Monday, November 17, 2008

చరిత్రలో ఏం జరిగింది? ... గార్డన్‌ చైల్డ్‌ .. తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య




మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్‌ సామ్రాజ్య పతనం వరకు తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమ జీవి.
రాళ్లతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మంచిన హృదయమున్న మేధావి.

అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థానాన్ని, మనిషి శ్రమ నైపుణ్యం పనిముట్ల భావజాలాన్ని లీలా సృష్టించాయో, చరిత్రగతిని ఎట్లా మార్చాయో వివరించే
ఈ పుస్తకంతో రచయిత గార్డన్‌ చైల్డ్‌ వేసిన బాట కొత్తది మాత్రమే కాదు... శాశ్వతమైనది కూడా!

ప్రొఫెసర్‌ గార్డన్‌ చైల్డ్‌ (1892-1957) ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. ప్రాక్‌ పురాతత్వ చరిత్ర శాస్త్రజ్ఞుడైన ఈయన అనేక ప్రముఖ పుస్తకాలను రచించారు. వాటిలో చరిత్రలో
ఏం జరిగింది? ఉదయించిన ఐరోపా నాగరికత, అతిప్రాచీన తూర్పు నాగరికత, సామాజిక పరిణామం ప్రముఖమైనవి.

ఇందులో చర్చించిన అంశాలు:
1. పురాతత్వ శాస్త్రం చరిత్ర
2. పాత రాతి యుగం
3. కొత్త రాతి యుగం
4. రాగి యుగం
5. మెసపొటేనియాలో నగర విప్లవం
6. ఈజిప్టు, భారతదేశాల్లో తొలి కంచుయుగం నాగరికత
7. తొలి ఇనుపయుగం
8. ప్రాచీన నాగరికత ఉన్నత దశ
9. ప్రాచీన ప్రపంచం యొక్క పతనం


ఈ పుస్తక అనువాదకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు, సృజనాత్మక రచయిత. వీరు అనువాదం చేసిన ప్రపంచ చరిత్ర వంటి పుస్తకాలను లోగడ లోగడ
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. వీరు రాసిన కథాశిల్పం అనే పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. వీరు మదనపల్లిలోని బి.టి.కళాశాలలో లెక్చరర్‌గా
పనిచేశారు.

చరిత్రలో ఏం జరిగింది?
గార్డన్‌ చైల్డ్‌
ఆంగ్లమూలం: వాట్‌ హాపెన్డ్‌ ఇన్‌ హిస్టరీ, పెంగ్విన్‌.

తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య
188 పేజీలు, వెల: రూ.40

Saturday, November 15, 2008

తరతరాల భారత చరిత్ర ... రొమిలా థాపర్‌ ...తెలుగు అనువాదం : సహవాసి





భారత చారిత్రక రచనకి సంబంధించి భావంలో, విషయ వివరణలో, వ్యాఖ్యానంలో వ్యాఖ్యానానికి అనుకూలంగా దిద్దుకొనే వాస్తవాలలో చాలా మార్పు వచ్చింది.
నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి.
డి.డి.కొశాంబి, సుశోభన్‌ సర్కార్‌, ఇర్ఫాన్‌ హబీబ్‌, రొమిలా థాపర్‌, బిపిన్‌ చంద్ర వంటి కొత్త చరిత్రకారులు రంగంలోకి వచ్చారు.చారిత్రక రచనా ప్రక్రియలో కొత్త విలువలు ప్రవేశపెట్టారు.



... ... ...


గతం కడుపులో దాగి వుంది ఓ నిధి.
ఏమిటా నిధి?
దాన్ని కనుక్కోడానికి మనకున్న ఆనవాళ్లేమిటి?
ఆధారాలేమిటి?
నిధి అంటే మనం పుట్టకపూర్వం వందల, వేళ ఏళ్ల కిందట ఈ ప్రపంచంలో, అందులో భాగమైన ఈ దేశంలో ఏం జరిగిందో ఎరుకపర్చే చరిత్ర.
లిపి తెలియని అతి పురాతనకాలం మొదలు లిఖిత, ముద్రిత పత్రాల, పుస్తకాల పునాదుల మీద లేచిన సమీప గతం వరకు సాగిన భారత చరిత్ర గతిని, మతం కళలు, సాహిత్యం భావజాలం, వ్యవస్థలు, ఉద్యమాలు, ఇత్యాదుల్లో దర్శనమిచ్చే భారతీయ సంస్కృతి స్వరూపాన్ని అత్యంత ప్రతిభావంతంగా, రసవత్తరంగా, విజ్ఞానదాయకంగా వర్ణించిన ఘనత రొమిలా థాపర్‌ది.

