మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Tuesday, June 30, 2009
తెలంగాణ ఆత్మకథ …ఊరువాడ బతుకు …. తెలిదేవర భానుమూర్తి సమీక్ష
ఊకదంపుడు ఉపన్యాసాలు, క్షణక్షణం మారే రాజకీయ వ్యూహాలు, లాబియింగ్ ద్వారా తెలంగాణ వస్తుందో రాదో తెలియదు గాని ఊరువాడ బతుకు వంటి పుస్తకాల ద్వారా జెనానికి తెలంగాణ సంస్కృతి అంటే ఏమిటో తెలుస్తుంది. ఉద్యమస్ఫూర్తి కలుగు తుంది. ఇలాంటి పుస్తకాలు ఇంకా రావలసిన అవసరం ఏంతైనా ఉంది.
- తెలిదేవర భానుమూర్తి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తెలంగాణ ఆత్మకథ …ఊరువాడ బతుకు
ఊరువాడ బతుకు కేవలం ఆత్మకధేకాదు. తెలంగాణ సంస్కృతి కధ. ఆచార వ్యవహారాల కధ. ఆత్మీయత, అనుబంధాల కధ.
తన ఆత్మకథను నాలుగు భాగాల్లో దేవులపల్లి కృష్ణమూర్తి చెప్పారు. ప్రతిభాగం జానపద గీతం లేదా గేయంతో ప్రారంభమవుతుంది. మధ్య మధ్య సందర్భానికి తగ్గట్లూ జానపద గీతాలను రచయిత ఉటంకించారు. బాల్యం నుంచి నవయవ్యనం దాకా తన అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా రాశారు.
ఇందులో అట్టడుగు వర్గాల జీవితచిత్రణ కనిపిస్తుంది. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, అనంతారంలలో చదువుకున్నప్పుడు తనకు కలిగిన అనుభవాలను ఉన్నది ఉన్నట్లుగా రచయిత వివరించారు. ఏ ఒక్క అంశాన్ని కూడా ఆయన పండుగలు, పబ్బాలు, భాగోతాలు, వంటి పలు అంశాలను రేఖామాత్రంగా ఆయన స్పృశించారు.
భాగోతంలో రాజువేషం వేసే వాడిమీద ఒకామె మోజు పడి ఆదేవేషంలో ఎడ్లకొట్టంకాడికి రమ్మని జీతగాడితో కబురంపుతుంది. జీతగాడు తోవచూపించగా దుప్పటి కప్పుకొని రాజువేషంతోనే ఎడ్లకొట్టంకాడికి అతను వెళతాడు. ఆమె రాజభోగం తీరింది, కానీ తెల్లారి ముఖానికంతా రంగు అంటుకొని ఆమె రంకు బయటపడింది.
గిర్దావరు వద్ద నాటు తుపాకీ ఉండేది. దానితో ఆయన కొంగలు, బాతులను వేటాడేవాడు. ఆ బాతు బొచ్చుపీకడానికి చాకలి వెంకులు వచ్చి కాల్చడానికి తాటకుల కోసం పోగానే పిల్లి వచ్చి బాతును తినిపోతుంది. ఇక ఆ వూట పప్పు పచ్చడితోనే గిర్దావరు తినవలసి వస్తుంది. నిజజీవితంలోని ఇలాంటి హాస్య సంఘటనల గురించి తన ఆత్మకధలో రచయిత ప్రస్తావించారు.
సందర్భోచితంగా ఆయన సామెతలను ఉపయోగించారు. ఒక విషయం గురించి చెబుతూ మధ్యలో సామెతను వాడే సాధారణ పద్థతికి భిన్నంగా విషయమంతా చెప్పేక చివర్న కృష్ణమూర్తి సామెత చెబుతారు. సందంతా దాసర్లే, బిచ్చమెవడు పెట్టాలె' ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం' 'చీర వూడిందాక సిగమూగొద్దమ్మో' వంటి సామెతలు, బింకి, తాతీళ్లు, దూప, గిన్నెపండ్లు వంటి తెలంగాణ పలుకు బళ్లు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.
స్నేహితుడిని దగ్గర కూర్చుండబెట్టకొని ముచ్చట్లు ఆయన తన ఆత్మకథను చెప్పారు. మోటకొట్టే తెల్లవారు జముతో మొదలయ్యే ఈ ఆత్మకథ కలికి గాంధారి వేళతో ముగుస్తుంది.
ఊరువాడ బతుకులో తెలంగాణ పండుగల గురించి రచయిత వివరించారు. శ్రీరామనవమి గురించి చెబుతూ 'శ్రీరామనవమికి మా అయ్యదే పెత్తనం. పొద్దున్నే స్నానం చేసి కోమటింటికి పోయి బెల్లం, మంచి చెనిగపప్పు తెచ్చెటోడు. ఊరబావి నుండి బిందెతో నీళ్లు తెచ్చి ఆంజనేయ విగ్రహాన్ని శుభ్రం చేసి, ధూప దీపాలతో ఆరాధన చేస్తడు. చుట్టుపక్కల ఇండ్లలోని ఆడపిల్లలు వచ్చి గుడిముందు పూడ్చిచల్లి, తీరుతీరు ముగ్గులు పెడ్తరు. బెల్లంతో బిందెలో పానకం చేసి, పప్పు నాన బెట్టి వుంచెటోడు. ఈ పనులన్నీ అయ్యేవరకు పొద్దుగూకేది. రాములోరి పెండ్లికి ఊరంతా పండుగే. పటేండ్లు, కోమట్లు ఊదుబత్తీలు, కర్పూరం, కొబ్బరికాయ దేవునికి సమర్పించేది. కొబ్బరి ముక్కలు పప్పుబెల్లంతో ఫలహారం చేసె టోడు. భక్తులందరు గడిచుట్టు ప్రదక్షిణం చేసి పానకం, ఫలహారం తీసుకునేది. ఫలహార ముల్లో అంటే నాకింత, నాకింత అని ఎగబడేది.
