భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం -
- దామోదర్ ధర్మానంద్ కోసంబి
ఇది ఎన్నో రకాలుగా కొత్త శకానికి నాంది పలికిన రచన. దాదాపు ప్రతి పేజీలోనూ మనకు సరికొత్త మౌలిక ప్రతిపాదనలు, స్వతంత్ర ఆలోచనలు కనబడతాయి. ... ఇది ఒక స్ఫూర్తిమంతమైన రచన. ... ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులను ఉత్తేజపరిచి, వారిలో ఆలోచనలను పురికొల్పిందిది.
- ఎ.ఎల్.బాషామ్
చరిత్ర అధ్యయనంలో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు కోసంబి. ఆధునిక గణితశాస్త్ర సూత్రాలను అన్వయిస్తూ, నాణాల బరువును బట్టి అవి ఎంతకాలంగా చలామణిలో ఉన్నాయో నిర్ధారించడమే కాదు - ఆయా కాలాలకు సంబంధించిన వివరాలను రాబట్టే దారి చూపారు.
- జె.డి.చెర్నాల్
కోసంబి అనుసరించిన విశ్లేషణా పద్ధతుల్లో చాలా భాగం - యాభై ఏళ్ల తర్వాత, ఇప్పటికీ అంతే ప్రభావవంతంగా, అంతే ఆమోదయోగ్యంగా ఉన్నాయి. మిగిలిన ఆ కొద్ది భాగం విషయంలో కూడా పునరాలోచన అవసరమవుతోందంటే అది - కొత్త ఆధారాలు వెలుగులోకి రావడం వల్లనో, సరికొత్త వివరణా సిద్దాంతాల వల్లనో, లేక గతాన్ని గురించిన మన దృక్పథాల్లో మార్పు రావడం వల్లనో తప్పించి మరేమీ కాదు. కోసంబి రచనలను మళ్లీ మళ్లీ చదవడం అవసరం. చదివిన ప్రతిసారీ సంభ్రమానికి గురిచేస్తూ మనల్ని మరింత చారిత్రకంగా ఆలోచించేలా ప్రేరేపించడం వాటి విశిష్టత.
- రొమిలా థాపర్
ఆనాటికి అందుబాటులో వున్న ఆధారాలకు లోబడడం అనే పరిమితి చరిత్ర రచనలన్నింటికి లాగానే కోసంబి రచనలకు కూడా వుంది. అయితే అప్పటివరకూ ఎవరూ అడగని ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. ప్రారంభకుడు ఆయనే గనుక ఆయన ప్రతిపాదించిన సమాధానాలను తప్పనిసరిగా పరీక్షించాల్సిందే. ఈ పుస్తకమే అంతిమం అని ఆయన కూడా అనుకోలేదు. కాకపోతే - తన తర్వాత చరిత్ర రచన అనేది విభిన్నంగా ఉండక తప్పని పరిస్థితి కల్పించారాయన
- ఇర్ఫాన్ హబీబ్
... ... ...
మనిషి కేవలం రొట్టెతో మాత్రమే జీవించడనీ, చరిత్రా సమాజమూ రెండూ కూడా శాశ్వతమైన ఆత్మ మీద వ్యక్తి సాధించే నియంత్రణ మీదనే ఆధారపడతాయనీ, భౌతికవాదం మానవ విలువలన్నింటినీ ధ్వంసం చేస్తుందనీ కొందరు నొక్కి చెబుతుంటారు.
దురదృష్టవశాత్తూ రొట్టెనో, అటువంటి మరొక పదార్థమో లేకుండా మనిషి మనుగడ సాగించలేడు.
దేహం లోపల ఆత్మ అనేటటువంటిదాన్ని ఆ వ్యక్తి ఉంచుకోగలగాలన్నా కూడా రొట్టె అవసరమే.
మానవ జీవుల సమూహం ఒక సమాజంగా మారాలంటే, ఆ మనుషులు ఏదో ఒకరకమైన పరస్పర సంబంధాలలోకి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.
ఆ అత్యవసరమైన సంబంధం రక్తబంధుత్వం కాదు, దానికన్న విస్తృతమైనది. అది సరుకుల ఉత్పత్తిలో, వాటి పరస్పర వినిమయంలో రూపొందుతుంది.
వస్తువులను సేకరించడం గానీ, ఉత్పత్తి చేయడం గానీ ఎవరు చేస్తారు, ఏ సాధనాలతో చేస్తారు,
ఎవరు ఇతరులు చేసిన ఉత్పత్తిని ఆరగించి బతుకుతారు,ఆ హక్కు వాళ్లకు ఎలా వస్తుంది, దైవికంగానా, చట్టబద్దంగానా (ఎందుకంటే పూజా విధానాలూ చట్టాలూ కూడా సామాజిక ఉప ఉత్పత్తులే)పనిముట్ల మీద, భూమి మీద, కొన్నిసార్లు ఉత్పత్తిదారు శరీరంమీద, ఆత్మమీద కూడా యాజమాన్యం ఎవరిది, మిగులను ఎలా పంచాలో, సరఫరా ఎంత ఉండాలో, ఏ రూపంలో ఉండాలోఎవరు నిర్ణయిస్తారు వంటి ప్రశ్నలలో ఏవి అత్యవసరమని అనుకుంటుందనే దానిమీదనే ఒక ప్రత్యేక సమాజపు స్వభావం నిర్ణయమవుతుంది.
