Sunday, December 31, 2017

"కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు"


"కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు"
పుస్తకం లోని కొన్ని వ్యాసాలను అంతర్జాల పాటకుల కోసం యునీకోడ్ ఫాంట్ లో  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగు లో పొందుపరిచడం జరిగింది.
ఈ పుస్తకం లోని మొత్తం వ్యాసాల వివరాలు ఇలా ఉన్నాయి :

ఆంగ్లంలో తొలి రచనలు :
1. సత్య సాయిబాబా : స్వర్గం వేచి ఉంటుందిలే!
2. ఆపరేషన్‌ శివరాసన్‌ : ముగిసిన వేట?
3. కూర్గ్‌ : ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష
4. సీరియల్‌ కిల్లర్‌ నాగరాజ
5. రాజీవ్‌ రేపిన కలకలం
6. మొఘల్‌ రాజవంశానికి కుంచె నద్దిన పాదుషానామా

ఇంటర్వ్యూ
1. 'మహిళ కావటమే ప్రస్తుతం నాకున్న భద్రత'

కన్నడ వ్యాసాలు:
1. నూర్‌ గుండెచప్పుడు అందరినీ మేల్కొలిపింది
2. బాబాబుడన్‌గిరిలో నేను చూసింది
3. జైలులో సంబరాలు
4. విభేదాల్ని అధిగమించిన మాతృత్వం
5. అజ్జంపురలో కాళింగరాయడిని చూసినప్పుడు...
6. ఏ.పి.షా : ప్రజల న్యాయమూర్తి
7. నా చెల్లెలు రేవతి ఆత్మకథ
8. సవణూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం
9. దయామయి దయామణి బర్ల
10.  అన్ని ఛాందసవాదాల్నీ ఖండించవలసిందే
11.  నా మీద మళ్ళీ దయతలచిన నా భాష
12. తుగ్లక్‌ మోదీ
13.  2005-2015 : పదేళ్ళ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ...

ప్రేమాస్పదులు :
1.  నాన్న
2.  అమ్మ
3.   చెన్ని
4.   బి.వి కారంత్‌
5.   బాబా ఆమ్టే అనే నైతిక శక్తి
6.   అమాయక 'ముత్తురాజ్‌'కి వీడుకోలు
7.   యు.ఆర్‌. అనంతమూర్తి

కాలమిస్ట్‌గా
1.   మృత్యువులో వెలిగిన ఒక వేకువ నక్షత్రం
2.   ఇంతకీ అది ఎవరి డబ్బు?
3.   భాషా మూలాలు - ఇంగ్లీష్‌ మేఘాలు
4.   వధువు కోసం అన్వేషణ
5.   చంపవలెనా... చంపవలదా !
6.   'నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి'
7.    అంతరాత్మ వెలుగులా! సంక్షోభ తయారీదారులా!
8.   'మేము ఏకలవ్యుని వారసులం'
9.    వివేకవంతమైన గొంతులు వినబడవా...!
10.   ఎక్కడైనా చిరుతపులి తన మచ్చల్ని పోగొట్టుకుంటుందా?
11.   మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఓ మంత్రి పోరాటం
12.   కుల రాజకీయాలు - ఒక ఆత్మహత్య
13.   'దేశభక్తి కన్నా ఉన్నతమైంది మానవత్వం'
14.   'సొంత దేశం'లోనే దేవుడు చచ్చిపోతున్నాడు
15.   వృద్ధులకు వారు చూపిస్తున్నది ఒయాసిస్‌ కాదు... ఎండమావి
16.   అసమ్మతి రాజద్రోహం కాదని తెలుసుకోండి
17.   మతం, రాజకీయాలు : ఒక నగ్న సత్యం
18.   పత్రికా స్వేచ్ఛ వర్సెస్‌ కర్ణాటక శాసనసభ


నివాళి వ్యాసాలు:
1. నా కూతురు    - ఇందిర లంకేశ్‌
2. ఒక అడవి పువ్వు  - రహమత్‌ తరికెరె
3. అక్క క్రమ పరివర్తనం - కె. ఫణిరాజ్‌
4. నేను మంగుళూరు వెళ్లలేకపోయాను- రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌
5. నవ్వుల గౌరమ్మ - మమతా సాగర్‌
6. మరణానికి ముందటి జీవితం  - ఉమర్‌ ఖాలిద్‌
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

గౌరి లంకేశ్‌ జీవన రేఖలు
జననం :
           29 జనవరి 1962, షిమోగా (శివమొగ్గ)

చదువు :
        ద హోమ్‌ స్కూల్‌, బెంగుళూరు (1967-74)
విజయ హైస్కూల్‌, బెంగుళూరు (1974-77)
పి.యు.సి - నేషనల్‌ కాలేజి, బెంగుళూరు (1977-79)
బి.ఎ - సెంట్రల్‌ కాలేజి, బెంగుళూరు ( 1979-82)
పి.జి. డిప్లొమా (మాస్‌ కమ్యూనికేషన్స్‌)- ఐ.ఐ.ఎం.సి, ఢిల్లీ (1983-84)

జర్నలిజం:
        ద టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, బెంగుళూరు, ఢిల్లీ (1985-90)
'సండే' వారపత్రిక (1990-93; 1994-98)
చీఫ్‌ ఆఫ్‌ బ్యూరో : ఈటీవీ న్యూస్‌, ఢిల్లీ (1998-2000)
ఎడిటర్‌ : లంకేశ్‌ పత్రికె (2000-2005)
ఎడిటర్‌ : గౌరి లంకేశ్‌ పత్రికె (2005-2017 సెప్టెంబర్‌)

అచ్చయిన పుస్తకాలు :

1.గిడుగగళిగె బలియాద గిళి బెనజీర్‌: (ద స్టోరీ ఆఫ్‌ బెనజీర్‌ భుట్టో - బెనజీర్‌: డేగల మధ్య రామచిలుక), లంకేశ్‌ ప్రకాశన, 2008
2.కండ హాగె (నా దృష్టిలో) : సమకాలీన వ్యాసాలు 1, 2, 3, సంపుటాలు, లంకేశ్‌ ప్రకాశన, 2009, 2011, 2013

అనువాదాలు :

1. దరవేశి కతెగళు (ఇద్రీస్‌ షా రాసిన 'టేల్స్‌ ఆఫ్‌ ద డర్వేషెస్‌'కు అనువాదం), సి.జి.కె. ప్రకాశన, 2000
2. 'కప్పు మల్లిగె' (నల్ల మల్లెలు : ఆధునిక కథల సంకలనం), లంకేశ్‌ ప్రకాశన, 2010
3. 'జుగారి క్రాస్‌', కె.పి. పూర్ణచంద్ర తేజస్వి (కన్నడం నుండి ఇంగ్లీషులోకి అనువాదం), 2004, అముద్రితం

సంపాదకత్వం వహించినది : 

1. 'ఆవరణ ఎంబ వి-కృతి', లంకేశ్‌ ప్రకాశన, 2007
2. బసవరాజమార్గ : వ్యక్తి-విచార (ఎల్‌. బసవరాజు జీవితం రచనలు), లంకేశ్‌ ప్రకాశన, 2010

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

2017 సెప్టెంబర్ 5 న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గౌరి లంకేశ్ ను బెంగళూర్ లో ఆమె ఇంటి ముందే కాల్చి చంపారు. వారు భౌతికంగా నిర్మూలించినా తన రచనల ద్వారా ఇవాళ గౌరి లంకేశ్  కర్ణాటక సరిహద్దులను దాటి  దేశ వ్యాప్తంగా మరెందరి మనసుల్లోనో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఆమె రచనలు అనేక భాషల్లోకి అనువాదమై ఎందరెందరికో స్ఫూర్తినిస్తున్నాయి.
గౌరి లంకేశ్ అమరురాలైన కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 2017 నవంబర్ 28 న  ఈ పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చింది . నెల రోజుల వ్యవధి లోనే  దాదాపు పుస్తక ప్రతులన్నీఅయిపోయి ద్వితీయ ముద్రణకు వెళ్తుండడం విశేషం.
చదవండి ...చదివించండి ... గౌరి లంకేశ్ అమర్ రహే అని నినదించండి....!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com


Saturday, December 30, 2017

పత్రికా స్వేచ్ఛ వర్సెస్‌ కర్ణాటక శాసనసభ- Gauri Lankesh




పత్రికా స్వేచ్ఛ వర్సెస్‌ కర్ణాటక శాసనసభ
( " కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకం నుంచి )

కర్ణాటకలో శాసనసభ్యులు, జర్నలిస్టుల మధ్య వివాదాలకు సుదీర్ఘ చరిత్రే వుంది.  
అత్యంత విలువైన తమ 'పార్లమెంటరీ హక్కుల్ని' జర్నలిస్టులు ఉల్లంఘిస్తున్నారని శాసనసభ్యులు తరచూ ఆరోపిస్తుంటారు. 
తాజాగా వాళ్ళు రవి బెలెగరె, అనిల్‌ రాజు అనే ఇద్దరు స్థానిక చిన్నపత్రికల సంపాదకుల మీద విరుచుకుపడ్డారు. 
సభాహక్కుల కమిటీ చైర్మన్‌ కూడా అయిన శాసనసభా స్పీకర్‌ కె.బి. కోలివాడ్‌ వాళ్ళిద్దరికీ పది వేల రూపాయల జరిమానాతోపాటు ఒక ఏడాది జైలు శిక్ష కూడా విధించారు. 

కాంగ్రెస్‌ శాసన సభ్యులు బి.యం. నాగరాజ్‌, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యస్‌.ఆర్‌. విశ్వనాథ్‌లతో పాటు సాక్షాత్తూ శాసన సభాపతి అయిన కోలివాడ్‌ పరువుప్రతిష్టలకు సహితం  నష్టం కలిగించేలా వార్తలు రాశారనేది వాళ్ళిద్దరి మీద ఉన్న అభియోగం. తమ 'పవిత్ర' హక్కులకు భంగం కలిగిందని వారి వాదన.


ఆ ఇద్దరు సంపాదకులు తమ పత్రికల్లో ఏం రాశారు అన్నది ఇక్కడ అంత ముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే, న్యాయకోవిదుల అభిప్రాయం ప్రకారం, వారు ప్రచురించిన అంశాలు పరువునష్టం కేసు కిందికి వస్తాయేగానీ, సభా హక్కుల ఉల్లంఘన కిందికి రావు. ఇక్కడ అసలు విషయం ఏమంటే వలస పాలకుల వారసత్వంగా మన ప్రజా ప్రతినిధులకు సంక్రమించిన 'సభా హక్కులు' ఇవి. శాసనకర్తల్ని న్యాయమూర్తులుగా మార్చి జర్నలిస్టులకు జైలు శిక్షలు విధించే అధికారం ఇస్తున్న ఇలాంటి కాలం చెల్లిన చట్టం ప్రజాస్వామిక వ్యవస్థలో వుండడానికి ఏ మాత్రం వీల్లేదు.

1980 వరకు కర్ణాటకలో పాత్రికేయం చాలా ప్రశాంతంగా, నిస్తేజంగా వుండేది. పాలకపక్షం మీద ఎప్పుడయినా ఒక విమర్శ చేయాల్సి వచ్చినా అది చాలా 'మర్యాద పూర్వకమైన' సంప్రదాయ భాషలో మాత్రమే ఉండేది. 'లంకేశ్‌ పత్రికె' వచ్చాకే ఈ పరిస్థితి మారింది. అనవసరపు మర్యాదలు వదిలేసి అది 'గుర్రాన్ని గుర్రం', 'గాడిదను గాడిద' అంటూ సూటిగా రాయడం మొదలెట్టింది. దాని సంపాదకుడు పి.లంకేశ్‌ ముఖ్యమంత్రి ఆర్‌. గుండూరావును 'గుమ్‌' అనీ, సీనియర్‌ మంత్రి యస్‌. బంగారప్పను 'బమ్‌' అనీ రాసే వార్తా కథనాలు పాఠకుల్ని గొప్పగా అలరించేవి.

ఆ కాలంలోనే - అంటే 1980లలో - కర్ణాటక అంతటా రైతాంగం అసంతప్తితో రగిలిపోతూ వుంది. దళితోద్యమం క్రమంగా వేళ్ళూనుకుంటోంది.  ప్రభుత్వ పాఠశాలల్లో కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలనే నినాదంతో మొదలయిన గోకక్‌ ఉద్యమానికి మద్దతు పెరుగుతూ వుంది. సుదీర్ఘ కాలంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ మీద ప్రజల్లో అసంతప్తి చాప కింది నీరులా వ్యాపిస్తూ వుంది. వీటన్నిటికీ 'లంకేశ్‌ పత్రికె' ఒక గొంతునిచ్చింది. 'పత్రికె' చేసే పదునైన విమర్శలు గుండూరావుకు మహా కోపాన్ని తెప్పించేవి. ఈ వ్యవహారం ఎందాకా వెళ్ళిందంటే, 1981లో ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ''జర్నలిస్టులందర్నీ కట్టకట్టి అరేబియా సముద్రంలో పడేయాలి'' అన్నారు.

