మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Sunday, August 31, 2008
నేను ఫూలన్ దేవిని
నేను ఫూలన్ దేవిని
ఉత్తర భారతదేశంలో దుర్భర దారిద్య్రం మధ్య పుట్టి పెరిగిన ఫూలన్ దేవి యావద్దేశ చరిత్రలోనే ఓ గొప్ప మహిళా బందిపోటుగా పేరుగాంచింది. చంబల్ లోయలో పసిపిల్లగా వున్నప్పుడే కులవ్యవస్థ దౌష్ట్యాన్ని, తమ భూమి హక్కులు కాలరాయబడటాన్ని, తనకంటే చాలా పెద్దవాడైన వ్యక్తితో పెద్దలు అనాలోచితంగా చేసిన పెళ్లివల్ల ఎదురైన చేదు అనుభవాలను ఎన్నింటినో చవిచూసింది. బందిపోట్లచే కిడ్నాప్‌కు గురైంది. ఆతరువాత పరిస్థితుల ప్రభావం చేత అదే బందిపోట్ల ముఠాకి తనే నాయకురాలైంది. 1983లో ప్రభుత్వానికి లొంగిపోయిన పిదప ఆమె జీవితంగురించి దినదిన గండంలా గడిచిన జైలు రోజుల గురించి, కందిరీగల్లా చుట్టుముట్టిన కోర్టు కేసుల గురించి, ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదిపార్టీలో చేరి పార్లమెంటు సభ్యురాలిగా ఎంపికైన వైనం గురించి, చివరికి అగ్రవర్ణాల చేత్లుల్లో దారుణంగా హత్యకు గురైన విషయం గురించి పత్రికల్లో అనేక కథనాలు వెలువడ్డాయి.
ఒక స్త్రీ బందిపోటుగా ఎలా రూపాంతరం జెందింది అనే అంశానికి సంబంధించిన అసాధారణ జీవిత చిత్రణే ఈ పుస్తకం.
ఇందులో ఫూలన్ దేవి జీవితంతో పాటు వర్తమాన భారతదేశపు స్థితిగతులు ఎలా వున్నాయి? భారతదేశం తన గ్రామాల్లో తను ఎట్లాంటి బతుకును గడుపుతోంది? పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనసభ, లోకసభ తదితర రాజ్య వ్యవస్థలు ఏవిధంగా విఫలమవుతున్నాయి మొదలైన అంశాల విశ్లేషణ కూడా వుంది.
నేను ఫూలన్ దేవిని
ఫూలన్ దేవితో మారి-తిరీస్ క్కూని, పాల్ రాంబలి జరిపిన ఇంటర్వ్యూల సారాంశం
ఆంగ్ల మూలం: ఐ, ఫూలన్ దేవి, ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఇండియాస్ బాండిట్ క్వీన్
తెలుగు అనుసరణ : నవత
308 పేజీలు, వెల : రూ.75
Friday, August 29, 2008
దళిత కథలు
దళిత కథలు
దళితుల సమస్యలు, పోరాటాలు ప్రధానంగా సాంఘికమైనవి. దళితులపట్లా, శూద్రులపట్లా అగ్రవర్ణాలవారు అవలంభించే అమానుష వైఖరి ఈ నాటికీ దేశంలోని మేధావులకు ఒక సవాలుగానే నిలిచింది. జీవితంలోని ప్రతి రంగంలోనూ దళితులు ఉపేక్షితులైనట్లే సాహితీరంగంలో కూడా వారు తిరస్కృతులైనారు. గత వందలాది సంవత్సరాలుగా వస్తున్న సాహిత్యంలో దళిత పురుషులను బానిసలుగా, దళిత స్త్రీలను దాసీలుగా లేదా భోగించబడే వస్తువులుగా హీనంగా చిత్రించడం జరిగింది. వాళ్లని సాటి మనుషులుగా ఎక్కడా చిత్రించనూలేదు, స్వీకరించనూలేదు. అగ్రవర్ణాలకు చెందిన వాళ్లను మాత్రమే శక్తిమంతులుగా, సమర్థులుగా చిత్రించారు. అందువల్ల అట్లాంటి సాహిత్యాన్ని తిరస్కరించి అడుగడుగునా తీవ్ర అన్యాయానికి, అణిచివేతకు, వివక్షకు గురవుతున్న వర్గాల యాతనలను, సంవేదనలను, బాధలను వారిపై జరుగుతున్న అత్యాచారాలను శక్తివంతంగా అభివ్యక్తం చేసే అవసరం ఏర్పడింది.
ఆ అవసరాన్ని పరిపూర్తి చేసే దిశగా సాగిన వివిధ దళిత రచయితల కథా సంపుటే ఈ పుస్తకం.
ఆ రచయితలు యోగేంద్ర మేశ్రామ్, కేశవ్ మేశ్రామ్, అన్నా భావూ సాఠే, లక్ష్మణ్ మానే, హోవాల వామన్, శ్రీరామ్ గుందేకర్, యోగీరాజ్ వాఘ్‌మారే, దయాపవార్, బంధు మాధవ్. కాగా దళిత సాహిత్య పూర్వరంగాన్ని డా. సూర్యనారాయణ రణసుభే, డా.కమలాకర్ గంగావణే పరిచయం చేశారు.
వీటికి పోలు శేషగిరిరావు, నిర్మలానంద, దండమూడి మహీధర్, సాకేత్, కౌముది, నిఖిలేశ్వర్ తెలుగు అనువదం చేశారు.
ఒక విధంగా ఈ సాహిత్యానికి మూల ప్రేరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. అటు పోరాటం, తిరుగుబాటు, నిరాకరణ అనే మూడు స్థాయిల్లో ఉద్యమాలు పెల్లుబికితే ఆ స్ఫూర్తితో ఇటు దళిత సాహిత్యం ప్రతిస్పందించింది. ఈ దళిత సాహిత్య ఉద్యమం సాంఘిక పోరాటం నుంచి రావటం వల్ల అందులోని అంతర్గత వైరుధ్యాలన్నీ ఈ సాహిత్యోద్యమంలోనూ కనపడతాయి.
దళిత కథలు
75 పేజీలు, వెల రూ. 16
Saturday, August 23, 2008
పోలీసులు అరెస్టు చేస్తే...............ఏం చెయ్యాలి? అసలు పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తారు?
పోలీసులు అరెస్టు చేస్తే...
పోలీసులు అరెస్టు చేస్తే ఏం చెయ్యాలి?
అసలు పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తారు?
అరెస్టు చేసిన వ్యక్తిని రోజుల తరబడి పోలీసు స్టేషన్‌లో వుంచవచ్చా?
లాకప్‌లో పెట్టి, కొట్టి చంపవచ్చా?
అరెస్టు చేసిన వ్యక్తిని ఎప్పుడు కోర్టులో హాజరుపరచాలి?
బెయిలు ఎలా దొరుకుతుంది?
