మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Sunday, November 28, 2010
ఉత్కంఠ భరితం ''చంద్రగిరి శిఖరం'' - ఆంధ్రజ్యోతి
'వనవాసి', 'పథేర్ పాంచాలి'ల రచయిత బిభూతి భూషణ్ బందోఫాధ్యాయ రాసిన మరో పుస్తకమే ''చంద్రగిరి శిఖరం''.
సాహసాలు ఇష్టమున్నవాళ్లకు విధిగా నచ్చే పుస్తకం.
ఎక్కడ బెంగాల్! ఎక్కడ ఆఫ్రికా!
శంకర్ అనే కుర్రాడు చిన్న ఉద్యోగం కోసం అక్కడిదాకా వెళ్లి అడుగడుగునా ప్రమాద భరిత, సాహసోపేత జీవితం గడుపుతూ తనతో పాటు మననూ ఆ జీవితం లోకి లాక్కుని పోతాడు.
అందులో మనిషి కాలుమోపని కొండలు, అడవులు, ఎడారులు, మన మెన్నడూ కనీవినీ ఎరుగని జంతువులు, పక్షులు, కీటకాలు ఎన్నో
తారసిల్లుతాయి.
వర్షాలు, వరదలు, తుఫానులే కాదు అగ్నిపర్వతం పేలడం కూడా చూస్తాం. అక్కడ వీటన్నిటిమధ్యా ఒకరిద్దరు విదేశీ సీనియర్ సాహస
యాత్రికులతో కలిసి అమూల్యమైన వజ్రాల వేటలో మన శంకర్..
ఎటువంటి ప్రయాణం అది!
ఒళ్లు గగుర్పొడిచే సాహసయాత్ర.
వజ్రాలు దొరుకుతాయా లేదా అనే ఉత్కంఠ కంటే శంకర్ క్షేమంగా తిరిగొస్తాడా లేడా అనే ఉత్కంఠే ఎక్కువ కలుగుతుంది మనకి.
కానీ, శంకర్‌కి వజ్రాలకంటే, తన క్షేమం కంటే, ఆ అనుభవమే ముఖ్యం. అనుభవం కోసం ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధమైన వాణ్ణి పాఠకులు
అక్కున చేర్చుకోకుండా ఉండగలరా?
కాకపోతే పాఠకులకు ఎడతెగని సస్పెన్స్ కల్పించడం కోసం శంకర్ ప్రయాణాన్ని మరీ సుదీర్ఘం చేసినట్టనిపిస్తుంది.
కాత్యాయని గారి అనువాదం అచ్చ తెలుగులాగే వుంది.
అన్నిటికీ అన్ని తెలుగు పేర్లు వెతికి రాయగలిగారామె.
ఇంతకాలం ఈ పుస్తకం తెలుగులో ఎందుకు రాలేదా అని ఆశ్చర్యమేస్తుంది.
-ఆంధ్రజ్యోతి, ఆదివారం, 28-11-2010
చంద్రగిరి శిఖరం
-బిబూతి భూషణ్ బందోపాధ్యాయ
తెలుగు అనువాదం: కాత్యాయని
పేజీలు: 104, వెల: రూ.50/-
ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ నెం. 040 2352 1849
ఇ మెయిల్: hyderabadbooktrust@gmail.com
Friday, November 26, 2010
ముస్లింలను అర్థం చేసుకోవడం, వారి మతాన్ని గౌరవించడం నేర్చుకుందాం!