గుండూరావు వారసునిగా వచ్చిన రామకష్ణ హెగ్డే ఒట్టి మాటలతో ఆగకుండా శాసనసభ్యుల హక్కుల పరిరక్షణ పేరిట ఏకంగా పత్రికా స్వేచ్ఛ గొంతు నులిమేందుకు  ప్రయత్నించారు. ప్రధాన స్రవంతి మీడియా ఆయన్ని 'సిసలైన మిస్టర్‌ క్లీన్‌', 'కాబోయే ప్రధాని' అంటూ పొగడ్తలతో ముంచెత్తుతుండగా. ఆయన గుట్టును రట్టు చేసింది 'పత్రికె'నే.  రెవజీతు హౌసింగ్‌ 
(1988), ఎన్‌.ఆర్‌.ఐ హౌసింగ్‌ అసోసియేషన్‌ (1989), సారా బాట్లింగ్‌ కాంట్రాక్టు (1984) మొదలైన కుంభకోణాలన్నిటినీ నిర్భయంగా బయటపెట్టింది 'లంకేశ్‌ పత్రికె'.

 పత్రికా స్వేచ్ఛను క్రోడీకరిస్తున్నామనే ముసుగులో హెగ్డే కర్ణాటక లెజిస్లేచర్‌ (అధికారాలు, హక్కులు, మినహాయింపులు) బిల్లు,1988 ను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 

అందులో పాత్రికేయులకు అత్యంత కఠిన శిక్షలు వేయాలని ప్రతిపాదించడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈలోగా ప్రభుత్వం టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తడంతో హెగ్డే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన తరువాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఎస్‌.ఆర్‌ బొమ్మై ఆ బిల్లును నిశ్శబ్దంగా సమాధి చేయడంతో పత్రికా రంగం ఊపిరి పీల్చుకుంది.

జనతా పార్టీకే చెందిన మరో ముఖ్యమంత్రి జె. హెచ్‌ పటేల్‌ కూడా ఒక సందర్భంలో 'సభాహక్కుల' కొరడాను ఝుళిపించడానికి ప్రయత్నించారు. మహిళా శాసనసభ్యులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం లేదని 1997లో 'పత్రికె' ఒక కవర్‌ పేజీ కథనం ప్రచురించింది. (నిజంగా కూడా అదేమంత మంచి కథనం కాదు.) దానిపై అన్ని పార్టీలకు చెందిన మహిళా శాసనసభ్యులు శాసనసభలో కన్నీళ్ళు కారుస్తూ లంకేశ్‌ను సంజాయిషీ అడగాలని డిమాండ్‌ చేశారు. అప్పటికే 'పత్రికె' విమర్శల సెగను స్వయంగా చవిచూసిన ముఖ్యమంత్రి పటేల్‌, ఇతర మంత్రులు, శాసనసభ్యులు వారు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుకు మద్దతు పలికారు.

సభలో ఆనాడు భిన్నంగా స్పందించిన ఏకైక సభ్యుడు  స్వతంత్ర అభ్యర్ధి అయిన వటల్‌ నాగరాజ్‌. తనకు వ్యతిరేకంగా ఒక కథనాన్ని ప్రచురించినందుకు 1980లో లంకేశ్‌ మీద భౌతికదాడి చేసిన చరిత్ర అతనికి వుంది. అయినా 'పత్రికె' కథనాన్ని పరువునష్టంగా భావించాలే తప్ప శాసనసభ్యుల హక్కుల ఉల్లంఘన కిందికి రాదని ఆయన వాదించాడు. ఈ వ్యవహారం 
శాసనసభలో కొన్ని రోజులు పెద్ద దుమారాన్నే రేపినప్పటికీ అప్పటి స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ఆ వేడి చల్లారే వరకూ దాన్ని పక్కన పెట్టారు. ఆ తరువాత అదే నిశ్శబ్దంగా చనిపోయింది. 

కర్ణాటక శాసన సభ్యుల ఆగ్రహానికీ, దాడులకూ గురైంది లంకేశ్‌, ఆయన ప్రచురణలు మాత్రమే కావు. సుప్రసిధ్ధ పాత్రికేయుడు టి.జె.ఎస్‌. జార్జ్‌ను కూడా నిండు శాసనసభలో తూలనాడారు. అప్పటి నుండి ఇప్పటి వరకు - ఈ వ్యాసకర్తతో సహా -  ప్రముఖ దిన, వార పత్రికల సంపాదకులు అనేకమందికి సభాహక్కుల సంఘం ముందు హాజరవ్వాలని తాఖీదులు వచ్చాయి. శాసనసభ్యుల్ని ఏకవచనంలో సంబోధించడం, సభ బయట వాళ్ల కార్యకలాపాలను విమర్శించడం, వాళ్ల అధికార దుర్వినియోగాన్ని బయటపెట్టడం  వంటివన్నీ పాత్రికేయుల పరిధిలోని అంశాలు కావనే గట్టి అభిప్రాయం సభాసంఘానికి వుండేది అనిపిస్తుంది. 'ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు' కావడాన తాము ఇతరులకన్నా 'మరింత సమానులు' అని వాళ్ళు గట్టిగా నమ్మేవాళ్ళు. ఎక్కువభాగం ఫిర్యాదులు మందలింపులతోనో, (బలవంతపు) క్షమాపణల ప్రచురణతోనో పరిష్కారం అయినప్పటికీ పత్రికలను వేధించాలనే ధోరణి మాత్రం వారిలో పోలేదు.

2012 లో భారతీయ జనతా పార్టీకి చెందిన జగదీశ్‌ షెట్టర్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక సంపాదకుడ్ని శాసనసభకు క్షమాపణలు చెప్పించడంలో ఇద్దరు శాసనసభ్యులు  కతకత్యులయ్యారు.  బెలగావి నుండి ప్రచురితమయ్యే మరాఠీ దినపత్రిక 'తరుణ్‌ భారత్‌' తమ మీద నిరాధార ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురించిందని బిజెపి శాసనసభ్యుడు అభయ్‌ పాటిల్‌, కాంగ్రెస్‌ శాసనసభ్యుడు శ్యామ్‌ ఘటగె ఆరోపించారు. అప్పటి సభాపతి కె.జి. బోపయ్య వాళ్ళ ఫిర్యాదుల్ని సభా హక్కుల సంఘానికి పంపించగా. ఆ కమిటీ 'తరుణ్‌ భారత్‌' సంపాదకుడైన కిరణ్‌ ఠాకూర్‌ను దోషిగా భావించింది. సభకు పిలిపించి, తాత్కాలికంగా నిర్మించిన ఒక బోనులో నిలబెట్టింది. ''ఈ సభా గౌరవాన్ని  కించపరిచే వ్యాఖ్యానాలు, కథనాలు వేటినీ నా ప్రతిక ఇదివరకెన్నడూ ప్రచురించలేదు. జరిగిన దానికి చింతిస్తున్నాను'' అంటూ ఆయన చేత ఒక ప్రకటన చేయించింది. సహచరుడికి పబ్లిక్‌లో అంతటి అవమానం జరిగినప్పటికీ విచిత్రంగా కర్ణాటకలోని అతని మీడియా 
సోదరులు మౌనంగా వుండిపోయారు.   

కన్నడలో 24ఞ7 వార్తా ఛానళ్ళు పెరిగాక పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. అర్నవ్‌ గోస్వామికి స్థానిక క్లోన్‌లు చాలామంది పుట్టుకొచ్చారు. టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్ళు వారి అభిప్రాయానికి ఏ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా పెద్ద గొంతుతో విరుచుకుపడిపోతుంటారు. ఆ స్వీయప్రకటిత జాతీయవాది కంటే మరింత ఎక్కువ దేశభక్తిని 
వొలకబోస్తుంటారు. నిమిషనిమిషానికి వేసే 'బ్రేకింగ్‌ న్యూస్‌' లను అతిశయోక్తులతో నింపేస్తుంటారు.

టీవీ ఛానళ్ల ప్రసారాలను ఖండించడానికి ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్‌, బిజెపి, జనతా దళ్‌ (సెక్యులర్‌)లకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు చేతులు కలిపారు. తమను ''తక్కువచేసి చూపెడుతున్నారు'', ''వాస్తవాలను వక్రీకరిస్తున్నారు'', ''తప్పుడు వార్తల్ని ప్రసారం చేస్తున్నారు'' అనేవి వారి ప్రధాన ఆరోపణలు. ఒకసారి బిజెపి ఎమ్మెల్యే సురేష్‌ గౌడ ఓ టోల్‌ గేట్‌ బూత్‌ లో సిబ్బంది మీద దాడి చేసి సిసిటివి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. వాటి ప్రసారాల గురించి ఆయన శాసనసభలో ఫిర్యాదు చేస్తూ టీవీ ప్రసారాల్లో తనను 'రౌడీ సురేష్‌ గౌడ' అని పేర్కొన్నారని ఆవేదన వెళ్ళగక్కాడు. ''టీవీల వాళ్ళు రౌడీ, గూండా వంటి పదాలను చాలా అలవోకగా వాడేస్తున్నారు. చివరకు ప్రజాప్రతినిధుల్ని కూడా అలా సంభోదిస్తున్నారు'' అని ఆయన నిండు సభలో బాధపడిపోయాడు.

ఆ తర్వాత మీడియా ప్రసారాల నియంత్రణ కోసం నియమ నిబంధనలను రూపొందించడానికి ఒక అఖిలపక్ష సభా సంఘాన్ని కోలివాడ్‌ ప్రకటించారు. దానితో మీడియా సోదరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. విచిత్రం ఏమంటే మీడియాకు మార్గదర్శకాలను రూపొందించాలని సభలో గట్టిగా పట్టుబట్టిన బిజెపి శాసనసభ్యులు సభా సంఘంలో సభ్యులుగా వుండడానికి మాత్రం ఇష్టపడలేదు. పత్రికా స్వేచ్ఛను అణిచివేయడం తమ పార్టీ విధానం కాదంటూ తప్పుకున్నారు. నాలుగు వైపుల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ఈ సభాసంఘం నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది.

రవి బెలెగరె, అనిల్‌ రాజులకు శాసనసభ శిక్షలు విధించడంతో ఈ వివాదం ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చింది. నిజానికి బెలెగరె పాత్రికేయ శైలి అందరికీ నచ్చేలా వుండదనేది అందరికీ తెలిసిన విషయమే. అనిల్‌ రాజు గురించి గానీ, అతని 'యలహంక వాయిస్‌' పత్రిక గురించి గానీ ఎవరికీ పెద్దగా ఏమీ తెలీదనే చెప్పాలి. 

ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమంటే శాసనసభ్యులు న్యాయమూర్తుల స్థానంలో కూర్చొని జర్నలిస్టుల మీద తీర్పులు చెప్పడం ఏ మాత్రం సరైందికాదు. ఒకవేళ వాళ్ళు తమ పరువుకు నష్టం కలిగిందని భావిస్తే ఇతర పౌరులలాగ నేర శిక్షాస్మతి (సిఆర్‌ పిసి)లోని వివిధ సెక్షన్ల కింద న్యాయ పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చు. కాలం చెల్లిన ఒక చట్టాన్ని అడ్డుపెట్టుకుని విమర్శకుల్ని శిక్షించడం కన్నా రాజ్యాంగ పరిధిలో వాళ్లు చేయగల సరైన పని అదే.

 (ద వైర్‌ వెబ్‌ మ్యాగజైన్‌, 16 జూన్‌ 2017)

అనువాదం : ఎ.ఎమ్‌ యజ్దానీ (డానీ)


(గౌరి లంకేశ్‌ హత్యానంతరం 'ద వైర్‌ వెబ్‌ మ్యాగజైన్‌' 5 సెప్టెంబరు 2017న ఈ వ్యాసాన్ని మరోసారి ప్రచురించింది.)

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com


Friday, December 29, 2017

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఓ మంత్రి పోరాటం - Gauri Lankesh




మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఓ మంత్రి పోరాటం    
 
కర్ణాటక రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి సతీష్‌ జర్కిహోళి గత రెండేళ్లుగా అంటే 2013 నుంచి అంబేద్కర్‌ వర్థంతి దినమైన డిసెంబర్‌ 6 ను ఒక అసాధారణమైన రీతిలో గడుపుతున్నారు. ఆ రోజును  మూఢవిశ్వాసాల వ్యతిరేక దినంగా పాటించడం కోసం ఆయన నిన్నంతా - పగలు రాత్రీ కూడా - బెళగావి స్మశానంలో గడిపారు.

ఓట్ల కోసం ప్రజలను సంతప్తి పరిచే ప్రధాన స్రవంతి రాజకీయ నాయకుడే అయినప్పటికీ సమాజాన్ని వెల్లువలా ముంచెత్తుతున్న మూఢవిశ్వాసాలకు ఎదురీదాలని జర్కిహోళి నిర్ణయించుకున్నారు. ఆయన స్థాపించిన మానవ బంధుత్వ వేదికె (నబఎaఅ ఖీతీఱవఅసరష్ట్రఱజూ ఖీశీతీబఎ) ఆధ్వర్యంలో 2014లో సదాశివనగర్‌ స్మశానంలో ఓ పెద్ద కార్యక్రమమే జరిగింది.

వేలాదిమంది సాధారణ ప్రజలూ, వందలాది మంది సామాజిక కార్యకర్తలూ, లింగాయత్‌ మఠాలకు చెందిన పలువురు ప్రవక్తలూ, ఇతర మత శాఖల నాయకులూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పేద, వెనుకబడ్డ ప్రజలను మూఢనమ్మకాలు ఏ రకంగా అంధకారంలోకి నెడుతున్నదీ వారంతా వివరించారు. వాటిని ఎదుర్కోవాల్సిన విధానాలను చర్చించారు. ఓ పక్క శవాల ఖననం, దహనం జరుగుతుండగానే వారంతా అక్కడే కూర్చుని సామూహిక భోజనాలు కూడా చేశారు.

