మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Thursday, October 30, 2008
చూపులేని పిల్లలకు సహాయం ... దృష్టి సమస్యలు గల పిల్లలకు కుటుంబ, సమాజ మద్దతు
హెస్పేరియన్ ఫౌండేషన్ వారు గతంలో రూపొందించిన ... వైద్యుడు లేని చోట (వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్), మనకు డాక్టర్ లేని చోట ... ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం ( వేర్ వుమెన్ హావ్ నో డాక్టర్) ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. దృష్టి సమస్యలు గల పిల్లలకు కుటుంబ, సమాజ మద్దతును సమీకరించే కృషిలో భాగంగా సామాజిక నిబద్ధతతో వారు వెలువరించిన మరో విశిష్ట పుస్తకమే ఇది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం అంధత్వానికి, దృష్టి సమస్యలకు దారిద్య్రమే మూలకారణం. అంటే అత్యధిక శాతం అంధత్వం నివారించసాధ్యమైనదే. ప్రపంచ వ్యాప్తంగా దారిద్య్ర నిర్మూలన, ఆరోగ్య చికిత్సా సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా చాలా వరకు అంధత్వాన్ని తగ్గించడం, నివారించడం సాధ్యమవుతుంది. అందువల్ల అంధత్వాన్ని ఒక సామాజిక అంశంగా పరిగణించాలి. అంధ బాలలు ఎవరో కాదు. మన పిల్లలే. మన భవిష్యత్తు, మన సమాజ భవిష్యత్తు వారిపై ఎంతగానో ఆధారపడివుంటుంది.
దృష్టి లోపం కలిగి బాగా చూడలేని పిల్లల, తల్లితండ్రుల, సంరక్షకుల అవగాహనను పెంపొందించడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఇది కేవలం వారి బాధ్యత మాత్రమే కాకూడదు. తమ పిల్లల అవసరాలు, మంచి చెడ్డలు చూసుకొనే విషయంలో అంధత్వాన్ని ఒక సామాజిక అంశంగా పరిగణించడం వల్ల దృష్టిలోపం కలిగిన పిల్లల తల్లితండ్రుల భారాన్ని కొంతమేరకు తగ్గించేందుకు వీలేర్పడుతుంది. అంధ బాలలకు మన ప్రేమ, సంరక్షణ, శ్రద్ధ మరింత ఎక్కువగా కావాలి. వారిని అభివృద్ధిపరచి, ప్రగతిపథంవైపు నడిచే విధంగా కృషి చేసేనట్లయితే అందరి జీవితాలు, మొత్తం సమాజ స్థితి మెరుగుపడుతుంది.
మెరుగైన విద్యా విధానం, ఆరోగ్య సంరక్షణ, భద్రమైన రహదారులు, పరిసరాలు, సంక్షేమ కార్యక్రమాలు మొదలైన వాటిలో ప్రజలు, సమాజం పెద్ద ఎత్తున మమేకమై కృషి చేసినట్టయితే ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలుగుతుంది. మీరు మీ స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి వుండటం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం ద్వారా ఒక మెరుగైన సమాజాన్ని, సామాజిక న్యాయం, మానవత్వం కలిగిన ప్రపంచాన్ని సృష్టించేందుకు దోహదపడగలుగుతారు.
ఈ పుస్తకంలో సూచించిన అంశాలు తల్లితండ్రులకు, సంరక్షకులకు, ఉపాధ్యాయులకు, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నవారికి, పునరావాస కార్యకర్తలకు, ఇతరులకు ఎంతగానో తోడ్పడతాయి. దృష్టి సమస్యలు గల పిల్లలలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వారిని ప్రగతిపథంలో ఆత్మవిశ్వాసంతో నడిపించేందుకు దోహదపడతాయి.
చూపులేని పిల్లలకు సహాయం
దృష్టి సమస్యలు గల పిల్లలకు కుటుంబం మరియు సమాజం యొక్క మద్దతు
- శాండీ నీమన్, నమిత జాకబ్
ఆంగ్ల మూలం: Helping Children Who Are Blind, Hesperian Foundation,USA
తెలుగు : రాణి
188 పేజీలు, వెల: రూ.130
Wednesday, October 29, 2008
పురుగు మందుల విషవలయం - రాబర్ట్ వాన్‌డెన్ బోష్
గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ కీటక నాశినుల వెల్లువ ఎక్కువయింది. వరి, పత్తి, కంది, కూరగాయలు, పండ్లు తదితర పంటలపైనే కాదు చిన్న చిన్న పెరటితోటల్లో, ఇళ్లల్లో, గోల్ఫ్ మైదానాల్లో ఎక్కడపడితే అక్కడ రకరకాల పురుగుమందులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
ఆధునిక కీటక నాశినులన్నీ ప్రధానంగా విషాలు. అవి అటు చెడువాటినే కాదు ఇటు మంచివాటినీ సమానంగా నాశనం చేస్తాయి. వాటిని తెలివిగా వాడకపోతే ప్రకృతిలోని సాధారణ సమతౌల్యత దెబ్బతిని తిరిగి కీటకాల దాడి మరింతగా పెరుగుతుంది. మానవాళికి హాని చేసే కీటకాల శరీర పటుత్వం కన్నా మేలు చేసే కీటకాల శరీర పటుత్వం తక్కువ. అందువల్ల కీటక నాశినుల వల్ల మనకు మేలు చేసే కీటకాలే ఎక్కువగా బలిఅవుతాయి.
ఇళ్లల్లో కీటక నాశినులు వాడటం వల్ల ప్రమాదస్థాయి మరింత తీవ్రంగా వుంటుంది. మనదేశంతో సహా కొన్ని వర్ధమాన దేశాల్లో తల్లి పాలల్లో కూడా డిడిటి అవశేషాలు కనిపించాయి. మలేరియా నిర్మూలన పేరుతో విచ్చలవిడిగా డిడిటిని వాడిన ఫలితంగా అది సంభవించిన పరిణామమిది.
కీటక నాశినుల వాడకం ఆ వ్యాపారం సాగించేవారికి తప్ప ఇతరులందరికీ హాని కలిగిస్తుంది. ఈనాటి కీటకనాశినులు పురుగులను అరికట్టకపోగా, ఆ పురుగుల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ మరింత అధికమోతాదులో పురుగు మందులను వాడాల్సిన దుస్థితికి దారితీస్తున్నాయి. రైతుల అప్పులనూ, రైతుకూలీలకు తీవ్ర అనారోగ్యాన్ని మిగులుస్తున్నాయి. వాడకందార్లను ఎలాంటి నష్టపరిహారాన్ని పొందేందుకు అవకాశంలేని అనూహ్య ప్రమాదాలకు గురిచేస్తున్నాయి.
ఇవాళ శీతలపానీయాలతో సహా అనేక ఆహార పదార్థాలలో పురుగుమందుల అవశేషాలు పెద్దఎత్తున కన్పించడం ఆందోళన కలిగిస్తోంది.
పురుగు మందులు తలపెట్టే విధ్వంసం, అది జీవావరణ సమతుల్యానికి కలిగించే హాని, శాస్త్రవేత్తలం ... విషయజ్ఞులంఅని చెప్పుకునే వారి మానసిక నిష్క్రియాపరత్వం, ఆత్మవంచన తత్పలితంగా పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కలుగుతున్న హాని నేపథ్యంలో ఆవేశంతో, ఆవేదనతో, బాధతో వెలువరించిన పరిశోధనాత్మక రచన యిది.
పురుగు మందుల విషవలయం
- రాబర్ట్ వాన్ డెన్ బోష్
ఆంగ్ల మూలం : The Pesticide Conspiracy - Robert Van den Bosch, Doubleday & Co, USA
తెలుగు అనువాదం : రామమూర్తి
పుస్తక సంపాదకుడు: కె. సురేష్
78 పేజీలు, వెల: రూ.18
ఎయిడ్స్ రోగులకు ధైర్యం చెప్పే ఓ పుస్తకం : హెచ్‌ఐవి, ఆరోగ్యం, మనమూ మన సమాజం
మనిషి శరీరంలోకి ఏదేని వ్యాధిని కలుగజేసే క్రిములు ప్రవేశించినప్పుడు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వాటిని నాశనం చేస్తుంది. తద్వారా ఆ వ్యాధి సోకకుండా కాపాడుతుంది. అయితే మొత్తం వ్యాధి నిరోధక వ్యవస్థనే నాశనం చేసే క్రిమి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏమిటి? అన్ని రకాల వ్యాధులకు గురి కావలసివస్తుంది. తద్వారా త్వరితంగా మరణం సంప్రాప్తమవుతుంది.
మనిషి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని హరించివేసే వైరస్ క్రిములను హూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (హెచ్‌ఐవి) అంటారు. వీటి కారణంగా సంక్రమించేదే సంప్రాప్త వ్యాధి నిరోధక శక్తి రాహిత్య స్థితి దీనినే మనం ఎయిడ్స్‌గా వ్యవహరిస్తున్నాం.
ఎయిడ్స్ పై ప్రజలలో ఉన్న భయాందోళనలను పారదోలి, ఎయిడ్స్‌కు గురైనవారికి మానసిక ధైర్యాన్ని కలుగజేయడం, ఈ వ్యాధి గ్రస్తులకు సహాయ సహకారాలందించేవారికి ఊతమివ్వడం కోసం ఉద్దేశించిన గ్రంథం హెచ్‌ఐవి, ఆరోగ్యం మనమూ మన సమాజం.
రచయితలు ఉపోద్ఘాతంలో పేర్కొన్నట్లుగా ఈ పుస్తకం హెచ్‌ఐవి నివారణ, వ్యాధి తీరుతెన్నులు, నిర్ధారణ, చికిత్సలకు సబంబధించిన ప్రశ్నలకు సమాధానాలు వెదికే వారికోసం ఉద్దేశించి రచించారు.
హెచ్‌ఐవి అంటే ఏమిటి నుంచి మొత్తం పదమూడు అధ్యాయాలలో ఈ వ్యాధి గురించి, ఆరోగ్య కార్యకర్తగా వ్యాధిగ్రస్తులకు సహాయాన్ని అందజేయడం వరకు అనేక అంశాలను స్పృశించారు.
సెక్స్‌కు సంబంధించిన అంశాలను చర్చించడం కొంత ఇబ్బ,దికరంగా అనిపించవచ్చు. కానీ, ఒక కచ్చితమైన సమాచారాన్ని అందజేయడం కోసం చేసిన ప్రయత్నంలో ఆ ఇబ్బందిని పాఠకుడు అధిగమిస్తాడు.
ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా హెచ్‌ఐవి సోకే అవకాశాలు ఉన్న వ్యక్తులు, ఆరోగ్య కార్యకర్తలు తప్పనిసరిగా చదవాల్నిస గ్రంథమిది.
-Jeedigunta (Vaarttha Daily)
హెచ్‌ఐవి, ఆరోగ్యం, మనమూ మన సమాజం
- ర్యూబెన్ గ్రానిచ్, జోనథన్ మెర్మిన్
ఆంగ్ల మూలం: HIV,Health and Your Community – A guide for Action… The Hesperian Foundation, 1919 Addison Street, #304, Berkeley, California, 94704, USA
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
రేఖా చిత్రాలు: మోనా స్ఫెయిర్, అన్వర్
248 పేజీలు, వెల : రూ.100
తిండి గింజలకు తిలోదకాలు ... అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార అభద్రత విశ్లేషణ - డా.అమితావ ముఖర్జీ, వందనా శివ, ఉత్సా పట్నాయక,్ దేవీందర్ శర్మ
ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాల్లోకి కార్పొరేషన్లు ప్రవేశించడం సులభతరమైంది. ఫలితంగా సన్నకారు రైతులు వేగంగా నిర్వాసితులైపోతున్నారు. అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యతను రాజ్యం గాలికి వదిలేసింది. వాటికోసం ఇప్పుడు ప్రైవేటు రంగంపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు రంగానికి గ్రామీణ ప్రాంతాల ప్రగతిపట్ల ఏమాత్రం ఆసక్తిలేదు.
నిత్యాహారంలో భాగమైన పప్పు ధాన్యాలను, ముతక ధాన్యాలను ఉత్పత్తి చేసే సాగు భూమి తగ్గిపోయి, నీరు ఎక్కువ అవసరమైన నూనె గింజలను, చెరుకు, బంగాళాదుంపలు, ప్లాంటేషన్ వంటి పంటలను పండించే భూమి విస్తీర్ణం రోజురోజుకూ పెరిగిపోతోంది. వ్యవసాయ, వ్యవసాయేతర శ్రామికుల వాస్తవికాదాయం పడిపోతోంది. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ఉపాధి అవకాశాలు స్తంభించిపోతున్నాయి. ఉద్యోగులు తొలగింపునకు గురవుతున్నారు. ఇవన్నీ దేశంలో అభద్రతా స్థితిని పెంపొందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆహారభద్రతపై తగినంత సమాచారం అందించి దానిపై శాస్త్రీయ చర్చకు వీలుకల్పించే కృషిలో భాగంగా ఈ పుస్తకం వెలువడింది.
స్వతంత్రభారతంలో వ్యవసాయం - ఆకుపచ్చ విప్లవమూ అటు తర్వాతా ... అనే వ్యాసంలో ఆహార భద్రతపై హరిత విప్లవ ప్రభావాన్ని వందనా శివ సవివరంగా చర్చించారు.
ఎగుమతి లక్ష్యంగా గల వ్యవసాయం - ఆహార భద్రత, భారత తదితర వర్థమాన దేశాల పరిస్థితి ... అనే వ్యాసంలో ఉత్సా పట్నాయక్ సరళీకరణ, స్థిరీకరణ, వ్యవస్థాగత సర్దుబాట్లు తదితర ప్రైవేటీకరణ చర్యలు సృష్టిస్తున్న బీభత్సాన్ని కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారు.
భయం గొల్పే భవిష్యత్తు ... అనే వ్యాసంలో దేవీందర్ శర్మ ఇటీవలి అంతర్జాతీయ దృశ్యాల నేపథ్యంలో మన దేశం అనుసరిస్తోన్న తప్పుడు వ్యవసాయ విధానాల గురించి, వ్యవసాయ దిగుమతులపై ఆంక్షలను తొలగించాలంటూ మనదేశంపై పెరుగుతున్న వత్తిళ్లగురించి, వాటి భవిష్యత్తు పరిణామాల గురించి చర్చించారు.
ప్రవేశిక లో డా. అమితావ ముఖర్జీ మొత్తం పరిస్థితిని సమీక్షించారు. వర్థమాన దేశాల్లో నెలకొంటున్న ఆహార అభద్రత గురించి సమగ్ర అవగాహనను కలిగిస్తాయి. ఆలోచింపజేస్తాయి ఇందులోని వ్యాసాలు.
తిండి గింజలకు తిలోదకాలు
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార అభద్రతకు దోహదం చేస్తున్న అంశాల విశ్లేషణ
- డా.అమితావ ముఖర్జీ, వందనా శివ, ఉత్సా పట్నాయక,్ దేవీందర్ శర్మ
తెలుగు అనువాదం : కలేకూరి ప్రసాద్
84 పేజీలు, వెల: రూ.20
Tuesday, October 28, 2008
వ్యవసాయం : ఎటు మన పయనం ? - వి. హనుమంతరావు
వ్యవసాయం : ఎటు మన పయనం ? - వి. హనుమంతరావు
ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, వ్యవస్థాగత మార్పులు, ప్రైవేటీకరణ, ప్రపంచ బ్యాంకు మొదలైన వాటి ప్రభావాలు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల మీద ఆధిపత్యం కోసం అమెరికా తదితర సామ్రాజ్యవాద దేశాలు క్రమేణా రణ నీతికి బదులు రుణ నీతిని అనుసరిస్తూ బడుగు దేశాల మూలుగులను పీల్చేస్తున్నాయి.