ముహమ్మద్ ప్రవక్త జీవితం
- క్యారెన్ ఆంస్ట్రాంగ్
తెలుగు అనువాదం: పి. సత్యవతి
''ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న మతం ఇస్లాం. క్యారెన్ ఆంస్ట్రాంగ్ వ్రాసిన ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర ఇస్లామ్ గురించీ, ఆ మతాన్ని గాఢంగా అనుసరించే ప్రజల గురించీ లోతుగానూ ఖచ్చితంగానూ అర్థం చేయిస్తుంది. ఇస్లామ్‌కు దగ్గర సంబంధం కల జూడాయిజం, క్రైస్తవంతో ఆ మతానికి కల పోలికల్ని కూడా అందిస్తుంది''
''భక్తితో కాక గౌరవంతో, పాండిత్య ప్రకర్షతో కాక వస్తు పరిజ్ఞానంతో వ్రాసిన ఈ పుస్తకం, అన్నిటికీ మించి, చదివించే శక్తి కలది''
-ఎకనమిస్ట్
''పాశ్చాత్య పఠితల్లో వుండే అపోహల్నీ, అపార్థాలనీ పోగొట్టడానికి సానుభూతితో మాత్రమే వ్రాసిన పుస్తకం కాదిది. ముస్లిములకు కొంత ముఖ్యమైన పుస్తకం కూడా.''
- ముస్లిమ్ న్యూస్
...
ముందుమాట నుంచి ...
సల్మాన్ రష్డీ రచించిన ''సెటానిక్ వర్సెస్'' వివాదం, రష్డీని హతమార్చాలంటూ అయాతుల్లా ఖొమైనీ 'ఫత్వా' జారీ సందర్భంగా నేను ఈ ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర వ్రాశాను.
అంతకు ముందు ఎంతో ఉదారంగా, స్వతంత్రంగా ఆలోచించే వారుకూడా అప్పుడు ఇస్లాం మతం పట్ల కనబరచిన అహేతుకమైన ద్వేషం నన్ను చాలా కలవరపరిచింది. ... ప్రపంచ జనాభాలో దాదాపు అయిదు వంతులుగా వున్న ఒక మతం పట్ల మనం అస్పష్టమైన, అసత్యమైన అభిప్రాయాలను పెంచిపోషించ కూడదనిపించింది. ...
1990లో నేనీ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ఒక ఇస్లామిక్ కాంగ్రెస్ సమావేశం జరగింది. అందులో పాల్గొన్న 45 ముస్లిం రాజ్యాల తాలూకు 44 మంది ప్రతినిధులు ఖొమేనీ జారీ చేసిన ఫత్వాని నిర్ద్వంద్వంగా ఖండించారు. అది ఇస్లామ్ మత విరుద్ధమన్నారు. అయినా బ్రిటన్‌లో ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ...
అయాతుల్లా ఖొమేనీతో విభేదించేవారూ, రష్డీన చంపాలనే కోరికలేని వారూ అయిన ముస్లిములు బ్రిటన్‌లో చాలామంది వున్నారు. అయితే సల్మాన్ రష్డీ తన నవలలో ముహమ్మద్ ప్రవక్తను దైవ దూషకునిగా చిత్రించడం వాళ్లందరినీ తీవ్రంగా కలవరపరిచింది.
పశ్చిమ మేధావులు మాత్రం, ముస్లింలంతా రష్డీ రక్తం కళ్ల జూడాలనుకుంటున్నారని భావించారు. కొందరు బ్రిటన్ రచయితలు, మేధావులు తత్వవేత్తలు కూడా ఇస్లామ్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజం తెలుసుకోడానికి కూడా ఆసక్తి కనబరచలేదు. వారి దృష్టిలో ఇస్లాం సహనం లేని ఒక మూఢమతం. గౌరవించతగ్గ మతం కాదు. అంతేకాదు, రష్డీ ముహమ్మద్‌ని చిత్రించిన తీరుకు నొచ్చుకున్న ముస్లిముల సున్నితమైన మనోభావాలను వారు అసలు పట్టించుకోలేదు. అదంత ముఖ్యమైన విషయమే కాదనుకున్నారు.
. ...