అరెస్టు అయిన వ్యక్తిని పోలీసులు చిత్రహింసల పాల్జేస్తే ఎవరూ ఏమీ చెయ్యలేరా?
పోలీసులు తప్పుడు కేసులు ఎందుకు బనాయిస్తారు?
అధికారం లేకుండా అరెస్టు చేస్తే మీరు అడ్డగించవచ్చా?
అరెస్టు అయిన వ్యక్తికి అన్నం ఎవరు పెడతారు?
లాకప్‌లో ఎందర్ని వుంచాలి?
ఇవన్నీ ప్రశ్నలే ...
ఎన్నో ప్రశ్నలు సమాధానం దొరకక ప్రజలను భయపెడుతున్నాయి.
అసలు పోలీసులంటే ప్రజలకు భయం ఎందుకు?
పోలీసుల గురించి, చట్టం గురించి, హక్కుల గురించి ప్రజలకు తెలియదు గనుకనే పోలీసులంటే ప్రజలకు భయం.
ఆ భయం పోతే ప్రజలు తమ హక్కుల్ని సాధించుకోగలరు.
అందుకే ఈ పుస్తకం....
పోలీసులు అరెస్టు చేస్తే
రచన : బొజ్జా తారకం
ప్రథమ ముద్రణ: 1981
పునర్ముద్రణ: 1987, 1988, 1990, 1992, 1994, 1995, 1997, 1998, 2001, 2006
Friday, August 22, 2008
నా (మన) కథ ...ఫ్లెవియా ఆగ్నెస్, ముంబాయి
నా (మన) కథ
...అమ్మా ... నాన్న నిన్ను కొడతాడని నా స్నేహితులముందు చెప్పకేం...
...టీచర్ ... మా నాన్న అమ్మని కొడతాడు. అమ్మ ఎప్పుడూ ఏడుస్తుంటుంది. అందుకే హోం వర్కు చేయలేదు...
...మా పక్క ఫ్లాట్‌లో రాత్రుళ్లు ఏడుపులూ, మూలుగులూ వినిపిస్తాయి. వెంటనే టీవీ పెద్దగా పెట్టేస్తారు. ఏం జరుగుతోందో అర్థం కాదు. అడుగుదామంటే ఆవిడ అసలు తలుపు తీసుకుని బయటకే రాదు...
...రాత్రి తాగొచ్చి నా ఒళ్లంతా హూనం చేశాడమ్మా... ఈ వేళ బట్టలుతకలేను...
మనందరికీ చాలా చాలా పరిచితమైన మాటలివి. కులమతవర్గ భేదం లేకుండా మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ... కుటుంబ హింస.
దాన్ని మౌనంగా భరించనక్కరలేదనీ ... నాలుగు పదుల వయసులోనూ జీవితాన్ని కొత్తగా ప్రారంభించవచ్చనీ... నిరూపించిన ఓ అసాధారణ మహిళ సాధారణ జీవితకథ ఇది.
ఒకనాడు తనకు, తన పిల్లలకు న్యాయం చేయమంటూ కోర్టుల చుట్టూ తిరిగిన ఒక అసహాయ మహిళ ... నేడు ఆ కోర్టుల్లోనే ఎందరికో న్యాయం జరిగేలా చూడగలుగుతున్నారు. అందుకు ఇంకా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఆమె పేరు ఫ్లెవియా ఆగ్నెస్ ... మహిళా హక్కుల న్యాయవాది.
స్ఫూర్తిదాయకమైన ఆమె జీవిత కథకు తెలుగు అనువాదమే ఈ పుస్తకం.
'' జీవిత చరిత్రలు సాధారణంగా ప్రముఖులే రాస్తారు. అణచివేతకు గురయ్యేవారి చరిత్రలు అరుదుగానే వస్తాయి. ఆవిధంగా చూస్తే ఈ జీవిత చరిత్ర మాత్రం ప్రత్యేకమైనదే. కుటుంబసింస అనే సమస్య చుట్టూ ఎన్నో అపోహలు, అపార్థాలు ...ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నా ఎవరికివారు తాము మాత్రమే సమస్య నెదుర్కొంటున్నట్టుగా భావిస్తూ ఇతరులకు చెప్పుకోడానికి సిగ్గుపడుతుంటారు. కొంతవరకైనా అట్లాంటి అపోహలను తొలగించి ఆ పరిస్థితుల్లో వున్న మహిళలు బయటపడేందుకు స్ఫూర్తినివ్వవచ్చనే ఉద్దేశంతోనే ఇది రాశాను. మహిళా కేంద్రంలో పనిచేస్తున్నప్పుడే ఈ పుస్తకాన్ని మొదలుపెట్టాను. వైవాహిక బంధంలో సమస్యలెదుర్కొంటున్న తోటి మహిళలకు మద్దతిచ్చేందుకు నా జీవితాన్ని అక్షరీకరించడం ఆరంభించాను. ఒకరి అనుభవాలనుంచి మరొకరం జీవిత పాఠాలు నేర్చుకోవాలనుకున్నాం...''
- ఫ్లెవియా ఆగ్నెస్
నా (మన) కథ
రచన: ఫ్లెవియా ఆగ్నెస్
ఆంగ్లమూలం : మై స్టోరీ ... అవర్ స్టోరీ ఆఫ్ రీబిల్డింగ్ బ్రోకెన్ లైవ్స్, మజ్లిస్, ముంబాయి, ౨౦౦౪
తెలుగు అనువాదం : భూజాత
Thursday, August 21, 2008
నేటి పిల్లలకు రేపటి ముచ్చట్లు
నేటి పిల్లలకు రేపటి ముచ్చట్లు
ఈ పుస్తకం ప్రధానంగా యుక్త వయసు పిల్లలకోసం రూపొందించబడింది. దీని లక్ష్యం:
..బాల్యానికీ యవ్వనానికీ మధ్య దశ గురించి, హెచ్‌ఐవి ఎయిడ్స్ లైంగికంగా వ్యాపించే వ్యాధుల గురించి అవగాహనను పెంపొందించడం.
..ఆత్మగౌరం, స్థిరత్వం తాలూకు నైపుణ్యాలను అభివృద్ధి పరచడం.
..లైంగికత పట్ల నిర్దిష్టమైన వైఖరిని అభివృద్ధి పరచడం.
..హెచ్‌ఐవి ఎయిడ్స్ తో జీవిస్తున్న వ్యక్తుల పట్ల సానుభూతిని కనబరిచేట్టు చేయడం.
..ఈ పుస్తకం యుక్యవయసు పిల్లలకు, విద్యార్థులకు, ప్రత్యేకించి ఉపాధ్యాయులకు, సామాజిక కార్యకర్తలకు, హెచ్‌ఐవి ..ఎయిడ్స్ నివారణా కృషిలో నిమగ్నమై వున్నవారికీ విశేషంగా తోడ్పడుతుంది.
