మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Sunday, November 30, 2008
ఏది హీనం? బానిసత్వమా ... లేక ... అంటరానితనమా ?? -డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ... తెలుగు అనువాదం పృథ్వీరాజ్
అంబేడ్కర్ ఆలోచన
అన్ని జాతుల్లో కెల్లా తామే అధికులమని నిరూపించుకోవటానికి హిందువులు చాలా కారణాలు చెప్తుంటారు.
భారతదేశంలో హిందువుల మధ్య బానిసత్వం లేదు,
అంటరానితనం బానిసత్వమంత ప్రమాదకరమైంది కాదు
అన్నవి వాళ్లు చెప్పే రెండు ముఖ్యమైన కారణాలు.
మొదటి వాఖ్యానం అసత్యం.
బానిసత్వం అనేది హిందువుల్లో అనాదిగా కొనసాగింది.
హిందూ ధర్మశాస్త్ర నిర్మాత మనువు బానిసత్వానికి గుర్తింపు నిచ్చాడు.
మనవు తరువాతి స్మృతికారులు బానిసత్వాన్ని విస్తరించి వ్యవస్థీకరించారు.
హిందువుల్లో బానిస వ్యవస్థ ఎప్పుడో పురాతన కాలంలో మాత్రమే ఉండి అంతరించిపోయిన వ్యవస్థ కానేకాదు.
భారత దేశ చరిత్ర ఆదినుంచీ మొన్న మొన్నటివరకూ బానిస వ్యవస్థ కొనసాగింది.
1843లో బ్రిటీషు ప్రభుత్వం కనుక చట్టం ద్వారా బానిసత్వాన్ని నిర్మూలించక పోయి వునట్టయితే అది ఇప్పటికీ కొనసాగుతూనే వుండేది.
బానిసత్వం కొనసాగినప్పుడు అది అటు అంటగలిగినవారికీ ఇటు అంటరానివారికీ ఇద్దరికీ వర్తించింది.
అయితే అంటగలిగిన వారికన్నా అంటరానివారే ఎక్కువగా బానిస వ్యవస్థకు బలయ్యారు.
అందుకు ప్రధాన కారణం వారి పేదరికమే.
1843వరకూ భారతదేశంలో అంటరానివారు
బానిసత్వం, అంటరానితనం
అనే రెండు రకాల దాస్య శృంఖలాలలో బందీలయ్యారు.
... ... ...
అంటరానితనం - బానిసత్వంల మధ్య మరో భేదం ఏమిటంటే బానిసత్వం ఎన్నడూ తప్పనిసరైనది కాదు.
కానీ అంటరానితనం తప్పనిసరిగా వుంటుంది.
ఒక వ్యక్తి మరొకరిని బానిసగా ఉంచుకోవటానికి '' అనుమతి '' వుంటుంది.
కానీ, అతడు అట్లా చేయదలచుకోకపోతే అతడిపై ఎట్లాంటి బలవంతం వుండదు.
మరోవైపు ఒక హిందువు మరొకరిని (ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాడిని) అంటరానివాడిగా పరిగణించి దూరంగా వుంచాలన్న నిర్దేశం (కుల/మతపర కట్టుబాటు) వుంటుంది.
అతడి వ్యక్తిగత భావాలు ఏవైనా సరే ఆ నిర్బంధం నుంచి అతడు తప్పించుకోలేడు.
... ...
అంటరానితనమనేది బానిసత్వమంత హీనమైనది కాదా?
బానిసత్వం కన్నా అంటరానితనం తక్కువ హానికరమైనదా?
అంటరానితనం కన్నా బానిసత్వం తక్కువ అమానవీయమైనదా?
అంటరానితనం కన్నా బానిసత్వమే ఎక్కువగా అభివృద్ధిని ఆటంకపరిచిందా?
?????
ఏది హీనం? బానిసత్వమా ... లేక ... అంటరానితనమా ??
-డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
ఆంగ్ల మూలం: Slaves and Untouchables, Chapter 3, Vol V, Dr.B.R.Ambedkar's Writings and Speeches, Education Department, Govt of Maharashtra, 1989.
తెలుగు అనువాదం : పృథ్వీరాజ్
17 పేజీలు, వెల: రూ.8
..................
Saturday, November 29, 2008
హిందూ నాగరికత - అంటరానివాళ్లు ... హిందువుల ఇళ్లు ...డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ... తెలుగు అనువాదం: సుందర వర్ధన్, జిలుకర శ్రీనివాస్.
అంబేడ్కర్ ఆలోచన
మనిషికి, ప్రకృతి జ్ఞానానికి హిందూ నాగరికత అందించేదేమిటి?
ప్రపంచంలో హిందూ లేదా వేద నాగరికత ప్రాచీనమైనదని ప్రతి దేశభక్త హిందువూ ప్రగల్భాలు పలుకుతాడు.
మిగతా ప్రదేశాల్లో మనుషులు నగ్నంగా సంచరిస్తూ ఆదిమ జీవనం సాగిస్తున్నప్పుడే భారతదేశంలో నాగరికత అత్యున్నత దశలో వుండేదని దురహంకారంతో గర్విస్తుంటాడు.
ఈజిప్టు, బాబిలోనియా, జూడియా, రోమ్, గ్రీసు నాగరికతలు నాశనమవుతున్నప్పుడు హిందూ నాగరికత సజీవంగా వుందని అందుకు వారసత్వ శక్తి కారణమని హిందువులు చెప్పుకోవటం కూడా వినవచ్చు.
అయితే అట్లాంటి దృష్టి ఒక కీలకమైన అంశాన్ని జారవిడుస్తుంది.
నాగరికత ప్రాచీనమైనదా, మనగలిగిందా అన్నది మౌలిక అంశం కాదు.
ఒక వేళ అది మనగలిగితే దేనిమీద?
దాని విలువలేమిటి?
ఈ హిందూ నాగరికత సామాజిక వారసత్వం ప్రయోజనకరమైనదేనా?
లేక మన సామాజానికి అది ఒక గుదిబండా?
వివిధ తరగతులకు, వ్యక్తులకు విస్తరించడం ద్వారా, ఎదగడం ద్వారా అది మనకేం అందివ్వనుంది?
.... .... ....
ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1. హిందువులది నాగరికతేనా?
2. హిందూ నాగరికత
3. కులం - బ్రాహ్మణుల సమర్థన
4. హిందూ ధర్మం
.....
హిందూ నాగరికత - అంటరానివాళ్లు ... హిందువుల ఇళ్లు
- డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
ఆంగ్ల మూలం: Dr.Baba Saheb Ambedkar's Writings and Speeches, Vol. V, Ps.127-191, 272-286, Govt. of Maharashtra, Mumbai, 1989
తెలుగు అనువాదం: సుందర వర్ధన్, జిలుకర శ్రీనివాస్.
76 పేజీలు, వెల: రూ.25
..................
Friday, November 28, 2008
'ఆధునిక' భారతంలో అంటరానితనం ... డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ... తెలుగు అనువాదం: కాత్యాయని
భారతదేశంలోని గ్రామీణ వ్యవస్ణను ఆదర్శవంతమైన సామాజిక నిర్మాణానికి ఒక నమూనాగా భావించేవాళ్లు ఎందరో వున్నారు.
ఐతే, ఈ ఆదర్శీకరణ కేవలం హిందువుల అభూతకల్పనే తప్ప, ఎంతమాత్రమూ వాస్తవం కాదని డాక్టర్ అంబేడ్కర్ ఈ రచనలో ప్రతిపాదించారు.
తన వాదనకు రుజువులుగా ఇందులో ఆయన లెక్కలేనన్ని సాక్ష్యాలను మనముందుంచారు.
ప్రాచీన హిందూమత గ్రంథాలూ, ధర్మ శాస్త్రాలూ నిర్దేశించిన వర్య వ్యవస్థ ఆధునిక భారతదేశంలోని గ్రామాల్లో నేటికీ యధాతథంగా కొనసాగుతూనే వుంది.
ఈ దేశంలోని ప్రతివ్యక్తికీ పుట్టుకతోనే ఏదో ఒక కులం నిర్ణయమైపోయి వుంటుంది.
కులాల స్థాయినిబట్టి వ్యక్తుల ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక జీవితం నిర్దేశితమవుతుంది.
ఈ కులాల సరిహద్దులను దాటటానికి ప్రయత్నించినప్పుడల్లా దారుణమైన హింసాకాండ అమలవుతున్నది - ఈ సత్యాలన్నీ సోదాహరణంగా ఈ రచనలో మన కళ్లకు కడతాయి.
భారతదేశంలోని పల్లెసీమలు అగ్రవర్ణాలకు స్వర్గధామాలు కావొచ్చునేమో గానీ దళితులకు మాత్రం అవి నరకకూపాలని డాక్టర్ అంబేడ్కర్ ఈ రచనలో స్పష్టంగా ప్రకటించారు.
.........
అంబేడ్కర్ ఆలోచన
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు, నివేదికలు భారత సమాజ గతిలోనే కొత్త శకానికి నాందిపలికాయి. కులాల దొంతరలో అట్టడుగున పడిపోయి, తరతరాలుగా అవమానాలకు, అన్యాయాలకు, అకృత్యాలకు, అమానుషాలకు బలైపోయిన అంటరాని కులాల విముక్తి ప్రదాతగా అంబేడ్కర్ అందరికీ తెలుసు.
అయితే ఆయన భావాలు, ఆలోచనల లోతులు చాలా తక్కువ మందికి తెలుసు. సమకాలీన సమాజ ఆర్థిక, రాజకీయ, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన అశంబిలన్నింటినీ ఆయన తడిమారు. కేవలం పైపైన మాత్రమే తాకి వదలలేదు. సమగ్రమైన పరిశోధన స్వభావం ఆయన సొంతం.
...
అంబేడ్కర్ రచనలను ఎన్నో రకాల విషయాల కింద విభజించవచ్చు. ఆవిధంగా చిన్న చిన్న పుస్తకాలుగా తీసుకురాగలిగితే పాఠకులకు వాటి అధ్యయనం పట్ల ఆసక్తి పెరుగుతుందని, విద్యావంతులకు, సామాజిక కార్యకర్తలకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందని భావిస్తున్నాం.
ఇటువంటి ప్రయత్యాలు గతంలో కూడా కొన్ని జరిగాయి. మరికొన్ని సంస్తలు, సొసైటీలు, ట్రస్ట్‌లు ఇప్పటికే అప్పుడప్పుడు ఇటువంటి పుస్తకాలు ప్రచురిస్తున్నాయి.