అప్పటి రాజకీయ పరిస్థితి గురించి ఈ పుస్తకంలో కొద్దిపాటి ప్రస్తావన ఉంది. నేను రెండో తరగతిల ఉండంగ మా సత్తెన్న ఇంటికి సంగపోల్లు వస్తుండెటోల్లు. చుట్టుపట్టు ఊర్లల్లో గోలలైతున్నయి. సంగపోల్లు వచ్చి సభలు పెట్టి జై కొట్టెది. ఆ భయానికి పెద్దకుటుంబాలు పేటకు వెళ్లి పోయినయి.
చుట్టుపట్టు ఊర్లల్ల రజాకార్ల గోల రాత్రిపూట కాపలా కాయడం మొదలైంది. మా ఊర్లో తురుకోళ్లుండిరి. వాళ్లు తురుకోళ్లమని ప్రత్యేకంగా అనుకోరు. మాతో పాటె కల్సివుండెటోళ్లు వాళ్లకు ఏ పిచ్చిలేదు. తిండిపిచ్చి తప్ప. గ్రామీణ వృత్తులు, వృత్తి పనివారల జీవితాల చిత్రణ ఈ పస్తకంలో కనిపిస్తుంది.
మీకు కల్చర్ లేదంటూ అవహేళన చేసే వారికి ఈ పుస్తకం ద్వారా రచయిత దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పారు.
ఊకదంపుడు ఉపన్యాసాలు, క్షణక్షణం మారే రాజకీయ వ్యూహాలు, లాబియింగ్ ద్వారా తెలంగాణ వస్తుందో రాదో తెలియదు గాని ఊరువాడ బతుకు వంటి పుస్తకాల ద్వారా జెనానికి తెలంగాణ సంస్కృతి అంటే ఏమిటో తెలుస్తుంది. ఉద్యమస్ఫూర్తి కలుగు తుంది. ఇలాంటి పుస్తకాలు ఇంకా రావలసిన అవసరం ఏంతైనా ఉంది.
తెలిదేవర భానుమూర్తి
(వార్త 21 జూన్ 2009 ఆదివారం సౌజన్యంతో)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
దేవులపల్లి కృష్ణమూర్తి అన్‌ట్రెయిన్డ్ టీచర్‌గా సంవత్సరంన్నర పనిచేసి, 1960లో నల్లగొండ జిల్లాలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఎల్‌డీసీగా చేరి 1998లో మండల రెవెన్యూ అధికారిగా రిటైరైనారు. అభిరుచులు: సాహిత్యం సంగీతం, జానపదాలు, చిత్రలేఖనం, ఆర్ట్ ఫిలింలు. ఇప్పుడు నకిరేకల్‌లో వుంటున్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఊరు వాడ బతుకు
రచన: దేవులపల్లి కృష్ణమూర్తి
135 పేజీలు, వెల: రూ.40
............................
Monday, June 29, 2009
భారత చరిత్రలో రైతు ... ఇర్ఫాన్ హబీబ్ ...తెలుగు అనువాదం : హనుమంతరెడ్డి (హెచ్‌ఆర్‌కె) ...
భారత చరిత్రలో రైతు
- ఇర్ఫాన్ హబీబ్
మానవ జాతి పరిణామక్రమంలో రైతాంగం చాలా విశిష్టమైన పాత్ర నిర్వహించింది. భవిష్యత్తులో మరింత గొప్ప పాత్ర నిర్వహించాల్సి వుంది. గత శతాబ్ద కాలంగా ప్రపంచాన్ని కుదిపివేసిన పలు సంఘటనలే దీనికి తార్కాణం అంటారు ఇర్ఫాన్ హబీబ్.
భారత దేశ చరిత్రలో ఇప్పటి వరకూ శిఖరాగ్ర సదృశమైన సంఘటనలన్నిటికీ రైతాంగమే కేంద్ర స్థానం. నాటి, నేటి పలు తీవ్ర సమస్యలు సారాంశంలో రైతాంగ సమస్యలే.
భారత దేశ చరిత్రలో రైతు ఎలా ఆవిర్భవించాడు?
ఏయే దారులగుండా అతడి ప్రయాణం సాగింది?
కులాలు ఏవిధంగా ఏర్పడ్డాయి?
చరిత్రలో ఎలాంటి పాత్ర నిర్వహించాయి?
అస్పృశ్యులనే వారి పుట్టు పూర్వోత్తరాలేమిటి?
ఐరోపా రైతు పరిణామానికీ మన దేశ రైతుకూ తేడా ఏమిటి?
మన దేశంలో రైతాంగం ఎందువల్ల సంఘటితం కాలేకపోయింది?
మొదలైన ప్రశ్నలవైపు దృష్టి సారింపజేసి, ఆలోచింపజేసే చారిత్రక విశ్లేషణే ఈ వ్యాసం.
మార్క్సిస్టు చరిత్రకారుడిగా సుప్రసిద్ధులైన ఇర్పాన్ హబీబ్ మొన్నటి వరకూ అ లీఘర్ ముస్లిం యూనివర్సిటీ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ హిస్టరీ లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
''అగ్రేరియన్ సిస్టమ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్'' (1982) వంటి పుస్తకాలను వెలువరించడమే కాక కేంబ్రిడ్జి ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, వాల్యూం -1'' (1982)కు జాయింట్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన రాసిన పలు వ్యాసాలు ''ఎస్సేస్ ఇన్ ఇండియన్ హిస్టరీ'' (1999) అనే పుస్తకంగా వెలువడ్డాయి.