రొమిలా థాపర్‌ నవతరం చరిత్రకారుల్లో ప్రముఖులు.
ఆమె 1931లో ప్రసిద్ధ పంజాబీ కుటుంబంలో పుట్టారు. 1958లో లండన్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ పొందారు. కొద్దికాలం అక్కడే దక్షిణాసియా ప్రాచీన చరిత్ర అధ్యాపకురాలుగా పనిచేశారు. డిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర ప్రొఫెసర్‌గా కృషిచేశారు.

తరతరాల భారత చరిత్ర
- రొమిలా థాపర్‌

తెలుగు అనువాదం : సహవాసి

ప్రథమ ముద్రణ: 1983
పుర్ముద్రణలు: 1984, 1993, 1998, 2000, 2005, 2006
179 పేజీలు, వెల: రూ.70/-

Friday, November 14, 2008

భగవద్గీత చారిత్రక పరిణామం ... డి.డి.కోశాంబి




భగవద్గీతలో పరస్పరం విభిన్నమైన దృక్పథాలు కలగలిసి వున్నాయి.
అందువల్ల గీతపై ఇంతవరకు వచ్చిన వ్యాఖ్యానాలు, భాష్యాలు కాకుండా, ఈ కాలానికి తగిన కొత్త అర్థం చెప్పడం ఏమంత కష్టంకాదు.
కానీ, దాని ప్రయోజనం లేకపోగా, ప్రమాదకరం కూడా ...
దీన్ని ఉపయోగించుకుని అసలు సమస్యల నుండి జనం దృష్టి మళ్లించడానికి అవకాశం వుంది.
దీనివల్ల భక్తికి విపరీతమైన గౌరవం ఏర్పడుతుంది.
ఫాసిజాన్ని, వ్యక్తి పూజను సమర్థించడానికిది తోడ్పడుతుంది... అంటారు సుప్రసిద్ధ చారిత్రకులు డి.డి. కోశాంబి.

డి.డి.కోశాంబి భారతదేశ చరిత్ర రచనలో కొత్త పుంతలు తొక్కిన మహామేధావి.
గణిత శాస్త్రంలో, జన్యు శాస్త్రంలో, ఇతర రంగాలలో గొప్ప గొప్ప విషయాలు వెలికితీసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
అన్నిటికన్న మిన్నగా ప్రతిపని, ప్రతి ఆలోచనా ప్రజల కోసం అనే ప్రగతి శీల మేధావి.

ఈ వ్యాసంలో కోశాంబి భారతీయ తత్వానికి మూల గ్రంథంగా పలువురు అభివర్ణించే గీత కున్న చారిత్రక పరిమితులను నిర్ద్వంద్వంగా బయటపెట్టారు.
గీత ను, గీత రచనా క్రమాన్ని అద్భుతమైన వర్గవిశ్లేషణకు గురిచేశారు.
విలువైన గుణపాఠాలు అందించారు.

భగవద్గీత చారిత్రక పరిణామం
డి.డి.కోశాంబి

ఇంక్వైరీ పత్రిక, 1959 సంచిక నుండి స్వీకరించబడిన వ్యాసం.
ప్రథమ ముద్రణ: 1985
పునర్ముద్రణలు: 1986, 1989, 1995, 1998, 2001
20 పేజీలు, వెల: రూ.5

Thursday, November 13, 2008

ప్రాచీన భారతదేశ చరిత్ర ... డి.డి.కోశాంబి పరిచయం ... కె. బాలగోపాల్‌




ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి (ఆదిమకాలం నుండి భూస్వామ్య దశ వరకు) దామోదర్‌ ధర్మానంద్‌ కొశాంబి (1907-1966) చూపించిన చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ పుస్తకం.