మన దేశంలో నూటికి 70 మంది వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. జాతీయాదాయంలో మూడోవంతు వ్యవసాయం నుంచే వస్తోంది. వ్యవసాయదారులు పండిస్తేనే మనందరికీ తిండి లభిస్తుంది. వ్యవసాయం దెబ్బతింటే దేశంలో మూడోవంతు పరిశ్రమలు పడుకొంటాయి. మన ఆర్థిక వ్యవస్థలో అంత ముఖ్యమైన వ్యవసాయం గురించి అసలు నూతన ఆర్థిక విధానంలో సరైన ప్రస్తావనేలేదు. వ్యవసాయం గురించిన విధాన పత్రం తయారు కాకుండానే నూతన ఆర్థక విధాన పత్రం తయారు చేశారు మన పాలకులు. పునాది గురించి పట్టించుకోకుండానే స్వతంత్ర భారత సౌధాన్ని నిర్మిస్తున్నారు. దేశ స్వాతంత్య్రాన్ని ప్రపంచ విపణివీధిలో తాకట్టుపెట్టేందుకు సంసిద్ధులవుతున్నారు. వీటన్నింటి ఫలితంగా నేడు భారత వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
భారీ పెట్టుబడులు పెట్టి, లాభాలు సంపాదించాలనే యావ వున్న వారికే వ్యవసాయంలో స్ధానం వుంటుందని ప్రభుత్వ విధానాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు తదితర సంస్థలు ప్రోత్సహించిన అధిక వరి వంగడాలు మన గ్రామ సీమల్లో ఆర్థిక వ్యత్యాసాలను పెంచుతున్నాయి. ఎక్కువ ఎరువులు, ఎక్కువ నీరు, అదే మోతాదులో పురుగుమందులు వాడితే తప్ప ఆ అధిక దిగుబడి వరివంగడాలు పండవు. అందుకే ఎన్ని ఎరువుల కర్మాగారాలు నిర్మించుకున్నా ఇవాళ తీవ్రమైన ఎరువుల కొరత ఏర్పడి రైతులు అ ల్లాడున్నారు. బడా భూస్వాములతో, పెట్టుబడిదారులతో సామాన్య రైతులు పోటీపడలేక నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయానికి తిలోదకాలిచ్చి, ఉన్న భూములను భూస్వాములకు సమర్పించుకుని ఎందరో సన్నకారు రైతులు కూలీలుగా పట్టణాలకు వలస పోతున్నారు.
వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులను, సంక్షోభాన్ని చక్కగా చిత్రించిన పుస్తకమిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, వివాదాలను, ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నీటి వినియోగదారుల సంఘాల లోపాలను, భూసంస్కరణలకు పట్టిన దుర్గతిని రచయిత ఇందులో చక్కగా చిత్రించారు. మన వ్యవసాయ విధానం, దాని స్థితిగతులు, రుణాలు, ధరలపెరుగుదల కథా కమామిషులను అద్భుతంగా విశ్లేషించారు. సమగ్ర సమాచారాన్ని సేకరించి, సులభశైలిలో రాసిన ఇందులోని వ్యాసాలు మిమ్మల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.
రచయిత వి. హనుమంతరావు గత 50 సంవత్సరాలుగా పత్రికా విలేకరిగా, సంపాదకునిగా పనిచేస్తున్నారు..డేటా న్యూస్ ఫీచర్స్ సస్థ సంపాదకునిగా ఆంధ్రప్రదేశ్ వార్షిక దర్శిని, పురపాలక దర్శిని, డేటా ఆంధ్ర ప్రదేశ్ పక్షపత్రికలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎట్ 50 అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని వెలువరించారు.
వ్యవసాయం: ఎటు మన పయనం ?
- వి. హనుమంతరావు
94 పేజీలు, వెల : రూ.25
ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, వ్యవస్థాగత మార్పులు, ప్రైవేటీకరణ, ప్రపంచ బ్యాంకు మొదలైన వాటి ప్రభావాలు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల మీద ఆధిపత్యం కోసం అమెరికా తదితర సామ్రాజ్యవాద దేశాలు క్రమేణా రణ నీతికి బదులు రుణ నీతిని అనుసరిస్తూ బడుగు దేశాల మూలుగులను పీల్చేస్తున్నాయి.
మన దేశంలో నూటికి 70 మంది వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. జాతీయాదాయంలో మూడోవంతు వ్యవసాయం నుంచే వస్తోంది. వ్యవసాయదారులు పండిస్తేనే మనందరికీ తిండి లభిస్తుంది. వ్యవసాయం దెబ్బతింటే దేశంలో మూడోవంతు పరిశ్రమలు పడుకొంటాయి. మన ఆర్థిక వ్యవస్థలో అంత ముఖ్యమైన వ్యవసాయం గురించి అసలు నూతన ఆర్థిక విధానంలో సరైన ప్రస్తావనేలేదు. వ్యవసాయం గురించిన విధాన పత్రం తయారు కాకుండానే నూతన ఆర్థక విధాన పత్రం తయారు చేశారు మన పాలకులు. పునాది గురించి పట్టించుకోకుండానే స్వతంత్ర భారత సౌధాన్ని నిర్మిస్తున్నారు. దేశ స్వాతంత్య్రాన్ని ప్రపంచ విపణివీధిలో తాకట్టుపెట్టేందుకు సంసిద్ధులవుతున్నారు. వీటన్నింటి ఫలితంగా నేడు భారత వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
భారీ పెట్టుబడులు పెట్టి, లాభాలు సంపాదించాలనే యావ వున్న వారికే వ్యవసాయంలో స్ధానం వుంటుందని ప్రభుత్వ విధానాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు తదితర సంస్థలు ప్రోత్సహించిన అధిక వరి వంగడాలు మన గ్రామ సీమల్లో ఆర్థిక వ్యత్యాసాలను పెంచుతున్నాయి. ఎక్కువ ఎరువులు, ఎక్కువ నీరు, అదే మోతాదులో పురుగుమందులు వాడితే తప్ప ఆ అధిక దిగుబడి వరివంగడాలు పండవు. అందుకే ఎన్ని ఎరువుల కర్మాగారాలు నిర్మించుకున్నా ఇవాళ తీవ్రమైన ఎరువుల కొరత ఏర్పడి రైతులు అ ల్లాడున్నారు. బడా భూస్వాములతో, పెట్టుబడిదారులతో సామాన్య రైతులు పోటీపడలేక నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయానికి తిలోదకాలిచ్చి, ఉన్న భూములను భూస్వాములకు సమర్పించుకుని ఎందరో సన్నకారు రైతులు కూలీలుగా పట్టణాలకు వలస పోతున్నారు.
వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులను, సంక్షోభాన్ని చక్కగా చిత్రించిన పుస్తకమిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, వివాదాలను, ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నీటి వినియోగదారుల సంఘాల లోపాలను, భూసంస్కరణలకు పట్టిన దుర్గతిని రచయిత ఇందులో చక్కగా చిత్రించారు. మన వ్యవసాయ విధానం, దాని స్థితిగతులు, రుణాలు, ధరలపెరుగుదల కథా కమామిషులను అద్భుతంగా విశ్లేషించారు. సమగ్ర సమాచారాన్ని సేకరించి, సులభశైలిలో రాసిన ఇందులోని వ్యాసాలు మిమ్మల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.
రచయిత వి. హనుమంతరావు గత 50 సంవత్సరాలుగా పత్రికా విలేకరిగా, సంపాదకునిగా పనిచేస్తున్నారు..డేటా న్యూస్ ఫీచర్స్ సస్థ సంపాదకునిగా ఆంధ్రప్రదేశ్ వార్షిక దర్శిని, పురపాలక దర్శిని, డేటా ఆంధ్ర ప్రదేశ్ పక్షపత్రికలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎట్ 50 అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని వెలువరించారు.
వ్యవసాయం: ఎటు మన పయనం ?
- వి. హనుమంతరావు
94 పేజీలు, వెల : రూ.25
Thursday, October 16, 2008
తల్లి భూదేవి ... రచన: చింగీజ్ ఐత్‌మాతొవ్ ... తెలుగు అనువాదం : ఉప్పల లక్ష్మణరావు
మన భారతీయ సంప్రదాయాల్లో మాదిరిగానే ప్రాచీన మధ్య ఆసియా పురాణాల్లో కూడా తల్లిని సృష్టికీ, తొలి గుర్తింపునకూ మూలంగా ప్రతీకగా భావిస్తారు.
మన అస్తిత్వానికీ, మన పురోభివృద్ధికీ, మనల్ని మనం తీర్చిదిద్దుకోడానికీ కీలకమైన ఆధారంగా నిలిచేది తల్లి ... భూదేవే.
అందుకే ఐత్‌మాతోవ్ తల్లి భూదేవిలో వ్యవసాయిక కుటుంబానికి చెందిన వృద్ధ మహిళ తొల్గొనాయ్ తన కళ్లముందే ఎంతోమంది తమ అస్తిత్వం కోల్పోవటాన్నీ, ఆ వరస విషాదాలనూ మర్చిపోలేదు. యుద్ధంలో భర్తనూ, ముగ్గురు కొడుకులనూ పోగొట్టుకున్న ఆమెకు మిగిలిందిఒకే ఒక వ్యక్తి ... గర్భంతో వున్న కోడలు!
ఆమె కూడా కాన్పు కష్టమై మరణించటంతో కొత్తగా ఈ లోకంలోకి వచ్చిన బిడ్డకు జీవితాన్నీ, ఈ లోకాన్నీ పరిచయం చేసే బాధ్యత తొల్గొనాయ్ మీదే పడుతుంది. దాన్ని ఆమె స్వీకరించిన తీరు, నిర్వహించిన వైనం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.
వ్యక్తులుగా మన గతాన్నీ, మన చరిత్రనూ, దాని విలువనూ ఎన్నటికీ విస్మరించలేమనీ, మనం ఈ లోకంతో సంబంధాలను విస్మరించుకోగలమేమోగానీ తెంచుకోవటం మాత్రం అసాధ్యమని బలంగా నొక్కి చెబుతుందీ రచన.
రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పరిణామాలను ఆమె చర్చించే తీరు చూస్తే ... మనకు దేనినైనా భరించే, దేనినైనా కడుపులో పెట్టుకునే చల్లిటి తల్లి భూమాత గుర్తుకొస్తుంది.. అందుకే ఐత్‌మాతొవ్ ఆ తల్లి భూదేవినే ప్రతీకగా నిలబెడతారు.
... రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించటంకంటే కూడా సమాజం అంతరాత్మను ప్రతిధ్వనించటమే ముఖ్యమన్న మాక్సిం గోర్కీ మాటలను చింగీజ్ ఐత్‌మాతొవ్ శిరసావహించారు.
ఒక రచయిత నిబద్ధతకు ...ఎటువంటి భేషజాలు లేకుండా మార్పును ఆహ్వానించటం, ఆవిష్కరించటమే నిజమైన కొలమానమని వ్యాఖ్యానించేవారాయన. అందుకే ఆయన సోవియట్ వాస్తవికతలోని చీకటి కోణాలను కూడా నిష్కర్షగా, ఆలోచనాత్మకంగా తన రచనల్లో ప్రతిబింబించారు.
... కిర్గిజ్ జాతిపితగా పేరొందిన చింగీజ్ ఐత్‌మాతొవ్ రచనలను మా దేశంలో ప్రతి కుటుంబం చదువుతుంది. మళ్లీ మళ్లీ చదువుతుంది. ఎందుకంటే మాకు గుండె ధైర్యాన్ని నూరిపోసింది ఆయన రచనలే. కేవలం ఒక వ్యక్తిగా మనం ఎంత మార్పు తేవచ్చో చూపారాయన ... అంటారు కిర్గిజ్ మానవ హక్కుల కార్యకర్త నటాలియా ఆబ్లోవా.
అర్థశతాబ్ధం క్రితం నాటి జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు, తల్లి భూదేవి వంటి ఆయన రచనలు 150 ప్రపంచ భాషల్లోకి అనువాదమవటమే కాదు ఇప్పటికీ వన్నె తగ్గకుండా సమకాలీన రచనల్లా అ లరిస్తుండటానికి ఐత్‌మాతొవ్ స్పృశించిన సార్వజనీన, మానవీయ భావనలే కారణం.ఆయన కిర్గిస్థాన్ రాయబారిగా పలుదేశాల్లో పనిచేశారు. 2008 జూన్ 10న జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో కన్నుమూశారు.
తల్లి భూదేవి
- చింగీజ్ ఐత్‌మాతొవ్
అనువాదం: ఉప్పల లక్ష్మణరావు
187 పేజీలు, వెల: రూ.75
తొలి ఉపాధ్యాయుడు ...చదువులపై రాసిన, కంటతడి పెట్టించే అపూర్వ నవల. రచన: చింగీజ్ ఐత్‌మాతొవ్ ... తెలుగు అనువాదం : ఉప్పల లక్ష్మణరావు
మారుమూల కిర్గిజ్ గ్రామంలో తొట్టతొలి పాఠశాలను స్థాపించి ... నవ సమాజ నిర్మాణం కోసం ఓ యువ ఉపాధ్యాయుడు పడ్డ తపనను, ఆ క్రమంలో సామాజికంగా అతనికి ఎదురైన పెను సవాళ్లను హృద్యంగా చర్చిస్తుందీ నవల.
దూషన్ పేరుతో ఐత్‌మాతొవ్ 1962లో రాసిన ఈ నవలకు ఆంగ్ల అనువాదమైన ఫస్ట్ టీచర్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది.
సోవియట్ సమాజ నిర్మాణం కోసం తరతరాలుగా వస్తున్న సంప్రదాయ విలువలకు దూరం జరగాల్సి వచ్చినప్పుడు తొలినాళ్లలో ఆయా జాతులు అనుభవించిన సంఘర్షణను, ఆ వ్యథను ... ఆక్రమంలో ఒ తొలితరం ఉపాద్యాయుడు సాధించిన విజయాలను అద్భుతంగా వివరిస్తుందీ నవల.
బాహ్య ప్రపంచపు విజ్ఞానాన్నీ, విద్యనూ తన కుగ్రామంలోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో అనూహ్య మార్పులు తెచ్చిన దూషన్ అనుభవాలు ... నేడు మనదేశంలో ఇటువంటి కృషి చేస్తున్న ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.
... రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించటంకంటే కూడా సమాజం అంతరాత్మను ప్రతిధ్వనించటమే ముఖ్యమన్న మాక్సిం గోర్కీ మాటలను చింగీజ్ ఐత్‌మాతొవ్ శిరసావహించారు.
ఒక రచయిత నిబద్ధతకు ...ఎటువంటి భేషజాలూ లేకుండా మార్పును ఆహ్వానించటం, ఆవిష్కరించటమే నిజమైన కొలమానమని వ్యాఖ్యానించేవారాయన. అందుకే ఆయన సోవియట్ వాస్తవికతలోని చీకటి కోణాలను కూడా నిష్కర్షగా, ఆలోచనాత్మకంగా తన రచనల్లో ప్రతిబింబించారు.
... కిర్గిజ్ జాతిపితగా పేరొందిన చింగీజ్ ఐత్‌మాతొవ్ రచనలను మా దేశంలో ప్రతి కుటుంబం చదువుతుంది. మళ్లీ మళ్లీ చదువుతుంది. ఎందుకంటే మాకు గుండె ధైర్యాన్ని నూరిపోసింది ఆయన రచనలే. కేవలం ఒక వ్యక్తిగా మనం ఎంత మార్పు తేవచ్చో చూపారాయన ... అంటారు కిర్గిజ్ మానవ హక్కుల కార్యకర్త నటాలియా ఆబ్లోవా.
అర్థశతాబ్ధం క్రితం నాటి జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు, తల్లి భూదేవి వంటి ఆయన రచనలు 150 ప్రపంచ భాషల్లోకి అనువాదమవటమే కాదు ఇప్పటికీ వన్నె తగ్గకుండా సమకాలీన రచనల్లా అ లరిస్తుండటానికి ఐత్‌మాతొవ్ స్పృశించిన సార్వజనీన, మానవీయ భావనలే కారణం.ఆయన కిర్గిస్థాన్ రాయబారిగా పలుదేశాల్లో పనిచేశారు. 2008 జూన్ 10న జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో కన్నుమూశారు.
తొలి ఉపాధ్యాయుడు
- చింగీజ్ ఐత్‌మాతొవ్
అనువాదం: ఉప్పల లక్ష్మణరావు
106 పేజీలు, వెల: రూ.50
Wednesday, October 15, 2008
ఎగిరే క్లాస్ రూమ్ ... సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఎరిక్ కేస్టనర్ పిల్లల కోసం రాసిన అద్భుత నవల
సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఎరిక్ కేస్టనర్ 1933లో పిల్లల కోసం రాసిన నవల దాస్ ప్లెయిజెండె క్లాసెస్ (ఫ్లయింగ్ క్లాస్‌రూమ్)కు తెలుగు అనువాదమిది. బోర్డింగ్ పాఠశాలల్లో చదువుకునే పిల్లల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే ఈ నవలలో క్రిస్టమస్ డ్రామా, పిల్లల, ఉపాధ్యాయుల అనుభవాలు, అనుభూతులు హృదయానికి హత్తుకునేలా చిత్రించబడ్డాయి. మధ్యమధ్య పెద్దలు చేసే యుద్ధాల మీదా, జాతీయవాదం మీదా, దేశభక్తి మీదా చేసిన వ్యాఖ్యానాలూ చెణుకులూ పాఠకులను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. జర్మనీలో నాజీలు ఇంకా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోకముందు కేస్టనర్ రాసిన చివరి రచన యిది. అయితే ఇందులో నాజీల గురించిన ప్రస్తావన ఎక్కడా స్పష్టంగా లేకపోయినప్పటికీ నవల నేపథ్యంలో కనిపించే ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, తీవ్ర నిరుద్యోగ సమస్య వంటివి జర్మన్ ఓటర్లు హిట్లర్ వైపు గంపగుత్తగా మొగ్గుచూపడానికి ఏవిధంగా దోహదం చేశాయో చాటిచెబుతాయి.