ఈ పుస్తక అనువాదకులైన హనుమంతరెడ్డి (హెచ్‌ఆర్‌కె) తెలుగు పాఠకులకు కవిగా, రచయితగా, పత్రికా విలేఖరిగా సుపరిచితులు. స్వయంగా అనేక రచనలు చేయడంతో పాటు ఎన్నో ఇతర పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.
భారత చరిత్రలో రైతు
-ఇర్ఫాన్ హబీబ్
ఆంగ్లమూలం: The Peasant in Indian History, Presidential Address, Indian History Congress, Kurukshetra 1982, Published in Social Scientist Vol. II.
తెలుగు అనువాదం: హనుమంతరెడ్డి
ప్రథమ ముద్రణ: 1985
ద్వితీయ ముద్రణ: 2000
32 పేజీలు, వెల: రూ.9
…………………….
Saturday, June 27, 2009
బతుకంతా (కన్నడ మూలం: ఒడళాల) ... దేవనూర మహదేవ... అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్య ...
ఎవరో వచ్చి తమను ఏదో ఉద్ధరిస్తారనే పగటి కలలకు దూరంగా - సుఖదుఃఖాలను పెనవేసుకుని, ఆప్యాయం అనురాగంతో ఒకరి కొకరు తోడుగా నీడగా బతుకంతా సాగించే దళితుల, నిరుపేదల బతుకుల ప్రతిబింబింబం ఈ 'బతుకంతా...' కథ.
అష్టకష్టాలతో జీవనం సాగిస్తూ అర్థాకలితో అ లమటిస్తూ బతుకు బండిలాగే నిరుపేద కుటుంబాలు సాంఘికంగా ఏ స్థితికి నెట్టబడ్డాయో సజీవంగా చిత్రిస్తూ, వారిపై ''పైవారి'' దౌష్ట్యం ఏవిధంగా సాగుతోందో తెలియజేస్తుంది మనకీ కథ.
దేవనూర మహదేవ కర్ణాటక ప్రాంతంలో సుపరిచితులైన ప్రఖ్యాత దళిత రచయిత. ''వ్యాపనూర్ కథలు'' ఈయన మొదటి కథా సంకలనం. ''ఒడళాల'' (బతుకంతా ...) రెండవ రచన.
ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు ఈ కథను తెలుగులోకి అనువదించారు.
బతుకంతా ...
రచన: దేవనూర మహదేవ
కన్నడ మూలం: ఒడళాల
తెలుగు అనువాదం : వల్లంపాటి వెంకటసుబ్బయ్య
ముఖచిత్రం : సూరిబాబు
ప్రథమ ముద్రణ : 1984
ద్వితీయ ముద్రణ : 2000
24 పేజీలు, వెల : రూ.7
.......
Tuesday, June 23, 2009
ఊరు వాడ బతుకు ... దేవులపల్లి కృష్ణమూర్తి గారి పుస్తకంపై అరుణ పప్పు గారి సమీక్ష
అరుణ పప్పు గారు తన అరుణమ్ బ్లాగులో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇటీవలనే ప్రచురించిన దేవులపల్లి కృష్ణమూర్తి గారి ఊరు వాడ బతుకు పుస్తకాన్ని సమీక్షించారు. వారికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ సమీక్షను మా బ్లాగు సందర్శకుల సౌకర్యం కోసం తిరిగి ఇక్కడ యదాతథం గా పొందుపరుస్తున్నాము
ఊరు వాడ బతుకు
మామిడాల మా అమ్మమ్మ ఊరు, మూసీనది దాటి పోవాలె. వేరే బాటలేదు. అనాజిపురం దగ్గర నుండి మూసీనది దాటాల్సి ఉంటుంది. ఎండకాలంలోనే రెండుమూడు పాయెలు పారేది. మిగతా కాలంలో నిండుగా పారుతుండేది. నడుముల లోతు నీరుంటే కూడా ఇద్దరు ముగ్గురు జంటలు జంటలుగా పట్టుకొని లోతులేని దగ్గర నుంచి ఏరు దాటి పోయేది. వానలను ఏరు నిండుగా పారేది. చెట్లు, కొమ్మలు కొట్టుక వచ్చేవి. అప్పుడు దాటటం కష్టం. సద్దిమూట ఏటి ఒడ్డున విప్పుకొని తిని కాస్త అలిపిరి తీసుకుని బాట పట్టెటోళ్లం. ఏటి ఒడ్డున సద్ది మూట విప్పితే తెల్లని బువ్వలో మామిడికాయ తొక్కు కలిసిపోయి ఎర్రమందారం అయ్యి, కమ్మని రుచేసేది. నాభికాడ చల్లబడితే నవాబు కాడ జవాబియ్యొచ్చు. నడిచి నడిచి అలసి ఉన్న పానం ఏటి ఒడ్డున చల్లని గాలికి హాయిగా తేలిపోయేది. తిన్నరేవును తలవాల.
* * * *
దొరోరి వ్యవసాయమంటే ఎంత జేస్తుండో, ఎంత పండుతుందో ఎవరికి అంచనా దొరికేదికాదు. ‘దొరలయవుసం బడుగులపాడు’. ఊరిపక్క పొలాలు చెల్కలన్నీ వాళ్లవే. మా ఇంటికి ఎదురుగానున్న పొలం దొరోరిదే. నాట్లు వేసేటప్పుడు, కలుపుతీసేటప్పుడు, కూలీలు పాడే పాటలు నాకెంతో ఇష్టం.