మన చరిత్రకారులలో ఆధునిక దృక్పథం గల వారందరూ కోశాంబిని ఆద్యునిగా భావిస్తారు. చరిత్ర పరిశోధనా పద్ధతిలోనూ, సిద్ధాంత దృక్పథంలోనూ శాస్త్రీయ ప్రమాణాలను నెలకొల్పిన వ్యక్తిగానే గాక, వలసత్వం, శృతిమించిన దేశభక్తి, సంప్రదాయకత, అగ్రవర్ణ ఆధిక్యత, విశృంఖలమైన ఊహాతత్పరత మొదలైన అనేక అవలక్షణాల నుండి మన దేశ చరిత్రను రక్షించిన వ్యక్తిగా ఆయనను గౌరవిస్తారు.

ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి, ఆ ఉత్పత్తిపై ఆదారపడిన స్థిర వ్యవసాయ గ్రామాల ఆవిర్భావం, దాని నుండి భూస్వామ్య వ్యవస్థకు పునాది ఏర్పడడం అనే ఆర్థిక క్రమం మన ప్రాచీన చరిత్రకు మూలం అని కోశాంబి భావించాడు. ఆ చోదక క్రమాన్ని మన దేశ నైసర్గిక స్వభావానికి జోడించి సామాజిక, సాంస్కృతికరంగాలను విశ్లేషించాడు. పురావస్తు ఆధారాలను పట్టించుకోకుండా కేవలం ప్రాచీన సాహిత్యాన్ని ఆధారం చేసుకుని ఊహాగానాలు చేసే చరిత్రకారులను కోశాంబి విమర్శిస్తాడు.

శాస్త్రీయంగా ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయదల్చుకున్న ఎవ్వరైనా కోశాంబి ప్రతిపాదించిన భౌతిక చోదక క్రమాన్ని ప్రాతిపదికగా తీసుకోక తప్పదు.

ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1. పద్ధతి - సిద్ధాంతం
2. ఆహార సేకరణ - ఆహార ఉత్పత్తి
3. సింధూ నాగరికత - ఆర్యులు
4. వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ
5. మహాభారతం - బుద్ధుడు
6. ఉత్తరాపథం - దక్షిణాపథం
7. వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు
8. సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం

ముందుమాటలో రచయిత రాసిన చివరిమాట:
... నా మాటకొస్తే ఒక్క విషయం మాత్రం చెప్పాలి. కోశాంబి భగవద్గీత మీద రాసిన వ్యాసాన్ని 1976లో మొట్టమొదటిసారి చదివి నేను మార్క్సిస్టునయ్యాను. ఆ రుణం ఈ రూపంలో తీర్చుకొవాలన్న కోరిక కలిగి మూడేళ్లయింది. ఇప్పటికి తీరింది.


ప్రాచీన భారతదేశ చరిత్ర
డి.డి.కోశాంబి పరిచయం

- కె. బాలగోపాల్‌

ప్రథమ ముద్రణ: 1986
పునర్ముద్రణలు: 1992, 1995, 2000, 2007
150 పేజీలు, వెల: రూ.32

Wednesday, November 12, 2008

విజ్ఞాన శాస్త్రం ఎలా ఎదిగింది? - ఎగొన్‌ లార్సెన్‌, తెలుగు అనువాదం: సనగరం నాగభూషణం







ఆది నుంచి నేటి దాకా మానవుడు సాధించిన సాంకేతిక ప్రగతిని ఒకే ఒక సంపుటంలో ఆవిష్కరించిన అద్భుత కథనమే ఈ పుస్తకం..

రచయిత యావత్‌ శాస్త్ర సాంకేతిక ప్రగతిని మూడు ప్రధాన విభాగాలకింద విభజించారు. అవి... శక్తి, రవాణా, మ్యూనికేషన్లు.

శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను పరిశీలించి, అవసరమైన చోట్ల చారిత్రక, సామాజిక నేపథ్యాన్ని సంక్షిప్తంగా వివరించారు.

నూతన కల్పనలలోనూ ఇంజనీరింగ్‌లోనూ మూల పురుషులైన ముఖ్యల జీవిత కథల్ని కూడా ఈ పుస్తకంలో స్పృశించారు.

ఎగొన్‌ లార్సెన్‌ సులభశైలిలో ఎన్నో ప్రముఖ విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు రాశారు.

ఈ పుస్తక అనువాదకులైన సనగరం నాగభూషణం మదనపల్లెలోని బి.టి. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు.


