Monday, November 27, 2017

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్ రచనలు

ఆ భారతదేశం బతికే ఉందని నమ్ముతున్నాను
- పాల్‌ జకారియా


గౌరి లంకేశ్‌ తను పుట్టిపెరిగిన భారతదేశాన్ని నమ్మింది.

తనకు వారసత్వంగా సంక్రమించిన ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మింది.

ఆ రెండిటినీ పూర్తి నియంత్రణలో ఉంచుకునే ఆధిపత్య శక్తులను నిత్యం విమర్శిస్తూ కూడా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బేషరతుగా నమ్మడంలో ఆమె మిగతా అందరి భారతీయుల్లానే వ్యవహరించింది.

ఆ నమ్మకం వల్లనే ఆమెను వారు - ఆమె నిర్భయంగా తిరిగిన తన ప్రపంచం మధ్యనే, ఆమె ఇంటి గేటు వద్దనే అంత సులభంగా కాల్చి పడేయగలిగారు.

ఆమె లోలోపల ఏవైనా భయాలున్నా పారిపోవాలని మాత్రం అనుకోలేదు, వ్యవస్థను నమ్మడానికే సిద్ధపడింది. కోట్లాది మంది ఇతర భారతీయుల లాగే ఆమె కూడా ఏడు దశాబ్దాల నుంచి మన పాలకులు మనకు చూపిస్తున్న 'ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సంక్షేమ రాజ్యం' అనే సుందర స్వప్నాన్ని నమ్ముతూ వచ్చింది.

ఆమె మాట్లాడిన ప్రతి మాటలో, చేసిన ప్రతి పనిలో ఈ నమ్మకం అంతర్లీనంగా వుంది. ఆమె జరిపిన చర్చల్లో, చేసిన వాదనల్లో, పాల్గొన్న పోరాటాలలోనూ అంతర్లీనంగా ఉంది. మిగతా పౌరులందరి లాగే ఆమె ఆ స్వప్నం తనకు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధి, భీంరావు రాంజీ అంబేద్కర్‌, తదితరుల నుండి వారసత్వంగా వచ్చిందని నమ్మింది.

వాళ్లందరి లాగే ఆమె ఆ స్వప్నాన్ని దేశ రాజ్యాంగంలో దర్శించింది. ఆ స్వప్నాన్ని సాకారం చేసే దేశం కోసం శాయశక్తులా పోరాడింది.

కాని ఆమెకు నమ్మకద్రోహం జరిగింది, కోట్లాది మంది భారతీయులందరికీ జరిగినట్లే. దేశాన్ని పాలిస్తున్న వారి మౌనం చూడండి. తూకం వేసినంత పకడ్బందీగా ఒక్క మాట కూడా బయటికి రాకుండా ఎంత ఘనీభవించినట్టు ఉందో! నిజమే... ప్రతి పౌరుని హత్యా పాలకుల అట్టహాస అధికార కార్యక్రమాలలో చోటు సంపాదించుకోలేదు.

కాని గౌరి ఎవరు? ఒక లౌకికవాదిగా, ప్రజాస్వామికవాదిగా, ప్రజాపక్షం వహించిన మేధావిగా ఆమె మనందరం స్వప్నించే భారతదేశానికి బీజరూప ప్రతినిధి. ఆమె హత్య అన్ని హత్యల్లాంటిది కాదు. ఆమె ఒక సీనియర్‌ జర్నలిస్టు. ప్రజాస్వామ్య భావాలకు ప్రచారకర్త. ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధి. స్వేచ్ఛా సత్యాలకై పోరాడిన ఉద్యమకారిణి. అటువంటి వ్యక్తి హత్య చేయబడినపుడు పాలకులు తప్పనిసరిగా దానిపై స్పందించాలి. ఈ అర్థంలో చూస్తే ఆమె హత్య కేవలం భౌతికం కాదు.

ఆమె ఏ విలువల కోసం నిలబడిందో ఆ విలువలను రూపుమాపేందుకు ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య ఇది. చావు అనే పనిముట్టుతో అసమ్మతి గొంతు నులమడమనేది నూటికి నూరుపాళ్ళు ఫాసిస్ట్‌ చర్య. వంద శాతం పిరికి చర్య.

