవనాన్ని మెరుగుచేసుకొనేందుకు ఉపయోగపెట్టుకొన్నారు. తద్వారా పల్లెల్లో వెంటాడే అంటరానితనంకి కొంత దూరంగా ఉంటూ తరువాత తరాలకు విద్యాగంధాలు అందిచగలిగారు. అరకొరగా అందిన ప్రభుత్వ సహాయాన్ని అడ్డం పెట్టుకొని మెరుగైన జీవితాల కోసం అహర్నిశలు శ్రమించారు.

ఇదంతా రాత్రికి రాత్రే వచ్చిన మార్పు కాదు. అక్షరం ముక్క రాని పెదనర్సయ్య నుండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అధ్యాపకులుగా స్థిరపడ్డ బాలయ్య నలుగురు కొడుకుల వరకు సమాజంలో ఉన్న అననుకూల పరిస్థితులతో అలసిపోని యుద్దం చేశారు. కుటుంబ వారసత్వంగా వచ్చిన అవిద్య, సాంఘిక వెలివేత, బయట ప్రపంచంతో స్నేహం చేసే వెసులుబాటు లేని సంకుచిత పరిస్థితులు వీరిని నిరంతరం వెన్నాడాయి. అర్ధాకలితో, అవాంతరాలతో, వసతులు లేని చిన్న చిన్న ఇళ్ళళ్ళో అమరని సౌకర్యాలతో కొనసాగిన వీరి చదువులు ముళ్ళ బాట మీదే నడిచాయి.
సెంటు భూమి కూడా ఇవ్వటానికి నిరాకరించబడిన, తృణీకరించబడిన సామాజిక వర్గం నుండి వచ్చిన బాలయ్య, విద్య ద్వారా మాత్రమే తన పిల్లలు సమాజంలో సముచిత స్థానాన్ని పొందగలరనే బలమైన ఆకాంక్షతో చేపట్టిన యజ్ఞం కఠోరమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది.

రచయత తన ఆత్మ కధలో సృజించిన విషయాలు అనేకం అమూల్యమైనవి. చరిత్రలో నిక్షిప్తం చేయాల్సినవి. తరాలు మారే కొలది రూపాలు మార్చుకొన్న కుల వివక్షత, దాన్ని స్వీకరించే విధానంలో వచ్చిన మార్పులు వివరంగా చర్చించారు. మొదటి తరం పెదనర్సయ్యతో దొర “నీకు భూమి కావాల్నారా” అని హుంకరించగానే “నీ బాంచన్, నువ్వే నా దొరవు, దేవునివి” అని చేతులు జోడిస్తాడు. రెండో తరంలో నర్సయ్య తన కొడుకుతో “లేదు బిడ్డా! మనం సదువుకోవద్దు. సదువుకుంటే పాపం తలుగుతది” అంటాడు. బాలయ్య దగ్గరకు వచ్చేసరికి “ఎవరికైనా అణగి ఉండటం ఆయనకు కోపమే కానీ ఈ అస్పృశ్యత పాటించడం గురించి నిరసన వెలిబుచ్చేవాడు కాదు. అది సమాజ నిర్మాణంలో ఒక భాగం అనుకొనేవాడు.” 

మన పుస్తక రచయిత దగ్గరకు వచ్చేసరికి ఆయన కులాన్ని అర్ధం చేసుకోవటం, కుల వివక్షతకు కారణాలు శోధించటం అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే రచనల వెలుగు నుండి ప్రయత్నించినట్లు అనిపించింది. “నీ బానిసత్వాన్ని నువ్వే నిర్మూలించుకోవాలి. ఆత్మ గౌరవాన్ని పణం పెట్టి బతకడం అవమానాల్లోకెల్లా అవమానం. ఆత్మగౌరవంతో హుందాగా జీవించాలంటే కష్టాలు భరించాలి. నిరంతర పోరాటాల నుంచే శక్తి జనిస్తుంది. ఆత్మ విశ్వాసమూ, గుర్తింపూ, గౌరవమూ వస్తాయి.” అనే అంబేడ్కర్ వాక్యాలను రచయిత ఉటంకించడం బట్టి ఈ ఆలోచన కలుగుతోంది.
కుల దురహంకారులు వ్యక్తిగతంగా, సామూహికంగా; తన మీద, తన వారి మీద చేసిన దాడులను, బహిరంగ తిరస్కారాన్ని అత్యంత పరిణతితోనూ, ఆవేశకావేశాలను అణచుకొని ఎదుర్కొన్నట్లు అనిపిస్తుంది. కుల దురహంకారానికి, దురభిమానానికి మూలాలు వ్యక్తుల్లో కాక, వ్యవస్థలో వెదికే ప్రయత్నం చేయడం కూడా కనిపిస్తుంది. 

కులానికి సంబంధించి వీరు పేర్కొన్న చేదు అనుభవాలు కంట నీరు రప్పిస్తాయి.
“మనం ముట్టుకోని వాళ్ళం బిడ్డా, ఆళ్ళు మనకు చదువు చెప్పరు”
“ఎందుకు?”
“మనలను వాళ్ళు ముట్టుకోరు బిడ్డా! అందుకే ”
“అయితేంది? నేను వాళ్ళకు దూరంగా కూసుంట, అక్కడ కూడా ఎవర్నీ ముట్టుకొను”
“కాని నీకు పంతులు పాఠం చెప్పడు”
“నేను పంతుల్ని గూడ ముట్టుకోను.” 

చదువుకోవాలనే తీవ్ర వాంఛగల బాలయ్యను బడి దరిదాపులకు కూడా అనుమతించని అమానవీయ పరిస్థితుల నుండి ఆయన పిల్లలకు రైల్వే బడుల్లో ప్రవేశం అయితే లభించింది కానీ కుల దౌష్ట్యం మాత్రం వారిని వీడలేదు.