విజ్ఞాన శాస్త్రం ఎలా ఎదిగింది?
- ఎగొన్‌ లార్సెన్‌,

ఆంగ్ల మూలం: The History of Invention, Egon Larsen, Roy Publishers, New York, 1961

తెలుగు అనువాదం: సనగరం నాగభూషణం

235 పేజీలు, వెల: రూ.45

Tuesday, November 11, 2008

మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే సంక్షిప్త రచనలు ...





మహాత్మా జ్యోతిరావు ఫూలే దూరదృష్టికి, విశ్లేషణా సామర్థ్యానికీ ఈ సంక్షిప్త రచనలు ఉదాహరణలు.

హంటర్‌ కమిషన్‌కు ఫూలే సమర్పించిన విజ్ఞాపన...
పండిత రమాబాయి మతమార్పిడీ ...
బ్రహ్మసమాజికుల వంటి బ్రాహ్మణ ప్రధాన సంస్కరణల గురించి రాసిన సత్సార్‌ సంచికలు ...
మరాఠీ సంస్కర్తల్లో ప్రముఖుడైన జస్టిస్‌ గోవింద రణడే వ్యాఖ్యలపై హేతుబద్ధ విమర్శలతో కూడిన చేతావని ...
మరాఠీ రచయితల సంఘపు ఆహ్వానానికి జవాబు ...
బ్రాహ్మణీయ విలువలు ప్రధానంగా ఉండే విద్యా విధానం మీద విసుర్లతో కూడిన పాటల సారాంశం ...
బాల్యవివాహాలు, బలవంతపు వైధవ్యం పై బెహ్రామ్‌జీ మల్‌ బారీకి సమర్పించిన పత్రం ...
మొదలైనవి ఈ సంపుటిలో వున్నాయి.

స్త్రీలు, రైతులు ఎదుర్కొనే సమస్యలను తడిమి,
బ్రాహ్మణీయ కుటిల సంస్కరణల స్వరూపాన్ని చూపి జ్ఞాన వికాసానికీ,
బహుజనులకు విద్య ఎంత అవసరమో నొక్కి చెప్పిన తీరు ద్వారా జ్యోతిబాలోని భావ ప్రసార సామర్థ్యాన్ని,,
సంవాదం - సంభాషణల రూపంలో రచనలకుండే బలాన్ని ఇందులో మనం చూడవచ్చు.







జ్యోతిరావు ఫూలే సంక్షిప్త రచనలు
ఆంగ్ల మూలం: Selections, Vol.2, Collected Works of Mahatma Jotirao Phule, Govt. of Maharashtra, 1991.
Satsar from selected writings of Jotirao Phule, ed.. G.P. Deshpande, Left Word, New Delhi, 2002 and from Vol. 4, Collected works of Mahatma Jotirao Phule, Hindi, Govt. of Maharashtra, 2002.

తెలుగు అనువాదం : హారతి వాగీశన్‌

61 పేజీలు, వెల: రూ.20

Monday, November 10, 2008

మానవుడే చరిత్ర నిర్మాత ... గార్డన్‌ చైల్డ్‌, తెలుగు అనువాదం: హెచ్‌. ఆర్‌. కె.






ప్రాచీన మానవ చరిత్రను పరిచయం చేసే పుస్తకాల్లో గార్డెన్‌ చైల్డ్‌ రాసిన ఈ పుస్తకాన్ని క్లాసిక్‌గా పరిగణిస్తారు.

మూడు లక్షల నలభైవేల యేళ్ల నుంచీ, నిప్పును పుట్టించి, రాళ్లను పనిముట్లుగా, ఆయుధాలుగా మలచుకొని మానవులు క్రూరమృగాల నడుమ ఎలా నిలదొక్కుకున్నారో ఈ పుస్తకం తెలియజేస్తుంది.

ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, నగరాల నిర్మాణం, రాజ్యం పుట్టుక, సదూర ప్రాంతాలలో వర్తకం, నగర విప్లవం వంటి దశలూ, మలుపులూ ఎలా వచ్చాయో వివరిస్తుంది ఈ పుస్తకం.

ప్రొఫెసర్‌ గార్డన్‌ చైల్డ్‌ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. ప్రాక్‌ పురాతత్వ చరిత్ర శాస్త్రజ్ఞుడైన ఈయన అనేక ప్రముఖ పుస్తకాలను రచించారు.

