Wednesday, December 31, 2008

ఇస్లాం అవగాహన ఓ చిరుప్రయత్నం



సంక్లిష్ట భారతీయ సమాజంలో సామాజిక అంశాతిని ఎగదొసే పరిణామాలు ప్రతినిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయి. కొన్ని భగ్గుమని ఆరిపోతే మరికొన్ని రావణకాష్ఠంలా రగులు తుంటాయి.

ముంబైలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమం యావత్‌ దేశాన్ని కదిపేసింది.
ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో బాధితులకు మతం ఉండదు.
ఇలాంటి సంఘటనల నుంచి లబ్ది పొందాలనుకునేవారు మాత్రం మతాన్ని ఉపయెగించుకుంటారు. దీనివల్ల సామరస్య జీవనం నెత్తురోడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రధాన మతాల అనుయాయుల మద్య పరిపూర్ణమైన పరస్పర అవగాహన ఉండాలి.

భారత్‌లో ఇస్లాం వ్యాపించి కొన్ని వందల సంవత్సరాలైన్పటికీ మెజార్టీ సంఖ్యాకులైన హిందువుల్లో ఇస్లాం ఆవిర్భావం చారిత్రక నేపథ్యం, తమ ప్రాభవం భారతీయ సమాజంలో ఇస్లాం పాత్ర వగైరా అంశాలకు సంబంధించిన అవగహన చాలా తక్కువ.

ముందుస్తుగా ఏర్పడిన అభిప్రాయలతో ఇస్లాంను, ముస్లింలను చూసేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఉన్నత విద్యావంతులైన హిందువుల్లో కూడా అదే పరిస్థితి. ఇస్లాంకు సంబందించి పూర్తి అవగాహన హిందువుల్లో లేనట్టుగానే, తమ మతానికి సంబందించిన చారిత్రక జ్ఞానం కొరవడిన కారణంగా ముస్లింల్లో కూడా సంకుచిత్వం పేరుకుపోయిందటారు ఎంఎన్‌ రాయ్‌.

20 శతాబ్దంలో భారత్‌ గర్వించదగిన మహామేధావి ఎంఎన్‌ రాయ్‌ రాసిన చిరుపుస్తకం హిస్టారికల్‌ రోల్‌ ఆఫ్‌ ఇస్లాం ఎన్‌ ఎస్సే ఆన్‌ ఇస్లామిక్‌ కల్చర్‌. దీనినే ''ఇస్లాం చారిత్రక పాత్ర'' పేరుతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగులో ప్రచురించింది.

దేశ కాల మాన పరిస్థితులను బట్టి చూస్తే ఇది అత్యంత సందర్భోచితమైన ప్రచురణ. ఇస్లాం ప్రపంచగతిని ఏ విధంగా మార్చించిందో రచయిత అత్యంత ఆసక్తికరంగా వివరించారు.

ఇస్లాంను యుద్ధోన్మాదంగా భ్రమపడే పరిస్దితి ఎందుకు వచ్చింది?
ఈ తరహా అవగాహనకు కారణమైన అంశాలేమిటి?
ఇస్లాం విజయాన్ని సైనికవిజయంగా భావించడం సబబేనా అరబ్బుల సారథ్యంలో అత్యున్నత శిఖరాలకు చేరిన ఇస్లాం సంస్కతి ప్రాభవాన్ని దెబ్బతీసిన చారిత్రక అంశాలేవి?
ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఈ పుస్తకంలో సహేతుకమైన సమాధానాలు దొరుకుతాయి. హిందు ముస్లిం తేడా లేకుండా ఇస్లాం గురించిన శాస్త్రీయ అవగాహనకు అందరూ చదవదగిన ఈ పుస్తకంలో అనువాదంలో మరికొంత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
(- ఆదివారం ఆంధ్ర జ్యోతి 21-12-2208లో వెలువడిన పుస్తక సమీక్ష. సమీక్షకులు: వి. శ్రీనివాస్‌ )

ఇస్లాం చారిత్రక పాత్ర
ఎంఎన్‌ రాయ్‌,
తెలుగు: సుందరవర్దన్‌


ప్రతులకు. వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెంబరు 85, బాలాజినగర్‌,
గుడిమల్కాపూర్‌. హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌: 040 - 2352 1849

36 పేజీలు, వెల: రూ.25

యాభై ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ సంక్షోభం ... డి. నరసింహారెడ్డి ... తెలుగు అనువాదం: మామిడి భరత్‌ భూషణ్‌ ...



మన వ్యవసాయం సంక్లిష్టమైన సమస్యల రంగంగా మారిపోయింది.
ఎరువుల నుంచి రుణాల వరకూ ప్రతి అంశమూ రాజకీయ వివాదాల రంగు పులుముకుంటూ వాస్తవాలు ఎవరికీ పట్టనివైపోతున్నాయి.

అసలీ సమస్యల సుడిగుండాలకు మూలాలు ఎక్కడున్నాయో, గత యాభై ఏళ్ళుగా రాష్ట్ర వ్యవసాయ రంగం పయనం ఏ దిశగా సాగుతోందో లోతుగా విశ్లేషించే రచన ఇది.

భూ పరిమితులు, సంస్థాగత రుణాలు తగ్గిపోతుండటం, విస్తార సేవల వైఫల్యం సరళీకరణల వంటి కీలక సమస్యలన్నింటినీ ప్రొఫెసర్‌ డి. నరసింహారెడ్డి దీనిలో సవివరంగా చర్చిస్తూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలో ప్రణాళికాబద్ధమైన సూచనలు కూడా చేశారు.

హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా, స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగం డీన్‌గా వ్యవహరించి పదవీ విరమణ పొందిన ప్రొ. డి.ఎన్‌.ఆర్‌. ప్రస్తుతం న్యూఢిల్లీలోని 'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌' కు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. రాజకీయ ఆర్థిక విధానాలు, అభివృద్ధి రాజకీయాలు, జెండర్‌ అధ్యయనాలు, కార్మిక సంఘాలు, మార్కెట్లు, వ్యవసాయం వంటి రంగాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన వివిష్ట పరిశోధకులు. నయా ఉదారవాద విధానాలు బలహీన వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో లోతుగా పరిశోధించారు.

వ్యవసాయ రంగంపై ప్రొ. డి.ఎన్‌.ఆర్‌. రాసిన ''ఆర్థిక సంస్కరణలు: వ్యవసాయ సంక్షోభం - గ్రామీణ దుస్తితి'' పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇదివరలో ప్రచురించింది.


ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన మామిడి భరత్‌ భూషణ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాజ శాస్త్రం చదివారు. గత రెండు దశాబ్దాలుగా గ్రామీణాభివృద్ధి, పర్యావరణ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. పోలవరం ముంపు సమస్య, అటవీ వనరులపై ప్రజల హక్కులు, గిరిజన సంస్కృతి, 'అభివృద్ధి ప్రేరిత' నిర్వాసిత సమస్యలు, బాలల హక్కులు, పర్యావరణ సంబంధిత విషయాలపై పరిశోధన వ్యాసాలు రాశారు. ప్రత్యామ్నాయ ఉపాధి అంశాలపై ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ కార్యక్రమాల్లో సలహాదారుగా పనిచేశారు. తెలంగాణా ఉత్సవ కమిటీకి అధ్యక్షులు.

యాభై ఏళ్ల ఆంధ్రప్రదేశ& వ్యవసాయ సంక్షోభం
- డి. నరసింహారెడ్డి

ఆంగ్ల మూలం: Half a Century of Travails of Agriculture in Andhra Pradesh, Fifty Years of Andhra Pradesh, 1956-2006, CDRC, Hyderabad, 2006

తెలుగు అనువాదం: మామిడి భరత్‌ భూషణ్‌


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849

ముద్రణ: అనుపమ ప్రింటర్స్, గ్రీన్ వ్యూ, 126 శాంతి నగర్, హైదరాబాద్ - 28, ఫోన్: 040- 2339 1364 / 2330 4194


39 పేజీలు, వెల: రూ.20
..................

Monday, December 29, 2008

చివరి గుడిసె ... డా.కేశవరెడ్డి






కేశవరెడ్డికి శ్రోతగా ...

'చివరి గుడిసె' బాధామయం, భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో కూడిన విషాదాంత గాథ.

నాకు తెలిసినంత మటుకు ఇంత అద్భుతమైన కథని నేను తెలుగు సాహిత్యంలో ఇంతదాకా చదవలేదనే చెప్పాలి.

శిల్పంలో, చిత్రణలో, ప్రయోజనంలో ఒక 'కన్యాశుల్కం' ఒక 'యజ్ఞం' మాత్రమే దీనికి సాటి రాగల రచనలు.

అయితే గురజాడ, ఉన్నవ, కాళీపట్నం వంటి మహా రచయితలు ఒకే కాలానికీ, ఒకే వ్యవస్థకూ చెందిన వైరుధ్యాల్ని చిత్రించగా డా.కేశవరెడ్డి భిన్న వ్యవస్థలకు చెందిన వైరుధ్యాల్నీ, భూమిపైనా, పాతాళంలోనూ కూడా జరిగే పోరాటాన్నీ అత్యంత ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో చిత్రించారు ఈ నవలలో.
... ...
ఒక జాతిని తల్లి కడుపులోనించే నేరస్థులుగా నిర్ణయించిన ప్రభుత్వం గురించి ఏ యానాదికయినా స్పష్టంగా తెలుసు.

''గవుర్మెంటోళ్లంటే ఎవరు సావి? తాసిల్దారు, రివినిస్పెట్రూ, మనేగాడూ ఈళ్లేగదా గవుర్మెంటు'' అటువంటి ప్రభుత్వానికంతటికీ ఆధార స్తంభమయిన గ్రామ మణియాన్నే నిజమైన క్రిమినల్‌గా చూపించడమే ఈ కథా ప్రజ్ఞ.
....
డా.కేశవరెడ్డి భూస్వామ్య సమాజంలోని మానవత్వం బయటకి ప్రకటితం కావడానికి బైరాగినీ, భూస్వామ్య అమానుషత్వమంతటికీ మణియాన్నీ ప్రతినిధులుగా తీసుకున్నాడు. ఇద్దరిదీ 'చేను' గురించిన తాపత్రయమే.
... ...
ఒట్టి యానాదుల జీవితం గురించి, పీడన గురించి రాయడానికి మాత్రమే రచయిత ఈ కథని రాసాడనుకోను. తాను తొలినుంచీ ప్రయత్నిస్తున్న స్థూల, సూక్ష్మ పోరాటాల అత్యంత సునిశితమయిన చిత్రణకి ప్రయత్నించడమే ఈ ఇతివృత్తంలోని బలం.
... ...
( - వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందుమాట లోంచి)
.............................................................

ఒంటిల్లు అను స్తావర జంగమాత్మక ప్రపంచం


డాక్టర్‌ కేశవరెడ్డి నవలా ప్రపంచం గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు దుస్సాహసం కొద్దీ చెప్పబోయే ముందు ''మూగవాని పిల్లనగ్రోవి'' నవల చివరి వాక్యం ఇక్కడ ప్రస్తుతిస్తాను.

''పడమటి వైపు నుండి గ్రామంలోకి ప్రవేశించే వాళ్లు (బక్కిరెడ్డి) కానను సమీపించగానే తమకు తెలియకుండానే తమ నెత్తుల మీది తలపాగాలను తీసివేస్తారు. తమకు తెలియకుండానే వాళ్ల శిరస్సులు అవనతాలవుతాయి''.

కేశవరెడ్డి నవలలు చదివిన పాఠక ఆగంతకులకు కూడా ఆ బాటసారులకు కలిగిన అనుభవమే కలుగుతుంది. తమకు తెలియకుండానే వాళ్ల శిరస్సులు అవనతాలవుతాయి.

తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో పుట్టి, తెలుగుభాష చదవడం వచ్చి, ఆ భాషలో నవలలు చదివిన వాడికి మున్నెన్నడూ కలగని అనుభవం కేశవరెడ్డి నవలలు చదివితే కలుగుతుంది.

గొప్ప భావావేశం వారిని ముప్పిరిగొంటుంది.
గాఢానుభూతుల ప్రకంపనలు వారిని వివశులను చేస్తాయి.
వ్యాకులచిత్తులను చేయగల మహా సౌందర్యమేదో వారికక్కడ లభిస్తుంది.
స్పర్శేంద్రియాలకు లోబడని ఆథోలోకాన్ని వారు అక్కడ మొట్టమొదటిసారి స్పృశిస్తారు.

''మానవ సంబంధాలలోని రాక్షసత్వాన్ని, సృష్టి యొక్క నిరర్థకతను'' భగవంతునిలా నిర్దయగా క్రూరంగా విపులీకరించే నిర్వికారుడైన రచయితను మీరక్కడ దర్శిస్తారు.

రచయిత ముందు తమ కృతజ్ఞత వ్యక్తం చేసేందుకు మాటలు రాక, వచ్చిన మాటలు చాలక మరో మార్గం లేక వాళ్ల శిరస్సులు అవనతమవుతాయి.
... ... ...
(- అంబటి సురేంద్రరాజు రాసిన చివరిమాట నుంచి)

చివరి గుడిసె
డా.కేశవరెడ్డి

మొదటి ముద్రణ: ఆహ్వానం మాసపత్రిక, 1993, రీతిక పబ్లికేషన్స్‌ 1996
ముఖ చిత్రం: కాళ్ల

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849

ముద్రణ: అనుపమ ప్రింటర్స్, గ్రీన్ వ్యూ, 126 శాంతి నగర్, హైదరాబాద్ - 28, ఫోన్: 040- 2339 1364 / 2330 4194


158 పేజీలు, వెల: రూ.80

.............................

Sunday, December 28, 2008

మూగవాని పిల్లనగ్రోవి ... డా.కేశవరెడ్డి




....
'మూగవాని పిల్లనగ్రోవి' ఒక రైతు మరణ, పునరుత్థానాల గాథ. ఆ రైతు - ప్రయత్నం నుంచి వైఫల్యానికీ, వైఫల్యం నుంచి అభద్రతా భావానికీ, అభద్రత నుండి ఉన్మాదానికీ, ఉన్మాదం నుండి మరణానికీ నడిచిన కథ. తన మరణంలో ప్రాణత్యాగం చేసిన తీరువల్ల కర్మవీరుడై, అమరుడై, పురాణ పురుషుడైన కథ.