“నేను క్లాసులోకి అడుగు పెట్టగానే అతను తన స్నేహితులకి అక్కడున్న గోడ చూపించి ‘ఇది ఎవరిది?’ అని అడిగే వాడు. వాళ్ళు ‘మాది’ అనేవాళ్ళు. అప్పుడు మళ్ళీ ‘ఇదేమిటి?’ అని అడిగేవాళ్లు. వాళ్ళు ‘గోడ’ అనే వాళ్ళు. అప్పుడతను ఆ రెండు సమాధానాలనీ కలిపి చెప్పమనేవాడు. వాళ్ళు వెంటనే ‘మాదిగోడా ‘ అని అరిచేవాళ్ళు.” ఎంత అవమానపడి బాధపడ్డా, ఆ బృందానికి వ్యతిరేకంగా తన తరఫున ఎవరూ మాట్లాడే వాళ్ళు లేక ఎదురు సమాధానం చెప్పలేక పోవటం ఆనాటి దుర్భర, అసహాయ స్థితికి నిదర్శనం.

గ్రామాల్లో వివిధ వర్ణాల ఇళ్ళ నిర్మాణం అవర్ణుల గాలి, అగ్రకులాలకి తగలకుండా మనువు సూత్రాలకు అనుగుణంగానే ఉండేదని, ఇప్పటికీ అదే రకమైన పద్దతి కొనసాగుతుందని రచయత పేర్కొన్న విషయం ప్రాముఖ్యత గలది. ఇది భారత దేశంలో అస్పృశ్యత లేదని వాదించే వర్గాలకు మనం చూపించగలిగిన సజీవ దృశ్య ఖండిక. 

కటిక పేదరికం, ప్రతికూల సామాజిక పరిస్థితుల నేపధ్యంలో కుటుంబ సభ్యులు, వారి మధ్య పొందికగా పెంచుకొన్న ప్రేమాభిమానాలు ఎన్నదగ్గవి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒకరికోసం ఒకరు చేసుకొన్న త్యాగాలు గొప్పవి. తమ చదువు కోసం తల్లి దండ్రుల కష్టాన్ని, చాకిరీని పరికించి, తల పంకించి అత్యాశలకు పోకుండా అర్ధాకలితో సర్ధుకొన్నతీరు హృద్యంగా వర్ణించారు. మొదటి కొడుకు ఐన తనను తల్లిదండ్రులు ఎక్కువ చదివించక లేకపోయినా కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకొని బాలరాజు చివరి వరకు కష్టించిన వైనం, తనను కుటుంబమంతా ఇబ్బందుల కోర్చి చదివించినందుకు అబ్బసాయిలు తమ్ముళ్ళు స్థిర పడే వరకు ఇచ్చిన తోడ్పాటు, తరువాత కాలంలో తమ్ముళ్ళు ఆ బాధ్యతను అందుకొన్న తీరు… అంచెలంచెలుగా భుజాలు మార్చుకొంటూ కుటుంబాన్ని గట్టెక్కించిన విధానం చాలా ఉన్నతంగా అనిపిస్తుంది. కడగండ్లతో పెంచుకొన్న సంసారాల్లోని సంతానంలోనే ఇంత గాఢమైన బాంధవ్యాలు చూడగలం. 

తాను కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యాక ‘నాన్న సోఫా మీద కూర్చొని చందమామ చదవడం, అమ్మ వెక్కిరించటం’ తన మధుర స్మృతుల్లో ఒక భాగంగా రచయిత రాసుకొన్నారు. అది చదువుతున్నప్పుడు అప్రయత్నంగా మన పెదాల మీద కూడా చిరునవ్వు కదులుతుంది. అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యత పంచుకోవటానికి కొడుకులు సమావేశమైన రోజు రచయిత పడిన ఆవేదన మనల్ని కూడా మనస్థాపానికి గురి చేస్తుంది.

మూడు తరాల మాదిగ కుటుంబాలలో వచ్చిన సంస్కృతీకరణ మార్పు కూడా గమనించదగింది. దళితులు పూజించిన దేవతలు గ్రామ దేవతలు. (క్షుద్ర దేవతలు అని హిందువులు ఎగతాళి చేసేవాళ్ళు) ఈ గుడులు ఎత్తు తక్కువగా ఉండి, పైకప్పు గుమ్మటంలా ఉండేవి . స్త్రీలూ పురుషులు, ఎవరు పూజ చేస్తే వారే పూజారులు. తమ రోజూవారి ఆహారాన్నే నైవేధ్యంగా పెట్టేవాళ్లు. పెళ్ళిళ్ళు కూడా అదే కులానికి చెందిన బైండ్లాయన చేసేవాడు. (“బైండ్లాయన తనకు వచ్చిన ఒకే శ్లోకం ‘శుక్లాంభరధరం’ చదివినప్పుడు మా అన్న భ్రాహ్మణ స్నేహితులు నవ్వారు”). రచయిత మిగతా వర్ణాలవారిని ‘హిందువులు‘ అని పుస్తకమంతా పేర్కోవటం విశేషం. ఈ సంభోదన వెనుక తమని హైందవేతరులుగా ఐడెంటిఫై చేసుకోవటంగా కనిపిస్తుంది. అలాగని క్రైస్తవ, ముస్లిం మతాల స్వీకరణ కూడా వీరి కుటుంబంలో జరగలేదు. ఈ రోజు హిందుత్వ అంటే భారతీయ సంస్కృతి అని ఊదరగొడుతున్న వారికి; శూద్రులు, అవర్ణులు అని చెప్పబడిన ఈ మెజారిటీ ప్రజల సంస్కృతి మూలాలు హిందూ మతంలో లేవని ఈ కుటుంబ చరిత్ర చెబుతుంది. కాల క్రమేణా వీరి కొన్ని కుటుంబాలలో హిందూ దేవుడి పటాలు రావడం; ఇళ్ళళ్ళో వాస్తు పట్టింపులు, తులసి మొక్కలు రావటం, పూజలు చేసి గంటలు మోగించటం… ఇవన్నీ ఆధిపత్య వర్ణాల ప్రజల మతాన్ని అనుసరించడం తప్ప మరొకటి కాదు.

