Tuesday, July 27, 2010

సావిత్రీబాయి ఫూలే జీవితం - ఉద్యమం - కె.పి.అశోక్‌ కుమార్‌


సావిత్రీబాయి ఫూలే జీవితం - ఉద్యమం

ఆధునిక భారతదేశంలో మొట్టమొదటగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి. మహారాష్ట్రీయులైన ఈ దంపతులు మొదటిసారిగా సమగ్రమైన కుల వ్యతిరేక సిద్ధాంతానికి రూపకల్పన చేసి, ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా గొప్ప ప్రజా ఉద్యమాలను నిర్మించారు. వారి సామాజిక సాంస్కృతిక దృక్పథంలోని మౌలికాంశం పీడితులందరినీ ఐక్యం చేయడమే.

స్త్రీలు-శూద్రులు-అతిశూద్రులందరినీ ఒక తాటిమీదికి తీసుకురావడమే ఈ ఉద్యమ లక్ష్యం. విప్లవకారుడైన తన భర్తతో కలిసి సావిత్రీబాయి ఫూలే (1831-97) చేసిన పోరాటాలూ, ఎదుర్కొన్న సమస్యలూ తగిన గుర్తింపు పొందకపోవడానికి కారణం సమాజంలోని కులతత్వ, పురుషాహంకార ధోరణులే. పండిత వర్గాల్లోని చాలామందికి కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. ఆధునిక భారతదేశంలో మొట్టబదటి ఉపాధ్యాయురాలిగా, పేద ప్రజల ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికై కృషి చేసిన ఉద్యమకారిణిగా, స్త్రీ విముక్తి పోరాట నాయకురాలిగా కవియిత్రిగా, కులమూ - పితృస్వామ్యమూ అనే శక్తులపై యుద్ధానికి పూనుకున్న సాహసిగా సావిత్రీబాయి ఒక  స్వతంత్ర
వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న ఆదర్శ మహిళ. పందొమ్మిదవ శతాబ్దంలో జరిగిన సామాజికోద్యమాలన్నిటిలోనూ నాయకత్వస్థానంలో కనబడే మహిళ ఆమె ఒక్కతే.

భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను స్థాపించిన సావిత్రీబాయి 1852లో ''మహిళా సేవా మండల్‌'' అనే మహిళా సంఘాన్ని కూడామానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి, స్త్రీలను చైతన్యపరచడానికి ఈ సంస్థ ఎంతగానో కృషి చేసింది. స్త్రీలకు జెండర్‌ పరనంగా ఎదురయ్సేమస్యలకు తోడుగా కుల, పితృస్వామ్య
వ్యవస్థల అణిచివేత కూడా సాగుతున్నదన్న వాస్తవాన్ని ఒక మహిళగా ఆమె పూర్తిగా అర్థం చేసుకోగలిగింది. స్త్రీల ప్రత్యేక సమస్యపై జరిగిన ఎన్నో ఉద్యమాల్లో ఆమె పాలు పంచుకుంది. వితంతువులపై వివక్షకూ, అక్రమ సంతానమైన శిశువుల హత్యలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపట్టింది.

వితంతు పునర్వివాహాల అవసరాన్ని గురించి చాటిచెప్పడమే గాక, ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది.
అనాథలుగా మారుతున్న శిశువుల కోసం శరణాలయాన్ని స్థాపించింది. దిక్కులేని స్త్రీలకూ, పిల్లలకూ సావిత్రీబాయి ఇల్లే ఒక పునరావాస కేంద్రంగా మారింది. వితంతువులకు శరోముండనం చేసే ఆచారానికి సహకరించబోమంటూ క్షురకులు తిరుగుబాటు చేసేట్టుగా ప్రోత్సహించింది.

ఈ పనులన్నిటకీ ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించింది. సత్యశోధక్‌ సమాజాన్ని నిర్వహించిన ముఖ్య నాయకుల్లో సావిత్రీబాయి ఫూలే కూడా వున్నారు. సంస్థ మహిళా వొరీభాగానికి ఆమె నాయకురాలు. సత్య శోధక్‌ సమాజ కార్యకర్తలను ఎన్నో సామాజికోద్యమాల్లోకి నడపటంలో ఆమె శ్రద్ధ వహించింది. 1896-97 కాలంలో కరువు, ప్లేగు వ్యాధి వ్యాపించిన సందర్బాలలో సావిత్రీబాయి నాయకత్వంలో సత్య శోధక్‌ సమాజం చేసిన సేవ ఎంతో గొప్పది. సావిత్రీబాయి జీవితం ఉద్యమం గురించి విశ్లేషిస్తూ ప్రముఖులు రాసిన ఈ వ్యాసాల సంకలనాన్ని కాత్యాయిని తెలుగులోకి అనువదించారు.