ఆ రోజు సాయంత్రం మిగిలిన వారు వెళ్ళిపోగా జర్కిహోళి, మరో పిడికెడు మందీ ఒక డేరా వేసుకొని ఆ రాత్రి అక్కడే స్మశానంలో ఉండిపోయారు. అటువంటి కార్యక్రమమే ఈ ఏడాదీ జరిగింది.

జర్కిహోళి అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం ఇది మొదటిసారేం కాదు. చంద్ర గ్రహణం పట్టువిడుపుల సమయంలో ఎవరూ ఏదీ తినకూడదనీ, తాగకూడదనీ జ్యోతిష్కులు అంటారు. వారిని నమ్మేవారు గ్రహణ దోషాల నివారణ కోసం ఇంట్లో నిల్వ ఉంచుకున్న నీటినంతా పారబోసి, తాజాగా తెచ్చుకున్న నీళ్ళతో ఇంటినంతా కడుక్కుంటారు.         

ఆ జ్యోతిష్కులూ, వారిని గుడ్డిగా విశ్వసించే వాళ్ళూ చెప్పేది తప్పని రుజువు చేయడం కోసం 2014 లో జర్కిహోళి చంద్ర గ్రహణ సమయంలో టీ, వడపావ్‌ కార్యక్రమం ఒకదాన్ని నిర్వహించారు.

చాలామంది దుర్దినంగా భావించే మహాలయ అమావాస్య నాడు తాను క్షవరం చేయించుకుంటున్న ఫోటోను ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. వాట్సాప్‌ ద్వారా కూడా అందరికీ పంపించారు.

'నిమ్న' కులాలను అణచివేసేందుకు, సుఖమయమైన బ్రతుకుతెరువును పొందేందుకే పురోహిత వర్గం ఈ కులాలనూ, మతాలనూ, మూఢనమ్మకాలనూ సష్టించిందని అజ్ఞేయవాది (aస్త్రఅశీర్‌ఱష) అయిన జర్కిహోళి దఢంగా నమ్ముతారు. ''దేవుడూ, దెయ్యమూ రెండూ లేవు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలని నా ప్రయత్నం. అందుకోసమే ఇటువంటి కార్యక్రమాలను నేను నిర్వహిస్తుంటాను'' అని చెపుతారు ఆయన.

బుద్ధుడ్నీ, బసవన్ననూ, అంబేద్కర్‌నూ అనుసరించే జర్కిహోళికి తాను ప్రజల నమ్మకాలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్న కారణంగా ఏదో ఒకరోజు వారి ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని తెలుసు. ''ప్రజల విశ్వాసాల తేనెతుట్టెలో చేయి పెట్టడం ద్వారా ఒక రాజకీయ నాయకునిగా గండాన్ని కొనితెచ్చుకుంటున్నానని నాకు తెలుసు. ప్రజాబాహుళ్యంలో ఇలాంటి విషయాల్లో చైతన్యాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేసినందుకే కదా బౌద్ధాన్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టారు! సమసమాజం గురించి పోరాడినందుకే కదా మనవాళ్ళు బసవన్నను బలవంతంగా మంత్రి పదవి నుంచి తొలగించారు.
వారిలాగే నేను కూడా పదవి పోయినా పట్టించుకోను. చివరి వరకూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఒంటరిసేన మాదిరి పోరు సలుపుతూనే ఉంటాను'' అని చెపుతారు ఈ ఎమకలమరడి ఎం.ఎల్‌.ఎ.

ఎన్నికలప్పుడు నామినేషన్లు వేయడానికి రాహుకాలం లాంటి వాటిని ఆయన అస్సలు పాటించరు. ఆయన దేవాలయాలను సందర్శించడం గానీ, హోమాలను నిర్వహించడం గానీ చేయనే చేయరు. గత ఏడాది పిల్లల చదువు కోసం ఆయన తన నివాసాన్ని స్వస్థలమైన గోకక్‌ నుంచి బెళగావికి మార్చారు. ''ఈ కొత్త ఇంట్లోకి మారిన తర్వాత మాకో విషయం తెలిసింది. ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి ఖాళీగానే ఉందట. కారణం అడిగితే ఆ ఇంటిని స్మశాన స్థలంలో నిర్మించినందువల్ల ఎవరూ అందులో ఉండడానికి ఇష్టపడలేదని తెలిసింది. పునర్జన్మ లేదా దెయ్యాల మీద నాకు విశ్వాసం లేదు కాబట్టి చనిపోయిన వాళ్ళు నన్ను గానీ, నేను వారిని గానీ బాధ పెట్టకుండా బతికేస్తున్నాం'' అంటూ
ఆయన పరిహాసంగా మాట్లాడతారు.

కొత్త ఇంట్లో చేరే ముందు ఆయన సహజంగానే గహప్రవేశం లేదా మరే క్రతువూ జరపలేదు. జర్కిహోళి కొంతకాలం పాటు 'సమయ' న్యూస్‌ ఛానల్‌ను నడిపారు. అది నష్టాలలో నడుస్తున్నప్పటికీ ఆయన జ్యోతిష, వాస్తుశాస్త్ర పండితులు ఎవర్నీ దగ్గరికి రానివ్వలేదు.

''హేతువాదాన్ని ప్రచారం చేసే లక్ష్యంతోనే ఈ ఛానల్‌ను నేను కొనుగోలు చేశాను.  జ్యోతిషం, వాస్తు శాస్త్రం వంటి అహేతుక విషయాలను ప్రసారం చేయడానికి ఛానల్‌లో స్లాట్‌ ఇస్తే  నెలకు 50 లక్షల

రూపాయలు ఇస్తామని కొంతమంది అడిగారు. కాని నేను ఒప్పుకోలేదు'' అని చెప్పారు జర్కిహోళి. నష్టాలను తగ్గించుకోవడానికి ఆయన ఆ తర్వాత ఆ ఛానల్‌ను విక్రయించారనుకోండి.

రెండు దశాబ్దాలపాటు ఈ విధంగా ఆయన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరు చేస్తూనే వున్నారు. ''నేను వివాహం చేసుకున్నప్పుడు కూడా పెళ్లి తంతు నిర్వహణ కోసం పురోహితులు ఎవర్నీ పిలవలేదు. అయినప్పటికీ నేనూ, నా భార్యా ఆనందంగానే జీవిస్తున్నాం. దైవారాధనలో నేను సమయాన్ని ఎన్నడూ వధా చేయలేదు. బిల్‌ గేట్స్‌ గానీ, నేను గానీ ఎన్నడూ లక్ష్మీ దేవిని పూజించలేదు. అయినా అతడు ఈనాడు బిలియన్లకు అధిపతి. నేను ఆరు వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ గల వ్యాపారస్తుడ్ని. సరస్వతిని పూజించడం కంటే, బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించిన సావిత్రీబాయి ఫూలేను గుర్తు తెచ్చుకోవడం మరింత సముచితంగా ఉంటుంది'' అంటారు జర్కిహోళి.


''బుద్ధుడు, బసవన్న, అంబేద్కర్‌, జ్యోతిబా ఫూలే, పెరియార్‌, నారాయణ్‌ గురు వంటి ఎందరో సాంఘిక విప్లవకారులను భారతదేశం చూసింది. అయినా ఎందుకు ఇంకా చాలామంది పేదరికంలోనూ, అజ్ఞానంలోనూ ఉన్నారు? ఎందుకంటే వారు ఆ సంస్కర్తల బోధనలను మరచిపోయారు. తమను తరతరాలుగా పీడిస్తున్న వారినే విశ్వసిస్తున్నారు. మనం ఈ సాంఘిక సంస్కర్తలు ప్రచారం చేసిన భావనలను అనుసరించినపుడు మాత్రమే మన దేశం పురోగతి సాధిస్తుంది'' అని జర్కిహోళి నొక్కి చెబుతారు.

జర్కిహోళి ఒక రాజకీయ వేత్తే అయినా మూఢ, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఒక వైఖరి తీసుకోవడంలో, వాటికి వ్యతిరేకంగా పోరు చేయడానికి తన చేతి చమురును వదుల్చుకోవడంలో ఆయన ఇతర సాధారణ రాజకీయ నాయకుల మాదిరివాడు కానే కాదు.



(బెంగుళూరు మిర్రర్‌, 7 డిసెంబర్‌ 2015)

అనువాదం : ఎన్‌. శ్రీనివాసరావు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు

ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Thursday, December 28, 2017

'మేము ఏకలవ్యుని వారసులం' - Gauri Lankesh




'మేము ఏకలవ్యుని వారసులం'
( " కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకం నుంచి )


హుచ్చంగి ప్రసాద్‌ ఒక తిరుగుబాటుదారుడు.
       సామాజిక రాజకీయ మార్పు కోసం తిరుగుబాటు చేస్తున్న యువ కవి అతను.
       ఇరవైమూడేళ్ళ వయసుకే అతను ఎంతో దుఃఖాన్ని, అణచివేతను, పేదరికాన్ని, లేమిని, బానిసత్వాన్ని అనుభవించాడు. అవి సహజంగానే అతనిలో కోపాన్నీ, కసినీ నింపాయి. అనేకమంది యువకవులలాగా ఆ కోపాన్ని తీర్చుకోవడానికి అతను కవిత్వాన్ని మార్గంగా ఎంచుకున్నాడు.

ప్రముఖ కవయిత్రి దు. సరస్వతి అన్నట్లు ''ప్రసాద్‌ కవిత్వం నిండా బాధాతప్త హదయాల ఆగ్రహజ్వాలలు కనబడతాయి. మళ్లీ అందులోనే దయ, సహానుభూతి కూడా కనిపిస్తాయి.'' అతని కవితా సంకలనం 'ఒదలకిచ్చు' (అంతర్జ్వాల) కు కర్ణాటక బుక్‌ అథారిటీ వారిచ్చే సాహిత్య పురస్కారం లభించింది. ఆ పుస్తకాన్ని పైపైన తిరగేసినా చాలు కుల వ్యతిరేకత, హిందుత్వ వ్యతిరేకత, మూఢ నమ్మకాల పట్ల వ్యతిరేకత మనకు స్పష్టంగా కనబడతాయి. అంబేద్కర్‌ను గురువుగా భావించే ప్రసాద్‌  ప్రజలను అజ్ఞానం నుండి విముక్తి చెయ్యడానికి మళ్ళీ ఒక అంబేద్కరో, బసవడో రావాలని మనసారా కాంక్షిస్తాడు.

ప్రసాద్‌ తల్లి ఒక దేవదాసి, తండ్రి దళితుడు. బాల్యమంతా వెట్టి కార్మికుడిగా గడిచిపోతున్న తరుణంలో 'చిన్నారలోక' అనే ప్రభుత్వ పథకం అతన్ని ఆ ఊబిలో నుండి బయటికి లాగింది. బాలకార్మికులకు ఆసరా కల్పించి విద్య నేర్పే ఆ పథకం ప్రసాద్‌ జీవితంలో కొత్త వెలుగులు నింపింది. తన రచనల గురించి చెప్తూ ''నేను చూసిన, అనుభవించిన జీవితం గురించే రాసాను. అది తప్పు ఎలా అవుతుంది'' అంటాడు.

కాని కొందరి దష్టిలో అతను చాలా తప్పులే చేసాడు. గత సంవత్సరం మార్చిలో ప్రసాద్‌ తన కవితా సంకలనాన్ని అచ్చు వేసుకోవడమే కాక దాన్ని ఆవిష్కరించడానికి ప్రొఫెసర్‌ కె.ఎస్‌. భగవాన్‌ని ఆహ్వానించాడు. హిందూమతోన్మాదులకు భగవాన్‌ అంటే అస్సలు గిట్టదు. ఇప్పటికే అతన్ని చంపుతామని అనేకసార్లు బెదిరించారు కూడా. అటువంటి భగవాన్‌, ప్రసాద్‌ల కలయికను హిందూ జాగరణ్‌ వేదికె, శ్రీరామ సేన్‌ వారు ఏమాత్రం సహించలేక పోయారు. వారు ప్రసాద్‌ను బెదిరించడమే కాక అతనిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఆ ఫిర్యాదులు తర్వాత ఏమయ్యాయో తెలియదు గాని ప్రసాద్‌కి బెదిరింపులు రావడం మాత్రం ఆగిపోయాయి.

ఇదంతా జరిగి చాలా కాలం అయ్యింది. ఈ లోపు మతోన్మాద శక్తులు బాగా బలం పుంజుకుని చాలా రక్తాన్నే చిందించాయి. వారి భావాలకి విరుద్ధంగా మాట్లాడినవారిపై దాడులు జరిపాయి. వారే గత వారం ప్రసాద్‌ని దావణగెేరెలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి మోసపూరితంగా రప్పించి భౌతికంగా దాడి చేసారు. అతని ముఖానికి కుంకుమ పులిమి ''హిందూ ధర్మాన్ని విమర్శించడానికి నీకెంత ధైర్యంరా లంజాకొడుకా? గత జన్మలో చేసిన పాపం వల్లే నువ్వు ఇప్పుడు మాదిగోడిగా పుట్టావు. నీలాంటివారు బ్రతికుండగూడదు. హిందూ ధర్మానికి విరుద్ధంగా రాతలు రాసినందుకు నీ వేళ్లను నరికేస్తాం'' అంటూ బ్లేడ్‌ బయటికి తీసి దాడి చేయబోయారు. వేళ్లు నరికేస్తారన్న భయంతో ప్రసాద్‌ వాళ్ళపై గట్టిగా తిరగబడి అక్కడనుండి ఎలాగైతేనేం ప్రాణాలతో బయటపడ్డాడు. అరచేతికి మాత్రం చిన్న గాయం అయ్యింది.

