Sunday, April 29, 2012

"మా యాత్ర " పై డా. అమ్మంగి వేణుగోపాల్ సమీక్ష : "మన యాత్ర !"

‘ఊరువాడ బతుకు’ సజీవ నవలతో సాహిత్యలోకంలో స్థానం సంపాదించిన దేవులపల్లి కృష్ణమూర్తి బహుశా తెలంగాణ మాండలికంలో రాసిన తొలి యాత్రాచరిత్ర ‘మా యాత్ర’.

ఇది స్థూలంగా రెండు కాలాలలో నడిచే యాత్ర. ఒకటి 1960 ప్రాంతం నుంచి మొదలయ్యే గతం కాగా,  రెండోది 2011 నాటి వర్తమానం.

ఈ గ్రంథంలో డెబ్బయ్యేళ్ళ రచయిత తన బాల్య యౌవనాలను సమీక్షించుకునే ప్రయత్నం చేస్తాడు.
ఇది ఒక రకంగా బతుకు తవ్వకం పని.
చిన్నప్పటి తన సహాధ్యాయి, కొన్నాళ్ళు కలిసి పనిచేసిన సహోద్యోగి, ఏదో ఒక ఘట్టంలో పరిచయమై మరి కనిపించకుండా పోయిన వ్యక్తి-వీళ్ళ వర్తమాన స్థితిగతులు కూడా రచయిత యాత్రలో పాలుపంచుకుని గ్రంథాన్ని జీవిత యాత్రగా మలుస్తాయి.

వీటన్నిటి మూలంగా ఈ పుస్తకానికి యాత్రా కోణంతో పాటు మానవీయ కోణం కూడా అమరడం విశేషం.

కాగా, నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో మినీ బస్సులో ప్రారంభమైన రచయిత ‘యాత్ర’ బాసర, అజంతా, ఎల్లోర, అజ్మీర్ దర్గా, జైపూర్, ఢిల్లీ, కాశీ, కోలకతా, కోణార్క్ వంటి ప్రాంతాలను విశేషంగా దర్శించి కోస్తాంధ్ర మీదుగా తిరిగి నకిరేకల్ చేరుకొని భూమి గుండ్రంగా ఉందని నిరూపిస్తుంది.

బాసర గురించి చెప్తున్నప్పుడు కాశ్మీర్‌లోని వాగ్దేవి ఆలయ ప్రస్తావన వస్తుంది. ఎల్లోరాలో శిల్పకళలు అద్భుతం అనిపించే కైలాస నాథాలయం వివరాలు, అజంతాలోని పద్మపాణి చిత్రానికున్న అంతర్జాతీయ ఖ్యాతి ప్రస్తావనలు ఉంటాయి. తాజ్‌మహల్ నిర్మాణ విశేషాలు, ఢిల్లీ ఎర్రకోట ప్రాశస్త్యం కథనాలు కళ్ళకు కట్టినట్లుంటాయి. గంగానది ఒడ్డున ఉన్న పుణ్యక్షేవూతాల కథనం మరో ప్రత్యేక ఆకర్షణ.

అయితే, రచయిత 40, 50 సంవత్సరాల క్రితపు వ్యక్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం- అడిగిన వారిని, చెప్పేవారిని కూడా గతంలోకి ప్రయాణం చేయించే విధానం పాఠకుడిని కట్టి పడేస్తుంది. ఒకరని కాదు, యల్లయ్య అనే వ్యక్తి రెవెన్యూ శాఖలో పనిచేసి, ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం కోల్పోయి, షుగర్ మూలంగా కాలు పోగొట్టుకొని అవిటి వాడవుతాడు.

అదనపు కట్నం కోసం భర్త పెట్టే బాధలు భరించలేక పురుగుల మందు తాగి చనిపోయిన టూరిస్ట్ బస్సు డ్రైవర్ కూతురుదీ కన్నీరు పెట్టించే గాథ. పిల్లలు జీవితంలో స్థిరపడక ముందే పక్షవాతంతో చనిపోయిన
లక్ష్మీనారాయణ జీవిత కథ దయనీయం

అయితే, అదే యాత్రా బస్సులో ప్రయాణిస్తున్న భర్త పోయిన లలితకు, భార్యలేని సూర్యంకి పెళ్ళి చేయాలనే సహ యాత్రికుల సంకల్పం యాత్రకు నిండుతనాన్నిస్తుంది.

నవల ముగింపులో యాత్ర బస్సు ఆవుకు యాక్సిడెంట్ చేయటం, తప్పించుకునే యత్నంలో ఛేజింగ్ సన్నివేశం, చివరలో మూడు వేల రూపాయలతో బయట పడటం వంటి వాటి వల్ల ఈ గ్రంథానికి కాల్పనిక నవలా ధోరణి కూడా సమకూరింది. కాగా, రచయిత ప్రస్తావించినట్లు, చెన్నైలో ‘చోళమండల్ ఆర్టిస్ట్ విలేజ్’ ఉన్నట్టుగానే హైదరాబాద్‌లో చిత్రకారుల కోసం ఎప్పుడో ఒకప్పుడు అది సాకారం అవుతుందనే ఆశిద్దాం.