తమ మొదటి తరంలో, చదువు అభ్యసించటానికి ఏర్పడిన సంక్లిష్టతకు కారణాలు కూడా శాస్త్రీయంగా అర్ధం చేసుకొన్నారు రచయిత. కులం కారణంగా రుద్దబడిన ఆత్మన్యూనతా భావం, బయట ప్రపంచంతో సంభాషించలేని వారి అసహాయ ప్రపంచం… ఇవన్నీ వారి అభివృద్దికి అవరోధాలే. అన్నిటికి మించి కొన్ని తరాలుగా విద్యకు, జ్ఞానానికి నోచుకోక బీళ్ళు పడ్డ మెదడును పునర్జీవింపచేయటానికి మొదటి తరం చేసిన మధనం చిన్నది కాదు.

ఈ ఆత్మ కధలో ప్రశ్నార్ధకంగా మిగిలి పోయిన యాదగిరి అదృశ్యం గురించి ఇంకొంత రాసి ఉంటే బాగుండేదనిపించింది. భారతదేశంలో అత్యంత అణచివేయబడిన వర్గం, కులం నుండి వచ్చి, వామ పక్ష భావాలకు ఆకర్షితుడైన యాదగిరి ఎన్నుకొన్న జీవనమార్గం ఇతరులకు తప్పక ఆదర్శం అయ్యేది. అలాగే కుటుంబంలో ప్రస్పుటంగా కనబడిన పురుషాధిక్యత గురించి రచయత అంతర్లీనంగా చర్చించినా (ఆడపిల్లలకు చదువు చెప్పించక పోవటం, మగాళ్ళు రెండు వివాహాలు చేసుకొనే వెసులుబాటు, కుటుంబంలో పురుషుని ఆధిక్యత) ఇంకొంత విశదీకరించి, విమర్శిస్తే బాగుండేదని అనిపించింది. కుటుంబానికి పట్టుకొమ్మ అయిన నరసమ్మగారి వైపు నుండి కూడా ఇంకొక పుస్తకం రావాల్సి ఉంది.

తన ఆత్మ కధను ముందుతరాలకు దార్శనీయంగా మలిచిన వై.బి సత్యనారాయణగారు ధన్యులు. భారతదేశ నవ నిర్మాణంలో తమ చెమటను, రక్తాన్ని ధారబోసిన వీరుల, సమాజపు అడుగు పొరల నుండి అందిన కించిత్తు ఆసరాను ఊతంగా తీసుకొని పాకుడురాళ్ళపై ఎగబాకిన ధీరుల చరిత్రను రికార్డ్ చేయటంలో ఈయన సఫలీకృతులు అయినట్లే. ఈ ఆంగ్ల పుస్తకాన్ని తెలుగీకరించిన పి.సత్యవతి గారి అనువాద నైపుణ్యాన్ని ప్రశంసించి తీరాల్సిందే. ముందు మాటలు చదవకుండా మనం నేరుగా పుస్తకంలోకి వెళితే ఇది అనువాదమని ఎవరూ గ్రహించలేరు. అంత సరళంగా, చదవటానికి సౌలభ్యంగా ఉంది ఈ అనువాదం.

- బత్తుల రమాసుందరి  

ప్రజాసాహితి మాసపత్రిక నవంబర్ 2013

" కథలు డాట్ కాం " సౌజన్యంతో

Sunday, January 19, 2014

ఇతని ఆగ్రహానికి ఒక ధర్మం ఉంది..ఈ యుద్ధానికి ఒక అనివార్యత ఉంది – రమా సుందరి (Kinige.com)




చదివి వెంటనే పుస్తకాన్ని విసిరేశాను కాని ….  
పుస్తకం మెదడుకు పంపిణీ చేసిన చేదు వాస్తవ రసాయనాలు ….  
అవి అచ్చులేసిన ముద్రలను తుడిచి వేయలేక పోయాను. 

ఇది డా. గోపీనాథ్ ఆత్మ కధగానే నేను చదవగలిగి ఉంటే ఇందులో నిజాలు, నిర్ధారణల కోసం పరుగులు పెట్టే అగత్యం నాకు కలిగేది. కానీ ఈ పుస్తకం ఒకానొక ప్రాధాన్యత కలిగిన కాలంలో రచయిత సాగించిన చేవగలిగిన బతుకు నడక. తన మూలాల తాలూకు యధార్ధాన్ని ఏమారకుండా అప్రమత్తతతో కాలు సాగించిన త్రోవరీ ఈయన. 

ఈ నడకలో నాకు ఒక మారుమూల భారతీయ పల్లె నుండి కొద్దిగా తెగువ, విశ్వాసం మూట ముడిచి కర్రకు చివర కట్టుకొని బయలు దేరిన పాదచారి కనిపించాడు. గమ్యం తెలుసు. కానీ దోవ ఎవరూ వేయలేదు. కష్టపడి వేసుకొన్నదారి తిన్ననైనదేమీ కాదు. దానికోసం చేసిన యుద్దం తక్కువదీ కాదు.