2001 సెప్టెంబర్ 11 సంఘటన... ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని, పెంటగన్‌లో ఒక భాగాన్ని ముస్లిం ఉగ్రవాదులు ధ్వంసం చేసిన తీరు, దాదాపు 5000 వేల మంది మరణానికి కారణం కావడం పశ్చిమ దేశాలలో ముస్లిమ్ వ్యతిరేకతను తిరిగి రెచ్చగొట్టి, వారికి ఇస్లామ్ మతం పై వుండే ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసింది.
...
ఇస్లాం హింసను సమర్థిస్తుందనే భావాలు ప్రచారంలో వున్నాయి. ఈ హింసాత్మక సంఘటన తరువాత జరిగిన అనేక చర్చల్లో, వాదవివాదాల్లో చాలామంది ఖురాన్‌లోని కొన్ని పరుషమైన వాక్యాలను ఉల్లేఖించడం ప్రారంభించారు. అటువంటి వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయని వాదించారు. అయితే ఈ వాదన చేసేవారు క్రిస్టియన్, జ్యూయిష్ తదితర మత గ్రంధాల్లో కూడా అనేక హింసను ప్రోత్సహించే వాక్యాలు వున్నాయనే విషయాన్ని మరిచిపోతున్నారు.
...
పాశ్చాత్యుల్లో చాలామందికి ఇస్లాం మతం గురించి సంపూర్ణంగా తెలియదు. విచక్షణతో విశ్లేషించి ఉపయోగకరమైన చర్చ చెయ్యరు.
...
ఇరవై ఒకటో శతాబ్దంలోనైనా మనం మెరుగ్గా ఉండాలంటే
మనతో ఈ ధరిత్రిపై సహజీవనం చేస్తున్న ముస్లమ్‌లను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి.
వారి మతాన్ని అభిమానించడం, గౌరవించడం నేర్చుకోవాలి. వారి అవసరాలను, వారి ఆరాటపోరాటాలను, వారి ఆశలను ఉద్దేశాలను గుర్తించాలి.
అందుకు ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించడం మొదటి మెట్టు.
ఈ సంక్లిష్ట సమయంలోని అజ్ఞాన తిమిరాన్ని ఆయన మేధో వికాస కాంతులు పారదోలగలవు.
...
పుస్తక రచయిత్రి గురించి:
క్యారెన్ ఆంస్ట్రాంగ్ 1944 నవంబర్ 14న బ్రిటన్‌లో జన్మించారు. 1962 నుంచి ఏడు సంవత్సరాలు హోలీ చైల్డ్ జీసస్ సొసైటీలో ఒక నన్‌గా వున్నారు. తరువాత సొసైటీ నుంచి తప్పుకొని టెన్నిసన్ మీద డీ.లిట్ చేస్తూ అస్వస్థత వల్ల అసంపూర్తిగా వదిలేశారు.
నన్‌గా తన అనుభావాలను, అవేదనలను వ్యక్తపరుస్తూ 1982లో వ్రాసిన ''థ్రూ ది నారో గేట్'' బహుళ జనాదరణ పొందింది. అప్పుడే ఒక బ్రిటీష్ టెలివిజన్ ఛానెల్ ఆమెకు సెయింట్ పాల్ మీద డాక్యుమెంటరీ తీసే అవకాశమిచ్చింది. ఆ పని మీద జెరూసలేంలో వుండడం కూడా ఆమెను ఎక్కువ ప్రభావితం చేసింది. 1993లో ఆమె వ్రాసిన ''హిస్టరీ ఆప్ గాడ్'' దాదాపు 30 భాషల్లోకి అనువాదమై ప్రపంచ ప్రజల మన్ననలందుకుంది.
అన్ని మతాల తులనాత్మక అధ్యయనం ఆమె అభిరుచి. ప్రపంచలోని అన్ని మత సంప్రదాయాల బాహ్య స్వరూపాలలో వైవిధ్యం వున్నా వాటి అంతస్సారం ఒకటేననీ మతాలన్నీ కూడా పరస్పర సానుభూతినీ సదవగాహననూ, సహనాన్నీ బోధించేవేననీ నమ్మకం కన్నా ఆచరణ ముఖ్యమనేది అమె తాత్విక దృక్పథం.