అయితే నిరంతరంగా, ఒక కార్యక్రమంగా ఈ ప్రయత్నాలు తెలుగు పాఠకుల ముందుకు తేవాలని హైదరాబాద్ బుక్ ట్రస్ట్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సంస్థలు సంయుక్తంగా '' అంబేడ్కర్ ఆలోచన'' సిరీస్ పేరుతో ఈ పుస్తకాల ప్రచురణ కొనసాగించాలని భావిస్తున్నాయి.
ఇందులో అంబేడ్కర్ స్వయంగా చేసిన రచనలతో పాటు, అంబేడ్కర్ ఆలోచనను ప్రతిబింబించే గత, వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టే ఇతరుల రచనలను కూడా భాగం చేయాలని ఆశిస్తున్నాం.
ఈ ప్రయత్నంలో తెలుగు పాఠకుల, సామాజిక ఉద్యమ కార్యకర్తల దళితేతర విద్యావంతుల, ప్రజాస్వామికవాదుల సహాకారాన్ని ఆశిస్తున్నాం.
మా ఈ కార్యకర్మంలో సూచనలు, సలహాలు, ఇతర రకాలైన సహాయాలు అందించి భాగస్వాములు కావాలని హృదయపూర్వకంగా కోరుతున్నాం.
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (ఫోన్:+040-2352 1849)
- సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (ఫోన్:+040-2344 9192)
'ఆధునిక' భారతంలో అంటరానితనం
- డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
ఆంగ్ల మూలం: Untouchables or The Children of India's Ghetto, Vol.5,Pg.19-73, Dr. Babasaheb Ambedkar, Writings and Speeches, Govt. of Maharashtra, Bombay, 1989.
తెలుగు అనువాదం: కాత్యాయని
72 పేజీలు, వెల: రూ.25
.....
Wednesday, November 26, 2008
దాస్య విముక్తి కోసం మతమార్పిడి ... డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్... తెలుగు అనువాదం: ప్రభాకర్ మందార
అంబేడ్కర్ ఆలోచన
''నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చచ్చిపోను''
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 1935లో చేసిన ప్రకటన యిది.
అన్నట్టుగానే ఆయన 1956లో హిందూమతాన్ని విసర్జించి ఐదు లక్షల మంది అనుచరులతో కలసి మరీ బౌద్ధమతంలో చేరారు.
ఆ మధ్య కాలంలో ఆయన దళితుల దాస్య విముక్తి గురించీ, మతమార్పిడి ఆవశ్యకత గురించీ వివిధ సభల్లో చేసిన ఉపన్యాసాల సంకలనమే ఈ పుస్తకం.
చతుర్ వర్ణ వ్యవస్థ పునాదులు ఏమాత్రం చెక్కు చెదరకుండా అంటరానివాళ్లకు ... ''హరి జనులు'' ... అనే ఓ కొత్త పేరును అంటగట్టి దళిత సమస్యకు పైపై పరిష్కారం చూపబోయారు గాంధీజీ.
అయితే ఆ పేరు మార్పు వల్ల దళితులకు ఒరిగేదేమీ లేదనీ, తమను అంటరానివాళ్లుగా, అధములుగా పరిగణించే హిందూమతాన్ని వదిలించుకుని బయటకు వచ్చినప్పుడే దళితులకు నిజమైన విముక్తి లభిస్తుంది అంటారు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్.
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు హిందూ మతంలో స్థానం లేదు.
మిమ్మల్ని సాటి మనుషులుగా చూడని మతంలో,
మీకు చదువుకునే స్వేచ్ఛ లేకుండా చేసిన మతంలో,
చివరికి సమాజంలో గుక్కెడు మంచినీళ్లు కూడా పుట్టుకుండా చేసిన మతంలో,
మిమ్మల్ని జంతులవుకంటే హీనంగా చూసే ఈ హిందూ మతంలో
ఇంకా మీరెందుకు పడివుండాలి???
అని ప్రశ్నిస్తారు అంబేడ్కర్.
ఇవాళ ప్రపంచ శాంతికి దోహదం చేయగల మతం ఏదైనా వుందీ అంటే
అది బౌద్ధ మతం మాత్రమే అంటారాయన.
డాక్టర్ అంబేడ్కర్ మరాఠీలో చేసిన ఈ ప్రసంగాలను వసంతమూన్ తన సహచరులతో కలిసి అంగ్లంలోకి అనువదించారు. ఇవి అంబేడ్కర్ రచనల మూడో సంపుటంలో 17వ వాల్యూంలో పొందుపరచబడ్డాయి. వాటి వివరాలు:
1.మీరు విముక్తిపొందాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మతం మార్చుకోక తప్పదు.
(17 మే 1936 నాడు కళ్యాణ్‌లో చేసిన ప్రసంగం)
2. మన దాస్య విముక్తికి మార్గమేది?
(13 మే 1936 నాడు దాదర్‌లో చేసిన ప్రసంగం)
3. బానిస బంధాల నుంచి బయట పడేందుకే బౌద్ధమత స్వీకారం
(15 అక్టోబర్ 1956 నాడు నాగపూర్‌లో చేసిన ప్రసంగం)
4. అనుబంధం: బుద్ధ ధమ్మమే ప్రపంచాన్ని రక్షిస్తుంది (డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధ మత స్వీకార విశేషాలు)
దాస్య విముక్తి కోసం మతమార్పిడి
- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
ఆంగ్ల మూలం : Coversion as Emancipation, Critical Quest, New Delhi 2004; Dr.B.R.Ambedkar's Speeches in Marathi, reported in JANATA and Translated by Vasant moon and colleagues, Dr.B.R.Ambedkar Writings and Speeches, Vol 17 Part 3 Govt. of Maharashtra, 2003 @ Sr. Bos 28,29 and 158.
తెలుగు అనువాదం: ప్రభాకర్ మందార
60 పేజీలు, వెల: రూ.15
...........................
...
Tuesday, November 25, 2008
కుల నిర్మూలన ... డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ... తెలుగు అనువాదం: బోయి భీమన్న
హిందూ సమాజం నుంచి కుల వ్యవస్థను నిర్మూలించడానకి తనకు చివరగా మరొక అవకాశం ఇవ్వవలసిందని గాంధీ ప్రాధేయపడడటమే గాక, కొద్ది సంవత్సరాలలోనే కుల వ్యవస్థను, అస్పృశ్యతను అంతం చెయ్యడానికి తాను ఇతర హిందూ నాయకులతో కలిసి తీవ్రంగా ప్రయత్నించగలనని ''పూనా ఒడంబడిక'' సందర్భంగా డాక్టర్ అంబేడ్కర్‌కు హామీ యిచ్చారు.
అది 1932 సెప్టెంబర్‌లో జరిగింది.
ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు 1936లో డాక్టర్ అంబేడ్కర్ ఈ కుల నిర్మూలన వ్యాసాన్ని గ్రంథ రూపంలో వెలువరించారు.
అంటే ఏమిటి?
హిందూ సమాజాన్ని మార్చడానికి ఆ నాలుగు సంవత్సరాలలో ఎట్టి ప్రయత్నమూ జరగలేదన్నమాటే కదా!
అతి ప్రధానమైన ఒక ఒడంబడిక సందర్భంగా చేయబడిన వాగ్దానాలను కూడా హిందూ అగ్రకుల నాయకులు పట్టించుకోకపోతే ఇక అట్టి మతంలో వుండి ఏం ప్రయోజనం?
అందుకే తన ఈ వ్యాసంలో అంబేడ్కర్ మతం మార్చే ప్రస్తావనను తేవడం తప్పనిసరి అయింది.
''అత్త పెట్టదు అడుక్కు తిననివ్వదు'' అన్న సామెతలాగా
హిందూ నాయకులు కులాన్ని వదలరు.
అంటరానితనాన్ని నిర్మూలించరు.
దళితుల్ని మతం మారనివ్వరు.
ఇంత అన్యాయం మరెక్కడైనా వుంటుందా?
పోనీ నాలుగు సంవత్సరాలలో మార్పు సాధ్యం కాదని అనవచ్చు. మరి పూనా ఒప్పందం జరిగి ఇప్పటికి 76 సంవత్సరాలైంది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 61 సంవత్సరాలు దాటింది.
అయినా ఏమంత మార్పు జరిగింది?
అందరూ ముఖ్యంగా హిందూ అగ్ర నాయకులు తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది.
హిందూ సమాజానికి ఆధిపత్యం వహిస్తున్న బ్రాహ్మణులు తమ వర్గ ప్రయోజనాల కొసమే తప్ప మొత్తం ప్రజల యోగక్షేమాలను గురించి ఆలోచించలేడంలేదు అన్నారు అంబేడ్కర్.
ఆ దురదృష్టం ఇంకా కొనసాగుతూనే వుంది.
- బోయి భీమన్న (ఐదవ ముద్రణకు రాసిన ముందుమాట నుంచి)
కుల నిర్మూలన
- డా.బి.ఆర్. అంబేడ్కర్
తెలుగు అనువాదం: బోయి భీమన్న
మొదటి ముద్రణ: 1969
మలిముద్రణలు: 1969, 1981, 1990, 1992, 1994, 1998, 2001, 2006
103 పేజీలు, వెల: రూ.30
....
Sunday, November 23, 2008
దళితులు - రాజ్యం ... బొజ్జా తారకం
ఒకే చోట నివసిస్తూ,
ఒకే భాష మాట్లాడుతూ,
ఒకే దేవుణ్ణి పూజిస్తూ,
ఒకే జీవన విధానాన్ని పాటిస్తూ వున్న ప్రజలలో...
కొందరిని ముట్టుకోవడానికి కూడా వీలులేని మనుషుల్ని చేసిన దేశం భారతదేశం తప్ప మరొకటి ఎక్కడా కనపడదు.
కలిసి కూర్చుని మాట్లాడుకోకుండా,
కలిసి ప్రయాణం చేయటానికి వీలు లేకుండా,
కలిసి మంచినీళ్లు త్రాగడానికి గానీ
కలిసి భోజనం చేయడానికి గానీ వీలులేకుండా
పెళ్లి చేసుకుని జీవనాన్ని సాగించటానికి వీలులేకుండా
కోట్లాది ప్రజలను ఊరవతలకు తరిమేసి అంటరానివారిగానే కాక
చూడరానివారుగా కూడా చేసిన దేశం
భారతదేశం తప్ప మరొకటి ఎక్కడా కనపడదు.
దళితులు అని ప్రస్తుతం ఎవరినయితే అంటున్నామో
వారిని దళితులుగానే ఉంచటం కోసం,
కేవలం ఉంచటమేకాదు అదిమిపట్టి ఉంచటం కోసం,
తొక్కిపెట్టి ఉంచటంకోసం
ప్రస్తుత రాజ్యం వ్యవహరిస్తున్న తీరును విశ్లేషించిన పుస్తకమిది.
ఈ పుస్తక రచయిత బొజ్జా తారకం వృత్తిరీత్యా న్యాయవాది. కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే ఆయన
హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ సహ వ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు.
అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే బొజ్జా తారకం ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని
వెచ్చిస్తున్నారు.
మానవ హక్కుల, పౌర హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది.
బొజ్జా తారకం రచనల్లో ... పోలీసులు అరెస్టు చేస్తే (1981), ... కులం-వర్గం (1996), ... నది పుట్టిన గొంతుక (1983) ప్రముఖమైనవి.
దళితులు - రాజ్యం
- బొజ్జా తారకం
78 పేజీలు, వెల: రూ.25
...
Friday, November 21, 2008
మన తత్వం ... దళిత బహుజన తాత్వికత ... కంచ ఐలయ్య
నేను హిందువు నెట్లయిత? (వై ఐ యామ్ నాట్ ఎ హిందూ?) అనే పుస్తకంద్వారా భారత దేశంలోని అసమానతలకు అణచివేతకు, దోపిడీకి... ముఖ్యంగా కులం, వర్గం ప్రాతిపదికగా జరిగే దోపిడీకి పరిష్కారం దళితీకరణలోనే వుందని ప్రతిపాదించి దేశవ్యాప్త చర్చకు తెరలేపారు కంచ ఐలయ్య.
ఆ చర్చకు కొసాగింపుగా అసలు దళితీకరణ అంటే ఏమిటి, దానిని సాధించడానికి ఏం చేయాలి అనే మౌలిక ప్రశ్నలకు సమాధానంగా దళిత బహుజన తాత్వికతను వివరిస్తూ ఆయనే రాసిన పలు వ్యాసాల సంకలనమే ఈ మనతత్వం.
మన సమాజంలో రెండు తత్వాలున్నాయనీ ఒకటి దళిత బహుజన తత్వం కాగా రెండవది బ్రాహ్మణీయ తత్వ మనీ మొదటిది అణచివేతకూ, దోపిడీకికీ, పతనానికీ లోనైన మెజారిటీ ప్రజల తత్వమైతే ...రెండవది ఆదిపత్యం, అణచివేత, దోపిడీ, రాపిడీలను కొనాగిస్తూ పబ్బం గడుపుకునే మైనారిటీ ప్రజల తత్వమని అంటారాయన.
ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో 28 వారాలపాటు వెలువడిన ఈ వ్యాసాలు అచ్చవుతున్న రోజుల్లోనే పెద్ద దుమారాన్ని లేపాయి.
ఈ దేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాక దళిత బహుజన తాత్వికతను రాసిన అగ్ర కుల ఉపాధ్యాయులు ఎవరూ లేరు. విద్యను ఉత్పత్తి పనితో, ఉత్పత్తి కుల జీవన విధానంతో ముడేసి నేర్పాలని అగ్రకుల మేధావులెవరూ భావించలేదు. మన విద్య అంతా బ్రాహ్మణవాద సాహిత్యంతో నిండుకొని వుంది. అది ఉత్పత్తి కులాల వారిని చాలా అవమానాలకు గురిచేసింది. బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్ వంటి తత్వవేత్తలు రాసిన రచనలకు నిన్నమొన్నటి వరకు విశ్వవిద్యాలయాల్లో స్థానం వుండేదికాదు. ఇప్పుడిప్పుడే వారి తాత్వికతకు కొంత చోటు లభిస్తోంది. వారి దారిలో నడుస్తూనే తను ఈ వ్యాసాలు రాసినట్టు ఆయన చెబుతారు.
ఇందులోని అధ్యాయాలు: 1. మనతత్వం: ఆధ్యాత్మిక భౌతికవాదం - భౌతిక ఆధ్యాత్మిక వాదం, 2. మన చరిత్ర తత్వం 3. మన ఆస్తి తత్వం 4. మన రాజ్య తత్వం 5. మన చట్ట తత్వం.
మన పాట
చేప పిల్లల కోడి పిల్లల
గొర్రె పిల్లల జింక పిల్లల
కాయగడ్డల ఆకుకూరల
పండు ఫలముల పాలుపెరుగుల
తిండి తత్వం నేర్పినోళ్లం !
రాళ్లు రాకి నిప్పు జేసి
చర్మ మొలిచి తోలు జేసి
మట్టి పిసికి కుండ జేసి
నూలు వడికి బట్ట నేసి
ప్రాణ రక్షణ జేసినోళ్లం !
ఆవులకు ఈన నేర్పి
కోడెలకు దున్న నేర్పి
బంజర్లకు పంట నేర్పి
తాడిచెట్లకు పార నేర్పి
వ్యవసాయం చేసినోళ్లం !
ఆటపాటల ఆనందం
పూలతోటల అందచందం
వర్రె వాగుల నీటి బంధం
చెట్టు చేమల స్నేహ బంధం
ఉగ్గుపాలతో నేర్చినోళ్లం !
అండ పిండాల అనుబంధం
పశుపక్షుల జీవబంధం
తల్లిపిల్లల ప్రేమబంధం
సాలు సాలుకు సంబంధం
తత్వరీతులు తెలిసినోళ్లం !!
మన తత్వం
(దళిత బహుజన తాత్వికత)
- కంచ ఐలయ్య
64 పేజీలు, వెల: రూ.15
Tuesday, November 18, 2008
భారత ఆర్థికాభివృద్ధి - సాంఘిక అవకాశాలు ...జా ద్రెజ్, అమర్త్య సేన్ ... తెలుగు అనువాదం: మానేపల్లి
అమర్త్య కుమార్ సేన్ శాంతినికేతన్ (కలకత్తాలో, 1933 లో) జన్మించారు. 1959 లో కేంబ్రిడ్జిలో ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా తీసుకున్నారు. ఆక్స్‌ర్డ్‌లో కొన్నాళ్లు ఉన్నత స్థాయి
ప్రొఫెసర్ పదవి చేపట్టారు. 1960 లలో ఐక్యరాజ్య సమితి - అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలో పరిశోధనలు చేశారు. ఆయన రాసిన పావర్టీ అండ్ ఫామిన్ (1981) అనే గ్రంథం
చాలా ప్రసిద్ధి చెందింది. ఆర్థిక శాస్త్రంలో అమర్త్య సేన్‌కు నోబెల్ బహుమతి (1997) వచ్చింది.
జా ద్రెజ్ ఫ్రెంచ్ మేధావి. అభివృద్ధి చెందుతున్న తృతీయ ప్రపంచ దేశాల ఆర్థిక సమస్యలపై విస్తృత పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సెంటర్ ఫర్
డెవలప్‌మెంట్ ఎకనామిక్స్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమర్త్య సేన్‌తో కలిసి ఆర్థిక శాస్త్రంపై అనేక గ్రంధాలు రాశారు.
వారిరువురు కలిసి రాసిన ప్రస్తుత గ్రంథమే ఈ భారత ఆర్థికాభివృద్ధి, సాంఘిక అవకాశాలు.
భారత ఆర్థిక అభివృద్ధిని తృతీయ ప్రపంచ దేశాల ఆర్థిక అభివృద్ధితో సరిపోల్చి సమకాలిక అవసరాలకు అనుగుణమైన విశ్లేషణ చేస్తుందిది. మన దేశంలో విద్య, ఆరోగ్యం స్త్రీ పురుష వివక్ష, శిశు మరణాలు - మొదలైన వివరాల్ని చర్చించి సామాన్య ప్రజలకు తగిన సాంఘిక అవకాశాలు లేకపోవడాన్ని ఎత్తి చూపుతుంది.
ఈ గ్రంథంపై విస్తృతంగా చర్చ జరగాలని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ భావిస్తున్నది.
ఇందులోని అధ్యాయాలు:
1. పరిచయం
... స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ భారతదేశం, ...ఇతరుల నుంచి నేర్చుకోవడం, ...సాంఘిక అవకాశం పబ్లిక్ పాలసీ.
2. ఆర్థిక అభివృద్ధి - సాంఘిక అవకాశం
... అభివృద్ధి, స్వేచ్ఛ, అవకాశాలు, ...విద్య, ఆరోగ్యం, ...ప్రభుత్వం, రాజ్యం, మార్కెట్, ...మార్కెట్లు, ప్రభుత్వాలు పరస్పర సంబంధాలు, ...మార్కెట్ మినహాయింపు, మార్కెట్
పూరకం, ...విశాల దృష్టి.
3. భారతదేశం - తులనాత్మక పరిశీలన
... భారతదేశమూ ప్రపంచమూ, ...ఇతర దేశాల నుంచి పాఠాలు, ...మానవ పెట్టుబడి, మౌలిక విలువలు, ...అంతర్గత వైరుధ్యాలు, ...వివిధ రాష్ట్రాల పరిస్థితుల అధ్యయనం.
4. భారత దేశం - చైనా
... చైనా దృష్టి కోణాలు, ...జీవన మరణ పరిస్థితులు, ...మౌలిక విద్య, ...సంస్కరణ పూర్వకాలపు విజయాలు, ...సంస్కరణ అనంతర అభివృద్ధి, ...చైనా నుంచి నేర్చుకోవలసిన
నిజమైన గుణపాఠాలు.
5. సాంఘిక అసమానత
... ప్రజాసముదాయం దాని పాత్ర, ...సాంఘిక అసమానతలు ఆర్థిక సంస్కరణలు, ...స్థానిక పాలన, సంఘ సంస్కరణ.
6. రాజకీయ సమస్యగా విద్య
... విద్య సాంఘిక మార్పు, ...పాఠశాల విద్యా పరిస్థితి, ...ప్రాధాన్యాలూ సవాళ్లూ, ...స్త్రీ విద్య, ...విద్య రాజకీయ కార్యాచరణ.
7. స్త్రీ పురుష అసమానత, స్త్రీల పాత్ర
... స్త్రీల అణచివేత, ...స్త్రీ పురుష నిష్పత్తి, ...స్త్రీ పురుష వివక్ష - కులం, ...గర్భధారణ - స్త్రీ విముక్తి, ...వైధవ్యం - స్త్రీ పురుష సంబంధాలు, ... స్త్రీ పురుష సమానత - సాంఘిక
ప్రగతి.
8.అర్థిక సంస్కరణల తరవాత
... ప్రజలే మన లక్ష్యాలూ సాధనాలూ, ...మౌలిక అవసరాలూ సంస్కరణలూ, ...ప్రభుత్వం - ప్రజలు, ... స్త్రీలు - సాంఘిక మార్పు, తులనాత్మక దృక్కోణం...
భారత ఆర్థికాభివృద్ధి - సాంఘిక అవకాశాలు
- జా ద్రెజ్, అమర్త్య సేన్
ఆంగ్ల మూలం: INDIA : Economic Development and Social Opportunity, Jean Drese and Amartya Sen, Oxford University Press, Delhi, 1995,
తెలుగు అనువాదం: మానేపల్లి
110 పేజీలు, వెల రూ.30
Monday, November 17, 2008
చరిత్రలో ఏం జరిగింది? ... గార్డన్ చైల్డ్ .. తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య
మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్ సామ్రాజ్య పతనం వరకు తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమ జీవి.