‘మా యాత్ర’
రచయిత: దేవులపల్లి కృష్ణమూర్తి

పేజీలు: 112, ధర: రూ. 60/-

ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 5, బాలాజీ నగర్,
గుడి మల్కాపూర్, హైదరాబాద్- 500067

రచయిత మొబైల్: 92900 94015

~ డా॥ అమ్మంగి వేణుగోపాల్


( నమస్తే తెలంగాణా "బతుకమ్మ" 29 4 2012 సౌజన్యం తో  )



.

Sunday, April 22, 2012

ఓహో యాత్రికుడా ... యాత్రికుడా ... !

ఓహో యాత్రికుడా ... యాత్రికుడా ... !

...
రచన ఒక విధంగా సంగీతం వంటిదే కదా.
శృతిలయలున్న గొంతు ముచ్చటగా పాడుతోంటే చెవులు పరవశించిపోతాయి.
పాట దేని గురించి అన్నది తరువాతి సంగతి.
వ్యాసం గానీ, కథ గానీ చక్కగా రాయాలేగానీ వాక్యాలు పాటల్లా మనలో అంతర్మథనాన్ని నింపిపెట్టవా ఏం?
ఇవాళ నిజానికి ఈ పరిస్థితి ఇంత అనుకున్నంతగా లేదు.
నాటి గ్రాంథికం నేడు లేదుగానీ దినపత్రికల భాష ఒకటి వచ్చి పడింది ప్రాణం తియ్యడానికి.
కథలోనూ వ్యాసంలోనూ అదే పాత్రికేయ భాష చొరబడి చిరాకెత్తిస్తే పాపం పాఠక నిర్భాగ్యుడేమయిపోవాలి?
మరి ఇవాళ చాలా వరకు కథల్లో, నవలల్లో ఈ చొరబాటే కనిపించడంతో రచయిత గారి 'స్వీయ రచనా శైలి'  ఒకటంటూ లేకుండా పోయి, ఫలానా రచయిత రాసిందే ఇది అని పేరు చూడకుండానే చెప్పగలిగే స్థితి తరిగిపోతోంది.

ఇందుకే మన ''మా యాత్ర'' చదవవలసింది. సుఖయానం వంటి 'యాత్ర'శైలి మనల్ని కట్టిపడేసి దేవులపల్లి కృష్ణమూర్తి గారితో పాటు ప్రయాణం చేయిస్తుంది. శ్రీముఖలింగం గుడికి పొవటం సుతరామూ నాకు ఇష్టంలేదని శ్రీమావో గారి తమ్ముడిలాగా భీష్మించుకున్నా సరే కృష్ణమూర్తితో కులాసాగా అ లా తిరిగి వస్తాం. నచ్చని సంగతి గదాని పేజీలు తిరగేసి ఊరుకోలేం. అదీ దే.కృ.మూర్తి గారి పట్టు.

సులభంగా, హాయిగా రాసుకుపోవటం నిజానికి అంత సులువైందికాదు.
రచయితకి సహజంగానే పుట్టుకు రావాలి కర్ణుడి కవచకుండలాల్లాగేను.
అయితే 'వస్తువు' (అదేమయినా ఇత్తడా, ఇనుమా?) కోసం సహజ కవచంలాటి 'శైలి' వదులుకోవడం హృదయవిదారకం! నిజానికి ఆధునిక తెలుగు కథ, నవలల్లో శైలి వచ్చి కొండచిలువలాగా 'వస్తువు'ను మింగేసేంతటి పరిస్థితి ఎక్కడుంది కనుక?
గట్టిగా మాట్లాడితే చదివించే 'గుణమే', 'తీరే', 'లక్షణమే' శైలి.
ఈ సద్గుణం ''మా యాత్ర'' నిండా పరచుకుని ఉంది.