...
అనువాదకురాలి గురించి:
పి. సత్యవతి ప్రసిద్ధ స్త్రీవాద కథా రచయిత్రి. ''సత్యవతి కథలు'', ''ఇల్లలకగానే'', ''మంత్రనగరి'' కథా సంపుటాలు ప్రచురించారు. కొన్ని ఆంగ్ల కథలు తెలుగులోకి అనువదించారు. విజయవాడలో వుంటారు.
ఉదయకాంతి రేఖ
ముహమ్మద్ ప్రవక్త
రచన: క్యారెన్ ఆంస్ట్రాంగ్
తెలుగు: పి. సత్యవతి
ఆంగ్ల మూలం: Muhammad: A Biography of the Prophet, 1991, Harper Collins, U.K.
206 పేజీలు, వెల: రూ.80/-
ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ నెం. 040 2352 1849
ఇ మెయిల్: hyderabadbooktrust@gmail.com
Wednesday, November 10, 2010
వర్గ నిర్మూలన ద్వారా కుల నిర్మూలన జరుగుతుందా? లేక కుల నిర్మూలన ద్వారా వర్గ నిర్మూలన జరుగుతుందా??
కులం - వర్గం
- బొజ్జా తారకం
...
కులం అనగానే కొంతమందికి డాక్టర్ అంబేడ్కర్ గుర్తుకు వస్తాడు.
వర్గం అనగానే కొంతమందికి కార్ల్ మార్క్స్ గుర్తుకు వస్తాడు.
భారతదేశంలోని ప్రధాన సమస్య కులం అని డాక్టర్ అంబేడ్కర్ చెబితే -
ప్రపంచంలోని ప్రధాన సమస్య వర్గం అని మార్క్స్ చెప్పాడు.
కులం సమస్యను పరిష్కరిస్తే భారతదేశంలోని ప్రధానమైన సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్ అంబేడ్కర్ చెబితే -
వర్గ సమస్యను పరిష్కరిస్తే ప్రపంచంలోని ప్రధాన సమస్య పరిష్కారం అవుతుందని మార్క్స్ చెప్పాడు.
కుల సమస్యను క్షుణ్ణంగా అంబేడ్కర్ పరిశీలిస్తే వర్గ సమస్యను విపులంగా మార్క్స్ పరిశీలించాడు.
కులసమస్యతో పాటు వర్గ సమస్యను పరిశోధించటానికి అంబేడ్కర్‌కి అవకాశం లభించింది కానీ వర్గ సమస్యతో పాటు కుల సమస్యను అంత వివరంగా పరిశోధించటానికి మార్క్స్ కు అవకాశం లేకపోయింది.
భారత దేశంలో కుల సమస్యా వున్నది, వర్గ సమస్యా వున్నది.
కుల వైరుధ్యాలు వున్నాయి, వర్గ వైరుధ్యాలు వున్నాయి.
కుల ద్వేషం వున్నది, వర్గ ద్వేషమూ వున్నది.
కులాధిపత్యం వున్నది, వర్గాధిపత్యమూ వున్నది.
అందువల్ల అంబేడ్కర్‌కి ఈ రెండింటినీ పరిశోధించే అవకాశం దొరికింది. .....
కులం - వర్గం
రచన: బొజ్జా తారకం
ప్రథమ ముద్రణ: 1996
పునర్ముద్రణ: 2002, 2008
87 పేజీలు, వెల: రూ.30/-
Tuesday, November 9, 2010
నెహ్రూ కంటె, నేతాజీ కంటె భీమ్‌రావు అంబేద్కర్ మహామహుడు - నార్ల వెంకటేశ్వరరావు ...
