Thursday, July 31, 2008

ఆయుధం పట్టని యోధుడు ... మార్టిన్‌ లూథర్‌ కింగ్‌


ఆయుధం పట్టని యోధుడు ... మార్టిన్‌ లూథర్‌ కింగ్‌


...అమెరికన్‌ నల్లజాతి పోరాటంలో అహింసా విధానానికి ఊపిరి పోసి, నోబెల్‌ శాంతి పురస్కారంతో సత్కరించబడిన డా. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జీవిత చరిత్ర....

డాక్టర్‌ యం.వి. రమణారెడ్డి గారి ఆయుధం పట్టని యోధుడు చదువుతున్నంత సేపూ గతంలో హారియట్‌ బీషర్‌స్తోవే రాసిన అంకుల్‌ టామ్స్‌ కేబిన్‌, హోవర్డ్‌ ఫాస్ట్‌ రాసిన ఫ్రీడం రోడ్‌, ఎలెగ్జ్‌ హేలీ రాసిన రూట్స్‌ (ఏడు తరాలు) నా స్మృతి పథంలో మెదిలాయి.

ఆ నవలలు చదివినప్పుడు అమెరికాను అసహ్యించుకున్నాను. ప్రపంచంలో అగ్రరాజ్యంగా, నాగరిక దేశంగా కీర్తించబడుతున్న అమెరికాలోశతాబ్దాల తరబడి నీగ్రో జాతిమీద జరిపిన దాడులూ, వర్ణ వివక్షా, ణిచివేతా, క్రూరమైన హింసాకాండా, ఇలాంటివి ఎన్నెన్నో అర్థమై అమెరికా ఇంత అనాగరిక, ఆటవిక రాజ్యమా అని కంపరం కలిగింది. ఈ నవలల్లోని కథాకాలం ఒక శతాబ్దం కిందటిదన్న మాట నిజమే అయినప్పటికీ, ఈ పుస్తకంలోని చారిత్రక కాలం నిన్న మొన్నటిది. అమెరికాలో ఇప్పటికీ నీగ్రోల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే వుంది.

అమెరికాతో మన దేశాన్ని పోల్చినప్పుడు, ఇక్కడ కూడా దళితుల పట్ల వివక్ష, అస్మృశ్యత ఇంకా కొనసాగుతున్నప్పటికీ అమెరికాలోలా క్రూరంగా, పాశవికంగా, నిర్లజ్జగా మాత్రం కాదు. ప్రపంచీకరణ పేరుతో ఆ దేశం కొనసాగిస్తున్న ఆర్థిక, సాంస్కృతిక దోపిడీల నేపథ్యంలో ఈ పుస్తకం అవసరం ఎంతో వుంది. మరీ ముఖ్యంగా ఆ దేశంపట్ల భ్రమలు గలవారికి మరింత ఆవశ్యకత వుంది. ఇది మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జీవిత చరిత్ర మాత్రమే కాదు, అమెరికా సాంస్కృతిక చరిత్ర కూడా!

ఒక సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఓ నల్లజాతి స్త్రీ, ఒక తెల్లజాతీయునికి సీటు ఖాళీ చేసి ఇవ్వని కారణంగా అరెస్టుకు గురి అయ్యింది. ఆ సంఘటనతో ప్రారంభమైన జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ నాయకత్వంలో ఎలాంటి ప్రకంపనలు కలిగించింది? ఎలాంటి అవరోధాలు ఎదుర్కొన్నది? ఎలాంటి ఆణిచివేతకు గురి అయ్యింది? ఎలాంటి దశలను అధిగమించింది? అది క్రమక్రమంగా విస్తరిస్తూ ఎలాంటి ఫలితాలను సాధించింది? మొదలైన ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానాలు లభిస్తాయి. పాఠకుడు ఆ ఉద్యమంలో మానసికంగా తాదాత్మ్యం చెందుతాడు.

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఉద్యమం అహింసాయుతమైన ఉద్యమం. ఆయుధం పట్టని ఉద్యమం. బూటకపు ప్రజాస్వామ్యాన్ని బట్టబయలు చేసిన ఉద్యమం. కనీసపు ఓటు హక్కు కూజడా లేని నీగ్రోలు పిడికిలి బిగించిన ఉద్యమం. అనేకానేక సంక్షోభాలనూ ఒత్తిళ్లనూ ఆణిచివేతలనూ ఎదుర్కొన్న ఉద్యమం. మన దేశపు మహాత్మాగాంధీని ఆదర్శంగా స్వీకరించిన ఉద్యమం. అసంఖ్యాక ప్రజాబలంతో విస్తరించిన ఉద్యమం. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ తన ఆశయం కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టిన ఉద్యమం!

ఆయన ఉద్యమాన్ని అణచటానికి, దానిని అభాసుపాలు చేయటానికి కుటిలమైన జిత్తులతో, మోసపు ఎత్తుగడలతో, తీవ్రమైన నిర్బంధంతో ఎన్నెన్నో కుట్రల్ని పన్నిన వైనం, మనకు అమెరికా అప్రజాస్వామికత పట్ల ఏవగింపు కలిగేలా చేస్తుంది. పాఠకుడు ఈ పుస్తం చదవటం ప్రారంభించినప్పటి నుండి ఆ ఉద్యమంతో తాదాత్మ్యం చెందుతాడు. ఉద్విగ్నుడౌతాడు, ఉత్తేజితుడౌతాడు!

డాక్టర్‌ యం.వి. రమణారెడ్డి గారు ఇప్పటికే కథకుడిగా (పరిష్కారం కథల సంపుటి), అనువాదకుడిగా (పాపియాన్‌, అవే విత్‌ ఆల్‌ ద పెస్ట్స్‌), పత్రికా సంపాదకుడిగా (ప్రభంజనం), రాయలసీమ ఉద్యమకారుడిగా (రాయలసీమ కన్నీటి గాథ) చాలామందికి సుపరిచితులు. వారు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జీవిత చరిత్రను ఒక ఫిక్షన్‌లా నవలా నిర్మాణంలో ఒదిగించి రాసిన తీరు పాఠకుడిని ముగ్ధుణ్ణి చేస్తుంది. వాక్య నిర్మాణం, పదాల కూర్పు, శైలి పఠితను ముందుకు నడిపిస్తుంది.

- సింగమనేని నారాయణ

..... అమెరికా స్వభావానికి అద్దం పట్టే ఈ పుస్తకాన్ని ఎవరికీ అరువీయకండి. కానీ, మీకు పరిచయమున్న ప్రతి వ్యక్తీ దీన్ని చదివేలా చేయండి. వారు స్వయంగా కొని దగ్గరుంచుకునేలా చూడండి. ఈ మహాయజ్ఞంలో మీరు సాధించగలిగే ఫలితాలు రెండున్నాయి. తెలుగు పుస్తకాలను చదవటం మానేసి, టివీలకు అప్పగించిన కళ్లను తెలుగు అక్షరాల మీదికి మళ్లించడం మొదటి ప్రయోజనం... సంపాదన కోసం అనురాగాన్ని బలిచేసి, తమ సంతానాన్ని అమెరికాకు పంపాలనే ప్రయత్నంలో సాముగరిడీలు చేస్తున్న తల్లిదండ్రులకు ఆ అమెరికా గురించి కాసింత కనువిప్పు కలిగించడం రెండో ప్రయోజనం. ఈ శయాన్ని ఆమోదించే తెలుగు ప్రజలకు నమ్రతతో నమస్కరిస్తున్నాం....