రాళ్లతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మంచిన హృదయమున్న మేధావి.
అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థానాన్ని, మనిషి శ్రమ నైపుణ్యం పనిముట్ల భావజాలాన్ని లీలా సృష్టించాయో, చరిత్రగతిని ఎట్లా మార్చాయో వివరించే
ఈ పుస్తకంతో రచయిత గార్డన్ చైల్డ్ వేసిన బాట కొత్తది మాత్రమే కాదు... శాశ్వతమైనది కూడా!
ప్రొఫెసర్ గార్డన్ చైల్డ్ (1892-1957) ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. ప్రాక్ పురాతత్వ చరిత్ర శాస్త్రజ్ఞుడైన ఈయన అనేక ప్రముఖ పుస్తకాలను రచించారు. వాటిలో చరిత్రలో
ఏం జరిగింది? ఉదయించిన ఐరోపా నాగరికత, అతిప్రాచీన తూర్పు నాగరికత, సామాజిక పరిణామం ప్రముఖమైనవి.
ఇందులో చర్చించిన అంశాలు:
1. పురాతత్వ శాస్త్రం చరిత్ర
2. పాత రాతి యుగం
3. కొత్త రాతి యుగం
4. రాగి యుగం
5. మెసపొటేనియాలో నగర విప్లవం
6. ఈజిప్టు, భారతదేశాల్లో తొలి కంచుయుగం నాగరికత
7. తొలి ఇనుపయుగం
8. ప్రాచీన నాగరికత ఉన్నత దశ
9. ప్రాచీన ప్రపంచం యొక్క పతనం
ఈ పుస్తక అనువాదకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు, సృజనాత్మక రచయిత. వీరు అనువాదం చేసిన ప్రపంచ చరిత్ర వంటి పుస్తకాలను లోగడ లోగడ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. వీరు రాసిన కథాశిల్పం అనే పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. వీరు మదనపల్లిలోని బి.టి.కళాశాలలో లెక్చరర్‌గా
పనిచేశారు.
చరిత్రలో ఏం జరిగింది?
గార్డన్ చైల్డ్
ఆంగ్లమూలం: వాట్ హాపెన్డ్ ఇన్ హిస్టరీ, పెంగ్విన్.
తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య
188 పేజీలు, వెల: రూ.40
Saturday, November 15, 2008
తరతరాల భారత చరిత్ర ... రొమిలా థాపర్ ...తెలుగు అనువాదం : సహవాసి
భారత చారిత్రక రచనకి సంబంధించి భావంలో, విషయ వివరణలో, వ్యాఖ్యానంలో వ్యాఖ్యానానికి అనుకూలంగా దిద్దుకొనే వాస్తవాలలో చాలా మార్పు వచ్చింది.
నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి.
డి.డి.కొశాంబి, సుశోభన్ సర్కార్, ఇర్ఫాన్ హబీబ్, రొమిలా థాపర్, బిపిన్ చంద్ర వంటి కొత్త చరిత్రకారులు రంగంలోకి వచ్చారు.చారిత్రక రచనా ప్రక్రియలో కొత్త విలువలు ప్రవేశపెట్టారు.
... ... ...
గతం కడుపులో దాగి వుంది ఓ నిధి.
ఏమిటా నిధి?
దాన్ని కనుక్కోడానికి మనకున్న ఆనవాళ్లేమిటి?
ఆధారాలేమిటి?
నిధి అంటే మనం పుట్టకపూర్వం వందల, వేళ ఏళ్ల కిందట ఈ ప్రపంచంలో, అందులో భాగమైన ఈ దేశంలో ఏం జరిగిందో ఎరుకపర్చే చరిత్ర.
లిపి తెలియని అతి పురాతనకాలం మొదలు లిఖిత, ముద్రిత పత్రాల, పుస్తకాల పునాదుల మీద లేచిన సమీప గతం వరకు సాగిన భారత చరిత్ర గతిని, మతం కళలు, సాహిత్యం భావజాలం, వ్యవస్థలు, ఉద్యమాలు, ఇత్యాదుల్లో దర్శనమిచ్చే భారతీయ సంస్కృతి స్వరూపాన్ని అత్యంత ప్రతిభావంతంగా, రసవత్తరంగా, విజ్ఞానదాయకంగా వర్ణించిన ఘనత రొమిలా థాపర్‌ది.
రొమిలా థాపర్ నవతరం చరిత్రకారుల్లో ప్రముఖులు.
ఆమె 1931లో ప్రసిద్ధ పంజాబీ కుటుంబంలో పుట్టారు. 1958లో లండన్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు. కొద్దికాలం అక్కడే దక్షిణాసియా ప్రాచీన చరిత్ర అధ్యాపకురాలుగా పనిచేశారు. డిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర ప్రొఫెసర్‌గా కృషిచేశారు.
తరతరాల భారత చరిత్ర
- రొమిలా థాపర్
తెలుగు అనువాదం : సహవాసి
ప్రథమ ముద్రణ: 1983
పుర్ముద్రణలు: 1984, 1993, 1998, 2000, 2005, 2006
179 పేజీలు, వెల: రూ.70/-
Friday, November 14, 2008
భగవద్గీత చారిత్రక పరిణామం ... డి.డి.కోశాంబి
భగవద్గీతలో పరస్పరం విభిన్నమైన దృక్పథాలు కలగలిసి వున్నాయి.
అందువల్ల గీతపై ఇంతవరకు వచ్చిన వ్యాఖ్యానాలు, భాష్యాలు కాకుండా, ఈ కాలానికి తగిన కొత్త అర్థం చెప్పడం ఏమంత కష్టంకాదు.
కానీ, దాని ప్రయోజనం లేకపోగా, ప్రమాదకరం కూడా ...
దీన్ని ఉపయోగించుకుని అసలు సమస్యల నుండి జనం దృష్టి మళ్లించడానికి అవకాశం వుంది.
దీనివల్ల భక్తికి విపరీతమైన గౌరవం ఏర్పడుతుంది.
ఫాసిజాన్ని, వ్యక్తి పూజను సమర్థించడానికిది తోడ్పడుతుంది... అంటారు సుప్రసిద్ధ చారిత్రకులు డి.డి. కోశాంబి.
డి.డి.కోశాంబి భారతదేశ చరిత్ర రచనలో కొత్త పుంతలు తొక్కిన మహామేధావి.
గణిత శాస్త్రంలో, జన్యు శాస్త్రంలో, ఇతర రంగాలలో గొప్ప గొప్ప విషయాలు వెలికితీసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
అన్నిటికన్న మిన్నగా ప్రతిపని, ప్రతి ఆలోచనా ప్రజల కోసం అనే ప్రగతి శీల మేధావి.
ఈ వ్యాసంలో కోశాంబి భారతీయ తత్వానికి మూల గ్రంథంగా పలువురు అభివర్ణించే గీత కున్న చారిత్రక పరిమితులను నిర్ద్వంద్వంగా బయటపెట్టారు.
గీత ను, గీత రచనా క్రమాన్ని అద్భుతమైన వర్గవిశ్లేషణకు గురిచేశారు.
విలువైన గుణపాఠాలు అందించారు.
భగవద్గీత చారిత్రక పరిణామం
డి.డి.కోశాంబి
ఇంక్వైరీ పత్రిక, 1959 సంచిక నుండి స్వీకరించబడిన వ్యాసం.
ప్రథమ ముద్రణ: 1985
పునర్ముద్రణలు: 1986, 1989, 1995, 1998, 2001
20 పేజీలు, వెల: రూ.5
Thursday, November 13, 2008
ప్రాచీన భారతదేశ చరిత్ర ... డి.డి.కోశాంబి పరిచయం ... కె. బాలగోపాల్
ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి (ఆదిమకాలం నుండి భూస్వామ్య దశ వరకు) దామోదర్ ధర్మానంద్ కొశాంబి (1907-1966) చూపించిన చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ పుస్తకం.
మన చరిత్రకారులలో ఆధునిక దృక్పథం గల వారందరూ కోశాంబిని ఆద్యునిగా భావిస్తారు. చరిత్ర పరిశోధనా పద్ధతిలోనూ, సిద్ధాంత దృక్పథంలోనూ శాస్త్రీయ ప్రమాణాలను నెలకొల్పిన వ్యక్తిగానే గాక, వలసత్వం, శృతిమించిన దేశభక్తి, సంప్రదాయకత, అగ్రవర్ణ ఆధిక్యత, విశృంఖలమైన ఊహాతత్పరత మొదలైన అనేక అవలక్షణాల నుండి మన దేశ చరిత్రను రక్షించిన వ్యక్తిగా ఆయనను గౌరవిస్తారు.
ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి, ఆ ఉత్పత్తిపై ఆదారపడిన స్థిర వ్యవసాయ గ్రామాల ఆవిర్భావం, దాని నుండి భూస్వామ్య వ్యవస్థకు పునాది ఏర్పడడం అనే ఆర్థిక క్రమం మన ప్రాచీన చరిత్రకు మూలం అని కోశాంబి భావించాడు. ఆ చోదక క్రమాన్ని మన దేశ నైసర్గిక స్వభావానికి జోడించి సామాజిక, సాంస్కృతికరంగాలను విశ్లేషించాడు. పురావస్తు ఆధారాలను పట్టించుకోకుండా కేవలం ప్రాచీన సాహిత్యాన్ని ఆధారం చేసుకుని ఊహాగానాలు చేసే చరిత్రకారులను కోశాంబి విమర్శిస్తాడు.
శాస్త్రీయంగా ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయదల్చుకున్న ఎవ్వరైనా కోశాంబి ప్రతిపాదించిన భౌతిక చోదక క్రమాన్ని ప్రాతిపదికగా తీసుకోక తప్పదు.
ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1. పద్ధతి - సిద్ధాంతం
2. ఆహార సేకరణ - ఆహార ఉత్పత్తి
3. సింధూ నాగరికత - ఆర్యులు
4. వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ
5. మహాభారతం - బుద్ధుడు
6. ఉత్తరాపథం - దక్షిణాపథం
7. వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు
8. సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం
ముందుమాటలో రచయిత రాసిన చివరిమాట:
... నా మాటకొస్తే ఒక్క విషయం మాత్రం చెప్పాలి. కోశాంబి భగవద్గీత మీద రాసిన వ్యాసాన్ని 1976లో మొట్టమొదటిసారి చదివి నేను మార్క్సిస్టునయ్యాను. ఆ రుణం ఈ రూపంలో తీర్చుకొవాలన్న కోరిక కలిగి మూడేళ్లయింది. ఇప్పటికి తీరింది.
