Thursday, February 18, 2010

వైద్యుడు లేని చోట ... Where There is No Doctor


వైద్యుడు లేని చోట

వైద్యుడు లేని చోట కేవలం ప్రథమ చికిత్సకు సంబంధించిన పుస్తకం కాదు.
అంతకంటే ఎంతో విస్తృతమైన గ్రంథం.
సామాన్యల ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక అంశాలను ఇది తడిమింది.
నీళ్ల విరేచనాలు మొదలుకుని క్షయ వ్యాధి వరకు అన్ని వ్యాధుల్ని విశ్లేషించింది.
సహాయపడే/హానిచేసే రకరకాల గృహ వైద్యాలు మొదలుకొని కొన్ని ఆధునిక మందుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అనేక అంశాల గురించి చర్చించింది.
పరిశుభ్రత, పౌష్టిక ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు మొదలైన అంశాలకు ఈ పుస్తకంలో ప్రత్యేక ప్రాధాన్యత యివ్వడం జరిగింది.

ఇందులో బిడ్డల పుట్టుక, కుటుంబ నియంత్రణ గురించిన సమాచారం కూడా వుంది.
పాఠకులు తమ శ్రేయస్సు కోసం ఏం చేయాలో సూచించడమే కాకుండా ఏ సమస్యలను అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తచే పరిష్కరింపజేసుకోవాలో వారికి అవగాహనను కలిగిస్తుందీ పుస్తకం.

సవరించబడిన ఈ సరికొత్త ముద్రణలో ఎయిడ్స్‌, గర్భస్రావం, మాదకద్రవ్యాల వ్యసనం వంటి అనేక ఆరోగ్య సమస్యలపై అదనపు సమాచారాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా వివిధ అంశాలపై మొదటి ప్రచురణలో యిచ్చిన సూచనలని ప్రస్తు పరిస్థితులకు అనుగుణంగా సవరించడం కూడా జరిగింది.

ఇందులోని అధ్యాయాలు:
1. ఇంటింటి వైద్యం, 2. తరచూ అయోమయంలో పడేసే జబ్బులు, 3. రోగిని ఎలా పరీక్షించాలి?, 4. రోగిని ఎలా సంరక్షించాలి?, 5. మందులు లేకుండా జబ్బును నయం చేయడం,

6. ఆధునిక మందుల వాడకంలో తప్పొప్పులు, 7. యాంటీ బయాటిక్స్‌ అంటే ఏమిటి వాటిని ఎలా ఉపయోగించాలి? 8. మందును ఎలా కొలచి ఇవ్వాలి?, 9. ఇంజక్షన్స్‌కి సూచనలు, జాగ్రత్తలు 10. ప్రథమ చికిత్స,

11. పోషకాహారం, 12. వ్యాధినిరోధకం, 13. కొన్ని సర్వ సాధారణ జబ్బులు, 14. ప్రత్యేక వైద్యం అవసరమైన ప్రమాదకరమైన వ్యాధులు, 15. చర్మ వ్యాధులు,

16. కళ్లు, 17. చెవులు, ముక్కు, 18. జీర్ణ వ్యవస్థ, పళ్లు, చిగుళ్లు, నోరు, 19. మూత్రకోశం, జననేంద్రియాలు, 20. తల్లులకు, మంత్రసానులకు కావలసిన వివరాలు,

21. కుటుంబ నియంత్రణ, 22. పిల్లల ఆరోగ్యం జబ్బులు, 23. వృద్ధుల ఆరోగ్యం జబ్బులు, 24. మందుల పెట్టె, 25. మందుల ఉపయోగం, మోతాదు, తీసుకోవలసిన జాగ్రత్తలు, 26. ప్రమాదకరమైన, నిషేధించబడిన మందుల జాబితా.

ఈ పుస్తకాన్ని మీ బీరువాలో దాచి పెట్టకండి. పదిమందికీ అందజేయండి.