ఈ పుస్తకంలో రచయిత బయలు పరిచిన వస్తువుకి సార్వజనీనత ఉంది. వర్తమాన సామాజిక చిత్రంలో ఇప్పటికీ అనేకానేక సంఘటనలుగా కనిపిస్తూ ఈ వస్తువుకి తిరుగు లేని దాఖలాలు చూపిస్తున్నాయి. దళితులు అయినందుకు ప్రాజెక్ట్ గైడ్ గా ఉండటానికి ఒప్పుకోని ప్రొఫెసర్లు, ‘మీరు ప్రభుత్వ దత్తపుత్రులుఅని ఎకెసెక్కం చేసే విద్యార్ధులు వీరందరితో కూడిన సమాజం చుట్టూ ఇప్పటికీ ఉన్నపుడు ఈ ఆత్మకధలో ఏ విషయాన్ని తిరస్కరించగలం? రాజ్యాంగంలో హక్కులు, వెసులుబాటులు ఉంటాయి. అమలు పరిచే కాడ నిష్ఠూరం ఉంటుంది. గ్రంధాలయాల్లో దళితులకు పుస్తకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇచ్చే దగ్గర మనసు ఒప్పదు. స్కాలర్షిప్పులు అరకొరగా వస్తాయి. సమ్మతించటానికి అధికారులు నొసలు చిట్లిస్తారు. ఉన్న ఒక్క చొక్కా రోజూ ఉతుక్కొని, అర్ధాకలి కడుపుతో కాలేజీకి వెళ్ళే విద్యార్ధిలో క్రమశిక్షణ, శుభ్రత లేదనే సమన్యాయఅధ్యాపకుల ఆగ్రహం. ఇవన్నీ ఇప్పటి సమాజం వదిలేసిన విషయాలా?

ఇంకా కులవివక్షత ఉందా?” “కుల ప్రయోజనాలు పొందుతున్నప్పుడు కులం పోవాలని అనటం విడ్డూరం.” “రిజర్వేషనులు పొందుతున్నారు కాబట్టి కుల ధూషణ కూడా పొందాల్సిందే” …. ఇలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు నిరంతరం మేధోజీవుల నుండి కూడా వినవచ్చే ఈ సందర్భానికి ఇలాంటి లక్షల జీవితాలు అచ్చుకెక్కటం తప్పనిసరి అవుతుంది. ఈ పుస్తకం వేసిన మౌలిక ప్రశ్నలను దాటవేసి ఇతర విషయాలను రంధ్రాన్వేషణ చేసేవారి గురించి ఇక చెప్పేదేమీ ఉండదు.

ప్రకృతితో దగ్గర సంబంధం ఉండే కుర్రాడికి వృత్తి విద్య బాగా వంటబడుతుందనే ప్రాధమిక సూత్రం పట్ల కావాలనే ఉదాసీనత వహించారు. పాండిత్యం ఒక కులం సొత్తుగా మార్చుకోవటానికి చేసిన కుట్రకు వ్యతిరేకంగా అన్ని శూద్ర కులాలు పోరాటాలు చేశాయి. చివరగా మాలా మాదిగలు చేసిన పోరు సొగసుగా ఉండక పోవచ్చు. గరుకుగా, కురూపంగా ఉండవచ్చు. కానీ ఆ యుద్దానికి ఒక అనివార్యత ఉంది. గతితార్కిక సూత్రం ప్రకారం అడ్డంకులను బద్దలు కొట్టే స్వభావం ఆ యుద్దానికి ఉంటుంది.

కులాలని పేరుపెట్టి తిట్టినా, కమ్యూనిష్టుల అవకాశవాద రాజకీయాలను ఎండగట్టినా (పార్టీల కతీతంగా), ప్రొఫెసర్ల కాలరు పట్టుకొన్నా …. దాని వెనుక నిర్మాణమై ఉన్న ఒక వ్యవస్థకు, పదును పెట్టిన కత్తిని ఆనించి ఎదురొడ్డిన సాహసమే కనిపిస్తుంది. కాస్తంత అసహనం ఉంటేనేం? కూసంత అతిశయం కనిపిస్తేనేం? యుగాలుగా మెదళ్ళ పొరల్లో కరడు కట్టుకు పోయి ….చేతల్లో, మాటల్లో, సైగల్లో, రాతల్లో, భావాల్లోప్రకటిత, అప్రకటిత కుల అహంకార రంకెలకు సమాధానం ఆ మాత్రం కటువుగా, పొగరుగా ఉండదూ?

పెద్ద చదువులు చదివితే దళితులకు మెరుగైన పౌర జీవనం లభిస్తుంది అనే నిర్వచనం పాక్షిక సత్యం. ముందుకు పోవటానికి వేసే ప్రతి అడుగు తుస్కారానికి, నిందకు గురి అవుతున్నదశలో ఏదో రూపంలో ఊతం ఇచ్చిన వెసులుబాటును మననం చేసుకోవటం సహజమైన విషయం. క్రిష్టియానిటీ ఇచ్చిన చేయూతను పదే పదే తలుచుకొని కృతజ్నతలు తెలుపుకోవటం కూడా అందులో భాగమే. తన ఆలోచన స్రవంతి ని ప్రభావితం చేసిన వి‌ప్లవ సంస్థలకు కూడా అదే వినమ్రతతో ధన్యవాదాలు తెలిపాడు.

డా. గోపీనాథ్ కుల వ్యవస్థకు, విద్యా వ్యవస్థకు సంబంధించిన కొన్ని మౌలిక ప్రశ్నలు వేశాడు. సమాధానాల కోసం వెదికాడు. అణగారిన తమ కులాల సమున్నతి కోసం విప్లవాన్ని కల కన్నాడు. దాని కోసం తను నమ్మిన రాజకీయాలలో తలమునకలుగా పని చేశాడు. విభేధించిన చోట మాట్లాడాడు. ఎక్కడా తన కుదుళ్ళను మర్చిపోలేదు. మొదలుకీ, గురికి సూటి గీత గీయగలిగాడు. ఆచరణతో ఆ గీతకు చక్కగా లంకె పెట్టగలిగాడు. ఆర్.ఎస్.యూ. లో పని చేస్తున్నప్పుడు కానీ, విద్యార్ధి ప్రతినిధిగా కానీ ఈ దేశ మూలవాసిగా తన కుల న్యాయ లక్షణాలను వదులుకోక పోవటం ఎన్నదగిన విషయం. ఆ కొనసాగింపును మిగిలిన ఆయన జీవితంలో నిస్సంకోచంగా ఆశించవచ్చు.