బాబా సాహెబ్ అంబేద్కర్
(జీవిత చరిత్ర)
రచన: బి.విజయభారతి
ఈ పుస్తకానికి 1982లో నార్ల వెంకటేశ్వరరావు రాసిన పీఠిక నుంచి ...
ఒక ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్ అన్నాడు - గాంధీ కంటె, జిన్నా కంటె మహదేవ గోవింద రెనడే అనేక విధాల మహామహుడని.
ఈ పీఠికలో నేనంటున్నాను - నెహ్రూ కంటె, నేతాజీ కంటె భీమ్‌రావు అంబేద్కర్ మహామహుడని.
నెహూృ నేతాజీలవలె అంబేద్కర్ జన్మించింది అగ్రకులంలో కాదు, నిమ్నాతి నిమ్నమైన దానిలో. వారివలె ఆయన సంపన్న కుటుంబంలో పెరగలేదు. కటిక దారిద్య్రంలో పెరిగాడు. అడుగడుగునా అవమానాల మధ్య పెరిగాడు. ఒక గాంధీకి, ఒక సి.ఆర్.దాస్‌కు కూర్చినట్టు ఆయనకు రాజకీయంగా ప్రోత్సాహ ప్రోద్బలాలను కూర్చినవారు లేరు. సరిగదా, ఎందరెందరో ఆయనను అణగద్రొక్కడానికి ప్రయత్నించారు.
అయినా డాక్టర్ అంబేద్కర్ మహోన్నత స్థితికి రాగలగడం స్వయం కృషి వల్లనే, స్వీయ ప్రతిభ వల్లనే. విద్యా విజ్ఞానాలలో ఆయనకు సాటి రాగలవారు తక్కువ. ప్రజ్ఞా ప్రాభవాలలో ఆయనను మించగలవారు లేరనే చెప్పవచ్చు.
ధైర్య సాహసాలలో ఆయన స్థానం ప్రథమ శ్రేణిలో. శీల సంపదకు ఆయన సరసన నిలవగలవారు ఈనాటి భారత వర్షంలో బహుశా ఒక్కరైనా లేరు.
ఇవి ముఖస్తుతులనడానికి, వీటిని విని నాకు ఏదో కట్టబెట్టడానికి అంబేద్కర్ సజీవుడైలేడు. పోతే, ఇవి ఆత్యుక్తులనడానికి ఎవరైనా సాహసిస్తే వారికి భారత సాంఘిక చరిత్ర ఆణుమాత్రంగానైనా తెలియదనే చెప్పవలసి వుంటుంది.
... ... ... ... ...
బానిసత్వం కంటె అతి నీచమైనది, నికృష్టమైనది, అత్యంత క్రూరమైనది, కఠోరమైనది, ఆద్యంతం అధమాధమమైనది, అమానుషమైనది - అస్పృశ్యత.
ప్రపంచం మొత్తం మీదనే మరొక దేశంలో ఈ విధమైన రాక్షసత్వం కానరాదు.
.... ... ... ...
అస్పృశ్యతపై హిందూ దేశంలో తిరగబడిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ కావడం ఏ దృష్టితో చూచినా ఒక గొప్ప విశేషం.
ఆయన గురించి చదివినకొద్దీ ఆయన పట్ల నాకున్న ప్రేమ గౌరవాలు పెరుగుతూ పోతున్నాయి.
అయితే ఆయన సాగించిన తిరుగుబాటు సాగవలసిన మేరకు సాగలేదు.
కొన్ని విషయాలలో సాగవలసిన మార్గాలలో సాగలేదు కూడా.
అందువల్లనే ఈనాడు దేశంలో ఏదో ఒకమూల అస్పృశ్యులపై ఏదో ఒక అత్యాచారం, ఏదో ఒక అమానుష చర్య జరిగినట్టు దినపత్రికలలో వార్తలు వస్తూనే వున్నాయి.