వైద్యుడు లేని చోట
- డేవిడ్‌ వర్నర్‌
తెలుగు అనువాదం: డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి

సహాకుడు: బి. కృష్ణారావు

ఆంగ్ల మూలం: వేర్‌ దేర్‌ ఈజ్‌ నో డాక్టర్‌, హెస్పెరియన్‌ ఫౌండేషన్‌, కాలిఫోర్నియా, యు.ఎస్‌.ఎ.
ఇండియన్‌ ఎడిషన్‌ను డా. సత్యమాల సవరించారు. దానిని వాలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, న్యూఢిల్లీ వారు ప్రచురించారు.

తెలుగులో తొలి ముద్రణ: 1982
మలి ముద్రణలు: 1983, 1988, 1990, 1996, 2000
450 పేజీలు ... వెల: 220/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849


.

Tuesday, February 16, 2010

“ఓహ్.. ఇలాంటి బడొకటి ఉంటే ఎంత బాగుణ్ణు” - పూర్ణిమ


“టోటో చాన్”

Give me some sunshine
Give me some rain
Give me another chance.. I wanna grow up once again

ఇటీవల విడుదలైన హిందీ సినిమాలోని పాట వినగానే నాకు నచ్చిందిగానీ, నన్ను నేను చూసుకునే అవకాశంగా అనిపించలేదు, “టోటో చాన్” అనే పుస్తకం చదివే వరకూ. ఆ పుస్తకం చదువుతున్నంత సేపూ, చదివాక కూడా “యెస్.. నాకూ ఒక ఛాన్స్ ఉంటే బాగుణ్ణు” అని అనిపిస్తూ ఉంది.

నా బాల్యంతోనూ, బడితోనూ, అసలు ఇప్పటిదాకా జీవితంలో దేనితోనూ తీవ్ర నిరాశ చెందలేదు. ఉన్నంతలో దొరికిందే చాలు అనుకుంటూ ఉంటాను. పైగా నేను చదివిన బడి అంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో హైద్రాబాద్ లో పేరెన్నిక గల పాఠశాలలో అది ఒకటి. “నీదే స్కూల్?” అని ఎవరన్నా అడగగానే సమాధానంతో పాటు ఒక రవ్వ పొగరు కూడా ఉండేది. స్కూల్ ఉండి బయటకొచ్ఛేటప్పటికి అందరికీ పదో తరగతి మార్కుల మీదే కన్ను. మన లెక్కలు ప్రకారం ఎన్ని ఎక్కువ మార్కులు, ఎంత ఎక్కువ మందికి వస్తే ఆ పాఠశాల అంత మంచిదని కదూ? కాకపోతే సంవత్సరాలు గడిచేకొద్దీ, రెస్యుమే లో పదో తరగతి మార్కులు అట్టడుగున మూలుగుతూ, వల్లవేసిన పాఠాల కన్నా, చుట్టూ ఉన్న మనుషులతో, పరిస్థితుల్లో వేగాల్సి వచ్చినప్పుడు మన ఐ.క్యూ కన్నా ఇ.క్యూకి పరీక్ష! పాఠశాల విద్యార్థిగా మన మెదడెంత పదనుగా ఉన్నదానికంటే మనం జీవితంలో మనకున్న పరిమితుల్లో ఏం చెయ్యగలం అన్నదానికి ముడిసరకైన వ్యక్తిత్వం ముఖ్యం. దానికి బీజాలు పడేది స్కూల్లోనే మరి! మన స్కూల్లు వ్యక్తిత్వాలని తీర్చిదిద్దటం మాట అటుంచి, వాటిని మొగ్గలోనే చిదిమేస్తున్నారు. ఆ చర్చకి ఇది అనువైన చోటు కాదు.