ఆయుధం పట్టని యోధుడు ..మార్టిన్‌ లూథర్‌ కింగ్‌

రచన: డా. యం.వి.రమణారెడ్డి

210 పేజీలు, వెల : రూ.80

Monday, July 28, 2008

యువతరానికి పోరాట స్ఫూర్తి ..... చే గెవారా




ప్రవహించే ఉత్తేజం చే గెవారా
ప్రజల ప్రాణాలమీద గౌరవంలేని విప్లవకారులూ, జనం మెడలకు గుదింబడలుగా మారిన విప్లవ మేధావులూ వున్న నేటి సమాజానికి చేగెవారా అవసరం మరింత పెరిగింది. వ్యక్తిగత, రాజకీయ జీవితాలమధ్య వైరుధ్యాన్ని రద్దు చేసుకునేందుకు, అందివచ్చిన ఆధిపత్యాన్ని స్వచ్ఛందంగా వదలుకునేందుకు జీవితాంతం చేగెవారా పడిన ఘర్షణను రికార్డు చేయడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.
చిన్నతనం నుంచి ఆస్థమాతో బాధపడే ఎర్నెస్తో అనే చెగెవారాలో కార్యదీక్ష, పట్టుదలతో పాటు సున్నిత మనస్థత్వం వున్నాయి. అందుకే ఇంజనీరింగ్‌ చదివి మెడిసిన్‌లో చేరాడు. డాక్టర్‌గా వెనిజులా వెళ్లి కుష్ఠురోగుల ఆస్పత్రిలో పనిచేయాలని సంకల్పించాడు. అర్జెంటీనా ఇతర లాటిన్‌ ఆమెరికా దేశాల్లో రైతుల, ఇండియన్‌ తెగల జీవన పరిస్థితులను అధ్యయనం చేయడానికి చేసిన పర్యటన, ఆయన ఆలోచనా విధానాన్ని మార్చి వేసింది. లాటిన్‌ ఆమెరికాలోని స్థానిక ప్రజల మీద అమెరికన్‌ సామ్రాజ్యవాదులు ఎంతో కాలంగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఆ దేశాల రాజకీయ వ్యవస్థ, ఆర్థిక సంపదలను అమెరికా ప్రభుత్వం, సిఐఎ నియంత్రిస్తుంటాయి. వారి అధిపత్యాన్ని స్థానిక ప్రభుత్వాలు ఏమాత్రం వ్యతిరేకించినా వెంటనే ఆ ప్రభుత్వం పతనం కాక తప్పదు. చెరకు పంటకు, చక్కెర ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన క్యూబా మీద ఎంతోకాలంగా అమెరికా సర్వాధికారాలను చలాయిస్తుంటుంది. అనేక లాటిన్‌ అమెరికన్‌ దేశాలలో వలెనే క్యూబాలో కూడా అధ్యక్షుడు బతిస్తా అమెరికా చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తుంటాడు. ఫిడెల్‌ కాస్ట్రో అనే యువ న్యాయవాది నాయకత్వంలో కొందరు యువకులు సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. చెగెవారా వారితో చాతులు కలిపాడు. ఆవిధంగా గెరిల్లా సేనలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రవేశించి, కమాండర్‌ స్థాయికి ఎదిగినా ఎలాంటి ప్రత్యేకతలను, ఎవరికీ లేని సౌకర్యాలను తీసుకోవడానికి నిరాకరించాడు. క్యూబా దేశీయుడు కాకపోయినా, పరాయి దేశం లోని ప్రజల కష్టాలకు స్పందించి వారి విముక్తి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన చెగెవారా దృక్పథం, సార్థరాహిత్యం ఫిడెల్‌ కాస్ట్రోను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
క్యూబా విప్లవోద్యమంలో కార్యకర్తగా అడుగు పెట్టిన నాటినుంచి బొలీవియాలో హత్యకు గురయ్యేవరకూ అమెరికన్‌ సామ్రాజ్యవాదం మీద రాజీలేని పోరాటాన్ని సాగించిన విప్లవకారుడు చే. ఆయన రూపకల్పన చేసిన లాటిన్‌ అమెరికా విముక్తి వ్యూహంలో కీలకమైన అంశం సామ్రాజ్యవాద వ్యతిరేకతే. చెగెవారా మరణించి నాలుగు శతాబ్ధాలు దాటింది. దేశదేశాల విప్లవకారులు, రాజకీయ విశ్లేషకులు ఆయన విప్లవాచరణ గురించి చర్చిస్తూనే వున్నారు. క్యూబా ప్రజల్లోనే కా, అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో చెగెవారా పోరాట స్ఫూర్తితో చిన్న చిన్న బృదాలుగా యువతరం సంఘటితమవుతూనే వున్నది. భారత దేశంలోని వామపక్షాలు చెగెవారా స్ఫూర్తిని, ఆశయాలను పక్కనపెట్టి తమ అవకాశవాద రాజకీతాలకు అనుగుణంగా ఆయనను వాడుకుంటున్న తీరును రచయిత్రి విమర్శించడం ఆలోచింపజేస్తుంది.
...వార్త 11.6.2006
ప్రవహించే ఉత్తేజం చే గెవారా
రచన: కాత్యాయని
224 పేజీలు, వెల రూ.70/-

గిరిజన జీవితాల్ని ప్రతిబింబించిన ... తాండా


గిరిజన జీవితాల్ని ప్రతిబింబించిన ... తాండా

మారిపోయిన దేశకాల పరిస్థితులకి, చుట్టుముట్టిన వ్యాపార సంస్కృతికి నడుమ నలిగిపోయి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై చివరికి తన ఉనికినే పోగొట్టుకున్న ఒక లంబాడీ తండా కథ ఇది. మల్లికార్జున్‌ హీరేమఠ్‌ కన్నడంలో రాసిన ఈ నవలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ' తాండా ' పేరుతో తెలుగులో ప్రచురించింది. ప్రత్యేక మైన వేషభాషలు, ఆచార వ్యవహారాలున్న లంబాడీల బతుకులకు అద్దం పట్టిన రచనలు చాలా తక్కువ. ఈ పనిచేసినందుకు ముందుగా మూలరచయిత హీరేమఠను, దాన్ని తెలుగులో అనువదించిన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ను అభినందించాలి.

తాండా లో కథానాయకుడు సోమాల్య తమ సంప్రదాయాలను, పద్ధతులను కాపాడుకోవాలని ఆరాటపడే మనిషి. దారిద్య్రం కారణంగానే తాండాలో సారాయా అ లవాటు, వ్యభిచారం పెరిగాయని - అవి రూపుమాసి పోవాలంటే ఆర్థికంగా ఎదగడం ఒక్కటే మార్గమని భావిస్తాడు. తమ సమూహానికి చెందిన ఒక యువతి సాటి లంబాడీని కాకుండా ఊరి యువకుడిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నాగరీకుల మీద అపనమ్మకాన్ని ప్రకటించటమూ, అది నిజం కావడమూ జరిగిపోతాయి. అక్షర జ్ఞానమే లేని తండాలో కాస్తో కూస్తో చదువుకున్న కొడుకు తమ సంప్రదాయాలకు విరుద్ధంగా పెళ్లాడటం ఒక్కటే కాదు ... కొడుకూ, కోడలూ తమ మూలాలను మరిచి నాగరీకంగా ప్రవర్తించటమూ సోమాల్యను తీవ్రంగా బాధిస్తాయి. ఊరుతో పోరాడి, పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని తండా వాసులు సాధించుకున్న భూములు, గుట్టలు చివరికి గ్రానైట్‌ రాళ్ల పరిశ్రమగా మారిపోవటం - ఆ పరిశ్రమలో తండా వాసులు కూలీలుగా పనిచేయాల్సి రావడం చూసి సోమాల్య కలత చెందుతాడు. దీనంతటికీ తన చిన్న కొడుకు కారణం కావడం అతడిని మరింత కృంగదీస్తుంది. పోగొట్టుకున్న భూములు ... రూపురేఖలు పోగొట్టుకున్న తాండా ... మారిపోయిన కొడుకులూ ... కళ్లముందే అంతరించిపోతున్న ల ంబాడీ సంస్కృతి ... సోమాల్యను చివరికి అచేతనంగా మానసిక అస్వస్థుడిగా మార్చుతాయి.

ఉద్యోగరీత్యా తాండాకు వెళ్లి, వారితో మమేకమైన ఉపాధ్యాయుడి పాత్ర మూడొంతులపైగా కథను చెబుతుంది. ఇక మిగిలిన భాగాన్ని మరో మూడు లం బాడీ పాత్రలు చెబుతాయి.

...ఆంధ్ర జ్యోతి 20-6-2004


తాండా

రచన: మల్లికార్జున్‌ హిరేమఠ్‌

కన్నడ మూలం : హవన, ఆనందకాండ గ్రంథమాలే, మల్లాడి హళ్లి, కర్ణాటక.