''హిందూ మతాన్ని నేనెందుకు విమర్శించకూడదు? అంబేద్కర్‌ కూడా విమర్శించాడు కదా! 'హిందూస్తాన్‌ అసమానతలతో నిండిన దేశం' అన్నది ఆయనే కదా! నా దష్టిలో హిందూ మతం కన్నా భయంకరమైన మతం మరొకటి లేదు'' అన్నాడు ప్రసాద్‌.
 
       ''వాళ్ళు ఏ రామరాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారు? 
        రామరాజ్యంలో శంభూకుడి లాంటి శూద్రులకు ఏ గతి పట్టిందో వాళ్లకు తెలియదా? 
        రాముడి పరిపాలనలో స్త్రీలకు లభించిన స్థానమేమిటో వారికి గుర్తు లేదా? 
        సీతకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోయారా? 
       మాకు అటువంటి రామరాజ్యం అవసరం లేదు.  
       రాజ్యాంగం వాగ్దానం చేస్తున్న ప్రజా రాజ్యమే మాకు కావాలి'' అని కూడా అన్నాడు.

తన కుడి అరచేతికి గాయం అయినందువల్ల కొన్నాళ్ళు రాయలేకపోవచ్చునని చెపుతూ ''వాళ్ళు ద్రోణాచార్యుడి వారసులు అయితే మేము ఏకలవ్యుడి వారసులం'' అని ప్రసాద్‌ ధర్మాగ్రహంతో అన్నాడు. నాకు ఈ సందర్భంలో కువెంపు రాసిన 'బెరల్గే కొరళ్‌' నాటకం గుర్తుకొచ్చింది. ద్రోణాచార్యుడు తన ప్రియశిష్యుడు అర్జునుడిని మించిన విలుకాడు

      ఉండకూడదన్న దుర్బుద్ధితో ఏకలవ్యుడి కుడిచెయ్యి బొటనవేలును గురుదక్షిణగా అడిగిన కథ మనందరికీ తెలిసినదే. కువెంపు ఈ కథకు కొత్త మలుపునిస్తాడు. ఏకలవ్యుడు అడవిలో నివసించే ఆదివాసి గనక వేట అనేది అతని జీవన భృతి. అందుకే కుడిచెయ్యి పనికి రాకుండా పోయినా నిరుత్సాహపడకుండా అతను ఎడమచేత్తో విలువిద్యను సాధన చేసి నేర్చుకుంటాడని ఆ కథలో ఉంటుంది. నేను ఈ విషయాన్ని ప్రసాద్‌ దగ్గర ప్రస్తావిస్తే ''అవునా? నాకీ విషయం తెలియదు. కాని ఒకటి మాత్రం తెలుసు. వాళ్ళు నా పట్టుదలను నాశనం చెయ్యలేరు. అంబేద్కర్‌ మాకు ఆత్మగౌరవం, ఆత్మచైతన్యం అనే విలువలను నేర్పించాడు. మా హక్కుల కోసం మేము నిలబడడమెలాగో నేర్పించాడు. నేను సదా ఆ బాటలోనే నడుస్తాను'' అన్నాడు.

హిందుత్వ శక్తులు కర్రలతో, రాళ్ళతో ప్రసాద్‌లాంటి వారి ఎములను విరగ్గొట్టగలరేమోగాని వారి మనసుల్లో అంబేద్కర్‌ నింపిన చైతన్యాన్నీ, ఆలోచనలనూ మాత్రం రూపుమాపలేరు.

(బెంగుళూరు మిర్రర్‌, 26 అక్టోబర్‌ 2015)

అనువాదం : కె. అనురాధ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Wednesday, December 27, 2017

జైలులో సంబరాలు - గౌరి లంకేశ్




జైలులో సంబరాలు 

(కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు పుస్తకం నుంచి )

మత సామరస్యం కర్ణాటక సంస్కృతి మాత్రమే కాదు, అది ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల ఆశయం కూడా అని ఇప్పుడు రుజువైంది. లేకపోతే, డిసెంబర్‌ 7వ తేది ఆదివారం, రాష్ట్రం నలుమూలల నుండి అనేక సంస్థలు కలిసి చిక్కమగళూరులో జరిపిన సామరస్య సదస్సుకూ, అందులో పాలుపంచుకున్నందుకు జైలు పాలైనవారికీ రాష్ట్రమంతటా ఇంత మద్దతు లభించి ఉండేదే కాదు.

ఆ సదస్సు, దాని తరువాత రెండు రోజులు జైలులో ఉండడం - నేనెప్పటికీ మరువలేని అనుభవాలు. మా ఊరేగింపును జిల్లా అధికారులు అడ్డుకుని వందలాది మందిని ఆరెస్ట్‌ చేసినపుడు మేమందరం 'కట్టే కట్టుత్తేవ, నావు కట్టే కట్టుతేవ, ఒడెద మనసుగళ, కండ కనసుగళ కట్టే కట్టుతేవ' (కట్టి తీరుతాం, మేము కట్టి తీరుతాం, పగిలిన మనసులను తిరిగి కట్టి తీరుతాం, కన్న కలలను నెరవేర్చుకుని తీరుతాం) అని ఏకకంఠంతో పాడుతూ జైలుకి వెళ్ళిన క్షణాలు ఎటువంటి రోమాంచిత క్షణాలంటే ఆ రోజులు గుర్తొస్తే ఇవాళ్టికి కూడా నా కళ్ళు చెమ్మగిల్లుతాయి.

మా అందరినీ కిక్కిరిసిన బస్సుల్లో చిక్కమగళూరులో అప్పుడే కొత్తగా కట్టిన జైలుకు తీసుకువెళ్లారు. నినాదాలు చేస్తూ, కరపత్రాల్ని కిటికీల్లో నుంచి విసిరేస్తూ, తెల్ల జెండాలని ఊపుతూ వెళుతుండగా నాలో చిలిపి ఆలోచన వచ్చింది. అదేమిటంటే, ఏ ప్రభుత్వమైతే మా ప్రదర్శనని అడ్డుకున్నదో, ఆ ప్రభుత్వమే బస్సులలో మమ్మల్ని స్వయంగా ఊరంతా తిప్పి మా ఊరేగింపుకు అవకాశం కల్పించిందని. మేం కాలినడకన వెళితే అంత మంది జనం పట్టించుకునేవారు కాదేమో!

అది పేరుకే కొత్త జైలు. అందులో ఏ సౌకర్యాలూ లేవు. 250 ఖైదీలు పట్టే ఆ జైలులో వెయ్యిమందిని గొర్రెల మందల్లా తోసారు. అక్కడ తాగు నీరు గాని, మహిళలకి బాత్‌రూమ్‌లు గాని ఏ సదుపాయమూ లేదు. తాగు నీటి కోసం ధర్నా, తిండి కోసం ధర్నా, పరుపులు దుప్పట్ల కోసం ధర్నా ... ఇలా అన్నిటికీ గొడవ చేసి ఇప్పించుకోవలసి వచ్చింది.

చివరికి  'స్వచ్ఛ చిక్కమగళూరు' అని లేబుల్‌ అంటించిన చెత్త తీసుకెళ్ళే బ్యారల్‌లలో తాగు నీరు వచ్చింది. మూడు వందల మందికి సరిపడా తిండి మాత్రమే ఇచ్చారు. పరుపులు అడిగితే మామూలు గోనెపట్టలు, పల్చటి దుప్పట్లు వచ్చాయి.

అయినా అవేవీ మా ఉత్సాహాన్ని తగ్గించలేదు, మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. మా పోరాటంపై మాకున్న నమ్మకాన్ని సడలించలేదు. పైగా ఆ రెండు రోజుల జైలు జీవితం మమ్మల్నింకా దగ్గర చేసింది, మా పోరాటం కొనసాగించడానికి ప్రేరణ ఇచ్చింది.  జైలులో కష్టాలు పడుతున్నామేమోనని ఆదుర్దాగా ఫోన్‌ చేసిన కె. రామదాసు గారితో, భాను ముష్తాక్‌ గారితో నేను ''లేదు, లేదు, ఇక్కడే కష్టమూ లేదు. పైపెచ్చు ఎంత అద్భుతమైన అనుభవమంటే, మీరు కూడా ఇక్కడుంటే బాగుండేది. ఇక్కడి విశేషాలు వింటే మీరు కచ్చితంగా ఈర్ష్యపడతారు'' అన్నాను.

నిజంగానే ఆ జైలు ఒక మినీ కర్ణాటకలాగా ఉంది. ఖైదీలలో యువతీయువకులు, ప్రగతిశీల ఆలోచనాపరులు, కమ్యూనిస్టులు, ముస్లింలు, రకరకాల కళాకారులు,

ఉద్యమకారులు, పాత్రికేయులు, అధ్యాపకులు, మహిళలు, రైతు సంఘాల వారు, రాజకీయ నాయకులు అన్ని రకాలవారూ ఉన్నారు.

తమాషా ఏమిటంటే, భజరంగదళ్‌ నిర్వహించే దత్తజయంతిలో పాల్గొనటానికి వచ్చి, ఎలాగో మావాళ్ళ బండిలో ఎక్కిన కొందరు కాషాయ దళం సానుభూతిపరులు కూడా మాతో పాటు జైలు పాలయ్యారు. అక్కడ మాతో రెండు రోజులు గడిపిన తరువాత వాళ్ళు పూర్తిగా సామరస్యం వైపు మారినట్టు కనిపించారు. మేమందరం ఒకరికొకరు పూర్తి అపరిచితులం. అయినా ఒక గాఢమైన ఐక్యత మమ్మల్ని కలిపి ఉంచింది. ఎక్కడా ఎలాంటి అనర్థాలూ జరగలేదు.

మమ్మల్ని బంధించిన ఆదివారం రాత్రే 'పత్రికె' అచ్చుకి వెళ్ళవలసి ఉంది. జైలులోనే కాలమ్‌ రాసినా దాన్ని బెంగళూరుకు ఫాక్స్‌ చేయడం అసాధ్యం. పైపెచ్చు నాకు సహాయంగా ఉండటానికి వచ్చిన మా హసన్‌ రిపోర్టర్‌ చంద్రచూడ్‌ కూడా నాతోపాటు జైల్లోనే

ఉన్నాడు. దాంతో నా కాలమ్‌ను నేను మొబైల్‌లో చదివి చెప్పవలసి వచ్చింది. నేను అలా చెపుతుండగానే  సాయంత్రం సుమారు ఆరుగంటలకు సీనియర్‌ పోలీసు అధికారి సుభాష్‌ భరణి గారు అక్కడికి వచ్చారు. ''ఇవాళ మీ సంచిక పూర్తి చేయాల్సిన రోజు కదా?  ఎలాగూ అందర్నీ ఈ రాత్రికే విడుదల చేయబోతున్నాం కాబట్టి కావాలంటే ఇప్పుడే మీరు విడుదలై వెళ్ళిపోవచ్చు'' అన్నారు.

''అవసరం లేదండి ఇవాళ నేను మా ఆఫీసుతో టచ్‌లో ఉండాలంతే. కానీ నా మొబైల్‌ బ్యాటరీ అయిపోవస్తోంది. నేను దిగిన హోటల్‌ నుంచి నా మొబైల్‌ చార్జర్‌ తెప్పించగలిగితే చాలు'' అన్నాను. భరణిగారు ఒప్పుకున్నారు. కాని పని మాత్రం అవలేదు. రాజు ఆహ్వానించినా, ద్వారపాలకులు అడ్డుపడ్డట్టుగా ఉంది అక్కడి పరిస్థితి. జైలుకి కాపలాగా ఉన్న పోలీసులు నా మొబైల్‌ చార్జర్‌ తెప్పించలేదు. ''కావాలంటే మీరు విడుదలై వెళ్ళిపోవచ్చు, కాని తిరిగి రాకూడదు'' అని షరతు పెట్టారు. ఆల్‌ ఇండియా యూత్‌ ఫెడరేషన్‌ (ఏఐవైఎఫ్‌) కార్యకర్తలు, మత సామరస్య వేదికలోని యువకులు కూడా నన్ను వెళ్ళమనే చెప్పారు. అయితే అందరినీ విడుదల చేసేదాకా నేను వెళ్ళేది లేదని పట్టుబట్టాను. నా పరిస్థితి అర్థం చేసుకున్న భరణిగారే వైర్‌లెస్‌ ద్వారా పోలీసులకు ఆదేశమిచ్చి హోటల్‌ నుంచి నా సూట్‌కేస్‌ తెప్పించే ఏర్పాటు చేశారు. అలా నా పని అయింది. కాని జైల్లో వంద కంటే ఎక్కువ మొబైల్‌లు ఉన్నాయి. వాటన్నిట్నీ చార్జ్‌ చేసుకుంటే అందరికీ బయటి ప్రపంచంతో సంపర్కం ఉంటుందన్న ఒకే ఒక్క కారణంగా మరుసటిరోజు జైలు అధికారులు విద్యుత్‌ సరఫరాను ఆపేశారు.

ఆ రెండు రోజులు మాకు తోడుగా నిలిచింది చిక్కమగళూరు ముస్లింలే. నిజానికి సూఫీ సంప్రదాయానికి చెందిన బాబాబుడన్‌గిరి దర్గాతో చిక్కమగళూరు ముస్లింలకి చెప్పుకోదగ్గ అనుబంధమేమీ లేదు. వాళ్లెవరూ అక్కడ నమాజు చేయరు. అందుకే వాళ్ళందరూ ఈ వివాదంతో తమకు సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు ఇంతకాలం.  అయితే ఈ మధ్యకాలంలో కాషాయ దళం రెచ్చిపోవడం చూసి, చిక్కమగళూరులో మతకలహాలంటూ జరిగితే తామే బలి పశువులమవుతామని వాళ్లకు అర్థమయ్యింది. అందుకే మాకు మద్దతుగా నిలిచారు.