..ప్రధానంగా పాఠశాలల్లో కుటుంబ ఆరోగ్యం, జీవన నైపుణ్యాల బోధన కోసం రూపొందించిన ఈ పుస్తకంలో చర్చించిన అంశాలు:
... యవ్వనదశ పట్ల అవగాహన.
... యుక్తవయసులో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడం.
... మొటిమలు-శరీర వాసన.
... టీనేజి గర్భం-లైంగికంగా వ్యాపించే వ్యాధులు, హెచ్‌ఐవి, ఎయిడ్స్
... స్నేహితుల ఒత్తిడిని ప్రతిఘటించడం, నో అని స్థిరంగా చెప్పడం నేర్చుకోవడం.
... సహాయపడే వాతావరణాన్ని సృష్టించడం, వివక్షను నిర్మూలించడం.
... హెచ్‌ఐవి, ఎయిడ్స్ ప్రభావం.
... హెచ్‌ఐవి, ఎయిడ్స్ తో జీవిస్తున్న వారిపట్ల సానుభూతి కనబరిచే మార్గాలు.
ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రచురించింది. ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కొరకు సంప్రదించవలసిన చిరునామా:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ,
డి.ఎమ్.హెచ్.ఎస్. క్యాంపస్, సుల్తాన్ బజార్, కోఠీ,
హైదరాబాద్ 500 096
ఫోన్ 91+ 040 - 24657221 / 24650776
నేటి పిల్లలకు రేపటి ముచ్చట్లు
ఆంగ్ల మూలం : లెర్నింగ్ ఫర్ లైఫ్: ఎ గైడ్ టు ఫామిలీ హెల్త్ అండ్ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఫర్ టీచర్స్ అండ్ స్టుడెంట్స్; పబ్లిష్డ్ బై ఎన్.సి.ఇ.ఆర్.టి., ఎన్.ఎ.సి.ఒ (నాకో), యు.ఎన్.ఇ.ఎస్.సి.ఒ (యునెస్కో).
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
Tuesday, August 19, 2008
ఆధునిక కామ సూత్రం ... సెక్స్ గురించి మాట్లాడుకోవడం అంటే ఒక భయంకరమైన వ్యాధి గురించి తెలుసుకోవడమే
ఎయిడ్స్‌పై పోరాటానికి
ఆధునిక కామసూత్రం
ఇది సెక్స్ గురించి రాసిన పుస్తకం.
మరీ ముఖ్యంగా భారతదేశంలో సెక్స్ గురించి రాసిన పుస్తకం.
భారతీయుల లైంగిక వ్యవహారాలకు సంబంధించిన అనేకానేక అంశాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడుతుందిది.
ఎయిడ్స్ అనే భయంకరమైన వ్యాధి ప్రాథమికంగా ఒకరి నుంచి మరొకరికి లైంగికంగానే సంక్రమిస్తుంది కాబట్టి ఈ పుస్తకం ఎయిడ్స్ గురించి విపులంగా చర్చిస్తుంది.
సెక్స్ సామర్థ్యం కలిగిన లైంగికంగా చైతన్యవంతంగా వున్న భారతీయులెవరైనా వాళ్లు పేదలు, మధ్యతరగతివాళ్లు , ధనికులు, స్త్రీలు, పురుషులు, పదిహేనేళ్లవాళ్లు, అరవైయేళ్లవాళ్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరైనా ఈ వ్యాధి బారినపడే ప్రమాదం రోజురోజుకు పెరుగుతోంది. కాబట్టి ఈ పుస్తకం ప్రస్తుత భారత సమాజంలో సెక్స్ గురించి అర్థం చేసుకునేందుకు ఎటువంటి సంశయాలు లేకుండా కొంచెం లోతుగా ప్రయత్నిస్తుంది. దీనిని ఎయిడ్స్ వ్యాధి గురించి అర్థం చేసుకుంటూ అవగాహనను పెంచుకునేందుకు చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నంగా, లైంగిక ప్రపంచంలోకి జరుపుతున్న ఓ ప్రయాణంగా చెప్పుకోవచ్చు.
సెక్స్‌కు సంబంధించిన అనేకానేక సుఖాలను, లైంగిక అనుభవాలను వాంఛించేటప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి కొన్ని ప్రాథమికమైన, ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కాబట్టి ఈ పుస్తకం ఈ ఎయిడ్స్ యుగానికి అవసరమైన ఓ ఆధునిక కామసూత్రం లాంటిది.
... ... ...
సిద్ధార్థ్ దూబే అభివృద్ధి ప్రక్రియలను, అభివృద్ధి విధానాలను పరిశోధిస్తున్న పాత్రికేయులు. ప్రజా ఆరోగ్య విధానాల విశ్లేషకుడిగా విశేష కృషిచేస్తున్నారు. 1961లో కలకత్తాలో జన్మించిన ఈయన మినసోటా విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు చేశారు. హార్వర్డ్ పబ్లిక్ హెల్త్ స్కూల్‌లో ప్రజా ఆరోగ్య విధానాలను అధ్యయనం చేశారు.
యునిసెఫ్, ప్రపంచ బ్యాంకుల్లోని ఆరోగ్య విభాగాల్లో పనిచేశారు. వాటితో పాటు యుఎన్ ఎయిడ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థలవంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు కన్సల్టెంట్‌గా సలహా సంప్రదింపులను అందించారు. ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్‌టన్ పోస్ట్ వంటి పత్రికల్లో ఆర్థిక, సమకాలీన సామాజికాంశాలపై విస్తృతంగా రాశారు.
1998లో ఆయన యాభై సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రను పేదల దృక్కోణం నుంచి విశ్లేషిస్తూ ... వర్డ్‌స్ లైక్ ఫ్రీడం: మెమోయిర్స్ ఆఫ్ యాన్ ఇంపోవరిష్డ్ ఇండియన్ ఫ్యామిలీ 1947-1997 ... అనే పుస్తకం రాశారు. అది నోబెల్ బహుమతి పొందిన సంక్షేమ ఆర్థికవేత్త అమర్త్య సేన్ తో సహా పలువురి ప్రశంసలు అందుకుంది.
ఎయిడ్స్‌పై పోరాటానికి ఆధునిక కామసూత్రం
రచన : సిద్ధార్థ్ దూబే
ఆంగ్లమూలం : సెక్స్, లైస్ అండ్ ఎయిడ్స్, హార్పర్ కోల్లిన్స్, ఢిల్లీ, 2000, కాపీరైట్ : దూబే 2000
తెలుగు అనువాదం : చంద్రిక
బొమ్మలు : సురేంద్ర
Monday, August 18, 2008
అ ల్లరి పిల్లల్లో మార్పులు సాధ్యమా?
ఒక మంచి పుస్తకం
ఆయన తర్వాత అని చెప్పలేను గానీ, ఆయన వంటి మరో ప్రతిభాశాలి, మనల్ని పుస్తకంతో పాటు లాక్కెళ్ళిపోయే మరో అనువాదకులు స్వర్గీయ శ్రీ సహవాసి (సి.ఉమా మహేశ్వర రావు)గారు.