డా.కేశవరెడ్డి ఈ కథ ఇతివృత్తం ఎంచుకోవడంలో, కథని చెప్పిన తీరులో అసమాన కౌశలాన్ని ప్రదర్శించారు. ఈ కథలో కూడా పురాతన ఆసియా కథన సంప్రదాయాన్ని, ఆదిమ జాతుల విశ్వాస ధోరణిలో చెప్పే నేర్పు వల్ల ఇంతదాకా తెలుగు సాహిత్యంలో మనం వినివుండని అపూర్వ కథనాన్ని ప్రదర్శించారు.

మూగవాని పిల్లనగ్రోవి 'అతడు అడవిని జయించాడు' లాగానే ఒక వీరగాథ.

అయితే ఇది ఒట్టి వీరగాథగా ఆగిపోలేదు. ఆ వీర గాథ (legend) ఒక పురాణ ప్రతీక (myth) గా కూడా రూపొందింది ఇక్కడ.

ఇక్కడ రచయిత పురాణ ప్రతీకని ఇవ్వడంతో తన పని ముగించినట్టు కనబడినా అది నిజం కాదు. అటువంటి పౌరాణిక ముగింపు (mythological summation) ఇవ్వడంతోనే అతను మనల్ని వేధించడం మొదలు పెడుతున్నాడు.

ఎందుకు ఈ కథ ఇలా ముగిసింది?
ఈ కథకు యథార్థమయిన ముగింపు ఇదేనా??
ఇటువంటి పర్యవసానానికి కారణాలు ఎటువంటివి???

ఇటువంటి ప్రశ్నల పరంపరతో మనం ఆలోచనాపరులంకావడంలోనే రచయిత నిజమయిన విజయం వుంది.
బీదవాళ్లు భూస్వాములపై తిరగబడ్డారని ఎవరయినా రచయిత ఒక నవలని ముగిస్తే, ఆ ముగింపు మనని ఊరడిస్తుంది, మత గురువుల పరలోకం గురించిన ప్రభోధాలవలె.

ఆ ముగింపు మనకు ఇచ్చేది జాగృతి కాదు.
విశ్రాంతి!
అటువంటి రచన చదివిన తర్వాత మనకెటువంటి అ లజడీ కలగదు.
ఏప్రశ్నలూ రేకెత్తవు.

కానీ ఎంతో ప్రశాంతంగా, దివ్యంగా కనిపించే ఈ రచనలోని ముగింపు మనని ఎంతో ఆశాంత పరుస్తుంది. కథలో మణియం వలె మనం కూడా కారణాల అన్వేషణ మొదలుపెడతాం. ఎవరికి తోచిన కారణాలు వాళ్లు చెప్పడంతో చర్చ మొదలవుతుంది.

ఇటువంటి చర్చ నుండి ఒక సామాజిక జాగృతి పొటమరిస్తుంది.
....

(వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందుమాట లోంచి)

''మూగవాని పిల్లనగ్రోవి నవలలోనే కాదు, మిగిలిన నవలల్లో కూడా రచయిత ప్రతి సన్నివేశాన్నీ దృశ్యమానం చేస్తారు. “Writing as showing” కి కేశవరెడ్డి నవలలను మించిన దృష్టాంతం తెలుగులో మరొకటి లేదు.

అన్నీ పాఠకుల కళ్లముందే జరుగుతాయి.
పాఠకుడు ప్రతి కథనానికి ప్రత్యక్ష సాక్షి అవుతాడు. ప్రేక్షక పాత్రను దాటి దృశ్యంలో పాత్రగా, కథలో భాగస్వామిగా లీనమైపోయే పరిస్థితిని రచయిత కల్పిస్తాడు.

ఈ విధంగా ఆయన ప్రతి నవల ఒక దృశ్యకావ్యంగా, స్క్రీన్‌ప్లే గా రూపుదిద్దుకుంటుంది.

కేశవరెడ్డి నవలలతో విషయపరంగానే కాక రూపపరంగా కూడా గొప్ప సినిమాలు తీయవచ్చు.
స్క్రీన్‌ప్లే మళ్లీ రాసుకోనవసరం లేనంత గొప్పగా వుంటాయి ఆయన నవలలు.

భావాలతో పోలిస్తే మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు, రంగులు, వర్ణనలే కాదు చివరికి అంకెలు కూడా గొప్పవన్న హెమింగ్వే అభిప్రాయంతో ఏకీభావం వున్నందునే ఆయన ఇంత గొప్ప నవలలు రాయగలిగారా?

హెర్మన్‌ మెల్విల్‌, జాక్‌ లండన్‌, గోర్కీ (కథకుడు), నికోస్‌ కజాంట్జకిస్‌ (జోర్బాది గ్రీక్‌ నవల), హెమింగ్వే వంటి రచయితలతో పోల్చదగిన నవలా రచయిత కేశవరెడ్డి.

ఆంద్రీ తార్కొవిస్కీ 'శాక్రిఫైజ్‌' సినిమా చూసినప్పుడు కలిగిన భీతావహమే ''మూగవాని పిల్లనగ్రోవి'', ''చివరి గుడిసె'' నవలలు చదివినప్పుడు కలిగింది.

బి.వి.కారంత్‌ ''చొమనదుడి'' చూసినప్పుడు ...
దాగర్‌ బ్రదర్స్‌ 'రుద్రవీణ' విన్నప్పుడు ...
కుమార్‌ సహానీ 'ఖయాల్‌ గాథా' చూసినప్పుడు ...
కలిగే వివశత్వం కేశవరెడ్డిని చదివినప్పుడూ కలుగుతుంది.

హబీబ్‌ తన్వీర్‌ నాటకం,
రిత్విక్‌ ఘటక్‌ సినిమా ఆయన నవలలకు దగ్గరగా వుంటాయి.

“Man ought not to know more of a thing than he can creatively live upto” అని నీషే ఏనాడో చెప్పిన గొప్ప సత్యాన్ని అప్రయత్నంగా ఆచరిస్తున్నందువల్లే కేశవరెడ్డి నవలా వ్యాసంగాన్ని తపస్సులా దీక్షగా నిర్వర్తిస్తున్నారనుకోవాలి.''
...

(- అంబటి సురేంద్రరాజు రాసిన చివరి మాట లోంచి)


మూగవాని పిల్లనగ్రోవి (నవల)
రచన: డా.కేశవరెడ్డి

మొదటి ముద్రణ: ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 1993, రీతిక పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌ 1995.
ముఖచిత్రం: కాళ్ల

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849

ముద్రణ: అనుపమ ప్రింటర్స్, గ్రీన్ వ్యూ, 126 శాంతి నగర్, హైదరాబాద్ - 28, ఫోన్: 040- 2339 1364 / 2330 4194


132 పేజీలు, వెల: రూ.60
.......

Friday, December 26, 2008

తొలి యవ్వనంలో వచ్చే శారీరక మార్పులు, కలవరపరిచే సెక్స్‌ సందేహాలు - సమాధానాలు: : లెర్నింగ్‌ ఫర్‌ లైఫ్‌, ఎన్‌సిఇఆర్‌టి, నాకో, యునిసెఫ్‌, యునెస్కొ. తెలుగు



యుక్త వయస్సులో వున్న తన కొడుకు హస్తప్రయోగం చేసుకొన్నాడని తెలుసుకొన్న ఒక తండ్రి అతణ్ని విపరీతంగా కొట్టి, నలుగురికీ చెప్పి అవమానించి ఇంట్లోంచి తరిమేశాడని కొద్దికాలం క్రితం ఒక దినపత్రికలో వార్త వచ్చింది.
ఇందులో చేయరాని నేరం ఏం జరిగింది?
మోతాదుకు మించి స్పందించాల్సిన అవసరం ఆ తరడ్రికి ఎందుకు వచ్చింది?
ఇదంతా లైంగిక సమాచారం తెలియనందువల్ల జరిగిందనే చెప్పాలి.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ''జబ్బుల గురించి మాట్లాడుకుందాం'' సిరీస్‌లో భాగంగా వెలువడిన ... ''యవ్వనంలో వచ్చే శారీరక మార్పులు, కలవరపరిచే సెక్స్‌ సందేహాలు - సమాధానాలు'' పుస్తకంలో పిల్లలు ప్రైమరీ స్కూలు నుండి హైస్కూలు, జూనియర్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీ అని ఎలా దాటుకొంటూ పోతారో... అ లాగే వారిలో చోటుచేసుకునే శారీరక, మానసిక, ఆలోచనా మార్పుల మూలాన అవసరమయ్యే ముఖ్యంగా లైంగిక విషయాలపట్ల శాస్త్రీయ సమాచారాన్ని పొందుపరిచారు.
ఇందులోని 14 అధ్యాయాలలో ఒక్కోదానిలో ఒక్కో విషయాన్ని క్రమబద్ధంగా రాశారు.

పాఠశాల స్థాయినుండి విద్యార్థులకు లైంగిక విషయాలపట్ల స్పష్టమైన వైఖరిని కల్పించేటట్లు, విశృంఖల సెక్స్‌ వల్ల వ్యాపించే హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ లాంటి ప్రాణాంతక వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుడేటట్లు ప్రశ్నలు,సమాధానాల రూపంలో వివరించడం విశేషం.

స్నేహితుల వత్తిడిని ప్రతిఘటించడం - కాదు, లేదని చెప్పడాన్ని నేర్చుకోవడం మరియు వివిధ రకాల స్వభావాలు - ప్రవర్తనలు అనే అధ్యాయాలలోని సంఘటనలు, ఉదాహరణలు, ప్రశ్నలు, సమాధానాలు చాలావరకు ప్రాక్టికల్‌గా వున్నాయి.

తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని గురించి, పాఠశాల స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి, మునుముందు చర్చించాల్సిన అంశాల గురించి కూడా బాగా వివరించారు.
సెక్‌క్స్‌పరమైన అంశాలు విన్నా చదివినా తమ పిల్లలు చెడిపోతారనే విషయం తల్లిదండ్రులలో బాగా నాటుకొని పోయింది. ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని యువతకు తల్లితండ్రుల, ఉపాధ్యాయుల చొరవతో అందుబాటులోకి తీసుకుపోవాల్సిన అవసరం వుంది.

(ఆంధ్రభూమి 08-10-2001 పుస్తక సమీక్ష: చాపాటి రామసుధాకర్‌ రెడ్డి)


ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1. లైంగిక విద్య ఆవశ్యకత: సెక్స్‌ అంటే బూతు కాదు; నిశ్శబ్దాన్ని ఛేదించక తప్పదు.
2. యుక్త వయసులో శారీరక మార్పులు: మగపిల్లల, ఆడ పిల్లల లైంగిక అవయవాలు వాటి విధులు, జననేంద్రియాల పరిశుభ్రత
3. లైంగికత - అపోహలు, మూఢనమ్మకాలు.
4. యుక్తవయసులో పోషకాహారం: స్థూలకాయం, అతి డైటింగ్‌, మొటిమలు, శరీర వాసన.
5. టీనేజి గర్భం, లైంగిక వ్యాధులు
6. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ - ప్రాథమిక వాస్తవాలు
7. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ నివారణ: హెచ్‌ఐవి వుందోలేదో తెలుసుకునేందుకు రక్తదానం సరైన పద్ధతేనా?
8. స్నేహితుల ఒత్తిడిని ప్రతిఘటించడం: ఆడ మగ పిల్లల మధ్య సంబంధాలు, సెక్స్‌ లేకుండా ప్రేమగా వుండటం, తోటివాళ్ల ఒత్తిళ్లను ఎదుర్కోవడం.
9. మూడు రకాల స్వభావాలు/ప్రవర్తనలు: బలవంతపెట్టడాన్ని ప్రతిఘటించడం, సెక్స్‌ వద్దని చెప్పడం.
10. సహాయపడే వాతావరణాన్ని సృష్టించడం, వివక్షను నిర్మూలించడం: హెచ్‌ఐవి/ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారిపట్ల సానుభూతి కనబరిచే మార్గాలు.
11. పాఠశాల స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు.
12. తల్లిదండ్రుల భాగస్వామ్యం.
13. ప్రశ్నా పత్రం.
14. ప్రమాద వలయం: హెచ్‌ఐవి వ్యాప్తికి దోహదం చేస్తున్న అంశాలు, కొన్ని సమస్యలు.


తొలి యవ్వనంలో వచ్చే శారీరక మార్పులు, కలవరపరిచే సెక్స్‌ సందేహాలు - సమాధానాలు
ఆంగ్ల మూలం: Learning for Life: A Guide to Family Health and Life Skills Education for Teachers and Students, Published by NCERT, NACO, UNICEF, UNESCO, 2000

తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849


74 పేజీలు, వెల: రూ.20
..................

Tuesday, December 23, 2008

బషాయి టుడు (నవల) ... రచన: మహాశ్వేతా దేవి ... అనువాదం: ప్రభంజన్‌, సహవాసి ...



1967 మే-జూన్‌ మాసాల్లో ఉత్తర బెంగాల్‌ లోని నక్సల్‌బరి ప్రాంత రైతాంగ ఉద్యమం ఈ బషాయ్‌ టుడు, ద్రౌపది రచనల నేపథ్యం.
....

మొట్టమొదట, నక్సల్‌బరీలో ఉద్యమం తేయాకు తోటల యజమాన్ల ఎస్టేట్లలో మొదలయింది. ...
టీ తోటల ఆక్రమణలో వున్న మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకొని తమకు పంపిణీ చేయాలని 50వ దశకం నుంచీ అధియార్లు తోట యజమానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ యజమానులు వాళ్లను భూములనుంచి గెంటివేసి, ఏనుగుల చేత వాళ్ల గుడిసెల్ని నేలమట్టం చేయించడంతో నక్సల్‌బరీ రైతాంగం ఆ పీడనకు హింసకు వ్యతిరేకంగా ఒక్కటై ఒక్కుమ్మడిగా తిరగబడింది. ఆ తిరుగుబాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి పీడిత తాడిత రైతాంగానికి ప్రేరణ ఇచ్చింది. నక్సల్‌బరీ ఉద్యమం మీద రకరకాల ముద్రలు వేశారు.
...

సాధారణంగా పరిశోధకులు జనం తిరుగుబాట్ల వెనకగల కారణాలేమిటో శోధించి లిఖిత రూపంలో పెట్టడంలో నిమగ్నమవుతారు. కానీ నక్సల్‌బరీకి సంబంధించి పరిశోధకులు ఆ ఉద్యమ కారణాలమీద కన్నా దాని స్వభావం పైనా, ధోరణులపైనా ఎక్కువగా బుర్ర చించుకున్నారు.... మరో వైపు పాలనా యంత్రాంగం ఆ ఉద్యమాన్ని అణచివేయడంలో నిర్ణయాత్మకమైన చాకచ్యం ప్రదర్శించింది.
....