బొల్లిబొల్లి గుట్ట మీద నాగుమల్లె దారిలో
పొడిచినాడె చందమామ నాగుమల్లె దారిలో
నీకు మామ నాకు మామ నాగుమల్లె దారిలో
తెల్లబట్ట కట్టుకోని నాగుమల్లె దారిలో
తెల్లజొన్నలేయబోతే నాగుమల్లె దారిలో
వాడు చూచె చూపులకు నాగుమల్లె దారిలో
తెల్లబట్ట తేలిపాయె నాగుమల్లె దారిలో
* * *
లెవీగింజల వసూళ్లకని గిర్దావరు వస్తుండేటోడు. గిర్దావరు అంటే ప్యాంటుమూటు వేసుకొని వుండేటోడు. ఊర్లోకి గిర్దావరు వచ్చిండంటే హడలు. రైతులు ఎక్కడోళ్లక్కడ చెల్కలకు పోయేటోళ్లు. ఇంటింటికి పోయి లెవీ ధాన్యం కొలువమని బలవంతం చేస్తుండేటోళ్లు. పంటలే తక్కువ. ఇక లెవీ ఎక్కడిస్తరు? ఈ భయానికి రైతులు ఊర్లో లేకుండా చెల్కలకు పోయేటోల్లు.
కుప్పనూర్చినాడమ్మా చందమామ రైతూ
అప్పుతీర్చినాడమ్మా చందమామ రైతూ
కష్టించి పైరులు పెంచి చందమామ రైతూ
పండించి ప్రభువులకు పంచి చందమామ రైతూ
మేలు రకం అమ్ముతాడమ్మా చందమామ రైతూ
తాలు రకం తింటాడమ్మా చందమామ రైతూ
లోకాన్ని బతికిస్తాడే చందమామ రైతూ
శోకాన్ని భరియిస్తాడే చందమామ రైతూ
ఎన్నకన్నా మెత్తనివాడే చందమామ రైతూ
నీ కన్నా చల్లని వాడే చందమామ రైతూ
* * * *
తహసీల్ ఆఫీస్ దగ్గరలో ఆవుల పిచ్చయ్య అనే కమ్యూనిస్టు నాయకుడు వుండేవాడు. ‘ఆసియాలోనే పెద్ద భూపోరాటం తెలంగాణలో జరిగింది. ఒక దశకు వచ్చిన సమయంలో కమ్యూనిస్టు పార్టీలోని కొందరు అకారణంగా నెహ్రూపై భ్రమలు పెట్టుకొని ఉధృతంగా సాగుతున్న పోరాటాన్ని నీరుగార్చిండ్రు. పోరాట విరమణ తర్వాత కూడా మిలటరీ చేతుల్లో హతమార్చబడ్డరు. ఎట్లాగైనా కమ్యూనిస్టు రాజ్యం వస్తుందని ఉన్న ఆస్తిపాస్తులను వదులుకొని పార్టీలో చేరిండ్రు. ఆఖరికి కన్నబిడ్డలను కూడా వదులుకున్నరు. పోరాట విరమణ తరువాత కేసుల్లో ఇరికించి నానా ఇబ్బందులు పెట్టిండ్రు. మర్దరు కేసుల్లో ఇరికిస్తే ఉరిశిక్షలకు కూడా గురి అయ్యిండ్రు.
ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం.
నష్టపోయింది కింది స్థాయి కేడరే.’ అంటూ తన బాధ వెల్లబోసుకుండు. నాకు అంతగా అర్థం అయ్యేది కాదు, కాని ఏదో విద్రోహం జరిగిందనిపించేది. ఎట్లైనా కమ్యూనిష్టు రాజ్యం వస్తుంది. ఇక నా తిండికి ఇబ్బంది వుండదు. కాబట్టి పార్టీలో ఫుల్ టైమ్ వర్కరుగా పోదామనుకున్నా. ఈ విషయం బి.ఎన్. రెడ్డి గారితో చెబితే తొందరపడకు చదువు పూర్తికానివ్వు తర్వాత చూద్దాం అన్నడు. పెద్ద మనిషి మాట కాదనలేక చదువుపైననే శ్రద్ధ పెట్టిన. సూర్యాపేటలో ఎప్పుడు కమ్యూనిష్టులు మీటింగ్ పెట్టినా అది ఎర్రసముద్రం అయ్యేది. దాన్ని చూసి నేను రష్యా, చైనాలో వున్నట్లుగా భ్రమించేవాడిని.
* * * *
మా మిత్రుడు మన్సూర్ అహ్మద్ తండ్రి ఖాసీంపేట జాగీర్దార్. రామయ్య సార్ ఇంటి పక్కనే ఉంది వాడి బంగ్లా. తండ్రి చనిపోయిండు. తల్లి, తను, చెల్లెలు కలసి వుంటున్నరు. అది వెనుకట కట్టించిన పెద్ద బంగ్లా.రిపేర్లు చేయక పాతబడిపోయింది. గోడలకు రాగిచెట్లు పుట్టినవి. పేరుకు జాగీర్దారే కాని ఇప్పుడేమీ మిగలలేదు. ‘తుర్కలెవుసం బురకలపాడు’. వున్నభూముల్లో కౌలుదార్లు వున్నరు. వాళ్లు కొనరు, ఇంకోళ్లకు అమ్మనియ్యరు. అయినా కొంత కొంత కౌలుదార్లకే అమ్ముతూ జీవనం సాగిస్తున్నరు. మేము వాడ్ని ఆటపట్టించడానికి ‘నీకేమిరా జాగీర్దారువు’ అంటూ వుండేవాళ్లం.