- కె.పి.అశోక్‌ కుమార్‌
(వార్త దిన పత్రిక, జూలై 18, 2010 సౌజన్యంతో)

Monday, July 26, 2010

''నేను'' లేని ఆత్మకథ ! - చందు సుబ్బారావు



''నేను'' లేని ఆత్మకథ !

ఆర్టిస్ట్‌ మోహన్‌ యింట్లో పరిచయమైన ఈ రచయిత అంతకుముందేమీ రాసినట్లు లేదు.
వయసు దాదాపు డెబ్బయ్యేళ్లు. సొగసు దాదాపు సున్న.
నవ్వీ నవ్వనట్లు, మాట్లాడీ మట్లాడనట్లు చిన్న చిన్న తడీపొడీ పలుకులు.
అయితే ఆయనింటి పేరు గొప్పది. అసలు పేర్లో సగం గొప్పది. అది విని ఉలిక్కిపడి వారికి వీరేమైనా అనబోయాను.
''అబ్బే వీరు నాన్‌ బ్రామిన్స్‌'' అని జవాబొచ్చింది.
'ఈయనో పుస్తకం రాసారబ్బా... నువ్వు చదవాలబ్బా...' అని అభిమానంతో అన్నాడు మోహన్‌.
రచయిత కలం తీసుకుని రెండు వాక్యాలు రాసిచ్చాడు...ఆయనే తెలంగాణాలోని సూర్యాపేట ప్రాంత అనంతారం నివాసి... దేవులపల్లి కృష్ణమూర్తి!
కృష్ణ శాస్త్రి కాదు మూర్తి... ప్లీజ్‌ నోటిట్‌...!
పుస్తకం పేరు ''ఊరు వాడ బతుకు''.

మామూలుగా అయితే చదవకపోదును.
రోజూ ఎవరో ఏదో పంపుతూనే వుంటారు. ఎన్నని చదువుతాం?
ఏ ఆవిష్కరణ కోసమో బలవంతంగా చదివినా 'రాని అనుభూతి' వచ్చినట్లు కక్కేసి, నాలుగబద్ధాలు చెప్పేసి చెక్కేయటం తప్ప. కదిలించి చదివించిన పుస్తకం గతపదేళ్లుగా కానరాదాయె. పతంజలి వజ్‌ ది లాస్ట్‌...బస్‌ పఠనమ్‌. దాశరథి రంగాచార్యులు, మో, ఎండ్లూరి సుధాకర్‌, కొత్తపల్లి, శిఖామణి కొన్ని రచనల్ని చదివించారు.
అయినా యింతటి పారవశ్యం కలగలేదు.

అ లనాటి నామిని, ఆనక కేశవరెడ్డి, మధ్యలో రేగడి విత్తులు కొంత కదిలించకపోలేదు.
అయినా ఎందుకో యింతగా మనస్సును వెంబడించి వేధించలేదు.
తెలంగాణా మాండలికంలో తెలిదేవర, జూకంటి, గోరంట్ల యిత్యాదులు మురిపించకపోలేదు.
అయినా ఎందుకో యీ కృష్ణమూర్తి 'భావ' నవత్వానికి రసం కుండ పగిలి నెత్తిన వొలికి పోయినట్లనిపించింది.