మా సమావేశం జరగటానికి ముందురోజే చిక్కమగళూరులోని అన్ని మసీదుల్లో ''ప్రగతిశీలుర సామరస్య సమావేశం విజయవంతం కావాలి'' అని ప్రార్థనలు చేశారు. సమావేశానికి వస్తున్న వెయ్యి మందిని బంధించారని తెలియగానే స్థానిక ముస్లిం నాయకులు మా ఆహారం కోసం అప్పటికప్పుడు నలభై వేల రూపాయల విరాళాలు సేకరించారు. ప్రభుత్వం మాకు చెత్తబుట్టల్లో నీళ్ళు ఇస్తే, వాళ్ళు మాకు బిస్లరీ బాటిళ్ళు ఇచ్చారు. ఆహారం సరిపోకపోతే, వాళ్ళే అందరికీ ఆహారం సరఫరా చేశారు. ఎముకలు కొరికే చలికాలం కావడంతో వందలకొలదీ స్వెటర్‌లు పంచారు. కాఫీ, టీలే కాదు, సిగరెట్‌, బీడీలు కూడా పంపించారు.

మాకే అవసరం వచ్చినా చూసుకోవడానికి జైలు గేటు బయటే కొంత మంది ముస్లిం యువకులను నిలబెట్టారు. వీటన్నిటికీ నాయకత్వం వహించిన యూసఫ్‌ హాజీకి మేం ఎల్లకాలం రుణపడి ఉంటాం. పాటలు, నృత్యాలు, చర్చల్లో లీనమైన మాకు ఆ రెండు రోజులు ఎలా గడిచాయో కూడా తెలియలేదు. నేను తీసుకువెళ్ళిన (అప్పుడే విడుదలైన) గాబ్రియల్‌ గార్షియా మార్క్వెజ్‌ ఆత్మకథలో ఒక్క పేజీ కూడా చదవడం వీలుకాలేదు.

జైలులో ఒక సెల్‌లో కూర్చుని నేను కాలమ్‌ రాసుకోవడం చూసి కన్నీళ్ళు పెట్టుకున్న మా 'పత్రికె' శివమొగ్గ పాఠకుడు; 'బాబా-దత్తా ఏక్‌ హై' అని మేమందరం నినాదాలు చేస్తుంటే 'లారా దత్తా ఏక్‌ హై' అని అరిచిన ఒక తుంటరి, ఇంకెక్కడా ఖాళీ లేకపోవడంతో నేను నిద్రపోతుండగా నా సెల్‌లోకి చడీచప్పుడూ కాకుండా వచ్చి నమాజు చేసుకున్న ముస్లిం యువకులు; 'కులం వద్దు, మతం వద్దు' అని ఎవరో నినాదాలు చేస్తుంటే, ''అవన్నీ వదిలిపెట్టే ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు  కావాల్సింది తిండి. అది కావాలని అరవండి'' అని నవ్వుల అలల్ని ఎగిసిపడేలా చేసిన ఒక యువకుడు; మరుసటి రోజు పరీక్ష ఉందని ఆందోళన పడుతున్న విద్యార్ధులు ... ఇలా ఎన్నో జ్ఞాపకాలు. వేటినీ మరచిపోలేను.

అలాగే ఆ జైలు ప్రాంగణంలో పరుచుకున్న చల్లని వెన్నెలా, అక్కడక్కడ మంట వేసుకుని చలికాచుకుంటూ రాత్రంతా కూర్చున్న జనం... విస్మరించలేని దృశ్యాలు.

ఆ రెండు రోజులు మాతో ఉన్న యువతీయువకుల్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా పునర్జన్మ పొందినంత ఉత్సాహం నాలో నిండుతుంది. అక్కడ కొత్త స్నేహాలు, ఆత్మీయతలు ఏర్పడ్డాయి. నిజమైన అర్థంలో అదొక సామరస్య సమావేశమే అయ్యింది. ఇది నా ఒక్కదాని భావనే కాదు, జైల్లో ఉన్న వందలాదిమంది అనుభవం కూడా ఇదే అనటంలో నాకు ఏ సందేహమూ లేదు.

(లంకేశ్‌ పత్రికె, 24 డిసెంబర్‌ 2003)
అనువాదం : కె . ఆదిత్య
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com




Monday, December 25, 2017

చివరి పది క్షణాలు - కవిత లంకేశ్ కవిత


(కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు పుస్తకం నుంచి )





కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

సీరియల్‌ కిల్లర్‌ నాగరాజ - గౌరి లంకేశ్




సీరియల్‌ కిల్లర్‌ నాగరాజ - గౌరి లంకేశ్ 
("కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకం నుంచి మరొక ఆర్టికిల్)

అతను ఇష్టపడేది వాళ్ల చీరలనే.
రంగురంగులవీ మెరిసేవీ వెలిసిపోయినవీ మెత్తనివీ ఉల్లిపొర లాంటివీ ముతకవీ పట్టువీ నూలువీ ఏవైనా సరే చీరలు మాత్రమే ఇష్టం అతనికి.
చీర కట్టిన అమ్మాయిలనే నాగరాజ కోరుకుంటాడు.
ముందు ఆ చీర లాగి పడేస్తాడు.
ఆమె ఏ మాత్రం అనుమానించక ముందే దాన్ని మెలి తిప్పి ఆమె గొంతుకి బిగించి రెండు వైపుల నుంచి గుంజి వదిలిపెడతాడు.
ఆమె శవమై నేల మీద నగ్నంగా పడిపోతుంది.
ఒంటిమీద ఉండాల్సిన చీర గొంతు దగ్గర బిగించి వుంటుంది.
రాత్రి వేళల అతను చీరెలు కట్టుకున్న అమ్మాయిల కోసం వెతుకుతూ వీధుల వెంట తిరుగుతూ వుంటాడు.

1991 జనవరి నెలలో అతను బెంగుళూరు రైల్వేస్టేషన్‌ దగ్గర మసక చీకటిగా వున్న వీధుల్లో తచ్చాడుతుండగా జయలక్ష్మి (మారుపేరు. ఇప్పటివరకు ఆమె ఎవరో తెలియదు) కనపడింది. ఆమె ఒక దీప స్తంభం కింద నిలబడి చూపరులను ఆకర్షించేందుకు అటూ ఇటూ చూస్తూ వుంది. ఆమె వత్తి ఏమిటో అతనికి అర్థమై పోయింది. ఆమె చీర అతనికి నచ్చింది. రైల్వే స్టేషన్‌ దగ్గరే తచ్చాడుతూ చిన్న చిన్న నేరాలకి పాల్పడే మిత్రుడు గోపాల్‌ని పిలిచాడు. ఏదో విశేషం వుందని అర్థమై గోపాల్‌ వెంటనే వచ్చాడు. ఇద్దరూ  తాపీగా నడుచుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళారు. వాళ్ళను చూసి ఆమె మొహం వెలిగింది. ఎంత అన్నాడు నాగరాజ. ఆమె తన పద్ధతి చెప్పింది, గంటకింతని డబ్బు పుచ్చుకుని గదులు అద్దె కిచ్చే ఒక చవక బారు హోటల్‌కి తీసికెళతానని చెప్పింది. కావాలనుకుంటే ఇద్దరికీ కలిపి ఒక రేటు మాట్లాడుకోమంది. నాగరాజకి ఇది నచ్చలేదు. ''వద్దు. అట్లా కాదు, మనం బయటికి పోదాం. ఆరు బయలే బాగుంటుంది'' అన్నాడు. జయలక్ష్మి ఆశ్చర్యపడింది. ''మనం ఆటో మాట్లాడుకుని ఒక అందమైన చోటుకి పోదాం. పనయి పోయాక మేము నిన్ను తిరిగి ఇక్కడ దించుతాం'' అన్నాడు.

''అట్లా అయితే 200 ఇవ్వాలి'' అంది ఆమె. ''150 ఇస్తాం. వస్తే రా లేకపోతే లేదు'' అన్నాడు నాగరాజ. ఆమె ఒప్పుకుంది. ముగ్గురూ కలిసి ఒక ఆటో ఎక్కి  ఇరవై నిమిషాలు ప్రయాణం చేసి యూకలిప్టస్‌ చెట్లు దట్టంగా వున్న ఒక చోటికి పోయారు. ఆటోకి గోపాల్‌ డబ్బిచ్చి పంపేశాడు. జయలక్ష్మిని చెట్ల మధ్యకి తీసికెళ్లాడు నాగరాజ. ఆమె భయపడుతున్నట్లు గమనించి ''భయపడకు. నిన్ను మళ్లీ వెనక్కి తీసికెళ్లి దింపేస్తాం'' అన్నాడు నాగరాజ. అక్కడ దాకా వచ్చాక వాళ్ళతో ఆమె ఏం వాదించగలదు? ముందు గోపాల్‌ ఆమెను అనుభవించాడు. తరువాత నాగరాజ. అతని పద్ధతి వేరుగా ఉంది. చాలా మొరటుగా దూకుడుగా ఉంది. జయలక్ష్మి భయంతో అతని కింద ముడుచుకు పడుకుంది. హఠాత్తుగా అతను ఆమె చీర పట్టుకుని ఛాతీమీదకు లాగాడు. పైట కొంగు బలంగా గుంజాడు. ఆమె స్పందించే లోపునే దాన్ని మెడ చుట్టూ తిప్పాడు. ఆమె పెనుగులాడింది. కాని ఈ లోగానే అంతా అయిపోయింది. అతను దయ్యం పట్టిన వాడి లాగా చీరను ఆమె మెడ చుట్టూ బిగించి ఇంకా ఇంకా గట్టిగా లాగాడు. ఆమెకి ఊపిరాడలేదు. మెడ ఎముకలు విరిగిపోయాయి. పెనుగులాట నిలిచిపోయింది. ఆమెలో ప్రాణం మిగిలి లేదని తెలిసి కూడా ఇంకా అతను గొంతుకి ఉరి బిగిస్తూనే వున్నాడు. ఆ తరువాత అసలేమీ జరగనట్లు లేచి ప్యాంటు సరిచేసుకుని జయలక్ష్మి ఒంటి మీద ఉన్న చిన్నచిన్న బంగారు వస్తువుల్ని జేబులో వేసుకుని గోపాల్‌తో కలిసి మెయిన్‌రోడ్‌ మీదికి వెళ్ళాడు. అక్కడ ఒక ట్రక్కును ఆపి ఎక్కి బెంగుళూరు తిరిగి వచ్చారు,

ఆ రాత్రి ఇద్దరూ ఎప్పటికన్నా ఎక్కువ తాగేసి తమ ఘనకార్యం గురించి ముచ్చటించు కున్నారు. అయిదు రోజుల తర్వాత నాగరాజ అటువంటి మరో హత్య చేశాడు. ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చేశాడు.

వరుస హత్యలకు పాల్పడే వాళ్లు మతి భ్రమించిన వాళ్లని వాడుక. సినిమాల్లో ఇలాంటి వాళ్ళని  కాలు కుదురు లేకుండా తిరుగుతూ చెమటలు కక్కుతుండే ఆంథొనీ పెర్కిన్స్‌ నమూనాలో చూపిస్తూ వుంటారు. ఆధునిక సాహిత్యంలో ఇలాంటి వాళ్ళని స్వలింగ సంపర్కులుగా, లేకపోతే థామస్‌ హ్యారిస్‌ నవల 'సైలెన్స్‌ ఆఫ్‌ ది ల్యాంబ్స్‌' (Silence of the lambs) లోని డాక్టర్‌ లాగా చిత్రిస్తారు. ఈ డాక్టర్‌ తన రోగుల కాలేయాల్ని కొద్దిపాటి గ్రీన్‌ సలాడ్‌తో కలిపి తింటుంటాడు. దాంతో పాటు  మోన్‌ ట్రాషె (Montrachet‌) అనే వైన్‌ పుచ్చుకుంటుంటాడు. కానీ నిజ జీవితంలో ఈ సీరియల్‌ హంతకులు సినిమాల్లో లాగా ఒక మూస నమూనాలో వుండరు. వాళ్ల పద్ధతులు, మనస్తత్వం చాలా సంక్లిష్టంగా వుంటాయి. ఉదాహరణకి 1960 లలో బొంబాయి ప్రజలను భయభ్రాంతుల్ని చేసిన రామన్‌ రాఘవ్‌, యార్క్‌షైర్‌ హంతకుడు (ఇతన్ని యార్క్‌షైర్‌ రిప్పర్‌ అంటారు) పీటర్‌ సట్‌క్లిఫ్‌ (Sutcliffe) లాంటి వాళ్ళు ఏ నమూనాకీ లొంగరు.

అయితే కేవలం హంతకుడని కాక Serial Killer  అని పిలవడానికి ఆ వ్యక్తికి కొన్ని లక్షణాలు వుండాలి: అతను ఒకే పద్ధతిలో మళ్ళీ మళ్లీ దాడి చేయాలి. స్వలాభం లేకపోయినా హత్యలు చేయాలి. ఎక్కువ సార్లు ఈ నేరంలో స్త్రీలపై అత్యాచారం కూడా కలిసి వుంటుంది. ఈ విధంగా చూస్తే నాగరాజ అసలు సిసలైన సీరియల్‌ కిల్లర్‌. ఇప్పటిదాకా  24 హత్యలు చేసానని అతనే ఒప్పుకున్నాడు. బెంగుళూరు పోలీసులు మాత్రం అతను మరో ఇరవై హత్యలు కూడా చేసి వుండొచ్చు ననుకుంటున్నారు. కొంతమంది పోలీసులు అతను యాభై హత్యల దాకా కూడా చేసి వుండొచ్చంటున్నారు.

