Monday, February 18, 2013

సారంలోనూ ప్రేమ్‌చందే! - వి. అరవింద్, ఆదివారం ఆంధ్ర జ్యోతి



సారంలోనూ ప్రేమ్‌చందే! -

"ఆ పిల్లవాడు తిరణాలకు వెళ్ళాడు. కంటిని ఆకర్షించే ఎన్నో ఆటవస్తువులు, బొమ్మలు అక్కడ ఉన్నాయి. నోరూరించే తినుబండారాల అంగళ్ళకు కొదవ లేదు. కానీ, వాటికన్నా రోజూ రొట్టెలు చేయడానికి తల్లి పడుతున్న అవస్థే ఆ పిల్లవాడి మనసులో ముద్రేసుకుంది. కాల్చిన రొట్టెను దించేందుకు పళ్ళకర్ర లేక చేతులు కాల్చుకుంటున్న తల్లే ఆ సమయంలో గుర్తుకు వచ్చింది. దీంతో తన దగ్గరున్న డబ్బులతో ఒక పళ్ళకర్ర కొని ఇంటికి తీసుకెళతాడు.'' ప్రచురణ సంస్థ గానీ ఫలానా రచనని గానీ అంతగా గుర్తులేని ప్రేమ్‌చంద్ కథ ఇది.

ఈ కథలో పిల్లాడిలాగే, జీవితమంతా చాలా బాధ్యతగా, ఇతరుల అవసరాలు తీర్చడంలోనే తన సంతృప్తిని వెతుక్కున్నాడు ప్రేమ్‌చంద్. ఆయన సహచరి శివరాణీదేవి రాసిన 'ఇంట్లో ప్రేమ్‌చంద్' (అనువాదం : ఆర్. శాంతసుందరి) చదివితే ఈ విషయం తెలుస్తుంది. ప్రముఖుల ప్రైవేట్ జీవితాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని తీర్చడమే కాదు, వారి కళా, రాజకీయ వ్యక్తిత్వాలు వికసించే చారిత్రక, సామాజిక ఉద్యమ సందర్భాన్ని కూడా ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ముఖ్యంగా, తల్లి ప్రేమకు ముఖం వాచిపోయిన ప్రేమ్‌చంద్... ప్రతి స్త్రీ నుంచి ఆ లోటు తీర్చుకునేందుకు ఆరాటపడ్డాడు.

భార్యాభర్తల మధ్య గాఢంగా అల్లుకోవాల్సిన ప్రజాస్వామిక సంబంధాలను ఈ క్రమంలోనే ఆయన గుర్తించి గౌరవించాడనేందుకు శివరాణీదేవి-ప్రేమ్‌చంద్‌ల సంభాషణలే రుజువు. ఈ సంభాషణ తరచూ పాత వాసనలు వేయడం, సంప్రదాయ, దైవిక శక్తుల ప్రస్తావనతోనే ప్రేమ్‌చంద్ సైతం తన వాదనను నెగ్గించుకోవడం చూస్తాం. గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి కోసం పోరాడుతున్న రైతాంగంతో ఉండి రచనలు చేసినవాడు కాబట్టి, చివరి వరకు ప్రేమ్‌చంద్‌లో సంప్రదాయ భావనలు నిలిచే ఉన్నాయి. దీన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముఖ్యమైన పరిశీలన... జాతీయోద్యమం, సోవియట్ విజయాలతో రెక్కవిప్పిన అభ్యుదయ ఉద్యమం సైతం అప్పటికి పూర్తిగా కుబుసం విడవలేదనేది. ఈ అభ్యుదయ ఉద్యమానికి కళా, సాహిత్య రంగాల్లో సారథ్యం వహించినవాడు ప్రేమ్‌చంద్ అనేది ఇక్కడ గమనార్హం. ప్రేమ్‌చంద్ స్మరణకే పూర్తిగా ఈ పుస్తకం అంకితం కాకపోవడం మరో విశేషం.

జాతీయోద్యమంతో మమేకమైన బలమైన రాజకీయ వ్యక్తిత్వం గల ఆధునిక యువతిని శివరాణీదేవిలో మనం చూస్తాం. ఇండియన్ గోర్కీగా పిలవబడే ప్రేమ్‌చంద్ చివరి రచన, చివరి స్మారక ఉపన్యాసం (1936) కూడా గోర్కీపైనే కావడం, మాగ్జిమ్ గోర్కీ మరణించిన రెండు నెలల్లోపే ఆయనా మరణించడం గుర్తుండిపోయే విషయాలు. అయితే ప్రేమ్‌చంద్ జీవన, రచనా సారాన్ని పట్టుకోలేకపోవడం, ఆయన ఉర్దూలో మానేసి హిందీ భాషలో రచనలు చేయడమనే ఒక గుణాత్మక పరిణామానికి ప్రేరణగా నిలిచినదేమిటనేది తెలియజెప్పకపోవడం ఈ పుస్తకం పరిమితే.