ఆత్మకథ రాయడానికి ఆయనకు ఏ అర్హతా లేదు. కళాకారుడు కాదు. రచనాకారుడూ కాదు. చిన్న గుమస్తాగా చేరి పెద్ద గుమాస్తాగా రిటైరైన మనిషి.
ఏ సాయుధ పోరాటంలోనో, సాయుజ్య ఆరాటంలోనో నానా విధి క్రియల నాచరించి వాటితో మనల్ని వేధించగల అర్హతా సంపాదించుకోలేదు. డబ్బయినా సంపాదించుకోలేదు. పాపం ముచ్చటపడి యీ లేటు వయసులో మొరటు ప్రేమలతో ఓ నవల రాసాడు కామాలనుకున్నాను. కాదు. ఆత్మకథే.
ఇంత సామాన్యుడికి ఆత్మకథా...!
సాహిత్యం మరీ అంత అ లుసయిపోయిందా అని ఆగ్రహించబోయాను...!
పోనీ. సమకాలీన సామాజిక ఆత్మచరిత్రాత్మక చారిత్రక చరిత్ర ఏమోనని.. శ్రీశ్రీ శిష్యుడి కాపీ మార్కులేమోనని పొరపడబోయాను...!
మళ్లీ నేను... అనంతారం గ్రామంలోని నిరుపేద సాలె కులస్తుల కుటుంబంలో బిడ్డనయిన దేవులపల్లి కృష్ణమూర్తిని...!
'మొగ్గాలు నేసుకుంట పొట్టకు బట్టకు దేవులాట లేకుండ బతుకుతుండె... బర్రెను కట్టేసే కమ్మల కొట్టంలో సగం వున్న యిల్లు. ధోతులు.. పట్టంచులు.. పీతాంబరాలు, సాదాసీదా చారలు నేస్కుంట నా వాళ్లు బతుకుతుంటె నేను పాటలు పాడుకుంట తిరిగెటోణ్ణి...!
''ఈ జన్మమిక దుర్లభమురా
నా జన్మ సాకారా సద్గురుని కనరా'' అని తత్వాలు పాడుకుంటు, చేపలు పట్టుకుంటు వచ్చీరాని చదువుకు బడికెల్తా ఉండెటోణ్ణి!
ఇలాంటి వాక్యాలున్నాయి కనుక ఆత్మకథే కదా... నీ కెంత ధైర్యం క్రిష్ణ మూర్తీ అని గాట్టిగా ప్రయివేటుగా చెబుదామనుకునేంతలో...!
...
పల్లెటూళ్లో పిల్లలు... ఆటలు... పాటలు... కులాలు... వృత్తులు... గ్రామీణ చిత్రం.. సంపాదనలు.. దరిద్రాలు.. దౌర్జన్యాలు.. పండుగలు.. కొలువులు.. వేటలు.. బలులు.. మాంసాలు.. చేపల కూరలు.. కల్లు ముంతలు.. సారా కుండలు.. బత్తీసాలు.. కవ్వేలు.. తాతీళ్లు.. మర్లబందాలు.. గిన్నెచెట్లు.. చింత పాలు.. ఆడబాపలు.. దూపలు.. చెల్కలు.. బింకోలు.. అటికలు.. మైల సముద్రాలు.. ఇవన్నీ ఏమిటంటారా.. తెలంగాణా తెలుగు పలుకుబడిలో బంగారు చిలకలు.
అర్థాలు అడిగి తెలుసుకుందురుగాని.. ముందు సదువుండ్రి..!

