Thursday, August 25, 2011

ఐ యామ్‌ లెజెండ్‌ - నేనే బలాన్ని



మరుగుదొడ్లు సాపు చేసే మెహతర్‌ కులంలో పుట్టి- దేవుళ్లను, దేవుళ్ల ఆస్తులను సంరక్షించే మంత్రిత్వ శాఖను నిర్వహించే స్థాయికి ఎదిగిన టి.ఎన్‌.సదాలక్ష్మి - ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు సిసలైన గొప్ప స్పూర్తికి నిదర్శనం.
ఎందరో నాయకులను నిగ్గదీస్తూ,
అన్యాయాలను ఎదుర్కొంటూ,
నిత్యం న్యాయం వైపే నిలబడుతూ, ఎక్కడా రాజీపడకుండా బతికిన మనిషి సదాలక్ష్మి.
ఒక స్త్రీగా,
మాదిగగా,
తెలంగాణా వాదిగా...
ఎన్నింటికి ఎదురీది ఆమె గొప్ప నాయకురాలిగా,
మంచి నాయకురాలిగా పేరుతెచ్చుకుందో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

అందుకే ''అడుగడుగునా నాకు చరిత్ర వుంది'' అని అంత ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగిందామె.
ఆమె జీవిత చరిత్రనుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీకోసం ...

చూడండి: ఈరోజు (25 ఆగస్ట్‌ 2011) ఆంధ్రజ్యోతి దినపత్రిక - నవ్య పేజీ (ఈ కింది లింక్‌)లో ప్రచురించబడ్డ కథనం..

ఐ యామ్‌ లెజెండ్‌ - నేనే బలాన్ని - ఆంధ్ర జ్యోతి

Saturday, August 20, 2011

ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు పుస్తకాభిమానులకు శుభవార్త:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన పుస్తకాలు ఇకనుంచి 'కినిగె డాట్‌ కామ్‌'లో 'ఇ బుక్స్‌'గా లభిస్తాయి.
మా తొలి తెలుగు ఇ బుక్‌: "నేనే బలాన్ని"

ప్రపంచ వ్యాప్తంగా వున్న మా అభిమానులకు
హెచ్‌బీటీ పుస్తకాలను కినిగె డాట్‌ కామ్‌' వారి సహకారంతో ఇ బుక్స్‌' రూపంలో అందించాలని సంకల్పించాము. హెచ్‌బిటీ ఇటీవలే ప్రచురించిన గోగు శ్యామల రచించిన ''నేనే బలాన్ని-టిఎన్‌ సదాలక్ష్మి బతుకు కథ'' మా తొలి తెలుగు ఈ పుస్తకంగా ఇప్పటికే కినిగె డాట్‌ కామ్‌ లో అందుబాటులోకి వచ్చింది.

ఈ పుస్తకం కోసం దిగువ లింక్‌పై క్లిక్‌ చేయండి:
''నేనే బలాన్ని ఇ బుక్‌''

మా రెండో బుక్ : "ఊరు వాడ బతుకు"


అదేవిధంగా దేవులపల్లి కృష్ణమూర్తి రచించిన మరో విశిష్టమైన బతుకు పుస్తకం ''ఊరు వాడ బతుకు'' కూడా మా రెండో ''ఇ బుక్‌'' గా లభిస్తోంది. మా పుస్తకాలన్నింటినీ క్రమంగా ''ఇ బుక్స్‌'' రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.

ఊరు వాడ బతుకు "
పుస్తకం" కోసం దిగువ లింక్‌పై క్లిక్‌ చేయండి.
''ఊరువాడ బతుకు ఇ బుక్‌''

మంచి పుస్తకాలను ఆదరించండి. మా ప్రయత్నాన్ని విజయవంతం చేయండి.

కినిగే వారి వెబ్ చిరునామా: http://kinige.com



.

Tuesday, August 16, 2011

తొలి దళిత మహిళా శాసన సభ్యురాలు, మంత్రి శ్రీమతి టి.ఎన్‌.సదాలక్ష్మి బతుకు కథ: ''నేనే బలాన్ని''



సికింద్రాబాద్‌ బొల్లారంలోని మెహతర్‌ బస్తీలో అట్టడుగు మాదిగ ఉపకులమైన మరుగుదొడ్లు సాపు చేసే మెహతర్‌ వృత్తి కులంలో పుట్టి ఏటికి ఎదురీదుతూ అక్కడి నుంచే రాష్ట్ర శాసన సభలో ప్రవేశించి, మంత్రి స్థాయికి ఎదిగిన ధీరోదాత్త వ్యక్తిత్వం శ్రీమతి టి.ఎన్‌.సదాలక్ష్మిది. భారతదేశంలో 1952లో ప్రప్రథమంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రిజర్వుడు అభ్యర్థిగా నిలబడి కమ్యూనిస్టు ప్రభంజనాన్ని ఎదుర్కొని రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి, దేవాదాయ శాఖా మంత్రి వంటి అనేక బాధ్యతలను నిర్వహించారు. దేవాదాయ శాఖను నిర్వహించిన తొలి మాదిగ మహిళామంత్రిగా పేరు గడించడమే కాకుండా ఆయా శాఖలపై తనదైన బలమైన ముద్ర వేశారు.