కాగా, పత్రికలకెక్కని ఘోరాలలెన్నో, క్రౌర్యాలెన్నో ఎవరు చెప్పగలరు?
ఈ దుర్భర పరిస్థితి తొలగాలంటే ఒక అంబేద్కర్ చాలడు.
ఆయన అంతస్తును అందుకొనలేకపోయినా, కనీసం ఆయన ప్రతిభలో, ఆయన స్వేచ్చా �ప్రవృత్తిలో, ఆయన నిష్కలంక శీలంలో శతాంశాన్ని చూపగలవారైనా కొన్ని వందలమంది ఆ సంఘం నుంచి పైకి రావాలి.
అందుకు కావలసిన ఉత్కంఠను, అందుకు కావలసిన ఉత్తేజాన్ని
డాక్టర్ బి.విజయభారతి రచించిన అంబేద్కర్ జీవిత చరిత్ర కలిగించగలదని ఆశిస్తున్నాను.
పెక్కు గ్రంథాలను పరిశోధించి సరళమైన శైలిలో, సమగ్రమైన రీతిలో ఈ రచనను చేసినందుకు ఆమెను నేను అభినందిస్తున్నాను.
ఆమె రచనలో ఆలోచనతోపాటు ఆవేదన వున్నది.
జీవంతో పాటు జవం వున్నది.
ఇది జీవిత చరిత్ర అయినా నవల వలె సాఫీగా నడుస్తున్నది.
కొన్ని కొన్ని ఘట్టాలలో నాటకం వలె ముఖ్య దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపుతున్నది.
దీనిలో చెదురుగా కొన్ని లోపాలుంటే అవి పట్టించుకోదగినవి కావు.
ఇంతటితో సరిపుచ్చక అస్పృశ్య సంఘంలో నవచైతన్యానికి, విప్లవోత్సాహానికి దోహదం కూర్చగల మరి పెక్కు రచనలను డాక్టర్ విజయభారతి కొనసాగించాలని ఆశీర్వదిస్తున్నాను.
- నార్ల వెంకటేశ్వరరావు, జూన్, 1982, లుంబిని, బంజారాహిల్స్, హైదరాబాద్, 500034
బాబా సాహెబ్ అంబేద్కర్
బి.విజయభారతి
మొదటి ముద్రణ: 1982
పునర్ముద్రణ: 1986, 1990, 1992, 1999, 2005, 2008, 2009
256 పేజీలు, వెల: రూ.70/-
Monday, November 8, 2010
ఆధునిక భారత చరిత్ర ...
ఆధునిక భారత చరిత్ర ...
గతంలో భారత దేశాన్ని ఆక్రమించిన విదేశీయులకూ, బ్రిటీష్ వారికీ మధ్య వున్న తేడా ఏమిటి?
భారతదేశం మీద బ్రిటన్ సాధించిన విజయం ప్రత్యేకత ఏమిటి?
భారత జాతీయోద్యమానికి 1857 తిరుగుబాటు ఏ రకమైన ఊపునిచ్చింది?
ఏఏ సామాజిక, మత సంస్కరణోద్యమాలు ఆవిర్భవించాయి?
అవి ఏ సుప్త చైతన్యాన్ని మేల్కొల్పాయి?
జాతీయోద్యమానికి ప్రజలు ఏవిధంగా స్పందించారు?
భారత జాతీయవాదంలోని పాయలేమిటి?
బ్రిటీష్ వలసవాద కుటిల రాజనీతి ఫలితంగా దేశానికి కలిగిన అరిష్టమేమిటి?
ఈ ప్రశ్నలకు సామాధానమే ఈ పుస్తకం.
ప్రజల ఆర్థిక, సామాజిక జీవిత విధానాల్లో వచ్చిన పరిణామాలకు చరిత్రను పునాదిగా గ్రహించిన కొద్దిమంది చరిత్రకారులలో ఈ గ్రంథ రచయిత బిపిన్ చంద్ర ఒకరు.