వాటిలో చరిత్రలో ఏం జరిగింది?, ఉదయించిన ఐరోపా నాగరికత, అతిప్రాచీన తూర్పు నాగరికత, సామాజిక పరిణామం అనేవి ప్రముఖమైనవి.

ఈ పుస్తక అనువాదకులైన హెచ్చార్కె తెలుగు పాఠకులకు కవిగా, రచయితగా, పత్రికా విలేఖరిగా సుపరిచితులు. స్వయంగా అనేక రచనలు చేయడంతో పాటు ఎన్నో ఇతర పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.


మానవుడే చరిత్ర నిర్మాత

- గర్డన్‌ చైల్డ్‌

తెలుగు అనువాదం: హెచ్చార్కె

169 పేజీలు, వెల: రూ.50

Sunday, November 9, 2008

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వ్యవస్థ ... తెలంగాణా రాజకీయాలు ... దాగ్మార్‌ బెర్న్‌స్టార్ఫ్‌, హ్యూగ్‌ గ్రే ...




ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణాలో రాజకీయాలు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ నేపథ్యంలో జరిగిన గ్రామీణ అధికార నిర్మాణం, శిష్టవర్గాల ఏర్పాటు, పరిణామాలు వంటి వివిధ అంశాలను సమగ్రంగా చర్చించిన వ్యాసాల సంకలనమిది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అసమాన అభివృద్ధిని ప్రశ్నించిన ప్రాంతీయ గుర్తింపు ఉద్యమాలను కూడా ఈ వ్యాసాలు విశ్లేషించాయి..

ఇందులో మొత్తం పన్నెండు వ్యాసాలున్నాయి. వాటి వివరాలు:

1. ఆంధ్రప్రదేశ్‌ రాజనిర్మాతలు
2. 1956-1973ల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకత్వం.
3. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ పునర్నిర్మాణానికి ప్రయత్నం
4. తెలంగాణా భూస్వామ్య వర్గం
5. 1967 సార్వత్రిక ఎన్నికలు - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైదరాబాద్‌ ప్రాంత అభ్యర్థులు
6. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికై డిమాండ్‌
7. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌ వైఫల్యం
8. ప్రాంతం, జాతి, తెలంగాణా ఉద్యమ ద్వంద్వ అస్తిత్వం
9. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కమ్యూనిస్టుల కంచుకోటలో 1962 సాధారణ ఎన్నికలు
10. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లాలో 1962 సార్వత్రిక ఎన్నికలు
11. భారతదేశంలో ఏడవ సార్వత్రిక ఎన్నికలు - క్షమించే ఓటర్లు
12. ప్రాంతం, రాజకీయ చైతన్యం


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వ్యవస్థ ...
తెలంగాణా రాజకీయాలు

- దాగ్మార్‌ బెర్న్‌స్టర్ఫ్‌, హ్యూగ్‌ గ్రే

తెలుగు అనువాదం: బి.జనార్ధనరావు, కె.సీతారామారావు, డా.యం యాదగిరాచార్యులు, డా. ఇ.రేవతి

అట్టమీది బొమ్మలు: ఏలె లక్ష్మణ్‌

222 పేజీలు, వెల: రూ.60

Saturday, November 8, 2008

సంగతి ... దళిత స్త్రీల వేదనల, ఆలోచనల సమాహారం ... రచన: బామ



పురుషాధిక్య సమాజంలో అణచివేతకు గురవుతున్న స్త్రీల, ప్రత్యేకించి దళిత మహిళల జీవితాలను, వారి కష్టాలూ కన్నీళ్లూ ఉల్లాసాలూ ఉద్వేగాలను, వారి అస్తిత్వ పోరాటాలను, మానసిక సంఘర్షణలను ప్రతిబింబించే ఈ పుస్తకం విలక్షణమైన భాషా నుడికారాలతో పాఠకులకు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుంది.

రచయిత్రి బామ మాటల్లోనే చెప్పాలంటే...