ఈ నవలలోని పాత్రలన్నీ ఉల్లాసంగా, ఉత్తేజంగా అనిపిస్తాయి. కథనం మనసును రంజీపజేసేలా సాగుతుంది. ఈ పుస్తకం ద్వారా రచయిత యిచ్చిన సందేశం ఏడు దశాబ్దాల అనంతరం ఈనాటి సమాజానికి కూడా వర్తిస్తుంది. సునిశితమైన హాస్యం, బోర్డింగ్ పాఠశాల జీవితం, గొడవలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, నాటకీయత, అక్కడి స్నేహమాధుర్యం ... అన్నింటికీ మించి ''బాల్యాన్ని మరచిపోకండి'' అనే ఉదాత్తమైన సందేశం పాఠకుల మనసుపై చెరగని ముద్రవేస్తాయి. పెద్దల కన్నీళ్లు ఎంత బరువైనవో పిల్లల కన్నీళ్లు కూడా అంతే బరువైనవికదా.
ఎరిక్ కేస్టనర్ (23-2-1899 - 29-7-1974) ఇరవైయవ శతాబ్దపు జర్మన్ కథకులలో, స్క్రీన్‌ప్లే రచయితలలో ప్రముఖుడు. హాస్యపూరిత స్ఫూర్తిదాయక బాల సాహిత్యం ద్వారా, అడపాదడపా రాసిన వ్యంగ్య కవితల ద్వారా ఆయన ఎంతగానో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కేస్టనర్‌కు పదిహేనేళ్లప్పుడే మొదటి ప్రపంచయుద్ధం మొదలవుతుంది. ఒకచోట ''ఆ యుద్ధం నా బాల్యాన్ని మింగేసింది'' అని ఆక్రోశిస్తాడాయన. 1917లో నిర్బంధంగా సైన్యంలో చేరవలసి వస్తుంది. సైనికుడిగా తను పొందిన క్రూరమైన శిక్షణ, యుద్ధం సృష్టించే బీభత్సం, మానవహననం ఆయనపై తీవ్రమైన ప్రభావం చూపాయి. అవి ఆయనలో మిలిటరీ వ్యతిరేక భావనలు పెంపొందింపజేశాయి. ఆ తదనంతర కాలంలో ఆయన వివిధ పత్రికలలో స్వేచ్ఛా విలేఖరిగా పనిచేశారు. ప్రముఖ బెర్లిన్ పత్రికలన్నింటిలో కాలమ్‌లను, సమీక్షలను, వ్యాసాలను రాశారు. 1928లో ఆయన రాసిన ఎమిల్ అండ్ దై డిటెక్టివ్ (ఎమిల్ అండ్ ది డిటెక్టివ్) అనే పిల్లల నవల ఎంతో ప్రాచుర్యం పొందింది. పిల్లల డిటెక్టివ్ రచనలకు అది మార్గదర్శకమయింది. ఎనిడ్ బ్లయిటోన్ వంటి అనేకమంది పిల్లల పుస్తక రచయితలు దానినుంచి ప్రేరణ పొందారు.
నాజీలు కేస్టనర్‌ను చాలా ఇబ్బందులకు గురిచేశారు. అయినా జర్మనీని వదిలివెళ్లేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఈ ఎగిరే క్లాస్‌రూం నవల ప్రచురించబడిన కొద్దిరోజులకే నాజీలు అధికారంలోకి వచ్చారు. వచ్చిరాగానే వాళ్లు ఈ పుస్తక ప్రతుల్ని తగులబెట్టారు. నాజీ గూఢచారి సంస్థ గెస్టపో ఆయనను అనేకసార్లు ప్రశ్నించి వేధించింది. జర్మన్ రచయితల సంఘం ఆయనను తమ సంఘం నుంచి బహిష్కరించింది. నాజీల పాలన కొనసాగినంతకాలం కేస్టనర్ ఇలా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయన మొదటినుంచీ శాంతికాముకుడిగానే వున్నారు. పశ్చిమ జర్మనీలో అణ్వాయుధాల నిల్వలను వ్యతిరేకించే ప్రజాప్రదర్శనల్లో చురుకుగా పాల్గొన్నారు. వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా కూడా ఆయన తన నిరసన గళాన్ని వినిపించారు.
శ్రీ బి.వి.సింగరాచార్య గారు ఈ పుస్తకాన్ని ఆరోజుల్లోనే నేరుగా జర్మనీనుంచి తెలుగులోకి అనువదించి, ప్రచురించడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ప్రముఖ చిత్రకారుడు శ్రీ అన్వర్ ఈ పుస్తక ప్రతిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌కు అందించడమే కాకుండా దీని పునర్ముద్రణకు ఎంతో మక్కువతో శ్రమదానం చేశారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
ఎగిరే క్లాస్ రూమ్
- ఎరిక్ కాస్ట్‌నర్
జర్మన్ మూలం:
తెలుగు అనువాదం: బి.వి.సింగరాచార్య
162 పేజీలు, వెల: రూ.70
మహాత్మా జోతిరావ్ ఫూలే ... బ్రాహ్మణాధిపత్యంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు
నిమ్న కులాలవారి కోసం, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రథమంగా పాఠశాలలు స్థాపించి, విద్యావ్యాప్తి ద్వారా వారిని దాస్య విముక్తుల్ని చేసేందుకు; కులవివక్షనూ, సాంఘిక దోపిడీనీ, మూఢనమ్మకాలనూ ... వాటికి కేంద్ర బిందువైన బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు జోతిరావు ఫూలే (1827-1890). ఆయన సమగ్ర జీవిత సంగ్రామ చరిత్రే ఈ పుస్తకం.
నిన్న మొన్నటి వరకూ మన దేశంలో విద్య అగ్రవర్ణాల గుత్తసొత్తుగా వుండేది.
స్త్రీలైతే ఏ కులానికి చెందినవారైనా నాలుగు గోడల మధ్య బందీలుగా పడివుండాల్సిందే.
విద్య మీదా, రాజ్యం మీదా, మతం మీదా బ్రాహ్మణులదే తిరుగులేని పెత్తనం.
ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మం న్యాయం అంటూ వారు బోధించే నీతులన్నీ వారి ఆధిపత్యం కొరకే అన్నట్టు నడిచిన కష్టమైన ఆనాటి కాలంలోనే సమానమైన మరో సమాజం కోసం నడుంబిగించాడు ఫూలే.
ఎంతో సాహసోపేతంగా నిమ్న కులాల కోసం, స్త్రీల కోసం పాఠశాలల్ని నెలకొల్పి, వారి కొరకు తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పి ఆమెను టీచర్‌గా తీర్చిదిద్దాడు.
అంతేకాక సతీ సహగమనాన్ని, అంటరానితనాన్ని, పురోహిత వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమించాడు.
వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.
కార్మిక కర్షకుల హక్కులకోసం, సంఘ సంస్కరణ కోసం దళితులపై తరతరాలుగా సాగుతున్న బ్రాహ్మణీయ దోపిడీని ఎదిరిస్తూ తుదివరకు నిలబడ్డ ఫూలే జీవితం, పోరాటం తదనంతర కాలంలో డాక్టర్ అంబేడ్కర్ వంటి ఎందరో మహనీయులకు స్ఫూర్తినిచ్చింది.
హిందూమతోన్మాదం ఇవాళ ...మతభక్తే ... దేశభక్తి ... అనే కొత్త వాదనతో తిరిగి పడగ విప్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇ లాంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతో వుంది.
రచయిత ధనంజయ్ కీర్ మహారాష్ట్రకు చెందిన వారు. డాక్టర్ అంబేడ్కర్ మిత్రుడు. 1969లో వెలువడిన మహాత్మా ఫూలే సమగ్ర వాజ్మయ్ పుస్తకానికి సంపాదకులు. ఆయన మహాత్మా జోతిరావ్ ఫూలే జీవితం గురించి చాలాకాలం పరిశోధించి ఈ పుస్తకాన్ని రాశారు.
ఈ పుస్తక స్వేచ్ఛానువాదకురాలైన డా. విజయ భారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రాశారు. వాటిలో అంబేడ్కర్, పురాణాలు-కులవ్యవస్థ పేరుతో రాసిన సత్యహరిశ్చంద్రుడు, దశావతారాలు, షట్చక్రవర్తులు ముఖ్యమైనవి.
మహాత్మా జోతిరావ్ ఫూలే
- ధనంజయ్ కీర్
తెలుగు సేత: డా. విజయ భారతి
208 పేజీలు, వెల: రూ.60/-
నాన్న …. రాజన్ తండ్రి ఈచర వారియర్ అంతులేని పోరాటం
ఎమర్జెన్సీ చీకటి రోజులను అనుభవించిన వాళ్లందరికీ
రాజన్ కేసు సుపరిచితం.
వార్తా పత్రికల పతాక శీర్షికలకెక్కిన రాజన్ కేసు ఎమర్జెన్సీ క్రౌర్యానికీ
దాని నిర్దాక్షిణ్య హింసకూ ఒక దుర్మార్గ రాజ్య భీభత్సానికీ చిహ్నంగా నిలిచింది.
దానితో సమానంగా ఆ కేసు రాజన్ తండ్రి ప్రొఫెసర్ ఈచర వారియర్
సాహసానికి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా స్పందించిన, దాన్ని తోసిరాజన్న వందలవేల లక్షల భారతీయుల సాహసానికి కూడా అది ప్రతీకగా నిలిచింది.
ఈ కథ ఆయన ఒక్కడిదే కాదు. ఇప్పటిదాకా బయటపడని ఎన్నో వేలమంది బాధల, వేదనల కథ యిది.
భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల చేతుల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు అంతులేకుండా పోతోంది. ఈ అకృత్యాలను, పోలీసుల మితిమీరిన అధికారాన్ని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నాలలో ఒక అత్యవసర ప్రయత్నంగా ప్రొఫెసర్ వారియర్ కథనం నిలుస్తుందనే దృఢమైన విశ్వాసంతో మీముందు ఈ పుస్తకం ఉంచుతున్నాం. నిస్సందేహంగా ఇక్కడ కూడా ధైర్య సాహసాలు నిండిన మనుషులు కొందరుంటారు.
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్
.......
శ్రీ దుప్పల రవికుమార్ గారు తన బ్లాగు ... చదువు డాట్ వర్డ్‌ప్రెస్ డాట్ కామ్ ... లో ఈ పుస్తకంపై చేసిన సమీక్షను ఇక్కడ యధాతథంగా పొందుపరుస్తున్నాం:
మానవ హక్కుల హననం
....................
మన దేశంలోనే కాదు, మనుషులున్న ప్రతిచోటా అధికారం కాపాడుకోవడానికి పాలకులు చట్టాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటారు. ఇది దాదాపు ప్రతి కాలంలోను, ప్రతి ప్రాంతంలోను జరిగిందే, జరుగుతున్నదే. మన దేశంలో ఎమర్జెన్సీ కాలాన్ని చీకటి రోజులతో పోల్చవచ్చు. ఇందిరాగాంధీ కొన్ని అనవసర భయాలు, తర్క రహిత కారణాలతో దేశంలో పెట్టిన ఆత్యయిక పాలనకు స్వయానా తన కొడుకే కొత్త భాష్యాలు చెప్పడంతో దేశమంతా పోలీసులు పెట్రేగిపోయారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు వికటాట్టహాసం చేస్తూ దురంతాలకు పాల్పడితే, అడ్డుకోవలసిన అధికారులు, కాపాడాల్సిన నాయకులు, న్యాయం చెప్పాల్సిన కోర్టులూ ఏవీ కిమ్మనకుండా ఊరుకున్నాయి. కనీస మాత్రంగానైనా ఎదురు చెప్పలేని నిస్సహా య పరిస్థితిలో ప్రజలు నానాయాతనలు పడ్డారు.
బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు దేశమంతటా చేసినప్పుడు మారుమూలనున్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని కస్తూరిపాడు తాలూకాలో కొబ్బరిచెట్లపేట అనే అరవై వాకిళ్ల అతి చిన్న పల్లెలో బొడ్డేపల్లి పాపయ్య అనే రైతుకూడా తప్పించుకోలేకపోవడం ఆ దుస్థితి తీవ్రతకు నిదర్శనం. పోలీసులు, అధికారులు, రాజకీయ గణాలు చేసిన ఓవర్ యాక్షన్ కు ఇలాంటి వందలు వేలాది కథలు దృష్టాంతాలుగా నిలుస్తాయి. వీటికి విరుగుడుగా నిలవాల్సిన ప్రజా చైతన్యం కొరవడడం, ప్రజా ఆందోళనలు జరగక పోవడం, ప్రజా ఉద్యమాలు సాగకపోవడంతో పాటు ఎక్కడైనా చిన్న ఎత్తున బయలుదేరిన నిరసనలను సైతం అధికారం ఉక్కుపాదంతో అణచివేయడంతో ఆ చీకటి రోజుల గాయాలు ఇప్పటికీ అందరినీ తీవ్రంగా సలుపుతున్నాయి. పోలీసులు అదే మొండి ధైర్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మనిషి ప్రాణం వారి దృష్టిలో విలువ లేనిదయింది. జీవించే హక్కును కాలరాయడం వారి హక్కుభుక్తమయింది. కనీస మాత్రంగానైనా హక్కుల స్పృహ భారతదేశంలో పోలీసులకు కొరవడింది. ఒకవైపు అస్సాంలోను, మరోవైపు కాశ్మీరంలోనూ, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ జరుగుతున్న దమనకాండను మనం నిస్సహాయంగా చూస్తున్నాం. పోలీసు ఉద్యోగమంటేనే తల్లులూ, పిల్లలూ హడలిచచ్చే రోజులివి.
నిరుడు మనదేశంలో జరిగిన ఒక తంతును గమనించండి. పదేళ్ల కిందటి కేసుల విషయంలో అధికారం అడ్డదిడ్డమైన సాక్ష్యాలతో కోర్టు తీర్పులను తమకు అనుకూలంగా మలుచుకోగలిగింది - ప్రియదర్శిని కేసులో, జస్సికాలాల్ కేసులో. నిస్సహాయ స్థితిలో వున్న వారి బంధువుల ఆవేదనకు ఎన్. డి. టి. వి., తెహల్కా వంటి ప్రసార మాధ్యమాలు కృషి తోడై, జనమంతా సామూహికంగా గళం విప్పడం వల్ల కేసులు తిరగదోడి నిందితులకు కఠిన శిక్షలు వేయించగలిగాం. కాని ఎమర్జెన్సీ రోజులు వేరు. ఆనాటి పరిస్థితులు వేరు.
అధికారం చేసే ఈ మూర్ఖపు వికృత కరాళ నృత్యంలో పాలుపంచుకోవడానికి రాజకీయ పార్టీలేవీ మినహాయింపులు కావని ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్న ఆ చీకటిరోజుల దారుణ వ్యథార్థ గాథలు నిరూపిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు పోరాడి నిలువునీరైన ఓ తండ్రి వేదనను ఇటీవల “నాన్న” పేరుతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ లో హిందీ ప్రొఫెసరైన టి.వి. ఈచర వారియార్ మలయాళంలో వెలువరించిన తన ఆవేదనాభరిత కథను సి. వనజ తెలుగు పాఠకులకు అందించారు. ఈ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.
1979 ఫిబ్రవరి 29న నక్సలైట్లు కాయన్న పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ దాడిని పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. మందీ మార్బలతో ఊరిమీద పడ్డారు. కాలికట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ మీద విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ ఈచర వారియర్ ఒక్కగానొక్క కొడుకు రాజన్ కూడా అదే కాలేజీలో ఫైనలియర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రాజన్ ను కూడా పోలీసులు నిర్బంధించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా రాజన్ ఆచూకీ లేదు. రాజన్ ఏమయ్యాడో అటు పోలీసులకు గాని, ఇటు తల్లిదండ్రులకు గాని, కనీసం ఇతర విద్యార్థులకు గాని, లేదంటే కోర్టుకు గాని ఇంతవరకు పోలీసులు తెలియజెప్పలేకపోయారు. జయరాం పడిక్కాల్, పులిక్కొడన్ నారాయణన్ అనే ఇద్దరు పోలీసు అధికారులు పెట్టిన చిత్రహింసలకు తాళలేక రాజన్ మరణించారు. లేదా ఆ వాక్యాన్ని ఇలా చెప్పవచ్చు. ఆ ఇద్దరు పోలీసు అధికారుల చేతుల్లో రాజన్ హత్యకు గురయ్యాడు. అంతే, పోలీసులకు సంబంధించినంతవరకు రాజన్ కథ అలా సమాప్తమయింది. రాజన్ శవం ఎముకలు కూడా కనిపించకుండా ఉండేందుకు పంచదార వేసి గోనెసంచిలో కుక్కి కాల్చేశారు. ఈ పనిచేసింది చట్టవిద్రోహులు కారు. రౌడీషీటర్లు కానే కారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు. అదే భారతదేశంలో హక్కుల చరిత్రలో దారుణాతిదారుణమైన సంగతి.