అ లాగని ఈ పుస్తకంలోని దేశంలోని వివిధ యాత్రా స్థల పురాణాల భోగట్టాల గొడవుండదు. పుస్తకం ఒక గైడ్‌ కాదు. మాటల్లో మాటగా మాటవరసకు అన్నట్టు ఆయా ప్రాంత వివరాలు వుండాలన్నట్టు ఉన్నాయంతే. ఇక్కడ యాత్రా స్థలాలకంటే జీవన గమ్యాలు చేరీ చేరక పోవటం గురించిన జీవన యాత్ర జరుగుతుంది. చిన్న పుస్తకమే కావచ్చుగాక, లోపల మనల్ని నడిపించే ప్రయాణికుల కథలు పెద్దవి. రచయిత చిన్నగా సరిపుచ్చినా సరే, భారీ పదాలు, స్టాక్‌ ఎక్స్‌ప్రషన్‌లూ లేకుండా క్లుప్తంగా సాటి యాత్రికుల దిగుళ్లను, యాతనలనూ అనాయాసంగా చెప్పుకొస్తారు రచయిత. అంటీముట్టనట్టు, చెప్పీ చెప్పనట్టు అ లా అ లా రచయిత చెప్పుకొచ్చే నల్గొండ మిత్రులతో స్నేహం ముగియదు. మరచిపోనూలేం. అదీ ఆయన రచనా శైలి!

పుస్తకంలో ప్రతి పేజీ ఒక చక్కటి పద్యంతోనో, కవితతోనో, పాటతోనో ఆరంభమవుతుంది.
ఈ తీరుబలేగా వుందసలు.
ముందుమాటలో నగ్నముని గారు రచయితని కోరిన కోరికలు నిజానికి ఈ పుస్తకం చదివే వారందరివీనీ!
ఈ చిన్న పుస్తకానికి పెద్ద కరచాలనం!
నమస్తే సారూ!
యాత్ర చేయండిక!


మా యాత్ర - దేవులపల్లి కృష్ణమూర్తి, పేజీలు 112, వెల: రూ.60/- ప్రతులకు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌...

- శివాజీ, (వార్త ఆదివారం సంచిక, తేది 8 ఏప్రిల్‌ 2012) సౌజన్యంతో

Saturday, April 21, 2012

చదవాల్సిన యాత్రా రచన - గుడిపాటి (పాలపిట్ట మాస పత్రిక లో ) ...

చాలా కాలానికి ఒక మంచి యాత్రా రచన చదివాను.
హృదయానికి దగ్గరగా వచ్చిన రచన.
మనసును ఆహ్లాదపరచిన రచన.
ఇది దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన 'మా యాత్ర'.
చాలా ఇష్టంగా చదివించిన పుస్తకం.
ఎక్కడా పత్రికల్లో అచ్చుకాలేదు.
నేరుగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు అచ్చు వేసింది.
ఈ యాత్రా రచన అనేకానేక ప్రత్యేకతల్ని సంతరించుకుంది.
ఒక నవలలా సరళమైన శైలిలో నడిచిన రచన ఇది.

ఏడాది కిందట ఇరవై నాలుగు మంది రిటైర్డ్‌ ఉద్యోగులు దాదాపు ఇరవై రోజులపాటు చేసిన ఉత్తర భారత దేశ యాత్ర ఈ రచనకు ప్రేరణ. వారిలో ఒకనిగా దేవులపల్లి కృష్ణమూర్తి పర్యటించారు. మగవాళ్లు, ఆడవాళ్లు ఉన్నారు. కష్టసుఖాలు కలబోసుకున్నారు. మంచిచెడ్డలు తెలుసుకున్నారు. తమ పర్యటనను ఈ రచనలో దృశ్యమానం చేయడం, మానవ సంబంధాల్లోని అంతరువుల్ని దర్శింపజేయడం ఈ రచన విలక్షణత.

యాత్రా రచన అంటే కేవలం యాత్రాస్థలాల్ని పరిచయం చేయడం, అక్కడి వివరాలు పోగుచేయడం కాదు. లేదంటే ఆ పర్యటనా కేంద్రాల సందర్శనానుభూతుల వ్యక్తీకరణ మాత్రమే కాదు. అంతకు మించి మానవ జీవన సరళిలోని బహుళ పార్శ్వాల్ని వ్యక్తీకరించడం ఈ రచనలోని విశిష్టత.

కొందరు పర్యటనల కోజసం గుంపులుగా పర్యటిస్తుంటారు. సమూహాలుగా వెళుతుంటారు. అయినప్పటికీ ఎవరి దారి వారిదే. ఎవరి ప్రపంచం వారిదే. ఈ పర్యటనలో మాత్రం సరామూహికమైన సంస్పందనలున్నాయి. ఒకరినొకరు మరింత సన్నిహితంగా తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవడంలో అప్పటికే పరిచితమైనవాళ్లు, సన్నిహితులనుకున్నవాళ్లు మనసుకు మరింత దగ్గర అవుతారు. ఈ వైనాన్ని అక్షరాల్లో ప్రతిఫలించడమే దేవులపల్లి కృష్ణమూర్తి సృజన సాధించిన విజయం.