తెలుగు అనువాదం : జయశ్రీ మోహన్‌ రాజ్‌, ఎస్‌. మోహన్‌ రాజ్‌

140 పేజీలు, వెల రూ.35

Wednesday, July 23, 2008

తెలుగు క్లాసిక్స్‌ ... మన మంచి పుస్తకాలు



మన మంచి పుస్తకాలు

ఇటీవల తెలుగు పాఠకుల సంఖ్య చాలా పెరిగింది. కానీ ఒక తరాన్ని ముందుకు నడిపించి, సామాజిక జనజీవన చైతన్యానికి దోహదపడిన నాటి మేటి రచనలు నేటి తరం చదువరులకు లభ్యం కావటం లేదు. కొన్ని అమూల్య రచనలైతే మార్కెట్‌ నుండి పూర్తిగా కనుమరుగై పోయాయి. దీనిని దృష్టిలో వుంచుకుని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ... మన మంచి పుస్తకాలు ... పేరుతో ఆసక్తికరమైన రీతిలో సంక్షిప్తపరచి తెలుగు క్లాసిక్స్‌ సిరీస్‌ను వెలువరిస్తోంది. ఈ పుస్తకాలు గొప్ప రచయితల రచనా

ప్రపంచాన్ని కొత్తగా చదువు నేర్చిన పిల్లలతో పాటు మనందరినీ అ లరిస్తాయి. వీటిని పదేళ్లు దాటిన బాలబాలికలు, పెద్దలు

అందరూ చదవుకునేందుకు వీలుగా తీర్చిదిద్దడం జరిగింది. మన జాతి గర్వించదగ్గ మేటి రచనలను ఇలా సజీవ చిత్రాలతో, సంక్షిప్తంగా పరిచయం చేయటం - చదువరులలో ఆసక్తిని రేకెత్తిస్తుందనీ, తిరిగి మూల రచనలు చదివేలా స్ఫూర్తినిస్తుందనీ ఆశిస్తున్నాం.

ప్రజల మనిషి

రచన: వట్టికోట ఆళ్వారు స్వామి

సంక్షిప్తీకరణ: ఎన్‌. వేణుగోపాల్‌

బొమ్మలు: టి. వెంకన్న

వెల: రూ.25

వట్టికోట ఆళ్వారు స్వామి తెలుగుజాతి గర్వించదగిన మేధావి. సామాజిక ఉద్యమాల కార్యకర్త, నవలా రచయిత. నిజాం నిరంకుశ భూస్వామ్య పాలనలోని తెలంగాణాలో నిరుపేద కుటుంబంలో 1914లో జన్మించారు. స్వయంకృషితో ప్రతిభావంతుడై, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ప్రజ్ఞ సంపాదించారు. విజయవాడలో హోటల్‌ వర్కర్‌గా జీవితం ప్రారంభించి, సామాజిక ఉద్యమాలలోకి ఎదిగారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగస్మ్యాంతో ప్రజా జీవితంలో ప్రవేశించారు.

1944లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఆంధ్ర మహాసభలో, తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్య అభివృద్ధికి ఊరూరా తిరిగారు. దేశోద్ధారక గ్రంథమండలిని స్తాపించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు.

తెలంగాణా ప్రజా జీవితాన్నీ, ఉద్యమాన్నీ చిత్రించే మూడు నవలలు రాయాలని ప్రణాళిక వేసుకుని రాసిన మొదటినవల ఈ ప్రజల మనిషి. ఇందులో 1938 వరకు సాగిన ప్రజా ఉద్యమ చరిత్ర చిత్రితమైంది. తర్వాతి నవల గంగు అసంపూర్తిగా వుండగానే 1961 ఫిబ్రవరి 5న మరణించారు.

చిల్లర దేవుళ్లు

రచన, సంక్షిప్తీకరణ: దాశరథి రంగాచార్య

బొమ్మలు: ఏలె లక్ష్మణ్‌

వెల: రూ.25

దాశరథి రంగాచార్య విలక్షణ రచయిత. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంతోనూ, దేశ స్వాతంత్య్ర సమరంతోనూ మమేకమైన సాహితీమూర్తి, చిల్లర దేవుళ్లతో పాటు ఆయన రాసిన మోదుగు పూలు, జనపథం, మాయ జలతారు వంటి రచనలు గొప్ప పేరు సంపాదించుకున్నాయి. చిల్లర దేవుళ్లు బాష సహితంగా తెలంగాణా జన జీవితాన్ని చిత్రించిన తొలి నవల. ఇది 1969లో ప్రచురితమైంది. 1971లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ అవార్డు పొందింది.

హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదమైంది. ఆకాశవాణిలో ధారావాహికంగా ప్రసారమవటంతోపాటు చలన చిత్రంగా కూడా రూపుదిద్దుకుంది.

కొమురం భీం

ఒక ఆదివాసీ వీరుడి కథ

రచన: భూపాల్‌

బొమ్మలు: ఏలే లక్ష్మణ్‌

వెల: రూ.25

1953లో జన్మించిన భూపాల్‌ జన నాట్యమండలి స్థాపకుల్లో ఒకరు. మంచి నటుడు. రచయిత. దాదాపు పేరున్న అన్ని తెలుగు పత్రికల్లో భూపాల్‌ రచనలు అచ్చయ్యాయి. మా భూమి, దాసి, కొమురం భీము, షార్‌ మొదలైన సినిమాల్లో నటించారు. పట్నం వచ్చిన పల్లె, కొమురం భీము (పిల్లల కోసం), అంబల్ల బండ వీరి పుస్తకాలు. వెనెలలో, భూపాల్‌ పాటలు, కలుపు పాటలు వీరి పాటల పుస్తకాలు.

మాలపల్లి

రచన: ఉన్నవ లక్ష్మీ నారాయణ

సంక్షిప్తం: సహవాసి

బొమ్మలు: అన్వర్‌

వెల: రూ.25

ఉన్నవ లక్ష్మీనారాయణ స్వాతంత్య్ర సమరయోధుడు, సాహిత్య విశారదుడు, సంస్కర్త, కార్యశూరుడు. బార్‌-ఎట్‌-లా చదివినా పర ప్రభుత్వోద్యోగానికి పాకులాడక తనకు తానుగా ఎన్నుకొన్న సంఘసేవలో కాలం గడిపాడు. గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణోద్యమాన్ని నడిపినందుకు బ్రిటీషు ప్రభుత్వం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించి రాయవెల్లూరు జైలులో నిర్భంధించింది. జైలులోనే ఆయన 'మాలపల్లి' రచించాడు. అసమాన సామాజిక స్పృహతో ఆనాడు రాసిన నవలల్లో మాలపల్లి తరువాతే మరే రచన అయినా. సమకాలీన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలకు దర్పణం పట్టిన నవల మాలపల్లి. వాడుక భాష బొత్తిగా వ్యాప్తిలో లేని కాలంలో, మాదిరి (మాడల్‌)కి తగిన పుస్తకాలు లేని పరిస్థితిలో తెలుగు భాష నడకకు అనునుకూలంగా ఈ నవలను రాయడం విశేషం. ఎనభై ఏళ్లనాటి పరిస్థితి తెలియని ఈ తరం పాఠకులకు ఇదేమి వాడుక భాష అనిపించవచ్చు. జాతీయాలు, సామెతలు, తెలుగు పలుకుబళ్లు పొంగిపొరలే మాలపల్లి భావ, భాషా విప్లవాలను ఏకకాలంలో సాధించిన ఉత్తమ కృతి.

పల్లెటూరును వేదికగా చేసుకొని వెలువరించిన చాలా కొద్ది నవలల్లో మాలపల్లి వెలకట్టలేని అక్షరాభరణం. మాలపల్లిని బ్రిటీషు ప్రభుత్వం రెండు సార్లు నిషేధించింది.

గుంటూరులో స్త్రీ విద్యాభివృద్ధికోసం ఆయన నెలకొల్పిన శారదానికేతనం ఆయనను సదా జ్ఞాపకం చేస్తుంది. ఉన్నవ వారు 1958లో కన్ను మూశారు.

ప్రగతిని కోరేవారూ, సాహిత్యంలో వెలుగును కోరేవారూ కోట్లాది కడజాతి వారి గుండె వెతలను విన్పించే మాలపల్లి మన జాతి గర్వించదగిన నవల.