అక్కడి నుండి రాజన్ తండ్రి ఈచర వారియర్ అంతులేని పోరాటం ప్రారంభమవుతుంది. సాయం కోసం కేరళ రాజకీయ నాయకులను కలవాలని వారియర్ బయలుదేరుతాడు. కరుణాకరన్, అచ్యుతమీనన్ లాంటి నాయకులు, బూర్జువా దినపత్రికల సంపాదకులు కూడా అతనికి మొండి చేయి అత్యంత అవమానకరంగా చూపించడం మరో బాధించే అంశం. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వహబుద్దీన్ మాత్రం కోర్టు గుమ్మం ఎక్కి దిగడానికే కాదు, మరెన్నో విధాలా ఆ తండ్రికి సాయపడతాడు. ఎ.కె. గోపాలన్, విశ్వనాధ మీనన్ లాంటి రాజకీయులు నాణేనికి రెండోవైపు వారు. వారియర్ కు సహకరించడానికి సిద్ధపడ్డవారు.
1977 ఫిబ్రవరి 22న ఎమెర్జెన్సీ తొలగిన తర్వాత వారియర్ అందరికీ వినతిపత్రాలు ఇవ్వడం మానుకుని కోర్టును ఆశ్రయించారు. న్యాయవాది రాంకుమార్ సహాయంతో కేసును కోర్టుకు తీసుకెళ్లిన వారియర్ కోర్టు తీర్పుల్లోనే ఊరట పొందగలిగారు. ఎక్కడికక్కడ పోలీసుల దుర్మార్గాలకు వంత పాడుతున్న పాలక వర్గంతో వీరోచితంగా పోరాడుతూ అడుగులు ముందుకు వేయడంలో వారియర్ లో నిజంగా మనకో యుద్ధవీరుడు (వారియర్) దర్శనమిస్తాడు. కేరళ హైకోర్టులో హెబియస్ పిటిషన్ వేసిన వారియర్ కు అనుకూలంగా తీర్పు రావడం గొప్ప విషయం. రాజన్ ను కోర్టు ముందు హాజరు పర్చాలని చెప్పిన హైకోర్టు తీర్పును సవాలు చేస్తూపోలీసులు సుప్రీం గుమ్మమెక్కారు. భారత అత్యున్నత న్యాస్థానం కూడా రాజన్ ను పోలీసులు అరెస్ట్ చేశారని విశ్వసించి అతడిని కోర్టుకు అప్పజెప్పాలని ఆదేశించింది. దాంతో అప్పటి కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్ తన పదవికి రాజీనామా చేయాల్సిరావడం పెను సంచలనం.
తరువాత ముఖ్యమంత్రి ఎ.కె. ఆంటోనీ హైకోర్టు తీర్పుమీద కేరళ ప్రభుత్వం చేత ఒక విచారణ కమిషన్ ను నియమించారు. దాంతో మళ్లీ కేసు తప్పుదోవ పట్టించడానికి వీలైంది. కొంతకాలం నడిచి సుప్రీంకోర్టులో మూలపడ్డ కేసులో వారియర్ తన కొడుకు మరణాన్ని జీర్ణించుకుని నష్టపరిహారం కోరడం అతడి అన్నకే కాదు రాజన్ మిత్రులకు కూడా చాలా కోపం తెప్పించింది. కానీ తరువాత వారియర్ తీసుకున్న నిర్ణయం మన విప్లవ నేతలు కూడా గమనించాలి. రాజన్ స్మృతిచిహ్నంగా జిల్లా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ వార్డు పేరుతో ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి ఉపక్రమించడం. తరువాత రాజన్ మిత్రుల చొరవతో అదంతా పూర్తయి ప్రజలకు ఉపయోగపడుతోంది.
వారియర్ తన కుమారుడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో సమాధానాలు చెప్పలేక తన భార్యను పోగొట్టుకుంటారు. తన సంబంధాలను తృణప్రాయంగా అలక్ష్యం చేస్తారు. ప్రజలను సమీకరిస్తారు. ఉద్యమాన్ని లేవదీస్తారు. కానీ మన దళసరి చర్మపు పోలీసు వ్యవస్థకు ఇవేవీ పట్టవు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కూడా కాలరాయాలనుకోవడం క్షమించరాని నేరం.
పుస్తకం చదవడం పూర్తిచేశాక మనమంతా అంతులేని దుఖంలో కూరుకుపోతాం. వారియర్ చెప్పిన కథనంలోని ‘ఎవరి మీదా ద్వేషం లేదు’ అన్న అధ్యాయం మన కంట నీరు తెప్పిస్తుంది. ఒక్కసారి కదిలిపోతాం. ఇదే అధ్యాయంలో వారియర్ చెప్పిన మాటలు మనను ఆలోచనలో పడేస్తాయి. “రాజన్ మృతికి కారకులైన ఆ పోలీసాఫీసర్ల మీద పగ తీర్చుకోవాలని నాకుందా, లేదా అనే ప్రశ్న నన్ను అనుమానంలో పడేసేది. నేను హిందూ మత విశ్వాసాల మధ్య పెరిగాను. గుడి, ప్రార్థనలు, నైవేద్యాలు, మతాచారాలు నిండి ఉండే ఇంట్లో మెలిగిన వాడికి ప్రతీకార వాంఛ అసహజమైనది. కానీ ఒంపు తిరిగిన మీసాలు అటూ ఇటూ కదులుతుండగా ఉద్రిక్తంగా వాదించే పులిక్కోడన్ నారాయణన్ ను టెలివిజన్ లో చూసినప్పుడల్లా నా మనసులో ప్రతీకార వాంచ మెరిసేది. నా కొడుకుకు ఎదురైన అసహాయ వేదనా మయక్షణాలు నాకు గుర్తొచ్చేవి. అసంకల్పితంగానే లెక్కలు తీర్చుకోవడం గురించి నేనాలోచించేవాడిని. అంతకుముందెన్నడూ ఎరగని ఆగ్రహం నా మనసులో ప్రవేశించేది. ప్రతి ఒక్కటీ మరచి పోయానని నాకనిపించినప్పుడల్లా దాన్ని మరింత స్పష్టంగా గుర్తు తెచ్చుకునేవాడిని.” తన కన్న కొడుకును పొట్టన పెట్టుకున్నా ప్రతీకార వాంఛతో రగిలిపోకుండా న్యాయపోరాటం చేశాడా సామాన్య వృద్ధుడు. అధికారం ఉండీ ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు మన పోలీసులు. సరిగ్గా ఇక్కడే మనకు జీవన పోరాటం గురించి, హక్కుల పోరాటం గురించీ ఈచర వారియర్ రూపంలో కొత్త కొత్త పాఠాలు తెలిసి వస్తున్నాయి. నలబై రెండు పేజీల ఈ చిన్న పుస్తకం “నాన్న”లో పోలీస్ కస్టడీలో మరణించిన తన కొడుకు ఆచూకీ కోసం ఓ తండ్రిపడ్డ తపనను అక్షరం వెంట అక్షరం రాసుకుంటూపోతూ ఈచర వారియర్ మనకు అందించారు. దీనిని సి.వనజ తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కేసు విషయంలో కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును చివరి పదిహేడు పేజీలలో అందించారు. దీనిని నల్సార్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అనువదించారు.
కోర్టులు మరింత సమర్ధంగా పనిచేసి, ప్రజా సంఘాలు నిత్య చైతన్యంతో కృషిచేసి, హక్కుల సంఘాలు నిరంతర సంఘర్షణ జరిపిన నాడే మన పోలీసుల విధులు, బాధ్యతలను గుర్తెరిగేటట్టు చేయగలం. లక్ష్మణరేఖను దాటినప్పుడల్లా కొరడా దెబ్బల్లాంటి కోర్టు తీర్పులు, కళ్ళు బైర్లుకమ్మేలా ప్రజాందోళనలు మాత్రమే వారిని అదుపులో పెట్టగలుగుతాయి. చట్టం వికటాట్టహాసం చేస్తున్నపుడు దారిలో పెట్టాల్సిన ప్రభుత్వం ఏమైనా చేస్తుందనుకోవడం మన భ్రమ మాత్రమే. ఇంత మంచి పుస్తకం అనువాదం రూపంలో అందించిన హైదరాబాద్ బుక్ ట్రస్టుకు అభినందనలు.
(ఈ పరిచయ వ్యాసం వీక్షణం మాస పత్రికలో ఇదివరకే ప్రచురితమైంది.)
దుప్పల రవికుమార్
http://chaduvu.wordpress.com
సౌజన్యంతో
నాన్న
రాజన్ తండ్రి అన్వేషణ
ప్రొఫెసర్ టి.వి. ఈచర వారియర్
ఆంగ్ల మూలం:Memories of a Father, Asian Human Rights Commission/ jananeethi, 2004, Hong Kong / Thrissur Copy right : T.V. Eachara Varier, 2005
తెలుగుసేత: సి. వనజ
59 పేజీలు, వెల : రూ.25
Tuesday, October 14, 2008
వైద్యులారా, రోగుల వద్దకు మీరే వెళ్లండి. ... డాక్టర్ నార్మన్ బెతూన్ జీవితగాధ ... రక్తాశ్రువులు
ఆయన జీవించిందీ, పని చేసిందీ, పోరాడిందీ మూడు దేశాల్లో. ఒకటి స్వదేశమైన కెనడాలో, రెండు ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రప్రధమ ప్రజా ప్రతిఘతనా సమరం జరిగిన స్పెయిన్ లో, మూడు చైనా లో. ఒక ప్రత్యేకార్థంలో ఆయన ఈ మూడు దేశాలకు చెందినవాడు. విపులార్థంలో పీడనకు వ్యతిరేకంగా పోరాడే సమస్త ప్రజనీకానికి ఆయన చెందుతాడు.
డాక్టర్ బెతూన్ చనిపోయాక ఆయన స్థాపించిన అంతర్జాతీయ చికిస్తాలయాల్లో ఒక దానికి భారతీయ వైద్యబృందానికి చెందిన డాక్టర్ కొట్నీస్ డైరెక్టర్ పదవి స్వీకరించాడు. డక్టర్ బెతూన్ విడిచివెళ్లిన బాధ్యతల్ని డాక్టర్ కొట్నీస్ సాహసోపేతంగా నిర్వర్టిస్తూ విధి నిర్వహణలో మరణించాడు. చాగ్ కై షేక్ ప్రభుత్వం విధించిన దిగ్భంధనల ఫలితంగా మరణించిన అనేక మందిలో డాక్టర్ బెతూన్, డాక్టర్ కొట్నీస్ ఇద్దరు. ఆ దిగ్భందం లేకపోతే వారు యింకా జీవించి వుంటూ, ప్రప్రంచంలో ప్రజల విముక్తి లక్ష్యం కోసం పోరాడుతూ వుండేవాళ్లు.
నవ చైనా డాక్టర్ బెతూన్ ని ఎన్నడూ మరచిపోదు.
- మదాం సన్ యట్ సేన్
రెండుసార్లు మరణించి ఎప్పటికీ బతికుండే వీరుడి కథ
.................................
వీధుల్లో, సందుల చివర, ఇంటి ముందర గేటు దగ్గర, సినిమా హాలు రేకు కప్పుల నీడన, టీ బడ్డీల దగ్గర గంటల తరబడి దేశం గురించి, సమాజం గురించి, తమ ఈడు ఆడపిల్లల గురించి చర్చించుకుని, వ్యాఖ్యానించుకుని, పుకార్లు ప్రచారం చేసుకుని గడిపే యువతరం ఒక మూడు గంటలు (గట్టిగా ఒక సినిమా చూసినంతసేపు) కేటాయించగలిగి ఒక పుస్తకం చదివితే చాలు. ఈ దేశంలో కొన్ని కోటానుకోట్ల పనిగంటలు సద్వినియోగమవుతాయి. ఆ పుస్తకం ఏ మత ప్రబోధాల గ్రంథమూ కాదు. ఇటీవల మార్కెట్టును ముంచెత్తుతున్న వ్యక్తిత్వ వికాస పుస్తకమూ కాదు. ఒక నవల. ఒక డాక్టర్ జీవితాన్ని చిత్రించిన సాధారణ నవల. టెడ్ అలెన్, సిడ్నీ గోర్డన్ లు రాసిన “ది స్కాల్ పెల్, ది స్వోర్డ్” నవల. ఈ మహత్తర గాథను తెలుగులోకి సహవాసి “రక్తాశ్రువులు” పేరుతో సంక్షిప్తానువాదం చేశారు. కేవలం అనువాద నైపుణ్యం గురించే రెండు పేజీల వ్యాసం రాయొచ్చు. అంతటి స్ఫూర్తిదాయకమైన “రక్తాశ్రువులు”ను ఈ వారం పరిచయమ్ చేస్తున్నాను.
స్పెయిన్, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి పరిపూర్ణ నిస్వార్ధ దీక్షతో, అంతర్జాతీయతా చైతన్యంతో, ఆ లక్ష్యసాధన కోసం నిర్విరామ కృషిచేసి, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన డాక్టర్ నార్మన్ బెతూన్ జీవిత కథ ఈ ‘రక్తాశ్రువులు’. ఇంతే కథ. కానీ ఆ సాహసోపేత జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచించండి. కష్టపడి పనిచేసేవారిని గొడ్డులాగా పనిచేస్తున్నాడని అంటాం. వంద అడుగుల దూరంలో జపాన్ బాంబులతో దాడి చేస్తుండగా 69 గంటలలో నిద్రాహారాల జోలికి పోకుండా 115 మంది గాయపడ్డ వాళ్లకు చికిత్స చేసి ఇరవై ఆపరేషన్ల తరువాత వున్న మందులన్నీ అయిపోతే, మత్తుమందు లేకుండా పదిగంటలపాటు సైనికులకు శస్త్ర చికిత్సలు చేస్తూనే వున్న వాడిని ఏమనాలి? ‘పని రాక్షసుడు’ అనొచ్చా? చైనా ప్రజలు సరిగ్గా అదే పేరు పెట్టారు - పాచూ ఎన్.
కెనడాలో పుట్టి, వైద్య విద్యను అభ్యసించి, మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని, ఎం.డి. పట్టా పుచ్చుకున్నాక లండన్ వెళ్లి, తనకు లలిత కళల పట్ల ఉన్న మోజంతా తీర్చుకుని, అక్కడ్నుంచి ఎఫ్.ఆర్.సి.ఎస్. పరీక్షల కోసం ఎడింబరో వెళ్లి, అక్కడ ఫ్రాన్సిస్ అనే సంపన్నురాలు, అందమైన యువతిని ప్రేమించి పెళ్లాడాడు బెతూన్. కానీ అతడి జ్ఞానతృష్ణ తీరని దాహం. అహం దేనికోసమో అర్రులు చాస్తుంది. అతనేవేవో పనులు చేస్తున్నాడు. అవేవీ నచ్చక విడిచి పెడుతున్నాడు. విపరీతంగా తాగడం, విపరీతంగా చదవడం, కఠోరంగా బతకడం… వివాహ సంబంధం బీటలు వారింది. యూరప్ నుంచి తిరిగి వచ్చే ముందర తనే ఇలా అనుకుంటాడు. ‘తన శృంగార యాత్ర ఒక వెక్కిరింత.. తన వివాహం ఒక వెక్కిరింత.. తన బ్రతుకొక వెక్కిరింత..’.
నార్మన్ బెతూన్ భార్యతో సహా డెత్రాయిట్ లో వైద్యవృత్తి మొదలుపెడతాడు. పేదలు సాదలు, బీదాబిక్కీ, అనారోగ్యం అజ్ఞానంతో నలిగినాక డబ్బున్న పేషెంట్లు తగులుతారు. ఆ డబ్బంతా పేదల కోసం వెచ్చించడం.. ఆర్థిక పరిస్థితి అతలాకుతలం.. క్షయ వ్యాధి సోకుతుంది. ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా చెడిపోయి ట్రూడో శానిటోరియంలో రోజులు లెక్కపెట్టుకుంటూ మృత్యువుకోసం ఎదురు చూస్తుంటాడు. ఫ్రాన్సిస్ కు విడాకులు మంజూరైపోయాయి. అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో నార్మన్ బెతూన్ ఒక పుస్తకం చదువుతాడు. డాక్టర్ జాన్ అలెగ్జాండర్ రాసిన గ్రంథమది. ఎలాగూ చావు తప్పదు, ప్రయత్నించి చూద్దామని తానే గినీ పందిగా మారుతాడు. చివరికి వైద్య బృందం అంగీకరించి ఎడమ ఊపిరితిత్తిని స్తంభింపజేస్తారు. ఒకే ఊపిరితిత్తితో కొనప్రాణంతో బయటపడతాడు బెతూన్.