ఇకపోతే, నేను చదివిన పుస్తకం పేరు..'అల్లరి పిల్లలలో అద్భుత మార్పులు". రచయిత రష్యన్ విద్యా వేత్త ఏ.ఎస్.మకరెంకో. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసారు. అనువదించింది టి.ఎన్.వి. రమణ మూర్తి. పుస్తకం చదివి ఏడాది దాటినా, నా బ్లాగ్ మొదలెట్టింది ఈ మధ్యనే కావడం వల్ల, ఈ పుస్తకాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా!
ఈ పుస్తకం చూడగానే, పిల్లల్ని పెంచడంలో ఉపయోగపడే చైల్డ్ సైకాలజీ పుస్తకంగా భావించి నాకు , మా అయిదేళ్ళ పాపకు ఉపయోగంగా ఉంటుందని తీసుకున్నాను. కానీ మొదలు పెట్టాక, ఎంత అద్భుత వేగంతో నన్ను లాక్కు పోయిందంటే, పూర్తయ్యక గానీ, లేవలేకపోయాను. ఇది ఒక యదార్థ గాధ. రష్యాలో, 1920-30 మధ్య బాల నేరస్తుల పునరావాస కేంద్రంలో అనేకమంది పెంకె పిల్లలు, నేర స్వభావం కలిగిన పిల్లలు మకరెంకో శిక్షణ కింద మెరికల్లా ఎలా మారిందీ, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎలా నిలదొక్కుకున్నారన్నదీ ఈ పుస్తకం ఇతి వ్రుత్తం.
కధ విషయానికొస్తే, ఎటువంటి సదుపాయలుగానీ, తగినన్ని ఆర్థిక వనరులు గానీ లేని ఒక పిల్లల కాలనీలోకి మకరెంకో కొంతమంది వీధి బాలలతో, బాల నేరస్తులతో ప్రవేశిస్తారు. ఆ పిల్లలు కరడు గట్టిన మొండివాళ్ళు. దొంగతనాలకు అలవాటు పడ్డవాళ్ళు. మకరెంకోతో పాటు ఉన్నదల్లా, ఒక ముసలి అసిస్టెంటూ, మరో లేడీ టీచరూ! పిల్లలు కాలనీలోకి వస్తూనే, వీళ్ళ వస్తువులు దొంగిలిస్తారు. చుట్టుపక్కల గ్రామస్తుల వస్తువులు దొంగిలిస్తారు. వీళ్లను దారిలో పెట్టడం ఒక సమస్య కాగా, తగినంత రేషన్ కూడా ప్రభుత్వం సరఫరా చేయలేక పోవడం మరో సమస్యగా మారుతుంది.
దానితో వాళ్ళు కాలనీకి గల ఎకరాల కొద్దీ నేలలో వ్యవసాయం చేయాలని నిశ్చయించుకుంటారు. కానీ పనిముట్లు ఉండవు, గుర్రాలు ఉండవు. దగ్గరలోని గ్రామం నుండి ఒక కమ్మరిని పిలిచి పనిముట్ల తయారీలో శిక్షణ తీసుకుని, తామే ఒక కార్ఖానా ప్రారంభిస్తారు. కొండకి అవతల పక్క ఉన్న పాడుపడ్డ ఎస్టేట్ ను ప్రభుత్వ అనుమతితో తీసుకుని, కొత్త భవనాలను, ఇతరాలను వాళ్ళే సమకూర్చుకుంటారు. వ్యవసాయంలో వారిని ముందుకు నడిపించడానికి, షెర్రీ అనే నిపుణుడు వస్తాడు.
పిల్లల్లో 'మన ' అనే భావన కలిగాక, కాలనీ అభివ్రుద్ధిని ఎవరూ ఆపలేకపోతారు. రకరకాల పంటలు పండిస్తారు, పెద్ద పెద్ద కార్ఖానాలు నిర్మిస్తారు, గుర్రాలు కొనడమే కాక, గుర్రాల శాలను నిర్వహిస్తారు. పందుల పెంపకం చేపట్టి, ఒక పందుల నర్సరీని ఏర్పరుస్తారు. చుట్టు పక్క గ్రామాల్లోని సారా బట్టీలని మూయిస్తారు. నాటకాలు వేయడం ప్రాక్టీస్ చేస్తారు. చుట్టు పక్క గ్రామాల వాళ్ళు ప్రతి వారాంతం, వీళ్ళు ప్రదర్శించే నాటకాలు చూడనిదే ఉండలేని పరిస్తితికి వస్తారు. ఇవన్నీ చేస్తూ, ఉన్నత సాంకేతిక పరీక్షలో ఉత్తెర్ణులవుతారు. మధ్య మధ్యలో బయటినుంచి వచ్చే కొత్త పిల్లలను, వారిలోని నేర స్వభావాలను సంస్కారించే బాధ్యతను 'కమాండర్ 'లు గా పిలవబడే సీనియర్లు భుజాల మీద వేసుకుంటారు. రచయిత మక్సీం గోర్కీ మీద అభిమానంతో వాళ్ళ కాలనీకి 'గోర్కీ కాలనీ ' అని పేరు పెట్టుకుంటారు. ఈ కాలనీ ని గోర్కీ ఒకసారి సందర్శిస్తారు కూడా.
అంతే కాక, ఎక్కడో, వందల మైళ్ళ దూరాన అధ్వాన్న పరిస్థితిలో ఉన్న మరో కాలనీని సంస్కరిస్తారు కూడా. కానీ, ఇదంతా ఇక్కడ చెప్పినంత తేలికగా జరగదు. పిల్లలు వద్దన్న తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే, మకరెంకో సహనంతో వాళ్ళని దారిలో పెట్టిన విధానం చూస్తుంటే, ఆశ్చర్యంతో మతిపోతుంది.
ఈ పుస్తకం కేవలం చదవడమే కాదు. దాచుకోవలసిన పుస్తకం కూడా. ఎంత వుల్లాసంగా సాగుతుందంటే, ఆ కాలనీలో ఒక సభ్యుడిగా మనమూ ఉండి పరిశీలిస్తున్న అనుభూతి కలిగిస్తుంది ఈ పుస్తకం. అనువాదకుడికి సార్థకత అంతకంటే ఏముంది?
Friday, August 15, 2008
సేద్యగాని చర్నాకోల ...షేఠ్ కార్యాంచ అసూద్ ... జ్యోతీ బా ఫూలే
సేద్యగాని చర్నాకోల
జ్యోతీ బా ఫూలే
జ్యోతీరావు గోవిందరావు ఫూలే సాగించిన ఉద్యమం, రచనలు అన్నీ అందరికీ తెలియవు. ఆయన సామాజిక సమత్వం కేవలం సాంస్కృతికమైన అంశాలకు పరిమితమైనది కాదు. శూద్ర అంటరాని కులంలో చదువు ఆలోచనకు అంకురార్పణ చేసినవాడాయన. అందుకోసం స్వయంగా పాఠశాలలను నడిపారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ స్వయంగా ఫూలేను తన గురువుగా చెప్పుకున్నారు.