భారత సామాజిక జీవితంలోని వైరుధ్యాలనూ, సంక్లిష్టతనూ బిపిన్ చంద్ర అత్యంత ప్రతిభావంతంగా విశ్లేషించారు. నాయకుల మీద, మహా వ్యక్తుల మీద కాకుండా చరిత్రచోదక శక్తుల మీద, ఉద్యమాల మీద తమ దృష్టిని కేంద్రీకరించారు.
18వ శతాబ్దపు ఆర్థిక, సాంఘిక విషయాల చర్చ ఈ పుస్తకంలో విశేషంగా వుంది.
విదేశాల నుంచి వచ్చిన వర్తక సంస్థలు ఈ దేశాన్ని సునాయాసంగా ఆక్రమించుకోటానికి దారితీసిన పరిస్థితులను గ్రహించటానికి ఈ చర్చ ఎంతో ఉపయోగపడుతుంది.
బ్రిటీష్ సామ్రాజ్యవాదతత్వాన్ని, భారత ప్రజల జీవన విధానాలమీద దాని ప్రభావాన్ని విపులంగా వివరించారు.
దేశ ప్రజల్లో జాతీయతా భావావిర్భావం, విదేశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాపిత పోరాటం, రాజకీయ స్వాతంత్య్ర సముపార్జన తదితర అంశాలను ఇందులో సవివరంగా చిత్రించారు.
ఆధునిక భారత చరిత్ర
బిపిన్ చంద్ర
ఆంగ్ల మూలం: Modern India, Bipin Chandra
తెలుగు: సహవాసి
ప్రథమ ముద్రణ:1988
పునర్ముద్రణ: 1992, 1994, 1996, 1998, 2000, 2003, 2007
పేజీలు: 348 వెల: రూ.100/-
Sunday, November 7, 2010
నిలదీసే అక్షరాలు ....
నిలదీసే అక్షరాలు...
మార్క్సిస్టు అవగాహనతో తొలుత పౌర హక్కుల సంఘం కార్యకర్తగా, నేతగా ప్రత్యేకతను చూపిన డాక్టర్ కె. బాలగోపాల్ ఆ తర్వాత మానవ హక్కుల వేదిక ద్వారా తన కృషిని విస్తృత పరిచారు.
వివిధ రంగాల్లోని అనేక సమస్యలపై ఉద్యమించిన ఆయన, సమకాలీన సమాజంలోని వైరుధ్యాలను కూడా ప్రత్యేక రీతిలో విశ్లేషించారు.
బాలగోపాల్ మరణించి ఏడాదయిన సందర్భంగా పలు సంస్థలు ఆయన స్మృతిలో పుస్తకాలను ప్రచురించాయి. వివిధ సంధర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలను ''రాజ్యం - సంక్షేమం'' పేరిట 'పర్‌స్పెక్టివ్స్' పుస్తకంగా తీసుకొచ్చింది.
రాజ్యం ఆణచివేత స్వభావాన్ని నిలదీసిన బాలగోపాల్, సంక్షేమ బాధ్యత దానిపై ఉందని, అది ఉద్యమాల ఫలితమని స్పష్టం చేశారు.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో నక్సలైట్ ఉ్యమం తీరుతెన్నులు, ప్రభుత్వాల వైఖరులపై తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. సెజ్‌లు, బహుళ జాతి సంస్థల విస్తరణను అడ్డుకునేందుకు ప్రజా ఉద్యమాలు మరింతగా అవసరమని నొక్కి చెప్పారు.
లోతయిన విశ్లేషణతో నిక్కచ్చిగా తన భావాలను వెల్లడించే బాలగోపాల్ మతం విషయంలో కూడా ఏమాత్రం తడబడకుండా దాని వికృతత్వాన్ని పలు సందర్భాల్లో ఎండగట్టారు. ఆ రచనలను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ మతతత్వంపై బాలగోపాల్ పేరిట ప్రచురించింది.