కులాలు, రాజకీయాలు, పెత్తందారీ పనులు, పటేళ్లు, పోలీసోళ్లు, మాలోళ్లు కాపోళ్లు, రెడ్డోళ్లు, దొరలు, సూదరోళ్లు.. ఎన్నెన్ని విషయాలు.. జీవిత విశ్వరూపాన్ని వచ్చీరాని మాటల్తో చెపుతూ మధ్యలో నత్తనకాయలా దూరిపోయిన కృష్ణమూర్తి సొంత కథ. కథేముందిలెండి. జీవితమే కథానాయిక. సమాజమే సముద్రం. బతుకే నాయకుడు. కాలమే క్యారెక్టర్‌ ఏక్టర్‌. మధ్యలో గ్రామఫోను రికార్డుపై ముల్లులా యీ దేవులపల్లి కుర్రాడొకడు మూడో తరగతి, అయిదో తరగతి అంటూ అదేదో ఆక్స్‌ఫర్డు అయినట్లు.. బాల్రెడ్డి, చాందూ, ఆచారీ అంటూ స్నేహితులూ.. వారేదో సర్దార్‌ పటేలూ, భగత్‌సింగూ, జవ్హర్‌లాల్‌ నెహూృ అయినట్లు..! కల్లు తాగి ఎండు చేపలు కొరుక్కుతింటూ లాగూ లేకుండా పదేళ్లు తిరిగిన కృషణమూర్తి.. ఆ వ్రేపల్లెలో కృష్ణుడయినట్లుగా తన సొంత కథ రాసిండు.
అగోయిత్యం కాదూ...!
...
ఊరి కథ. వాడ కథ. ఊరివాడ బ్రతుకు కథ. పెరుగుతున్న వయసు కథ. పట్నం కథ. కాలం కథ. గాలం కథ. కమ్యూనిస్టు ఆవిర్భావాల వికాసాల ఆచూకీలు. కమ్యూనిస్టు నాయకుల దర్శన భాగ్యాలు. రజాకార్ల, పుండాకోర్ల అక్రమాలు, ఆర్తనాదాలు అన్నీ వివరంగా పేర్లతో 'అనంతారం ఆత్మకథ'లా అరవై ఏళ్ల తెలంగాణాకు గ్రామ చరిత్ర, అందులో మళ్లీ కృష్ణమూర్తి అనే నల్ల కుర్రాడి ఎనిమిదో తరగతి సూర్యాపేట చదువొకటే.. అతనికి పెళ్లి చూపులొకటే.. పెళ్లికి యింకా గడువుండగా కథ ఆగిపోయింది.!
...
ఈ పుస్తకంలో ''నేను'' కృష్ణమూర్తే కాదు .. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చదవలాడలో పుట్టిన ''నేను'' అను చందు సుబ్బారావు కూడా అనిపించింది.
పుట్టింది 1940లో కృష్ణమూర్తీ, 1946లో సుబ్బారావు అయినా మాండలికాలు మాత్రమే తేడాగున్నయి తప్ప - ఆ సంఘటనలన్నీ నాకు తెలిసినట్లే వున్నాయి.
ఆ కథంతా నాకు ఎరిగినట్లే వుంది.. నాది కూడా కమ్యూనిస్టు కుటుంబం కావటం చేత అ లనాటి పేదరికం, గ్రామాలు, కూలీల బతుకులు, పండగలు, పబ్బాలు, పాటలు, శ్రీశ్రీ గేయాలూ అన్నీ విన్నట్లే ఉన్నాయి.

అక్కడ బియన్‌రెడ్డి అయితే యిక్కడ వేములపల్లి శ్రీకృష్ణ. అక్కడ రావినారాయణరెడ్డి వస్తే యిక్కడ బొల్లముంతశివరామకృష్ణ. అంతే తేడా!
ప్రేమలు, అభిమానాలు, అడపిల్లలు, పెళ్లాం-మొగుళ్లూ, లంకెలు, రంకులు అతుకు బొతుకుల బతుకులు ఎర్ర జెండా రెపరెపలు.. అంతా నేను విన్నట్లే వుంది.
అక్కడ నేను వున్నట్లే వుంది..

అందుకే కృష్ణ మూర్తి కనిపించని ''నేను లేని అతని ఆత్మకథ'' తెలంగాణా సగటు సమాన్యుని అంతరంగ వ్యధలా రికార్డయిపోయింది.
ఈ పుస్తకం విలువ తెలుగు నేల గమనిస్తుందో .. లేదో.. దేవులపల్లి వారి పద్మశాలి బిడ్డడికి సన్మానాలూ, సత్కారాలూ అక్కర్లేదు. డెబ్బయ్యో పడిలో ఆయన్ను ''గొల్లవారి వాడలకూ కృష్ణమూర్తీ .. ఏమి పనుల కొచ్చినావు కృష్ణమూర్తీ'' అని అడిగేవాడూ లేడు. పొగిడేవాడూ లేడు!

ఈ పుస్తకం తెలుగు సాహిత్య చరిత్రలో అతి చక్కని డాక్యుమెంట్‌.
కాలం కన్నీటి చుక్కపై అతి సిన్సియర్‌ సెంటిమెంట్‌..
సామాన్యడి బతుకుపై సాధికార స్టేట్‌మెంట్‌.. అని పెద్దలు, విజ్ఞులు గుర్తించితే చాలు.
సాహిత్య చరిత్రలో ఈ చినిన పొత్తానికి ఓ వాక్యం దొరికితే చాలు.. భవిష్యత్‌ సమాజానికి న్యాయం జరుగుతుంది. సత్య సౌందర్యానికి మెడలో మణిహారంలా వెలిగిపోతుంది..!
వరవరరావు ముందుమాటలో అన్నట్లుగా తెలుగువాడి ''పథేర్‌ పాంచాలి''గా నిలిచిపోతుంది!

- చందు సుబ్బారావు
(ఆంధ్రజ్యోతి- వివిధ తేది 24-05-2010 సౌజన్యంతో)

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