నా కథలలో వాటన్నిటి ప్రత్యక్ష సంబంధాన్ని మించి, నక్సల్‌బరీలో జరిగినవి, వాటి నేపథ్యం దేశ చరిత్రలో గడచిన కొద్ది దశాబ్దాల కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలను ప్రతిబింబిస్తాయి.
బషాయి టుడు గానీ, ద్రౌపది గానీ, వారి సహచరులుగానీ ఆ సంఘటనల సృష్టే.
...
పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష సంఘటన తొలిసారి అధికారంలో కొచ్చిన కాలంలో (1977-82) ''బషాయి టుడు'' నవలికను రాశాను.
...

నా రచనలో ఏ నిర్దిష్ట రాజకీయాల జాడల కోసమో వెతకడం వృధా.
పీడిత తాడిత జన విముక్తి కోంసం నడుంకట్టిన వ్యక్తులు నా రచనల్లో కీలక పాత్రదారులుగా కనిపిస్తారు.
నేను రాసిన 'జాల్‌' కథలో ఉపాధ్యాయుడు నిజాయితీపరుడైన ఓ కాంగ్రెస్‌వాది.
మరోకథ 'లిఖిండా'లో వ్యవసాయ కూలీ ఉద్యమానికి సారథ్యం వహించిన సిపిఐ దర్శనమిస్తుంది.
'బషాయి టుడు'లో కాళీ సంత్రా సిపిఎమ్‌ పార్టీకి చెందినవాడు.
బషాయి టుడు నక్సలైట్లను సైతం మించిపోయి ఎక్కడో ఇంకా ఎత్తున నిలబడి కన్పిస్తాడు.
'ద్రౌపది' కథానాయిక ఓ చురుకైన నక్సలైట్‌ కార్యకర్త. మానసికంగా వాళ్లందరూ ఒక ఉమ్మడి ఆశయానికి బద్ధులైన వాళ్లు.
...

పార్టీ ప్రయోజనాల పెంపుదలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలు వర్తమాన సామాజిక వ్యవస్థను మార్చగలవంటే నేను నమ్మను.

స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లయిన తరువాత కూడా తిండికి, నీళ్లకు, భూమికి నోచుకోక అప్పుల్లో, కట్టుబానిసత్వంలో నా దేశ ప్రజలు అ ల్లాడిపోవడం నా కళ్లతో చూస్తున్నాను.

ఈ అమానుష నిర్బంధాల నుంచి నా ప్రజల్ని విముక్తుల్ని చెయ్యలేని వ్యవస్థకు వ్యతిరేకంగా జాజ్వలమానంగా ప్రజ్వరిల్లుతున్న ఆగ్రహమే నా రచనలన్నిటికీ ప్రేరణ, స్ఫూర్తి. ... అనాధలు, అభాగ్యుల పఢాన నిలబడి నా శాయశక్తులా కలంతో పోరాటం సాగిస్తున్నాను.
ఆవిధంగా నాకు నేను సంజాయిషీ చెప్పుకోవలసివస్తే తలదించుకోవాల్సిన ఆగత్యం ఎన్నడూ కలగబోదు. ఎందుకంటే అందరు రచయితలూ తమ తరానికి జవాబుదారులు, తమకు తాము జవాబు చెప్పుకోవాల్సినవాళ్లు.

- మహాశ్వేతా దేవి (నా మాట నుంచి)

బషాయి టుడు (నవల)
రచన : మహాశ్వేతా దేవి

తెలుగు అనువాదం: ప్రభంజన్‌, సహవాసి

151 పేజీలు, వెల: రూ.25

............................

Friday, December 19, 2008

భారతదేశంలో బౌద్ధమతం - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌... తెలుగు అనువాదం: పి.సత్యవతి



'అంబేడ్కర్‌ ఆలోచన' సిరీస్‌లో భాగంగా వెలువడిన మరో పుస్తకం.... భారత దేశంలో బౌద్ధ మతం....

'' నేనెందుకు బౌద్ధానికి ప్రాధాన్యత యిస్తానంటే - అది మూడు సిద్ధాంతాల కలయిక.
మరే మతమూ అట్లా కాదు. తక్కిన మతాలన్నీ భగవంతుడు, ఆత్మ మరణానంతర జీవితం గురించి చెబుతాయి.
బౌద్ధం ప్రజ్ఞ గురించి బోధిస్తుంది.
మూఢనమ్మకాలకూ, అతీత శక్తులకూ వ్యతిరేకంగా కరుణను బోధిస్తుంది.
సమతను బోధిస్తుంది.
భూమి మీద ఆనందంగా బ్రతకడానికి ప్రతి వ్యక్తికీ యివి అవసరం.
బౌద్ధంలోని ఈ మూడు సిద్ధాంతాలూ ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యాలి.
భగవంతుడు కానీ అత్మ కానీ సమాజాన్ని కాపాడలేవు. ''

.....

'' నా సామాజిక తాత్వికత మూడు మాటలలో యిమిడి వుంది.
స్వేచ్ఛ,
సమానత్వం,
సౌభ్రాతృత్వం.
దీన్ని నేను ఫ్రెంచి విప్లవం నుంచి గ్రహించలేదు.
నా తాత్వికత మతం నుంచి ఆవిర్భవించిందే తప్ప రాజకీయ శాస్త్రం నుంచి కాదు.
ఈ సిద్ధాంతాలను నేను నా గురువర్యులైన బుద్ధని బోధనల నుండి స్వీకరించాను. ''

- డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌

ఈ పుస్తక అనువాదకురాలు పి.సత్యవతి ప్రముఖ స్త్రీవాద కథా రచయిత్రి. ''ఇల్లలకగానే...'', ''మంత్ర నగరి'' కథా సంపుటాలను ప్రచురించారు. ప్రస్తుతం విజయవాడలో వుంటున్నారు.

ఇందులోని కొన్ని అధ్యాయాలు:
1. నేనెందుకు బౌద్ధాన్ని ఇష్టపడతాను?
2. బుద్ధుడా - కార్ల్‌ మార్క్సా?
3. బౌద్ధ - బ్రాహ్మణ సంఘర్షణే భారతదేశ చరిత్ర
4. హిందూ స్త్రీల ఉత్థాన పతనాలు
5. హిందూ, బౌద్ధ మతాలలో స్త్రీల స్థానం
6. ప్రజాస్వామ్యానికీ, సామ్యవాద సమాజానికి మార్గదర్శి బౌద్ధమే
7. భారత దేశంలో బౌద్ధమతం ఆగిపోదు.


భారత దేశంలో బౌద్ధ మతం
- డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌
ఆంగ్ల మూలం: Dr.Babasaheb Ambedkar, Writings and Speeches, Vol,17,Part 1,2 & 3, Govt. of Maharashtra, bombay, 2003

తెలుగు అనువాదం: పి. సత్యవతి
64 పేజీలు, వెల: రూ.30

.........................

Wednesday, December 17, 2008

హృదయానికి హత్తుకునే నవల : ఎగిరే క్లాస్‌రూమ్‌ ... రచన: ఎరిక్‌ కాస్ట్‌నర్‌, తెలుగు అనువాదం: బి.వి.సింగరాచార్య



పిల్లల కోసం ఎరిక్‌ కాస్ట్‌నర్‌ రాసిన పుస్తకం ''ఎగిరే క్లాస్‌ రూమ్‌''.
నిజానికి ఇది ఒక నాటకం. తర్వాత నవలగా మలిచారు. సరదాగా వుండే పిల్లలు, వారి మనో భావాలు తెలుసుకోవాలనుకునేవారు ఈ పుస్తకం చదవాలి.

బాల్యంలోని మధురిమలను గుర్తుచేస్తుంది ఈ రచన.

ఆసక్తికరమైన కథనం ఆగకుండా చదివిస్తుంది.

పిల్లలు, ఉపాధ్యాయులు వారి అనుభవాలు, అనుభూతులను హృదయానికి హత్తుకునేవిధంగా రాశారు.

ఏడున్నరు దశాబ్దాల కిందట ఫ్లయింగ్‌ క్లాస్‌ రూమ్‌ శీర్షికన రాసిన ఈ నవలని బి.వి.సింగరాచార్య తెలుగులోకి అనువాదం చేశారు.

సరళమైన అనువాదం హాయిగా చదివిస్తుంది.
పిల్లలూ పెద్దలూ చదివి ఆనందించదగ్గ నవల ఇది.

(ఆదివారం వార్త 16 నవంబర్‌ 2008, పుస్తక సమీక్ష : కుమార్‌)

ఎగిరే క్లాస్‌ రూమ్‌
- ఎరిక్‌ కాస్ట్‌నర్‌

జర్మన్‌ మూలం: Das Fliegende Klassen zimmer
తెలుగు అనువాదం: బి.వి.సింగరాచార్య

162 పేజీలు, వెల: రూ.70

...........................

Monday, December 15, 2008

కేరళ సామాజిక తత్వవేత్త శ్రీ నారాయణ గురు ... సత్యబాయి శివదాస్‌, పి. ప్రభాకరరావు; తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార




మనదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యతను సాధించిన రాష్ట్రం ఏదైనా వుందంటే అది ఒక్క కేరళ మాత్రమే! స్త్రీ విద్యలో ఆ రాష్ట్రం కమ్యూనిస్టు చైనా కంటే కూడా అగ్రస్థానంలో వుంది. ఇవాళ కేరళ నర్సులు లేని పెద్ద ఆసుపత్రి యావద్దేశంలో ఒక్కటి కూడా వుండదంటే అతిశయోక్తి కాదు. ఈ అద్భుత ప్రగతి వెనక అ లనాడు అభ్యుదయ సామాజిక తత్వవేత్త శ్రీ నారాయణ గురు (1855-1928) చేసిన అపూర్వమైన కృషి ఎంతో వుంది.

ఆయన గురించి ప్రముఖులు వెలిబుచ్చిన ఈ కింది అభిప్రాయాలను బట్టి ఆయన ఎంతటి మహనీయుడో అర్థం చేసుకోవచ్చు.

''శ్రీనారాయణ గురు ఉద్యమం ప్రయోజనకరమైన, ఆధ్యాతిక ఉద్యమం. ఆయన ప్రజల జీవన పరిస్థితులను, సామాజిక అవసరాలను గుర్తెరిగిన క్రియాశీల జ్ఞాని, ధార్మిక మేధావి.''
............... సుప్రసిద్ధ ఫ్రెంచ్‌ రచయిత రోమా రోలాండ్‌

''నేను ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ వస్తున్నాను. నా పర్యటన సందర్భంగా ఎందరో యోగులను, మహర్షులను కలుసుకునే అవకాశం లభించింది. అయితే కేరళకు చెందిన స్వామీ శ్రీ నారాయణ గురును మించిన గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త నాకు ఎక్కడా తారసపడలేదని నిజాయితీగా ఒప్పుకుంటున్నాను''
.............. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

''శోభాయమానమైన తిరువాన్కూరు రాష్ట్రంలో పర్యటించడం, పూజ్యులైన యోగి శ్రీ నారాయణ గురు స్వామి త్రిప్పదంగల్‌ వారిని కలుసుకోవడం నా జీవితానికి లభించిన మహద్భాగ్యంగా భావిస్తున్నాను.''
.............. మహత్మా గాంధీ

''ఈళవ కులస్థుల (వెనుకబడిన కులం) ఆధ్యాత్మిక నాయకుడైన శ్రీ నారాయణ గురు కేరళలోని రైతాంగాన్ని, భూమిలేని వ్యవసాయదార్లను ప్రప్రథమంగా సమీకరించి, జాగృతపరచి వారిని ప్రజాస్వామ్య ఉద్యమంలో భాగస్వాములను చేశాడనే విషయాన్ని మనం తప్పక గుర్తించవలసి వుంటుంది.''
............... ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌


ఆ రోజుల్లో వెనుకబడిన కులాల వారికి దేవాలయాల్లో ప్రవేశించే అర్హత వుండేదికాదు. దళితులకైతే దేవాలయాల చుట్టుపక్కలి వీధుల్లోకి, రహదార్లపైకి అడుగుపెట్టే అర్హత కూడా లేదు. అంటరానివాళ్ల నీడ సోకితేనే మైల పడతా మన్నట్టు అసహ్యించుకునేవారు బ్రాహ్మణులు.

నంబూద్రీలు (బ్రాహ్మణులు) దైవాంశ సంభూతులు కాబట్టి వారు మాత్రమే దేవాలయంలోని గర్భగుడిలో తిరుగాడవచ్చు. అదే రాజ్యాన్ని పాలించే క్షత్రియులకు సైతం ఆ అర్హత లేదు. వారు గర్భగుడికి కనీసం రెండడుగుల దూరాన్ని పాటించాలి. నాయర్లు 16 అడుగుల దూరం, ఈళవ కులస్తులు 32 అడుగుల దూరం, పులయ మరియు పరయ కులస్థులు 64 అడుగుల దూరం పాటించాలి. ఇక నాయాదీలు (మాల మాదిగ తదితర దళిత కులస్తులు) దేవాలయం సంగతి అటుంచి, బ్రాహ్మణుల కనుచూపు మేరలో కూడా కనిపించకూడదు. పొరపాటున ఏ నాయాదినైనా బ్రాహ్మణుడు చూస్తే అతను ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వుండేది.

ఇవీ ఆనాడు (సవర్ణ) మనిషికీ ... (అవర్ణ) మనిషికీ మధ్య, (మనువాద) దేవాలయానికీ మనిషికీ మధ్య వున్న దూరం నియమాలు. దేవుడి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం వారి కులాలను బట్టి పై దూరాలతో విడివిడిగా క్యూ రైలింగ్‌లుండేవి. అంటే ఉదాహరణకి నాయర్లు దేవుడి విగ్రహాన్ని 16 అడుగుల దూరం నుంచి దర్శనం చేసుకోగలిగితే పులయ, పరయ కులస్థులు 64 అడుగుల దూరం నుంచి నిక్కినిక్కి చూస్తూ అస్పష్టంగా దర్శనం చేసుకోవలసి వచ్చేది. ఇక మాలమాదిగలకైతే ఆ దేవుడు ఎలావుంటాడో చూసే అవకాశమేలేదు.

ఇంకా ఇట్లాంటి అమానుషమైన, అర్థ రహితమైన నియమ నిబంధనలు అనేకం వుండేవి. (వాటి గురించి ఈ పుస్తకంలో కొంతవరకు వివరంగానే ప్రస్తావించడం జరిగింది). ఈళవ తదితర వెనుకబడిన తరగతులకు చెందినవాళ్లు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూ కూడా దేవుడి విగ్రహాన్ని దర్శించుకునేందుకు నానా యాతనా పడేవారు. అగ్రవర్ణాల వారు ఆర్థికంగా బాగుండటానికి, తాము దారిద్య్రంతో కునారిల్లుతుండటానికి కారణం తమపై దైవానుగ్రహం లేకపోవడమే, తమకు దైవ దర్శనభాగ్యం లభించకపోవడమే కారణమని కుమిలి పోయేవారు!