యాత్రా రచన కూడా ఓ సృజనాత్మక రచన. సృజనాత్మకంగా జీవించే లక్షణం ఉన్న కృష్ణమూర్తి దృష్టికోణంలోని వైశాల్యం ఈ రచనకు సొబగులు అద్దింది. మనుషుల్ని అర్థం చేసుకునే లక్షణం ఉండాలి. సంయమనంతో లోకాన్ని పరికించే సహనం కావాలి. వీటితో పాటు సుదీర్ఘకాలపు సాహిత్య అధ్యయనం ఉన్న సృజనశీలి కృష్ణమూర్తి. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం రచనా వ్యాసంగంలోకి వచ్చినప్పటికీ వారిలో ఎప్పటినుంచో ఓ రచయిత దాగి వున్నాడు. '' ఊరు వాడ బతుకు '' ద్వారానూ, కొంతకాలంగా రాస్తున్న కథల్లోనూ కృష్ణమూర్తి సృజనశీలతను తెలుగు పాఠకులు ఆస్వాదిస్తున్నారు.

సరళంగా, సూటిగా, పదునుగా ఉంటుంది దేవులపల్లి కృష్ణమూర్తి శైలీ సంవిధానం. రచనని ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో తెలిసిన ప్రతిభాశాలి. దశాబ్దాలుగా వింటున్న సంగీతం, పాటలు, చదువుతున్న కవిత్వం, సాహిత్యం చూస్తున్న సినిమాలు వారిలో ఒక సృజనకారుని ప్రోది చేశాయి. ఆ సృజనాత్మక ప్రతిభను తారాస్థాయిలో అభివ్యక్తం చేసిన రచన ''మా యాత్ర''. మానవానుభూతుల సాంద్రతను అనుభవంలోకి తీసుకువచ్చే మేలిమి గుణం ఈ రచనలో ఉంది.

ఒక రోజున చేతిలోకి తీసుకున్న వెంటనే నడుమ ఒక అధ్యాయాన్ని చదివాను. తెలియని పరవశానికి లోనయ్యా. గాఢతమమైన అనుభూతికి లోనయ్యా. గుండె ఒకానొక తన్మయత్వంతో ఉల్లాసమొందింది. ఆ తర్వాత మొదటి అధ్యాయం నుంచి మొదలు పెట్టా. ముప్పయి చిన్నచిన్న అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయాన్ని కవిత్వంలా ఇష్టంగా, ప్రేమగా చదువుకున్నా. ఇష్టమైన పదార్థాన్ని త్వరగా అయిపోతుందేమో అని కొద్దిగా కొద్దిగా నెమ్మదిగా తిన్నట్టు ప్రతి అధ్యాయాన్ని అ లా చదివా.

ఈ రచన మీద ఎందుకింత మోహం?
ఎందుకింత ఆకర్షణ?
ఎందుకింత ఉన్మత్త ప్రేమభావం?
అని ఆలోచిస్తే, తర్కిస్తే, వివేచిస్తే కారణాలు అనేకం.
వాటి విచికిత్స జోలికి ఇక్కడ వెళ్లడం లేదు.
కానీ ఒక్కటి చెప్పగలను- ఇందులోని భాషా సంవిధానం, శైలీ వైశిష్ట్యం పాఠకుల్ని ఆకర్షిస్తాయి.
ప్రవాహ సదృశమైన శైలి రచన వెంట మనల్ని తీసుకెళ్తుంది.
ఒక మంచి తెలుగు పుస్తకాన్ని చదివిన మధురానుభూతుల్ని మిగులుస్తుంది.

- గుడిపాటి (పాలపిట్ట మాస పత్రిక) సౌజన్యంతో
 

Wednesday, April 18, 2012

దేవులపల్లి 'మా యాత్ర'లో కనిపించిన మానవబంధాల జాత్ర! - ప్రొ. చందు సుబ్బారావు - The Sunday Indian ...


'ఊరూ-వాడా బ్రతుకు'లో కుగ్రామ జీవిత విశేషాలు రాసి విశేష కీర్తినార్జించిన దేవులపల్లి కృష్ణమూర్తి, ఏకంగా భారతదేశ యాత్ర చేసి అనుభవాలను, అనుభూతులను ఓ చిరుపుస్తకంగా వెలువరించాడు.

మళ్ళీ గాల్లోకి లేచింది బంతి. ఫోరా, సిక్సరా అన్నది అంపయిర్లు జాగ్రత్తగా చూసి చెప్పాలి.
'మేం చూసిన సింగపూర్‌', 'చైనాలో నెలరోజులు', 'పాకిస్తాన్‌లో పదిరోజులు' అంటూ యాత్రా గ్రంథాలు ఏనుగుల వీరాస్వామి గారి 'కాశీయాత్ర' కాలంనుంచి వున్నవీ, వస్తున్నవే. భారతదేశ బస్సుయాత్రల గురించి బహుశా రాసిన వారుండరు. కారణం, ప్రయాణ సౌకర్యాలు పెరిగిన యీ రోజుల్లో బస్సులో భారత యాత్రలు చేసి 'నేను చూసిన తాజమహలు కాశీ విశ్వేశ్వరాలయం, గంగానదిలో స్నానం అంటే ఏం బావుంటుంది. ఎవరు చదువుతారు. చూడనివారెవ్వరు? అజంతా చిత్రాల్ని, ఆగ్రా అందాల్నీ చూసి పరవశించని వారెవరు?