ఒకసారి బక్రీదు పండగ వచ్చింది. నేను లక్ష్మణాచారి క్రిష్ణారెడ్డి రేపు మీ ఇంటికి వస్తున్నాం దావత్ ఇవ్వాలిరా అన్నం. దానికి వాడు ఏమి సమాధానం చెప్పలేదు. అయినా మేము మధ్యాహ్నం వాని ఇంటికి వెళ్లినం. మాకు బాదాం కీర్ ఇచ్చిండ్రు తాగినం. అదోఇదో మాట్లాడుకుంటూ వుండిపోయినం. మధ్యాహ్నం రెండు అయింది. వాళ్లమ్మ మమ్ములను భోజనానికి లేవమని అంది. మేము కాళ్లు చేతులు కడుక్కొని దస్తర్ ఖానాపై కూర్చొన్నం. ప్లేట్లు పెట్టిండ్రు. అన్నం వడ్డించిండు. ముందు నాలుగు పింగాణి గిన్నెలు వున్నయి. మా దోస్తు ఖానా షురూ కీజియె అన్నడు. ఆ గిన్నెలపై మూతలు తీస్తే అన్నిట్లో మామిడికాయ పచ్చడి మాత్రమే వుంది. ఏ లీజియే, ఓ లీజియే అంటూ ఆప్యాయతతో వడ్డించడం మొదలుపెట్టిండు.ఆఖరికి ఒక గిన్నెలో కట్టా అంటూ తెచ్చిండు. అది పచ్చిపులుసు. దానితో భోజనం ముగించినం.
మావాడి తల్లి ఎంతో ప్రేమతో పలుకరించింది. ‘పండుగపూట నాడు మావాడు దోస్తులను పిలిచిండు. ఏమేమో చేద్దామనుకున్నం బేటా, పైసలందలేదు, ఉద్దెర దొరకలేదు, గరీబోంకా దావత్ హై కుచ్ మత్ సమఝ్ నా ’ అంటూ కంట నీరు పెట్టుకుంది. నహి అమ్మా ఐసా మత్ సోచో హమ్ బహుత్ ఖుష్ హై అంటూ మావాడికి ఈద్ ముబారక్ చెప్పి బయటపడ్డం. మావాడి మనసు గొప్పది. ఏమి పెట్టాడు అన్నది కాదు ఎలా పెట్టింది అన్నదే ముఖ్యం. ఆ మంచి మనసుకు వందనాలు చెప్పుకున్నం.
* * * *
దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన ‘ఊరు వాడ బతుకు’ పుస్తకాన్ని నవల అనాలో, ఆత్మకథ అనాలో తెలియదు.
అరవయ్యేళ్ల వెనక్కి తీసుకెళ్లి తెలంగాణ గ్రామప్రాంతాలను, అక్కడి జీవనవిధానాన్నీ కళ్లకు కట్టినట్టుగా చూపించిన ఈ పుస్తకం చదవదగ్గది అని మాత్రం చెప్పగలను.
నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా నాగులపాడు పరగణాలోని అనంతారంలో 1940లో సాలె (పద్మశాలి) కుటుంబంలో పుట్టారు కృష్ణమూర్తి. ఆయన రాసిన ‘ఊరు వాడ బతుకు’ పేరుకు తగ్గట్టే నాటి
గ్రామాలను అత్యంత సహజంగా మనముందు నిలబెడుతుంది.
రుతువులు, జానపద గీతాలు, కులభావనలేని కులాలు, పల్లెటూరి వృత్తులు, పండగలు, పేదరికం, ప్రేమ, సమిష్టి కుటుంబాలు, స్నేహాలు, పోరాటాలు అన్నిటినీ సహజ సుందరంగా చిత్రించిన ఈ పుస్తకాన్ని వీలయినప్పుడు చదవండి.
135 పేజీలున్న ఈ పుస్తకం ధర నలభై రూపాయలు. పేజీల్లో అక్కడక్కడా ఆకట్టుకునే బొమ్మలు లక్షణ్ ఏలేవి. ఈ నెలే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది
Sunday, June 21, 2009
శూద్రులు - ఆర్యులు - డా. బి.ఆర్.అంబేడ్కర్ ... అనువాదం : బొజ్జా తారకం ...
శూద్రులు - ఆర్యులు
- డా. బి.ఆర్.అంబేడ్కర్
భారతదేశంలో కుల సమస్య చాలా ప్రధానమైనట్టిది.
సామాజిక శాస్త్రవేత్తలనింకా కలవరపెడుతూనే ఉన్నది.
ఈ సమస్యపై విదేశాలకు చెందిన పరిశోధకులు చేసినంత కృషి భారత దేశంలోని పరిశోధకులు చెయ్యలేదనే చెప్పాలి.
ఈ సమస్యపై కృషి చేసిన పరిశోధకుల్లో డాక్టర్ అంబేడ్కర్ ఒకరు. వేదాలనూ, ఇతర గ్రంథాలనూ పరిశోధించి ఆర్యుల ఉనికి గురించీ, భారతదేశంలో వారి స్థానం గురించీ తెలియజేయడమే కాకుండా ఇంతవరకూ వెనక్కు నెట్టివేసివున్న శూద్రుల సమస్యపై సమగ్ర పరిశోధన చేసి ''హూ వర్ ది శూద్రాస్'' (శూద్రులు ఎవరు?) అనే పుస్తకాన్ని రాశారు.
ఆర్యుల, శూద్రుల మూలాలు, చాతుర్వర్ణ వ్యవస్థలో వారి స్థానాలు ఏమిటి? బ్రాహ్మణులు, శూద్రులు ఎవరెవరు? వర్ణాలు నాలుగా మూడా? అనే విషయాలపై చాలా పరిశోధన చేసి రాసిన పుస్తకం ఇది.