ఈ నేపథ్యంలో ఈళవ కులంలో జన్మించిన శ్రీ నారాయణ గురు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆర్యనీకరణ వల్ల చోటుచేసుకున్న మూఢనమ్మకాలకు, దుస్సంప్రదాయాలకు, ఆచారాలకు, అగ్రవర్ణ దోపిడీపీడనలకు వ్యతిరేకంగా గొప్ప సామాజిక ఉద్యమాన్ని నిర్మించారు.

వెనుకబడిన కులాల వారికోసం ప్రత్యేకంగా దేవాలయాలను నిర్మించారు.
అందులో వెనుకబడిన తరగతుల వారినే పూజారులుగా నియమించారు.

ఆయన నిర్మించిన దేవాలయాలు అవర్ణులలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని, ఉత్తేజాన్ని కలిగించాయి. ఆ దేవాలయాలను శ్రీ నారాయణగురు విద్యాలయాలుగా కూడా ఉపయోగిస్తూ వెనుకబడిన తరగతుల వారిలో విద్యావ్యాప్తికి విశేషంగా కృషి చేశారు.

వివాహాలు, బారసాలలు, చావులు వంటి సందర్భాలలో ఆచారాల పేరిట శక్తికి మించి చేసే ఖర్చులను ఆయన పూర్తిగా రూపుమాపారు. చావులకి, పెళ్లిల్లకి బ్రాహ్మణుల మీద ఆధారపడకుండా, వారు తమను దోపిడీ చేసే అవకాశం లేకుండా చేశారు. ఈ అర్థంలేని ఆచారాల వల్ల అనేక కుటుంబాలు తమ తాహతుకు మించి ఖర్చుచేసి అప్పులపాలవుతుండేవి. ఆయన పుణ్యమాని అవర్ణ సమాజంలో అట్లాంటి వన్నీ మటుమాయమైపోయాయి.
ప్రతి ఒక్కరూ విద్య ప్రాధాన్యతను గుర్తించడం ప్రారంభించారు.
అంతకుపూర్వం అంటరానివాళ్లకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశార్హత వుండేది కాదు.
శ్రీ నారాయణ గురు నిర్మించిన దేవాలయాలే విద్యాలయాలుగా సేవలు అందిస్తుండటంతో వారికి విద్య అందుబాటులోకి వచ్చింది. ఆతరువాత అనేక పాఠశాలలు నెలకొల్పడమే కాక ప్రభుత్వ పాఠశాలల్లో సైతం అంటరానివాళ్లని చేర్చుకోవాలని పోరాడి సాధించారు. దాంతో ఒక్కసారిగా వెనుకబడిన తరగతుల వారి స్థితిగతుల్లో గొప్ప మార్పు చోటుచేసుకుంది.

సంఘ సంస్కరణకోసం విలక్షణమైన తాత్విక మార్గాన్ని అనుసరించిన శ్రీ నారాయణగురు ప్రభోదాలు అవర్ణులందరికీ శిరోధార్యాలయ్యాయి:

''మనుషులందరికీ ఒకే కులం ... ఒకే మతం ... ఒకే దేవుడు.''

''మతం కోసం మనిషి కాదు. మనిషి కోసం మతం.''

''కులం అడగొద్దు ... కులం చెప్పొద్దు ... కులం గురించి అసలు మాట్లాడనే వద్దు.''

''విద్య ద్వారా స్వేచ్ఛ ...
సంఘటితమవడం ద్వారా శక్తి ...
పరిశ్రమించడం ద్వారా ప్రగతి !''

''మతం ఏదైనా గానీ మనిషిని ఎదగనివ్వాలి.''


అంటూ శ్రీ నారాయణ గురు చేసిన ప్రభోదాలు కేరళలోని వెనుకబడిన, దళిత సమాజంలో విప్లవాత్మక మైన మార్పులకు నాంది పలికాయి.
ఆ మహనీయుని జీవిత విశ్లేషణే ఈ పుస్తకం. ఆయన గురించి సంక్షిప్తంగానైనా వీలైనంత సమగ్రంగా పరిచయం చేస్తుందిది.

కేరళ సామాజిక తత్వవేత్త శ్రీ నారాయణ గురు
రచన: సత్యబాయి శివదాస్‌, పి. ప్రభాకరరావు.

ఆంగ్ల మూలం: Sree Narayana Guru: The social Philosopher, Satyabai Shivadas and P. Prabhakara Rao, Unpublished manuscript, 1999.

తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార

90 పేజీలు, వెల: రూ.20

........................

Sunday, December 14, 2008

రుదాలి - మహా శ్వేతాదేవి కథల సంపుటి


జీవన పోరాటాన్ని తాత్వీకరించిన మహా శ్వేతాదేవి కథలు ...

మహాశ్వేతా దేవి ఎనభైలలో రాసిన కథలు చాలా విశిష్టమైనవి. భారతీయ సమాజంలో కుల, వర్గ దోపిడీ పీడనలకు ప్రత్యక్ష కథనాలవి.
మహాశ్వేతాదేవిని తెలుగు వారికి ఆత్మీయురాలిగా చేసిన హెచ్‌.బి.టి. మరోసారి ఆమె కథలు ఐదింటిని ''రుదాలి'' పేరుతో ప్రచురించింది.

పిడికెడు సత్తు (పిండి) కోసం
గుప్పెడు మెతుకుల కోసం
కాసింత గంజి కోసం
చారెడు నేల కోసం
చిటికెడు ఉప్పు కోసం
తమ జీవితాల్ని అమ్ముకొనే దీనులు ఈ కథల్లో మనకు కనిపిస్తారు.
బతకడం కోసం అనునిత్యం సంఘర్షిస్తుంటారు. వారి జీవితమంతా అస్తిత్వ పోరాటమే. ఆ పోరాటమే వారికి బతుకుతెరువు చూపుతుంది.

దోపిడీ సమాజంలో పరాయీకరణకు గురయ్యేది కేవలం పేదల శ్రమ మాత్రమే కాదు - వారి వైయుక్తిక అనుభూతులు కూడా.
ఆఖరికి వారి ఏడుపు కూడా అమ్మకపు సరుకయ్యే వైనాన్ని తెలిపే అద్భుతమైన కథ 'రుదాలి'.

మామూలుగా కథలు సంఘటన ప్రథానంగా సాగుతాయి. కానీ రుదాలి కథలో రచయిత్రి 'శనిచరి' జీవితం మొత్తాన్ని సమగ్రంగా కళ్ల ముందు నిలిపింది. చలికాలపు ఎండలో గిన్నె నిండా బెల్లం, సత్తూ (పిండి) కలుపుకొని తింటూ కూర్చోవాలి అన్న అతి సాధారణమైన కోరిక శనిచరిది.
తినడానికి ఏమైనా పెట్టండి అని అరుస్తూ ఆమె అత్తగారు చనిపోయింది.
శివలింగానికి అభిషేకం చేసిన పాచిపోయిన మురుగు పాలు తాగి మొగుడు చనిపోయాడు.
క్షయ వ్యాధి సోకి కొడుకు కాలం చేశాడు.
తిండికోసం - కేవలం జిహ్వ చాపల్యం తీర్చుకోడానికి కోడలు ఎవరితోనే వెళ్లిపోయి చివరికి వేశ్యా వాడలో తేలింది.
దొరల వెట్టి చెయ్యలేక మనవడు ఊరు విడిచి పారిపోయాడు.
ఏ సందర్భంలోనూ శనిచరికి ఏడుపు రాలేదు.
ఆమెకు జీవితంలో ఏడ్చే వ్యవధి దొరకలేదు.
తీవ్రమైన నిర్బంధమో, భయంకరమైన దోపిడీయో, క్రూరమైన అణచివేతో, తప్పించుకోలేని మత క్రతువులో ఆమె ఏడుపును మింగేసేవి.
ఆమె తన కన్నీళ్లని అమ్మకానికి పెట్టింది.
ఏడవడమే వృత్తిగా చేసుకుంది.
దొరల కుటుంబంలో ఎవరైన చస్తే ఏడవడానికి కిరాయికి వెళ్లి వికృతంగా, వైనవైనాలుగా ఏడ్చి దొరల ప్రతిష్టను పెంచేది. అందుకు వేశ్యా వాడల నుంచి ఏడ్చేవాళ్లని కుదిర్చి పెట్టేది. చివరికి వాళ్లందర్నీ సంఘటితపర్చే ప్రయత్నంలో రుదాలి కథ ముగుస్తుంది.

శనిచరి వైయుక్తిక జీవితాన్ని చిత్రీకరించే క్రమంలో మొత్తం సమాజం, దాని మత, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ వికృత రూపం బహిర్గతమైంది. ఈ కథలో పాత్రలు, సంఘటనలు కాల్పనికాలు కావు. కథ ఆయ సంఘటనలచుట్టూ అ ల్లినదీ కాదు. అందుకే చిన్నకథలో విశాలమైన జీవితాన్ని వర్ణించడానికి వీలయింది. పలామూ ప్రాంత ప్రజల వర్తమాన జీవితాన్ని చారిత్రీకరించడానికి మహాశ్వేతాదేవి యాంటీ ఫిక్షన్‌ టెక్నిక్‌ని ఎన్నుకొన్నారు. పలామూ ప్రాంతాన్ని మొత్తం భారతదేశానికి ప్రతిబింబంగా నిలిపారు. ఆ క్రమంలో కోల్‌ ఆదివాసుల వీరోచిత పోరాటాల్ని, వాటిని అణచివేసిన రాజపుత్రుల క్రౌర్యాన్ని తెలిపే చరిత్రని కథలో యిమిడ్చారు. ఆ కథ చెప్పి ''దులాన్‌'' శనిచరిని జీవన పోరాటంలో నిమగ్నం చేస్తాడు. పేదల చెమట, కన్నీళ్లూ, రక్తమూ, శరీరంలో ప్రతి అణువునూ బతకడానికి అనివార్యంగా ఎలా ఉపయోగించుకోవాల్సి వస్తుందో చెప్పే దులాన్‌ గొంతు రచయిత్రిదే. కథ మొదట్లో నిస్సహాయురాలిగా వున్న శనిచరి దులాన్‌ నేర్పిన పోరాట స్ఫూర్తితో రుదాలి ఆచారాన్ని అడ్డం పెట్టుకొని దొరల చావును కోరుకుంటూ - ఆ చావులకు ఏడ్చి డబ్బు గుంజి వారిమీద పగ తీర్చుకొనే స్థాయికి ఎదుగుతుంది. మధ్య తరగతి మేధావులకు ఒక్కోసారి అది ఎబ్బెట్టుగానూ, అసహజంగానూ వుంటుంది. ''చిన్నోళ్లు'' కథలో కూడా ఈ విషయాన్ని గమనించవచ్చు.

తీవ్రమయిన అణచివేతకు గురయి అడవి లోతట్టు ప్రాంతానికి పారిపోయిన కుబా అగరియాలు తినడానికి తిండిలేక, శారీరకంగా గిడసబారిపోయిన ఒకానొక భయంకర సత్యం 'చిన్నోళ్లు' కథకు మూలం.
తరతరాలుగా కొనసాగే ఆకలీ అణచివేత సాధారణ మానవుల్ని పిగ్మీలుగా మార్చేయగలదు.
తమను పిగ్మీలుగా మార్చిన అనాగరిక వ్యవస్థ ముఖంమీద కుభా అగరియాలు తమ అంగాల్ని రాసి కసి తీర్చుకుంటారు. ఉప్పులేక ఊపిరి తీసుకోవడం కష్టమైన గిరిజనులు ప్రాణాలకు తెగించి ఏనుగులకోసం అటవీ శాఖ వాళ్లు అడవిలో చల్లిన రాతి ఉప్పును దొంగిలించి ఏనుగు కోపానికి గురై మరణిస్తారు. మనిషికి గానీ, జంతువుకు గానీ ఉప్పు దొరకకుండా చేసిందెవరు? తనకు ఉప్పు దొరకకుండా చేసిన మనుషుల్ని అడవి జంతువు సహించనప్పుడు మనుషులెలా సహించగలుగుతారు? ప్రతిఘటన అనివార్యమన్న విషయాన్ని 'ఉప్డు' కథలో రచయిత్రి ప్రతీకాత్మకంగా చెప్పారు.

కులాన్ని, వర్గాన్ని వేరువేరుగా చూడలేం - దోడీకి రెండూ సమానంగా దోహదం చేస్తాయనే స్పృహ మహాశ్వేతాదేవి రచనల్లో కనిపించే ప్రధానాంశం.
బలీయమైన మత విశ్వాసాలు, లోతుగా దాడుకుపోయిన కుల వ్యవస్థ వర్గ సమాజ,లో పీడనకు తిరుగులేని సాధనాలుగా ఉపయోగపడే తీరుని ఆమె తన రచనల్లో అడుగడుగునా స్పష్టం చేశారు.
ఆమె వర్గ దృక్పథం కులాన్ని మర్చిపోయేలా చేయలేదు. అంతేకాదు - కులం పేరున జరిగే అణచివేత, నిర్బంధపు వెట్టి, లైంగిక దోపిడీతో సహా స్త్రీల అనేక సమస్యలు - ఇవన్నీ భూమి సమస్యతో ముడిపడి వున్నాయని, భారతదేశపు భూ విధానంలో కుల - వర్గ దోపిడీ, పీడితుల ప్రతిఘటనా మమేకమై వున్నాయనీ ఆమె ఈ కథనాల్లో నిరూపించారు.

ఇందులోని 'దయ్యాలున్నాయి జాగ్రత్త', 'శ్రీశ్రీ గణేశ మహిమ (రాకాసి కోర)' కథలను సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారు. మహాశ్వేతాదేవిని తెలుగు పాఠకలోకానికి మొదటిసారిగా పరిచయం చేసిన ఆయనకే ఈ కథల సంపుటిని అంకితం చేయడం ఎంతైనా సమంజసం. మిగతా కథలను కలేకూరి ప్రసాద్‌ (రుదాలి; రుదాలి జీవన పరిణామ చిత్రణ), అనంత్‌ (చిన్నోళ్లు), ప్రభంజన్‌ (ఉప్పు), ప్రభాకర్‌ మందార (భారతదేశపు ప్రతిబింబం పలామూ- ఒక పరిచయం) అనువదించారు. అనువాదాలు బాగున్నాయి. పాత్రోచితమైన మాండలికం వాడి వుంటే ఇంకా బావుండేది.