ఇది గమనించాడే మా కృష్ణమూర్తి....బస్సులో ఉత్తర భారత యాత్ర చేసి చూసిన ప్రదేశాల్ని చూచూయగా చెబుతూ, మానవ సంబంధాల్ని, భారతీయ సందర్భంలో యిరికించి మెరిపించేటట్లు చూపించాడు. ఔరా! గడుసుతనం...అనేలా రాసుకుంటూ వెళ్ళాడు. ప్రసిద్ధ కవి నగ్నముని ముందుమాటలో అన్నట్లుగా యాత్రానుభవాలను అడ్డం పెట్టుకుని వ్యక్తుల పాత్రానుభవాలను పూసగుచ్చేశాడు! నగ్నముని చేత 'నేనూ ఉంటే యీ బస్సులో బావుండేది' అనిపించాడు. కృష్ణమూర్తి మెత్తని కత్తి అని తెలుసు గనుక అలా అననుగానీ, ఆ ప్రాంతాలన్నీ బస్సులో కాకపోయినా, రైళ్ళలోనో కార్లలోనో చూసిన వాడినే గనుక దేవులపల్లి కృష్ణమూర్తి అంతరంగాన్ని యిట్టే పట్టేయటానికి వీలుపడింది.

యాత్రా గ్రంథాలు రాసినవారి 'ఇంటెన్షన్‌' ఏమిటి?
మీరు చూడనివి, ఎరుగనివి మేం చూశామని చెప్పటం....
ఒకవేళ మీరు చూసినవీ, ఎరుగనివీ అయితే మేం కొత్తకోణంలో చూశాం. చిత్తగించండి....అనటం అంతేకదా..!
కృష్ణమూర్తి 'బస్సుయాత్ర'ను అడ్డుపెట్టుకుని మానవ మానస మానసరోవరంలోని జీవిత విశేషాలను, సామాన్యుల బ్రతుకుబంధాలను గుదిగుచ్చి మాలగా తయారుచేశాడు. అతని అసలు 'ఇంటెన్షన్‌' అదేనని మనకు కాస్త ఆలస్యంగా తెలుస్తుంది.

నల్లగొండలో బయలుదేరిన బస్సు జ్ఞాన సరస్వతీ బాట-బాసర నుంచి, షిర్డీ సాయి మానవత్వం నుండి- ఎల్లోరా దౌలతాబాద్‌, అజంతాల నుండి మౌంట్‌ అబూ, ఆజ్మీర్‌ దర్గా, జైపూర్‌, హరియానా, ఢిల్లీ ఎర్రకోట, హరిద్వార్‌, నైనిటాల్‌, ద్వారక, ఖజురహో, ఆగ్రా తాజ్‌, అయోధ్య, వారణాసి, శాంతినికేతన్‌, కోణార్క్‌ దేశాలయం, పూరీ, చిల్కా, అరసవిల్లి సూర్య దేవుడి కిరణాలు, సింహాచలం, అద్భుత విశాఖ, అరకు, అన్నవరం, భద్రాచలం రాముడితో సీతాకళ్యాణం చూసుకుని యింటికి చేరింది!!

ఇన్ని మహత్తర ప్రదేశాలు ఇరవై రోజుల్లో చూసిన మరొకరైతే సాయిరెడ్డి, తిరపతమ్మ, మాయాచారి, రాజు, సత్యం అంటారా? బాల వితంతువు లలిత గూర్చి మాట్లాడతాడా? అజంతా చిత్రాల మీద అరవై పేజీలు, ముంతాజ్‌ ప్రేమపై ముప్ఫై పేజీలు, నైనిటాల్‌ అందాలమీద వంద పేజీలు లాగించేయరూ! ఒక్కోస్థలానికి మూడుపేజీలు అందులో మళ్లీ శ్రీశ్రీ, దాశరథి, సినారె, అన్నమయ్య, గురజాడ, నండూరి, ఆత్రేయ, తిలక్‌, శివసాగర్‌, అల్లం రాజయ్య కవితా శకలాల ముఖద్వారాలూ! అజంతాను చూసినా, ఎల్లోరాను చూసినా, తుగ్లక్‌ గారి పిచ్చి పనుల దౌలతాబాద్‌ను చూసినా రామనాధం, వెంకటరెడ్డి, మాయాచారి గుర్తుకొచ్చి కావల సొచ్చిండ్రా? అసలు నీ ఉద్దేశమేంది కిష్టమూర్తీ....భారద్ద్దేశాన్ని గూర్చి చెప్పాలనుకున్నావా...లేక నీ బస్సులో యాభైమంది సహయాత్రీకుల గూర్చి తడవలు తడవలుగా యివరించాలనుకున్నావా...అట్టగయితే మద్దెలో యీ ఎర్రకోటలెందుకు? కోణార్క్‌లో బట్టల్లేని బొమ్మల ఊసులెందుకు? ఎమ్మార్వో చేసి చేసి ప్రతిదీ లెక్కగా చూసుకునే బూరోక్రాటు బుద్ధి అబ్బినట్టుందే....లేపోతే ఎందిది? అరె బుద్దడి జన్మభూమి గురించి చబుతా....తోటి ప్రయాణీకురాలు తిరపతమ్మ నీళ్ల బాటిలు గురించి చెబుతవేంది? అప్పుడప్పుడు చండీల రాజుల గురించి చెప్పినట్లు గొప్ప విషయాలు చెప్పినవనుకో, సటుక్కున ఫిట్టొచ్చినట్టు హైదరబాద్‌లోని నీ కొడుకుల ఊసెందుకయ్య? ఆళ్ళేదో బుందేల్‌ ఖండ్‌ రాజులైనట్టు?