గొప్ప సర్జన్ కావాలన్న తన చిన్ననాటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో డాక్టర్ ఎడ్వర్డ్ ఆర్చిబాల్డ్ దగ్గర అసిస్టెంట్ గా చేరుతాడు. ఇక వెనక్కి తిరిగి చూడకుండా శ్వాసకోశ శస్త్ర చికిత్సలో ప్రపంచంలోనే అతిపెద్ద, గొప్ప నిపుణుడని పించుకుంటాడు. పేరు ప్రఖ్యాతులతో పాటు సంపద, పదవులు వచ్చి చేరుతాయి. మళ్లీ ఫ్రాన్సిస్ తో ప్రేమరాయబారం నడుపుతాడు. కాని వృత్తిపట్ల పెంచుకున్న మమకారం భార్యను నిర్లక్ష్యం చేయిస్తుంది. మళ్లీ కలిసిన ఫ్రాన్సిస్ ఈసారి శాశ్వతంగా విడిపోతుంది. బెతూన్ ఒంటరివాడవుతాడు. పూర్తిగా వైద్యమొక్కటే అతని ప్రపంచమైపోతుంది. వైద్య వ్యాపారం చేయడమ్ సహించలేకపోతాడు. వృత్తిపరమైన హక్కులకన్నా మానవ హక్కులు గొప్పవంటాడు. నెమ్మది నెమ్మదిగా కమ్యూనిజం వైపు ఆకర్షితుడవుతాడు.
ఇంతలో స్పెయిన్ దురాక్రమణ ప్రారంభమవుతుంది. కెనెడియన్ వైద్య సహాయ బృందంగా పనిలో దిగి రక్తదానం కార్యక్రమం చేపడతాడు. బీభత్సమైన యుద్ధరంగంలో ప్రాణదాతగా తొమ్మిది నెలలపాటు సుడిగాలికంటే వేగంగా పర్యటించిన బెతూన్ పోరాటానికి విరాళాలు సేకరించే పనిమీద స్వదేశంలో పర్యటిస్తాడు. కెనడా, అమెరికాలలో ఏడు నెలలపాటు పర్యటించి, ప్రసంగాలు చేస్తాడు. అంతలో చైనామీద జపాన్ దురాక్రమణ దాడి ప్రారంభమవుతుంది. వెoటనే చైనా చేరుకుని యుద్ధరంగంలో వైద్య సేవలు మొదలుపెడతాడు. క్షతగాత్రులను హాస్పిటల్ కు చేర్చడంకంటే క్షతగాత్రుల దగ్గరకే వైద్య సహాయం చేరితే బావుంటుందన్న బెతూన్ సూచనకు మావోసేటుంగ్ అవాక్కయిపోతాడు. 29 నెలలపాటు గెరిల్లా యుద్ధవీరులకు వైద్య సహాయం అందించిన బెతూన్ సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోకుండా నిర్లక్ష్యం చేసి యాభై ఏళ్ల వయసులోనే రెండోసారి నిజంగా మరణిస్తాడు.
కవి, విద్యావేత్త, సైనికుడు, విద్యార్థి, చిత్రకారుడు, శరీర ఉపశమనకారుడు, స్వాప్నికుడు, శాస్త్రవేత్త, అన్నింటినీ మించి ప్రజల పట్ల గాఢానురాగం, జీవన విచ్చినకుల పట్ల అంతులేని జుగుప్స, భవిష్యత్తులో అనంత విశ్వాసం నిండిన మానవతా మూర్తి, పాచూ యెన్, లావో జెన్ చా, కామ్రేడ్ డాక్టర్ నార్మన్ బెతూన్ ప్రాత: స్మరణీయుడు. ఒక చేత్తో వైద్యం, మరో చేత్తో ప్రసంగాలు, ఇంకో చేత్తో వైద్య శాస్త్ర గ్రంథాలు, మరింకో చేత్తో సామాజిక నాయకత్వాన్ని తయారుచేయడం, ఇతర చేతుల్తో సమాజాన్ని ప్రక్షాళన చేసేందుకు కృషి చేయడం.. ఇంకా ఇలా చెప్పాలంటే పని.. పని.. పని.. అంతే. అదే బెతూన్ జీవన విధానం. జీవితం. ప్రపంచ యువతకు మార్గ దర్శకం.
పరిచయ వ్యాసంలో కథంతా చెప్పడాన్ని వ్యక్తిగతంగా నేనిష్టపడను కానీ, ఇదంతా చదివాకైనా మన యువత ఈ పుస్తకాన్ని చదువుతారని కక్కుర్తి. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తొలి ప్రచురణగా విడుదల చేసిన ఈ ‘రక్తాశ్రువులు’ నవల వెల 18 రూపాయల 50 పైసలు మాత్రమే. (పేజీలు 256). మరి మీరూ చదువుతారుగా.
దుప్పల రవి
http://chaduvu.wordpress.com
సౌజన్యంతో
రక్తాశ్రువులు
ఆంగ్ల మూలం : The Scalpel, The Sword, Sydney Gordan, Ted Allen
తెలుగు అనువాదం : సహవాసి
Monday, October 13, 2008
ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర ... రెండు భాగాలు ... రచన : కంభంపాటి సత్యనారాయణరావు ... తెలుగు సంక్షిప్తానువాదం : మహీధర రామమోహనరావు
మనకింతకు పూర్వం రచించిన ఆంధ్రదేశ చరిత్రలున్నాయి. అవి సాధారణంగా రాజవంశాలనో, ప్రముఖ వ్యక్తులనో కీర్తిస్తూ సామ్రాజ్య విస్తీర్ణతను ప్రశంసించేవిగా వున్నాయి.
శాతవాహనులు తెలుగువారేనా? విజయనగర సామ్రాజ్యం తెలుగువారిదేనా? కాకతీయుల వర్ణమేది? ఇట్లాంటి ప్రశ్నలకు ఆ చరిత్ర గ్రంథాల్లో ప్రాధాన్యత ఎక్కువ.
ప్రజల సాంస్కృతిక చరిత్రను సాహిత్యం ద్వారా పునర్నిర్మించటానికి సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) కృషిచేసి ఆంధ్రుల సాంఘిక చరిత్రను ప్రకటించారు.
ఆ తరువాత ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందు శేఖరం గార్లు ఆంధ్రుల సంస్కృతి చరిత్ర-సంస్కృతి అనే గ్రంథం రచించారు. ఇందులో సాంస్కృతికాంశ పూర్వపు చరిత్రలకన్నా కొంత ఎక్కువ వున్న మాట నిజమే. అయినా ఈ రెండు పుస్తకాలు సమాజ ఆర్థిక వ్యవస్థను గురించి పట్టించుకొన్నవి కావు.
కంభంపాటి సత్యనారాయణగారు స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి వివిధ ప్రజోద్యమాల్లో పాల్గొన్నారు. బహు గ్రంథ రచయితలు.
వారు మార్క్సిస్టు మూలసూత్రాల వెలుగులో ఆంధ్ర దేశ ప్రజల ఆర్థిక సాంస్కృతిక చరిత్రను ఇంగ్లీషులో రచించారు. ఆయన పరిణత వయస్సులో బహు ప్రయాసల కోర్చి, ఎన్నో గ్రంథాలు పరిశీలించి స్వత్సంత పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రూపొందించారు.
యూరపులో ఫ్యూడలిజానికి, మన దేశంలో చిరకాలం వర్థిల్లిన స్వయం పూర్ణ గ్రామీణ వ్యవస్థకూ భేదాల్ని చాలా స్వతంత్రంగా ప్రతిపాదించారు. ఈ పద్ధతిలో ఆంధ్ర దేశానికి చరిత్ర కూర్చటం ఇదే ప్రథమం.
తరవాత రాబోయే విపుల చరిత్రలకు ఇది మార్గదర్శకం అవుతుందని మా నమ్మకం.
ఈ పుస్తకంలో చేసిన ప్రతిపాదనలు తుది నిర్ణయాలనే భ్రమ రచయితకూ లేదు. ప్రకాశకులకూ లేదు.
ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవితం ఆధారంగా నవలలు రచించిన సుప్రసిద్ధ రచయిత మహీధర రామమోహనరావుగారు ఈ గ్రంథాన్ని తెలుగు చేసి పెట్టారు. రామమోహనరావు గారు కూడా బహుగ్రంథ రచయితలేగాక, ప్రజోద్యమాల్లో జీవితాన్ని పండించుకున్నవారు. వారి సరళమైన అనువాదం ఈ పుస్తకాన్ని ఆకర్షణీంగా తయారు చేసిందని మా నమ్మకం.
మొదటి భాగంలో 1. చరిత్ర పూర్వయుగం, 2. సజీవ చరిత్ర పూర్వదశ 3. శాతవాహన యుగం 4. తెగ సంస్కృతి నుంచి నాగరికతకు పరివర్తన 5. శాతవాహనుల అనంతరపు వ్యవస్థా రూపం 6. ఫ్యూడల్ వ్యవస్థ పునాదులు 7. మధ్య యుగాల ఆరంభ దశ 8. ఫ్యూడల్ వ్యవస్థ పుట్టుక పెరుగుదల అనే ప్రకరణాలున్నాయి.
రెండవ భాగంలో 1. వరంగల్లు కాకతీయులు 2. వరంగల్లు కాకతీయులు వాణిజ్యం, సాహిత్యం కళలు 3. కాకతీయుల తదనంతరులు 4. బహమనీ రాజవంశం 5. గజపతుల కళింగ రాజ్యం 6. విజయ నగర సామ్రాజ్యం 7. విజయనగర రాజ్య పరిపాలనా వ్యవస్థ 8. విజయనగర రాజ్య ఆర్థిక విధానం 9. విజయనగరం సామాజిక స్థితి 10. విజయనగర సాహిత్యం కళలు, 11. కుతుబ్‌షాహీ రాజవంశం 12. కుతుబ్‌షాహీల పరిపాలనా వ్యవస్థ 13 కుతుబ్‌షాహీల ఆర్థిక నిర్మాణం 14. కుతుబ్‌షాహీ యుగ మతం సమాజ స్థితి 15. కుతుబ్‌షాహీ యుగ సాహిత్యం-కళలు 16 ఆర్థిక వ్యవస్థలో సరికొత్త మార్పులు: విదేశీ పెట్టుబడుల పాత్ర మొదలైన అధ్యాయాలున్నాయి.
ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర - 1
190 పేజీలు వెల: రూ.50
ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర - 2
274 పేజీలు వెల : రూ.75
రచన: కంభంపాటి సత్యనారాయణ
తెలుగు సంక్షిప్తానువాదం : మహీధర రామ మోహనరావు
ఆంగ్ల మూలం : A Study of the History and Culture of the Andhras by Kambhampati Satyanarayana, Peoples's Publishing House, New Delhi.
Saturday, October 11, 2008
వాస్తు - నిజానిజాలు ... ఆర్.వి.కొల్హాట్కర్, జెఎన్‌టియు ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్
ఇటు మూఢ నమ్మకాలు, అటు ఫ్యాషన్లు మన సమాజాన్ని అంటురోగాల్లా అలుముకుంటున్నాయి. యువకులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడాలేకుండా అందర్నీ అవి లొంగదీసుకుంటున్నాయి. ప్రవాహంలా వచ్చిపడుతున్న వాటి ధాటికి హేతువాద దృక్పథం, తర్కం, విచక్షణ, వివేకం అన్నీ మట్టిగొట్టుకుపోతున్నాయి.
నిజమే, వాస్తుశాస్త్రం చాలా ప్రాచీనమయినది. అందుబాటులో వున్న సామాగ్రిని బట్టి ఆనాడు ఇళ్లు ఎట్లా కట్టాలో చెప్పేవారు. అట్లాగే వైద్యరంగంలోనూ ప్రాచీన కాలంలో కొన్ని చికిత్సా పద్ధతులు ప్రాచుర్యంలో వుండేవి. కాలం గడిచే కొద్దీ వైద్యరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. అదేవిధంగా గృహనిర్మాణ రంగంలోనూ ఎంతో పురోభివృద్ధి జరిగింది. అయినా ఇంకా ప్రాచీన పద్ధతులనే పట్టుకుని వేలాడటం, వాస్తు పేరుతో గందరగోళం సృష్టించడం దారుణం.
వాస్తు అంటే నివాసం లేదా ఇల్లు అని అర్థం. మన పూర్వీకులు ఒకప్పుడు గుహల్లో నివసించారు. తరువాత ఆకులతో కుటీరాలు నిర్మించుకున్నారు. తరువాత మట్టితో ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు సిమెంట్‌తో ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు.
ప్రాచీన కాలంలో మాయామాతా, వరాహమిహిరుడు, మానసారుడు మొదలైనవారు వాస్తు శాస్త్ర గ్రంథాలు రాశారు. అయితే వాళ్లు భిన్న ప్రాంతాలకు చెందిన వాళ్లు కావడంతో వాళ్ల అభిప్రాయాల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. ఈనాటి అపర వాస్తు పండితుల అభిప్రాయాల్లో కూడా అట్లాంటి అభిప్రాయభేదాలను మనం గమనించవచ్చు.
ఆధునిక ఆర్కిటెక్ట్‌లు ఎంతో శ్రమించి ఇళ్లకు అద్భుతమైన ప్లాన్లు గీసి ఇస్తే అవన్నీ ఈ కుహనా వాస్తు పండితుల సలహాలతో అస్తవ్యస్తమవుతున్నాయి. ఆ పండితుల హద్దులకు లోబడకపోతే ఆర్కిటెక్టులు తమ ఉపాధినే కోల్పోయే దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది. వాస్తు పిచ్చి మన సమాజంలో రోజురోజుకూ ముదిరిపోతోంది. వాస్తుపండితులు గృహస్థులను రకరకాలుగా భయపెడుతున్నారు. ... ఇట్లా కట్టావంటే నీ కొడుక్కో కూతురుకో ప్రాణగండం వుంటుంది ... నీ భార్య అనారోగ్యం పాలవుతుంది ... నీ సంసారంలో గొడవలు, అశాంతి చెలరేగుతాయి ... నీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ... అంటూ బెంబేలిత్తిస్తుంటారు. దాంతో ఎందరో చక్కగా కట్టుకున్న ఇళ్లను కూడా వేలకు వేలు ఖర్చుపెట్టి అనవసరంగా చెడగొట్టుకుంటున్నారు.
మన దేశంలో రాజకీయ నాయకులకు ఈ వాస్తు భయం మరింత ఎక్కువగా వుంది. కారణం అన్ని రంగాలకన్నా అస్థిరమైంది రాజకీయ రంగం. వాళ్ల భయాలు, మూఢనమ్మకాలు మొత్తం సమాజం మీద మరింత గాఢంగా ప్రభావం చూపుతున్నాయి.
ఎన్.టి.రామారావు కి ఈ వాస్తు భయాలు పుష్కలంగా వుండేవి. పర్యవసానంగా ఆయన తన ఇంటికి ఎన్నో మార్పులు చేర్పులు చేయించారు. కానీ అవేమీ ఆయనకు కలిసిరాలేదు. ఆయన తన ముఖ్యమంత్రి పదవినే కాదు చివరికి ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అట్లాగే దేవెగౌడ ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు వాస్తు పండితుల సలహా మేరకు భవనానికి ఎన్నో మార్పులు చేయించారు. అయినా సంవత్సరం గడిచే లోగానే ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు.
ఇవాళ ఏ రియలెస్టేట్ ప్రకటన చూసినా మా ఇండ్లు, ఫ్లాట్లు పక్కా వాస్తు ప్రకారం నిర్మించబడ్డాయన్న మాట విధిగా కనిపిస్తుంది. అశాస్త్రీయంగా కట్టిన వాటిని శాస్త్రీయంగా వున్నాయని నమ్మింపజేసే ప్రయత్నమంటే ఇదే. అసలు ఈ వాస్తు పిచ్చి మొదట ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలయింది. క్రమంగా దేశమంతటికీ వ్యాపించింది. విచిత్రం ఏమిటంటే చివరికి అనేకమంది ముస్లింలు సైతం ఈ వాస్తును బహిరంగంగానో రహస్యంగానో పాటిస్తున్నారు.
వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం ఇంటికి దక్షిణ ద్వారం వుండకూడదు... అది అశుభం అంటారు. కానీ ఏ నగరం లోనైనా నాలుగు రోడ్ల కూడలికి వెళ్లి చూడండి అనేక షాపుల ద్వారాలు దక్షిణాభిముఖంగా కనిపిస్తాయి. అది అనివార్యం కూడా. అవన్నీ నష్టాల్లో మునిగితేలుతున్నాయా? అంతెందుకు అగ్రగామి దేశమైన అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా దక్షిణాభిముఖంగానే వుంది.