ఈ కథలేవీ పాఠకుణ్ణి ఉల్లాస పరచవు - భయంకరమైన సమకాలీన దుర్భర సత్యాలీ కథలు - 'తక్షణ స్పందననూ, చర్యనూ' కోరుతున్నాయి.
(ఆదివారం ఆంధ్ర జ్యోతి 18-7-1999 లో ఎ.కె.ప్రభాకర్‌ పుస్తక సమీక్ష)

రుదాలి కథల సంపుటి
- మహాశ్వేతాదేవి

పుస్తక సంపాదకురాలు: సూరంపూడి కామేశ్వరి
198 పేజీలు, వెల: రూ.45

Monday, December 8, 2008

వికలాంగులైన స్త్రీలకు, వారి సంరక్షకులకు ధైర్యం చెప్పి చేయూతనిచ్చే పుస్తకం



వికలాంగులైన స్త్రీలు - ఆరోగ్య సంరక్షణ ...
( ''వైద్యుడు లేని చోట'', ''మనకు డాక్టర్‌ లేని చోట'' వంటి సుప్రసిద్ధ ప్రయోజనాత్మక పుస్తకాలను అందించిన హెస్పేరియన్‌ ఫౌండేషన్‌ వారి మరో అపూర్వ గ్రంథం)


అంగవైకల్యం శాపం కాదు.
ప్రపంచంలో ఎవరైనా, ఎప్పుడైనా అంగవైకల్యానికి గురికావచ్చు.

యుద్ధాలు, ఉగ్రవాదం, రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాలు, మందుపాతరలు, బాంబు దాడులు, మతకల్లోలాలు, గూండాయిజం, హింస, రసాయనాలు, రేడియో అణుధార్మికత, మాదకద్రవ్యాల వాడకం, జబ్బులు, కాలుష్యాలు మొదలైన కారణాలవల్ల ఏ అవయవలోపంలేని వ్యక్తులు సైతం హఠాత్తుగా అంగవికలురుగా మారుతున్నారు.

అదేవిధంగా తల్లిదండ్రుల మాదకద్రవ్యాల వ్యసనం, వారు తమ జబ్బులకు సరిగా చికిత్స చేయించుకోకపోవడం, నిషేధిత మందులు వాడటం, వంశపారంపర్య లోపాలు, మేనరికం వివాహాలు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నాటు మంత్రసానులు చేత కాన్పులు చేయించుకోవడం, గర్భవిచ్ఛిత్తికి నాటు మందులు వాడటం, వంటి కారణాల వల్ల అనేకమంది పిల్లలు వివిధ లోపాలతో పుడుతున్నారు. పుట్టిన తరువాత పిల్లలకు సరిగా రోగనిరోధక టీకాలు వేయించకపోవడం, సరైన ఆరోగ్య, ఆహార జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్ల కూడా ఎంతోమంది పిల్లలు అంగవైకల్యం బారిన పడుతున్నారు.

పురుషాధిక్య సమాజంలో సాధారణ స్త్రీలు ఎదుర్కొనే సమస్యలకుతోడు వికలాంగులైన స్త్రీలు మరిన్ని రెట్లు ఎక్కువ సమస్యవలను ఎదుర్కోవలసి వస్తుంది.

వికలాంగులైన స్త్రీలు తమ వైకల్యం వల్ల కంటే దానివల్ల సంక్రమించే న్యూనతాభావం వల్ల, చాలీచాలని సంరక్షణ సౌకర్యాల వల్ల, సమాజ బాధ్యతా రాహిత్యం వల్ల, ప్రభుత్వాలు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి రూపొందించిన ఈ పుస్తకం వికలాంగ స్త్రీలకు - సామాజికపరమైన అడ్డంకులను అధిగమించడానికి, సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, ఆత్మగౌరవాన్ని, తమ సంరక్షణని తామే చూసుకోగల సామర్థ్యాన్ని
పెంపొందిచుకునేందుకు, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించటానికి ఎంతో ఉపయోగపడుతుంది.

అంగవైకల్యం సమాజంలో ఎవరికైనా కలుగవచ్చు. అది ఒక సహజమైన దురదృష్ట స్థితి. కానీ వైకల్యం కలవారు తమ లోపాన్ని మరచి మిగతా సమాజంలోని వ్యక్తులలాగా జీవించాలని కోరుకుంటారు. అందుకు తమకున్న అవకాశం మేరకు కృషి చేస్తారు. కానీ సమాజంలోని ఇతర వ్యక్తులు వారిపట్ల చూపించే వివక్ష, చిన్న చూపు వారిని తీవ్రమైన నిరాశకు, నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి.
వికలాంగులపట్ల సాంఘిక వివక్ష, నిరాదరణ, చులకనభావం, అసత్యపు అభిప్రాయాలను తొలగించేందుకు కూడా ఈ పుస్తకం విశేషంగా తోడ్పడుతుంది.

ఇందులోని అధ్యాయాలు:
1. వైకల్యం - సామాజిక స్పృహ (వైకల్యం అంటే ఏమిటి? దానికి కారణాలు)
2. వైకల్యానికి చేయూత - స్నేహపూర్వక ఆరోగ్య సంరక్షణ
3. మానసిక ఆరోగ్యం
4. మీ శరీరాన్ని గురించి తెలుసుకోవడం
5. మీ శరీర సంరక్షణ
6. ఆరోగ్య పరీక్షలు
7. లైంగికత
8. లైంగిక ఆరోగ్యం - లైంగిక సంబంధాల వల్ల వ్యాపించే వ్యాధులను, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌తో సహా నిరోధించటం
9. కుటుంబ నియంత్రణ
10. గర్భం
11. నొప్పులు - శిశు జననం
12. మీ బిడ్డ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు
13. వైకల్యంతో వయసు పెరుగుట
14. దూషణ, హింస, ఆత్మరక్షణ
15. సంరక్షకుల తోడ్పాటు

ఇంకా వివిధ రకాల మందులు, జాగ్రత్తలు, సమస్యలు, వినికిడికి తోడ్పడే సాధనాలు, నడవడానికి సహాయపడే చేతికర్రలు, చక్రాల కుర్చీలు తీసుకోవలసిన జాగ్రత్తలు వంటివి ఇందులో సవివరంగా సచిత్రంగా చర్చించబడ్డాయి.

ఈ పుస్తకం వికలాంగ స్త్రీలకు ఒక మార్గదర్శకంగా, వారికి అవసరమైన సంపూర్ణ సమచారాన్ని అందించేదిగా రూపొందించబడింది. 42 దేశాలలోని ఎంతోమంది వికలాంగ స్త్రీల అనుభవాలు, సలహాలు సూచనల ఆధారంగా తీర్చిదిద్దబడిన ఈ పుస్తకాన్ని వికలాంగ స్త్రీలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, సమాజ సేవారంగంలో పనిచేసేవారు, ప్రతి ఒక్కరూ విధిగా చదవాల్సిన అవసరం వుంది.

.............ఈ పుస్తకాన్ని మీ బీరువాలో దాచిపెట్టకండి. పదిమందికీ అందజేయండి...............


వికలాంగులైన స్త్రీలు - ఆరోగ్య సంరక్షణ
- జేన్‌ మాక్స్‌వెల్‌, జూలియా వాట్స్‌ బెల్సర్‌, డార్లీన డేవిడ్‌

ఆంగ్ల మూలం: A Health handbook for Women with Disablities, Hesperian Foundation, USA, 2007.

తెలుగు సేత : రాణి
414 పేజీలు, వెల: రూ.220

......................

Saturday, December 6, 2008

ఇస్లాం చారిత్రక పాత్ర ....యం.ఎన్‌,.రాయ్‌ ...తెలుగు అనువాదం: సుందర వర్ధన్‌



ప్రపంచంలోనే ముస్లింలు అధిక సంఖ్యలో వున్న రెండో అతి పెద్ద దేశం మన భారత దేశం.

అయినా ఇస్లాంకు ఉన్న విప్లవాత్మక ప్రాముఖ్యాన్ని గుర్తించటంలోనూ, ఆ విప్లవ సాంస్కృతిక పర్యవసానాలను అర్థం చేసుకోవటంలోనూ ఎంతో అవగాహనా రాహిత్యం సర్వత్రా కనిపిస్తోంది..

నేడు ఇస్లాం మీదా, ఇస్లామిక్‌ దేశాల మీదా జరుగుతున్న విషపూరిత దాడి తెలిసిందే.
ప్రపంచమంతా ఇప్పుడు ఇస్లాం గురించి తీవ్రంగా చర్చించుకుంటోంది.

ముస్లిం సమాజం గురించి ఇప్పటి వరకు అందించిన చారిత్రక జ్ఞానం కూడా అనేక అపోహలతో కూడుకున్నదే.
ఉదాహరణకు ఒక చేత్తో ఖురాన్‌, మరో చేత్తో ఖడ్గం ద్వారా ప్రపంచం మీద ఇస్లాం దండెత్తిందన్న (ఏక్‌ హాత్‌ మే ఖురాన్‌ ... దూసిరీ హాత్‌ మే తల్వార్‌ ... జో ఖురాన్‌ కో నై మాన్‌తాహై ... ఉస్‌కా గర్దన్‌ కాట్‌ దో) కథనానికి ఇప్పటికీ ఎంతో సమర్థన లభించడం విషాదం.

ఇస్లాం నిర్వహించిన చారిత్రక పాత్రను అర్థ చేసుకోలేకపోతే ఇస్లాం వ్యతిరేకులు చేసే దుష్ప్రచారం పైచేయి సాధించే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది మందికి గర్వకారణమైన మహోన్నత చరిత్ర దురవగాహనకు, అపోహలకు బలవుతుంది.

ఈ నేపథ్యంలో ప్రపంచ మానవ చరిత్రలో ఇస్లాం పోషించిన చారిత్రాత్మక పాత్రను లోతుగా చర్చిస్తూ విఖ్యాత మానవోద్యమ కార్యకర్త యం.ఎన్‌.రాయ్‌ గతంలో రాసిన ఈ వ్యాసానికి ఎంతో ప్రాముఖ్యత వుంది.

యం.ఎన్‌. రాయ్‌ (1887-1954) ఎన్నో ప్రపంచ విప్లవోద్యమాల్లో పాలుపంచుకున్న అంతర్జాతీయ ప్రముఖులు. కమ్యూనిస్టుగా ఆరంభమై మానవతా వాదం దిశగా మళ్లిన రాయ్‌ ఎన్నో వివేచనాత్మక రచనలు చేశారు.

ఆయన ఇలా అంటారు:

ఇస్లామిక్‌ దేశాలతో పోల్చితే భారతదేశంలో నివసిస్తున్న ముస్లింల సంఖ్యే ఎక్కువ.
చాలామంది ఈ వాస్తవాన్ని పట్టించుకోవడం లేదు. అతి అరుదుగా గుర్తిస్తున్నారు. కొన్ని వందల ఏళ్ల తర్వాత ఈనాడు కూడా ముస్లింలను బయటివారిగానే పరిగణిస్తున్నారు.

దేశ నిర్మాణం బలహీనంగా వున్నప్పుడు ఈ విధమైన చీలికలు కనిపించడం విచారకరమైన పరిణామం.
దీని వెనక చారిత్రక కారణం వుంది.

ముస్లింలు భారతదేశంపై దండెత్తి వచ్చారు. భారతదేశాన్ని జయించి వందల యేళ్లు పాలకులుగా కొనసాగారు. పాలకులకూ పాలితులకూ మధ్య వుండే సంబంధం దేశ చరిత్రలో కీలక పాత్ర పోషిస్తుంది.
నేడు అదే రెండు వర్గాల వారిని ప్రభావితం చేస్తోంది.

బ్రిటీషు వలస పాలనలో హిందువులతో సమానంగా ముస్లింలు ఎంతో నష్టపోయారు. తీవ్రంగా దెబ్బతిన్నారు. ముస్లింలు ఈ దేశ ప్రజలతో మమేకమైయ్యారు. ముస్లింల పాలనాకాలపు చరిత్ర పాఠ్య ప్రణాళికలో పొందుపరచబడింది. జాతీయతా భావం పెరిగినా కొద్దీ పూర్వకాలపు చేదు జ్ఞాపకాలు చెరిగిపోతూవచ్చాయి. వలస పాలనలో ఎదురైన అవమానాల కారణంగా ప్రజలు తమ పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకునేవారు. అందులో ఓదార్పును కోరుకునేవారు. తత్ఫలితంగా ముస్లిం పాలకులు ఈ దేశ జాతీయతలో అంతర్భాగం అయ్యారు.

అయితే విచిత్రంగా హిందూ మతస్థుడు ముస్లిం నుండి వేరుపడ్డాడు.
అక్బర్‌ సామ్రాట్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని తలచుకొని గర్వపడే ఇతడు,
షాజహాన్‌ కట్టించిన ముగ్ధ మనోహర కట్టడాలను గొప్పగా చెప్పుకునే ఇతడు,
ఆ చక్రవర్తుల మతానికే చెందిన వారి నుండి వేరుపడ్డాడు.
ముస్లింలంతా అతనికి పరాయివారే.
నేటికీ అదే పరిస్థితి.
పూడ్చలేని అగాథం అతణ్ని వేరు చేస్తోంది.

హిందువులు ముస్లింలను మ్లేచ్ఛులుగా భావిస్తున్నారు. మ్లేచ్ఛులు అంటే అపవిత్రమైన అనాగరికులు అని అర్థం.
హిందువుల్లోని కింది కులాల వారికి దొరికే సామాజిక స్థాయి కూడా వీరికి దక్కడం లేదు.

ఈ పరిస్థితికి కారణాన్ని గతం తాలూకు పక్షపాత ధోరణిలో మనం చూడవచ్చు.
విదేశీ ఆక్రమణదారులపై సహజంగా వుండే పగ, ద్వేషంలోంచి పుట్టిందే ఈ ధోరణి.

దీని వెనక వున్న రాజకీయ నేపథ్యం గతకాలానికి సంబంధించిన విషయం.
కానీ పక్షపాత ధోరణి మాత్రం ఇప్పటికీ అట్లాగే కొనసాగుతోంది.
ఇది జాతీయ ఐక్యతను దెబ్బతీయడమే కాక నిష్పాక్షిక చరిత్ర పరిశీలనకు అడ్డంకిగా మారింది.
కొన్ని వందల యేండ్లుగా రెండు మతాల వారూ ఒకే దేశంలో కలిసి వుంటున్నప్పటికీ కూడా పరస్పర సంస్కృతుల గురించి వీరికున్న అవగాహన చాలా స్వల్పం. ఇటువంటి విడ్డూరం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.