డాక్టర్ అంబేడ్కర్ సూచించిన అంశాలు తీసుకొని సామాజిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ సమస్యపై ఇంకా కృషి చేస్తారని మా ఆశ. అందకుండా ఎక్కడో దాచిపెట్టిన విషయాలను తెలుగు పాఠకులకు అందించడానికే ఈ ప్రయత్నం.
అనువాదకులు బోజ్జా తారకం ప్రముఖ న్యాయవాది. పౌరహక్కుల, దళితుల సమస్యల గురించి తోడ్పడుతున్నారు. వీరు రాసిన ''పోలీసులు అరెస్టు చేస్తే...'' పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రజోపయోగకరమైన మరెన్నో పుస్తకాలను రచించారు.
శూద్రులు - ఆర్యులు
- డా. బి.ఆర్.అంబేడ్కర్
-
అనువాదం : బొజ్జా తారకం
ప్రథమ ముద్రణ: 1984, పునర్ముద్రణ : 2001
32 పేజీలు, వెల : రూ.8
,,,,,,,,,,,,,,,,,,,,,
Thursday, June 18, 2009
మంచీ చెడూ (నవల)…రచన: శారద … సంక్షిప్తం: సహవాసి … బ్మొమ్మలు: కాళ్ల
మంచీ చెడూ (నవల)…
రచన: శారద ...
అరవై డెబ్బై ఏళ్ల కిందట వందకు పైగా కథలు, ఆరు నవలలతో ఆంధ్ర దేశాన్ని వశీకృతం చేసుకుని అశేష తెలుగు పాఠకలోకానికి శారద గా పరిచితుడైన ఈ రచయిత అసలు పేరు నటరాజన్.
ఈయన తెలుగువాడు కాదు. స్కూల్లో చదువుకోలేదు. 12-13 ఏళ్లు వచ్చేదాకా ఆంధ్రలో అడుగుపెట్టి ఎరుగడు. బ్రతుకు తెరువు వెతుక్కొంటూ మద్రాసు నుంచి తెనాలి వచ్చి వంటవాడిగా స్ధిరపడ్డ నటరాజన్ తెలుగు నేర్చుకున్నాడు.
సాంస్కృతిక సంప్రదాయ వారసత్వం కలిగిన తెనాలి, త్రిపురనేని రామస్వామి చదౌరి మొదలు చలం, చక్రపాణి, కొడవటిగంటి, జి.వి.కృష్ణారావు ప్రభృత భావ విప్లవకారులైన సంస్కర్తలు, రచయితల నెందరినో పూచిన తెనాలి నటరాజన్‌ను సహజంగానే ప్రభావితం చేసింది.
జీవితం పాఠాలు నేర్పింది.
అతనిలోని సృజనశీలి మేలుకొన్నాడు, వికసించాడు. సాహితీ పరిమళాలు వెలార్చాడు.
శారద (నటరాజన్) తొలి కథ... ప్రపంచానికి జబ్బు చేసింది. 1946లో ప్రజాశక్తిలో వెలువడింది.
ఆ తరువాత జ్యోతి, తెలుగు స్వతంత్ర, విశాలాంధ్ర, యువ, రేరేణి వగైరా ఎన్నో పత్రికల్లో ఆయన రచనలు అచ్చయ్యాయి.
1950 ప్రాంతంలో వెలువడిన ఏది సత్యం నవల ప్రతులన్నీ ఒక్క నెలలో అయిపోయాయి. ఆనాడది అపూర్వమైన రికార్డు ఆంధ్ర పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన ... మంచీ-చెడూ, అపస్వారాలు నవలలు తెలుగు పాఠకలోకాన్ని ఊపిశేశాయి. ముసిరిన దారిద్య్రంలో శారద కన్ను మూశాడు.
మంచీ-చెడూ, అపస్వారాలు సమాజంలో ఆనాడు కొత్తగా చోటుచేసుకొంటున్న వ్యాపార విలువలను చిత్రించాయి. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ వస్తూన్న మనుషుల స్వభావ శీలాల పరివర్తనాన్ని కళ్లకు కడతాయి ఆ నవలలు.
శారద జీవితం వ్యక్తిత్వం, జనం కోసం కలం పట్టాలన్న ఆయన తపన తరాలు గడచిపోయినా పలిగిపోని స్ఫూర్తి దీపమై
నిబద్ధతగల వర్ధమాన రచయాతలందరికీ ఇన్‌స్పిరేషన్ యిస్తాయి.
......
మంచీ చెడూ
రచన: శారద
సంక్షిప్తం: సాహవాసి
బ్మొమ్మలు: కాళ్ల
వెల: రూ.25
Wednesday, June 3, 2009
కొత్త పుస్తకం : ఊరు వాడ బతుకు... దేవులపల్లి కృష్ణమూర్తి రచన ... వి.వి. ముందుమాటతో ...
ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి ...
''...ఇరవై ఏళ్ల క్రితం జెఎన్‌యు ప్రొఫెసర్ జి.పి.దేశ్‌పాండే అద్భుత పరిచయంతో అప్పుడు అర్జున్ డాంగ్లే అనువాదం చేసి ఓరియంట్ లాంగ్మన్ వాళ్లు ప్రచురించిన మరాఠీ దళిత ఆత్మకథలు చదివిన అనుభూతి మళ్లీ ఈ పుస్తకం చదివితే కలిగింది.
తెలుగులో ఇట్లా ఎవరైనా ఆత్మకథలు రాసుకున్నారా తెలియదు. రావూరి భరద్వాజ ''జీవన సమరం'', దాశరథి రంగాచార్య ''జీవన యానం'', దాశరథి కృష్ణమాచార్య ''యాత్రాస్మృతి'' వంటివి లేవని కాదు.