ప్రాచీన భారతదేశ చరిత్ర
డి.డి.కోశాంబి పరిచయం
- కె. బాలగోపాల్
ప్రథమ ముద్రణ: 1986
పునర్ముద్రణలు: 1992, 1995, 2000, 2007
150 పేజీలు, వెల: రూ.32
Wednesday, November 12, 2008
విజ్ఞాన శాస్త్రం ఎలా ఎదిగింది? - ఎగొన్ లార్సెన్, తెలుగు అనువాదం: సనగరం నాగభూషణం
ఆది నుంచి నేటి దాకా మానవుడు సాధించిన సాంకేతిక ప్రగతిని ఒకే ఒక సంపుటంలో ఆవిష్కరించిన అద్భుత కథనమే ఈ పుస్తకం..
రచయిత యావత్ శాస్త్ర సాంకేతిక ప్రగతిని మూడు ప్రధాన విభాగాలకింద విభజించారు. అవి... శక్తి, రవాణా, మ్యూనికేషన్లు.
శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను పరిశీలించి, అవసరమైన చోట్ల చారిత్రక, సామాజిక నేపథ్యాన్ని సంక్షిప్తంగా వివరించారు.
నూతన కల్పనలలోనూ ఇంజనీరింగ్‌లోనూ మూల పురుషులైన ముఖ్యల జీవిత కథల్ని కూడా ఈ పుస్తకంలో స్పృశించారు.
ఎగొన్ లార్సెన్ సులభశైలిలో ఎన్నో ప్రముఖ విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు రాశారు.
ఈ పుస్తక అనువాదకులైన సనగరం నాగభూషణం మదనపల్లెలోని బి.టి. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు.
విజ్ఞాన శాస్త్రం ఎలా ఎదిగింది?
- ఎగొన్ లార్సెన్,
ఆంగ్ల మూలం: The History of Invention, Egon Larsen, Roy Publishers, New York, 1961
తెలుగు అనువాదం: సనగరం నాగభూషణం
235 పేజీలు, వెల: రూ.45
Tuesday, November 11, 2008
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే సంక్షిప్త రచనలు ...
మహాత్మా జ్యోతిరావు ఫూలే దూరదృష్టికి, విశ్లేషణా సామర్థ్యానికీ ఈ సంక్షిప్త రచనలు ఉదాహరణలు.
హంటర్ కమిషన్‌కు ఫూలే సమర్పించిన విజ్ఞాపన...
పండిత రమాబాయి మతమార్పిడీ ...
బ్రహ్మసమాజికుల వంటి బ్రాహ్మణ ప్రధాన సంస్కరణల గురించి రాసిన సత్సార్ సంచికలు ...
మరాఠీ సంస్కర్తల్లో ప్రముఖుడైన జస్టిస్ గోవింద రణడే వ్యాఖ్యలపై హేతుబద్ధ విమర్శలతో కూడిన చేతావని ...
మరాఠీ రచయితల సంఘపు ఆహ్వానానికి జవాబు ...
బ్రాహ్మణీయ విలువలు ప్రధానంగా ఉండే విద్యా విధానం మీద విసుర్లతో కూడిన పాటల సారాంశం ...
బాల్యవివాహాలు, బలవంతపు వైధవ్యం పై బెహ్రామ్‌జీ మల్ బారీకి సమర్పించిన పత్రం ...
మొదలైనవి ఈ సంపుటిలో వున్నాయి.
స్త్రీలు, రైతులు ఎదుర్కొనే సమస్యలను తడిమి,
బ్రాహ్మణీయ కుటిల సంస్కరణల స్వరూపాన్ని చూపి జ్ఞాన వికాసానికీ,
బహుజనులకు విద్య ఎంత అవసరమో నొక్కి చెప్పిన తీరు ద్వారా జ్యోతిబాలోని భావ ప్రసార సామర్థ్యాన్ని,,
సంవాదం - సంభాషణల రూపంలో రచనలకుండే బలాన్ని ఇందులో మనం చూడవచ్చు.
జ్యోతిరావు ఫూలే సంక్షిప్త రచనలు
ఆంగ్ల మూలం: Selections, Vol.2, Collected Works of Mahatma Jotirao Phule, Govt. of Maharashtra, 1991.
Satsar from selected writings of Jotirao Phule, ed.. G.P. Deshpande, Left Word, New Delhi, 2002 and from Vol. 4, Collected works of Mahatma Jotirao Phule, Hindi, Govt. of Maharashtra, 2002.
తెలుగు అనువాదం : హారతి వాగీశన్
61 పేజీలు, వెల: రూ.20
Monday, November 10, 2008
మానవుడే చరిత్ర నిర్మాత ... గార్డన్ చైల్డ్, తెలుగు అనువాదం: హెచ్. ఆర్. కె.
ప్రాచీన మానవ చరిత్రను పరిచయం చేసే పుస్తకాల్లో గార్డెన్ చైల్డ్ రాసిన ఈ పుస్తకాన్ని క్లాసిక్‌గా పరిగణిస్తారు.
మూడు లక్షల నలభైవేల యేళ్ల నుంచీ, నిప్పును పుట్టించి, రాళ్లను పనిముట్లుగా, ఆయుధాలుగా మలచుకొని మానవులు క్రూరమృగాల నడుమ ఎలా నిలదొక్కుకున్నారో ఈ పుస్తకం తెలియజేస్తుంది.
ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, నగరాల నిర్మాణం, రాజ్యం పుట్టుక, సదూర ప్రాంతాలలో వర్తకం, నగర విప్లవం వంటి దశలూ, మలుపులూ ఎలా వచ్చాయో వివరిస్తుంది ఈ పుస్తకం.
ప్రొఫెసర్ గార్డన్ చైల్డ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. ప్రాక్ పురాతత్వ చరిత్ర శాస్త్రజ్ఞుడైన ఈయన అనేక ప్రముఖ పుస్తకాలను రచించారు.
వాటిలో చరిత్రలో ఏం జరిగింది?, ఉదయించిన ఐరోపా నాగరికత, అతిప్రాచీన తూర్పు నాగరికత, సామాజిక పరిణామం అనేవి ప్రముఖమైనవి.
ఈ పుస్తక అనువాదకులైన హెచ్చార్కె తెలుగు పాఠకులకు కవిగా, రచయితగా, పత్రికా విలేఖరిగా సుపరిచితులు. స్వయంగా అనేక రచనలు చేయడంతో పాటు ఎన్నో ఇతర పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.
మానవుడే చరిత్ర నిర్మాత
- గర్డన్ చైల్డ్
తెలుగు అనువాదం: హెచ్చార్కె
169 పేజీలు, వెల: రూ.50
Sunday, November 9, 2008
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ ... తెలంగాణా రాజకీయాలు ... దాగ్మార్ బెర్న్‌స్టార్ఫ్, హ్యూగ్ గ్రే ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణాలో రాజకీయాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ నేపథ్యంలో జరిగిన గ్రామీణ అధికార నిర్మాణం, శిష్టవర్గాల ఏర్పాటు, పరిణామాలు వంటి వివిధ అంశాలను సమగ్రంగా చర్చించిన వ్యాసాల సంకలనమిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసమాన అభివృద్ధిని ప్రశ్నించిన ప్రాంతీయ గుర్తింపు ఉద్యమాలను కూడా ఈ వ్యాసాలు విశ్లేషించాయి..
ఇందులో మొత్తం పన్నెండు వ్యాసాలున్నాయి. వాటి వివరాలు:
1. ఆంధ్రప్రదేశ్ రాజనిర్మాతలు
2. 1956-1973ల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకత్వం.
3. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పునర్నిర్మాణానికి ప్రయత్నం
4. తెలంగాణా భూస్వామ్య వర్గం
5. 1967 సార్వత్రిక ఎన్నికలు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైదరాబాద్ ప్రాంత అభ్యర్థులు
6. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికై డిమాండ్
7. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ వైఫల్యం
8. ప్రాంతం, జాతి, తెలంగాణా ఉద్యమ ద్వంద్వ అస్తిత్వం
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కమ్యూనిస్టుల కంచుకోటలో 1962 సాధారణ ఎన్నికలు
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో 1962 సార్వత్రిక ఎన్నికలు
11. భారతదేశంలో ఏడవ సార్వత్రిక ఎన్నికలు - క్షమించే ఓటర్లు
12. ప్రాంతం, రాజకీయ చైతన్యం
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ ...
తెలంగాణా రాజకీయాలు
- దాగ్మార్ బెర్న్‌స్టర్ఫ్, హ్యూగ్ గ్రే
తెలుగు అనువాదం: బి.జనార్ధనరావు, కె.సీతారామారావు, డా.యం యాదగిరాచార్యులు, డా. ఇ.రేవతి
అట్టమీది బొమ్మలు: ఏలె లక్ష్మణ్
222 పేజీలు, వెల: రూ.60
Saturday, November 8, 2008
సంగతి ... దళిత స్త్రీల వేదనల, ఆలోచనల సమాహారం ... రచన: బామ
పురుషాధిక్య సమాజంలో అణచివేతకు గురవుతున్న స్త్రీల, ప్రత్యేకించి దళిత మహిళల జీవితాలను, వారి కష్టాలూ కన్నీళ్లూ ఉల్లాసాలూ ఉద్వేగాలను, వారి అస్తిత్వ పోరాటాలను, మానసిక సంఘర్షణలను ప్రతిబింబించే ఈ పుస్తకం విలక్షణమైన భాషా నుడికారాలతో పాఠకులకు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుంది.
రచయిత్రి బామ మాటల్లోనే చెప్పాలంటే...
మనం ఇష్టపడ్డా, ఇష్టపడకపోయినా చాలా సంగతులు మన చెవుల్ని కొరుకుతుంటాయి. కొన్నింటిని ఆసక్తిగా, జాగ్రత్తగా వింటాం. మరికొన్నింటిని గాలికొదిలేస్తాం. పురుషాధిక్య సమాజంలో దళిత మహిళల సమస్యలకు సబంధించిన, అణచివేతకు గురవుతున్న వారి హక్కులకు సంబంధించిన సంగతులు మనందరికీ తెలిసినవే. కులదురహంకారం వల్ల అణచివేతకు గురవుతున్న చాలామంది ఆడవాళ్లు దారుణంగా తొక్కివేయబడుతున్న దళిత స్త్రీల సంగతులను మరింత అడుక్కు తొక్కేసి మరచిపోతుంటారు.
ఈ పుస్తకంలో దళిత స్త్రీల ఏడుపులూ కష్టాలే కాక వారి ఆనందాలు, హాస్యాలు, పరాచికాలు, కొట్లాటలు, సంస్కృతిని కూడా ఆవిష్కరించడం జరిగింది.