దేశంలో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయనే దానికి గౌరి హత్య ఒక విషాద ఉదాహరణ. ద్వేషం, దురాశ, హింస, యుద్ధోన్మాదం అనే బ్లాక్‌¬ల్‌లోకి నేడు దేశం నెట్టేయబడుతోంది. మనం నమ్మిన, ప్రేమించిన ప్రజాస్వామ్యం, బహుళత్వం త్వరలో కనుమరుగయ్యేలా వున్నాయి. తన 70వ ఏట భారతదేశం ఒక ప్రమాదకరమైన శిఖరపుటంచు పైన నిలబడి ఉంది.

అయినప్పటికీ, ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న పోరాటంలో గౌరి మరణం ఒక నిర్ణయాత్మక మలుపు అవుతుందని ఒక భారతీయుడిగా నేను గట్టిగా నమ్ముతున్నాను. కాని ఆ పోరాటంలో గౌరి మనతో కలిసి నడవదనేది మాత్రం బాధాకరం. ఈ దేశ అనూహ్య ఆలోచనా రీతులను గమనిస్తున్న ఒక పౌరుడిగా నా అంతరంగం చెపుతున్నదేమిటంటే గౌరి ఏ విశ్వాసాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించిందో దాని ప్రభావం మనం ఊహించని పద్ధతుల్లో, చనిపోయేంత వరకు ఆమె ఎవరో తెలియని వారి గుండెల్లో సైతం ప్రతిధ్వనిస్తుందని. ఇంతటి దుర్మార్గాన్ని సులభంగా క్షమించని ఇండియా ఒకటి ఇంకా ఉందనే నమ్ముతున్నాను.

ఆ ఇండియా బతికే ఉంది. అదే ఇప్పుడు మనకున్న పెద్ద ధైర్యం.

స్వేచ్ఛ, మానవత్వం, ప్రజాస్వామ్యం గురించి గౌరి ఆలోచనలు అందరికీ అందేలా ఆమె కన్నడ, ఇంగ్లీషు రచనల నుండి కొన్నిటిని ఎంపిక చేసి చందన్‌ గౌడ ఈ పుస్తకం తీసుకురావడం ఎంతో అభినందనీయం. ఒక పౌర-కార్యకర్త (జఱ్‌ఱఓవఅ జీశీబతీఅaశ్రీఱర్‌)గా ఆమె గొంతెత్తకుండా ఉండలేకపోయిన అనేక అంశాలు ఈ రచనలలో మనకు కనిపిస్తాయి. ప్రజాసమస్యల గురించి మాట్లాడే హక్కు తనకుందని ఆమె ఎంతగా నమ్మిందో, అలా మాట్లాడడం తన బాధ్యత కూడా అని అంతగానూ నమ్మింది. మానవ చరిత్రలోని అత్యున్నత విలువల కోసం గొంతెత్తి, దాని ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకున్న మ¬న్నత స్త్రీ పురుషుల జాబితాలో ఇప్పుడు ఆమె పేరు కూడా చేరింది.

జీవితాన్ని ఎంతగానో ప్రేమించిన గౌరి మరణం వృధా కాదని, సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకున్న భారతదేశంలో గుణాత్మక మార్పుకు అది తప్పకుండా దోహదం చేస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.


కొల్లం, 22 అక్టోబర్‌ 2017
(ముందు మాట)
..అనువాదం : వేమన వసంతలక్ష్మి

పాల్‌ జకారియా ప్రముఖ మలయాళీ రచయిత. అనేక కథలు, నవలలు, వ్యాసాలు రాశారు.