రాజస్థాన్‌లు ఉదయపూర్‌ సరోవరాల మనోహర దృశ్యాలను వర్ణిస్తూ 'రామనాధం గారి గుమాస్తా కొడుకు గురించి వివరిస్తావా? అందుకే మా బాగ జరిగింది...మీ బస్సులోని సంచులన్నీ దొంగలు కొట్టేసిండ్రు గదా...! ఆరావళీ పర్వతాల మీద ఎల్తూ సూర్యంతో లేచిపోయిన పెళ్ళాం కత చెప్తవా? బెమ్మకుమారి విశ్వవిద్యాలయం గురించి రాయమంటే లచ్చమ్మ చీరెలూ, చంద్రమౌళీ బనీన్లు అంటావా...? స్వర్గానికి తీస్కపోయి యింద్రుడి వైభోగం చూడమంటే, మావూళ్ళ కొలువుల్లో యిట్టాగె గెంతులేస్తరంటావా? దేవులపల్లోరి కిట్టమూర్తీ....యింటిపేరు చెడగొట్టావు కదయ్యా...మా కష్ణశాస్ర్తి చూడు...'దిగిరాను దిగిరాను దివినుండి భువికి' అన్లే...! పేరుపెట్టుకోగాన సరే...నెవ్రూ అని పేరుపెట్టుకుని తొమ్మిదో క్లాసు తప్పితే ఎట్టా...! గాంధీ గారి పేరెట్టుకొని బిరియానీలు లాగించేస్తే ఏంది మార్గం! నీ బుర్రలో ఏదో దాగుందిలే. పసిగట్టిన! ఎట్టాగైతేనేంలే...భారద్దేశాన్ని చుట్టుముట్టి వస్తివి. అన్ని స్థలాల గురించి అంతోయింతో పరిచయం చేస్తివి. అవి గొప్పయివరాలేం గావుగాని, మొత్తానికి పరిచయంగా రికార్డు చేసినావు గద...అస్సలు నీ మయిండులో దాచివున్నట్లే నీవూరోళ్ళ, నీ నేస్తుల, నీ ప్రాంతపోళ్ళ, నీ బంధువుల ఊసులన్నీ పూసగుచ్చినట్లు విడతలు విడతలుగా రాసి చదివించినవ్‌లే!

ఎటొచ్చీ 'పోలవరం' పేజెక్టు గూర్చి భద్రాచలం మునిగిపోద్దని ఎవరో అంటునట్లు రాసినవు. అది నిజం కాదు కాని సీమాంద్రోళ్ళ పిల్లలు సుఖంగుంటే నువ్వున్నట్టు కాదా! ఆడపండేపంట, ఆడ లేచే సౌభాగ్యం ఆడనే వుంటదా...! దేశాన్ని అలుముకోదు! మరి దేశమంటే ఏంది? భారద్దేశపు యాత్ర చేసి యింత బంగారం లాంటి సమాచారం కలగలిపి, రంగులు పులిమి అందించినవే....ఒక్క పోలవరం...తెలుగోళ్ళ మద్దెన అన్నదమ్ముల యవహారంలో అన్నాయంగా రాసినట్టు పీలవుతున్నా....నన్ను సీమాంద్ర పొగరుబోతోడని అనబాకు కిష్టన్నా...డెబ్బయి చేరినోళ్ళం నువ్వూ నేనూ పులుముకునేదేముంది...ప్రాజెక్టులు ...నీళ్ళు...మన 'సూర్యం' లలిత'లకు పుట్టబోయే బిడ్డలు సుకపడేటందుకే గదా! ఆళ్ళు రెడ్‌ యిండియన్లలాగ అవుతారని ఎట్టనుకొంటవు....భారద్దేశం యీ దినాన్నే గొప్పగా వుంది కదా. ఆళ్ళ బిడ్డల నాటికి అమెరికావోణ్ని తలదన్ని పోదూ... జాగరత్తగా ఆలోచిచ్చన్నా...నీ పుస్తకం గూర్చి ఓ కవిత పలకనా....?