- వి. అరవింద్
(ఆదివారం ఆంధ్ర జ్యోతి 17 -2 -2013)

ఇంట్లో ప్రేమ్‌చంద్ - శివరాణీదేవి
అనువాదం : ఆర్. శాంతసుందరి
పేజీలు : 274, వెల : రూ. 120
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

Wednesday, February 6, 2013

తిరగబడ్డ తెలంగాణా పై పుస్తకం డాట్ నెట్ లో అసూర్యం పశ్య సమీక్ష

కొంతకాలం క్రితం ఆర్.నారాయణమూర్తి గారి “వీర తెలంగాణ” చిత్రం చూశాక తెలంగాణా సాయుధ పోరాటం సంఘటనలు నన్ను వెంటాడాయి. అప్పట్లో బైరంపల్లి ఘటన పై రాసిన ఒక చిరుపుస్తకమూ (ఈ పుస్తకం ఒకప్పుడు ఇక్కడ ఆన్లైన్లో ఉచితంగా చదువుకునేందుకు ఉండేది. ఇప్పుడు లేదుమరి! ఇక్కడ జరిగిన మారణహోమాన్ని జలియన్వాలాబాఘ్ ఉదంతంతో పోలుస్తారు.), ఈ సాయుధ పోరాటం గురించి పుచ్చలపల్లి సుందరయ్య రాసిన పుస్తకమూ -రెంటినీ పైపైన తిరగేసినా కూడా, ముందుకు సాగలేదు నా చదువు. ఈ నేపథ్యంలో మొన్నామధ్య హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారిని కలిసినప్పుడు ఈ పుస్తకం గురించి తెలిసింది. ఒక చరిత్ర పరిశోధకుడు రాసిన థీసిస్ అనగానే భయం వేసింది. ఇది నాకర్థం కాదులే అనుకుంటూ ఉన్నా, స్ట్రాంగ్ రికమెందేషన్ మూలాన చదవడం మొదలుపెట్టాను.
తెలంగాణ సాయుధ పోరాటంపై రచయిత రాసిన పీ.హెచ్.డీ థీసిస్ కు ఒక కొనసాగింపులా సాగిన పరిశోధనకు తెలుగు అనువాదం ఈ పుస్తకం. నల్గొండ, వరంగల్ జిల్లాలలో ఉద్యమం మొదలై, కొనసాగిన తీరును ఆవిష్కరించడం ఈ పుస్తకం లక్ష్యం (ఇప్పటి ఖమ్మం జిల్లా అప్పటి వరంగల్ జిల్లాలో భాగం). చారిత్రక, సామాజిక నేపథ్యాలను వివరించడంతో మొదలుపెట్టి, 1948 దాకా వచ్చి ముగుస్తుంది ఈ పుస్తకం. సాధారణంగా ఈ సాయుధ పోరాటం గురించి వివరించే రచనలన్నీ కమ్యూనిస్టు పార్టీ దృక్పథం నుండి, పార్టీని కేంద్రంగా చేసుకుని సాగిన రచనలు (ఈ ముక్కనేను కాదు అంటున్నది. పుస్తకంలో కూడా రాసారు. ఈ విషయమై నేను ఏదన్నా తెలుసుకోజూసిన ప్రతిసారీ కమ్యూనిస్టుల రచనలే నాకు కనబడ్డాయి అన్నది వేరే విషయం!). అయితే, ఈ రచనలో 1940ల నాటి తెలంగాణా పోరాటాల్లో ప్రజల భాగాన్ని అధ్యయనం చేయడం ముఖ్య లక్ష్యమని రచయిత ఉపోద్ఘాతంలోనే స్పష్టం చేశారు. పుస్తకం కవర్ పేజీ – “మా భూమి” అన్న చిత్రం లోనిదట. వ్యక్తిగతంగా ఈ సినిమాలో అసలు కథ కన్నా కమ్యూనిస్టు ప్రాపగండా ఎక్కువని నాకు అనిపించింది ఆ మధ్య ఈ సినిమా చూసినప్పుడు. మరి ముఖచిత్రంగా దాన్ని పెట్టారేం? అనుకున్నాను.
***
పుస్తకంలో ఎనిమిది ప్రధాన అధ్యాయాలు (ముందుమాట, అనుబంధాలు కాక). వీటిలో మొదటి రెండు అధ్యాయాలు ఉద్యమానికి వెనుక చారిత్రక నేపథ్యం, ఉద్యమానికి దారితీసిన భూస్వామ్య పరిస్థితులు, “దొర” దొర గా తయారైన వైనాన్ని విశ్లేషిస్తాయి. తరువాత రెండు అధ్యాయాలు “చిల్లరోళ్ళు” అని పిలువబడే వృత్తి కులాల వారు, రైతులూ ఈ దొరలపై తిరుగుబాట్లు చేయడాన్ని గురించి విశ్లేషిస్తాయి. తక్కిన అధ్యాయాల్లో ఆంధ్రమహాసభ/కమ్యూనిస్టు పార్టీ వీళ్ళని సంఘటిత పరచడం, నిజాం/దొర లకు వ్యతిరేక సాయుధ పోరాటం, కొన్ని ప్రాంతాల్లో సంఘం రాజ్యం ఉండడం – ఈ క్రమాన్ని వివరిస్తూ, విశ్లేషిస్తూ 1948లో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని తన పరిధిలో విలీనం చేసుకోవడం దగ్గర ఆపేస్తారు రచయిత. మొదటి రెండు అధ్యాయాలు మినహాయిస్తే, తక్కినవన్నీ తేలిగ్గా అర్థమయ్యే భాషలో ఉన్నాయి........ ....

పూర్తి సమీక్ష ... ఇక్కడ ... చదవండి.
http://pustakam.net/?p=13658

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