ఇస్లాం - చారిత్రక పాత్ర
- యం. ఎన్‌. రాయ్‌

ఆంగ్ల మూలం : Historical Role of Islam: An essay on Islamic Culture, Critical Quest, New Delhi 2006.

తెలుగు అనువాదం : సుందర వర్థన్‌

36 పేజీలు, వెల : రూ.25
...........................

Friday, December 5, 2008

ప్రతిష్టాత్మక 'క్లుగ్‌' అవార్డుకు ఎంపికైన ప్రముఖ భారత చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌కు అభినందనలు!






రొమిల్లా థాపర్‌కు క్లుగ్‌ అవార్డు

ప్రముఖ భారతీయ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌ ప్రతిష్టాత్మక క్లుగ్‌ పురస్కారానికి సంయుక్తంగా ఎంపికయ్యారు. అమెరికా లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ఈ అవార్డు విజేతలకు 10 లక్షల డాలర్ల పారితోషికం అందజేస్తారు. భారతీయ నాగరికతలోని భిన్నత్వంలోని ఏకత్వపు సంవిధానాన్ని చాటిచెప్పడంలోఆమె విశేష కృషి చేశారు. తరతరాల చరిత్రను పరిశోధించి, శాస్త్రీయ దృక్పథంతో సేవలనందించారని అమెరికా లైబ్రరీ కాంగ్రెస్‌ ఈ అవార్డు ప్రకటన సందర్భంగా ప్రశంసించింది. 77 సంవత్సరాల రొమిల్లా ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో చరిత్ర విభాగంలో ప్రొఫెస్‌గా వున్నారు. ఐర్లాండ్‌కు చెందిన చరిత్రకారుడు పీటర్‌ రాబర్ట్‌ లమెంట్‌ బ్రౌన్‌తో కలిపి థాపర్‌కు ఈ పురస్కారం బహుకరిస్తారు. చరిత్రలో వక్రీకరణలను, వివిధ సిద్ధాంతాలను కావాలని జోడించడాన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. ఆమె చరిత్రకు నిజమైన భాష్యం చెప్పారు అని పలువురు పరిశోధకులు పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ చరిత్రను సమగ్ర రీతిలో విశ్లేషించగల చరిత్రకారులలో ఆమె అగ్రగణ్యురాలని ప్రశంసలు కురిపించారు.

(ఆంధ్రజ్యోతి, ఈనాడు 5-11-2008 సౌజన్యంతో)

రొమిలా థాపర్‌ తరతరాల భారత చరిత్రను 1983లోనే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని స్వర్గీయ సహవాసి తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంగా మరో సారి ఆ పుస్తకం గురించి ప్రస్తావించుకుందాం.
………………………………………


తరతరాల భారత చరిత్ర ... రొమిలా థాపర్‌ ...తెలుగు అనువాదం : సహవాసి

భారత చారిత్రక రచనకి సంబంధించి భావంలో, విషయ వివరణలో, వ్యాఖ్యానంలో వ్యాఖ్యానానికి అనుకూలంగా దిద్దుకొనే వాస్తవాలలో చాలా మార్పు వచ్చింది.
నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి.
డి.డి.కొశాంబి, సుశోభన్‌ సర్కార్‌, ఇర్ఫాన్‌ హబీబ్‌, రొమిలా థాపర్‌, బిపిన్‌ చంద్ర వంటి కొత్త చరిత్రకారులు రంగంలోకి వచ్చారు.చారిత్రక రచనా ప్రక్రియలో కొత్త విలువలు ప్రవేశపెట్టారు.
... ... ...

గతం కడుపులో దాగి వుంది ఓ నిధి.
ఏమిటా నిధి?
దాన్ని కనుక్కోడానికి మనకున్న ఆనవాళ్లేమిటి?
ఆధారాలేమిటి?
నిధి అంటే మనం పుట్టకపూర్వం వందల, వేళ ఏళ్ల కిందట ఈ ప్రపంచంలో, అందులో భాగమైన ఈ దేశంలో ఏం జరిగిందో ఎరుకపర్చే చరిత్ర.
లిపి తెలియని అతి పురాతనకాలం మొదలు లిఖిత, ముద్రిత పత్రాల, పుస్తకాల పునాదుల మీద లేచిన సమీప గతం వరకు సాగిన భారత చరిత్ర గతిని, మతం కళలు, సాహిత్యం భావజాలం, వ్యవస్థలు, ఉద్యమాలు, ఇత్యాదుల్లో దర్శనమిచ్చే భారతీయ సంస్కృతి స్వరూపాన్ని అత్యంత ప్రతిభావంతంగా, రసవత్తరంగా, విజ్ఞానదాయకంగా వర్ణించిన ఘనత రొమిలా థాపర్‌ది.

రొమిలా థాపర్‌ నవతరం చరిత్రకారుల్లో ప్రముఖులు.
ఆమె 1931లో ప్రసిద్ధ పంజాబీ కుటుంబంలో పుట్టారు. 1958లో లండన్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ పొందారు. కొద్దికాలం అక్కడే దక్షిణాసియా ప్రాచీన చరిత్ర అధ్యాపకురాలుగా పనిచేశారు. డిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర ప్రొఫెసర్‌గా కృషిచేశారు.

తరతరాల భారత చరిత్ర
- రొమిలా థాపర్‌

తెలుగు అనువాదం : సహవాసి

ప్రథమ ముద్రణ: 1983
పుర్ముద్రణలు: 1984, 1993, 1998, 2000, 2005, 2006
179 పేజీలు, వెల: రూ.60
……………………..

పథేర్‌ పాంచాలీ సత్యజిత్‌ రే అపూర్వ చిత్రానికి నవలా మాత్రృక బిభూతి బూషణ్‌ బందోపాధ్యాయ...అనువాదం: మద్దిపట్ల సూరి




పథేర్ పాంచాలీ అనగానే సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాకు ప్రేరణ ఇదే పేరుతో వెలువడిన ఒక బెంగాలీ నవల.దీన్ని బిభూతి భూషన్ బందోపాధ్యాయ రచించారు. మనలో చాలా మందికి ఆ సినిమా చూసే అవకాశం కలిగివుండొచ్చు కానీ ఆ నవల చదివే అదృష్టం వుండివుండకపోవచ్చు. కానీ ఈ బెంగాలీ నవలను దాదాపు నలభై ఏండ్ల క్రితమే మద్దిపట్ల సూరి గారు తెలుగులోకి అనువదించారన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. చాలా ఏళ్ళుగా ’out of print’ లో ఉన్న ఈ నవల ఈ మధ్యనే మరో ప్రచురణకు నోచుకుంది. పథేర్ పాంచాలీ సినిమాలాగే ఈ నవల కూడా మానవ సంబంధాలను ఎంతో సున్నితంగా ఆవిష్కరిస్తుంది. ప్రస్తుతం హైదరాబాదులోని అన్ని పుస్తకాల షాపుల్లోనూ ఈ పుస్తకం లభ్యమవుతోంది.

మద్దిపట్ల సూరి గురించి:1920 జులై 7 న తెనాలి దగ్గరి అమృతలూరులో జన్మించారు.తెలుగు సంస్కృతం, బెంగాలీ, హిందీ భాషలపై గట్టిపట్టున్న ఆయన విశిష్ట బెంగాలీ సాహిత్యాన్ని సొగసైన నుడికారంతో, సహజ సుందర అనువాదంతో తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. బిభూతి భూషన్ తో పాటు ప్రఖ్యాత బెంగాలీ రచయితలైన తారశంకర్ బెనర్జీ,శైలాజానంద ముఖర్జీ ,నిరంజన గుప్తా వంటి వారిని కూడా తెలుగు పాఠకులకు చేరువ చేసిన ఘనత సూరిదే.ఈయన అనువదించిన శాంబుడు(సమరేశ్ బసు), సమయం కాని సమయం(బిమల్ కర్), కలకత్తాకు దగ్గర్లో (గజేంద్రకుమార్ మిత్ర) వంటి నవలలను సాహిత్య అకాడెమీ ప్రచురించింది. భలే తమ్ముడు (1969), పండంటి కాపురం(1972) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా కూడా సుప్రసిద్ధులైన సూరి 1995 నవంబరు 19న మరణించారు.

ఈ పుస్తకం లోని ముందుమాట మీకోసం.

అజరామర పథగీతం

పథేర్ పాంచాలీ అనగానే మనకు చప్పున గుర్తుకొచ్చేది సత్యజిత్ రే, ఆయన రూపొందించిన ’అపూ’ చిత్రత్రయం! మొట్టమొదటిసారిగా ప్రపంచం దృష్టిని భారతీయ సినిమావైపు ఆకర్షించిందీ, సత్యజిత్ రేకు అంతర్జాతీయ గుర్తింపునూ, అపార ఖ్యాతినీ అర్జించి పెట్టిందీ ఈ చిత్ర త్రయమే.వీటిలో మొదటిది పథేర్ పాంచాలీ(1955) మిగిలిన రెండూ అపరాజిత (1956), అపూర్ సంసార్ (1959).ఈ చిత్రాలు మూడింటికీ కూడా ప్రఖ్యాత బెంగాలీ రచయిత బిభూతిభూషన్ బందోపాథ్యాయ్ రాసిన రెండు విశిష్ట నవలలే ఆధారం.

40 వ దశకంలో శాంతినికేతనంలో లలిత కళలు, గ్రాఫిక్ డిజైనింగ్ అభ్యసించి బయటకొచ్చిన సత్యజిత్ రేను సినిమాలు ఎంతగానో ఆకర్షించాయి. కానీ భారతీయ సినిమాల్లో ఎంతకీ తీపి వలపుల ప్రేమపాటలు, మార్మిక పురాణగాథలే రాజ్యమేలుతుండడం ఆయన్ను చాలా చికాకు పెట్టింది.”సినిమాకు జీవితమే ముడి సరుకు కావాలి.సినిమా వంటి జనమాధ్యమానికి స్ఫూర్తి మన జీవితంలో, మన మూలల్లో ఉండాలి. సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం వంటి రంగాల్లో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఈ దేశం చిత్రదర్శకులను కదిలించలేకపోవడం విడ్డూరం.వాళ్ళు తమ కళ్లూ, చెవులూ తెరుచుకుని వుంటే చాలు!”. ఈ వేదనే సత్యజిత్ రే ను సినిమాల వైపు ధృఢ సంకల్పంతో నడిపించింది. ఒక వైపు అప్పుడే సాధించుకున్న దేశ స్వాతంత్ర్యం తాలూకు ఉత్సాహం అన్ని రంగాల్లోనూ కొత్త ఊపిరులోడుతోంది. గాఢమైన జీవితానుభూతితో సినిమా రూపొందించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనకు మొట్టమొదటిసారిగా అధిగమించి ఆయన రూపొందించిన ఆ సినిమా ఆ తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అత్యుత్తమ మానవ చిత్రణా పురస్కారం (1955) తో సహా దేశ విదేశాల్లో ఎంతగా ప్రాచుర్యం పొందిందో, భారతీయ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్ళిందో, నవ్య ధోరణులకు ఎలాంటి పునాది వేసిందో ఆ చరిత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

’పథేర్ పాంచాలీ’ - సినిమాగా ఎంతటి ప్రఖ్యాతి అర్జించిందో ….ఒక నవలగా అది అంతకుముందే గొప్ప ప్రశంసలను అందుకుంది. ఒక రకంగా పథేర్ పాంచాలీ బిభూతి భూషనుడి స్వీయ కథాత్మక నవల. దీన్ని ఆయన 1928-29 మధ్య ’విచిత్ర’ పత్రికలో సీరియల్ గా రాశారు. 1929 నవంబరులో మొట్టమొదటిసారిగా పుస్తకం రూపంలో వెలువడీంది. బెంగాలీ/భారతీయ సాహిత్యంలో అప్పటికే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఈ నవలను చలనచిత్రంగా మలచటం ద్వారా సత్యజిత్ రే దీనికి అంతర్జాతీయ గుర్తింపునూ, శాశ్వతత్వాన్నీ తెచ్చిపెట్టారు.

చక్కటి బెంగాలీ గ్రామీణ జీవితపు అనుభవాలతో అలరారే బిభూతి భూషనుడి రచనలను చదవడమంటే ఈ విశ్వాన్ని, ఈ ప్రపంచాన్ని అతి సన్నిహితంగా దర్శించటమే.వీటిలో మనకు తారసపడే పిల్లలూ, పెద్దలూ, వాళ్ల జీవితాలూ తత్వాలూ సజీవమైనవి.పైకి అతి వాస్తవికంగా కనబడుతుండే ఈ జీవితాల్లోనే ఊహాతీతమైనవేవో…విస్మయాలు, విభ్రమాలు మనల్ని ఎక్కడికక్కడ కట్టిపడేస్తుంటాయి.పథేర్ పాంచాలిలో కథ చాలా స్వల్పం.నిశ్చిందిపురంలో ఉంటున్న ఒక పేద బ్రాహ్మణుడి కుటుంబం, ఇల్లు, పిల్లలు, జీవిక కోసం వాళ్ళు చేసే పనులు, వారి దైనందిన అనుభవాలు….అంతే! ఈ చిన్న కథాంశాన్నే బిభూతి భూషనుడు ఇద్దరు పిల్లల కళ్ళతో, వారి పసి మనసుల్లో నుంచి పొరలు పొరలుగా దర్శింపజేస్తూ మనల్ని ఓ జీవితకాలపు అనుభూతికి లోను చేస్తాడు. నిశ్చిందిపురంలోని తోటలూ, చెట్టుచేమలూ, కాయలూ పళ్ళూ ఎంత వాస్తవమైనవో ’దుర్గ’,’అపు’ కూడా మన కళ్ళముందు అంతే వాస్తవంగా తిరుగుతుంటారు.తమ చిన్న ప్రపంచాన్ని క్షణం తీరికలేకుండా బాల్య సహజమైన కుతూహలంతో సాహోసోపేతంగా కూడా శోధిస్తుంటారు. వాళ్ళ అపురూపమైన ఆశలు, చిన్న చిన్న కోర్కెలు, ఏవేవో గుసగుసల రహస్యాలు, కవ్వింపులు, కుళ్ళుమోత్తనాలు….మనం ముచ్చట పడకుండా ఉండలేం! నిస్సహాయంగా వాళ్ళ స్నేహితులమైపోతాం.వాళ్లే లోకంగా, వాళ్ళలోనే ఉంటాం, వాళ్లతోనే తిరుగుతాం.అందుకే దుర్గ మరణాన్ని మనం తట్టుకోలేం. కానీ ఆ విషాదాన్ని వాళ్ళ కుటుంబం తట్టుకుంటుంది. ఆ ఒక్క విషేదాన్నే కాదు, ఎన్నో వరుస విషాదాల్ని, పేదరికాన్ని, ఈసడింపుల్ని, ఈర్ష్యాసూయల్ని ఎన్నో బెంగల్ని, జీవన్మరణాల్ని….ఎన్నింటినో నిభాయించుకుంటుంది.జీవిత పథం ఆశావహంగా, మరింత ముందుకే సాగుతుంటుంది.