ఫూలే పుస్తకాలలో గులాం గిరీ ఒక సంచలనం. బ్రాహ్మణ ఆధిపత్యంలోని హిందూమతం సాగించిన కుట్రపూరితమైన దాడులను మహా విష్ణువు దశావతారాలుగా నిరూపించి కొత్త చరిత్రకు పునాదులు వేశారు. అయితే విషాదం ఏమిటంటే చారిత్రక వాస్తవాలను తవ్వి ప్రజలకు పంచే పనిని మన పరిశోధకులు ఇంకా ప్రారంభించలేదు.
అటువంటి మరో పుస్తకం షేఠ్ కార్యాంచ అసూద్. దీనిని ఫూలే మరాఠీలో రాశారు. దీన్నే కల్టివేటర్ విప్‌కార్డ్ పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. ఇప్పుడు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సేద్యాగాని చర్నాకోల పేరిట తెనిగించారు (హారతీ వాగేశన్). 1881లో అచ్చయిన ఈ పుస్తకం నాటి రైతుల దయనీయ స్థితికి అద్దంపడుతుంది. ఈ పరిస్థితులకు బ్రిటిష్ ప్రభుత్వాధికారులు, బ్రాహ్మణ పూజారి వర్గం ప్రత్యక్ష కారణాలని ఫూలే ఉదాహరణలతో వివరించారు. దీనితోపాటు నాటి రైతుల సంక్షేమం కోసం ఎన్నో సూచనలు చేశారు. పందొమ్మిదో శతాబ్దంలో మహారాష్ట్ర ప్రాంతంలోని సామాజిక పరిస్థితులు, వలస పాలన ప్రభావం ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఇది ఈనాటి పరిస్థితులకు కూడా ఎంతో దగ్గరగా వున్నట్టు అనిపిస్తుంది. ఫూలే అంచనాలను, ఆయన వెలికి తీసిన సత్యాలను ఇంకా ఎవరూ అందుకోలేదని అనిపిస్తుంది. ఈ 72 పేజీల పుస్తకంలో ఐదు అధ్యాయాలు, రెండు అనుబంధాలు వున్నాయి.
మొదటి అధ్యాయం ఫూలే మేధోపాటవానికి, ఆలోచనలలోని చిక్కదనానికి నిదర్శనం. రైతాంగాన్ని బ్రాహ్మణవర్గం ఎన్ని రకాల ఆర్థిక దోపిడీకి గురి చేసిందో ఈ అధ్యాయం వివరిస్తుంది. మహిళ సమర్తాడినప్పటి నుంచి ఈ తంతు మొదలవుతుంది. ఆమె బహిష్టు కావడం వల్ల మైల ఏర్పడిందని దాని నివారణకు పూజలు, ప్రార్థనలు చేసి, భట్ బ్రాహ్మణులు వారి బంధువులు రైతుల దగ్గర నుంచి నెయ్యి, బియ్యం, గోధుమలు ఇతర ధాన్యాలు పొందుతారు. ప్రతిగా వారు ఆ మహిళలకు శనివారం ఉపవాసం వుండమని, చతుర్థిరోజు పూజలు నిర్వహించమని ఇది శుభమని చెపుతారు అంటూ మొదలుపెట్టి వారానికి ఏడురోజులు, రోజుకు ఇరవై నాలుగు గంటలు ప్రజల జీవితాలలో సంభవించే అన్ని సంఘటనలలో జోక్యం చేసుకొని, చావు, పుట్టుక మధ్య ఆయా సందర్భాలను తమ ఆర్థిక పరిపుష్టికి ఉపయోగించుకుంటారని ఫూలే వివరించారు.
తెల్లజాతి ఉద్యోగుల భోగలాలసత రైతును దుర్భర స్థితికి తీసుకెళ్లిన క్రమాన్ని రెండవ అధ్యాయంలో వివరించారు. మూడవ అధ్యయంలో బ్రాహ్మణుల పుట్టుపూర్వోత్తరాలు, రైతుల మీద ప్రభుత్వం విధించే పన్నులు, వాటి భారం గురించి, నాలుగో అధ్యాయంలో రైతుల కడగండ్ల గురించి వివరించారు. ఐదవ అధ్యాయంలో రైతు శ్రేస్సుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను సూచించారు.
ఇవాళ రైతుల పరిస్థితి గురించి, సాగు గురించి ఎంతో చర్చ జరుగుతున్నది. అయితే గతకాలపు రైతు స్థితిపై ఇప్పటి వారికి అవగాహన లేదు. కొంత సమాచారం వున్నా ఫూలేకు వున్న దృష్టికోణం లేదు. కాబట్టి నాటి స్థితిగతుల ఆధారంగా నేటి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఫూలేలోని ఆర్థికవేత్తను అర్థం చేసుకోవడానికి కూడా ఈ పుస్తకం ఉపకరిస్తుంది.
- మల్లేపల్లి లక్ష్మయ్య, ఆదివారం ఆంధ్రజ్యోతి, 19 ఫిబ్రవరి 2006
సేద్యగాని చర్నాకోల
జ్యోతి బా ఫూలే
మరాఠీ మూలం: షేఠ్ కార్యాంచ అసూద్
ఇంగ్లీషు : కల్టివేటర్స్ విప్‌కార్డ్
తెలుగు అనువాదం : హారతీ వాగీశన్
72 పేజీలు వెల రూ.20
Thursday, August 14, 2008
నల్లపొద్దు దళిత స్త్రీల సాహిత్యం 1921-2002 సంపాదకులు గోగు శ్యామల
నల్లపొద్దు
దళిత స్త్రీల సాహిత్యం 1921 - 2002
సంపాదకులు : గోగు శ్యామల
తెలుగు భాష సంస్కృతీకరణకు, ఆంధ్రీకరణకు, హైందవీకరణకు గురవుతున్న నేపథ్యంలో ప్రాంతీయ భాషా పరిమళాలు కలుషితమవుతూ, పరాయీకరణకు గురవుతూ తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. వాటిని కాపాడుకోవాలంటే ఉన్నత విద్యతో ప్రమేయం లేకుండా సాహితీ ప్రపంచంలో అట్టడుగు, వెనుకబడిన కులాల, తెగల స్త్రీ పురుషుల భావాలు నిరంతరం గుబాళించగలిగే వాతావరణాన్ని సృష్టించుకోవాలి.
....