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్ రచనలు 
ఆంగ్ల మూలం :
The Way I See It: A Gauri Lankesh Reader, 
Edited by Chandan Gowda,
© Kavita Lankesh, originally published in English by DC Books and Navayana Publishing Pvt Ltd, 2017

పుస్తక సంపాదకురాలు : వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని,   ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,    కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

130 పేజీలు  వెల : రూ. 150 /- 
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849

Email ID : hyderabadbooktrust@gmail.com


Friday, November 24, 2017

ఆ గొంతు పలకని సంగతులెన్నో-నవ్య, ఆంధ్ర జ్యోతి 24 నవంబర్ 2017

ఆ గొంతు పలకని సంగతులెన్నో-నవ్య, ఆంధ్ర జ్యోతి 24 నవంబర్ 2017


సుబ్బులక్ష్మి మూలాలను చెప్పే పుస్తకం - గీతా రామస్వామి

సుబ్బులక్ష్మి మూలాలను చెప్పే పుస్తకం - గీతా రామస్వామి


Tuesday, November 7, 2017

మేరీ టైలర్‌ రచించిన భారతదేశంలో నా జైలు జీవితం, మై ఇయర్స్‌ ఇన్‌ ఏన్‌ ఇండియన్‌ ప్రిజన్‌ ఇంగ్లీష్ లేదా తెలుగు పుస్తకం కావాలి



ఒక విజ్ఞప్తి

పాఠకుల కోరికపై మేరీ టైలర్‌ రచించిన ''భారతదేశంలో  నా జైలు జీవితం'' అనే పుస్తకాన్ని పునర్ముద్రించాలనుకుంటున్నాం.

మన దేశంలో 1970లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ ఆమె రాసిన ఈ పుస్తకం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పెంగ్విన్‌ వారు ''మై ఇయర్స్‌ ఇన్‌ ఏన్‌ ఇండియన్‌ ప్రిజన్‌'' అన్న పేరుతో ఇంగ్లీషులో వెలువరించగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 1983లో ''భారతదేశంలో నా జైలు జీవితం'' పేరిట తెలుగులో ప్రచురించింది.

అయితే ప్రస్తుతం మాదగ్గర వున్న ఒకే ఒక ప్రతి కవర్‌పేజీ సరైన స్థితిలో లేదు.  ముద్రణా యొగ్యమైన మేరీ టైలర్‌ ఫొటో కూడా అందుబాటులో లేదు. కాబట్టి ఎవరిదగ్గరైనా ఈ దిగువ ఇంగ్లీషు లేదా తెలుగు పుస్తక ప్రతి ముఖచిత్రం మెరుగైన స్థితిలో వున్నట్టయితే దయచేసి మాకు పంపించవలసిందిగా కోరుతున్నాం. వారం పది రోజుల్లో మీ పుస్తకాన్ని మీకు భద్రంగా తిరిగి అందజేస్తాం. ( పెంగ్విన్ కాకుండా ఇతర పబ్లిషర్స్ ప్రచురించిన పుస్తకం మాత్రం అవసరం లేదు.)

పుస్తకం పంపించడానికి వీలుకాకపోతే కవర్‌ పేజీని ముద్రణకు అనువుగా హై రెజల్యూషన్‌తో స్కాన్‌ చేసి ఈ కింది చిరునామాకు వెంటనే పంపించండి.

ధన్యవాదాలు       
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ,

07 నవంబర్‌ 2017 







మా చిరునామా:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్ నెం 85 , బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌
హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ నెం. 040-23521849

ఇమెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com








Monday, November 6, 2017

జయకాంతన్‌ కథలు తెలుగు అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ

'' మానవ సంబంధాలలోని లోతుపాతుల్ని స్పృశిస్తూ, విభిన్న కోణాల్ని మన కళ్ల ముందు ఆవిష్కరించటంలో మేటి అయిన జయకాంతన్‌ కథలో కొన్ని - ఇదిగో మీ కోసం....'

- కామం పిడికొట్లో చిక్కుకుని ఊపిరాడని ఒక యువకుడు, ఆడదాని నగ్నత్వాన్ని మనసులో ఊహిస్తూ తహతహలాడిపోతుంటాడు. నగ్నంగా అడుక్కుంటున్న మానసిక రోగి అయిన ఒక యువతిని చూడగానే రసవాదం సంభవిస్తుంది. కానీ సోదరభావంతో తను కట్టుకున్న పంచెను తీసి ఆమెను కట్టబెట్టేస్తాడు - 'ఉడుపు'కథలో...