వాస్తుపండితులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఇట్లాంటి అపోహలను అనంతంగా ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారు. వాస్తు గుట్టు రట్టు చేయడానికి తన వ్యాసాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, బహిరంగ చర్చల ద్వారా ప్రొఫెసర్ ఆర్.వి. కొల్హాట్కర్ విశేషంగా కృషి చేస్తున్నారు. వారి కృషికి మద్దతు పలుకుతూ వాస్తు పై ఆయన రాసిన ఈ చిన్న వ్యాసాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ విస్తృత చర్చ నిమిత్తం ప్రజలకు అందిస్తోంది.
వాస్తు - నిజానిజాలు
ప్రొఫెసర్ ఆర్.వి.కొల్హాట్కర్
తెలుగు అనువాదం: రవి
10 పేజీలు, వెల: రూ.2
Friday, October 10, 2008
హిందూ సామ్రాజ్యవాద చరిత్ర ... స్వామి ధర్మతీర్థ
మనది దేవుళ్లను విశ్వసించే జాతి. మనం మానవ వ్యవహారా లన్నింటికీ ఆధ్యాత్మికంగానే మార్గదర్శకత్శం లభిస్తుందని నమ్మేవాళ్లం. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లం. ఆయా దేశాలు చేసుకున్న కర్మలను బట్టే వాటి ఫలితం రాసిపెట్టివుంటుందని భావిస్తాం. ఎన్నో సుదీర్ఘ శతాబ్దాలుగా మన దురదృష్టాలకు మన కర్మఫలమే కారణమనుకుంటాం.
ఇప్పుడు మనం మన గతాన్ని తవ్వాలి. మనం ఎక్కడ పొరపాటు చేశామో నిర్భయంగా పరిశీలించాలి.
వాటిని ఎలా సరిదిద్దుకోగలమో ఆలోచించాలి.
మనం మన గతం తాలూకు ఊహాత్మక గొప్పదనంపై ఆధారపడి మాత్రమే ఒక ఆధునిక జాతిని నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం తప్ప ప్రస్తుతం సాధించిన అంశాలపై ఆధారపడికాదు. మనల్ని మనం భ్రమల్లో ముంచెత్తుకుంటున్నామే తప్ప వాస్తవాల లెక్కలు తేల్చుకోవడంలేదు. మన బోధనాభ్యాస మంతా మనం మిగతా ప్రపంచ మానవాళి కంటే ఉన్నతమైన జాతి వారమని విశ్వసించే విధంగా సాగింది.
..........
హిందువుల విషయంలో అన్ని అధికారాలూ ఒక చిన్న వర్గం చేతిలో శతాబ్దాలుగా వుంటూ వచ్చాయి.
ఆ దోపిడీదారుల జీవితం, ప్రయోజనాలు ఇప్పటికీ దేశంలోని అశేష ప్రజల ప్రయోజనాలకు నష్టదాయకంగా వున్నాయి. పవిత్ర గ్రంథాలూ, సామాజిక నిర్మాణం, మతసంస్థలూ, రాజ్యం అన్నీ వారి దోపిడీని కొనసాగించేందుకు అనుకూలంగా రూపొందాయి. ఇప్పటికీ అవి ప్రజలను అజ్ఞానంలో ముంచెత్తి, వారిని అనైక్యులను చేసి, బానిసత్వంలో మగ్గేలా చేస్తున్నాయి.
..........
బ్రాహ్మణ వాదం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనది కాదు. ప్రారంభించి ప్రచారం చేసింది బ్రాహ్మణులే అయినప్పటికీ అది వారికే పరిమితమై లేదు. రాను రాను ఇతర హిందూ కులాలు, విదేశీ దండయాత్రికులు, రాజులు దాన్ని సమర్థించి తమ స్వంత ప్రయోజనాలకు వాడుకున్నారు. తమ దండయాత్రలకు, దోపిడీకి బ్రాహ్మణవాదం తోడ్పడటంతో దానిని వారు ప్రోత్సహించారు. తద్వారా బ్రాహ్మణ వాదం శక్తివంతమైన వాదంగా ఎదగడానికి దోహదపడ్డారు.
కుల వ్యవస్థనీ, పౌరోహిత క్రతువులనూ అందరు దోపిడీదారులూ ఉపయోగించుకున్నారు.
.........
బ్రిటీష్ సామ్రాజ్యవాదం సైతం మార్పునకు గురవుతోంది. కానీ బ్రాహ్మణ సామ్రాజ్యవాదం మాత్రం ఏ మార్పూ లేకుండా ఎప్పటిలా క్రూరంగా వుంది. తన మరణాంతక పట్టును ఏ మాత్రం సడలించకపోగా తన బరువు కింద బాధితులు నలిగిపోయి మరణించేట్టు చేస్తుంది. ఆరుకోట్ల మంది అస్పృశ్యులు హిందూ వాదాన్ని ఏకకంఠంతో నిరసించినా సరే అది తన పట్టును వీడదు. హిందూ సమాజం అంగాంగం ముక్కలు ముక్కలై పోతున్నాసరే దేవాలయాల ద్వారాల వెనుక బ్రాహ్మణమతం వర్థిల్లుతూనే వుంటుంది. భారతదేశం చచ్చినా బతికినా దానికేమీ లెక్కలేదు.
....
స్వామి ధర్మతీర్థ (1893-1978) అసలు పేరు పరమేశ్వర మీనన్. కేరళలోని ప్రఖ్యాతి గాంచిన హిందూ పుణ్య క్షేత్రమైన గురువాయూర్‌లోని ఒక అగ్రవర్ణ శూద్ర (నాయర్) కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సనాతన హిందువు. వృత్తి రీత్యా న్యాయవాది. కుల వ్యవస్థ పట్ల అచంచలమైన విశ్వాసం గలవాడు. అస్పృశ్యతను పాటించేవాడు. పరమేశ్వర మీనన్ చిన్నతనం నుంచే కులవ్యవస్థను, అంటరానితనాన్ని నిరసిస్తూ స్వంత ఇంటిలోనే తిరుగుబాటుదారుడుగా మారాడు.
కేరళలో వెనుకబడిన ఈళవ కులానికి చెంది సంఘ సంస్కర్త శ్రీనారాయణగురు బోధనలతో ఆయన ఎంతగానో ప్రభావితుడయ్యారు. శ్రీనారాయణ గురు ఆశ్రమంలో చేరి రెండేళ్లలోనే స్వామి ధర్మతీర్థగా మారిపోయారు.
పదేళ్లపాటు శ్రీనారాయణగురు ప్రబోధాలను ప్రచారం చేసిన అనంతరం ఆయన ఆశ్రమాన్ని విడిచిపెట్టి కాలినడకన పరివ్రాజకుడై ప్రయాణిస్తూ భిక్షాటన చేస్తూ దేశంలోని అన్ని దేవాలయాలను సందర్శించారు. ఈ క్రమంలోనే హిందువుల గురించీ, హిందూ మతం గురించీ, కుల దౌష్ట్యం గురించీ క్షుణ్ణంగా తెలుసుకున్నారు. హిందూ దేవాలయాలే ఈ మూఢవిశ్వాసాలకు, దోపిడీకి, అనైతికతకూ మూలకేంద్రాలన్న అవగాహనకు వచ్చారు. ఆయన రాజమండ్రి ఆశ్రమంలో వుండగానే హిందూమతంపై తన పరిశోధనను కొనసాగించారు. ఎట్టకేలకు తన రాత ప్రతితో బయటకు వచ్చారు.
ఆయన రాసిన ఈ పుస్తకం తొలుత ది మెనేస్ ఆఫ్ హిందూ ఇంపీరియలిజం పేరిట 1941లో లాహోర్‌లో వెలువడింది.
బ్రాహ్మణవాద హిందూమతంతో సుదీర్ఘకాలం పెనుగులాడి పోరాటం చేసిన తర్వాత తాను ఇంకెంతమాత్రం హిందువుగా కొనసాగలేనని గ్రహించి తన 56వ యేట హిందూమతాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారు. చివరికి ఆయన 1978లో హిందూయేతరుడిగానే మరణించారు. స్వామి ధర్మతీర్థ తన జీవితాన్ని కరిగించి చరిత్రను మధించి సారాన్ని వడపోసి రూపొందించిన ఈ పుస్తకాన్ని మనకు కానుకగా అందించారు.
హిందూ సామ్రాజ్యవాద చరిత్ర
- స్వామి ధర్మతీర్థ
ఆంగ్లమూలం : First published as "The Menace of Hindu Imperialism", Lahore, 1941, later reprinted as THE HISTORY OF HINDU IMPERIALISM, 1946 (Lahore) 1948 (Delhi), 1949 (Trivandrum) and 1992 (Babasaheb Ambedkar Foundation, Kottayam.
తెలుగు అనువాదం : కలేకూరి ప్రసాద్
మొదటి ముద్రణ:1998
116 పేజీలు, వెల : రూ.30/-
Thursday, October 9, 2008
మన విశ్వవిద్యాలయాల్లోకి జ్యోతిషం చెదలు? ... కె.అశోకవర్ధన్ శెట్టి, వై.నాయుడమ్మ, ఎస్.జి.కులకర్ణి
నక్షత్రాలు చూడటం, జ్యోతిషం, రాశుల ఆధారంగా అదృష్ట, దురదృష్ట సంఘటనలను ముందే చెప్పటం, భవిష్యత్తులో సంభవించే మంచిచెడ్డలను జోస్యం చెప్పడం ఇవన్నీ నిషిద్ధం.
..... గౌతమ బుద్ధుడు
జ్యోతిషం లాంటి మార్మికమైన విషయాలన్నీ కూడా చాలా వరకు బలహీన మనస్తత్వానికి చిహ్నాలు. కాబట్టి అవి మన మనసుల్ని ఆక్రమిస్తున్నాయని అనిపించగానే మనం డాక్టరును సంప్రదించటం, మంచి ఆహారం, విశ్రాంతి తీసుకోవడం మంచిది.
... స్వామి వివేకానంద
భూమి ఈ విశ్వాంతరాళానికి కేంద్రం కాదని తేలిన మరుక్షణం... జ్యోతిషం అర్థరహితంగా మారిపోయింది.
.... ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్
వంద అబద్ధాల్లో ఒక నిజం చెప్పి జ్యోతిష్కులు ఎంత హాయిగా గడిపేస్తున్నారు! అదే వేరే ఎవరన్నా అయితే వంద నిజాలు చెప్పి ఒక్క అబద్ధం ఆడినా వాళ్లకున్న పరపతి మొత్తం పోతుంది.
... ఫ్రాన్సిస్కో గిసియార్డినీ (1483-1540)
జ్యోతిషంతో జగడమన్నది ఇవాల్టిది కాదు.
బహుశా జ్యోతిషం పుట్టటంతోటే దానిని వ్యతిరేకించే వాదాలు కూడా పుట్టి వుంటాయి.
అహేతుకమైన ఆ సంప్రదాయాన్ని హేతుబద్ధ ప్రగతిశీల ఆలోచనా ధోరణి ఎన్నడూ ఆమొదించలేదు.
సామాజికంగా వ్యక్తిగతంగా ఎన్నో అనర్థాలకు, ఆయోమయాలకు దారితీసే అతి బలమైన మూఢనమ్మకం జ్యోతిషం.
దీనిని విశ్వవిద్యాలయాల్లో ఒక బోధనాంశంగా ప్రవేశపెట్టాలని ఇటీవల యూజీసీ నిర్ణయం తీసుకోవటం ... మన ఏలికల తలతిరుగుడు పెడమార్గానికి పరాకాష్ట.
పైకి పక్కా శాస్త్రంలా కనిపించే ఈ కుహనా విజ్ఞానం తరతరాలుగా ఎలా మనగలుగుతోంది?
మన సమాజంలో ఇదింతగా వేళ్లూనుకోవటానికి కారణాలేమిటి?
దీనిని మనం ఒక సైన్స్‌గా ఎందుకు పరిగణించలేం?
ఈ జాతకకాల తతంగం ఇట్లా నలుచెరగులా విస్తరించిపోవటానికి మన సైన్స్ రంగం అచేతనత్వం, వైఫల్యాలే కారణమా?
మన పాలకుల కార్యాచరణలోకి ఇప్పుడిది ఎందుకు వచ్చి చేరినట్టు?
తదితర ప్రశ్నలన్నింటినీ తరచి చూసేందుకు చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.
మన విశ్వవిద్యాలయాల్లోకి జ్యోతిషం చెదలు?
కె.అశోకవర్ధన్ శెట్టి, వై.నాయుడమ్మ, ఎస్.జి.కులకర్ణి
36 పేజీలు, వెల : రూ.10
Wednesday, October 8, 2008
కుల నిర్మూలన ... మార్క్సిస్ట్ దృక్పథం ... కంచ ఐలయ్య
భారత దేశంలో కలసి జీవించే స్వభావం లేకుండా చేసింది కులవ్యవస్థే.
అది మన సమాజాన్ని ముక్కలు ముక్కలుగా విభజించినట్టు ప్రపంచంలో ఏ ఇతర వ్యవస్థా మరే ఇతర సమాజాన్ని విభజించలేదనడం అతిశయోక్తికాదు.
దళిత బహుజన వర్గ ప్రజలు తరతరాలుగా దారుణ ఆణచివేతకు గురయ్యారు.
ఇక్కడి మాల మాదిగల పరిస్థితి అమెరికాలోని నీగ్రోల పరిస్థితిని మరపింపజేస్తుంది.
మహాత్మాగాంధీ మాల మాదిగలకు హరిజనులు అని కొత్తపేరు పెట్టి, అంటరానితనానికి వ్యతిరేకంగా కొన్ని ధర్మోపదేశాలు చేశాడు.
కానీ, ఆచరణలో వర్ణవ్యవస్థను ఆయన మరింత పటిష్టపరచడానికే పాటుపడ్డాడు.
అందుకే గాంధీజీ హరిజనోద్ధరణ వట్టి బూటకం అని ఆనాడే ఎండగట్డాడు అంబేడ్కర్.
ఆది నుంచీ మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలూ, విప్లవ గ్రూపులూ నిర్లక్ష్యం చేసిన సమస్యలలో అత్యంత ముఖ్యమైనది కుల సమస్య.
సుందరయ్యలాంటి వాళ్లు తమ పేరులోని కుల ప్రతీకలను తొలగించుకోవడం వంటి వ్యక్తిగత చర్యలు చేపట్టినా కుల నిర్మూలన కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.
పైగా కుల నిర్మూలనా పోరాటాల పట్ల, దళిత ఉద్యమాలపట్ల వారు ఉదాశీన వైఖరినే కనబరుస్తూ వస్తున్నారు.
మనదేశంలో కుల వ్యవస్థకు వర్గ స్వభావం వుంది.
అగ్రకులాలది దోపిడీ వర్గ స్వభావమైతే - శూద్ర, దళిత కులాలది శ్రామిక వర్గ దృక్పథం. ఎవరిదైనా సరే వర్గం మారవచ్చునేమో కానీ కులం మారేందుకు ఏ మాత్రం అవకాశంలేదు.
కుల వ్యస్థను ఎదిరించిన బౌద్ధమతాన్ని ఈ దేశం నుంచి పారదోలిందీ, అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి రామజన్మభూమి పేరిట మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదీ హైందవ బ్రాహ్మణత్వమే అంటారు కంచ ఐలయ్య.
కుల నిర్మూలన
మార్క్సిస్ట్ దృక్పథం
- కంచ ఐలయ్య
27 పేజీలు, వెల: రూ.7
అది మన సమాజాన్ని ముక్కలు ముక్కలుగా విభజించినట్టు ప్రపంచంలో ఏ ఇతర వ్యవస్థా మరే ఇతర సమాజాన్ని విభజించలేదనడం అతిశయోక్తికాదు.
దళిత బహుజన వర్గ ప్రజలు తరతరాలుగా దారుణ ఆణచివేతకు గురయ్యారు.
ఇక్కడి మాల మాదిగల పరిస్థితి అమెరికాలోని నీగ్రోల పరిస్థితిని మరపింపజేస్తుంది.
మహాత్మాగాంధీ మాల మాదిగలకు హరిజనులు అని కొత్తపేరు పెట్టి, అంటరానితనానికి వ్యతిరేకంగా కొన్ని ధర్మోపదేశాలు చేశాడు.
కానీ, ఆచరణలో వర్ణవ్యవస్థను ఆయన మరింత పటిష్టపరచడానికే పాటుపడ్డాడు.
అందుకే గాంధీజీ హరిజనోద్ధరణ వట్టి బూటకం అని ఆనాడే ఎండగట్డాడు అంబేడ్కర్.
ఆది నుంచీ మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలూ, విప్లవ గ్రూపులూ నిర్లక్ష్యం చేసిన సమస్యలలో అత్యంత ముఖ్యమైనది కుల సమస్య.
సుందరయ్యలాంటి వాళ్లు తమ పేరులోని కుల ప్రతీకలను తొలగించుకోవడం వంటి వ్యక్తిగత చర్యలు చేపట్టినా కుల నిర్మూలన కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.
పైగా కుల నిర్మూలనా పోరాటాల పట్ల, దళిత ఉద్యమాలపట్ల వారు ఉదాశీన వైఖరినే కనబరుస్తూ వస్తున్నారు.