దళిత సాహిత్యం లోని వేగుచుక్కలు ఈ నల్ల పొద్దులు
దళిత స్త్రీలు రచించిన సాహిత్యాన్ని తొలిసారిగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన ఘనత గోగు శ్యామలది. నిజానికి ఇది చిన్నపనికాదు. అన్వేషి వారి సహాయ సహకారాలతో చేయగలిగింది. ఈ పుస్తకం చూడగానే చాలా సంతోషమన్పించింది. దీని వెనుక వున్న అకుంఠిత దీక్ష, శ్రమ కన్పించాయి.
1988లో నేను రీసెర్చ్ చేస్తున్న రోజుల్ని గుర్తుకు తెచ్చింది. కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాల్ని పరిశోధన చేయాలన్న నా తపనకు రెండు యూనివర్సిటీలు అనుమతినివ్వలేదు. మూడో యూనివర్సిటీ వాళ్లు కూడా చాలా అభ్యంతరపెట్టారు. అసలు కవిత్వం రాసిన స్త్రీలే లేరు. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వాళ్లు రాసిన కవిత్వమూ లేదు. దానిపై పరిశోధనలేమిటి? ఫ లానా రచయిత రచనలు పరిశీలన చెయ్యి బాగుంటుంది అన్నారు.
అభ్యంతర పెట్టిన కొద్దీ నాలో పట్టుద ల పెరిగింది. ఎందుకు కవయిత్రులు ఎక్కువగా లేరు? సమాజమా, సాహిత్యమా ఎవరు కారణం? ఏ రాజకీయ, సామాజిక ఆర్థిక పరిస్థితులు కారణం? స్త్రీలు నిజంగానే బ లహీనులా? అణచివేయబడ్డారా? కావాలని స్త్రీలని చరిత్ర మరుగున పడేసిందా? ఇవన్నీ పరిశీలిస్తే అది పరిశోధన కాదా? అని వాదించి మొదలుపెట్టాను.
తవ్విన కొద్దీ శిథి లా ల నుంచి మణులూ, మాణిక్యాలూ అనేకం బయటపడ్డాయి. వందలాది మంది కవయిత్రులను వెలికి తీయగలిగాను.
సరిగ్గా అటువంటి ప్రయత్న ఫలితమే గోగు శ్యామల నల్లపొద్దు సంకలనం. ఇందులో 54 మంది దళిత స్త్రీల రచనలున్నాయి. వాళ్ల జీవిత వివరాలూ, ఇంటర్వ్యూలూ వున్నాయి.
సామాజికపరమైన హింసను స్త్రీలు అనుభవిస్తున్నారు. సామాజిక హింసతో పాటు, కుల హింసను కూడా దళిత స్త్రీలు అదనంగా ఎదుర్కొంటున్నారు. చాలా తక్కువ కులాలవారిగా పరిగణించబడుతూ, తమను బలవంతంగా హీనస్థితిలోకి నెడుతున్న వ్యవస్థను ప్రశ్నించి, ధిక్కరించి, నిలబడి పోరాడుతున్న నేటి దళితోద్యమ చరిత్రలో విస్ఫులింగాలు ఈ రచయిత్రులు.
వారి వారి ప్రాపంచిక దృక్పథాన్నుంచి, రాజకీయ అవగాహననుంచి, స్త్రీవాద నేపథ్యాన్నుంచి, అక్షరాలను ఆయుధాలుగా మలుచుకున్నారు. ప్రశ్నతోనే జ్ఞానం ఉదయిస్తుందనీ, పోరాటంతోనే స్వేచ్ఛ లభిస్తుందనే వాస్తవాన్ని గ్రహించి నిలబడ్డ ధీర వనితలు.
ఇందులో 1890ల నుంచి రచనలు చేస్తున్న వారున్నారు. గుల్చానమ్మ, జ్ఞానరత్నమ్మలపై కూడా రాజకీయాల ప్రభావం సంస్కరణోద్యమ, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి కనిపిస్తాయి. హిందూ మతం - క్రైస్తవ మతం మధ్య సంఘర్షణకు గురైన సందర్భాల్ని కూడా వారు తమ రచనల్లో వ్యక్తీకరించారు.
ఈ రచనల్లో అస్తిత్వ ఘర్షణ, నిరంతర పోరాట స్ఫూర్తి కన్పిస్తాయి. పసిపిల్లల అంతరంగిక దృశ్యాలు, దళిత స్త్రీల కలలు, కలల సౌధాలు, వాస్తవ జీవిత చిత్రపటాలు, మానవత్వం గొప్పదన్న అభిప్రాయ ప్రకటనలు, శ్రమ సౌందర్య కీర్తనలు, వారి వ్యక్తిగత జీవితాల్లో సంఘర్షిస్తున్న అనేకానేక సూక్ష్మాంశాలను సైతం ప్రదర్శించారు.
-శిలాలోహిత , భూమిక, జులై, ఆగస్ట్ 2003
నల్లపొద్దు
దళిత స్త్రీల సాహిత్యం 1921 - 2002
సంపాదకులు : గోగు శ్యామల
Wednesday, August 13, 2008
వ్యవస్థను కాపాడిన రాముడు - డా. బి. విజయభారతి
వ్యవస్థను కాపాడిన రాముడు
డా. బి. విజయ భారతి
రామాయణం కొందరికి కల్పవృక్షమైతే, మరికొందరికి విషవృక్షం.
ఎవరి దృక్కోణం వారిది.
ఆ తరహాలో వచ్చిన మరో పుస్తకమే వ్యవస్థను కాపాడిన రాముడు.
రామాయణానికి వున్నన్ని అనువాదాలు, రామాయణంపై వచ్చినన్ని విమర్శనా గ్రంథాలు ప్రపంచంలో ఏ ఇతర కావ్యానికీ వచ్చి వుండకపోవచ్చు.
వాల్మీకి రామాయణం చదవకుండానే ఏవేవో రామాయణాల్లోంచి తమకు అనువైన ఉదాహరణలు తీసుకుని రామాయణం రంకు అనే మహానుభావులు వున్నారు, రామాయణాన్ని తమ ఆత్మీయ బంధువుగా భావించేవారు వున్నట్లే. దోపిడీ వ్యవస్థను బలపరచిన బూర్జువా గ్రంథమనే వారూ వున్నారు.
ఎవరి దృక్కోణం వారిది.
డాక్టర్ బి. విజయభారతి రచించిన ఈ పుస్తకంలో రామాయణంతో ఎంతోకొంత పరిచయం వున్నవారందరూ ఆలోచించవలసిన అంశాలు వున్నాయి.
సంప్రదాయ, ఆధునిక పరిశోధకులు వెలువరించిన అనేక పరిశోధనా గ్రంథాలను ఆకళింపుచేసుకుని, తద్వారా తనకు కలిగిన అభిప్రాయాలను అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు రచయిత్రి.
రామాయణాన్ని పరామర్శించినా, విమర్శించినా దానికి ముందు పాఠకుడు తాను చదువుతున్నది కావ్యమా, పురాణమా, ఇతిహాసమా అనే విషయంలో స్పష్టమైన అభిప్రాయానికి రావాలి.