మనం ఇష్టపడ్డా, ఇష్టపడకపోయినా చాలా సంగతులు మన చెవుల్ని కొరుకుతుంటాయి. కొన్నింటిని ఆసక్తిగా, జాగ్రత్తగా వింటాం. మరికొన్నింటిని గాలికొదిలేస్తాం. పురుషాధిక్య సమాజంలో దళిత మహిళల సమస్యలకు సబంధించిన, అణచివేతకు గురవుతున్న వారి హక్కులకు సంబంధించిన సంగతులు మనందరికీ తెలిసినవే. కులదురహంకారం వల్ల అణచివేతకు గురవుతున్న చాలామంది ఆడవాళ్లు దారుణంగా తొక్కివేయబడుతున్న దళిత స్త్రీల సంగతులను మరింత అడుక్కు తొక్కేసి మరచిపోతుంటారు.

ఈ పుస్తకంలో దళిత స్త్రీల ఏడుపులూ కష్టాలే కాక వారి ఆనందాలు, హాస్యాలు, పరాచికాలు, కొట్లాటలు, సంస్కృతిని కూడా ఆవిష్కరించడం జరిగింది.

భారమైన రోజువారీ జీవితంతో సతమతమవుతూ, ఏటికి ఎదురీదుతూ కూడా దళిత స్త్రీలు ఆత్మ స్థైర్యాన్ని కూడగట్టుకుంటూ దుర్భరమైన సమస్యలను సైతం సెన్సాఫ్‌ హ్యూమర్‌తో ఎదుర్కొంటుంటారు.
వారి ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం, నిజాయితీగా, సహజంగా బతకాలనే వారి కోరిక, వారి శ్రమైక జీవన సౌందర్యం మొదలైన వాటిని లోకానికి చాటాలన్న ప్రగాఢమైన కాంక్షకు ప్రతిరూపమే ఈ పుస్తకం.

ప్రత్యేకించి దళిత స్త్రీలు తమ జీవితాన్ని ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని చదివి మరింత ఉత్తేజం పొంది నూతన సమాజ నిర్మాణానికి కృషిచేస్తారనీ, దళిత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారన్న ఆశతో, నమ్మకంతో ఈ సంగతి మీ ముందుకొచ్చింది.

సంగతి (నవల)
- బామ
తమిళ మూలం : సముదాయ చిందనై, మధురై, తమిళనాడు.

తెలుగు అనువాదం : జూపాక సుభద్ర
ముఖచిత్రం: కాళ్ల

82 పేజీలు, రూ.25

Friday, November 7, 2008

గులాంగిరి - జోతీరావు ఫూలే


భారత దేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు జోతీరావు ఫూలే (1827-1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని ఆయన ప్రగాఢంగా కోరుకున్నారు. ఫూలే ఆలోచనలకూ, విశ్లేషణలకూ ఆయన రాసిన ఈ పుస్తకం అద్దం పడుతుంది.
... ... ...

ఈ పుస్తకం రాయడంలో నా శూద్ర సోదరుల్ని బ్రాహ్మణులు ఎట్లా మోసం చేశారో చెప్పడం ఒక్కటే నా ఉద్దేశం కాదు. ఇంతవరకూ బ్రిటీషు ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన ఉన్నత విద్యాబోధనా విధానం ఎంత హానికరమో తెలుసుకొనేలాగ ఆ ప్రభుత్వం కళ్లు తెరిపించడం కూడా నా ఉద్దేశం.
...

తోటి శూద్రుల నిజ పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, బ్రాహ్మణ దాస్యత్వం నుంచి తమని తాము విముక్తి చేసుకోవడం - ఈ రెండూ ఏ కాస్త చదువుకున్న నా శూద్ర సహూదరులందరి ప్రథమ కర్తవ్యం.

ప్రతి గ్రామంలో శూద్రులకు పాఠశాలలు అవశ్యం కావాలి.
కానీ అందులో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వుండకూడదు.

దేశం అనే దేహానికి శూద్రులు రక్తనాళాల వంటివారు. అందుచేత ప్రభుత్వం తన ఆర్థిక, రాజకీయ కష్టాలనుంచి గట్టెక్కడానికి ఎప్పుడూ ఆధారపడవలసింది శూద్రుల మీదనే తప్ప బ్రాహ్మణుల మీద కాదు.

- జోతిరావు ఫూలే



గులాంగిరి
-జోతీరావు ఫూలే
తెలుగు అనువాదం : ఏలూరి రామయ్య
102 పేజీలు, వెల: రూ.40/-

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