మనదేశంలో కుల వ్యవస్థకు వర్గ స్వభావం వుంది.
అగ్రకులాలది దోపిడీ వర్గ స్వభావమైతే - శూద్ర, దళిత కులాలది శ్రామిక వర్గ దృక్పథం. ఎవరిదైనా సరే వర్గం మారవచ్చునేమో కానీ కులం మారేందుకు ఏ మాత్రం అవకాశంలేదు.
కుల వ్యస్థను ఎదిరించిన బౌద్ధమతాన్ని ఈ దేశం నుంచి పారదోలిందీ, అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి రామజన్మభూమి పేరిట మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదీ హైందవ బ్రాహ్మణత్వమే అంటారు కంచ ఐలయ్య.
కుల నిర్మూలన
మార్క్సిస్ట్ దృక్పథం
- కంచ ఐలయ్య
27 పేజీలు, వెల: రూ.7
Tuesday, October 7, 2008
పగటి కల ... గిజూభాయి ... పిల్లలకు ఆదర్శంగా నిలిచే, ప్రేరణనందించే భావి ఉపాధ్యాయులను, ఆహ్లాదకరమైన విద్యావిధానాన్ని అందించాలి.
ప్రస్తుత ప్రాథమిక పాఠశాలలో బోధించబడుతున్న విషయాలు, విధానాలు బాలలకు చాలా హానికరంగా వున్నాయి. విద్యార్హతను పరీక్షలతోనూ, బహుమతులతోనూ, పోటీలతోనూ, కుస్తీపట్లతోనూ కొలుస్తున్నారు. ఈ రకపు చదువుసంధ్యల ఫలితాలే దెబ్బలాటలు, ఈర్ష్య, ద్వేషం, అశాంతి, అసంతృప్తి, అదుపుతప్పటం, పరిస్థితి అస్తవ్యస్థంగా మారిపోవడం.
ఈ విధానానికి స్వస్తిపలకాలని, ఓ నూతన విధానాన్ని రూపొందించాలని ప్రఖ్యాత గుజరాత్ విద్యావేత్త గిజుభాయి ఎన్నో ప్రయోగాలు చేశారు. సత్ఫలితాలను సాధించారు. ప్రాథమిక విద్యారంగంలో మౌలికమైన మార్పులెన్నో ప్రవేశపెట్టారు. వాటిని తాను ఆచరించి రుజువుచేశారు. ఆయన తన పద్ధతుల్లో స్వయంగా దాదాపు ఆరు వందల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి విద్యాకార్యకర్తలుగా తీర్చిదిద్దారు.
గిజూభాయి పూర్తిపేరు గిరిజాశంకర్ భగవాన్‌జీ బగేకా. ఆయనను గుజరాత్‌లో ప్రజలంతా మూంచ్ వాలీ మా (మీసాలున్న అమ్మ) అని ఎంతో ప్రేమగా పిలిచేవారు. ఆయనకు పెద్ద మీసాలుండేవి. మాతృత్వానికి ఒక కొత్త కోణాన్ని చూపిన ఆయన వ్యక్తిత్వాన్ని ఆ పిలుపు ప్రేమగా ప్రతిబింబిస్తుంది.
కేవలం ఉద్యోగం జీతం డబ్బులు అనే పరిమిత స్థాయిలో జడంగా బతికేసే ఉపాధ్యాయులను కాకుండా ఆదర్శంగా, ప్రేరణ నిచ్చే వ్యక్తిత్వంతో, ధైర్యంతో ఒక ఆశయం కోసం జీవించే భావి ఉపాధ్యాయులను సృష్టించడమే గిజుభాయి పగటికల.
పగటి కల
గిజుభాయి
హిందీ మూలం: దివా స్వప్న
తెలుగు అనువాదం : పోలు శేషగిరి రావు
84 పేజీలు, వెల : రూ.16
మీ పిల్లలు టీవీ చూస్తారా? ... చిన్నారులపై టీవీ వ్యాపార ప్రకటనల ప్రభావం - ఒక పరిశోధన ... నమితా ఉన్ని కృష్ణన్, శైలజా బాజ్‌పాయ్
భారతదేశంలో టెలివిజన్ అనూహ్య వేగంతో అభివృద్ధి చెందింది. ఇవాళ ప్రతి ఇంట్లో మనకో టీవీ సెట్టు కనిపిస్తుంది. ఇంటింటికీ ఉపగ్రహ కేబుల్ టీవీ ప్రసారాలు చేరుతున్నాయి.
టీవీ ప్రేక్షకులలో అతి సులువుగా ప్రభావితులయ్యే దుర్బలురు చిన్న పిల్లలే. టీవీల్లో ప్రసారమయ్యే విభిన్న కార్యక్రమాలపట్ల వారు ఎక్కువగా ఆకర్షితులవుతారు.
టీవీ చూడటం సురక్షితమైన అ లవాటే అనే దృష్టితోనూ, పిల్లలు టీవీ ముందు కూర్చుంటే వాళ్లనిక పట్టించుకోవాల్సిన తలనొప్పి వుండదనే ఉద్దేశంతోనూ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని టీవీలకి అప్పగించేస్తుంటారు.
అసలు టీవీ వల్ల మనకూ, మన పిల్లలకూ ఏమిటి ఉపయోగం?
టీవీల్లో వచ్చే వ్యాపార ప్రకటనల మూలంగా మన పిల్లల చైతన్యం ఏ ప్రకారంగా రూపుదిద్దుకుంటోంది?
టీవీ చూసి వాళ్లేం నేర్చుకుంటున్నారు?
టీవీ అందించే సమాచారాన్ని, ప్రకటనల సందేశాలని మన పిల్లలు ఎలా స్వీకరిస్తున్నారు? మొదలైన అంశాలని అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం సాయపడుతుంది. తెలుగులో ఇట్లాంటి ప్రయత్నం జరగడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు.
నమితా ఉన్ని కృష్ణన్ ఈ పుస్తక పరిశోధనను పర్యవేక్షించారు. ఒక పత్రికా విలేఖరిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె విద్య, మీడియా విషయాల కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
శైలజా బాజ్‌పాయ్ టీవి టుడేకి డిప్యూటీ ఎడిటర్‌గా, పత్రికలలో టీవీ విమర్శకురాలిగా పనిచేస్తున్నారు.
... టీవీ ప్రకటనలు చాలా మంది చిన్నారులలో పెద్దవాళ్ల మాదిరిగా, శ్రీమంతుల స్థాయిలో జీవించాలనే కోరికను రగిలిస్తున్నాయి. అది వారి జీవితాలకు ఎంత అసందర్భమయినప్పటికీ, వారి ఆలోచనలను మేఘంలా కమ్మేస్తోంది. తమ చుట్టూ పెరుగుతున్న ఈ నూతన వినిమయ సంస్కృతిని వారిలో కొందరు గుర్తించగలుగుతున్నారు. మరికొందరు గుర్తించలేకపోతున్నారు. వారు ఆయోమయానికి, అసంతృప్తికి గురవుతున్నారు. స్వయం శక్తి మీద నమ్మకం కోల్పోతున్నారు. ఈ విధమైన ఒత్తిళ్లకు గురవుతున్న ఆ పసికందుల పక్షాన మాట్లాడడానికి ఈ పుస్తకంలో మేం ప్రయత్నించాం ...
మీ పిల్లలు టీవీ చూస్తారా?
నమితా ఉన్ని కృష్ణన్
శైలజా బాజ్‌పాయ్
ఆంగ్ల మూలం : The Impact of Television Advertising on Children, namita Unnikrishnan and Shailaja Bajpai, Sage, New Delhi, 1996, Copyright International Development Research Centre, 1996.
Telugu Translation : D. RAMA MURTHY
132 పేజీలు, వెల : రూ. 30
Monday, October 6, 2008
రైలు బడి ...టొటొచాన్ ... ప్రపంచంలోని ప్రముఖ భాషలన్నింటిలోకి అనువదించబడిన టెట్సుకొ కురొయనాగి అద్భుత రచన.
టోమో అనే బడి గురించి, దాన్ని స్థాపించి, నడిపిన సొసాకు కొబయాషి అనే వ్యక్తి గురించి రాయడం నేను ఎన్నాళ్లుగానో చేయదలచుకున్న పనుల్లో ఒకటి. నేను చిన్నప్పుడు ఆ బడిలోనే చదువుకున్నాను. ఇందులో ఏ సంఘటననూ కల్పించలేదు. అన్నీ నిజంగా జరిగినవే.
1945లో టోక్యోపై జరిగిన బాంబుదాడుల్లో టోమో నాశనమైపోయింది. అప్పటికి కొబయాషి దాన్ని తన స్వంత డబ్బుతో నిర్మించాడు. అందువల్ల పునర్నిర్మాణానికి ఎక్కువ వ్యవధి తీసుకుంది. యుద్ధం తర్వాత పాత స్థలంలోనే ఆయన ఒక కిండర్ గార్టెన్‌ని ప్రారంభించాడు. కొబయాషి 1963లో చనిపోయాడు.
ఇప్పుడు ఆ స్థలంలో పీకాక్ అనే సూపర్ మార్కెట్ వుంది. టోమో గానీ దాని ఆవరణ గానీ ఏమీ మిగలలేదు. అయినా పాత జ్ఞాపకాల ఉద్వేగంతో నేను ఒక రోజు అక్కడికి వెళ్లాను. ఒక మహా విషాదం నన్ను ఆవరించింది. నా చెక్కిళ్ల మీద కన్నీళ్లు వరద కట్టాయి.
నేను టోమోలో గడిపిన కాలం కొబయాషిలో ఉత్సాహం పొంగులెత్తున్న కాలం. ఆయన పథకాలు నిండుగా వికసిస్తున్న కాలం. యుద్ధం రాకుండావుంటే ఆయన సంరక్షణలోకి ఇంకా ఎంతెంత మంది చిన్నారి బాలలు వచ్చి ఉండేవారో తలచుకుంటే, ఎంత కృషి వ్యర్థమై పోయిందో కదా అని అంతులేని విచారం ఆవహిస్తుంది.
నేనీ పుస్తకంలో కొబయాషి విద్యాబోధనా పద్ధతులను వర్ణించడానికి ప్రయత్నించాను. పిల్లలందరూ ఒక స్వతసిద్ధమైన ఉత్తమ స్వభావంతో జన్మిస్తారని ఆయన నమ్మకం. ఈ మంచితనమంతా వాళ్ల వాతావరణం వల్లా, వాళ్ల మీద పెద్దల తప్పుడు ప్రభావాల వల్లా అతి సులభంగా ధ్వంసమై పోతుందని ఆయన అభిప్రాయం. ఆ మంచి స్వభావాన్ని వెలికి తీసి, అభివృద్ధిచేయడమే ఆయన లక్ష్యం. తద్వారా పిల్లల్ని వ్యక్తిత్వం గల మనుషులుగా తీర్చిదిద్దడం ఆయన ఆశయం.
టోమోలాంటి పాఠశాలలు గనుక ఇప్పుడున్నట్టయితే ఇవాళ మన సమాజంలో హింసా ప్రవృత్తి ఇంతగా వ్యాపించి వుండేదికాదనీ, మధ్యలో బడి మానేసే పిల్లల సంఖ్య ఇంత ఎక్కువగా వుండేదికాదని నేను బలంగా అనుకుంటాను. టోమోలో బడి అయిపోగానే ఇంటికి వెళ్లిపోవాలని ఎవరికీ అనిపించేది కాదు. ఉదయంపూట కూడా ఎప్పుడెప్పుడు బడికి చేరుతామా అని మాకెంత ఆత్రంగా వుండేదో...! అటువంటి అద్భుతమైన బడి అది...!
....
టెట్సుకో కురొయనాగి టోక్యోలో జన్మించింది. అందరికంటే ఎక్కువ ప్రజాదరణవున్న టివీ వ్యాఖ్యాతగా వరుసగా ఐదు సంవత్సరాల పాటు ఎన్నికయింది. చివరికి నటిగా స్థిరపడింది. ఆమె ఈ పుస్తకాన్ని జపనీస్ భాషలో ప్రచురించిన కొద్దిరోజుల్లోనే 45 లక్షల కాపీలు అమ్ముడయి అత్యధిక ప్రజాదరణ పొందిన పుస్తకంగా పేరు సంపాదించుకుంది. ప్రముఖ కవయిత్రి డొరొతి దీనిని ఇంగ్లీషులోకి అనువదించగా ఆ ఇంగ్లీషు ప్రతి కూడా జపాన్‌లో అత్యధికంగా అమ్ముడయిన ఇంగ్లీషు పుస్తకంగా రికార్డు సృష్టించింది. జపాన్‌లో నాలుగు లక్షల ఇంగ్లీషు ప్రతులు అమ్ముడయ్యాయి. ఈ పుస్తకం వల్ల ఆమెకు అనేక పురస్కారాలు, గౌరవాలు లభించాయి. యునిసెఫ్‌కు గుడ్‌విల్ అంబాసడర్‌గా నియమించబడింది.
రైలు బడి
టెట్సుకో కురొయనాగి
ఆంగ్లమూలం : First Published in Japanese, translated into English by Dorothy Britton and published as TOTTO-CHAN the little girl at the window.
తెలుగు అనువాదం : ఈశ్వరి, ఎన్. వేణుగోపాల్
118 పేజీలు, వెల : రూ.25
పిల్లల పెంపకం ... సమ్మర్ హిల్ అనుభవాలు ... ఎ.ఎస్. నీల్
సమ్మర్ హిల్ అన్నది ఎ.ఎస్.నీల్ (1883-1973) ఇంగ్లాండ్‌లో సఫోక్క్, లీస్టన్‌లో 1921లో స్థాపించిన నలభై ఏండ్లు నడిపిన చిన్న బడి పేరు.
ఇది విద్యలో జరిగిన అతి గొప్ప ప్రయోగం.
సమ్మర్ హిల్‌లో ఆరు తరగతులుండేవి. పిల్లలు వయసును బట్టి కాకుండా వారి సామర్థ్యాన్ని బట్టి ఆయా తరగతులకు వెళ్లేవారు. స్వేచ్ఛ పనిచేస్తుందన్న సత్యాన్ని నీల్ నిరూపించాడు. సమ్మర్ హిల్‌లో పిల్లలు తమకు ఇష్టమైనది చదవటానికి, అసలు చదవకుండా వుండటానికీ స్వేచ్ఛ వుండేది. తమకేంకావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తరువాత చాలా వేగంగా నేర్చుకోగలుగుతారని నీల్ అనుభవంలో చూశాడు. ఇతరుల స్వేచ్ఛ, భద్రతలకు భంగం కలగనంతవరకు పిల్లలకు తమ ఇష్టం వచ్చినది చేసే స్వాతంత్య్రం వుండేది. బడిని అందులో చదువుకునే పిల్లల సంతోషాన్ని బట్టి నీల్ అంచనా వేసేవాడు. సమ్మర్ హిల్‌లో స్వయం పాలనా విధానం వుండేది. బడి అసెంబ్లీలో ప్రతి విద్యార్థికి, టీచరుకి ఒక ఓటు వుండేది.
నీల్ తన అనుభవాలను సమ్మర్ హిల్ అన్న పుస్తకంలో పొందుపరిచాడు. అందులోని పిల్లల పెంపకం అన్న భాగాన్ని ఈ చిన్న పుస్తక రూపంలో మీ ముందుంచుతున్నాం.
పిల్లల పెంపకం గురించి నీల్ మాటల్లో చెప్పాలంటే ... అన్ని నేరాల, అన్ని ద్వేషాల, అన్ని యుద్ధాల మూలాలు దుఃఖంలోనే వున్నాయి. దుఃఖం ఎలా పుడుతుంది, అది మనుషుల జీవితాలను ఎలా నాశనం చేస్తుంది, దుంఖం లేకుండా పిల్లల్ని ఎలా పెంచవచ్చు అన్నవి తెలియచేసే ప్రయత్నమే ఈ పుస్తకం.
ఇందులోని అధ్యాయాలు 1. స్వేచ్ఛలేని శిశువు 2. స్వేచ్ఛా శిశువు 3. ప్రేమా ఆమోదం 4. భయం 5. ఆత్మన్యూనత-అభూత కల్పనలు 6. విధ్వంసకత 7. అబద్ధాలాడటం 8. బాధ్యత 9. విధేయత - క్రమశిక్షణ 10. బహుమతులూ - దండనలూ 11. దొడ్డికి కూర్చోవడం టాయ్‌లెట్ శిక్షణ 12. ఆహారం 13 ఆరోగ్యమూ నిద్ర 14. శుభ్రత బట్టలు 15. ఆటబొమ్మలు 16. గోల 17. అ లవాట్లు మర్యాద 18. డబ్బులు 19. హాస్యం.