బహుశా ఈ ''ఊరు వాడ బతుకు'' రావూరి భరద్వాజ ''జీవన సమరం'' వంటిది.
అయితే ఈ రచనా పథకం చాలా విచిత్రమైంది. అందువల్ల తెలుగు ఆత్మకథల్లో ఇది విలక్షణమైనది. అపూర్వమైనది.
ఆయనకింకా ఇరవై ఏళ్ల వయస్సు కూడా రాకుండానే, ఆయనగా తనదయిన జీవితంలోకి, వైవాహిక జీవితంలోకి ప్రవేశించే దగ్గరే ఈ నవల వంటి ఆత్మకథ ముగుస్తుంది. బహుశా ఇది మొదటి భాగమేమో.
కాదు. ఇప్పటికే నాలుగు భాగాలు 1) బాల్యం 2) ప్రాథమిక విద్య, 3) మాధ్యమిక విద్య, 4) ఉన్నత విద్య - పదవ తరగతి వరకు (తెలంగాణాలో అప్పటికదే గొప్ప. తహసీల్దార్ కావచ్చు!).
బాల్యంలో పోలీసు చర్య పేరుతో జరిగిన సైనిక చర్యకు ముందు జీవితం, కమ్యూనిస్టు ఉద్యమం రజాకార్లు, ప్రవాసం.
చదువులో అనంతారం, సూర్యాపేట అనుభవాలు.
నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా నాగుల పాటు పరగణాలోని అనంతారంలో 1940 కృష్ణాష్టమి నాడు పుట్టాడు గనుక కృష్ణమూర్తి అని పేరు పెట్టారు.
'బడికి పోయేటప్పుడు పుట్టిన తేదీ 14.06.1940 అని రాసిండ్రు'.
1958 ఏప్రిల్ 9న చివరి పరీక్ష మధ్యాహ్న వరకు రాసి సైకిల్ మీద ఊరికి పోయి అంతకు ముందే నిర్ణయమైవున్న ముహూర్తానికి పెళ్లి చేసుకున్నాడు. అంటే అప్పటికింకా ఆయనకు 18 ఏళ్లు నిండలేదు.
''1958 ఏప్రిల్ 9న చివరి పరీక్ష మధ్యాహ్నం వరకు అయిపోయింది.
అదే రోజు రాత్రి (నా) పెండ్లి.
అప్పుడు బస్సులేదు.
సైకిల్ కిరాయకు తీసుకున్న.
నాకు తొక్కడం సరిగ్గా రాదు.
అప్పుడప్పుడు స్నేహితులు సైకిల్ కిరాయకు తీసుకుంటె ఒకటి రెండు చక్కెర్లు కొట్టేటోణ్ని. అంతంతమాత్రం తొక్కేటోణ్ని.
సైకిల్‌ను ఊరి బయటి దాక నడిపించి రాయి చూసుకుని, రాయిమీద కాలుబెట్టి సైకిలెక్కి తొక్కడం మొదలుపెట్టిన.
చిన్నగ తొక్కుకుంటూ పోయిన.
ఏదైన బస్సు, లారీ ఎదురొస్తే దిగి మరల ఎక్కేటోణ్ని.
ఎట్లయితేంది ఇంటికి చేరుకున్నా.
ఇంకా (పెండ్లి కొడుకు) రాలేదేమని ఎదురుచూస్తుండ్రు.
వచ్చినందుకు సంతోషించిండ్రు.
బయలుదేరి బండ్ల మీద నకిరేకల్ చేరుకున్నం.
పెండ్లి అయ్యేవరకు కలికి గాంధారి వేళ అయింది.
నా భార్య పేరు కమల.''
ఇది కథన పద్ధతి.
పద్దెనిమిదేళ్ల జీవిత కథ పద్దెనిమిది పర్వాల మహాభారత కథకన్నా తక్కువ ఆసక్తిదాయకంగా ఏమీ లేదు.
పైగా మహాభారతం శ్మశానంగా మారిన యుద్ధ భూమి నుంచి స్వర్గారోహణతో ముగుస్తుంది.
ఈ పద్దెనిమిదేళ్ల జీవిత కథ కమల కలికి గాంధారి వేళ కృష్ణమూర్తి జీవితంలో ప్రవేశించడంతో నిజానికి జీవితం మొదలవుతుంది.
ఎంత బాగా రాసాడు.ఎంత అద్భుతంగా రాసాడు.
ఇది ఒక దృశ్య కావ్యం.
పథేర్ పాంచాలీ వంటి జానపద బాధల గాథ.
మా కృష్ణమూర్తేనా రాసింది.
నలభై ఏళ్లుగా నాకు తెలిసిన కృష్ణమూర్తి ... అని ఆశ్యర్యపోవడం కన్నా విశ్లేషణ కందనిదీ అపూర్వ గ్రంథం.
- వి.వి. (ముందుమాట నుంచి)
ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి
ముఖచిత్రం, బొమ్మలు : లక్ష్మణ్ ఏలే
మొదటి ముద్రణ: మే 2009
136 పేజీలు, వెల: రూ.40
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ నెం. 040 2352 1849
ఇమెయిల్: hyderabadbooktrust@gmail.com
మా పుస్తకాలని ''ఎవికెఎఫ్ బుక్ లింక్'' వారి ద్వారా (http://www.avkf.org/BookLink/book_link_index.php) కూడా పొందవచ్చు.
......................................................................
దేశమంటే మార్కెట్ కాదోయ్ ... డబ్ల్యు.టీ.ఓ. కథా కమామిషు ... ఎస్. జయ ...
దేశమంటే మార్కెట్ కాదోయ్
(డబ్ల్యు.టీ.ఓ. కథా కమామిషూ)
ప్రపంచీకరణ చుట్టూరా సాగుతున్న చర్చలు, వాదోపవాదాలూ ఊహలతోనే గత దశాబ్ది సాంతం గడిచిపోయింది.