ఇంట్లో ఉక్కపోత, ఒంట్లో ఉక్కపోత, వీథిని చూసే కిటికీనే తన ఒంటరితనానికి పరిష్కారం ఆ తల్లిలేని అమ్మాయికి. కెలైడ్‌స్కోప్‌ లాగా వీథిలో పరుగులు తీసే దృశ్యాలు ఆమె జీవితపు కలలు. దృశ్యాలలో కాలమూ దొర్లిపోతుంది. కిటికీకే అంకితమైపోయి 'బామ్మ' పట్టమూ దక్కించుకుంటుంది. చదివే పాఠకుని హృదయంలో శోకపూరితమైన వీచిక చుట్టేస్తుంది - 'నేను కిటికీ దగ్గర కూర్చోనున్నాను'... అన్న కథలో...

నమ్మిన వ్యక్తి చేసిన మోసానికి తాను గురయ్యానని బాధపడి, మనసుకు సర్దిచెప్పుకుంటే - ఆశ్చర్యకరంగా తనను మోసం చేసిన వ్యక్తి చేసిన పనివల్ల మనిషిమీద అపారమైన నమ్మకాన్ని కలిగించే కథ- 'నమ్మకం'

ఏ స్పందనలూ లేని ముసల్ది పిల్లల్ని బొమ్మల్లా బడికి తీసుకెళ్లి వస్తుంటుంది. కానీ కఠినమైన శిలలోనూ జల స్పర్శను కలిగించే కథ- 'యంత్రం'

ఎదురుచూపులకే తన జీవితాన్ని అంకితం చేసి ఒంటి స్తంభంలా నిలబడిపోయిన ఒక స్త్రీ అంతర్యపు లోతుల్ని తేటతెల్లం చేసే కథ - 'ఎదురుచూపులు'

ఇలా... స్త్రీ పురుష సంబంధాల గాఢతను తెలిపే మరెన్నో కథలు ఇందులో... చదవండి!

జయకాంతన్‌ కథలు

తెలుగు అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ

పేజీలు: 218 వెల : 150



Tuesday, October 31, 2017

ఒక తల్లి తెలుగు అనువాదం : సూరంపూడి సీతారాం

Add caption

చిన్న కొడుకు, ఇరవై యేళ్ళవాడు, అలా యెందుకు మారిపోయాడు? ఇంటి పట్టున ఉండడు, యెక్కడికి వెడుతున్నాడో స్నేహిం చేస్తున్నాడో తెలియదు. తల్లికి గాని తండ్రికి గాని తెలియదు. డబ్బుకి లోటులేదు. పుష్కలంగా ఉంది. కాలేజి చదువు పూర్తికాగానే అమెరికా పంపి పై చదువులు చదివించాలనుకున్నారు. కాని ఈ చిన్న కొడుకు అందిరికీ దూరమైపోయాడు. ఇంటిలో యెవరితోనూ మనసిచ్చి మాటాడడు. భోగభాగ్యాలంటే నిరసన. తల్లికి అర్థంకాదు. చిన్న కొడుకు మారిపోయాడు. చివరికి ఇరవయ్యోయేట దారుణంగా చంపబడ్డాడు. వాడు పుట్టిన రోజూ, చచ్చిపోయిన రోజూ ఒకటే, జనవరి 17 తల్లికి మాత్రమే ఇదిజ్ఞాపకం, వాడు చచ్చిపోయి ఏడాది తిరిగి వచ్చింది. ఆ రోజున తల్లి అన్వేషణకు బయలుదేరింది. తన చిన్న కొడుకు ఎందుకలా అయిపోయినాడని. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి బోధపడింది. బోధపడేసరికి తట్టుకోలేక పోయింది. ఆమె ఆవేదన కూడా అదే రోజున అంతమయింది. ఇది ఆ ఒక్క తల్లి కథకాదు. ఈనాడు సమాజంలో కొత్తతరం. యువజనం, స్వాతంత్య్రానంతరం పుట్టిన తరం, ఇలా యెందుఉక మారిపోతున్నారో తెలియక దు:ఖానికి గురవుతున్న అనేక మంది తల్లుల కథ - అందరి తల్లుల కథ కూడా
మహాశ్వేతాదేవి బెంగాలీలో రచించిన యీ నవల విశేష ప్రచారం ప్రశంసలూ పొందిన తరువాత, నాటకంగా కూడా విశేష ప్రచారం సాధించింది. ఈమధ్యనే ప్రఖ్యాత దర్శకుడు గోవింద నిహలానీ దర్శకత్వంలో ''హజార్‌ చౌరాసియాకి మా'' అనే పేరుతో సినిమాగా కూడా నిర్మించబడింది. గ్రామీణుల దుర్భర జీవితాన్ని యథాతథంగా చిత్రించిన మరో నవల ''రాకాసి కోర, అలాగే ''ఎవరిదీ అడివి'', ''దయ్యాలున్నాయి జాగ్రత్త'' యింతకు పూర్వం ప్రచురించాం.