మంచీ చెడూ

రచన: శారద

సంక్షిప్తం: సాహవాసి

బ్మొమ్మలు: కాళ్ల

వెల: రూ.25

అరవై డెబ్బై ఏళ్ల కిందట వందకు పైగా కథలు, ఆరు నవలలతో ఆంధ్ర దేశాన్ని వశీకృతం చేసుకుని అశేష తెలుగు పాఠకలోకానికి శారద గా పరిచితుడైన ఈ రచయిత అసలు పేరు నటరాజన్‌. ఈయన తెలుగువాడు కాదు. స్కూల్లో చదువుకోలేదు. 12-13 ఏళ్లు వచ్చేదాకా ఆంధ్రలో అడుగుపెట్టి ఎరుగడు. బ్రతుకు తెరువు వెతుక్కొంటూ మద్రాసు నుంచి తెనాలి వచ్చి వంటవాడిగా స్ధిరపడ్డ నటరాజన్‌ తెలుగు నేర్చుకున్నాడు. సాంస్కృతిక సంప్రదాయ వారసత్వం కలిగిన తెనాలి, త్రిపురనేని రామస్వామి చదౌరి మొదలు చలం, చక్రపాణి, కొడవటిగంటి, జి.వి.కృష్ణారావు ప్రభృత భావ విప్లవకారులైన సంస్కర్తలు, రచయితల నెందరినో పూచిన తెనాలి నటరాజన్‌ను సహజంగానే ప్రభావితం చేసింది. జీవితం పాఠాలు నేర్పింది. అతనిలోని సృజనశీలి మేలుకొన్నాడు, వికసించాడు. సాహితీ పరిమళాలు వెలార్చాడు.

శారద (నటరాజన్‌) తొలి కథ... ప్రపంచానికి జబ్బు చేసింది. 1946లో ప్రజాశక్తిలో వెలువడింది. ఆ తరువాత జ్యోతి, తెలుగు స్వతంత్ర, విశాలాంధ్ర, యువ, రేరేణి వగైరా ఎన్నో పత్రికల్లో ఆయన రచనలు అచ్చయ్యాయి. 1950 ప్రాంతంలో వెలువడిన ఏది సత్యం నవల ప్రతులన్నీ ఒక్క నెలలో అయిపోయాయి. ఆనాడది అపూర్వమైన రికార్డు ఆంధ్ర పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన ... మంచీ-చెడూ, అపస్వారాలు నవలలు తెలుగు పాఠకలోకాన్ని ఊపిశేశాయి. ముసిరిన దారిద్య్రంలో శారద కన్ను మూశాడు.

మంచీ-చెడూ, అపస్వారాలు సమాజంలో ఆనాడు కొత్తగా చోటుచేసుకొంటున్న వ్యాపార విలువలను చిత్రించాయి. ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ వస్తూన్న మనుషుల స్వభావ శీలాల పరివర్తనాన్ని కళ్లకు కడతాయి ఆ నవలలు.

శారద జీవితం వ్యక్తిత్వం, జనం కోసం కలం పట్టాలన్న ఆయన తపన తరాలు గడచిపోయినా పలిగిపోని స్ఫూర్తి దీపమై

నిబద్ధతగల వర్ధమాన రచయాతలందరికీ ఇన్‌స్పిరేషన్‌ యిస్తాయి.

రథచక్రాలు

రచన: మహీధర రామ్మోహనరావు

సంక్షిప్తం: టి.ఎన్‌.వి.రమణమూర్తి

బొమ్మలు: పాండు

వెల: రూ.25

మహీధర రామమోహనరావు (1990-2000) ప్రసిద్ధ నవలా రచయిత, గొప్ప అనువాదకుడు, కమ్యూనిస్టు ఉద్యమకారుడు, తూర్పు గోదావరి జిల్లాలో పుట్టారు. పదిమంది తోబుట్టువుల్లో పెద్దవాడు. స్వాతంత్రోద్యమ ప్రభావంతో 1920లో థర్డ్‌ ఫాం (ఇప్పటి 8వ తరగతి) చదువుకు స్వస్తి చెప్పారు. సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ భాషలు నేర్చుకున్నారు. 1936 నుండీ మంచి సాహిత్యాన్ని అనువాదం చేయడం మొదలుపెట్టారు. 1948లో రథచక్రాలు నవల రాశారు. కొల్లాయి గట్టితేనేమి?, దేశం కోసం, జ్వాలా తోరణం నవలలు రాశారు. ప్రపంచ ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందించడానికి విశ్వ సాహిత్యమాల ప్రచురణ సంస్థనూ, అవంతీ ప్రెస్‌నూ స్థాపించారు. 1941లో బ్రిటీష్‌ వారి నిర్బంధానికి గురై రాజమండ్రి, రాయవెల్లూరు జైళ్లలో వున్నారు. 1948-51 మధ్య అజ్ఞాతవాసం గడిపారు. 1951లో తెలంగాణా సాయుధ పోరాట విరమణ తర్వాత ప్రజాశక్తి, విశాలాంధ్ర, సంవేదన వంటి పత్రికల్లో పనిచేశారు. 1966-77ల మధ్య మద్రాసులోని సోవియట్‌ సమాచార శాఖలో పనిచేశారు. 1976-79ల మధ్య

మద్రాసు నుండి అభ్యదయ మాస పత్రికను వెలువరించారు. గొప్ప సిద్ధాంత సాహిత్య గ్రంథాలను అనువదించి తెలుగువారి మేధోస్థాయి పెరుగుదలకు దోహదం చేశారు. సులువుగానూ, ఖచ్చితంగానూ వుండే మహీధర అనువాదాలు అనువాదకళకు

క్లాసిక్‌లు.

తెలుగు ప్రజల జీవితంలో ప్రవేశించిన ఆధునికతనూ, దాని సందర్భాన్నీ, అది తీసుకొచ్చిన అవకాశాలనూ, సందిగ్దాలనూ సూక్ష్మంగా అక్షరబద్ధం చేసిన మహీధర రచనల ప్రాధాన్యత నానాటికీ పెరుగుతూ వుంది.

Wednesday, July 16, 2008

పిల్లల కథలు




పిల్లల కథలు

మన పిల్లలకి జంతు నైజం గల మనుషుల కథలు చెప్పడం కంటే మనిషి నైజం గల జంతువుల కథలు చెప్పడం ఎంతో మేలు. ఆధునిక యుగంలో ఆటపాటలకు, అద్భుతమైన కథలకు దూరమవుతున్న పిల్లల చెంతకు వింతల్ని, గిలిగింతల్ని మోసుకెళ్లి వారిలో చక్కని ఊహాశక్తిని, ఉన్నత విలువల్ని పెంచడానికి దోహదం చేసే అపురూపమైన కొన్ని పిల్లల కథల పుస్తకాలని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. ఈ కథలు కేవలం పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలు కూడా చదవ తగ్గవి. వీటిని చదివి వారు గతించిన తమ బాల్యంలో మరోసారి విహరించి అనిర్వచనీయమైన అనుభూతిని పొందవచ్చు. అందరికీ కలకాలం గుర్తుండిపోయే ఆణిముత్యాల్లాంటి కథలివి.

ఈ కథల్లో పిల్లల్ని ఆనంద పరిచే హాస్యం, విస్మయపరిచే కల్పనలు, మాయలు మాత్రమే కాక, వారి దృష్టిని మానవత్వం వైపు మళ్లించగల శక్తి వుంది. సాంఘిక జీవనంలోని అవకతవకల, చేదునిజాల హెచ్చుతగ్గుల పరిచయం వుంది. వివిధ దేశాల్లో, ప్రాంతాల్లో ఇంకా బతుకుతున్న ఈ కథలు మన పరిస్థితులకు చాలా దగ్గరగా వున్నాయి.

అనగనగా కథలు

ఇందులో...1) దొంగవేషం, 2) వ్యాపారికి గుణపాఠం, 3) తల్లిమాట, 4) జమీందారు పెళ్లి, 5) మా మంచి దయ్యం, 6) తెలివైన కోడలు, 7) కట్టెలవాడి కలిమి, 8) అంతులేని ఆశ ... అనే ఎనిమిది సచిత్ర కథలున్నాయి.

36 పేజీలు, వెల: రూ.25

బుడుంగు

ఇందులో...1) బుడుంగు, 2) శ్రీశ్రీశ్రీ నక్కరాజావారు, 3) చేపలవాడు - ద్వారపాలకుడు, 4) గ్రేట్‌ వాల్‌, 5) నీలికళ్ల కుందేలు, 6) చిరుగుల టోపి రాకుమారి, 7) చిన్నచూపు, 8) పర్వతకాయుడు, 9) గొంగళిపురుగు అనే తొమ్మిది సచిత్ర కథలున్నాయి.