ఒక్కరు తప్ప అతను చంపిన వారంతా స్త్రీలే. దాదాపు ఆ స్త్రీలందరినీ చంపే ముందు లైంగికంగా అనుభవించాడు. కొన్నిసార్లు వాళ్ల అనుమతితో, కొన్నిసార్లు బలవంతంగా. అతనికి  రక్త దాహం ఒక జబ్బుగా మారినట్లుంది. అవసరం లేనిచోట కూడా హత్యలు చేశాడు. ఇతర సీరియల్‌ హంతకుల్లాగానే ఇతనూ తప్పించుకోడంలో బహు నేర్పరి. నాగరాజ హత్యలకు ఎంచుకునే వారంతా సమాజం అంచుల్లో నివసించేవారు. పడుపు వత్తి చేసుకు బ్రతికేవారు. పట్నంలో బ్రతుకుదామని ఏదో ఒక రైలు పట్టుకుని వచ్చిన  పల్లెటూరి యువతులు, తాడు బొంగరం లేనివాళ్లు. వాళ్ల కోసం వెతికే వాళ్ళు గాని పట్టించుకునే వాళ్ళు గాని ఎవరూ ఉండరు. దానికి తోడు 'ద సైలన్స్‌ ఆఫ్‌ ల్యాంబ్స్‌'లో బఫెలో బిల్‌ (Buffalo Bill) లాగా అతను కర్ణాటకలో ఒక చోట ఎక్కడా వుండకుండా,  పోలీసులకి తన హత్యా విధానం అర్థం కాకుండా తప్పించుకుని తిరిగాడు. యార్క్‌షైర్‌ రిప్పర్‌ వలె అతను ఎప్పుడైనా, ఏదైనా హత్య కేసులో అనుమానితుడిగా పోలీసులకి దొరికినా అబద్ధాలు చెప్పి తప్పించుకుపోయేవాడు.

నాగరాజ ఈ పని ఎప్పుడు ప్రారంభించాడు, ఎందుకు అలా తయారయ్యాడు అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. 1989  మే 20 న బెంగుళూరు శివార్లలో సుమతి అనే యువతి కుళ్ళిపోయిన శవం కనిపించింది. ఆమే తన మొదటి బాధితురాలు అంటాడు నాగరాజ. అతను పచ్చి అబద్ధాలకోరు కనుక ఇది నిజం కాకపోవచ్చు కూడా. సుమతికి పదిహేడేళ్ళు. కాస్త మందమతి. మాట స్పష్టత లేదు. ఆమె కుందపుర అనే ఊరు నుంచి తన  అక్క ఇంటికి బెంగుళూరు వచ్చింది. ఎందువల్లనో ఆమె అక్క ఆమెను ఒంటరిగా సినిమా చూసిరమ్మని పంపించింది. సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన సుమతి బెంగుళూరు మెజిస్టిక్‌ ప్రాంతంలోని జన సమ్మర్దాన్ని చూసి బెదిరిపోయింది. బస్సు ఎక్కి అక్క ఇంటికి పోదామనుకుంది  కాని ఏ బస్సు ఎక్కి  వెళ్ళాలో అర్థం కాక కంగారుగా అటూ ఇటూ తిరుగుతోంది. అప్పుడామెను నాగరాజ చూసాడు. అతనితో పాటు చంద్ర అనే స్నేహితుడు కూడా వున్నాడు. ఆమె తప్పిపోయి వుండవచ్చని ఊహించి దగ్గరకు వెళ్లి ''సాయం కావాలా'' అని అడిగాడు. తను అక్క ఇంటికి వెళ్లాలనీ, దారి తెలీడం లేదనీ చెప్పింది. తీసికెళతామని ఆమెను నమ్మించారు కాని మిత్రులిద్దరికీ ఆమెను ఆమె అక్క ఇంటికి చేర్చే ఉద్దేశం ఎంతమాత్రం లేదు.

ఆ సాయంత్రం మొట్టమొదటిసారి వాళ్లు ఒక అమ్మాయిని బెంగుళూరు శివార్లకి తీసుకుపోయి రేప్‌ చేశారు. అత్యాచారం చేసిన తరువాత నాగరాజ ఆమె చీర లాగేసి దానితోనే ఆమె ప్రాణాలు తీశాడు. ఎంతసేపటికీ సుమతి ఇంటికి తిరిగి రాకపోయేసరికి సుమతి అక్క-చెల్లెలు తప్పిపోయిందని మడివాళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎన్నాళ్ళకీ సుమతి ఆచూకీ తెలియకపోయేసరికి ఇంకేదో జరిగిందని పోలీసులు అనుమానించారు. వెంటనే చిన్న చిన్న నేరాలకు పాల్పడే వారందర్నీ పట్టుకొచ్చి ప్రశ్నించారు. అందులో నాగరాజ ఒకడు. అతను చెపుతున్నట్లుగా నిజంగా అదే అతని మొదటి హత్య అయితే పోలీసులు పట్టుకెళ్లినప్పుడు అతను చాలా భయాందోళనలకు గురి కావలసినది. కానీ అతను చెక్కు చెదరలేదు. తనకు అసలు సుమతి తెలియదని, ఆమె అదృశ్యమైపోవడానికీ తనకీ ఎలాంటి సంబంధం లేదని అతను చాలా దృఢంగా చెప్పినట్లు పోలీసు రికార్డులు చెపుతున్నాయి. మామూలుగా ఎవర్నీ నమ్మని పోలీసులనే అతన్ని పొరపాటుగా పట్టుకొచ్చామని అనుకునేలా నమ్మించాడట. వాళ్ల దగ్గర ఏ ఆధారమూ లేకపోవడంతో ఆ తర్వాత వదిలేసారు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటపడ్డ ఆ రోజే అతనికి అర్థమయి ఉంటుంది - తను ఇక ఎన్ని హత్యలైనా చేసి తప్పించుకోగలనని. ఆ తర్వాత అతన్ని ఎవరూ ఆపలేకపోయారు.

ఇలా వరస హత్యలకు పాల్పడేవారిలో ఎక్కువమంది ఒంటరిగానే తమ పని కానిస్తారు. అయితే యార్క్‌షైర్‌ రిప్పర్‌ కేసును పరిశోధించిన పోలీసులు ఒక్కొక్కసారి అతనికి తోడుదొంగలు కూడా ఉండేవారని చెప్పారు. కాని నాగరాజ దాదాపు అన్నిసార్లూ ఎవరో ఒక పరిచయస్తుడిని వెంట తీసుకువెళ్లడం అసాధారణమనిపిస్తుంది. అతను తన వెంట వచ్చే వాళ్లకి ఆ స్త్రీని చంపే ఉద్దేశం వుందని చెప్పేవాడో లేదో తెలియదు. కాని ప్రతిసారీ వేరే వేరే వాళ్లను వెంట తీసుకెళ్లడం చూస్తుంటే రేప్‌ చెయ్యబోతున్నట్టు మాత్రమే వాళ్లకు చెప్పేవాడనిపిస్తుంది. మరో అసాధారణ విషయం ఏమిటంటే ఆ స్త్రీలను చంపాక వారి వొంటి మీద వున్న చిన్న చిన్న బంగారం వస్తువుల్ని కాజేయడం. అతను ఏ పనీ చేయని తిరుగుబోతు కావడం వలన ఆ కాస్త బంగారాన్నీ అమ్ముకుని బతికినట్టున్నాడు.. ఈ డబ్బుని అతను తన తోటి దొంగలతో పంచుకున్నట్టు కూడా కనిపించదు.

నాగరాజ ఎక్కువగా పడుపు వత్తి చేసుకు బ్రతికే స్త్రీలనే ఎందుకు ఎంచుకున్నాడు? యార్క్‌షైర్‌ రిప్పర్‌ గానీ, జాక్‌ ది రిప్పర్‌ గానీ అలాంటి అమ్మాయిలనే ఎందుకు ఎంచుకున్నారో నాగరాజ కూడా అందుకే ఎంచుకున్నాడు. తెలియని మగాడిని నమ్మి తెలియని చోట్లకు వెళ్ళేది ఎక్కువగా అటువంటి అమ్మాయిలే. వాళ్ళు మాయమైనా సమాజానికి పట్టదు. కనీసం వాళ్ళు కనిపించడం లేదని కూడా ఎవరూ గుర్తించరు. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలలో ఎక్కువమంది కుటుంబాలతో కలిసి వుండరు. కనుక వాళ్ళు తప్పిపోయినట్లు ఫిర్యాదు చేసే వాళ్ళూ తక్కువే ఉంటారు. ఇప్పటికి తాను పదహారు మంది పడుపువత్తి చేసుకు బ్రతికే  అమ్మాయిల్ని చంపానని నాగరాజే చెప్పాడు. వీళ్ళందరినీ  అతను చంపిన పద్ధతి ఒక్కటే. ముందు తన సహచరుడూ, ఆ తర్వాత తనూ ఆమెను లైంగికంగా అనుభవించాక ఆమెను హత్య చేసి మరింత త్రిల్‌ అనుభవించడం అతని పద్ధతి.

కాని అతను ఎందుకు ప్రతిసారీ ఒక మనిషిని తోడు తీసుకువెళతాడు? దీని మీద రెండు అభిప్రాయాలున్నాయి. ఒకటి-బాధితురాలు తిరగబడితే ఆమెను లొంగదియ్యడానికి అవసరమవుతారని కావచ్చు. అయితే ఆరు సందర్భాలలో అతనొక్కడే  వెళ్లి చంపేశాడు కనుక ఆ కారణం కరెక్టు కాకపోవచ్చు. రెండు-బహుశా ఒక స్త్రీతో ఒకరికంటే ఎక్కువమంది ఒకేసారి శృంగారంలో పాల్గొనడం చూడడం అతనికి ఆనందం కావచ్చు. ఇతరుల లైంగిక చర్యలను  చూస్తూ తనే ఆ ఆనందం పొందుతున్నట్లు భావించే (voyeurism) మనస్తత్వం గలవాడయి వుండొచ్చు. తను చంపదలుచుకున్న స్త్రీని లైంగికంగా అవమానించడాన్ని కూడా అతను ఆస్వాదిస్తూ వుండవచ్చు,

అందరు హంతకులూ, రేపిస్టులూ ఉన్మాదులేమీ కారు.  ప్రతి రామన్‌ రాఘవ్‌1కు అత్యాచారం చెయ్యడం, హత్య చెయ్యడం అనేవి తమ ఘనకార్యాల జాబితాలో మరికొన్ని పతకాలుగా భావించే బిల్లా2 లాంటివారు కూడా వుంటారు.

నాగరాజకు అయిదేళ్ళప్పుడు వాళ్ల కుటుంబం బెంగుళూరు వచ్చింది. బిల్లా లాగా  కార్లు దొంగిలించడం, కిడ్నాపులు చెయ్యడం, ఆయుధాలతో దోపిడీలకు పాల్పడడం వంటి పనులు నాగరాజ ఎప్పుడూ చెయ్యలేదు. అతను ఎప్పుడో తప్ప ఆయుధం మోసుకు తిరగలేదు. పిచ్చివాడు కూడా కాదు. గత జీవితంలో సైతం అతనికి మతి చాంచల్యం

ఉన్న దాఖలాలు లేవు. అతని బాల్యం ఆనందంగా గడవలేదని కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ నిశితంగా పరిశీలిస్తే అటువంటి నేపథ్యంలో పెరిగిన వాళ్ళ కంటే అతని బాల్యం ఏమీ భిన్నం కాదనిపిస్తుంది. అటువంటి బాల్యాలు చాలామందికి వున్నాయి.

నాగరాజ ఉరఫ్‌ కుమార్‌ ఉరఫ్‌ సెల్వన్‌ 27 సంవత్సరాల క్రితం తమిళనాడులోని బందేహళ్లి అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి కరియప్ప రాళ్ళు చెక్కే పనివాడు. చాలా బీదవాడు. తాగుబోతు. అతనికి ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. తాగినప్పుడు అందర్నీ కొట్టేవాడు. పని కోసం ప్రయత్నించేవాడు. దొరకనప్పుడు తాగుతూ కూర్చునే వాడు. ఆ తాగుడే కొన్నాళ్ళకి అతన్ని ఏ పనికీ పనికిరాని వాణ్ణి చేసింది. కాలేయం చెడిపోయి చనిపోయాడు. కుటుంబానికి ఏ ఆధారమూ లేకుండా పోయింది. నాగరాజకు  చిన్నప్పుడే బ్రతుకుతెరువు వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. కాని అతను ఏ పని చేసి పొట్టపోసుకునే వాడో ఎవరికీ తెలియదు. ఆ విషయం గురించి అతను ఎప్పుడూ చెప్పలేదు. బహుశా చిన్న చిన్న దొంగతనాలు చేసి బతికి వుంటాడని పోలీసుల అనుమానం. ఎందుకంటే మూడు నెలల పాటు ఎంత తీవ్రంగా పరిశోధించినా అతనికి పని ఇచ్చిన వ్యక్తులెవర్నీ వారు కనుగొనలేకపోయారు.