జీవిత కధలు విశిష్ట చారిత్రిక సంఘటనలతో కలబోసి ఉంటే ఆ జీవితాలకు ఒక ప్రత్యేకత, సార్ధకత ఉంటాయి. గోపీనాధ్ కధలో ఆ వనరులు చాలా ఉన్నాయి. రమిజాబి ఉదంతం, ఇంద్రవెల్లి మారణ కాండ, ఈశాన్య రాష్ట్రాల ప్రజా పోరాటాలు, “ది గ్రేట్ ఎస్కేప్లాంటి విశేష సంఘటనలతో ఈ రచయిత జీవితం ముడివడి ఉంది. చెరుకూరి రాజ్ కుమార్ లాంటి నిప్పు రవ్వతో మానసిక ఏకత్వం రచయిత జీవితాన్ని ప్రభావితం చేసినట్లు కనబడుతుంది. కేవలంప్రజలకు ఇంకా నా అవసరం ఉందిఅనే ప్రాతిపాదిక మీదే ప్రాణాలు నిలబడటం అనే విషయంనిర్ణయించబడి అంతకు మించి పూచిక పుల్ల కూడా దానికి విలువ ఇవ్వని విప్లవ సంస్థలలోని వ్యక్తుల సాంగత్యం ఈ డాక్టరుగారిని మొండిగా, సాహసిగా నిలబెట్టాయి. అణగారిన వర్గాలవైపు షరతులు లేకుండా నిలబడ్డ ఆ సంస్థల నిబద్దత రచయితను సూదంటు రాయి లాగా ఆకర్షించినదనటానికి సందేహం లేదు. అందుకే తన జీవితంలోని ఒక కీలకమైన దశలో జీవికను ఫణంగా పెట్టటానికి సైతం వెనకాడలేదు.

భారత దేశంలో కులం, వర్గం …. ఈ రెండు షరీకై చేసిన విన్యాసాలను ఈయన జాగ్రత్తగానే పరిశీలించినట్లుగా కనబడుతుంది. ఈ రెండిటి మధ్య సారూప్యత, వైరుధ్యం అంచనా వేయటానికి మార్కిజాన్ని, అంబేడ్కరిజాన్ని కలిపి అధ్యయనం చేయాలని అంటారు.

 కులాన్ని పట్టుకొని వర్గమే లేదనే వాళ్ళు ఎంత మూర్ఖులో, వర్గమే తప్ప కులం లేదన్న వాళ్ళు మూర్ఖులే కాక పచ్చి మోసగాళ్ళు.అలాగే పీపుల్స్ వార్ లోని వ్యక్తులు కులాతీతులు అనటం సహజ సూత్రానికి విరుద్ధం అని ఒప్పుకొన్నారు. వి‌ప్లవ కార్యాచరణలో భాగంగా ఆ లక్షణాలను వదిలించుకోవటం జరుగుతుంది. అయితే ఈ బలహీనత అన్ని వి‌ప్లవ సంస్థలలో తరతమ స్థాయిల్లో ఉంటుందనీ వర్గకుల సమాజాల్లోని సంస్థలు, వ్యక్తులు వాటికి అతీతంగా ఉండరనీ వాటి నుండి విడివడటానికి ఏ మేరకు ప్రయత్నం చేస్తున్నారనేదే మూలమనే విషయం డాక్టరు గారు అంగీకరిస్తే ఇతర వి‌ప్లవ సంఘాల పట్ల ఆయన అసహనం తగ్గుతుంది. ఎన్నికల్లో పాల్గోవటం ఒక ఎత్తుగడగా పాటిస్తున్న సంస్థల ఆచరణను ఇన్ని సంవత్సరాలుగా గమనించి కూడా ఎన్నికలు వసతుల కోసం ఎంచుకొన్నదారులని ఆయన భావించటం ఆయా సంస్థలలో పని చేస్తున్న నిజాయితీ కలిగిన వ్యక్తులకు ఇబ్బంది కలిగించవచ్చు.

కులాల పాకుడురాళ్ళపై ఎగబాకి వచ్చిన దళిత జీవితాలు ఇప్పుడు ముద్రణ పొంది మన ముందుకు వచ్చి జఠిలమైన ప్రశ్నలు వేస్తున్నాయి. ఎన్ని తరాలకూ మారని రాజకీయ ఆర్ధిక చిత్రాన్ని గీసి చూపించి సమాధానాల కోసం గల్లా పట్టుకొని అడుగుతున్నాయి. గుండె, గొంతు ఒకటే చేసి ఈ పుస్తక జీవితాలతో సంభాషిద్దామా? లేదంటే విసిరి కొట్టి లేచి పోదామా?
 – రమా సుందరి
ప్రింటుఈ-పుస్తకాలు “కినిగెలో లభ్యం
 http://patrika.kinige.com/?p=979

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ – 500 006.
ఫోన్: 23521849

( కినిగె డాట్ కాం సౌజన్యం తో...)

Tuesday, December 24, 2013

పుస్తకాభిమానులకు విజ్ఞప్తి

పుస్తకాభిమానులకు విజ్ఞప్తి

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రధానంగా పుస్తకాభిమానులు అందించే స్వచ్ఛంద సేవలపై ఆధారపడి మనుగడ
సాగిస్తోంది. అయితే రోజురోజుకూ పనిఒత్తిళ్లు పెరిగిపోతున్న నేటి ప్రపంచంలో అంకితభావంతో
సేవలందించేవారు లభించడం కష్టంగా మారింది. హెచ్‌బీటీకి సహాయపడేవారు సహజంగానే ఇతర అనేక
సేవాకార్యక్రమాలకోసం కూడా తమ సమయాన్ని వెచ్చిస్తుంటారు. అందువల్ల ఎంతోకాలంగా హెచ్‌బీటీని
ఆదరిస్తున్న పాఠకులలో ఎవరైనా ఈ కింది పనులలో మాకు సహకరించేందుకు ముందుకు
రావలసిందిగా కోరుతున్నాము:

1) ప్రచురణకు పంపేముందు రచనల, అనువాదాల రాతపతులను పరిశీలించి తగు సూచనలివ్వడం.
2) కంపోజ్‌ చేసిన ప్రూఫులను తప్పులు లేకుండా సరిదిద్దడం.
3) రాతపతులను ఎడిట్‌ చేయడం, నిర్దిష్టమైన మార్పులు చేర్పులు సూచించడం

