Tuesday, October 31, 2017

ఒక తల్లి తెలుగు అనువాదం : సూరంపూడి సీతారాం

Add caption

చిన్న కొడుకు, ఇరవై యేళ్ళవాడు, అలా యెందుకు మారిపోయాడు? ఇంటి పట్టున ఉండడు, యెక్కడికి వెడుతున్నాడో స్నేహిం చేస్తున్నాడో తెలియదు. తల్లికి గాని తండ్రికి గాని తెలియదు. డబ్బుకి లోటులేదు. పుష్కలంగా ఉంది. కాలేజి చదువు పూర్తికాగానే అమెరికా పంపి పై చదువులు చదివించాలనుకున్నారు. కాని ఈ చిన్న కొడుకు అందిరికీ దూరమైపోయాడు. ఇంటిలో యెవరితోనూ మనసిచ్చి మాటాడడు. భోగభాగ్యాలంటే నిరసన. తల్లికి అర్థంకాదు. చిన్న కొడుకు మారిపోయాడు. చివరికి ఇరవయ్యోయేట దారుణంగా చంపబడ్డాడు. వాడు పుట్టిన రోజూ, చచ్చిపోయిన రోజూ ఒకటే, జనవరి 17 తల్లికి మాత్రమే ఇదిజ్ఞాపకం, వాడు చచ్చిపోయి ఏడాది తిరిగి వచ్చింది. ఆ రోజున తల్లి అన్వేషణకు బయలుదేరింది. తన చిన్న కొడుకు ఎందుకలా అయిపోయినాడని. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి బోధపడింది. బోధపడేసరికి తట్టుకోలేక పోయింది. ఆమె ఆవేదన కూడా అదే రోజున అంతమయింది. ఇది ఆ ఒక్క తల్లి కథకాదు. ఈనాడు సమాజంలో కొత్తతరం. యువజనం, స్వాతంత్య్రానంతరం పుట్టిన తరం, ఇలా యెందుఉక మారిపోతున్నారో తెలియక దు:ఖానికి గురవుతున్న అనేక మంది తల్లుల కథ - అందరి తల్లుల కథ కూడా
మహాశ్వేతాదేవి బెంగాలీలో రచించిన యీ నవల విశేష ప్రచారం ప్రశంసలూ పొందిన తరువాత, నాటకంగా కూడా విశేష ప్రచారం సాధించింది. ఈమధ్యనే ప్రఖ్యాత దర్శకుడు గోవింద నిహలానీ దర్శకత్వంలో ''హజార్‌ చౌరాసియాకి మా'' అనే పేరుతో సినిమాగా కూడా నిర్మించబడింది. గ్రామీణుల దుర్భర జీవితాన్ని యథాతథంగా చిత్రించిన మరో నవల ''రాకాసి కోర, అలాగే ''ఎవరిదీ అడివి'', ''దయ్యాలున్నాయి జాగ్రత్త'' యింతకు పూర్వం ప్రచురించాం.

ఈ రచయిత్రి ప్రతిష్ఠాత్మక మెగసేసే, జ్ఞానపీఠ్‌ అవార్డులు కూడా పొందారు.

ఒక తల్లి 
తెలుగు అనువాదం : సూరంపూడి సీతారాం 
141 పేజీలు  ; వెల: రూ. 150

Tuesday, October 17, 2017

మనకు తెలియని యం.ఎస్ - దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు - టి. జే. ఎస్. జార్జ్ తెలుగు అనువాదం : ఓల్గా

యమ్‌.యస్‌. సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశం లోని కోట్లాది యిళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట యిళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమోగని రోజు వుండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణేకాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులను సమ్ముగ్ధం గావించిన ప్రతిభ ఆమెది. 1916లో మదురైలో ఒక సామాన్య దేవదాసి కుటుంబంలో షణ్ముగవడివు అనే వైణికురాలికి జన్మించిన యమ్‌.యస్‌. సుబ్బులక్ష్మి ''భారతరత్న'' పురస్కారానికి చేరుకున్న క్రమం, ఆమె జీవిత గమనం కేవలం ఆసక్తికరంగా వుండటమే కాదు. ఆధునిక భారతదేశంలో కులం, జండర్‌ యెలాంటి పరిణామాలను పొందాయో, యెన్ని సంక్లిష్ట, భిన్న సందర్భాలను యెదుర్కొన్నాయో, ఆ వివక్షలను యెదుర్కునేందుకు స్త్రీలు యెలాంటి సాహసాలు, పోరాటాలు, ప్రయోగాలు చేశారో, యెలా రాజీపడ్డారో తెలియజేప్పే ఒక చారిత్రక సామాజిక శాస్త్ర పాఠం. అగ్రవర్ణ పురుషుల ఆక్రమణలో శతాబ్దాలుగా చిక్కుబడిన కర్ణాటక సంగీతం ఆలపించిన స్వేచ్ఛా గీతం యమ్‌. యస్‌. సుబ్బులక్ష్మి.

ఈ పుస్తకంలో టి.జె.యస్‌ జార్జ్‌ కేవలం ఆమె జీవిత కథను మాత్రమే చెప్పలేదు. కర్ణాటక సంగీత భౌగోళిక సామాజిక, రాజకీయ స్వరూప స్వభావాల సారాంశంలో యమ్మెస్‌ యెక్కడ నిలబడి ప్రకాశిస్తున్నదో , ఆ స్థానమూ ఆ ప్రకాశమూ యెలా సాధ్యమయ్యాయో విశ్లేషించి, వివరించి, పోల్చి చెప్పాడు. కర్ణాటక సంగీతపు లోతుపాతులను కూడా. ఈ పుస్తకం తెలియజెబుతుంది.
మనకు తెలియని యం.ఎస్ - 
దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు 
- టి. జే. ఎస్. జార్జ్ 
తెలుగు అనువాదం : ఓల్గా 
పేజీలు; 240, వేల ,150/-


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