1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి మూలస్తంభంగా వున్నారు. తెలంగాణా ప్రజా సమితి (టిపిఎస్‌) అధ్యక్షురాలిగా ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మాదిగ హక్కుల కోసం, ఎబిసిడి వర్గీకరణ కోసం పోరాడుతూ దండోరా ఉద్యమానికి బీజం వేశారు. మాదిగ వర్గీకరణ అన్నది వీరి ఆలోచనే. దండోరా ఉద్యమానికి రాజకీయ రంగు రావద్దొన్న ఉద్దేశంతో తను వెనకుండి మంద కష్ణ మాదిగ, కృపాకర్‌ మాదిగలను ముందుంచి ఉద్యమాన్ని నిర్మించారు.

నేర పూరిత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సాగిన శ్రీమతి సదాలక్ష్మి కృషి మీడియాలో పెద్దగా ఫోకస్‌ కాలేదు. ఇంటా బయటా హిందూ బ్రాహ్మణీయ వర్ణ, పితృస్వామ్య నియంత్రణలను ధిక్కరించి... నిజమైన సాధికారతతో దళిత స్త్రీశక్తిని చాటిచెప్పిన వీరి పాత్ర చరిత్రలో మరుగుపరచబడింది. అందుకే అడుగడుగునా ''నాకు చరిత్ర వున్నదని'' తనే బలంగా ఎలుగెత్తి ప్రకటించారు.

టి.ఎస్‌. సదాలక్ష్మి జీవితం ఈ నాటి మహిళలందరికీ ఆదర్శప్రాయం. ఉద్యమాల్లో, ఉద్యోగాల్లో రాజకీయాల్లో స్త్రీ పురుషులకు... ముఖ్యంగా సాధికారతలో వెనుకబడ్డ ఎంతోమంది మహిళలకు సదాలక్ష్మి జీవితం బతుకు తొవ్వను చూపిస్తుంది.

ఈ పుస్తక రచయిత్రి గోగు శ్యామల గొంతు ప్రత్యేకమైనది. పది సంవత్సరాల క్రితం కథలు రాయటం మొదలుపెట్టిన శ్యామల తన రచనల్లో దళిత సమాజంలో బాల్యం, దళిత స్త్రీలు భూమికోసం పడే తపన, దళిత కుటుంబాలలో, సమూహాలలోని ప్రజాస్వామిక తత్వం, దళిత సబ్బండ కుల సంబంధాలు, మాదిగ అస్తిత్వం, మాదిగ ఉపకులాల అస్తిత్వాలను కొత్త దృక్పథంలో చూపిస్తూ వచ్చారు. ఆమె రచనల్లో దళితులు పీడిత అస్తిత్వంతో కాక, తమ జీవితం, ఇప్పటి ప్రపంచం, దానిలో రావలసిన మార్పుల గురించి తదేకంగా ఆలోచించే తాత్విక దృక్పథం కలవారిగా కనిపిస్తారు. అనేక
సాహితీ పురస్కారాలు అందుకున్న శ్యామల మొదటి పుస్తకం ''నల్లపొద్దు.'' ఆ తరువాత ''నల్లరేగడి సాల్లు'', ''ఎల్లమ్మలు'' పుస్తకాలు ఆమె సంపాదకత్వంలో వెలువడ్డాయి. ''ఎడ్యుసెంట్‌'' అనే దళితుల విద్యపై పనిచేసే సంస్థను స్థాపించి, 'అందరికీ విద్య' అనే మాసపత్రికను నడుపుతున్నారు. అనేక సంస్థలలో, సాహితీ వేదికలలో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ''అన్వేషి'' సంస్థలో సీనియర్‌ ఫెలోగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే సదాలక్ష్మి బతుకు కథను రాశారు.

నేనే బలాన్ని - టి.ఎన్‌. సదాలక్ష్మి బతుకు కథ
రచన: గోగు శ్యామల
పేజీలు: 338, వెల: రూ.180/-


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 23521849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com


...

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