40 పేజీలు, వెల: రూ.25

చిన్నోడి ప్రయాణం

ఇందులో...1) భలే భహుమానం, 2) గురువుకు ఎగనామం, 3) చిన్నోడి ప్రయాణం, 4) కోతి - జిత్తులమారి నక్క, 5) సాగరకన్య, 6) దాడి, 7) ఫిడేలు రాగం, 8) తాతమ్మ పులి, 9) దున్న గొప్పా - పులి గొప్పా, 10) ఎగిరే బొమ్మలు అనే పది సచిత్ర కథలున్నాయి.

40 పేజీలు, వెల: రూ.25

అనువాదం: డాక్టర్‌ దేవరాజు మహారాజు, అనుపమ

బొమ్మలు: అన్వర్‌

మూలం: టాటర్‌హుడ్‌ అండ్‌ అదర్‌ టేల్స్‌, చైనా జానపద కథలు

Monday, July 14, 2008

మన పిల్లలకు శ్రమ గౌరవ పాఠాలు నేర్పిద్దాం


సారె తిప్పు ... సాలు దున్ను, మన కాలపు శ్రమ గౌరవ పాఠాలు

కంచ ఐలయ్య

సాలు వెనక సాలు తీర్చిదిద్దినట్టుగా మీరెవరైనా దుక్కి దున్న గలరా? వరినాటు వరసబెట్టి మునుం తప్పకుండా నాటెయ్యగలరా? ఒరం జెక్కగలరా? తూర్పార పట్టగలరా? చెయ్యలేరు. వరి... ధాన్యమా! బియ్యమా! తెలియని అజ్ఞానంలో పెరుగుతున్న కంప్యూటర్‌ బ్రాయిలర్‌ కోడిపిల్లల తరం ఈ పనులు అసలే చెయ్యలేరు. కానీ ఒకటి మాత్రం చెయ్యగలరు. సాలుదున్నిన క్రియాశీలి, సృజనశీలి, సంపద సృష్టికర్తను ఉత్త బైతు...ఎర్ర బస్సు ఎక్కొచ్చినోడు అని ఈసడించుకోగలరు. అదీ సమస్య.

ఒక్క రైతునే కాదు... ఆదివాసులను, పశులమందలను ఏలే పసుల కాపర్లను, చెప్పులు కుట్టిచ్చే తోలుపనివాళ్లను, సారెతిప్పి కుండలూ కూజాలూ మట్టి కళాఖండాలను చేసే కుమ్మరులను, సన్నపోగుపెట్టి అగ్గిపెట్టెలో ఇమిడే కళాత్మక నేత దుస్తులను నేసే సాలోళ్లను, మురికి కంపును ఒదిలించి మీకు చలువ దుస్తులందించే చాకలోళ్లను, బొచ్చుతో ఉంటే కోతులను తలపించే మీ ముఖారవిందాలను అద్దంలా మెరిసిపోయేలా చేసే క్షురకులను, చివరికి ఇంటిపని, పాచిపనిచేసే మన తల్లులను, అక్కలను, చెల్లెళ్లను కూడా ఈసడించుకోగలరు.

శ్రమను హీనంగా చూసే సంస్కృతిలో పుట్టి ఎదుగుతున్న భారత సమాజంలో శ్రమకు విలువలేకపోవడం వెనక పెద్ద కుట్రే వుంది. అగ్రవర్ణాల వారు మానవ సంబంధాలను పుట్టుకతోనే శాసించే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను ఏర్పరచడంలో వుంది. కొంచెంకూడా చెక్కుచెదరనివ్వకుండా కులవ్యవస్థను స్థిరీకరించడంలో వుంది. పురుషు సూక్తాల్లో, వేదాల్లో, మనువు ప్రవచించిన అనాది సిద్ధాంతాల్లో వుంది.

కంచ ఐలయ్య అనే ఒక ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఆధిపత్య భావజాలాలపై పోరాటం చేస్తున్న యోధుడు. ఇప్పుడున్న దాన్ని తలకిందులుగా చూసి, అసలు సత్యాల్ని శాస్త్రీయంగా, తాత్వికంగా, సహేతుకంగాచెప్పగలుగుతున్న బుద్ధిజీవి. హిందూమతం పైనా... ఆది శూద్రుల మీద, పంచముల మీద రుద్దిన భావజాలం పైనా ఆయన రాతలన్నీ అందుకే తలకిందులుగా ప్రశ్నించడంతో ప్రారంభమై ఒక గొప్ప తాత్విక దృష్టిని కలిగిస్తాయి. నేను హిందువు నెట్లయిత? అనే ఒక సాదాసీదా మాటతో ఒక గొప్ప తాత్విక ప్రపంచాన్ని గతంలో ఆవిష్కరించిన కంచ ఐలయ్య శ్రమ గౌరవ పాఠాలకు సబంధించి ఇప్పుడు సారె తిప్పు... సాలు దున్ను అనే అద్భుతమైన పుస్తకం రాశారు.

మానవీయ విలువలపట్ల, ప్రజాస్వామ్య విలువలపట్ల ఏమాత్రం నమ్మమున్న ఏ వర్ణాలవారికైనా, ఏ వర్గాల వారికైనా ఈ పుస్తకం ఇప్పటి దాకా నెత్తురులో పాతుకుపోయివున్న భావాలను చెల్లాచెదురుచేసి కనువిప్పు కలిగించగల గొప్ప సాధనం. మానవ నాగరికతకు మూలమైన శ్రమకు సంబంధించిన వివక్ష మూలాలు కుల, మత భావనల్లో ఉన్నాయన్న విషయం గురించిన కొత్త సిలబస్‌ ఈ పుస్తకం.

ఈ ప్రపంచం ఎట్లా నిర్మితమయింది? దాని నిర్మాతలెవరు? పనికీ జెండర్‌కూ గల సబంధం ఏమిటి? అది విలోమంగా ఎందుకున్నది? అసలు పనిచేస్తున్న వాళ్లు ఎవరు? వారికి గౌరవం ఎందుకు దక్కదు?...శానిపని (నైపుణ్యం) ఏమిటి? సన్నపని ఏమిటి? ఈ శ్రమ ఎట్లా పుట్టింది? ఎన్ని మార్పులు చెందింది? ఒళ్లు వంచి, చెపట కక్కుతూపనిచెయ్యడం అనే ఒక గొప్ప విషయం ... ఎందుకు అగౌరవంగా తయారయ్యింది? చదువు పెరిగినక కొద్దీ ఉత్పాదక శక్తుల పట్ల ఏవగింపు, చిన్నచూపు ఎందుకని వస్తున్నది? ఇది పరిణామ క్రమంలో భాగంగా వస్తున్నదా? దీనివెనక కుల, మత వ్యవస్థల ప్రమేయం ఉన్నదా? ఇలా ... సహస్ర వుృత్తుల సమస్త రహస్యాలు, అద్భుతాలు, ఇన్వెన్షన్లూ అన్నీ కలగలిపి నేర్పుతుంది ఈ పుస్తకం.

ఇది వర్తమాన భారతంలో శ్రమకూ, శ్రమకు సంబంధించిన అన్ని వ్యాపకాలకూ ఆమడ దూరమై పోతున్న ఈ తరపు పిల్లలకు నేర్పాల్సిన విషయాలు. ఉత్త భూమి నుంచి బంగారం పండించగల నేర్పు, బట్టలు నేసే నేర్పు, సబ్బుకు మూల మైన సోడా కనిపెట్టిన నేర్పు, తోలుపనిలో వాడిన రసాయనాల నేర్పు, సారె తిప్పి కళాఖండాన్ని వేళ్ల కొనలమీద చేయగల నేర్పు, అందుకు సబంధించిన విజ్ఞానం, దాని కారణంగా ఏర్పడిన ఇవ్వాల్టి సౌకర్యాల గురించి చాలా చిన్న చిన్న విషయాలతో, ఎక్కడా జార్గన్‌ వాడకుండా, అద్భుతంగా మలిచారు ఐలయ్య.

ఇంగ్లీషులో ... టర్నింగ్‌ ద పాట్‌, టిల్లింగ్‌ ద లాండ్‌ - డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ ఇన్‌ అవర్‌ టైమ్స్‌ ... అనే పేరుతో వచ్చిన ఈ పుస్తకానికి చంద్రిక అనువాదం చాలా సరళంగా తెలుగులోనే రాసినట్టుగా వుంది.