ఈ రచయిత్రి ప్రతిష్ఠాత్మక మెగసేసే, జ్ఞానపీఠ్‌ అవార్డులు కూడా పొందారు.

ఒక తల్లి 
తెలుగు అనువాదం : సూరంపూడి సీతారాం 
141 పేజీలు  ; వెల: రూ. 150

Tuesday, October 17, 2017

మనకు తెలియని యం.ఎస్ - దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు - టి. జే. ఎస్. జార్జ్ తెలుగు అనువాదం : ఓల్గా

యమ్‌.యస్‌. సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశం లోని కోట్లాది యిళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట యిళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమోగని రోజు వుండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణేకాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులను సమ్ముగ్ధం గావించిన ప్రతిభ ఆమెది. 1916లో మదురైలో ఒక సామాన్య దేవదాసి కుటుంబంలో షణ్ముగవడివు అనే వైణికురాలికి జన్మించిన యమ్‌.యస్‌. సుబ్బులక్ష్మి ''భారతరత్న'' పురస్కారానికి చేరుకున్న క్రమం, ఆమె జీవిత గమనం కేవలం ఆసక్తికరంగా వుండటమే కాదు. ఆధునిక భారతదేశంలో కులం, జండర్‌ యెలాంటి పరిణామాలను పొందాయో, యెన్ని సంక్లిష్ట, భిన్న సందర్భాలను యెదుర్కొన్నాయో, ఆ వివక్షలను యెదుర్కునేందుకు స్త్రీలు యెలాంటి సాహసాలు, పోరాటాలు, ప్రయోగాలు చేశారో, యెలా రాజీపడ్డారో తెలియజేప్పే ఒక చారిత్రక సామాజిక శాస్త్ర పాఠం. అగ్రవర్ణ పురుషుల ఆక్రమణలో శతాబ్దాలుగా చిక్కుబడిన కర్ణాటక సంగీతం ఆలపించిన స్వేచ్ఛా గీతం యమ్‌. యస్‌. సుబ్బులక్ష్మి.

ఈ పుస్తకంలో టి.జె.యస్‌ జార్జ్‌ కేవలం ఆమె జీవిత కథను మాత్రమే చెప్పలేదు. కర్ణాటక సంగీత భౌగోళిక సామాజిక, రాజకీయ స్వరూప స్వభావాల సారాంశంలో యమ్మెస్‌ యెక్కడ నిలబడి ప్రకాశిస్తున్నదో , ఆ స్థానమూ ఆ ప్రకాశమూ యెలా సాధ్యమయ్యాయో విశ్లేషించి, వివరించి, పోల్చి చెప్పాడు. కర్ణాటక సంగీతపు లోతుపాతులను కూడా. ఈ పుస్తకం తెలియజెబుతుంది.
మనకు తెలియని యం.ఎస్ - 
దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు 
- టి. జే. ఎస్. జార్జ్ 
తెలుగు అనువాదం : ఓల్గా 
పేజీలు; 240, వేల ,150/-


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