ఇరవై మూడేళ్ళ వయస్సులో అతనికి అతని సోదరి పెళ్లి కుదిర్చింది. పెళ్లికూతురు ఆమె ఆడబిపడుచే. భార్యకు లారీ డ్రైవర్‌ పని చేస్తానని నాగరాజ చెప్పాడు కానీ అతను నిజంగా ఏ పని  చేస్తాడో ఆమెకు తెలియదు. అతను నడిపే లారీని ఎవరూ చూడలేదు కూడా. అయితే ఆ కల్పిత ఉద్యోగాన్ని రోజుల కొద్దీ మాయమై పోవడానికి అతను ఒక సాకుగా వాడుకున్నాడు. ఒక్కొక్కసారి బాగా డబ్బులతో తిరిగి వచ్చేవాడు. భార్య అడిగితే లారీలో బొంబాయి వెళ్లి వచ్చాననీ, ఆ డబ్బు జీతంగా ఇచ్చిన డబ్బు అనీ చెప్పేవాడు.

ఇప్పుడు అడిగితే తానెప్పుడూ లారీ నడపలేదంటాడు నాగరాజ. మరయితే మధ్యమధ్యలో ఎక్కడికి మాయమై పోతుండేవాడు? అతను చెప్పినదాని ప్రకారం చూసినా అతను  మొదటి హత్య  చేసింది1989 ఏప్రిల్‌-మే లో. కానీ ఈ మాయమవడాలు జరిగింది 1987-89 మధ్యలో. అంటే అతను ఆ హత్యల్ని ఆ కాలంలోనే మొదలుపెట్టి ఉండొచ్చా? పోలీసులు ఇప్పుడు ఆ విషయం కనుక్కోడానికే ప్రయత్నిస్తున్నారు.

చివరికి అతని పెళ్లి విఫలమైపోయింది. అతను కనిపించకుండా పోవడాలు రానురాను ఎక్కువై పోయాయి. కొన్నాళ్లకు అసలే మాయమై పోయాడు. తనకి భార్యంటేనూ, సంసారమంటేనూ విసుగు పుట్టిందని చెబుతాడు. బెంగుళూరు రైల్వే స్టేషన్‌ దగ్గరకు చేరాడు. అది తిరుగుబోతులకూ చిట్టి పొట్టి దొంగలకూ స్వర్గధామం. కావల్సినన్ని జేబులు కొట్టొచ్చు. సూట్‌కేస్‌లు కొట్టేయ్యొచ్చు. అక్కడ తచ్చాడే అమ్మాయిలతో సుఖం కొనుక్కోవచ్చు.

క్రమంగా అతనికి చాలా రకాల నేరస్తులు పరిచయం అయ్యారు. అందులో చాలామంది తమిళనాడు వాళ్ళు.ఊరితో పరిచయంలేని వాళ్ళు రైలు దిగినప్పుడు వాళ్ళకి ఊరు చూపించే  నెపంతో మోసాలు చేయడానికి ఆ రైల్వే స్టేషన్‌ వాళ్లకు బాగా పనికొచ్చింది. అవతలి వాళ్ళు మగవాళ్ళయితే దోచుకుని వదిలేసేవాళ్లు. ఆడవాళ్ళయితే అత్యాచారం చేశా దోచుకుని వదిలేసేవాళ్లు. ఈ హత్యలు చెయ్యడం ఎప్పుడు మొదలయిందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇండియా మొత్తం మీద రైల్వే స్టేషన్లు దొంగలకు మంచి ఆశ్రయాలు. ప్రయాణీకుల్ని బురిడీ కొట్టించడానికి అవి బాగా పనికొస్తాయి. కానీ హత్యలు జరగడం మాత్రం తక్కువే. అత్యాచారాలు అందరూ కలిసి చేసినా హత్యలు చెయ్యడం మాత్రం నాగరాజ పనేనని అతని స్నేహితులు చంద్ర, రాజా ఇద్దరూ పోలీసులకు చెప్పారు. తన స్నేహితులు అత్యాచారాల్లో పాల్గొన్నారు కానీ హత్యలు మాత్రం తనే చేసానని నాగరాజ కూడా ఒప్పుకున్నాడు.

ఎంత అన్యాయమో చూడండి: సెక్స్‌ వర్కర్లని చంపినంత కాలం నాగరాజ బాగానే వున్నాడు. సెక్స్‌వర్కర్లు కాని వాళ్లను చంపడం మొదలుపెట్టాకే అతను పోలీసులకు దొరికాడు. తను ఒక్క మగవాడిని మాత్రమే చంపానని నాగరాజ పోలీసులకు చెప్పాడు. కోలార్‌ బంగారు గనుల దగ్గర కత్తి చూపించి తన చేతి గడియారం, ఉంగరం, బట్టలు దొంగిలించిన బాషా అనే వ్యక్తిని ఆ తర్వాత ఒకరోజు బస్సులో పోతూ చూసి ఆగి  ప్రతీకారం కోసం చంపానన్నాడు. ఈ కథ నిజమో కాదో అనుమానమే. ఎందుకంటే బాషాను కూడా అతని బెల్ట్‌తోనే మెడ నులిమి చంపాడు. పైగా బాషాను చంపాక అతని భార్యపై అత్యాచారం చేసి ఆమెను కూడా గొంతు నులిమి చంపాడు. ఆమె పేరు నూర్జహాన్‌. అతనికి కావలసింది నూర్జహానే కావచ్చు. మధ్యలో బాషా అడ్డం వచ్చి వుంటాడు. వాళ్ళిద్దరి హత్యల గురించి సమాజం ఎంత గగ్గోలు పెట్టినా అప్పుడు కూడా నాగరాజ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. అయితే ఆ తరువాత మాత్రం 'అదష్టదేవత' అతన్ని కరుణించలేదు.

గత సంవత్సరం అతను తమిళనాడు లోని ధర్మపురి జిల్లాలో పడుపు వత్తి చేసుకు బ్రతికే ఒక స్త్రీని హత్యచేసి అక్కడ నుండి వెంటనే పరారయ్యాడు. గోవింద అనే స్నేహితుడితో కలిసి బెంగుళూరు దగ్గర పట్టు బట్టలు నేసే కనకపురా అనే ఊర్లో తేలాడు. అక్కడి అంబేద్కర్‌ నగర్‌ మురికివాడలో గోవిందకు ఒక పాక వుంది. నాగరాజ ఎందుకు కనకపురాలో ఉండడానికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. బహుశా తన కోసం వేట ముమ్మరమైందనీ, కొన్నాళ్ళ పాటు హత్యలకీ, అత్యాచారాలకీ  విరామం ఇవ్వాలనీ అనుకుని వుండవచ్చు. ఇక్కడ ఇరుగు పొరుగులెవ్వరూ అతన్ని హంతకుడని అనుమానించలేదు. చాలా సాదాసీదాగా కనిపించేవాడు.గోవింద పొరుగున వుండే హొన్నయ్య అనే వాచ్‌మన్‌  నాగరాజను చాలా ఇష్టపడి తన పద్దెనిమిదేళ్ళ కూతురు హొన్నమ్మకు అతనే తగిన వరుడని అనుకున్నాడు. నాగరాజ వారికి అలాంటి అభిప్రాయమే కలిగించడానికి ప్రయత్నించాడు. వాళ్ళతో కూడా తను లారీ డ్రైవర్ననే చెప్పాడు. అందుకే కుదురుగా ఒక చోట వుండననీ, కానీ బాగా సంపాదిస్తాననీ చెప్పాడు. ఉంగరం, వాచీ చూపించాడు. అయినా సంతృప్తి చెందక నీకు కుటుంబ సభ్యులెవరూ లేరా అని ఆరా తీశాడు హొన్నయ్య. తనొక అనాథననీ, తన బ్రతుకేదో తనే బతుకుతూ వచ్చాననీ చెప్పాడు నాగరాజ.  హొన్నయ్య పెద్ద కూతుళ్ళు జయమ్మ, గౌరమ్మలకు అతని మీద జాలి కలిగింది.అతనే హొన్నమ్మకి తగిన వరుడు అని వాళ్ళు కూడా గట్టిగా నమ్మారు. ఫలితంగా 1991 లో నాగరాజ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లు అతన్ని చాలా బాగా చూసుకున్నారు. ఎంతో మందిని చంపి శిక్ష తప్పించుకున్న అతనికి ఇప్పుడు మళ్ళీ కుదురుగా బ్రతికే అవకాశం వచ్చింది.

కానీ రక్త దాహం ఊరుకోదు కదా! హత్యలూ, అత్యాచారాలూ లేకుండా రెండు నెలలు గడపడం కూడా కష్టమై పోయింది అతనికి. ఇప్పుడు కొత్త అమ్మాయిలు కావాలి. పెళ్లి చేసుకున్న వారానికే వాళ్లమీద కన్నుపడింది అతనికి. తను ఏవో కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి బెంగుళూరు వెళ్లాలని హొన్నయ్యకి చెప్పాడు. సరేనని హొన్నయ్య కుటుంబం కొత్త దంపతులతో కలిసి నగరానికి వెళ్లింది. తన పాత సంచార స్థలమైన మెజెస్టిక్‌ ప్రాంతం చూడగానే అతనిలోని వికారాలు మళ్లీ బయటికొచ్చినట్టున్నాయి. అతనిలోని సైకోపత్‌ నిద్ర లేచాడు. ''అందరం ఒక ఆటో రిక్షాలో పట్టం'' అని హొన్నయ్యతో అంటే నిజమే కదా అని హొన్నయ్య రెండో ఆటోను పిలిచాడు. రెండో ఆటోలో హొన్నయ్య కూర్చున్నాడో లేదో మొదటి ఆటోలో నాగరాజ ముగ్గురు ఆడవాళ్ళతో కలిసి తుర్రుమన్నాడు.

ఆ ఆటో బెంగుళూరు  శివార్లలోని బన్నేర్‌ఘట్ట (Bannerghatta) నేషనల్‌ పార్క్‌ దగ్గరున్న ఒక పొలం దగ్గర ఆగింది. భార్యని రోడ్డు మీదే వేచి వుండమని చెప్పి ఆమె అక్కలను ఆ దగ్గరలోనే వున్న తన అమ్మమ్మకి చూపించి తీసుకువస్తానని వాళ్ళిద్దర్నీ తీసుకుపోయాడు. ఒకప్పుడు నాగరాజతో వుండిన  షంగుట్ట వాళ్ళని అనుసరించి వస్తున్నాడని ఆ ఆడవాళ్ళెవరికీ తెలియదు. పొలం దగ్గరకు వెళ్ళేసరికి అతనక్కడ ప్రత్యక్షమయ్యాడు. మగవాళ్ళిద్దరూ కలిసి జయమ్మని పట్టుకుని ఆమె చీర ఊడదీసారు.. గౌరమ్మ పారిపోబోతే షంగుట్ట ఆమెని పట్టుకున్నాడు. ఆ తరువాత అన్నీ ఎప్పటిలాగే జరిగిపోయాయి. వదినగార్లిద్దరి పైనా అత్యాచారం జరిగింది. వాళ్ల చీరలతోనే వాళ్ల గొంతులు నులిమారు. ఆ తరువాత నాగరాజ చాలా మామూలుగా మెయిన్‌ రోడ్డు మీద ఓపిగ్గా ఎదురుచూస్తూ నిలబడ్డ భార్య దగ్గరకు వచ్చి ''మీ అక్కలు బెంగుళూరు వెళ్ళిపోయారు'' అని చెప్పాడు. ఏ మాత్రం అనుమానించకుండా హొన్నమ్మ భర్త మాటల్ని అమాయకంగా నమ్మింది. తర్వాత భర్తతో కలిసి ధర్మపురి జిల్లాలోని కొత్తనూరుకి కొత్త కాపురానికి వెళ్ళిపోయింది.

అయితే హొన్నయ్య తన చిన్న కూతురులా అతన్ని నమ్మలేదు. పెద్ద కూతుర్లిద్దరూ ఇంటికి రాకపోయేసరికి అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు ఊరంతా గాలించారు. చివరికి ఒక గుర్తుతెలియని శవం బెంగుళూరు శివారు పొలాల్లో దొరికినప్పుడు ఆమె చేతి మీద జయమ్మ భర్త పేరున పచ్చబొట్టు వుండడంతో బెంగుళూరు అదనపు జిల్లా పోలసు సూపరింటెండెంట్‌ ఎస్‌.కె.వేణుగోపాల్‌కి లంకె దొరికింది. ఆయన శవాన్ని గుర్తుపట్టడానికి హొన్నయ్యను పిలిచాడు. అతను గుర్తు పట్టడంతో రెండో ఆమె గౌరమ్మ శవం కోసం భారీగా గాలింపు జరిగింది. అది కూడా దొరకడంతో నాగరాజకు ఈ హత్యలతో సంబంధం వుందని తేలిపోయింది. హొన్నయ్య ఇచ్చిన పెళ్లి ఫోటో సాయంతో పోలీసులు నాగరాజ కోసం వెదకడం ప్రారంభించారు. చివరకు కొత్తనూరులో అలాంటి మనిషిని చూసామని ఒకరు చెప్పారు.

పోలీసులు అతన్ని కనుక్కునే సమయానికి అతను భార్య పక్కన పడుకుని గాఢంగా నిద్రపోతున్నాడు. పోలీసులను చూసి అమితాశ్చర్యం ప్రదర్శించాడు. తన భర్త అమాయకుడని హొన్నమ్మ గట్టిగా చెప్పింది. కాని ఈసారి ఆట ముగిసిందని అతనికి అర్థమైనట్టే ఉంది. అయినా అచ్చమైన సైకోపత్‌లా అతను అమిత ఆత్మ విశ్వాసంతో పోలీసుల వాదనలన్నీ తిప్పికొట్టాడు. ఒకసారి పొలీసులను మాయ చేసాడు కనుక ఎల్లప్పుడూ చెయ్యగలను అనుకున్నాడు, అయితే ఈసారి బెంగుళూరు పోలీసులు చాలా చురుకుగా వ్యవహరించారు. అతను తన వదినగార్లను హత్య చేసాడన్నది దాదాపు స్పష్టమైంది కానీ  బెంగుళూరు జిల్లా ఎస్‌.పి టి. జయప్రకాష్‌కి తను కేవలం ఒక మామూలు హంతకుడితో వ్యవహరించడం లేదని, నాగరాజ అంతకంటే ఎక్కువ నేరస్తుడని తోచింది.