’పథేర్’ అంటే పథం, రహదారి మార్గం. ’పాంచాలీ’ అనేది తరతరాలుగా సంప్రదాయ కథాగానానికి ఉపయోగిస్తుండే బెంగాలీ గీతాలు.అందుకే సత్యజిత్ రే తన చిత్రానికి ’సాంగ్ ఆఫ్ ది లిటిల్ రోడ్’ అని ఉపశీర్షిక జోడించారు.చింత-నిశ్చింతల మధ్య ఊగిసలాడుతుండే జీవనమార్గంలో ఎన్నో మలుపులు. అయినా ఆ పథం ముందుకు సాగుతూనే వుంటుంది. స్థలకాలాదులకు అతీతంగా జీవితాన్ని, మానవానుభూతులను సార్వత్రీకరించటంలో బిభూతి భూషన్ చూపించే అసమాన సామర్థ్యం అది. దుర్గ మరణంతో ….పథేర్ పాంచాలీ నవల చివర్లో అపు సొంత జీవితం ఆరంభమవుతుంది. (అది తర్వాత నవల ’అపరాజిత’ లో కొనసాగుతుంది.) పైకి జీవనమార్గం సూటిగా, సున్నితంగా సాగిపోతున్నట్టే ఉంటుందిగానీ….సామజికంగా దీనికి ఉన్న విస్తృతి చాలా ఎక్కువ.మారుతున్న కాలంతో పాటే వ్యక్తులు తమతమ జీవితాలకు అర్థాలను వెతుక్కుంటూ పల్లెల నుంచి పట్నాలకు వలసపోతున్న జీవితాలు అంతర్లీనంగా తరచూ మనల్ని కలవరపెడుతుంటాయి.ఊపందుకున్న పారిశ్రామీకరణలో అప్పుడప్పుడే గ్రామాల గుండెల్లోకి దూసుకొస్తున్న నాగరికతారైళ్ళు, అబ్బురంతో చూసే పసి మనసుల్లో అవి రేపే గుబుళ్ళు, కుటుంబాలను అతలాకుతలం చేసే అనూహ్య విలయాలు, తలవంచకుండా ఆత్మగౌరవంతో సాగించే పేదరికపు పోరాటాలు….ఇలా ఎన్నో బలీయమైన మానవ సామాజిక సందర్భాలు నవల పొడుగునా మనల్ని పలకరిస్తుంటాయి.మనసు ఆర్థ్రంగా మానవీయమవుతుంటుంది.అందుకే పథేర్ పాంచాలీ కరిగిపోయే కాలంతో ప్రమేయం లేని ’క్లాసిక్’ గా ఎన్నటికీ వన్నె తగ్గకుండా నిలిచివుంటుంది.
Curtesy:
శిద్దారెడ్డి వెంకట్
http://telugu.yuyam.com/out.php?id=24678

పథేర్‌ పాంచాలీ
సత్యజిత్‌ రే అపూర్వ చిత్రానికి నవలా మాత్రృక
- బిభూతి బూషణ్‌ బందోపాధ్యాయ
అనువాదం: మద్దిపట్ల సూరి
258 పేజీలు, వెల రూ.100/-

.................

Thursday, December 4, 2008

ఒక ఆదివాసీ వీరుడి కథ : కొమురం భీం (నవల)... రచన: భూపాల్‌




ప్రస్తుత ప్రపంచీకరణ వాతావరణంలో మన పిల్లలు మన మూలాలకు దూరమైపోతున్నారు...

సినిమా తారల, కూల్‌ డ్రింక్‌ల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ఆధునిక మీడియా అనునిత్యం వారిని 'అ లరిస్తోంది'. వలస ధోరణులను పెంచేందుకు
ఉద్దేశించిన ఈ చట్రాల నుంచి బయటపడేందుకు మనం మన మూలాలకు, ముఖ్యంగా మన ప్రజల మూలాలకు చేరువ కావాల్సిన అవసరం
వుంది....

మన గడ్డపై వీరోచితమైన పోరాటాలు సాగించి, ఇప్పుడు దాదాపుగా జానపదుల గాధల్లో మిగిలిపోతున్న మన వారి కథల్ని పిల్లలకూ (పెద్దలకూ
కూడా) అందించే ఉద్దేశ్యంతో ఈ ''పిల్లల కోసం'' సిరీస్‌ను వెలువరిస్తున్నాం.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతికేకంగా అడవుల్నీ, ఆదివాసీ ప్రజల్నీ కదిలించిన ఆదిలాబాద్‌ జిల్లా గోండు పోరాట నాయకులు ఈ కొమురం భీం
కథ ఈ సిరీస్‌లో మొదటిది.

..............................................................

ఒక ఆదివాసీ వీరుడి కథ


మన రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా పురాణ కాలపు భీముడు, హిడింబల రాజ్యమని ప్రతీతి.
ఇప్పటి గోండు జాతి సోదరీ సోదరులు వాళ్ల వంశీకులే అంటారు.
ఆ ప్రాంతాన్ని గోండులు పరిపాలించినట్టు చారిత్రక రుజువులున్నాయి.
జనహిత పాలన వాళ్లది.
మైదాన ప్రాంతాన్నుంచి వచ్చిన షావుకార్లు బిస్కట్లు, మురుకులు, ఉప్పు, దువ్వెన్లు, తదితర వస్తువులను వస్తుమార్పిడి పద్ధతిలో అమ్ముతూ
గోండులను నిలువుదోపిడీ చేసేవారు..
దోసెడు ఉప్పు ఇచ్చి గోండుల నుంచి ఇరవై రెండు కిలోల కందులు తీసుకునేవారు.
ఆదివాసీలు అమాయకులు. వాళ్లకు చదువురాదు, లెక్కలు తెలియవు. ధర్మ పథం తప్పనివాళ్లు వారు.
వాళ్ల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మైదాన ప్రాంత వ్యాపారస్థులు అప్పుల పేరుతో ఆదివాసీల పంటలు, మేకలు, ఇతర జంతువులను
స్వాధీనం చేసుకునేవారు. చివరికి గోండుల చేత తమ ఇళ్లల్లో వెట్టి చాకిరీ చేయించుకునేవారు.

ఆ తర్వాత నైజాం రాజోద్యోగులు వాళ్లని పన్నుల పేరిట నానా రకాలుగా హింసించేవారు. అట్లాంటి దారుణమైన వాతావరణంలో ఓ గోండు
కుటుంబంలో జన్మించాడు కొమురం భీము.
ఆదివాసీలందరికీ భీం కుటుంబమే పెద్దదిక్కు. కొమురం భీం తన పూర్వీకుల వీరోచిత గాథలు వింటూ పెరిగాడు. వాళ్ల వదిన భీం కు
చిన్నప్పటినుంచే వీర గాథల్ని చెప్తూ అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.

కూసే కూకు కూకూ (కూసే కోకిల కూకూ)
కేడా మావయి కూకూ (అడవి మనది కూకూ)
బీడూ మావయి కూకూ (బీడూ మనది కూకూ)
గోండు రాజ్యం కూకూ
మైసి వాకట్‌ కూకూ (గెలిచీ వస్తాం కూకూ)
తుడుం అంకత్‌ కూకూ (తడుం మోగించాలి కూకూ)
సచ్చుల దేశం కూకూ (మొత్తం దేశం కూకూ)
మైసి వాకట్‌ కూకూ (గెలిచీ వస్తాం కూకూ)


భీం వదిన కుకూ బాయి ఎప్పుడూ పాడే ఈ పాట అతణ్ని అమితంగా ప్రభావితం చేసింది.
'' వదినా ఈ నీళ్లు మనవి... ఈ గాలి మనది... ఈ ఎండ మనది... ఈ ఆకాశం మనది... మరి ఈ అడవి మనదెందుకు కాదు ? మన అడవి,
మన నేల, వాళ్లదెట్లా అయింది? '' అని అడిగేవాడు భీం.

ఆదివాసీలు పోడు వ్యవసాయం చేస్తూ తమ పంటల్ని రక్షించుకునేందుకు ప్రాణాలకు తెగించి అడవి మృగాలతో పోరాడుతుంటారు.
కానీ పంటలు చేతికందే సమయానికి నైజాం ప్రభుత్వ మానవ మృగాలు విరుచుకుపడి పంటలన్నింటినీ ఊడ్చుకుపోతుంటారు. కోళ్లను, మేకలను,
గొర్రెలను ఎత్తుకుపోతారు. ఎదురుతిరిగిన వాళ్ల చిత్రహింసలకు గురిచేస్తారు, వారిపై అక్రమ కేసులు బనాయిస్తుంటారు. గూడేలకు గూడేలనే
తగులబెడ్తుంటారు.

ఈ అన్యాయాలను సహించలేక కొమురం భీం తిరుగుబాటు బాటపడ్తాడు. ఆ క్రమంలో శత్రుపక్షంలో ఒకడ్ని చంపేస్తాడు. శత్రువులకు చిక్కకుండా
తప్పించుకునేందుకు గూడెంను వదిలి దేశాటన చేస్తాడు.

బతుకు గమనంలో అక్షరం నేర్చుకుంటాడు. భాషలు నేర్చుకుంటాడు. ఉద్యమాలతో అతనికి పరిచయం కలుగుతుంది. అ ల్లూరి సీతారామరాజు
వీరోచిత గాథ విని ఉత్తేజం పొందుతాడు. ఆ చైతన్యంతో తిరిగి తన ఊరుకు చేరుకుని తోటి ఆదివాసీలను చైతన్యపరుస్తాడు. తనవాళ్లని స్వేచ్ఛా
స్వాతంత్య్రం దిశలో నడిపిస్తాడు.

మొదట తమ సమస్యల పరిష్కారానికి సాత్వికంగా సర్కారుకు విన్నపాలు సమర్పిస్తాడు. కానీ సర్కారు ఆ విన్నపాలను బుట్టదాఖలు చేసి
అణచివేత మార్గాన్ని అనుసరిస్తుంది. దాంతో ఇక లాభం లేదని యుద్ధానికి సిద్ధమవుతాడు కొమురం భీం. సర్కారుతో అరివీర భయంకరంగా
పోరాడి పాక్షిక విజయం సాధిస్తాడు. అయితే నైజాం సర్కారు ఆయుధ సంపత్తి ముందు ఎక్కువ కాలం నిలబడలేకపోతాడు. పైగా స్వపక్షంలో
కొందరు ద్రోహులు వెన్నుపోటు పొడవడంతో కొమురం భీం ఆ వీరోచిత పోరాటంలో అమరుడవుతాతు.

కొమురం భీం జానపద హీరో కాదు. ఓ చారిత్రక రోల్‌ మాడల్‌ మాత్రమే కాదు. నేటికీ జనం గుండెల్లో సజీవంగా వున్న యోధుడు. ఆ పల్లె
ప్రాంతాల్లో ఇప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆయన వీర గాథను వినిపిస్తూనే వుంటారు.

ఆయనపై అనేక పుస్తకాలు వచ్చాయి. అయితే భూపాల్‌ అందించిన ఈ పుస్తకం ఎంతో విలక్షణమైనది. విశిష్టమైనది. జన నాట్య మండలి
కార్యకర్తగా, సారథ్య శ్రేణిలో ముఖ్యుడిగా ఆయన అందరికీ సుపరిచితుడు. (కొమురం భీంపై నిర్మించిన సినిమాలో కూడా ఆయన ముఖ్య పాత్రను
పోషించారు). రేపటి పౌరులను ప్రయోజనాత్మక బాటలో తీర్చిదిద్దాలన్నది ఆయన ఆశయం. అందుకే పిల్లల స్థాయికి ఒదిగి వాళ్ల టోన్‌లోనే ఎంతో
ఆసక్తిని రేకెత్తించేవిధంగా చెప్పుకెళతాడీ కథనాన్ని.

తల్లిదండ్రులు తమ పిల్లలకు చాక్లెట్లో, మరొకటో గాక అప్పుడప్పుడు ఇట్లాంటి పుస్తకాలు కొనిస్తే వాళ్లు టీవీలను వొదిలి నిజమైన ప్రపంచం గురించి
తెలుసుకుంటారు. మానవీయ విలువలతో ఎదుగుతారు.

(ఆంధ్రభూమిలో వెలువడిన పుస్తక సమీక్ష నుండి)
.....................................................




కొమురం భీం
ఒక ఆదివాసీ వీరుడి కథ
రచన: భూపాల్‌

బొమ్మలు : ఏలే లక్ష్మణ్‌

63 పేజీలు, వెల : రూ.25
.............................

Wednesday, December 3, 2008

మన మంచి పుస్తకాలు ... చిల్లర దేవుళ్లు (నవల) ... రచన: దాశరథి రంగాచార్య



మూడు దశాబ్దాల క్రితం దాశరథి రంగాచార్య రాసిన 'చిల్లర దేవుళ్లు' నవల తెలుగు సాహిత్యరంగంలో ఆలోచనలు రేకెత్తించింది.

తెలంగాణా ప్రాంతపు ఇతివృత్తం, అందులోని పాత్రల కనుగుణమైన సంభాషణ, తెలంగాణా పరిసరాల చిత్రణ, పండుగల విధానం చెప్పడంలో ఓ కొత్త గాలిని మోసుకొచ్చింది.

అప్పటికి తెలంగాణా యాస అచ్చులో కనిపించడం కొందరు అమర్యాదకరంగా భావించినవారున్నారు.

అ లాంటి భావజాలం నుంచి బయటపడి తెలంగాణా మాండలికానికి సాహిత్య గౌరవం తీసుకొచ్చారు, సాహిత్య రంగంలో స్వేచ్ఛను తీసుకొచ్చారు దాశరథి రంగాచార్య.

మూడు దశాబ్దాల అనంతరం కొత్త తరాలకు ముఖ్యంగా పిల్లలకు పరిచయం చేయాలన్న సంకల్పంతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ఆ నవలకు సంక్షిప్త రూపాన్ని తీసుకొచ్చారు.

ఈ తరం పాఠకులు ఒకనాటి తెలంగాణా జీవితాన్ని తెలుసుకోవడానికి వీలు కల్పించే రీతిలో ఈ పుస్తకాన్ని సచిత్రంగా రూపొందించారు.
తెలుగులో ఇదో కొత్త సంప్రదాయంగా అనిపిస్తోంది. ఈ ప్రయత్నం ఎన్నదగిందికూడా.