ప్రపంచాన్నంతా ఒక కుగ్రామం (గ్లోబల్ విలేజ్)గా చేసి, రచ్చబండ (రౌండ్) చర్చలు జరుపుతూ, ప్రపంచంలోని బడుగు ప్రజలకు ప్రపంచీకరణ చేస్తున్నదేమిటి?
ప్రపంచీకరణకు మూలం ఉదారవాదం.
నిర్మాణాత్మక సర్దుబాటు పేర ఒక కొత్త అందమైన పదాన్ని ప్రపంచీకరణం అందరిముందు పెట్టింది.
అంటే ధనిక పేద దేశాల మధ్య వున్న అసమానతల్ని తొలగించి మొత్తం ప్రపంచ వ్యవస్థను సరిదిద్దుతానంటూ ముందుకు వచ్చింది.
గాట్ (ఉరుగ్వే రౌండ్) చర్చలను కీలకమైన పనిముట్టుగా ఉపయోగించుకొని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ.)ను ఏర్పాటు చేసింది.
ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్. వంటివి దేశాలకు అప్పులు యిచ్చి నిబంధనల్ని రుద్దడం ద్వారా ఆయా దేశాల జాతీయ చట్టాల్ని, పథకాల్ని నిర్వీర్యం చేస్తున్నాయి.
జాతీయ ప్రభుత్వాలు ప్రజలకోసం పనిచేయడం కాకుండా ఐ.ఎం.ఎఫ్., ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో సంపన్న దేశాలకోసం పనిచేసే స్థితికి నెట్టబడ్డాయి. ఇప్పుడు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం జరిపించడం కోసం ప్రపంచ వాణిజ్య సంస్థను ముందుకు తీసుకొచ్చింది.
పేద దేశాలు కూడా ప్రపంచీకరణ ప్రక్రియలో చురుకైన పాత్ర పోషించవచ్చని ఒక వాదన లేకపోలేదు. స్వేచ్ఛా వాణిజ్యంలో పేద దేశాలు పాల్గొనడమంటే సంపన్న దేశాలతో సమాన స్థాయిలో వ్యాపారం చేయడానికి కాదు.
అవి సంపన్న దేశాలతో సమాన భాగస్వాములుగా వ్యాపారం చేయలేవు.
సంపన్న దేశాల వ్యాపార ప్రయోజనాల్ని పేదదేశాలు కాపాడాలి.
సంపన్న దేశాల వస్తువులకు మార్కెట్‌గా ఉపయోగపడాలి.
దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సదస్సులో ఇది మరింత భాగా వెల్లడయింది. 144 దేశాల సభ్యత్వం గల డబ్ల్యుటీఓ కేవలం 14 దేశాలు మాత్రమే నిర్ణయించిన అంశాల్ని తీర్మానాలుగా ప్రపంచ ప్రజల మీద రుద్దుతున్నది.
ఈ సందర్భంలో డబ్ల్యుటీఓ గురించి విపులంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
అందుకు ఈ చిన్న పుస్తకం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.
ఎస్. జయ కథలు, కవిత్వం వ్యాసాలు, స్త్రీవాద రచనలు చేస్తుంటారు. ఇటీవలే ''రెక్కలున్న పిల్ల'' కథా సంకలనం ప్రచురించారు. ''అన్వేషి''లో కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.
దేశమంటే మార్కెట్ కాదోయ్
(డబ్ల్యు.టీ.ఓ. కథా కమామిషూ)
ఎస్. జయ
ముఖచిత్రం: ప్రభాకర్ వైర్‌కర్
ప్రథమ ముద్రణ: 2002
36 పేజీలు, వెల:8
.......................
Monday, June 1, 2009
అంటబడనివాడు ... అంబేడ్కర్ అనుభవాలు ... తెలుగు అనువాదం: చిట్టిబాబు ...
అంటబడని వాడు ...
ఇవి అంబేడ్కర్ స్వయంగా రాసుకున్న నోట్సులోని విషయాలు.
కొన్ని ఆయన సొంత అనుభవాలు.
మరికొన్ని ఇతరుల అనుభవాలు.
'అంటరానితనం' అంటే ఏమిటో విదేశీయులకి వివరించాలని అంబేడ్కర్ వీటిని రాశారు.
బాల్యంలో ఎదుర్కొన్న వివక్ష, విదేశాలలో పెద్ద చదువులు చదివి ఇండియాకి తిరిగి వచ్చాక ఎదుర్కొన్న అవమానాలూ...
ఇలాంటి వాటి గురి,చి దాపరికం, ద్వేషం లేకుండా వర్ణించారు.
అంబేడ్కర్ ఆత్మకథ రాసుకోలేదు.
అంబేడ్కర్ తన గురించి తాను రాసుకున్న అతి కొద్ది అపురూపమైన నోట్స్ ఇది.
ఇందులో ...
విదేశీయులకి అర్థం కాని విషాచారం
ప్రాణాల మీదికి తెచ్చిన ప్రతిష్ట
ప్రవక్తను ఓడించిన మనువు
పాకీవాడు పటేలైతే...
వంటి శీర్షికలతో అంబేడ్కర్ అనుభవాలు, జ్ఞాపకాలు వున్నాయి.
అంటబడనివాడు
అంబేడ్కర్ అనుభవాలు
ఆంగ్ల మూలం:Ambedkar - Atobiographical Notes, by Navayana, 2003
తెలుగు అనువాదం: చిట్టిబాబు
తొలి ముద్రణ: 2003
20 పేజీలు, వెల: రూ.5
.............
Subscribe to:
Posts (Atom)