భారమైన రోజువారీ జీవితంతో సతమతమవుతూ, ఏటికి ఎదురీదుతూ కూడా దళిత స్త్రీలు ఆత్మ స్థైర్యాన్ని కూడగట్టుకుంటూ దుర్భరమైన సమస్యలను సైతం సెన్సాఫ్ హ్యూమర్‌తో ఎదుర్కొంటుంటారు.
వారి ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం, నిజాయితీగా, సహజంగా బతకాలనే వారి కోరిక, వారి శ్రమైక జీవన సౌందర్యం మొదలైన వాటిని లోకానికి చాటాలన్న ప్రగాఢమైన కాంక్షకు ప్రతిరూపమే ఈ పుస్తకం.
ప్రత్యేకించి దళిత స్త్రీలు తమ జీవితాన్ని ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని చదివి మరింత ఉత్తేజం పొంది నూతన సమాజ నిర్మాణానికి కృషిచేస్తారనీ, దళిత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారన్న ఆశతో, నమ్మకంతో ఈ సంగతి మీ ముందుకొచ్చింది.
సంగతి (నవల)
- బామ
తమిళ మూలం : సముదాయ చిందనై, మధురై, తమిళనాడు.
తెలుగు అనువాదం : జూపాక సుభద్ర
ముఖచిత్రం: కాళ్ల
82 పేజీలు, రూ.25
Friday, November 7, 2008
గులాంగిరి - జోతీరావు ఫూలే
భారత దేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు జోతీరావు ఫూలే (1827-1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని ఆయన ప్రగాఢంగా కోరుకున్నారు. ఫూలే ఆలోచనలకూ, విశ్లేషణలకూ ఆయన రాసిన ఈ పుస్తకం అద్దం పడుతుంది.
... ... ...
ఈ పుస్తకం రాయడంలో నా శూద్ర సోదరుల్ని బ్రాహ్మణులు ఎట్లా మోసం చేశారో చెప్పడం ఒక్కటే నా ఉద్దేశం కాదు. ఇంతవరకూ బ్రిటీషు ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన ఉన్నత విద్యాబోధనా విధానం ఎంత హానికరమో తెలుసుకొనేలాగ ఆ ప్రభుత్వం కళ్లు తెరిపించడం కూడా నా ఉద్దేశం.
...
తోటి శూద్రుల నిజ పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, బ్రాహ్మణ దాస్యత్వం నుంచి తమని తాము విముక్తి చేసుకోవడం - ఈ రెండూ ఏ కాస్త చదువుకున్న నా శూద్ర సహూదరులందరి ప్రథమ కర్తవ్యం.
ప్రతి గ్రామంలో శూద్రులకు పాఠశాలలు అవశ్యం కావాలి.
కానీ అందులో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వుండకూడదు.
దేశం అనే దేహానికి శూద్రులు రక్తనాళాల వంటివారు. అందుచేత ప్రభుత్వం తన ఆర్థిక, రాజకీయ కష్టాలనుంచి గట్టెక్కడానికి ఎప్పుడూ ఆధారపడవలసింది శూద్రుల మీదనే తప్ప బ్రాహ్మణుల మీద కాదు.
- జోతిరావు ఫూలే
గులాంగిరి
-జోతీరావు ఫూలే
తెలుగు అనువాదం : ఏలూరి రామయ్య
102 పేజీలు, వెల: రూ.40/-
Thursday, November 6, 2008
బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ నిర్మాత ... ఛత్రపతి సాహూ మహరాజ్ - కాత్యాయని
ఫూలే తర్వాత బ్రాహ్మణ వ్యతిరేకోద్యమాన్ని అంత సమర్థవంతంగా నిర్వహించిన నాయకుడు ఛత్రపతి సాహూ మహరాజ్.
ఆయన 1894 నుండి 1922 దాకా, మొత్తం ఇరవై ఎనిమిదేళ్లపాటు కొల్హాపూర్ సంస్థానాన్ని పాలించాడు.
దళిత, బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చెయ్యటానికి సైద్ధాంతికంగానూ, పాలనాపరంగానూ తీవ్రమైన కృషిచేశాడు.
అట్టడుగు కులాల, వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఆర్థిక, విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలన్నింటిలోనూ విప్లవాత్మకమైన చట్టాలను రూపొందించింది సాహూ ప్రభుత్వం. వెనకబడిన కులాల ప్రజలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన మొట్టమొదటి పాలకుడు ఆయన.
సాహూ పాలనలో కొల్హాపూర్ సంస్థానమే గాక, మొత్తం మహారాష్ట్ర ప్రాంతమే కొత్త జీవంతో తొణికిసలాడింది.
బ్రాహ్మణాదిక్యతలో మగ్గుతూ వుండిన మహారాష్ట్ర నుండి తర్వాత కాలంలో దళిత నాయకులూ, మేధావులూ ముందుకు రావటం వెనక సాహూ చేసిన కృషి ఎంతో వుంది.
సాహూ జీవితాన్నీ, ఉద్యమాన్నీ ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది. ఆయన సైద్ధాంతిక దృక్పథానికున్న పరిమితులపై వచ్చిన విమర్శలను కూడా చర్చిస్తుంది.
బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ నిర్మాత
ఛత్రపతి హాహూ మహరాజ్
- కాత్యాయని
88 పేజీలు, వెల: రూ.25
Wednesday, November 5, 2008
అయ్యంకాళి (1863-1941) ... ఒక దళిత యోధుని సమరగాథ - మూలం: చెందరాశేరి, తెలుగు కూర్పు: అ ల్లం నారాయణ
అయ్యంకాళి మన దేశంలో జరిగిన మొట్టమొదటి వ్యవసాయ కార్మిక సమ్మెకు నాయకత్వం వహించిన దళిత నేత.
విశేషం ఏమిటంటే ఆ సమ్మె కూలీ రేట్లు పెంచమని డిమాండ్ చేస్తూ చేసిందికాదు. అణగదొక్కబడుతున్న దళితుల పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోవాలన్న డిమాండ్‌తో చేసింది!
నిరక్షరాస్యుడైన అయ్యంకాళి తన జాతి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక పోరాటాలు చేశాడు.
పురవీధుల్లో, రహదారుల్లో అంటరానివాళ్లు నడవటానికి కూడా వీల్లేదని నిషేధించిన ఆ కాలంలో తాను ముందుండి దళితులందరినీ ముందుకు నడిపించి, ఉద్యమించి విజయం సాధించాడు.
ఆరోజుల్లో కేరళలో అంటరాని కులాల స్త్రీలు రవికెలు వేసుకోడానికి వీల్లేదు.
వక్షస్థలం కప్పుకోడానికి వాళ్లు పూసలదండలు మాత్రమే వేసుకోవాలి.
అట్లాంటి దుర్మార్గపు ఆంక్షలను రూపుమాపడానికి అయ్యంకాళి మరో ఉద్యమం నిర్వహించాడు.
దళిత స్త్రీలను చైతన్యపరచి వేలాది మందితో సమావేశం నిర్వహించి వారంతా ఆ దుస్సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ పూసలదండలను తెంపి వేసి రవికెలు ధరించేలా చేశాడు. దళిత స్త్రీలు రవికెలు వేసుకున్నా సహించలేని సవర్ణులు వారిమీద దాడి చేస్తే స్త్రీలంతా ఉవ్వెత్తున వారిపై ఎదురుదాడి చేసి తరిమికొట్టారు.
అయ్యంకాళి జీవితమంతా ఇట్లాంటి పోరాటాల సమాహారమే.
కేరళలో అది పోరాటాల యుగంగా చెప్పుకోవచ్చు.
శ్రీనారాయణగురు కూడా తలపెట్టని మార్పును అయ్యంకాళి తీసుకువచ్చాడు.
1924లో జరిగిన వైకోం సత్యాగ్రహం గురించి మనకు చెప్పారు. కానీ 1907లోనే దళితుల దేవాలయ ప్రవేశం కోసం అయ్యంకాళి చేసిన పోరాటం గురించి ఎవరూ చెప్పలేదంటే అంటరానివారికి చరిత్రకారులు కూడా ఎంత అన్యాయం చేసారో తెలుస్తుంది.
అంటరానితనం, వివక్ష, అడుగడుగునా అణచివేత, స్వేచ్ఛారాహిత్యం రాజ్యమేలుతున్న రోజుల్లో ఒక చదువురాని, పేద అట్టడుగు స్థాయినుంచి వచ్చిన నిమ్నకులస్తుడు భూస్వామ్య వ్యవస్థకు, అగ్రవర్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి నిలబడగలగడం సామాన్యమైన విషయం కాదు.
అయ్యంకాళి జీవితం ఒక మహాకావ్యం.
ఉద్విగ్న భరిత పోరాటం.
ఉత్తేజకరమైన సందేశం.
హక్కులు సాధించుకోవటానికి ఒక ఆయుధం.
అయ్యంకాళి (1863-1940)
ఒక దళిత యేధుని సమరగాథ
మూలం: చెందరాశేరి
తెలుగు కూర్పు: అ ల్లం నారాయణ
84 పేజీలు, వెల: రూ.20
Tuesday, November 4, 2008
ముల్కి ... ముస్లిం సాహిత్య సంకలనం ... సంపాదకులు: వేముల ఎల్లయ్య, స్కైబాబ
క్యారే తూ బక్తా హై సో
నన్ను విదేశీయు డంటావేందిరా బద్మాష్
జర చరిత్ర పుస్తకాన్ని తిరగెయ్యరా
ఎవరు విదేశో తేలిపోద్ది ...
.... .... ....
నీ మనుధర్మం అంటరాని పెనుమంటల్లో
నన్ను మలమల మాడ్చుతున్నప్పుడు
ఇస్లాం నన్ను హత్తుకుంది
చక్రవర్తీ తన బానిసా కలిసి నమాజ్ చేసేవారు
ఏదీ ... నీ పక్కన కూర్చోబెట్టుకుని
మాదిగోనితో వేదమంత్రాలు చదివించు చూద్దాం!?
మాదిగోనిని పూజారి చెయ్యి చూద్దాం!?
దళితుల్ని కూడా హిందువులంటున్నావే
ప్యాపిలిలో బిసి దొరలు దళిత వినాయకుణ్ణి
చంపితే మౌనంగా వున్నావేం?
... ... ...
మతమార్పిడిని నిషేధించాలని
గుండెలు బాదుకుంటున్నావు
నేను తిరిగి నీ మతంలోకి వస్తే
నన్ను ఏ కులంలో చేరమంటావు?!
మళ్లీ దళితుడిగా మారుస్తానంటావా??
..... (అ ల్‌ఫతా)
....