నిజానికి రామాయణం కావ్యమైనా దానిని పురాణంగానో, ఇతిహాసంగానో భావించేవారు లేకపోలేదు. అటువంటి భావనలతో చేసే విమర్శలే పాఠకులకు అనేక అపోహలను కలిగిస్తుంటాయి. రామాయణాన్ని విమర్శించడానికి, ఆ విమర్శను సమర్థించుకోవడానికి చాలా ప్రతిభ కావాలి. అది ఈ రచయిత్రికి సమృద్ధిగా వున్నదని ఈ పుస్తకం నిరూపిస్తుంది.
పురోహిత వర్గాలు, పాలక వర్గాలు కలసికట్టుగా వుంటూ సమాజంలోని కిందివర్గాలను, వారి కార్యకలాపాలను నియంత్రించడం రామాయణంలో కనిపిస్తుంది అని ప్రకటిస్తారు రచయిత్రి. అటువంటి వాఖ్యలు చేయడానికి ఎంతో ధైర్యం కావాలి.
రామాయణకాలం ఎప్పటిది, వాల్మీకి బోయవాడా, మునిపుంగవుడా అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికే కాదు ఎప్పటికీ దొరకవు. ఎందుకంటే ఈ విషయంలో ఏ ఇద్దరూ ఒకే అభిప్రాయానికి రాలేరు గనుక. ఆ కాలాన్ని క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాలలోపు కుదించినా, లేక కొన్ని యుగాలకు ముందనుకున్నా, ఒరిగే లాభమూ లేదు, నష్టమూ లేదు.
రామాయణం ఇప్పటికీ జనం నాల్కలపై నిలిచి వుందన్నది ఒక్కటే వాస్తవం. అంతటి అజరామరమైన మహాకావ్యం ప్రపంచంలో మరొకటి లేదన్నదీ వాస్తవమే. హోమరు పేరు తెలియని వారికి సైతం వాల్మీకి పేరు తెలుసు. అది చాలు. ....
రామాయణంలోని అనేక అంశాలను చాలా సులువైన రీతిలో ఈ పుస్తకంలో పరిచయం చేశారు రచయిత్రి.
రామాయణాన్ని కొత్త కోణంలోంచి ఆవిష్కరించిన పుస్తకం ఇది.
ఎ. సునీల్ చంద్ర, వార్త దిన పత్రిక
వ్యవస్థను కాపాడిన రాముడు
రచన: డాక్టర్ బి. విజయ భారతి
వెల : రూ.75
Monday, August 11, 2008
నేల నాగలి మూడెద్దులు - బొజ్జా తారకం
నేల నాగలి మూడెద్దులు
బొజ్జా తారకం
సకల జీవరాశులకూ, సమస్త మానవకోటికీ అడగకుండా అన్నంపెట్టే ఈ నేల నాదని కొందరు స్వార్థపరులు గిరిగీసుకొని, ముళ్ల కంచెలు వేసి, రాళ్లు పాతి మిగిలిన వాళ్లెవరూ ఈ నేల అందించే నీరు, నిప్పూ, అన్నం ముట్టుకోకుండా కట్టడి చేస్తున్నారు. ఇది అన్యాయం అని అందరికీ కనబడుతున్నది. భూమి మీద దొరికే సంపద అంతా అందరూ సమానంగా పంచుకోవాలని, ఏది కూడా ఏ కొందరి చేతుల్లోనో ఇరుక్కుపోయి ఉండకూడదని, నేల అందిస్తున్న ఫలాలను అన్నీ అందరూ సమానంగా పంచుకోవాలని, ఏది కూడా ఏ కొందరి చేతుల్లోనో ఇరుక్కు పోయి ఉండకూడదని, నేల అందిస్తున్న ఫలాలను అన్నీ అందరూ సమానంగా పంచుకోవాలనే పద్ధతి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూనే వున్నార. ఆ ప్రయత్నాల నేపథ్యమే ఈ పుస్తకం.
....
బొజ్జా తారకం వృత్తిరీత్యా సీనియర్ న్యాయవాది. కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే ఆయన హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్ ఉద్యోగానికి రాజినామా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ సహవ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలం పాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే బొజ్జా తరకం ఇప్పటికీ దళితులను సంఘటిత పరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు. భారత రిపబ్లికన్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మానవ హక్కుల, పౌర హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది. బొజ్జాతారకం రచనల్లో ...పోలీసులు అరెస్టు చేస్తే ... (1981), కులం వర్గం (1996), నది పుట్టిన కొంతుక (1983) ప్రముఖమైనవి.
నేల నాగలి మూడెద్దులు
రచన : బొజ్జా తారకం
74 పేజీలు, వెల రూ. 25
Saturday, August 9, 2008
వైద్య వ్యాపారం- రోగులకూ వైద్యులకూ మధ్య పెరుగుతున్న అగాధాన్ని విశ్లేషించే పుస్తకం
వైద్య వ్యాపారం
మీరు రోగికి సేవ చేస్తున్నారా? ప్రజల ఆరోగ్య సంరక్షణతో మీకు సంబంధం వుందా? ఆరోగ్యం విషయంలో ప్రజల హక్కుల పట్ల మీకు ఆసక్తి వుందా? నాసిరకం వైద్య సౌకర్యాలవల్ల నష్టపోతున్న ప్రజల గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? నిర్లక్ష్య వైద్యంవల్ల మీ సన్నిహితులెవరైనా ప్రాణాలు కోల్పోయారా? అయితే ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే. రోగులకూ వైద్యులకూ మధ్య పెరుగుతున్న అగాధాన్ని సరికొత్త కోణంలో కథలు కథలుగా విప్పిచెప్పే ఈ పుస్తకం తెలుగులో అపూర్వమైనది. తమ సన్నిహితులను కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తుల యదార్థ గాథలు, వారికి అండగా నిలిచిన న్యాయవాదుల వాదనలు, వ్యాపారంగా మారిన వైద్యం వల్ల ప్రజలకు కలుగుతున్న కష్ట నష్టాలు ఎన్నో ఇందులో వున్నాయి. నిర్లక్ష్య వైద్యం వల్ల అగచాట్ల పాలవుతున్న రోగులకు, వారి బంధువులకు ఒక ఆయుధంగా ఉపయోగపడగల విపుల సమాచార వేదిక ఈ పుస్తకం.
....
