Friday, June 5, 2015

నల్లజాతి నిప్పుకణిక - రమాదేవి చేలూరు




నల్లజాతి నిప్పుకణిక  - సొజర్నర్‌ ట్రూత్‌

- రమాదేవి చేలూరు

ఓ శక్తిమంతమైన నల్లజాతి మహిళ జీవిత కథే ఈ పుస్తకం.

నల్లజాతిలో వికసించిన రత్నాలు - ముఖ్యంగా ఆఫ్రికన్‌ అమెరికన్ల జీవిత చరిత్రలు ఎంతటి గాఢమైన, ఆర్ద్రమైన మానవ అనుభవాలను ఈ ప్రపంచం ముందుంచాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వీరి జీవిత కథలు మనకొక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందించటమే కాదు, అడుగడుగునా ప్రతిఘటించే అసాధారణ పోరాట పటిమకు, మూర్తీభవించిన మానవతా స్ఫూర్తికి ప్రతీకలుగా కూడా నిలుస్తూ... అంతిమంగా అన్ని జాతుల మనసులనూ కదిలించి, అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తాయి. 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇప్పటికే ఇటువంటి శక్తిమంతమైన నల్లజాతి జీవిత కథలను కొన్నింటిని తెలుగు పాఠకుల ముందుకు తెచ్చింది. 

అలెక్స్‌ హేలీ రాసిన రూట్స్‌ (ఏడుతరాలు, 1980) తో ఆరంభించి,  
ఆ తర్వాత రిచర్డ్‌ రైట్‌ ఆత్మకథ బ్లాక్‌ బాయ్‌ (రేపటికల, 2004),  
మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జీవిత చరిత్ర (ఆయుధం పట్టని యోధుడు, 2008),  
మాల్కం ఎక్స్‌ జీవిత చరిత్ర (అసుర సంథ్య, 2006) ఇలాంటివే. 

ఈ పరంపరకు మరో ముఖ్యమైన చేర్పు ఈ సొజర్నర్‌ ట్రూత్‌ జీవిత కథ.

పంధొమ్మిదో శతాబ్దపు తొలినాళ్లలో నల్లజాతిలో, అందునా మహిళగా పుట్టటమే పెద్ద ప్రతికూలత అయితే ఇక సొజర్నర్‌ ట్రూత్‌ వాటికి తోడు బానిస వ్యవస్థలో, ఒక నిరక్షరాస్యురాలిగా కూడా ఘోరమైన వివక్షలను ఎదుర్కొంది. అయినా ఆమె ఎక్కడా తల వంచలేదు. నిప్పు కణికలా రగిలిపోతూ వివక్ష అనేది ఏ రూపంలో, ఎట్నుంచి ఎదురైనా దాన్ని బద్దలు కొట్టేందుకే పోరాడింది. అందుకే ఇప్పుడామె దాస్య శృంఖలాలను బద్దలుకొట్టిన 'విముక్తి ఉద్యమ' నేతగా, మహిళల హక్కుల గురించి ఎలుగెత్తిన తొలితరం ఉద్యమకారిణిగా చరిత్రకెక్కింది. ఆమె యుద్ధం బానిసత్వ నిర్మూలనకే పరిమితం కాలేదు. జైళ్ల సంస్కరణల నుంచి స్త్రీలకు ఆస్తి హక్కు, ఓటు హక్కుల వరకూ ఎంతో విస్తృతంగా సాగింది.

ముక్కుసూటిగా మాట్లాడే సొజర్నర్‌ ట్రూత్‌ నల్లజాతి మహిళలకే కాదు, మొత్తం మహిళా సమాజానికే ఒక బలమైన ప్రతీకగా అవతరించింది.
 
బానిసల కుటుంబంలో పుట్టి ఇసబెల్లా పేరుతో ఇళ్లలో పనిమనిషిగా జీవితాన్ని మొదలుపెట్టిన ఆమె తన జీవిత కాలంలోనే ఒక మహాత్మురాలిగా గుర్తింపునందుకుందంటే ఈ ప్రస్థానం ఎంతటి అసాధారణమైనదో, ఆమె జీవితం ఎంత సంక్లిష్టంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.   

బానిసలంటే పురుషులేనన్న భావనలను బద్దలుకొట్టి... నల్లజాతిలో మహిళలూ ఉన్నారు, మహిళల్లో నల్లజాతివారున్నారు, వారు రెట్టింపు వివక్షలను ఎదుర్కొంటున్నారన్నవాస్తవాన్ని ఆమె ప్రతిభావంతంగా ప్రపంచం ముందుకు తెచ్చింది. 

నల్లజాతివారిని, మహిళలను నీచంగా, అథములుగా చూస్తున్నరోజుల్లో... ప్రతికూలతలకు ఎదురొడ్డి ఏకకాలంలో ఆమె బానిసల విముక్తి కోసం, మహిళల హక్కుల కోసం మొక్కవోని పోరాటం సాగించింది. విముక్తి పొందిన బానిసల పునరావాసం కోసం కృషి చేస్తూ 1864-1867 మధ్య ఆమె వాషింగ్టన్‌లో గడిపింది. గుర్రపు బగ్గీల్లో ఎలాంటి జాతివివక్షా తగదంటూ 1865లో చట్టం వచ్చినా నల్లవారెవరూ రోడ్డు మీదకు రావటానికి సాహసించని రోజుల్లో ఆ సాహసం ట్రూత్‌ చేసింది. తనను కిందకు తోసేయబోయిన కండక్టర్‌ను ప్రతిఘటించటమే కాదు... అరెస్టు చేయించి, శిక్ష పడే వరకూ పోరాడింది. నిరక్షరాస్యురాలై ఉండి కూడా బానిస బంధనాల్లో చిక్కుకున్న తన కుమారుడి విముక్తి కోసం అసాధారణ న్యాయపోరాటం చేసిందామె.

ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన ఆమె తరచుగా ''నాకు పుస్తకాలు చదవటం రాదు... కానీ మనుషులను చదివే విద్య తెలుసు'' అనేది. చదవటం, రాయటం రాకపోయినా ఆమె తన జీవిత అనుభవాలను గుదిగుచ్చి 1850లో ప్రచురించిన 'నెరేటివ్‌' ఆమె జీవిత కాలంలోనే ఐదు పునర్ముద్రణలు పొందింది. నేటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా విరివిగా అమ్ముడుపోతూనే ఉంది. 

నేడు ట్రూత్‌ అంటే... స్త్రీవాదులకూ, ఆఫ్రికన్‌ అమెరికన్లకూ కూడా ఒక శక్తిమంతమైన చిహ్నం! 1900లలో ప్రధానంగా స్త్రీ వాదిగా వెలుగులోకి వచ్చిన ఆమె 1910 కల్లా నల్లజాతి సమాన హక్కుల ఉద్యమకారిణిగా, 1940ల నాటికి అత్యంత ప్రభావవంతమైన ఆఫ్రికన్‌ అమెరికన్‌గా గుర్తింపులోకి వచ్చింది. 1990ల నాటికి విమర్శకులంతా ఆమెను అమెరికా రాజకీయ చరిత్రలో కీలకమైన వ్యక్తిగా పేర్కొనటం ఆరంభించారు. ఆధునిక రాజకీయ సంస్కరణలన్నింటి పైనా ఆమె ముద్ర చాలా బలంగా ఉంది.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రూత్‌ జీవితాన్ని కథలుకథలుగా చెప్పు కొంటున్నారన్నా...  ఆమె జీవితంపై పాటలు, సినిమాలు, నాటకాలు, పిల్లల పుస్తకాలు, పాఠ్యాంశాలు అసంఖ్యాకంగా ప్రాచుర్యంలో ఉన్నాయన్నా అందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. ఈ నిప్పు కణిక పంచిన వెలుగు దివ్వెలను తెలుగు పాఠకులూ అందుకుంటారని ఆశిస్తున్నాం.
(ముందుమాట )





               
పుస్తక రచయిత్రి మాట :

మేము 2001వ సంవత్సరంలో షికాగోలో వున్నప్పుడు, అక్కడ లైబ్రరీలో ఆఫ్రికన్‌ అమెరికన్‌ స్త్రీ జీవిత చరిత్ర చదివాను. అది ఎంతో ఆసక్తిగా వుంది. చదివాక నాకనిపించింది ఈ కథని తెలుగు పాఠకులకందిస్తే బాగుంటుందని. అప్పట్నుంచి వివిధ పుస్తకాలు చదివాక, మిత్రుల ప్రోత్సాహంతో రాయగల్గాను ఈ 'స్వేచ్ఛాగానా'న్ని.

19వ శతాబ్ది ఆరంభంలో అమెరికా గడ్డపైన 'బానిసత్వం' వికృత రూపంలో ప్రబలి, నల్లజాతీయుల లక్షల కుటుంబాల్ని విచ్ఛిన్నం చేసి, వాళ్ళ ప్రాణాల్నిపీల్చి పిప్పి చేసి, పసికందుల్ని సైతం తల్లిదండ్రుల ఒళ్ళోనుంచి లాక్కొని వేలంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్న కాలంలో, మోసం ద్వేషం తెలీని అమాయకమైన ఒక చిన్నారిపాప, కుటుంబం నుంచి దూరమై ఒంటరిగా విలపించి, స్వేచ్ఛకోసం కుటుంబంకోసం తపించి, శ్రమించి, తుదకు బానిస సంకెళ్ళని తెంచుకొని బయటపడింది. అంతటితో తృప్తిచెందక, తన తోటి బానిసల విముక్తి కోసం ఉద్యమించింది.

నిరక్షరాస్యురాలైన ఆ స్త్రీ, ఆఫ్రికన్‌ అమెరికన్‌ జాతీయుల హక్కులకోసం, సమానత్వం కోసం, భూమికోసం, స్వేచ్ఛాజీవనం కోసం స్వేచ్ఛానినాదంతో, దృఢదీక్షతో, అలుపెరుగని శక్తివంతమైన వ్యక్తిగా, స్త్రీ వాదుల్లో మొదటి తరానికి చెందిన వ్యక్తిగా, బానిసోద్యమకారిణిగా ఎదిగిన కథే ఇది.
 
 -రమాదేవి చేలూరు


నల్లజాతి నిప్పుకణిక  - సొజర్నర్‌ ట్రూత్‌

- రమాదేవి చేలూరు

 ధర : రూ. 100/-
మొదటి ముద్రణ : డిసెంబర్ 2003 ; మహిళా మార్గం ప్రచురణలు, హైదరాబాద్
హెచ్ బి టి తొలి ముద్రణ : జూన్ 2015 


పతులకు, వివరాలకు:  
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006


ఫోన్‌ : 040 23521849  

ఇ మెయిల్ ఐ డి : hyderabadbooktrust@gmail.com 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