మానవ హక్కుల వేదిక ప్రచురించిన ''హక్కుల ఉద్యమం- తాత్విక దృక్పథం'', ''మా బాలగోపాల్'' కూడా ఆ హక్కుల యోధుడి జీవితానికీ, ఆలోచనలకూ అద్దం పట్టేవే.
రాజ్యం - సంక్షేమం
కె.బాలగోపాల్ ఉపన్యాసాలు పేజీలు: 164, వెల: రూ.100/-
మతతత్వంపై బాలగోపాల్ పేజీలు 336, వెల: రూ.150/-
హక్కుల ఉద్యమం-తాత్విక దృక్పథం పేజీలు: 248, వెల: రూ.100/-
మా బాలగోపాల్ పేజీలు: 248, వెల: రూ.100/-
ఈనాడు ఆదివారం 07 నవంబర్ 2010
మార్క్సిస్టు అవగాహనతో తొలుత పౌర హక్కుల సంఘం కార్యకర్తగా, నేతగా ప్రత్యేకతను చూపిన డాక్టర్ కె. బాలగోపాల్ ఆ తర్వాత మానవ హక్కుల వేదిక ద్వారా తన కృషిని విస్తృత పరిచారు.
వివిధ రంగాల్లోని అనేక సమస్యలపై ఉద్యమించిన ఆయన, సమకాలీన సమాజంలోని వైరుధ్యాలను కూడా ప్రత్యేక రీతిలో విశ్లేషించారు.
బాలగోపాల్ మరణించి ఏడాదయిన సందర్భంగా పలు సంస్థలు ఆయన స్మృతిలో పుస్తకాలను ప్రచురించాయి. వివిధ సంధర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలను ''రాజ్యం - సంక్షేమం'' పేరిట 'పర్‌స్పెక్టివ్స్' పుస్తకంగా తీసుకొచ్చింది.
రాజ్యం ఆణచివేత స్వభావాన్ని నిలదీసిన బాలగోపాల్, సంక్షేమ బాధ్యత దానిపై ఉందని, అది ఉద్యమాల ఫలితమని స్పష్టం చేశారు.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో నక్సలైట్ ఉ్యమం తీరుతెన్నులు, ప్రభుత్వాల వైఖరులపై తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. సెజ్‌లు, బహుళ జాతి సంస్థల విస్తరణను అడ్డుకునేందుకు ప్రజా ఉద్యమాలు మరింతగా అవసరమని నొక్కి చెప్పారు.
లోతయిన విశ్లేషణతో నిక్కచ్చిగా తన భావాలను వెల్లడించే బాలగోపాల్ మతం విషయంలో కూడా ఏమాత్రం తడబడకుండా దాని వికృతత్వాన్ని పలు సందర్భాల్లో ఎండగట్టారు. ఆ రచనలను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ మతతత్వంపై బాలగోపాల్ పేరిట ప్రచురించింది.
మానవ హక్కుల వేదిక ప్రచురించిన ''హక్కుల ఉద్యమం- తాత్విక దృక్పథం'', ''మా బాలగోపాల్'' కూడా ఆ హక్కుల యోధుడి జీవితానికీ, ఆలోచనలకూ అద్దం పట్టేవే.
రాజ్యం - సంక్షేమం
కె.బాలగోపాల్ ఉపన్యాసాలు పేజీలు: 164, వెల: రూ.100/-
మతతత్వంపై బాలగోపాల్ పేజీలు 336, వెల: రూ.150/-
హక్కుల ఉద్యమం-తాత్విక దృక్పథం పేజీలు: 248, వెల: రూ.100/-
మా బాలగోపాల్ పేజీలు: 248, వెల: రూ.100/-
ఈనాడు ఆదివారం 07 నవంబర్ 2010
Subscribe to:
Posts (Atom)