ఐలయ్య ఈ పుస్తకం ఎందుకు రాశారు?

ఐఐటీల్లో, ఐఐఎంలలో, కేంద్ర వైద్య సంస్థల్లో చదువుతున్న అగ్రకులాల పిల్లలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎన్నో ర్యాలీలు చేశారు. వీపీసింగ్‌ బీసీ ల కోసం మండల్‌ కమిషన్‌ సిఫారసులు అమలు పరచాలనుకున్నప్పుడుకూడా విద్యార్థులు పెద్ద గొడవ చేశారు. ఈ ఆందోళనలో వాళ్లు రోడ్లు ఊడ్చారు. బూట్లు పాలిష్‌ చేశారు. కూరగాయలు అమ్మారు. అంటే అర్థం ఏమిటి? డాక్టర్లమై వుండీ మేం రోడ్లు ఊడుస్తున్నామనీ, ఇంజనీర్లమై వుండీ బూట్లు పాలిష్‌ చేశామనీ ... అంతేనా? కాదు. రోడ్లు ఊడ్వడం బూట్లు పాలిష్‌ చెయ్యడం, కూరగాయలు అమ్మడం చిన్నపని అగౌరవమైన పని అని. కానీ వాళ్లు ఆ పనులు నిజంగానే చెయ్యగలరా? సహజ శస్త్రచికిత్సలు చేసే మంత్రసానులు, మంగలి పనివారు లేకుండానే మానవ నాగరికతలో శస్త్ర చికిత్సలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? లేదు అందుకే ఐలయ్యను ఈ విద్యార్థుల కార్యాచరణ చికాకు పరిచింది. ఆ మాటకొస్తే ఆ విద్యార్థులట్లా బయటపడ్డారు కానీ మన ఇంట్లో, ప్రతివాళ్ల ఇంట్లో వాళ్లు శూద్రులైనా, అగ్రవర్ణాల వారైనా శ్రమ పట్ల కొద్దిపాటి గౌరవం కూడా లేకపోవడం మనకు నిత్యానుభవమే. అందువల్లే మన కాలపు ఈ మిడిమిడి జ్ఞానపు, మిడిమేళపు తరానికి మన కాలపు శ్రమ గౌరవ పాఠాలను కంచ ఐలయ్య అందించారు.

ఆదివాసుల తెలివితేటలు ఏ పండు తినాలో, ఏది కూడదో మనకు నేర్పింది. అట్లాగే చాకలి వారి పని, మంగలి వారి పని, వ్యవసాయం అన్ని వృత్తులూ విజ్ఞానానికి సబంధించిన కొనసాగింపుగానే చూడాలనే విషయం ఈ పుస్తకంలో అనేక ఉదాహరణలతో వుంది.

ఒక్క పిల్లలకే కాదు శ్రమను మరిచిపోయి, మూలాలు మరచిపోయి త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న పెద్దలకు కూడా ఇది కనువిప్పుకాగల పుస్తకం. సింగరేణిలో సమ్మె జరిగినప్పుడు గోడలమీద ఒక నినాదం వుండేది. అది శాశ్వతమైన సత్యం. ... కంప్యూటర్లు బొగ్గు తవ్వగలవా? ... తవ్వలేవు. బొగ్గు లేకుండా ప్రపంచం బతకగలదా? లేదు. అందువల్ల శ్రమకు సంబంధించి మౌలికాంశం భౌతిక శ్రమ, దానికి సబంధించిన మేధో శ్రమ. దీనికి మినహాయింపు లేదన్న సత్యాన్ని కంచ ఐలయ్య పుస్తకం ఆవిష్కరించింది. భారతదేశంలో శ్రమగౌరవం లేకపోవడానికి, ఆశాస్త్రీయ, అభివృద్ధి నిరోధక భావజాలం ఉండడానికి కారణమైన మత కుల వ్యవస్థల పాత్రపై, శ్రమలో జెండర్‌ వివక్షపై కూడా ఈ పుస్తకం కొంత సైద్ధాంతికంగా వివరించింది. ఇది అన్ని పాఠశాలల్లో ... అన్ని గ్రంధాలయాల్లో ఉండాల్సిన పుస్తకం. ముఖ్యంగా శ్రమను గౌరవించే వారికి ఇది హ్యాండ్‌ బుక్‌ కాగలిగిన విలువైన పుస్తకం. దీనికి బొమ్మలు వేసిన దుర్గాభాయ్‌ వ్యామ్‌ను ప్రత్యేకంగా పేర్కొనాలి. పెద్దగా చదువులేని దుర్గాభాయ్‌ వ్యామ్‌ ఫోనులో పాఠ్యాంశాలను విని కేవలం పది రోజుల్లో వేసిన బొమ్మలు ఈ పుస్తకానికి అదనపు అందాన్ని, అదనపు విలువనూ తెచ్చాయి. ఐలయ్యకు అనేక అభినందనలు. ఈ పుస్తకం ముద్రించిన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు.

అ ల్లం నారాయణ,

ఆదివారం ఆంధ్ర జ్యోతి, 30 మార్చి 2008, కొత్త పుస్తకాలు... సమీక్ష

సారె తిప్పు ... సాలు దున్ను, మన కాలపు శ్రమ గౌరవ పాఠాలు

రచన: కంచ ఐలయ్య

బొమ్మలు : దుర్గాభాయ్‌ వ్యామ్‌, తెలుగు అనువాదం : చంద్రిక

పేజీలు 108 వెల రూ.80

Sunday, July 13, 2008

నాదిరా సారా అబూబకర్‌


నాదిరా

సారా అబూబకర్‌

కన్నడంలో ముస్లిం స్త్రీల జీవిత వాస్తవికతను ఆవిష్కరించిన మార్గదర్శక రచనగా గుర్తింపు పొందిన చంద్రగిరి తీరదల్లి (చంద్రగిరి తీరంలో) నవల మొదట 1982లో లంకేష్‌ పత్రికలో ధారావాహికగా వెలువడింది. పత్రికా ప్రకాశన పబ్లిషర్స్‌ వారు 1984లో నవలగా ప్రచురించారు. ఆతర్వాత 1995లో నాలుగో ముద్రణకు వచ్చిన సందర్భంగా రచయిత్రి సారా అబూబకర్‌ ఈ నవలను తిరగరాశారు. దాని ఆధారంగానే బ్రేకింగ్‌ టైడ్స్‌ అనే పేరుతో ఆంగ్లానువాదం వెలువడింది. ఇందులో చంద్రగిరి తీరదల్లి (నాదిరా) అనే నవలికా, ఓ మస్లిం అమ్మాయి విద్యాభ్యాసం అనే ఆత్మకథాత్మక రచనా వున్నాయి. ఇది కర్ణాటక సాహిత్య అకాడమీ, మల్లికా ప్రశాంతి అవార్డుల్ని అందుకుంది. అంతేకాక, ఈ పుస్తకాన్ని కూవెంపు, బెంగుళూరు, మంగుళూరు యూనివర్సిటీలతో సహా కర్ణాటకలోని అనేక యూనివర్సిటీల్లో డిగ్రీ క్లాసులకు ఉపవాచకంగా పెట్టారు.

ఈ పుస్తకమూ, దీని రచయిత్రీ సంపాదించుకున్న అవార్డుల్ని, పురస్కారాలన్నీ చూస్తే, కన్నడ సాహిత్య ప్రపంచం - ప్రగతిశీల వర్గమూ, ప్రధాన స్రవంతీ కూడా యీ పుస్తకాన్ని ఎంతగానో ఆదరించినట్టు అర్థమవుతుంది. నిజానికి, సాహితీలోకంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ముస్లిం స్త్రీల జీవితాలను వెలికితీసిన మొదటి పుస్తకంగా యిది ప్రశంసలు పొందుతోంది. కుల మతాల పేరిట నిలువునా చీలిపోయిన యీ సమాజాన్ని చక్కబరిచేందుకు, సరైన సమయంలో చేసిన కృషిగా సారా రచనను గౌరవిస్తున్నారు. సారా రచనలో స్త్రీవాద విమర్శకులు గుర్తించిన గొప్ప విలువ - సబాల్టర్న్‌ అనుభవాల వ్యక్తీకరణ. అధిక సంఖ్యాక వర్గాల ద్వేషానికి భయపడుతూ, తద్వారా తనను మరింతగా పీడించే స్థితికి చేరిన ముస్లిం పితృస్వామిక ఆధిపత్యానికి బలయిపోయిన చదువురాని, పేద ముస్లిం స్త్రీ వేదన.