పిల్లల పెంపకం
సమ్మర్ హిల్ అనుభవాలు
- ఎ.ఎస్. నీల్
ఆంగ్లమూలం : Child Rearing section from Summerhill by A.S.Neill
తెలుగు అనువాదం: కె. సురేష్
68 పేజీలు, వెల : రూ.15
Sunday, October 5, 2008
అమ్మా నాన్నలకు ... ఎ బుక్ ఫర్ పేరెంట్స్ ... ఏ.ఎస్.మకరెంకో
ప్రపంచ ప్రసిద్ధ విద్యావేత్తలలో ఒకరైన ఆంటన్ సెమ్యోనొవిచ్ మకరెంకో పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకోసం ప్రత్యేకంగా రాసిన పుస్తకం ఎ బుక్ ఫర్ పేరెంట్స్.
పిల్లలను కావాలనుకోవడమే ఒక బాధ్యతను స్వీకరించడమని, దానిని తల్లితండ్రులు గుర్తించాలని మకరెంకో అంటారు. బాధ్యతను చేపట్టడం అంటే వారిని జీవితంలో ఆర్థికంగా స్థిరపడేలా చూడగలగడం ఒక్కటే కాదని ఆయన కచ్చితమైన అభిప్రాయం. చిన్నారులు మైనం ముద్దల వంటివారనీ, వారు పెద్దలుగా ఎదిగి ఎలా తయారైనా బాధ్యత అమ్మా, నాన్నలదేననీ విశ్వసిస్తారు. పసిపిల్లలకు ఇల్లే పాఠశాల అన్నది ఆయన నమ్మకం.
విద్యాబోధనారంగంలో ప్రజాస్వామ్య భావనలను ప్రవేశపెట్టిన మకరెంకో కుటుంబంలోనూ ఈ ధోరణులు ఉండటం వాంఛనీయమని భావించారు. అతి గారాబం లేదా అతి క్రమశిక్షణ, అర్థం లేని అధికార ప్రదర్శనల వల్ల పిల్లల మనస్తత్వం ఎలా రూపొందుతుందో మకరెంకో ఈ గ్రంథంలో ఉదాహరణలతో సహా రాశారు.
సునిశితమైన ఆయన పరిశీలనాశక్తి, సున్నిత మనస్తత్వం, మొత్తం సమాజం పట్ల బాధ్యత ముఖ్యంగా పిల్లలపై ఆయనకు గల అపారమైన అనురాగం ఇందులో ఆద్యంతం కనిపిస్తాయి.
పిల్లల పెంపకం బాధ్యతలు వహించే అమ్మా నాన్నలకు స్వార్థం ఉండకూడదంటూనే అర్థం లేని త్యాగాల వల్ల ఫలితం రాదని మకరెంకో అంటారు. ఆయన వ్యక్తం చేసిన అన్ని అభిప్రాయాలతో ఏకీభవించలేకపోయినా విద్యాబోధనారంగ నిపుణుడిగా, దశాబ్దాల తరబడి పిల్లలతో సాన్నిహిత్యం కలిగిన పరిశీలకునిగా, అన్నింటికంటే ప్రధానంగా అత్యున్నతమైన మానవతావాదిగా మకరెంకోకు గల గుర్తింపును దృష్టిలో ఉంచుకుంటే బిడ్డల పెంపకంపై తల్లితండ్రుల కోసమే రాసిన ఈ పుస్తకం పెద్దలందరికీ నిస్సందేహంగా ఉపయోగకరం.
విద్యాబోధన పద్ధతులు, బిడ్డల శిక్షణ వంటి అంశాలపై మకరెంకో రాసిన వివిధ గ్రంథాలు పలు ఖండాల్లో, అనేక భాషల్లో లక్షల సంఖ్యలో ప్రచురితమై, ప్రజాదరణ పొందాయి. మకరెంకో రచనల్లో తెలుగులో వచ్చిన రెండో పుస్తకమిది.
......
...పిల్లలు తమ పెద్దలతో, ముఖ్యంగా తల్లితండ్రులతో అనుచితంగా ప్రవర్తించారంటే, క్రమశిక్షణ లేకుండా దిమ్మరులుగా, దొంగలుగా, గూండాలుగా తయారయ్యారంటే, కుటుంబం పట్ల, చదువుపట్ల బాధ్యతను విస్మరించారంటే అందుకు కారణాలకోసం ఎక్కడో అన్వేషించవద్దు. తొలి తప్పు మీదే - అమ్మానాన్నలదే అని గుర్తించండి. ఇలా జరిగిపోయిన తప్పుల గురించి ఆవేదన చెందడం కంటే, ఏ తరహా వైఫల్యాలు పిల్లలను పెడదారిలోకి నెడతాయో గుర్తించండి. అందుకు నా ఈ ప్రయత్నం ఉపకరిస్తే ఆ మేరకు అది ఒక విజయమే.
...మకరెంకో
అమ్మా నాన్నలకు ...
ఏ.ఎస్.మకరెంకో
ఆంగ్లమూలం ఎ బుక్ ఫర్ పేరెంట్స్
తెలుగు అనువాదం: టి.ఎన్.వి.రమణమూర్తి
200 పేజీలు, వెల : రూ.50/-
Saturday, October 4, 2008
మునెమ్మ ... సాధారణ స్త్రీలోని అసాధారణ శక్తికి ప్రతీక ... నవల ... రచన: డాక్టర్ కేశవరెడ్డి
అనగనగా : మునెమ్మ
ఒక మాంత్రిక కథనం ... ఒక పురాణగాథ
You always have to take the side of the dead.
- Gabriel Garcia Marquez
Quest – romance is the search of the libido or desiring self for a fulfillment that will deliver it from the anxieties of reality but will still contain that reality.
- Northrop Frye
అడుగుదాం. సమయమొచ్చినప్పుడు గొంతుమీద కాలేసి అడుగుదాం. చేప కోసం గాలం వేసినప్పుడు బెండు తైతక్కలాడగానే గాలాన్ని లాగుతామా? బెండు నీళ్లలో మునిగినప్పుడు కదా గాలాన్ని లాగుతాం.
....మునెమ్మ
మనం సాధించదలచుకున్నది ధర్మసమ్మతమైనదైతే దాన్ని పొందడానికి మనకు యోగ్యత వుంటే, దానికోసం సాగే ప్రయత్నం నిజాయితీగా సాగితే దాన్ని సాధించే తీరుతాం. ఏ అమావాస్యగానీ, పౌర్ణమిగానీ అడ్డురావు.
.... పూటకూళ్లింటి ముసలాయన
వాస్తవ జగత్తులోని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేయడం మనం చూసినదే. అ లాగే స్వప్న జగత్తులోని సంఘటనలు కూడా జీవిత దృక్పథాన్ని మార్చివేయగలవని నేను చెప్పగలను. అందుకు మునెమ్మే సాక్ష్యం. స్వప్నంలో ఆమె చూసిన దృశ్యాలు ఆమెలోని ప్రతి అణువునూ కుదిపివేశాయి. స్వప్నానంతరం ఆమె కార్చిన కన్నీళ్లు, ఆమెలోని సకల సందిగ్ధతలనూ సకల సంశయాలనూ సకల జడత్వాలనూ కడిగివేశాయి.
... సినబ్బ
...
డా.కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టారు. తిరుపతిలో పియుసి, పాండిచ్చేరిలో ఎంబిబిఎస్ చేశాక నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి విక్టోరియా మెమోరియల్ ఆసుపత్రిలో స్కిన్ స్పెషలిస్టుగా కుష్టు రోగులకు సేవలందించారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో వుంటూ ఆర్మూరులో వైద్య సేవలు అందిస్తున్నారు. కుష్టువ్యాధిపై ఆయన రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.
వీరి ఇతర రచనలు:
బానిసలు
భగవానువాచ
ఇన్‌క్రెడిబుల్ గాడెస్
స్మశానం దున్నేరు
అతడు అడవిని జయించాడు
రాముడుండాడు రాజ్జిముండాది
మూగవాని పిల్లనగ్రోవి
చివరి గుడిసె
సిటీ బ్యూటిఫుల్
నేషనల్ బుక్ ట్రస్ట్‌వారు అతడు అడవిని జయించాడు నవలను 14 భారతీయ భాషల్లోకి అనువదించారు.
ఇన్‌క్రెడిబుల్ గాడెస్ నవల మరాఠీలోకి అనువాదమైంది.
తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి, హృదయాలను తేలికపరచటం, అనివార్యమైన జీవిత పోరాటానికి ఉపక్రమింపజేయటమే తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం. కొడుకూ కూతురూ సంతానం.
మునెమ్మ ... నవల
రచన: డా. కేశవరెడ్డి
తొలి పలుకు: జయప్రభ
మలి పలుకు: అంబటి సురేంద్రరాజు
ముఖచిత్రం: కాళ్ళ
111 పేజీలు, వెల రూ.40
Thursday, October 2, 2008
జమీల్యా...ప్రపంచంలోని బహు సుందరమైన ప్రేమకథల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన నవల. - చింగిజ్ ఐత్‌మాతొవ్ ... తెలుగు అనువాదం : ఉప్పల లక్ష్మణరావు
జమీల్యా ఓ అపురూపమైన ప్రేమ కథ. విమర్శకులు దీన్ని ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకథగా అభివర్ణిస్తారు. అయినప్పటికీ అంతకు మించిన బలీయమైన సామాజిక సందర్భం, సంస్కృతుల సంఘర్షణ, సమకాలీన జీవన సంక్లిష్టతలను ప్రతిఫలించటం దీని ప్రత్యేకత.
అందుకే ఇప్పటికీ ఐతమాతొవ్ రచనలన్నింటిలోకీ ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన నవలగా నిలబడుతోంది.
దీన్ని ఆయన 1958లో కిర్గిజ్, రష్యన్ భాషలు రెంటిలోనూ రాశారు.
1959లో లూయీ ఆరగాన్ చేసిన ఫ్రెంచ్ అనువాదంతో జమీల్యా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. తర్వాత అనేక భాషల్లోకి అనువాదమైంది.
రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించటంకంటే కూడా సమాజం అంతరాత్మను ప్రతిధ్వనించటమే ముఖ్యమన్న మాక్సిం గోర్కీ మాటలను చింగీజ్ ఐత్‌మాతొవ్ శిరసావహించారు. ఒక రచయిత నిబద్ధతకు ...ఎటువంటి భేషజాలూ లేకుండా మార్పును ఆహ్వానించటం, ఆవిష్కరించటమే నిజమైన కొలమానమని వ్యాఖ్యానించేవారాయన. అందుకే ఆయన సోవియట్ వాస్తవికతలోని చీకటి కోణాలను కూడా నిష్కర్షగా, ఆలోచనాత్మకంగా తన రచనల్లో ప్రతిబింబించారు.
కిర్గిజ్ జాతిపితగా పేరొందిన చింగీజ్ ఐత్‌మాతొవ్ రచనలను మా దేశంలో ప్రతి కటుంబం చదువుతుంది. మళ్లీ మళ్లీ చదువుతుంది. ఎందుకంటే మాకు గుండె ధైర్యాన్ని నూరిపోసింది ఆయన రచనలే. కేవలం ఒక వ్యక్తిగా మనం ఎంత మార్పు తేవచ్చో చూపారాయన ... అంటారు కిర్గిజ్ మానవ హక్కుల కార్యకర్త నటాలియా ఆబ్లోవా.
అర్థశతాబ్ధం క్రితం నాటి జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు, తల్లి భూదేవి వంటి ఆయన రచనలు 150 ప్రపంచ భాషల్లోకి అనువాదమవటమే కాదు ఇప్పటికీ వన్నె తగ్గకుండా సమకాలీన రచనల్లా అ లరిస్తుండటానికి ఐత్‌మాతొవ్ స్పృశించిన సార్వజనీన, మానవీయ భావనలే కారణం.ఆయన కిర్గిస్థాన్ రాయబారిగా పలుదేశాల్లో పనిచేశారు. 2008 జూన్ 10న జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో కన్నుమూశారు.
జమీల్యా
చింగీజ్ ఐత్‌మాతొవ్
అనువాదం: ఉప్పల లక్ష్మణరావు
96 పేజీలు, వెల: రూ.40
Wednesday, October 1, 2008
గుండె జబ్బులు - ప్రత్యామ్నాయ పరిష్కారాలు ... యాంజియోప్లాస్టీ, స్టెంట్, బైపాస్ సర్జరీలు లేకుండా శాశ్వత, సంపూర్ణ స్వస్థత పున:స్థాపన - డా.జి.లక్ష్మణరావ
గుండె ధమనులు కొలెస్ట్రాల్ తదితర పదార్థాలతో, కరుడుగట్టిన గారతో పూడుకుపోవడం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. రోజురోజుకు గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పశ్చిమ దేశాలతో పాటు మన దేశంలోనూ విపరీతంగా పెరిగిపోతోంది.
గుండె ధమనులు పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ పూడటానికి అధిక రక్త ప్రసరణ వత్తిడి, అధిక స్థాయి కొలెస్ట్రాల్, ధూమపానం, మధుమేహం ప్రధాన కారణాలు. స్థూలకాయం, మందకొడి జీవితం, ఆవేశపూరిత మనస్తత్వం, వయసు, లింగభేదం, సంతాన నియంత్రణ మందుల వాడకం, మానసిక ఒత్తిడి, ఆందోళన మొదలైనవి ఇతర కారణాలుగా గుర్తించారు. అయితే వీటన్నింటికీ అట్టడుగున వుండే మూలకారణాలేమిటో అ ల్లోపతి వైద్య పరిశోధకులు ఆరాతీయటం లేదు.
పూడుకుపోయిన ధమనులను పూర్తిగా క్లియర్ చేయడం ఔషధాల వల్ల సాధ్యం కాదు కనుక యాంజియోప్లాస్టీ, స్టెంట్లతో ప్రారంభించి చివరకు బైపాస్ సర్జరీ చేసి పదిపన్నెండు సంవత్సరాల వరకూ ఎలాంటి సమస్యా వుండదని చెబుతుంటారు. అయితే వీటిలో 60 శాతం అనవసరంగా చేయబడుతున్నాయనీ, ఈ ప్రక్రియలకు లోనయినవారు ఔషధాలతో చికిత్సలు చేయించుకున్న వారి కన్నా ఎక్కువ కాలం జీవించటం లేదని ప్రపంచ స్థాయి అ లోపతి వైద్య పరిశోధకులే తేల్చిచెప్తున్నారు.
బైపాస్ సర్జరీ 1967లోనూ, యాంజియో ప్లాస్టీ 1977లోనూ, స్టెంట్ 1986లోనూ ఔషధం పూసిన స్టెంట్ 1987లోనూ ప్రప్రథమంగా ప్రవేశపెట్టబడ్డాయి.ఇవాళ ఒక్క అమెరికాలోనే సంవత్సరానికి 20 లక్షలకు మించి ఇలాంటి ప్రక్రియలు జరుగుతున్నాయని అంచనా.
వాస్తవానికి ఛాతి నొప్పులకు, గుండె ధమనుల పూడికకు 1946 నుంచే సమర్థవంతమయిన, సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలిగిన తేలిక అయిన, చవక అయిన ప్రత్యామ్నాయ చికిత్సాపద్ధతులు వున్నాయి. అవి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉపయోగకరమైనవే. అయితే వాటిని లాభదాయక పెట్టుబడిదారీ పేటెంట్ల చట్రంలో బిగించటానికి వీలుపడదు కనుక వాటికి తగినంత ప్రచారం లభించటం లేదు.
ప్రత్యామ్నాయ చికిత్సల విజయాలు, అ ల్లోపతి వైద్య విద్యలోగానీ శిక్షణావిధానంలోగానీ పాఠ్యాంశాలుగా పెట్టరు. అదేవిధంగా వ్యాధి కారక, వ్యాధి నిరోధక, వ్యాధి నివారక అంశాలలో ఆహారంలోని పోషక విలువల ప్రాముఖ్యతను అ ల్లోపతి వైద్యవిద్య, శిక్షణ, చికిత్సలు గుర్తించవు. పైగా వాటిని ఘోరంగా నిర్లక్ష్యం చేస్తాయి. చికిత్సలో వ్యాధి మూలకారణాలను నిర్మూలించటం ప్రధాన ధ్యేయం కాకపోవటమే ఇందుకు కారణం.
ఈ పుస్తకం వైద్య విద్యార్థులకు ఉద్దేశించబడింది కాదు. గుండె జబ్బులతో బాధపడుతున్న, భయపడుతున్న పేషెంట్లకు, వారి బంధు మిత్రులకు ఉద్దేశించబడింది. ఆహార, జీవన శైలి మార్పులతో గుండె జబ్బులను ఎలా నయం చేయవచ్చో, ఎలా నివారించవచ్చో ఇందులో విపులంగా చర్చించారు.
గుండె జబ్బులు
ప్రత్యామ్నాయ పరిష్కారాలు
- డా.జి. లక్ష్మణరావు
120 పేజీలు, వెల: రూ.40
Subscribe to:
Posts (Atom)