దానితో వేణుగోపాల్‌, జయప్రకాష్‌, అనేకల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ కె.హెచ్‌. చంద్రశేఖర్‌లు బాగా ఆలోచించుకుని తాము జంట హత్యలని ఛేదించినట్లు వెంటనే ప్రకటించవద్దను కున్నారు. నాగరాజ సంగతి తేల్చాలనుకున్నారు. అతన్ని మూడు రోజులు ఇంటరాగేషన్‌ చేశారు. నవంబర్‌ ఆఖరికి తను ఇరవైకి పైగా హత్యలు చేసినట్లు అంగీకరించాడు. అయినాసరే వాళ్లు హడావిడిగా ఒక సైకోపత్‌ని పట్టుకున్నామని పత్రికలకు ప్రకటించలేదు. అతనిపై కేసు తయారు చేయడానికి మూడు నెలలు తీసుకున్నారు. ''మా అదష్టం కొద్దీ అతనికి మంచి జ్ఞాపకశక్తి వుంది'' అన్నారు జయప్రకాష్‌. నాగరాజ కూడా పోలీసులకు సహకరించాడు. తను ఎక్కడెక్కడ ఎవరెవరిని చంపిందీ ఆ స్థలాలను వారికి చూపించాడు.  ఎట్లా అమ్మాయిలను వలలో వేసుకున్నాడో, ఎట్లా చంపాడో కాస్త గర్వంగా కూడా చెప్పుకున్నాడు. ఆఖరికి మార్చి ఒకటిన పోలీసులు నాగరాజ అరెస్టును బయటికి చెప్పారు. (అన్ని రోజులు పోలీసు కస్టడీలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం కనుక అతన్ని ఫిబ్రవరి 20న అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు.)

పెద్ద సంచలనం అయింది. దక్షిణ భారతదేశంలో తాము ఛేదించలేకపోయిన అనేక కేసుల్లో ఇతనే హంతకుడై ఉండొచ్చని ఎక్కడెక్కడి ఊళ్ల నుంచో పోలీసులు ఆ కేసుల్ని బెంగుళూరు పోలీసులకు పంపారు. కొంతమంది అతని ఫోటో గుర్తు పట్టి కొన్ని హత్యల గురించిన వివరాలు అందచేసారు.

ప్రస్తుతం నాగరాజ తన జైలు గదిలో కేసు విచారణ కోసం ఎదురుచూస్తూ  మౌనంగా కూర్చుని ఉన్నాడు. అతనిలో పశ్చాత్తాపం లాంటిది ఏమీ కనపడదు. పచ్చి అబద్ధాలకోరు కనుక ప్రశ్నలడిగే వాళ్ళతో ఆడుకుంటాడు. ఒక్కొక్కసారి తను అమాయకుడినంటాడు. ఇంకోసారి రెండు హత్యలు మాత్రమే చేశాను, తక్కినవి చెయ్యలేదంటాడు. అట్లా సాగుతూ వుంటుంది. పోలీసులు అతను చేసిన హత్యల చిట్టా ఇంకా తయారుచేస్తూనే ఉన్నారు. ఆ సంఖ్య యాభై దాటితే ప్రపంచ ప్రసిద్ధ సైకోపత్‌ సీరియల్‌ కిల్లర్‌ జాబితాలోకి అతని పేరు ఎక్కుతుంది.

ఒక హంతకుడితో ముఖాముఖీ

నాగరాజ అరెస్టు వార్తను పోలీసులు బహిరంగంగా ప్రకటించగానే అతన్ని అందరికంటే ముందు జైల్లో కలిసింది 'సండే' పత్రికే. ఆ సైకోపత్‌ని ఫోటోలు తీసింది కూడా 'సండే' పత్రిక మాత్రమే.

నాగరాజ చూడ్డానికి చాలా వినయంగా కనిపిస్తాడు. కొంచెం అయోమయంగా, బెదురుగొడ్డులా కూడా కనిపిస్తాడు. రక్త దాహంతో అలమటించే ఉన్మాదిలా మాత్రం అస్సలు అనిపించడు. గళ్ళ లుంగీ, మాసిపోయిన పాలిస్టర్‌ షర్ట్‌ వేసుకుని వున్నాడు. ఒంటరి ఖైదు నుండి కుంటుకుంటూ వచ్చాడు. ఎంతోమంది గొంతులు నులిమిన అతని చేతులు అప్పుడు వినయంగా జోడించి వున్నాయి. కళ్ళు దయా బిక్షను కోరుతున్నాయి. బెంగుళూరు కేంద్ర కారాగారంలోని ఒక గదిలో ఒక మూల ముడుచుకుని కూర్చుని ''ఏం కావాలి మీకు నా నుండి?'' అని నమ్రతగా అడిగాడు.

ఫోటోగ్రాఫర్‌ కెమెరా బయటికి తీయగానే అతను తన బుగ్గ మీద ఉన్న చిన్న బ్యాండేజిని చూపించి తీసేయొచ్చా అని జైలర్‌ని అడిగాడు, ఫోటోలకు మంచి మంచి పోజులు ఇచ్చాడు. ''నన్ను గురించి పత్రికల్లో ఏం రాస్తున్నారో నాకు తెలుసు. అయితే నేనెవర్నీ చంపలేదు. నాకు ముగ్గురు చిన్న కూతురులున్నారు. అంతమంది ఆడవాళ్ళని చంపేటంత రాతి గుండెనా  నాది?'' అన్నాడు. నిజానికి రెండు సార్లు పెళ్లి చేసుకున్నా అతనికి పిల్లలు లేరు.
నాలుగు సంవత్సరాల కిందట  పెళ్ళయిన రెండు నెలలకే మొదటి భార్య మంజమ్మను వదిలేశాడు. కిందటి సంవత్సరం నవంబర్‌లో పద్దెనిమిదేళ్ళ హొన్నమ్మను పెళ్లి చేసుకున్న మూడు వారాలకే అరెస్ట్‌ అయ్యాడు (మంజమ్మకు కొడుకు పుట్టలేదని హొన్నమ్మను పెళ్లి చేసుకున్నానని పచ్చి అబద్ధం చెబుతాడు.)

''మంజు, పిల్లలు కూడా అనేకల్‌ పోలీస్‌స్టేషన్‌కి నన్ను చూడడానికి ప్రతిరోజూ వచ్చే వాళ్ళు. నాకు భోజనం తెచ్చేవాళ్ళు'' అని చాలా నమ్మకంగా చెబుతాడు. అసలు సంగతేమిటంటే మంజమ్మ ఒక్కసారి మాత్రమే అతన్ని చూడ్డానికి వెళ్ళింది. నాగరాజ అందర్నీ తేలిగ్గా నమ్మించగలడు. ''నేనెప్పుడూ ఎవర్నీ చంపలేదు. నేను చంపానని పోలీసులు చెప్పిన ఏ అమ్మాయినీ నేను చూడనైనా చూడలేదు'' అంటాడు చాలా అమాయకత్వం నటిస్తూ.

జరిగిన సంఘటనలను రకరకాలుగా అల్లి చెబుతాడు. ''నేను ఒక ఉంగరం తాకట్టు పెట్టడానికి చిక్‌పేట వచ్చాను. జయమ్మ, గౌరమ్మ కనపడడం లేదని మా మామగారు పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. అనేకల్‌ పోలీస్‌స్టేషన్‌లో జయమ్మను ఉంచినట్లు నాకు చెప్పారు. నేను హొన్నమ్మను తీసుకుని స్టేషన్‌కు వెళ్లాను. అక్కడ పోలీసులు నాకు చాలా డబ్బిస్తామని చెప్పారు. బాగా తాగించారు, ఎక్కడెక్కడో తిప్పారు. ఆడవాళ్ళందరినీ నేనే చంపానని బలవంతంగా చెప్పించారు'' అంటాడు.

''పోలీసులు నన్ను మూడు నెలల నాలుగు రోజులు స్టేషన్‌లో వుంచి ఇక్కడికి (సెంట్రల్‌ జైలుకి) తీసుకొచ్చారు అని చాలా జ్ఞాపకశక్తితో చెబుతాడు. మళ్ళీ వెంటనే ''పోలీసులు నన్నెప్పుడూ అరెస్ట్‌ చెయ్యలేదు.  నా అంతట నేనే స్టేషన్‌కు పోయాను'' అని మరో అబద్ధం ఆడతాడు. నిజానికి బెంగుళూరు శివార్లలోని కొత్తనూరులో బాగా తాగి వున్న నాగరాజను అరెస్ట్‌ చేసినప్పుడు తను పక్కనే వున్నానని హొన్నయ్య చెప్పాడు. ఇంటి తలుపు తీసిపెట్టి నాగరాజ, అతని భార్య హొన్నమ్మ గాఢనిద్రలో వున్నారని, పోలీసులు అతన్ని నిద్రలేపి కొట్టి స్టేషన్‌కి తీసుకుపోయారని చెప్పాడు

నాగరాజ అబద్ధాలాడడంలో బహు నేర్పరి. ఒకసారి చెప్పిన దానికీ మరొక సారి చెప్పిన దానికీ  పొంతనలేని విధంగా చెబుతాడు. అతని పదహారు పేజీల నేరాంగీకార పత్రంలో (ఆ అంగీకార పత్రాన్ని 'సండే' ప్రతినిధులు చూశారు.) ''జయమ్మ షంగుట్ట గౌరమ్మలను అనుభవించాలనుకున్నాడు. కాని నేను వాళ్ళను హొన్నమ్మతో పాటు తీసుకుపోయాను. షంగుట్ట మమ్మల్ని వెంటాడాడు. జయమ్మ, గౌరమ్మలను నేను పొలాల్లోకి తీసుకుపోగానే అతను వారిమీద దాడి చేసి అత్యాచారం చేశాడు. ఆ పైన ఇద్దర్నీ గొంతు నులిమి చంపేసాం'' అని చెప్పాడు.

జైల్లో 'సండే' పత్రికతో మాత్రం ''షంగుట్ట వాళ్ళిద్దర్నీ ఆటోలో తీసుకుపోయి చంపేసాడు. నింద నా మీద పడింది'' అన్నాడు. అతని నేరాంగీకార పత్రంలో ఆటో ప్రసక్తే లేదు. మరోసారి తనూ, తన స్నేహితుడు గోపాల్‌  బాగా తాగేసి వాళ్ళను చంపేసామని చెప్పాడు. రెండు హత్యలూ నాగరాజ ఒక్కడే చేసాడని-ఈ రెండే కాదు - మరో ఇరవై ఇద్దర్ని కూడా నాగరాజే హత్య చేసాడని పోలీసులు నమ్ముతున్నారు.

నువ్వు అమాయకుడివయితే నిన్ను ఈ హత్య కేసుల్లో ఎట్లా ఇరికించారు''  అని అడిగితే పారిపోయిన షంగుట్ట, గోపాల్‌లని తలుచుకుని  విలపిస్తాడు. 'షంగుట్ట, షంగుట్ట' అని కాసేపు ఏడ్చి తరువాత మౌనంగా వుండిపోయాడు. ఆ తరువాత ఎంత బ్రతిమిలాడినా, బెదిరించినా ఏమీ చెప్పలేదు. పదిహేను నిమిషాలు అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఇంక అతనేమీ చెప్పడని నిర్థారించుకున్నాక పోలీసులు అతన్ని లేచి  వెళ్ళిపొమ్మన్నారు. అతను గుమ్మం దాకా పోయి వెనక్కి తిరిగి ''నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇంకేం చెప్పను?'' అనేసి వెళ్లిపోయాడు.


('సండే' వారపత్రిక, 15-21 మార్చి 1992)

అనువాదం : పి. సత్యవతి

ఎడిటర్‌ నోట్‌ :
నాగరాజ 1993 నవంబర్‌లో పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. తరువాత సంవత్సరం ఫిబ్రవరి వరకూ పోలీసులకు దొరకలేదు. ఈ మధ్య కాలంలో మళ్ళీ అతను తన పాత వ్యూహాలనే ఆశ్రయించాడు. ఒక రహస్య నివాసం కోసమని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అత్తగారిని హత్య చేసి ఆమె  నగలు అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు.

1) 1960 లలో బొంబాయి ప్రజలను వణికించిన సీరియల్‌ కిల్లర్‌. మురికివాడల్లో నివసించే వాళ్లను, పేవ్‌మెంట్ల మీద పడుకున్న వాళ్ళను కొట్టి చంపేవాడు. ఇతని మీద అనురాగ్‌ కశ్యప్‌ 2016 లో ఒక సినిమా కూడా తీసాడు. 1995లో చనిపోయాడు.

2) బిల్లా (జస్బీర్‌ సింగ్‌), ఇతనికి తోడు రంగా (కుల్జీత్‌ సింగ్‌) అక్కతమ్ముళ్ళయిన ఇద్దరు టీనేజ్‌ పిల్లలు-గీతా, సంజయ్‌ చోప్రాలను కిడ్నాప్‌ చేసి చంపారు. 1982 లో వీరిద్దరినీ ఉరి తీసారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com



హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