వైద్యానికి నైతిక చికిత్స
డాక్టర్ దేశాయ్‌కి,
నేను గత సంవత్సరం నుంచీ నానా యాతన పడుతున్నాను. ఏడ్వని క్షణమూ, పెడబొబ్బలు పెట్టని రోజు అంటూ లేదు. నా దుస్థితికి నీ అనైతిక, అమానవీయ ప్రవర్తనే కారణం. రెండు మూడు రోజులలో నేను భగవంతుని సన్నిధికి చేరుకుంటాను. ఈ సంవత్సర కాలంలో నిన్నూ నీ భార్యనీ శపించని రోజంటూ లేదు. నేనూ నా భర్తా ఎంత నరక యాతన వెళ్లదీశామో అవే పరిస్థితులు నీకు రావాలని ఆ భగవంతుడిని మరీ మరీ వేడుకుంటున్నాను. నీ భార్యకు సైతం నాకు పట్టిన గతే పట్టాలని కోరుకుంటున్నాను. నీ అహంభావంతో నన్ను కొద్దికొద్దిగా హత్య చేశావు. నువ్వు చేసిన ఈ పనిని దేవుడు ఎన్నడూ క్షమించడు.
ఇట్లు
లీలా సంఘి
ఈ ఉత్తరం రాసిన లీల డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ఎంతో నరకయాతన అనుభవించింది. ఆమె భర్త రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ పి.సి. సంఘీ. ఆయన ఈ విషయమై ముంబాయి హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కాన్సర్ నిపుణుడు డాక్టర్ ప్రఫుల్ల దేశాయ్ నిర్లక్ష్యమే లీలను నరకయాతనకు గురిచేసింది. ఆమె ఎంతటి భయానక స్థితిని చవిచూసిందో చెప్పడానికి డాక్టర్‌కు ఆమె రాసిన ఈ చివరి ఉత్తరమే ప్రత్యక్ష్య సాక్ష్యం.
నర్సింగ్ హోమ్‌లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రులు ఒక్కటేమిటి అంతటా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ప్రదర్శిస్తున్న అశ్రద్ధ, అ లక్ష్యం రోగుల బతుకుల్లో నిప్పులు పోస్తోంది. అందుకు మనందరి అనుభవాలలో కూడా ఎన్నో సంఘటనలున్నాయి. అందరం ఏదో ఒక సమయంలో ఇటువంటి దారుణాలను చవిచూసిన వాళ్లమే. కానీ మనలో చాలామందిమి ఆ సంఘటనలను అక్కడే మరిచిపోయి మామూలు జీవితానికి అ లవాటుపడిపోతుంటారు. కానీ డాక్టర్ల మోసాలపై, వారి నిర్లక్ష్యంపై ముంబయికి చెందిన వైద్య మిత్రమండలి ... మెడికో ఫ్రెండ్స్ సర్కిల్ ... గత ఇరవైయేళ్ల నుంచి పోరాటం చేస్తోంది. వాళ్ల కృషి ఫలితమే ఈ పుస్తకం. ఇందులో వున్న నిజాల సంకలనంలోని చిన్న ఉదాహరణే పైన పేర్కొన్న ఉత్తరం.
ఈ పుస్తకంలో నేడు వైద్యరంగంలోని అవినీతిని, అక్రమాలను బయటకు తీసుకువచ్చేందుకు జరిగిన అపూర్వ కృషి వుంది. ఇంతకు ముందు పేర్కొన్న డా.ప్రఫుల్ల దేశాయ్ ఈ పుస్తకం వల్ల తనకు పరువు నష్టం జరుగుతోందని, దీనిని వెంటనే నిషేధించాలని ముంబాయి కోర్టులో కేసువేశారు. దాంతో ఈ పుస్తకం మహారాష్ట్ర లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
లీలా సంఘి కేసులో న్యాయమూర్తిగా వుండి రిటైరైన జస్టిస్ సురేష్ స్వయంగా ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. అందులో ఆయన - ప్రతి భారతీయునికి ఆరోగ్య సంరక్షణ లభించినప్పుడే జీవించే హక్కు (రాజ్యాంగం ఆర్టికిల్ 21) సార్థకం అవుతుందన్నారు. రాజ్యం దీనిని అమలుపరచకపోతే కోర్టుల ద్వారా, రిట్‌లద్వారా పోరాటం చేసి సాధించుకోవచ్చన్నారు. వైద్యవృత్తి నిర్లక్ష్యం వహిస్తే రోగి ఎవరైనా చుక్కలు లెక్కపెట్టుకోవలసిందే. ఈ పరిస్థితుల్లో రెండు వేల సంవత్సరాల నాటికి (!) అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ యిచ్చింది. ఇప్పటికీ మనం దాని దరిదాపుల్లోకి కూడా చేరుకోలేదు. చాలా ఏళ్లుగా న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సురేష్ వ్యక్తం చేసిన ఆవేదన వైద్య పరిస్థితి ఎంతగా చేజారిపోయిందో తెలియజేస్తుంది.
ఈ పుస్తకం మూడు విభాగాలుగా వుంది. వైద్య వ్యవస్థలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని గుర్తించడానికి రేఖామాత్రంగానైనా విస్తరించడానికి మొదటి భాగం ప్రయత్నిస్తే ... రెండవ భాగంలో బాధితులకు సంబంధించిన నాలుగు కథనాలు పోరాట చిత్రణతో కూడుకుని వున్నాయి. మూడవ విభాగంలో ఆయా కేసులు రేకెత్తించిన అంశాలు, వివాదాలు, వాటి తీరుతెన్నులపై వ్యాసాలున్నాయి. వైద్య వృత్తి నైతిక బాధ్యతను ఈ విభాగం చిత్రిస్తుంది. మెడికల్ కౌన్సెళ్ల పనితీరును విశ్లేషిస్తుంది.
వైద్య వృత్తి ఆచరణలో నైతిక సూత్రాలు విడదీయలేనివి. నైతిక సూత్రాలు మంటగలిసిపోవడం వల్లే వైద్యుల దొంగలెక్కలు నడుస్తున్నాయన్న అభిప్రాయం బలంగా వుంది. ఈ దుస్థితివల్ల నిర్లక్ష్య వైద్యం, నైతికత, వినియోగదారుని సంరక్షణ వంటి అంశాలు చర్చనీయమైపోయాయి. డాక్టర్ల నిర్లక్ష్యం, నిర్లిప్తతలపై మూడవ భాగంలో విపులంగా చర్చ జరిగింది. ఇంగ్లీషు అనువాదానికి అనుబంధంగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కేసులను వాటి నిర్లక్ష్యాన్ని సోదాహరణంగా వివరించారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ పనితీరును దాని ఆశయాలను పేర్కొన్నారు. ఎస్. జగన్‌రెడ్డి, ప్రభాకర్ మందార అనువాదం కూడా ఎమోషనల్‌గా వుంది. ఈ పుస్తకం రోగులను, డాక్టర్లను, ప్రజలను అందరినీ ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు.
- సుంకరి పోషన్న (వార్త దినపత్రిక)
వైద్య వ్యాపారం
- అమర్ జెసాని, పి.సి. సింఘి, పద్మ ప్రకాశ్
ఆంగ్లమూలం : మార్కెట్, మెడిసిన్ అండ్ మాల్‌ప్రాక్టిస్
తెలుగు అనువాదం : యస్. జగన్ రెడ్డి, ప్రభాకర్ మందార