అది కవనం...విజ్ఞానం
అది గ్రహాంతర యానం...
అది మోదం...అది ఖేదం...
శిల్పచిత్రకళా ప్రయాణం..
అది పవిత్రం మన చరిత్ర....!
సాధారణ సామాన్యుల అనుభూతుల జాత్ర!
కిష్టమూర్తి కలం నుండి
ప్రవహించిన, పయనించిన నవభారత యాత్ర!!

ప్రొ. చందు సుబ్బారావు |
The Sunday Indian … Issue Dated: ఏప్రిల్ 16, 2012

మా యాత్ర
దేవులపల్లి కృష్ణమూర్తి

ముఖచిత్రం: ఎడ్గర్‌ దేగా, వాసు
లోపలి బొమ్మలు: శీలా వీర్రాజు

112 పేజీలు, వెల రూ. 60/-





.

Tuesday, April 17, 2012

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా హెచ్‌బిటి పుస్తకాల డోర్‌ డెలివరి!



.
ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా హెచ్‌బిటి పుస్తకాల డోర్‌ డెలివరి!

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను ఫ్లిప్‌ కార్ట్‌ డాట్‌ కామ్‌ వారు ఇప్పుడు ఇంటింటికి అందిస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
మీరు ఇకనుంచీ ఎలాంటి శ్రమ లేకుండా ఇంటివద్ద కూర్చునే ఫ్లిప్‌కార్ట్‌ డాట్‌ కామ్‌ ద్వారా హెచ్ బీ టీ పుస్తకాలను
సులువుగా తెప్పించుకోవచ్చు.
ఆర్డర్‌ చేసిన వారం రోజుల లోపే మీరు కోరిన పుస్తకం మీ ఇంటికి వచ్చేస్తుంది.
ఇందుకు ఎలాంటి అదనపు చార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు.
భారతదేశంలో ఎక్కడున్న వారైనా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

పూర్తి వివరాలకు ఈ దిగువ క్లిక్‌ చేయండి:
.... ఫ్లిప్‌కార్ట్‌ డాట్‌ కామ్‌ ....



హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ - మంచి పుస్తకాల ప్రచురణలో ఒక విప్లవ కెరటం!
ఫ్లిప్‌ కార్ట్‌ డాట్‌ కామ్‌ - ఇంటింటికి పుస్తకాల పంపిణీలో ఒక సంచలనం!!



...

Sunday, April 15, 2012

రమాబాయి అంబేడ్కర్‌ జీవిత చరిత్ర - హిందీ మూలం: శాంతి స్వరూప్‌ బౌద్ధ్‌ - తెలుగు అనువాదం: డా.జి.వి.రత్నాకర్‌ ...




డా.బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఇల్లాలు రమాబాయి జీవన పోరాటాన్ని తెలిపే ఈ రచన కొంత ఆలస్యంగా వచ్చినా సాహిత్య లోకంలో ముఖ్యంగా జీవిత చరిత్రల కోవలో ఒక పెద్ద లోటును పూరించింది.

శతాబ్దాలుగా వర్గ వర్ణ విభజనలతో అతలాకుతలంగా వున్న భారత సమాజ ధర్మాన్ని ప్రశ్నించి నిలదీసి సమధర్మం, సమన్యాయం ఏర్పాటుచేసిన మహనీయుడు డా.అంబేడ్కర్‌.
ఆయన భార్య రమాబాయి జీవన గమనాన్ని అర్థం చేసుకుంటే, ఆమె కూడా ఆయన మార్గాన్నే ఆమోదించినట్లు స్పష్టపడుతుంది.

పోరాటాలకు, త్యాగాలకు, బాధలు భరించటానికి మనిషి సిద్ధంగా వుండాలనేవాడు అంబేడ్కర్‌. ఆ మాటలను రమాబాయి తన జీవితానికి ఎంతగా అనువర్తింప జేసుకున్నదో ఈ పుస్తకం విశదపరుస్తున్నది.