దాదాపు అన్ని సమాజాలలో మెజారిటీ మత భావజాలం ఆవరించి ఉంటోంది. ప్రత్యక్షంగా బైటపడని చోట కూడా పరోక్షంగా దాని ప్రభావం ఎంతో ఉంటుంది. అ లాంటి ఈ లోకంలో ఒక మైనారిటీ వాయిస్ కు ... అందులోనూ దేశ విభజనాభారాన్నీ, నిందల్నీ, గోబెల్ ప్రచారాల్నీ అకారణంగా మోస్తున్న ముస్లింల నుంచి వస్తున్న సాహిత్యానికి సమ్మతి లభించి ప్రత్యేక సంచికలు వేయడానికి ముందుకు రావటం అంటే ఎంతో విశాలత్వం, ఎంతో చైతన్యం వున్న వాళ్లకే సాధ్యమవుతుంది.
బహుశా అందుకే ఆ పని తెలుగు సాహిత్యంలో జరుగలేదు. దశాబ్దంన్నర కాలంగా ముస్లిం సాహిత్యం వస్తున్నా కూడా జరుగలేదు. స్త్రీ, దళిత, తెలంగాణా సాహిత్య ప్రత్యేక సంచికలెన్నో వచ్చాయి. కొన్ని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు సైతం ఈ సంచికల్ని తీసుకువచ్చాయి. కానీ ముస్లిం సాహిత్య విషయమై ఎవరూ ముందుకు రాలేదు.
పత్రికలు ముస్లిం సాహిత్యం విషయంలో ఎలాంటి చర్చలకు చోటు ఇవ్వలేదు. తెలుగు సాహిత్యంలో భూకంపం పుట్టించిన జల్‌జలా లాంటి గొప్ప కవితా సంకలనాన్ని సమీక్షలకే పరిమితం చేశాయి. దాంతో ముస్లిం కవులకూ, ఈ సాహిత్యోద్యమాన్ని అందిపుచ్చుకోవాల్సిన వాళ్లకూ ఎలాంటి ప్రోత్సాహం లేకపోయింది. తర్వాత వచ్చిన ఫత్వా, అజా విషయంలోనూ అదే జరిగింది.
ఇట్లాంటి నిశ్శబ్ద వివక్ష కొనసాగుతున్న సమయంలో ఏడాదిన్నరపాటు కష్టపడి ముల్కి మూడవ సంచికను ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచికగా తీసుకువచ్చాం .... (అదే ఇప్పుడు పుస్కకరూపంలో మీ ముందుంది)
(వేముల ఎల్లయ్య, స్కైబాబ)
ఇందులో వతన్, ఖబూతరా, సండాస్, ముసీబత్ వంటి కథలు;
హిందువులు ఈ దేశస్తులు కారు,
హిందుత్వకు విరుగుడు హేతువాదం కాదేమో,
భారతీయ ముస్లింల వెనుకబాటుకు కారణాలు,
తెలుగు కథల్లో ముస్లిం జీవితాలు- భాష,
మతమార్పిడి,
సెక్యులరిస్టుల దగ్గర సరైన ఆయుధంలేదు,
బాధితులను నిరాయుధుల్ని చేయడమే లౌకికవాదమా?,
భారత ముస్లింలు - రిజర్వేషన్ల ఆవశ్యకత వంటి వ్యాసాలు;
అనేక కవితలు, సమీక్షలు వున్నాయి.
ముల్కి
ముస్లిం సాహిత్య సంకలనం
సంపాదకులు : వేముల ఎల్లయ్య, స్కైబాబ
258 పేజీలు, వెల : రూ.65
Monday, November 3, 2008
తమిళ బౌద్ధ - దళిత ఉద్యమ నిర్మాత పండిత అయోతీదాస్ ... తెలుగు కూర్పు : కాత్యాయని
బౌద్ధ మతం ఆవిర్భవించిన కాలం నుండీ, వలసవాద సంక్షోభ కాలంలో పునరుజ్జీవనం పొందిన కాలం దాకా అది పీడితుల పక్షాన నిలబడే మతంగానే వుంది.
బుద్ధుడి వ్యక్తిత్వమూ, ఉపదేశమూ కూడా మానవ సంబంధాల్లోని ద్వంద్వ ప్రవృత్తినీ, అసమానతలనూ వ్యతిరేకించేవే.
వర్ణ ధర్మానికీ, కులభేదాలకూ వ్యతిరేకంగా బుద్ధుడు చేసిన తిరుగుబాటు విప్లవాత్మకమైనది. ఆయన హేతువాదిగా నిలిచి పూజారివర్గాన్నీ, మూఢ సంప్రదాయాలనూ నిరసించాడు. నైతిక విషయాల్లో స్పష్టతనూ, ఆలోచనల్లో, ఆచరణలో పారదర్శకతనూ, పీడితుల పక్షాన నిలబడాల్సిన అవసరాన్నీ ఉపదేశించాడు. బౌద్ధంలోని ఈ ఆధిపత్య వ్యతిరేక స్వభావం వల్ల అది నిమ్న కులాలను ఆకర్షించగలగింది.
..... ..... ....
బౌద్ధ ధర్మాన్ని పీడితకులాల విముక్తి సిద్ధాంతంగా అంగీకరిస్తూ 1956లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆధ్వర్యలో వేలాది మంది దళితులు బౌద్ధాన్ని స్వీకరించటం మనకు తెలుసు.
కానీ అంతకన్నా అర్థశతాబ్దం ముందుగానే తమిళనాడులో పరయాలు నిర్మించిన సఖ్య బౌద్ధ ఉద్యమాన్ని గురించి చరిత్రలో లభిస్తున్న వివరాలు చాలా తక్కువ, ఆ ఉద్యమ నిర్మాత పండిత అయోతీదాస్ (1845-1914) సామాజిక, సాహిత్య రంగాల్లో చేసిన అద్భుతమైన కృషి కూడా ప్రధాన స్రవంతి చరిత్రకారుల దృష్టిని అంతగా ఆకర్షించలేదు.
పరయాల బౌద్ధ ఉద్యమాన్ని మత మార్పిడిగా అయోతీదాస్ ఎంత మాత్రమూ అంగీకరించడు. అది కేవలం మరుగున పడిన పరయాల ఆస్తిత్వాన్ని తిరిగి ప్రకటించటమేనని ఆయన వాదన. పీడిత జాతుల విముక్తి పోరాటాలెప్పుడూ వాళ్ల అస్తిత్వపు పునాదిపై నిలబడి చెయ్యాలేతప్ప ఆధిపత్య మతాల్లోకి శరణార్థులుగా వెళ్లటం ద్వారా కాదని చెప్పిన విలక్షణమైన తత్వవేత్త పండిత అయోతీదాస్.
ఆయన తదనంతర కాలంలో పెరియార్, అంబేడ్కర్‌లు నడిపిన ఉద్యమాలకు సఖ్య బౌద్ధఉద్యమం స్ఫూర్తిదాయకంగా పనిచేసింది. పరయాల విముక్తిపోరాటంగా ప్రారంభమై, సమగ్రమైన కులనిర్మూలనా దృక్పథంతో విస్తరించిన ప్రజా ఉద్యమం సఖ్య బౌద్ధం.
ఆ ఉద్యమాన్నీ, ఉద్యమ నిర్మాత పండిత అయోతీదాస్‌నూ ఈ పుస్తకం మనకు సంక్షిప్తంగా పరిచయం చేస్తుంది.
తమిళ బౌద్ధ - దళిత ఉద్యమ నిర్మాత
పండిత అయోతీదాస్
-జి. ఎలోసియస్, వి.గీత, ఎస్.వి.రాజాదురై
ఆంగ్ల మూలం: రెలిజియన్ యాజ్ ఎమాన్సిపేటరీ ఐనండెంటిటీ- జి. ఎలోసియస్; టువర్డ్స్ ఎ నాన్ బ్రాహ్మిన్ మిలీనియం - వి.గీత, ఎస్.వి.రాజాదురై.
తెలుగు కూర్పు : కాత్యాయని
48 పేజీలు, వెల: రూ.15
Sunday, November 2, 2008
వెలకట్టలేని విలువైన పుస్తకం ... మనకు డాక్టర్ లేని చోట ... ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం
గుంటూరులో డాక్టర్ కోదండ రామయ్య గారి హాస్పిటల్ వరండాలో నా మూడేళ్ల కొడుకు చందూని వళ్లో పెట్టుకుని కూర్చున్నా. డిగ్రీ పరీక్షలు రాశానప్పుడే.
ఆ థైరాయిడ్ పేషంట్‌ని తీసుకురమ్మని డాక్టర్‌గారు పిలిచారంటూ నర్స్ వచ్చి చెప్పింది.
నాకు అర్థం కాలేదు.
మా అబ్బాయికి జబ్బు కాదు. నేను ఓ బంధువు అనారోగ్యంగా వుంటే చూడ్డానికి వచ్చాను అంతే అని చెప్పాను.
అయినా ఆవిడ వినకుండా వీడికి జబ్బుందని డాక్టర్‌గారు రమ్మంటున్నారని నన్ను లోనికి లాక్కెళ్లింది.
నేను పిల్లవాడిని డాక్టర్ ఎదురుగా కూర్చోబెట్టి తెల్లమొహం వేసుకుని నిలబడ్డాను. వాడిని పరీక్ష చేశాక డాక్టర్ నా వయసు, చదువు గురించి అడిగారు.
వాడు పొట్టిగా వున్నాడు ఎందుకు చూసుకోలేదు, వాడి జుట్టు వూడిపోతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదు, వాడు తెల్లగా పాలిపోయి నీరసంగా వున్నా తెలుసుకోలేని మొద్దువి నువ్వేం తల్లివి అన్నారాయన.
వాడిని కన్నప్పుడు నా వయసు పదిహేడేళ్లు!
ఆస్పత్రికి తీసుకుపోయే స్థోమతలేక, నాటు మంత్రసాని చికిత్సలతో నేను చచ్చిబతికాను. కనేముందు వరకూ వంటలొండుతూ, గొడ్డు చాకిరీ చేసే కోడళ్లున్న పల్లెటూరి ఇంటి గృహిణిని నేను. అక్కడ స్త్రీల ఆరోగ్యం గురించి, పిల్లల ఆరోగ్యం గురించిన ఆలోచనలేలేవు.
పిల్లవాడు ఏడిస్తే ఓదార్చడం చాతకాక, ఇద్దరం ఏడుస్తూ వుండేవాళ్లం.
వాడికి జబ్బని నాకు తెలియలేదని డాక్టర్‌గారికి చెప్పాను.
వాడికి థైరాయిడ్ పెరగడం లేదనీ, ఎప్పటికీ వాడు ఆ మూడడుగుల ఎత్తే వుంటాడనీ, వాడు బతికినా నీకే కష్టమనీ, అయినా మందులు వాడి చూడమన్నారు డాక్టర్ గారు.