తలాక్‌ (విడాకులు) సమస్యను గురించి ఆమె రాసింది ఎంతవరకు యదార్థమనే విమర్శలకు జవాబుగా, ఖురాన్‌లో ఒక చోట యీ పెళ్లి పద్ధతిని (ఒక స్త్రీ, తన భర్తను మళ్లీ పెళ్లాడే ముందు మరో వ్యక్తిని చేసుకోవాలన్న నియమం) సమర్థిస్తూ వుండటాన్ని, మరోచోట స్పష్టంగా కన్పిస్తూ వున్న ఒక నియమాన్ని (ప్రతిసారీ నెలరోజుల విరామంతో మూడుసార్లు చెప్తేనే తలాక్‌ అమలవుతుందని) కూడా సారా తన నవల 1984 ప్రచురణకు రాసిన ముందుమాటలో పేర్కొన్నారు. మతంలోని ప్రతి నిబంధననూ తన స్వంత ప్రయోజనానికి అనుకూలంగా మార్చుకుని, వక్రీకరించే పిత్రృస్వామ్యాన్ని ఎండగడుతూజ, ఈ స్వార్థపర ఆచారాలన్నిటినీ ముస్లిం స్త్రీ ఎట్లా భరించాల్సి వస్తోందో చూపించి, ఇస్లాం స్ఫూర్తిని గౌరవించాలంటే ముస్లిం పర్సనల్‌ చట్టంలో రావాల్సిన మార్పుల గురించి ఆమె ప్రస్తావించింది. మగవాళ్లు ఒక్క గుక్కలో మూడు సార్లు తలాక్‌ చెప్పేసి భార్యల్ని వదిలేసే పద్ధతిని నిషేధించాలన్న అంశంమీద లక్నోలోని ఒక ఇస్లామిక్‌ సంస్థ చర్చను ప్రారంభించిందని వచ్చిన వార్తను సారా తన నాలుగో ముద్రణకు ముందుమాటలో ఎంతో ఆశావహంగా ప్రస్తావించారు.

మొదట కన్నడంలో వెలువడిన యీ రచన ఆ తరువాత తమిళ, మలయాళ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించబడ అశేష పాఠకుల ప్రశంసలు అందుకుంది. 'చూపు' పత్రిక సంపాదకురాలు కాత్యాయని ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు.

108 పేజీలు వెల రూ.30

Saturday, July 12, 2008

పురుషాహంకారానికి సవాల్‌


పురుషాహంకారానికి సవాల్‌

తారాబాయి షిండే

నూటా పాతిక సంవత్సరాల క్రితం 1882లో తారాబాయి షిండే భారతదేశంలో స్త్రీల దుస్థితి పట్ల ఆవేదన చెందుతూ, పురుషాధిపత్యం మీద నిప్పులు చెరుగుతూ రాసిన మొట్టమొదటి స్త్రీవాద పుస్తకమిది. మన దేశంలో ప్రతి సామాజిక దురాచారానికీ, సకల దురవస్థలకూ కారణం స్త్రీలే అంటూ నిందించడాన్ని చూసిన తారాబాయి ఆవేశంతో రగిలిపోయింది. పురుషులు సర్వ స్వతంత్రాలనూ హక్కులనూ తమ గుప్పిట్లో పెట్టుకుని, అన్ని అనర్థాలకీ స్త్రీలనే బాధ్యుల్ని చేయడాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ప్రతికూలమైన పురుష పాఠ ప్రపంచాన్ని తాను ఒంటరిగా ఎదుర్కొంటున్నాననే భావనతో ఆమె అసలు దోషులైన పురుషులను కఠినంగా అధిక్షేపించింది. స్త్రీ - పురుష తులనా (స్త్రీ పురుషులలో ఎవరు నిజంగా దుష్టులో నీతినియమాలు లేనివారో తెలియజేసే వ్యాసం) అనే పేరుతో తారాబాయి మరాఠీలో ప్రచురించిన ఏకైక పుస్తకమిది. ఆ తరువాత ఆమె ఏమైనా ఇతర రచనలు చేశారోలేదో తెలియదు. ఆరోజుల్లో ఒక స్త్రీ ఇంత ధైర్యంగా, ఇంత తార్కికంగా స్త్రీ పురుష సంబంధాల గురించి చర్చించడం అద్భుతమనిపిస్తుంది.

జ్యోతీ బా ఫూలే తోనూ, ఆయన స్థాపించిన సత్యశోధన సమాజంతోనూ తారాబాయి కుటుంబానికి దగ్గర సంబంధాలుండేవి. 1885 సెప్టెంబర్‌లో సత్సార్‌ (సత్యవారం) పత్రికలో జ్యోతీ బా ఫూలే తారాబాయి గురించి ఇలా రాశారు: ఈ రోజు ఇంగ్లీషు ప్రభుత్వం అధికారంలో వుండటం వల్ల ఈ దేశ పీడిత ప్రజల్లో కొందరు సంకోచంగానైనా చదవడం రాయడం నేర్చుకోవటం మొదలుపెట్టారు. అట్లాంటి వారిలో తారాబాయి మన ముద్దుల ఆడపడచు. మగవాళ్ల చేతుల్లో బాధలుపడే స్త్రీల కోపాగ్నిని వ్యక్తం చెయ్యటం, మగవాళ్లు ఎలా ఉంటే మళ్లీ తమ స్త్రీల ప్రేమ, విశ్వాసం పొందగలరో స్పష్టంగా చెప్పటం ఆమె ధ్యేయం అని అభివర్ణించారు.

మీరు (పురుషులు) ప్రతి మహిళనీ ఒక పాపిగా భావించి ఆమె జీవితం నరకప్రాయం చెయ్యాలనే ప్రయత్నాలను ఇకముందైనా ఆపేస్తారనే ఆశతో నేనీ పుస్తకం రాస్తున్నాను అంటుంది తారాబాయి ముందుమాటలో. సనాతన మరాఠీ పద్ధతిలో నాలుగు గోడల మధ్య బంధించబడిన, పెద్ద తెలివితేటలు లేని సామాన్యమైన స్త్రీని నేను. ఇది నా మొట్ట మొదటి ప్రయత్నం కనుక ఇందులో కొన్ని అంతన పొంతనలేని విషయాలు వుండొచ్చు. దీనిని కఠినమైన, మొరటు భాషలో రాశాను. అయితే ప్రతి రోజూ మగవాళ్లు చేసే వింత వింత సిగ్గులేని పనులు, క్రూరమైన చర్యల గురించి వింటున్నాము. ఎవరూ ఆ విషయాల గురించి ఒక్క ముక్క కూడా అనడం లేదు. పైగా దోషమంతా ఆడవాళ్లదే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసి నా మనస్సు స్త్రీల ఆత్మగౌరవం కోసం తల్లడిల్లిపోయింది. దాంతో నా భయమంతా ఎగిరిపోయింది. ఇక ఇలా పరుషమైన భాషలో రాయకుంటా వుండలేకపోయాను అంటుంది.