ఉత్పత్తి బంధాలతోనే సమాజం కలసికట్టుగా వుంటుంది. భౌతికవాదం మానవ విలువలను విధ్వంసం చేయదు సరికదా దానికి భిన్నంగా ఆ మానవ విలువలు సమకాలీన సామాజిక పరిస్థితులతో, ప్రబలంగా వున్న విలువ భావనతో ఎలా ముడిబడి వున్నాయో చూపుతుంది.
విలువ భావన లాగానే భాష కూడా భావాల వినిమయానికి దారితీసిన భౌతిక వినిమయ సంబంధాల నుంచే తలెత్తింది. నిజానికి ఆ భాష లేకపోతే భావవాది కనీసం తన ఆత్మ గురించి ఊహించడం కూడా సాధ్యం కాదు.
ఒక తాత్విక దృక్పథం గల వ్యక్తి ఈ ఎడ్ల బళ్ల దేశంలో రెండువేల సంవత్సరాల కింద రూపొందిన 'శాశ్వత' భావజాలాలతో తన మనసుకు నచ్చినట్టుగా ఈ యాంత్రిక ప్రపంచాన్ని తిరిగి తయారుచేయలేడు.
- డి.డి.కోసంబి
(మొదటి కూర్పు ముందుమాట నుంచి)
..... ..... .....
కోసంబి రచనల ప్రభావం తెలుగు మేధో ప్రపంచం మీద గత ఆరు దశాబ్దాలుగా విస్తృత,గానే వున్నప్పటికీ, ఆయన రచనలలో ప్రధానమైన ఈ పుస్తకం ఇంతవరకూ తెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మొత్తంగా కోసంబి భారత చరిత్ర రచనలో ప్రవేశపెట్టిన కొత్తచూపును పరిచయం చేస్తూ కె. బాలగోపాల్ 'భారత చరిత్ర - డి డి కోశాంబి పరిచయం' (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1986) అనే స్వతంత్ర గ్రంథం రాశారు. దానికన్నా ముందే కోసంబి రచనలలో 'భగవద్గీత - చారిత్రక పరిణామం' ఒక్క వ్యాసమే ఒక పుస్తకంగా (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1985) వెలువడింది.
ఆ తర్వాత కోసంబి వ్యాసాల సంపుటాలు రెండు - 'భారత చరిత్ర పరిచయ వ్యాసాలు' (అనువాదం హెచ్‌ఆర్‌కె, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1986), 'ఆచరణలో గతితర్కం' (ఎగ్జాస్పరేటింగ్ ఎస్సేస్‌కు గొర్రెపాటి మాధవరావు అనువాదం, జంపాల చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ప్రచురణ, 1991) వెలువడ్డాయి.
తర్వాత 'ప్రాచీన భారతదేశ సంస్కృతి, నాగరికత' (కల్చర్ అండ్ సివిలైజేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా' కు ఆర్. వెంకటేశ్వరరావు అనువాదం, తెలుగు అకాడమీ ప్రచురణ, 1998) కూడా తెలుగులోకి వచ్చింది. ఈ మధ్యలో కోసంబి శతజయంతి కూడా రావడంతో ఇంగ్లీషులో ఆయన గురించీ, ఆయన కృషి గురించీ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు వెలువడ్డాయి.
నిజానికి ఇతర పుస్తకాలకన్నా, వ్యాసాలకన్నా ''యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ'' పుస్తకంలోనే కోసంబి ఆలోచనలు లోతుగా, విస్తృతంగా పరిచయం అవుతాయి. ఈ పుస్తకం దాదాపు మూడువేల సంవత్సరాల భారత చరిత్రమీద స్థూల అవగాహన ఇవ్వడం మత్రమే కాదు, ఎన్నెన్నో కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది గనుక ఇది ఎప్పుడో తెలుగులోకి రావలసి వుండింది. ఎందువల్లనో గతంలో జరిగిన ప్రయత్నలు ఫలించక, చివరికి ఇది నా కోసం మిగిలిపోయింది.
- ఎన్. వేణుగోపాల్
(అనువాదకుడి మాట నుంచి)
... ... ...
భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం -
- దామోదర్ ధర్మానంద్ కోసంబి
ఆంగ్ల మూలం : An Introduction to the Study of Indian History, D.D.Kosambi
తెలుగు అనువాదం : ఎన్. వేణుగోపాల్
488 పేజీలు, ధర: రూ. 250/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500 006
ఫోన్ : 040 23521849