అట్టడుగు వర్గాల స్త్రీలకు నాగరిక సమాజంలో తగిన గౌరవమర్యాదలు లభించటం లేదన్న సత్యాన్ని ఆకళింపు చేసుకున్న అంబేడ్కర్‌ ఆమెకు సామాజిక క్షేత్రంలో కీలకమైన బాధ్యతలు అప్పగించలేదు. కుటుంబ బాధ్యతలు, దారిద్య్రం, పిల్లల మరణాలు, ఆమె ఆరోగ్యం దెబ్బతీయడం కూడా అందుకు కారణాలయ్యాయి. చాలా చిన్న (ఎనిమిది తొమ్మిదేళ్ల) వయసులోనే ఇంటి కోడలిగా వచ్చిన రమాబాయి ఇంటి బాధ్యతను చాలా ఆనందంగా స్వీకరించింది. కుటుంబ సభ్యుల అవసరాలు, వారి మనోభావాలు అర్థం చేసుకుంటూ ఎదిగింది.
జాతి అవసరాల గురించే తప్ప కుటుంబం గురించి ఆలోచించే సమయం డా.అంబేడ్కర్‌కు లేదనీ, ఆయన లక్ష్యం వేరనీ అర్థం చేసుకుని ఆయన సహధర్మచారిణిగా ఆ బాధ్యతనంతా తనమీద పెట్టుకుంది.

అంబేడ్కర్‌ పైచదువులకు విదేశాలకు వెళ్లినప్పుడు ఇక్కడ ఆయన కుటుంబ అవసరాలు ఎలా తీరాయి. ఇల్లు ఎలా గడిచింది? అనేది చాలా మందికి కలిగే సందేహం. ఆ సందేహానికి సమాధానం ఈ పుస్తకంలో దొరుకుతుంది.
అంబేడ్కర్‌ విద్యా వ్యాసంగం, సమాజ సంస్కరణ కార్యక్రమాలు, ఉద్యమాలు నిరంతరాయంగా సాగటానికి రమాబాయి ఎంతగా సహకరించిందో తెలుసుకునే కొద్దీ ఆశ్చర్యం కలుగుతుంది.

............... - డా.బి.విజయభారతి (ముందుమాట 'భారతదేశ చరిత్రను తిరగరాసిన రమాబాయి' నుంచి)

'' రమాబాయి ఏ రకమైన ప్రలోభాలనూ తన దరిదాపుల్లోకి రానీయలేదు. ఔను, మా బతుకుదారులు మాకున్నాయి అన్నట్టు తన భర్త బారిష్టరైనా తాను పేడ ఎత్తి పిడకలు చేసి సంసారాన్ని ఎల్లదీసింది. ఆమె తన బాధ్యతను నెరవేర్చాననుకుంది కానీ తనకు తెలియకుండానే ఈ అవినీతిమయమైన, పురుషాధిక్య వ్యవస్థను ధిక్కరించింది. ఆత్మగౌరవ ప్రకటన చేసింది. అందుకే రమాబాయి తన ఇంటికే కాదు... ఒక ప్రపంచ మేధావిని తీర్చిదిద్ది ఈ దేశానికే దీపమయిందని అనలేమా?
ఆ మనస్తత్వం మానసిక ధైర్యం మనకు లేవా? లేకుంటే అలవర్చుకోవాలి. తప్పదు మరి...''

............... - గోగు శ్యామల ('ఆత్మగౌరవపు ఒరవడి సృష్టించిన రమాబాయి' ఉపోద్ఘాతం నుంచి)



రమాబాయి అంబేడ్కర్‌
జీవిత చరిత్ర


హిందీ మూలం: శాంతి స్వరూప్‌ బౌద్ధ్‌
తెలుగు అనువాదం: డా.జి.వి.రత్నాకర్‌


52 పేజీలు, వెల రూ. 40/-

ప్రతులకు :

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006

ఫోన్‌ : 040 2352 1849
ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com


.

Monday, April 9, 2012

జార్జిరెడ్డి 40వ వర్ధంతి సభ


ఏప్రిల్‌ 14న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జార్జిరెడ్డి 40వ వర్ధంతి సభ

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో జార్జిరెడ్డి హత్య జరిగి 40 సంవత్సరాలైంది. జార్జిరెడ్డి సైన్స్‌ కాలేజీలో రీసెర్చ్‌ స్కాలర్‌గా గోల్డ్‌ మెడల్‌ సాధించిన అత్యున్నత ప్రతిభాశాలి. ఉస్మానియా యూనివర్సిటీలో విప్లవ వామపక్ష విద్యార్థి ఉద్యమాలకు పునాదులు వేసిన మూలపురుషుడు. ఆనాటి ''జీనాహైతో మర్‌నా సీఖో- ఖదం ఖదం పర్‌ లడ్‌నా సీఖో'' నినాదం అగ్గిరవ్వగా మారి అనేక విద్యార్థి ఉద్యమాలను వెలిగించింది.
ఆ యువనేతను స్మరించుకోడానికి, ఆనాటి వాతావరణాన్ని మనముందుంచడానికి, ఆయనతో కలిసి మెలిగిన మిత్రులు ఈ సభలో ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని వివరిస్తారు.
- జార్జి మిత్రులు

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