పైన పేర్కొన్న పనుల్లో దేనిలోనైనా స్వచ్ఛంద సేవ అందించేందుకు వెసులుబాటు, ఆసక్తి వున్నవారు
దయచేసి ఈ కింది మెయిల్‌ ఐడీకి మెయిల్‌ చేయగలరు.
gitaramaswamy@yahoo.com

వీలైతే మీ ఫోన్‌ నెంబర్‌ తెలియజేయండి, మేమే మిమ్మల్ని సంప్రదిస్తాము.
విదేశాలలో వున్నవారు కూడా పై పనుల్లో మాకు తమ సహకారం అందించవచ్చు. వారికి స్క్రిప్టులను
ఓపెన్‌ ఫైల్‌ లేదా పీడీఎఫ్‌ రూపంలో మెయిల్‌ ద్వారా పంపించడం జరుగుతుంది.

మీ స్పందన కోసం ఎదురుచూస్తూ
అభినందనలతో

గీతా రామస్వామి
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ఫోన్‌: 040 2352 1849
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,



A personal call for help

It is becoming increasingly difficult in the busy world of today to find volunteers for various tasks of the HBT. HBT runs largely on dedicated volunteer work. Those who spare time for HBT time are inevitably those who also give their time to other causes unsparingly. We request our readers who have supported us for so long, to help us in:

1. reviewing manuscripts and giving us their valuable opinions, so that we can select appropriate texts for publication.
2. proofing composed manuscripts
3. editing manuscripts and suggesting both broad and specific changes.

Kindly write to us at gitaramaswamy@yahoo.com, if you can volunteer for any of the above.

If it is possible, please give us your telephone number so that we can speak directly to you. We welcome help from those of you who live abroad - we can send you open or PDF files by email too.

Hoping from a response from you,
Yours in anticipation,

Gita Ramaswamy
Hyderabad Book Trust
Ph. No. 040 2352 1849

 




Tuesday, December 10, 2013

ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం - గోగు శ్యామల

ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం

- గోగు శ్యామల
ముందుమాట : డా|| కేశవరెడ్డి

సూర్యగ్రహణాన్ని వర్ణించనీ,
చావడి దగ్గర చేరిన గ్రామస్తులను గురించి చెప్పనీ,
బర్రెమీద సవారీ చేసే పల్లెటూరి పిల్లను గురించి చెప్పనీ,
దళితులు కొట్టే డప్పు చప్పుడులోని వివిధ దరువులు పరిచయం చేయనీ...
గోగు శ్యామల కథనంలో వుండే మంత్ర శక్తి ఒకే స్థాయిలో వుంటుంది.

దానికి పరిమితులు లేవు. ఆమె మనకు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని చూపిస్తూనే విశాల విశ్వంలోకి నడిపిస్తుంది. ఒక్కసారిగా బాల్యంలోకి పరుగు తీసి అవధులూ ఆకాంక్షలూ ఎరుగని అమాయకపు కళ్లతో దళిత జీవితాన్ని మన ముందుకు తెస్తుంది. దళితుల రోజువారీ జీవితాన్ని వివరంగా కళాత్మకంగా ఎంతో చాతుర్యంతో కళ్లకు కట్టిస్తుంది.

ఈ కథలకి నేపథ్యం ఒక తెలంగాణా గ్రామంలోని మాదిగ వాడ.
అక్కడి వివిధ సందర్భాలనూ, సనినివేశాలనూ, జనం అనుభవాలనూ చిత్రిస్తూ వాటిని అవగాహన చేసుకునే ఒక కొత్త చూపును పాఠకులకు ప్రసాదిస్తుంది.

పూర్వపు రచనలలో అటువంటి ప్రదేవాలను, ప్రజలను వర్ణించడానికి ఉపయోగించిన భాష గురించి, వాటి పట్ల ఆ చరనలలో కనబడిన భావుకత, పరిపాలనా దృక్పథం, గాంధీత్వ దృష్టి గురించి చెపుతున్నప్పుడు ఆమె చమత్కారం చాలా నవ్వు తెప్పిస్తుంది. ఈ కల పరిష్కారాలు ఊరి నుంచి, మాదిగవాడ నుంచి, ఆటువంటి ఇతర సమూహాల నుంచి మనుషుల్ని బయటికి పంపించడంలో లేదు. అక్కడి జన జీవితాన్నే భవిష్యత్‌ ఆశగా చూపించే కథలు ఆమెవి.

తన పదునైన రాజకీయ భావాలను గాఢమైన కథన సౌందర్యంతో మేళవించి, దళిత రచనంటే కేవలం పీడన గురించి వ్రాయడమేననే మూసాభిప్రాయాన్ని బద్దలు కొట్టింది గోగు శ్యామల.
.........................................................................................................



 స్పందన

The crowds were amazed at his
teaching, because he taught as
one who had authority and not
as their teachers of  the law.               Matthew 7:28 (Bible)


''మీ పుస్తకానికి ముందు మాటలు రాయలేను. " ఐ యాం ఎ పూర్ జడ్జ్ " అని ''నేనన్నప్పుడు
గోగు శ్యామలగారు, జడ్జ్  చేయవద్దు. కథలు చదివి మీ స్పందన రాస్తే చాలు'' అన్నారు. ఆ
వెసలుబాటు లభించాక ఇక కూర్చుని ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.