నాలాటి పనికిమాలిన తల్లులకు పిల్లలెందుకుంటారో అని విచారపడ్డారు. అప్పటినుంచి పిల్లవాడికి పదేళ్లపాటు తనే ట్రీట్‌మెంట్ యిచ్చారు.
వాడిని కిందకు దించాలన్నా నాకు భయం వేసేది. ఆ పదేళ్ల కాలం నేను అనుభవించిన క్షోభ వర్ణనాతీతం.
ఇప్పుడు వాడు బ్యాంకు ఉద్యోగి.
మా పల్లెలో మరీ ముంచుకొస్తే తప్ప ఆడవాళ్లు ముందుగా ఆస్పత్రికి పోవటం నేనెరుగను. లోపలవచ్చే జబ్బులగురించి చెప్పుకోవటం కూడా సిగ్గే.
సంపాదించి పోషించే మగాళ్లకి తలనొప్పివచ్చినా ఇంట్లో పెద్ద హడావిడిగా వుంటుంది. కానీ ఆడవాళ్ల విషయంలో వాళ్లకే కాదు, అసలు ఎవరికీ పట్టింపు వుండనే వుండదక్కడ.
వైద్యుడులేని చోట ... అనే పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గీత పంపారు. ఆ పుస్తకాన్ని నేను అపురూపంగా అందుకున్నాను. ఇంక మా ఊళ్లో ఆడవాళ్లకి ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఆ పుస్తకం తిరగేసి కారణాలు వెతికేవాళ్లం. పోనీ అవన్నీ పాతరోజులనుకుందాం. మొన్నీ మధ్య హైదరాబాద్‌లోని జీడిమెట్ల దగ్గర్లో ఓ స్లమ్ ఏరియాలో స్త్రీల ఆరోగ్యం గురించి జరిగిన ఒక వర్క్ షాప్‌కి వెళ్లాను. మాటల సందర్భంలో అక్కడ అందరికీ ఐదారుగురికి తక్కువకాకుండా పిల్లలున్నట్టు తెలిసింది. దాదాపు అందరికీ ఇన్‌ఫెక్షన్ వుందని చెప్పారు. గంటల తరబడి ప్రశ్నలడిగిన తరువాత తేలిందేమంటే వాళ్లు బైటవున్నప్పుడు బట్ట మార్చుకోరు, శుభ్రత పాటించరు. ఎందుకు? నీళ్లు లేవు కాబట్టి! కష్టపడి మోసుకొచ్చే నీళ్లు మగవాళ్ల స్నానానికి, ఇంటి పనులకు సరిపోతే వీళ్లవరకు వచ్చేసరికి ఓపికలేక సరిపెట్టుకుంటారు. జబ్బులకు మూలం అది.
మీటింగులొద్దు, ఉపన్యాసాలొద్దు ముందు అందరికీ నీళ్లిమ్మని ముఖ్యమంత్రిని ఎవరడుగుతారు? ఇంటినంతా చక్కదిద్దే ఆడవాళ్లకి తమ గురించిన శ్రద్ధ లేకపోవడం గురించి, వాళ్లపట్ల ఇంట్లోవాళ్లకి బాధ్యత లేకపోవడం గురించి ఎంతగా చెపితే అర్థమవుతుంది?
ఈ ఆలోచనలకు, చర్చలకు ఇది సమయం కాదని, ఇదిగో పరిష్కారం అంటూ వచ్చింది ... మనకు డాక్టర్ లేని చోట ... పుస్తకం. ఈ పుస్తకం కొని చదవటం కాదు, ఎందరిచేతో చదివించాలి. మారుమూల పల్లెలకు వెళ్లాలి.
ఐదొందలకు పైగా పేజీలున్న ఈ పుస్తకంలో, సులభంగా అర్థం చేసుకొనేందుకు వీలుగా వందలాది బొమ్మలున్నాయి. స్త్రీల శరీరంలో వచ్చే మార్పుల గురించి, జబ్బుల గురించి, జాగ్రత్తల గురించి వివరిస్తుందీ పుస్తకం. వొట్టి వైద్యం గురించే కాదు సామాజికంగా ఆర్థికంగా స్త్రీల పరిస్థితి ఏమిటో చెపుతుంది. స్త్రీలకు వచ్చే జబ్బులకూ వాటికీ వున్న సంబంధాన్ని బయటపెడుతుంది. స్త్రీలు సమూహంగా ఏం చేయవచ్చో సలహాలు ఇస్తుంది. ఇలాటి పుస్తకాలు ఇంకా రావాలి. వయోజన విద్యా కేంద్రాల్లో, గ్రామీణ గ్రంథాలయాల్లో ఈ పుస్తకం వుంచాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- సి. సుజాత (ఆంధ్ర జ్యోతి సచిత్ర వారపత్రిక-20-8-1999)
మనకు డాక్టర్ లేని చోట
ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం
- ఎ.ఆగస్ట్ బర్న్స్, రాని లోవిచ్, జేన్ మాక్స్‌వెల్, క్యాథరిన్ షాపీరో
ఆంగ్ల మూలం: Where Women Have No Doctor, Hesperian Foundation, USA
తెలుగు అనువాదం : డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి
582 పేజీలు, సాదా ప్రతి వెల: రూ.220, మేలుప్రతి: రూ.300
Saturday, November 1, 2008
భారతదేశంలో మందుల విషాదం ... డా. అనంత ఫడ్కే
ది ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ వారు వెలువరించిన డ్రగ్ సప్లై అండ్ యూజ్- టువర్డ్స్ ఎ రేషనల్ పాలసీ ఇన్ ఇండియా అనే అధ్యయన పత్రానికి తెలుగు అనువాదం ఇది. ముందుమాట, మూడు భాగాలు కలిపి వంద పేజీల పుస్తకం.
భారత దేశంలో మందుల విషాదం అనే మొదటి భాగంలో మందుల తయారీ వినిమయం, వినియోగం, ప్రభుత్వ అ లసత్వం ప్రజల జీవితాలతో కంపెనీల చెలగాటం, అనవసర మందుల వాడకం, డాక్టర్ల అజ్ఞానం, రోగుల అజ్ఞానం, పేదరికం, నిస్సహాయత ... వగైరా ఎన్నో వివరాలతో సహా ఈ భాగంలో చాలా విలువైన సమాచారం వుంది. ఆయుర్వేదం పేరుతో మోసాలు, క్రాస్ ప్రాక్టీసింగ్ (ఎలాంటి అర్హతలు లేకున్నా) రెండు వైద్య విధానాలతో చికిత్స చేసే డాక్టర్లు వైద్యం చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. హేతు విరుద్ధమైన మందుల తయారీ ద్వారా వనరులు ఎలా వృధా అవుతున్నాయో తెలుస్తుంది. వి.పి.ఫోర్టే కేసు వివరాలు చదివితే పసలేని భారతీయ మందుల పర్యవేక్షణా నియంత్రణా విధానాల నీడలో లాభాలే ద్యేయమైన మందుల కంపెనీల ప్రజాద్రోహ వైఖరులు తెలుస్తాయి. న్యాయవ్యవస్థ వాటికి ఎలా సహకరిస్తోందో అవగతమవుతుంది. కొండను ముక్కుతో రుద్దే పోరాటాన్ని ప్రజాసంఘాలు ఎలా నిర్వహించాయో కూడా బోధపడుతుంది.
రెండో భాగంలో సతారా జిల్లా (మహారాష్ట్ర)లోని మందుల సరఫరా వినియోగం తాలూకు అధ్యయన వివరాలున్నాయి. ఎంతో శ్రమకోర్చి రచయిత డాక్టర్ల ప్రిస్కిప్షన్లను సేకరించి విశ్లేషించినందుకు అభినందించాలి.
మూడో భాగంలో వాడకూడని మందుల తాలూకు జాబితాలు, వివరాలు, వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలు, నిషేధించిన మందుల వివరాలు ఉన్నాయి. చివరగా రోగులు, సమాజ సేవా తత్పరులు ఏం చేయాలో సూచించారు.
ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు తమ సామాజిక నిబద్ధతనూ, సేవా దృక్పథాన్నీ చాటుకున్నారు. ప్రభుత్వ వైద్య సేవా విభాగాల వారు, ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఆస్పత్రుల్లోనూ వుండే మెడికల్, పారా మెడికల్ సిబ్బంది దీన్ని చదివితే మంచిది. అధ్యయన శిబిరాలు పెట్టి బోధించాల్సిన పుస్తకం ఇది. ఎందుకంటే నిరక్షరాస్యులు, పేదవారు, గ్రామీణులు దీన్ని చదవలేరు కదా! మన దేశంలో ఏటా 50 లక్షల మంది అతిసార వ్యాదితోనే చనిపోతున్నారు. ఏటా 40 వేల మంది పిల్లలు విటమిన్-ఏ లోపంతో బాధపడుతున్నారు. ఇందువల్ల వారు అంధులవుతున్నారు. పౌష్టికాహారం అందుబాటులో సరైన విద్య కావాలి.
మనదేశ వనరులు కొరగాని మంచుకొండల కోసం కరిగిపోతున్నాయి. దేశ రక్షణ, సమగ్రత కోసం ప్రజల్ని పావులుగా వాడుకుంటూ, పేద సైనికుల్ని బలిపెడుతూ, మధ్యతరగతి మిధ్యా (దేశభక్తి) వేషాల మంటల్లో చలికాచుకునే నేతలు, అదే దేశభక్తి ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం వంటి సామాజిక న్యాయాల కోసం పాటుపడరు. రాజకీయ నాయకులకు అధికార దాహమే కాని, ప్రజల మనుగడ అక్కర్లేదు. సామాజిక స్పృహ మాటెలా వున్నా వైయక్తిక ప్రయోజనాల కోసమైనా దీన్ని చదవవచ్చు. ... నిశితంగా చదవాల్సిన, చదివించాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని చదివించేది కాలక్షేపం కోసం ఎంతమాత్రం కాదని గ్రహించాలి. సామాజిక బాధ్యత, ప్రయోజనాలను గుర్తుకు తెచ్చుకోవడానికే అన్న విషయం తెలుసుకోవాలి.
- కస్తూరి (ఆదివారం ఆంధ్రజ్యోతి 19-12-2008)
భారతదేశంలో మదుల విషాదం
సరైన మందుల విధానం కోసం
- అనంత ఫడ్కే
ఆంగ్ల మూలం : Drug Supply and Use: Towards a Rational Policy in India. Dr.Anan Phadke, sage, New Delhi, 1998 copyright The Foundation for Research in Community Health,1998
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
96 పేజీలు, వెల: రూ.25
Subscribe to:
Posts (Atom)