మూడు దశాబ్దాల క్రితం చిల్లర దేవుళ్లు సృష్టించిన ప్రకంపనలు ఇప్పటికీ ఇంకా వినిపిస్తున్నాయి.

... ... ... ...

తెలంగాణా జీవితాన్ని చిత్రించిన తొలి నవలగా చరిత్రలో స్థిరపడిన చిల్లర దేవుళ్లు నవల ఈ తరం వారికోసం అన్నట్టు మళ్లీ అందుబాటులోకి రావడం విశేషం.

నిండైన సైజుతో తెలంగాణా ఆత్మను నింపుకున్న బతుకమ్మ ముఖచిత్రం పుస్తకానికి ఆభరణం.

జరిగిపోయిన కాలచక్ర ప్రవాహంలాంటి ఒక తరాన్ని ముందుకు నడిపించి, నాటి సమకాలీన జనజీవన చైతన్యానికి దోహదం చేసిన నాటిమేటి రచనలు నేటితరం చదువరులకు మార్కెట్‌లో లభ్యంకావడం లేదన్నది వాస్తవం. కొన్ని అమూల్య రచనలైతే పూర్తిగా కనుమరుగయ్యాయనీ మనకు తెలుసు. ఈ లోటును పూడ్చడం కోసం హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌వారు వెలువరిస్తున్న '' మన మంచి పుస్తకాలు ''సిరీస్‌లో భాగమే ఈ '' చిల్లర దేవుళ్లు ''.

పదేళ్లు దాటిన పిల్లలు, పెద్దలందరూ చదువుకునేందుకు వీలుగా ఎంతో జాగ్రత్తగా నవలని తీర్చిదిద్దామని ముద్రాపకులు చెప్పన మాట అక్షర సత్యం.

నాటి నిజాం నవాబుల పాలనని తెలంగాణా ఆత్మతో దాశరథి రంగాచార్య అక్షరీకరించిన తీరు అద్భుతం.

(ఆంధ్రప్రభ, వార్త దినపత్రికల సమీక్షలు)


చిల్లర దేవుళ్లు
- దాశరథి రంగాచార్య

బొమ్మలు : ఏలే లక్ష్మణ్‌

35 పేజీలు : వెల: రూ.15


...........................

Monday, December 1, 2008

ఒక మంచి పుస్తకం ... డాక్టర్ కేశవరెడ్డి నవల మునెమ్మ





డాక్టర్ కేశవ రెడ్డి గారు చాలాకాలం తర్వాత 'మునెమ్మ ' నవల రాశారు. ఈ నవల 2007 అక్టోబర్ నెల చతురగా వచ్చింది. కేశవరెడ్డి గారు అద్భుతమైన రచనలు చేసారు. సిటీ బ్యూటిఫుల్, అతడు అడవిని జయించాడు,రాముడుండాడు.రాజ్జివుండాది, మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ మునెమ్మ.(ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు ) రాసి కంటే, వాసి ముఖ్యమని ఇలాంటి వాళ్ళ రచనల గురించే అంటారు కాబోలు.

రాయలసీమ మాండలికాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసింది స్వర్గీయ పులికంటి క్రిష్ణారెడ్డి గారైతే, దాన్ని తెలుగు సాహితీ ప్రియుల ఇళ్ళలోకి సరఫరా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది నామిని, కేశవ రెడ్డి గార్లు.

ఇక మునెమ్మ నవల విషయానికొస్తే, కథాకాలం మొదటి ప్రపంచ యుద్ధం నాటిది. కథని ఒక పదేళ్ళ కుర్రా డు (మునెమ్మకు మరిది వరస) చెపుతూ ఉంటాడు. భర్త చావుకి కారణమైన కొంతమంది వ్యక్తుల ఆచూకీ కనుక్కుని, వారిని అంతమొందించడానికి బయలు దేరిన ఒక భార్య కధ. వినగానే, ఇదేదో ఫాక్షన్ సినిమాలా ఉంది గానీ...కాదు!

మునెమ్మ ఒక పాతికేళ్ళ పడుచు. రైతు భార్య. ఆమె భర్త జయరామిరెడ్డి తన బండికి కట్టే బొల్లి గిత్తను రక్తం కారేలా కొట్టడంతో కథ ప్రారంభమవుతుంది. అతడలా కొట్టడానికి కారణం ఏమిటంటే, గడ్డి కోస్తున్న మునెమ్మ వీపుమీద బొల్లి గిత్త రెండు కాళ్ళతో గీరడంతో, ఆమె రవిక చిరిగి పోతుంది. దానితో జయరాముడు అగ్గిరాముడై పోతాడు.

తల్లి, మునెమ్మ, ఎంత చెప్పినా వినక జయరాముడు దాన్ని మద్దిపాలెం పశువుల సంతలో తెగనమ్మి పారేసేందుకు మర్నాడే బయలు దేరతాడు. దారిలో పోటు మిట్ట గ్రామంలో, 'తరుగులోడు 'గా పేరుపడ్డ పశువుల దళారీతో కలిసి మద్దిపాలెం వెళ్ళాలని జయరాముడు నిర్ణయిస్తాడు. అప్పట్లో బస్సులూ, అవీ అరుదు గనక, కాలి నడకన బయలు దేరతాడు.

రెండు రోజులయ్యక, జయరాముడు లేకుండా, బొల్లి గిత్త ఒక్కటే రొప్పుకుంటూ ఇల్లు చేరుతుంది. దానితో, మునెమ్మ, ఆమె అత్త నిర్ఘాంతపోతారు. ఒక రోజంతా చూసినా జయరాముడు తిరిగి రాడు. పైగా ఆ రాత్రి మునెమ్మకి ఒక పీడ కల వస్తుంది. ఆ కలలో మునెమ్మ గిలక బావి నుండి నీళ్ళు తోడుతుండగా, బకెట్ కి బదులుగా జయరాముడి శవం పైకొస్తుంది. అతడి మెడకి బొల్లిగిత్త మెడలో ఉండాల్సిన వెంట్రుకల తాడు బిగించి ఉంటుంది.(ఆ తాడు మునెమ్మ వెంట్రుకలతో పేనిందే) దానితో జయరాముడు ఇక లేడని మునెమ్మ నిర్థారణకొస్తుంది. బారెడు పొద్దెక్కేదాక ఏకధాటిగా ఏడుస్తుంది. తర్వాత లేచి కర్తవ్య నిర్వహణకు సన్నాహమవుతుంది. జయరాముడి ఆచూకీ కోసం వూళ్ళోని మగవాళ్ళు ఎవరు వెళతామన్నా, ఒప్పుకోదు. 'కనబడకుండా పోయింది నా వాడేగదా, నేనే వెదకాల ' అని మరిదితో ( ఈ కథ చెప్పే కుర్రాడు) కలిసి బయలు దేరుతుంది.

బొల్లి గిత్త కొమ్ములకున్న మద్దిపాలెం సంత చీటీ ఆధారంగా వారి అన్వేషణ ప్రారంభమవుతుంది.
మొదట వాళ్ళు తరుగులోడిని కలుస్తారు. వాడు ఎటూ చిక్కకుండా సమాధానాలు చెపుతాడు. పైగా ' ఏవమ్మా, జయరాముడు పైకంతో మంచి గొడ్డుని పట్టుకున్నాడా...జల్సా చేస్తా వున్నాడా ' అని అడుగుతాడు కూడా! జయరాముడు బొల్లిగిత్తను సంత దాకా తీసుకెళ్లకుండానే, దార్లోనే అమ్ముడైపోయిందని చెప్తాడు. సంత చీటీ తమ దగ్గరున్న సంగతి చెప్పకుండా , వాడిచ్చిన సమాచారం ఆధారంగా ముందుకు సాగుతారు. ఒక పూట కూళ్ళ ఇంట్లో వారికి మరింత విలువైన సమాచారం లభిస్తుంది.

సంతలో మరికొంత మంది చెప్పిన విషయాల ఆధారంగా పశువైద్యుడి ఇంటికి వెళతారు. కాని అప్పటికే అతడు మరణ శయ్య మీద ఉంటాడు. వైద్యం చేస్తుంటే ఆవు కుమ్మిందని ఇంట్లో వాళ్ళు చెపుతారు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో అన్నట్లున్న అతడు, మునెమ్మ చేతిమీద బొల్లి గిత్త పచ్చ బొట్టు చూడగానే, వెర్రికేక పెట్టి ప్రాణం వదిలేస్తాడు.

జయరాముడి హత్యలో తరుగులోడికి, పశువద్యుడుకి భాగం ఉందని గ్రహిస్తుంది మునెమ్మ! అప్పుడు వెళుతుంది పోలీస్ స్టషన్ కి...ఏదైనా అనాధ శవం దొరికిందా అని తెల్సుకోవడానికి. ఒక రోజు ముందే జయరాముడి శవ దహనం జరిగిందని తెల్సుకుంటుంది.ఒక వెంట్రుకల తాడుతో జయరాముడి గొంతు బిగించి చంపారని తెలిసి వణికి పోతుంది. ఆ తాడుని జయరాముడే స్వయంగా మునెమ్మ తల దువ్వుకునేటపుడు రాలిన వెంట్రుకలతో పేనాడు.

మునెమ్మ బొల్లి గిత్తను తోలుకు రమ్మని మరిదిని పంపుతుంది. బొల్లిగిత్తతో పాటు తరుగులోడి ఇంటికి వెళుతుంది. తరుగులోడిని నిలదీసి, వాడు తనకేమీ తెలీయదని బుకాయిస్తుండగా , బొల్లి గిత్తను వదులుతుంది. అది ఉగ్రరూపం దాల్చి తరుగులోడి పేగులు తీసి కొమ్ములకు చుట్టుకోవడంతో కథ ముగుస్తుంది.

ఇక్కడ మీకు ఆసక్తికరంగా అనిపించిందో లేదో కాని, చదవడం మొదలెట్టాక ఆపకుండా చదివించే నవల ఇది. కేశవ రెడ్డి గారి శైలి అదే! అద్భుతమైన కథనం ఊపిరి తిప్పుకోనివ్వదు.

మునెమ్మ మనోభావాల చిత్రణ చదువుతుంటే, అతడు అడవిని జయించాడు లోని ముసలివాడి పాత్ర గుర్తొసుంది.ఆమె కర్తవ్య నిర్వహణ, అలుపెరుగని ప్రయాణం, పంది పిల్లల్ని కాపాడె ప్రయత్నంలో ముసలివాడు పడే తాపత్రయాన్ని గుర్తు చేస్తుంది.

'వదినా, జయరామన్న అంత్యక్రియలు ఎక్కడ చెయ్యా ల? " అని మరిది అడిగితే ' ఇప్పుడు నేనేం జేస్తున్నాను? ఆయన అంత్యక్రియలేగా! జయరాముడిని పడగొట్టిన వాళ్ళ నోట్లో రూకలు పడాల! ఆయన అంత్యక్రియలు పూర్తైనట్టే " అని మునెమ్మ చెప్పే మాటలు గగుర్పాటు కలిగిస్తాయి.
లైబ్రరీలో తప్పక ఉండవలసిన పుస్తకం ఇది.

(మనసులో మాట సుజాత గారి సౌజన్యంతో )
http://manishi-manasulomaata.blogspot.com/2008/04/blog-post_13.html

డా.కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టారు. తిరుపతిలో పియుసి, పాండిచ్చేరిలో ఎంబిబిఎస్‌ చేశాక నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి విక్టోరియా మెమోరియల్‌ ఆసుపత్రిలో స్కిన్‌ స్పెషలిస్టుగా కుష్టు రోగులకు సేవలందించారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో వుంటూ ఆర్మూరులో వైద్య సేవలు అందిస్తున్నారు. కుష్టువ్యాధిపై ఆయన రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.

వీరి ఇతర రచనలు:

బానిసలు
భగవానువాచ
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌
స్మశానం దున్నేరు
అతడు అడవిని జయించాడు
రాముడుండాడు రాజ్జిముండాది
మూగవాని పిల్లనగ్రోవి
చివరి గుడిసె
సిటీ బ్యూటిఫుల్‌
నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌వారు అతడు అడవిని జయించాడు నవలను 14 భారతీయ భాషల్లోకి అనువదించారు.
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ నవల మరాఠీలోకి అనువాదమైంది.
తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి, హృదయాలను తేలికపరచటం, అనివార్యమైన జీవిత పోరాటానికి ఉపక్రమింపజేయటమే తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం. కొడుకూ కూతురూ సంతానం.

మునెమ్మ ... నవల
రచన: డా. కేశవరెడ్డి

తొలి పలుకు: జయప్రభ
మలి పలుకు: అంబటి సురేంద్రరాజు

ముఖచిత్రం: కాళ్ళ

111 పేజీలు, వెల రూ.40

......................

విలక్షణ నవల మునెమ్మ … రచన డా. కేశవరెడ్డి






మునెమ్మ నవలపై ఈనాడులో వెలువడిన పుస్తక సమీక్ష



విలక్షణ నవల

ఏదో ఒక ప్రత్యేకత గల రచనలు చెయడంలో పేరుపొందిన కేశవరెడ్డి గారి నవల మునెమ్మ.
స్త్రీ పురుష సంబంధాలపై మాజిక్ రియలిజం పద్ధతి లో రాసారు దీన్ని.


కధన పద్దతి లో ఆసక్తిగా చదివించె శైలి ఉంది.

రాయలసీమ మాండలికం (కొంచం కష్టపడితే) ఆహ్లాదం కలిగిస్తుంది.
కొందరి లో ఉండె మౄగత్వ లక్షణాలను కూడా వెల్లడి చెస్తుంది.

కథా నాయకుడు జయరాముడి హత్య దానికి ప్రతిగా మునెమ్మ చేసిన హత్య -
అప్పటి మానసిక ప్రవ్రుత్తులూ విశిష్ఠ భావనలూ పాఠకుడిని చకితుణ్ణి చెస్తాయి.

జయప్రభ, అంబటి రాసిన వ్యాసాలు రచయిత హౄదయాన్ని తెలియ జేస్తాయి.

కధాంశంతో గాని, రచయిత ఆలోచనా విధానంతో గాని ఏకీభవించకపొవడమూ కద్దు.

అంటె చర్చకి అవకాశం ఉన్న నవల.


మునెమ్మ నవల
రచన డా. కేశవరెడ్డి
పేజీలు 111, వెల : రూ.40


ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ఫ్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్,
హైదరాబాద్ -67

(ఈనాడు ఆదివారం 30-11-2008 సౌజన్యంతో)

............................

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