స్త్రీలను నిజమైన ప్రపంచానికి దూరంగా చీకటి మూలల్లోకి తోసి, పరదాల మాటున వుంచి, భయపెట్టి, ఆడబానిసల్లా అణిచిపెట్టి, స్త్రీలకు చదువు అవసరం లేదని చెప్పి పైనుంచి ఆడవాళ్లు బుద్ధిహీనులు, తెలివి తక్కువవాళ్లు అంటూ అవమానించడాన్ని ఆమె సహించలేకపోయింది. భార్య చనిపోతే నడివయసు పురుషుడైనా మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కానీ భర్త చనిపోతే పదహారేళ్ల పడుచు అయినా సరే పెళ్లి చేసుకోడానికి వీల్లేదు. పైగా ఆమె బొట్టు చెరిపేసుకుని, గాజులు పగులగొట్టుకుని శేషజీవితమంతా శాపగ్రస్తురాలిగా చీకటి గదిలో గడపాలనే ఆచారం మీద తారాబాయి నిప్పులు కక్కుతుంది. మరి మీరు కూడా మీ భార్యలు చనిపోయినప్పుడు మీ మీసాలు గొరిగించుకుని, మీ తలకు గుండు కొట్టించుకుని ఏ అడవుల్లోకో పోయి గడిపేయొచ్చుకదా. అమ్మో మీరా? మీరలా చేయరు. భార్య చనిపోగానే ఇంకో ఆమెని పదో రోజుకే తెచ్చేసుకుంటారు. వివేకవంతుడైన ఏ దేవుడు మిమ్మల్ని ఇలా చేయమన్నాడో చెప్పండి. నిజానికి స్త్రీకి ఏది మంచిదో పురుషుడికి కూడా అదే మంచిదవ్వాలి కదా. మీ విషయంలో ఎందుకీ భేదం? అంటూ నిలదీస్తుంది. స్త్రీలను అణిచి వుంచే కుతంత్రంలో భాగంగా రాయబడ్డ పతివ్రత కథలను, పురాణాలను, దేవుళ్ల ద్వంద్వ నీతిని, పక్షపాత ధోరణిని అన్నింటిపైనా ఆవేశంతో విరుచుకుపడుతుంది. అనుకున్నట్టుగానే తారాబాయి పుస్తకం నాటి జనంలో తీవ్రవ్యతిరేకతను రేకెత్తించింది.

ఆ కాలపు స్త్రీల జీవనస్థితిగతులను తెలుసుకునేందుకు ఈ చిన్న పుస్తకం విశేషంగా తోడ్పడుతుంది. ఈ పుస్తకంలో లేవనెత్తబడ్డ అనేక ప్రశ్నలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి.

ఈ పుస్తకాన్ని ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన సి.ఎల్‌.ఎల్‌. జయప్రద ఆంధ్రా యునివర్సిటీలో ఆంగ్ల సాహిత్యం బోధిస్తున్నారు. ఆమె తెలుగు నుండి ఇంగ్లీషులోకి, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి చాలా కథలు అనువదించారు. ఆమె అనువాదం చేసిన డా. కేశవరెడ్డి నవల అతడు అడవిని జయించాడు ను మాకమిలన్‌ వారు 1998లో హి కాంకర్డ్‌ ద జింగిల్‌ పేరుతో ప్రచురించారు.

పురుషాహంకారానికి సవాల్‌

40 పేజీలు వెల: రూ.16

Friday, July 11, 2008

పథేర్‌ పాంచాలీ


పథేర్‌ పాంచాలీ


సత్యజిత్‌ రే అపూర్వ చిత్రానికి నవలా మాత్రృక

బిభూతి బూషణ్‌ బందోపాధ్యాయ

పథేర్‌ = పథం, రహదారి, మార్గం

పాంచాలీ = తరతరాలుగా సంప్రదాయ కథా గానానికి ఉపయోగిస్తున్న బెంగాలీ గీతాలు.

అజరామర పథగీతం : పథేర్‌ పాంచాలీ అనగానే మనకు చప్పున గుర్తుకొచ్చేది సత్యజిత్‌ రే, ఆయన రూపొందించిన అపూ చిత్ర త్రయం. మొట్టమొదటిసారిగా యావత్‌ ప్రపంచం దృష్టిని భరతీయ సినిమావైపు ఆకర్షించిందీ, సత్యజిత్‌ రేకు అంతర్జాతీయ గుర్తింపునూ, అపార ఖ్యాతినీ అర్జించి పెట్టిందీ ఈ చిత్ర త్రయమే. వాటిలో మొదటిది పథేర్‌ పాంచాలీ (1955), రెండోది అపరాజిత (1956), మూడోది అపూర్‌ సంసార్‌ (1959). ఈ మూడు చిత్రాలకూ ప్రఖ్యాత బెంగాలీ రచయిత బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ రాసిన విశిష్ట నవలలే ఆధారం.

నలభైయవ దశకంలో శాంతినికేతన్‌లో లలిత కళలు, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ అభ్యసించి బయటకొచ్చిన సత్యజిత్‌ రేను సినిమాలు ఎంతగానో అకర్షించాయి. కానీ భారతీయ సినిమాల్లో ఎంతకీ తీపి వలపుల ప్రేమ పాటలు, మార్మిక పురాణగాథలే రాజ్యమేలుతుండటం ఆయన్ను చాలా చికాకు పెట్టింది. సినిమాకు జీవితమే ముడిసరుకు కావాలి. సినిమా వంటి విస్తృత జనమాధ్యమానికి స్ఫూర్తి మన జీవితంలో, మన మూలాల్లో వుండాలి. సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం వంటి రంగాల్లో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన మన దేశం చిత్రదర్శకులను కదిలించలేకపోవటం విడ్డూరమే.

ఈ వేదనే సత్యజిత్‌ రేను సినిమాలవైపు నడిపించింది. గాఢమైన జీవితానుభూతితో సినిమాను నిర్మించాలనుకున్నప్పుడు ఆయన మనసులో మెదిలిన నవల పథేర్‌ పాంచాలీ. పథేర్‌ పాంచాలీ బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ స్వీయ కథాత్మక రచన. ఇది 1928-29లో విచిత్ర అనే పత్రికలో సీరియల్‌గా ప్రచురించబడి 1929లోనే పుస్తక రూపంలో వెలువడింది.

సత్యజిత్‌ రే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఆనవలను అదే పేరుతో పథేర్‌ పాంచాలీ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. 1955లో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అత్యత్తమ మానవ చిత్రణా పురస్కారం అందుకుంది. దేశవిదేశాల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. చలనచిత్రాల్లో నవ్య ధోరణులకు పునాది వేసింది.

బెంగాలీ/భారతీయ సాహిత్యంలో అప్పటికే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పథేర్‌ పాంచాలీ నవలను చలన చిత్రంగా మలచడం ద్వారా సత్యజిత్‌ రే ఆ నవలకు అంతర్జాతీయ గుర్తింపునూ, శాశ్వతత్వాన్నీ తెచ్చిపెట్టారు.

పథేర్‌ అంటే పథం అని అర్థం, పాంచాలీలనేవి తరతరాలుగా సంప్రదాయ కథాగానానికి ఉపయోగిస్తుండే బెంగాలీ గీతాలు. అందుకే సత్యజిత్‌ రే తన చిత్రానికి సాంగ్‌ ఆఫ్‌ ద లిటిల్‌ రోడ్‌ అనే ఉపశీర్షికను జోడించారు. మారుతున్న కాలంతో పాటే వ్యక్తులుగా తమ తమ జీవితాలకు అర్థాలను వెతుక్కుంటూ పల్లెల నుంచి పట్నాలకు వలసపోతున్న జీవితాలు అంతర్లీనంగా తరచూ మనల్ని కలవరపెడుంటాయి. ఊపందుకున్న పారిశ్రామికీకరణతో అప్పుడప్పుడే గ్రామాల గుండెల్లోకి దూసుకొస్తున్న నాగరికతా రైళ్లు, అబ్బురంతో చూసే పసి మనసుల్లో అవి రేపే గుబుళ్లు, కుటుంబాలను అతలాకుతలం చేసే అనూహ్య విలయాలు, తలవంచకుండా ఆత్మగౌరవంతో సాగించే పేదరికపు పోరాటాలు... ఇలా ఎన్నో బలీయమైన మానవ-సామాజిక సందర్భాలు నవల పొడుగునా పరంపరగా మనల్ని పలకరిస్తుంటాయి. మనసు ఆర్ద్రంగా మానవీయమవుతుంటుంది. అందుకే పథేర్‌ పాంచాలీ కరిగిపోయే కాలంతో ప్రమేయం లేని క్లాసిక్‌ గా ఎన్నటికీ వన్నె తగ్గకుండా నిలిచి వుంటోంది.

విశిష్టమైన ఈ బెంగాలీ నవలను మద్దిపట్ల సూరి తేట తెలుగులోకి అనువదించారు. బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయతో పాటు తారాశంకర్‌ బెనర్జీ, శైలజానంద ముఖర్జీ, నిరంజన గుప్తా వంటి మరెందరో సుప్రసిద్ధ బెంగాలీ రచయితలను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఘనత మద్దిపట్ల సూరిదే. ఆయన భలేతమ్ముడు (1969), పండంటి కాపురం (1972), విచిత్ర దాంపత్యం (1971) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాటలు కూడా రాశారు.

258 పేజీలు, వెల రూ.80

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