    దళిత అస్తిత్వాన్ని పలు కోణాలలో విశ్లేషించే కథలు పన్నెండు ఇందులో ఉన్నాయి. ఈ
సంకీర్ణ సమాజంలో ఏ మనిషికి గాని ఒకే అస్తిత్వం ఉండదు. ఒకటి కన్నా ఎక్కువ అస్తిత్వాలే
ఉంటాయి. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎంత మంది జనం ఉన్నారో దానికి నూరు రెట్లు అధిక సంఖ్యలో
అస్తిత్వాలున్నాయి. ఈ అస్తిత్వాలలో వెయ్యోవంతునైనా ప్రపంచ సాహిత్యం యావత్తూ కలిసి గూడా
ఇంతవరకు విశ్లేషించలేదు, విశ్లేషించ జాలదు. అందుకే  అంటారు  రాసే నేర్పు, కౌశలం ఉండాలే గాని
ఇతివృత్తాలకు ఏ కాలంలోను, ఏ దేశంలోను కొరతలేదని.

    మనిషికున్న ఎన్నో ఎన్నో అస్తిత్వాలలో ప్రధానమైనవి రెండు: ఆర్థిక అస్తిత్వం,
సాంస్కృతిక అస్తిత్వం. వీటిలో ఏది పునాది, ఏది ఉపరితలం అన్న దానిని గురించి కొందరికి ఇంకా
స్పష్టత లేదు. అయితే అవి రెండు ఒక దానినొకటి అనివార్యంగా ప్రభావితం చేసుకుంటాయన్నది
కాదనలేని సత్యం. సమాజం చలనశీలమని, మానవ సంబంధాలు చరిత్ర పొడవునా ఒకే రీతిగా
ఉండవని తెలిసిన వారికి ఈ సత్యాన్ని గుర్తించడం కష్టమేమీ కాదు. ఆర్థిక అస్తిత్వం మనుషులందరికీ
ఉమ్మడి అస్తిత్వమై ఉండగా, సాంస్కృతికం ఆయా వర్గాలకు మాత్రం ప్రత్యేకమైన అస్తిత్వంగా ఉంటుంది. రెండు అస్తిత్వాలు కలగలసిపోయి ఉంటాయి. గనక, పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి గనక గిరిగీసుకుని సాంస్కృతిక
అస్తిత్వాన్ని గురించి మాత్రమే రచన చేయటానికి వీలుపడదు. అలాగే ఆర్థిక అస్తిత్వాన్ని గురించి
మాత్రమే రాయడానికీ వీలుపడదు. ఇక్కడే మనకు ఏది దళిత సాహిత్యం? అనే ప్రశ్నకు సమాధానం
దొరకవచ్చు. రచయిత దళితుడైనంత మాత్రాన అది దళిత సాహిత్యమైపోదు. అలాగే దళితులను
గురించి రాసిందంతా దళిత సాహిత్యం కాజాలదు. దళితులకు ప్రత్యేకమైన సాంస్కృతిక అస్తిత్వం పైనా
ప్రధానంగా కేంద్రీకరించి దానిని పరిశీలించి, విశ్లేషించిన రచనను దళిత సాహిత్యమని నిర్వచించవచ్చు.

అంటే రచయితకు బలమైన సాంస్కృతిక మూలాలు, స్వానుభవం
ఉండితీరాలి. ఐతే అవి రెండు ఉన్నంత మాత్రాన ఆ రచన సాధికారతను, పరిపూర్ణతను సాధించజాలదు.
ఎందుకంటే సాహిత్యం మరీ అంత యాంత్రికమైన ప్రక్రియ కాదు గనక. సాంస్కృతిక మూలాలు,
స్వానుభవము పుష్కలంగా ఉన్న ఒక దర్శకుడు, స్క్రిఫ్టు రైటరు కలిసి తీసిన సినిమాలో బ్రాహ్మణ
పూజారికి జందెం పెట్టడం మరచిపోయిన ఉదంతం మనం విన్నాంగదా. ఇక్కడే ఇందుకు భిన్నమైన ఇంకొక ఉదాహరణ గూడా చెప్పుకోవాలి.

సాంస్కృతిక మూలాలు, స్వానుభవము ఏమాత్రం లేని ఒక పరమ నాస్తికుడైన నటుడు 'శ్రీ చైతన్య
ప్రభు' నాటకంలో ప్రధాన పాత్ర పోషించి రక్తి కట్టించాడట. రామకృష్ణ పరమ హంస ఆ నాటకం చూడడం
తటస్తించి చైతన్య ప్రభుని భక్తిరసానికి ముగ్ధుడైపోయి, నాటకం అయిపోయాక గ్రీన్‌ రూంలోకి వెళ్ళి
నటుడ్ని అభినందించి, ''నీలో కృష్ణపరమాత్మను దర్శించుకొన్నానయ్యా. దేవుని కృపాకటాక్షాలు నీకు
నిండుగా ఉన్నాయి'' అన్నాడట. అందుకా నటుడు, ''అయ్యా, నువ్వంటున్నదేమిటో నాకర్థం
కావటంలేదు. దేవుని కృపా కటాక్షాలను గురించి నాకేమీ తెలియదు. నేను నాస్తికుడిని, నేను కేవలం
నటించానంతే'' అన్నాడట. ఇక్కడ భక్తిరసాన్ని పండించింది నటుని నటనా కౌశలమే గాని సాంస్కృతిక
మూలాలు, స్వానుభవమూ కాదు. అందుకే గదా అంటారు: కళకు అసాధ్యం ఏదీలేదని. ఇక
రచయితకు సాంస్కృతిక మూలాలు, స్వానుభవాలతోబాటు రచనా కౌశలం గూడా ఉన్నప్పుడు ఆ
రచనకు మరింత సాధికారత, మరింత పరిపూర్ణత లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

    ఈ అంశాలన్నీ నిండార్లుగా ఉండడం వల్లనే గోగు శ్యామలగారి కథలు సాధికార దళిత
సాహిత్యంగా రూపుదిద్దుకున్నాయి. ఎంత బలమైన మూలాలు లేకపోతే రచయిత్రి బైండ్లామె చేత,
''దొరా, మీరు నాకు కూలి పైసలియ్యకుండ్రి. నేనే కూలి పైసలిస్త. మీ బిడ్డను గోజుకిడ్వుండ్రి. పండగల
రంగమెక్కమనుండ్రి. నేనే నీ బిడ్డకు కూలిస్త!'' అనిపించ గలదు! ఆ సమయంలో బైండ్లామె
ధర్మాగ్రహాన్ని, రౌద్రాన్ని వర్ణించడానికి రచయిత్రి ఇరవై ఏడు వాక్యాలు రాశారు. అవి ఒక్కొక్కటి వొళ్ళు
గగుర్పొడిచే వాక్యాలు. (బైండ్లామె భూమడగదా మరి).

    స్వానుభవం నుండి పుట్టిందే 'బడెయ్య' కథలోని బొక్కబండి ఉదంతం. మనం మట్టి
బండిని చూశాం. కొయ్య బండిని చూశాం. బంగారు బండిని గురించి విన్నాం. చచ్చిపోయిన దూడ
పుర్రెతో బండి తయారు చేయొచ్చునని నాకిప్పుడే తెలిసింది. ఆ బండిని తయారుచేసే విధానం రచయిత్రి
వివరిస్తుంటే వినడం ఒక అనుభవం. బడెయ్య ఆ బండితో ఆడుకోవడమే గాక దాంతో పొలానికి ఎరువు
తోలడం గూడా చేస్తాడు. అంత చిన్న వయసులోనే వాడికి అది ఆటవస్తువేగాక ఒక పనిముట్టు అని
గూడా తోచడం గమనార్హం. పని, పాట - ఇవి రెండూ వేర్వేరు కాదనే సాంస్కృతిక నేపథ్యం రచయిత్రికి
ఉండడంవల్లనే ఇది సాధ్యమయింది. ఇక 'జాడ' కథను చదవడమంటే ఒక పండగ సంబరంలో
పాలుపంచుకోవడమే.  మోర్స్‌ కోడ్‌తో నడిచే టెలిగ్రాఫ్‌ వ్యవస్థకు మనదేశం ఇటీవలే చరణగీతం
పలికింది. మోర్స్‌కోడ్‌కు దీటుగా డప్పుమీద రచయిత్రి వినిపించిన తొమ్మిది రకాల సంకేతాలను
వింటుంటే ఎంత సంబరం! ఆ కథ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చిర్ర, చిటికెన పుల్లలు డప్పుమీద వేసిన
తొమ్మిది రకాల దరువులు నా చెవుల్లో హోరెత్తుతాయి.

    మిగిలిన కథలు కలగచేసిన స్పందనలను గూడ ఏకరవు పెట్టగలను. కాని మీ
పఠనోత్సాహానికి భంగం కలిగించకూడదు కదా.

    మనిషికి ఉన్న ఎన్నెన్నో అస్తిత్వాలను విశ్లేషిస్తూ తెలుగులోను, ఇతర భాషలలోను
విస్తారమైన సాహిత్యం వస్తూ ఉంది. ఐతే ఎaఱఅర్‌తీవaఎ  సాహిత్యం అనబడే దిమ్మిసా  కొట్టిన రస్తాల
వెంబడి నడిచి నడిచి పాఠకలోకం విసుగెత్తిపోయింది. సమాజంలోని సందు గొందుల వెంబడి తిప్పగలిగే
రచయితల కోసం పాఠకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారి ఆర్తిని తీర్చడానికి ఈ కథలు
ఎంతో దోహదపడతాయి. గోగు శ్యామల గారు ఈ కృషిని ఇంకింతగా, మరింతగా సాగిస్తారని
ఆశిస్తున్నాను.

18-7-2013

నిజామాబాద్‌    ......................................................................................డా|| కేశవరెడ్డి


 ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం

- గోగు శ్యామల


ధర : రూ. 80/-
పేజీలు  : 101
మొదటి ముద్రణ : డిసెంబర్ 2013 


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849
Mail: hyderabadbooktrust@gmail.com


.................................................................

రచయిత గురించి...


తెలుగు దళిత సాహిత్య ప్రపంచంలో గోగు శ్యామల గొంతు ప్రత్యేకమైనది.
పది సంవత్సరాల క్రితం కథలు రాయటం మొదలుపెట్టిన శ్యామల తన రచనల్లో దళిత సమాజంలో బాల్యం, దళిత స్త్రీలు భూమి కోసం పడే తపన, దళిత కుటుంబాలలో, సమూహాలలోని ప్రజాస్వామిక తత్త్వం, దళిత సబ్బండ కుల సంబంధాలు, మాదిగ అస్తిత్వం, మాదిగ ఉపకులాల అస్తిత్వాలను కొత్త దృక్పథంలో చూపిస్తూ వచ్చారు.

ఆమె రచనల్లో దళితులు పీడిత అస్తిత్వంతోకాక, తమ జీవితం, ఇప్పటి ప్రపంచం, దానిలో రావలసిన మార్పుల గురించి తదేకంగా ఆలోచించే తాత్త్విక దృక్పథం కలవారిగా కనిపిస్తారు.

అనేక సాహితీ పురస్కారాలు అందుకున్న శ్యామల మొదటి పుస్తకం 'నల్లపొద్దు.' తరువాత, 'నల్లరేగడి సాల్లు', 'ఎల్లమ్మలు' పుస్తకాలు ఆమె సంపాదకత్వంలో వెలువడ్డాయి. 2011లో శ్యామల రాసిన ''నేనే బలాన్ని'' సదాలక్ష్మి బతుకు కథ ప్రచురించబడింది.

'ఎడ్యుసెండ్‌' అనే దళతుల విద్యపై పనిచేసే సంస్థని స్థాపించి, 'అందరికీ విద్య' అనే మాస పత్రికను కూడా నడుపుతున్నారు.

అనేక సంస్థలలోనూ, సాహితీ వేదికలలోనూ క్రియాశీలకంగా పాల్గొంటారు.
ప్రస్తుతం అన్వేషిలో సీనియర్‌ ఫెలోగా పనిచేస్తున్నారు, ఐఎఫ్‌ఎల్‌యులో పిహెచ్‌డి చేస్తున్నారు.








హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