మొన్న హైద్రాబాద్ బుక్ ఫేర్‍లో “నేషనల్ బుక్ ట్రస్ట్” వాళ్ళ స్టాల్ లో పుస్తకాలు చూస్తుండగా, నాతో పాటున్న స్నేహం ఓ పుస్తకం తీసి, “ఈ పుస్తకం చదివారా?” అని అడిగారు. నేను చదవలేదన్నాను. పుస్తకం గురించి మరో ముక్క చెప్పకుండా, ఓ కాపీ నా చేతిలో పెట్టి “తప్పక చదవండి! భలే ఉంటుంది. రైలు బడి అన్న కాన్సెప్టుతో బడి నడుపుతుంటారు. ఆ బడిలో చదివిన విద్యార్థిని రాసిన పుస్తకం ఇది. జపాన్ లో కథ” అని ఉత్సాహంగా చెప్పటం మొదలెట్టారు. సరే, చదివి చూద్దాం అని తీసుకున్నాం.

మొన్నెప్పుడో ఏం చెయ్యటానికీ తోచక, ఊరికే కాసేపు చదువుదాం అని మొదలెట్టాను. పూర్తయ్యే వరకూ ఎక్కడా ఆగలేదు. ఇది “టోటో చాన్” అనే చిన్నారి కథ. ఈ చిన్నారిని ఓ స్కూల్ నుండి పంపించేస్తారు. “ఎందుకూ?” అని అడగడానికి వాళ్ళ అమ్మ స్కూల్‍కి వెళ్లినప్పుడు టీచర్ సవాలక్ష కారణాలు – “క్లాసులో చెయ్యొద్దన్న పని చేస్తుంది”, “పిట్టలతో మాట్లాడుతుంది”, “రోడ్డూ పోయే వాళ్లని అరుస్తూ పిలుస్తుంది” – లాంటివెన్నో చెప్తుంది. టోటో చాన్ అమ్మ చాలా కలరవపడుతున్నా పిల్లకి మాత్రం ఏం జరుగుతుందో చెప్పదు. నేరుగా తీసుకెళ్లి వేరే స్కూల్లో వేస్తుంది.

కాకపోతే ఈ పాత స్కూల్ అన్ని స్కూల్లా ఉండదు. ఇక్కడసలు గదులే ఉండవు. ఒక రైలులో బల్లలు, కుర్చీలూ, బ్లాక్‍బోర్డ్ లు అన్నీ ఉంటాయి. ఈ స్కూల్లో చేరటానికి ఇంటర్వ్యూ ఏంటో తెల్సా? ప్రిన్సిపాల్ ముందు మనకి ఏం తోస్తే అది చెప్పటం. ఎంత సేపైనా చెప్పచ్చు, ఆయన వింటూ ఉంటారు. టోటో చాన్ లాంటి వాగుడుకాయే, “అబ్బా.. ఇంకేం చెప్పాలి” అనుకునేంత వరకూ సహనంగా వింటారు. బడిలో చేరాక, రోజూ బడికి వెళ్ళటం ఎంత నచ్చుతుందంటే, ఒక్క రోజు కూడా స్కూల్ మిస్స్ కాకుండా వెళ్లాలనిపించేంత. క్లాసులో పిరీయడ్స్ ఉండవు. రోజుకిన్ని చదువుకోవాలనుంటే, ఏది ఏక్కడైనా మొదలెట్టచ్చు. “అబ్బా.. పొద్దునే మాథ్సా? ఆ టీచరంటే నాకు చచ్చేంత భయమే” లాంటి ఆలోచనలు ఇక్కడుండవు. అలానే చుట్టూ ఉన్న వాళ్ళతో సఖ్యంగా ఉండడం, బోలెడేసి పుస్తకాలున్న లైబ్రరీ, బొమ్మలు గీసుకోడానికి కాగితాలు కాకుండా, ఏకంగా నేల మీద గీయడానికి అనుమతి.

ఈ పాఠశాల నిర్వహణలో నాకు నచ్చిన రెండు విషయాలు:

“నిన్ను చెయ్యొద్దన్నానా? మళ్ళీ చేస్తావా ఇలాంటి పని?” అని ఎంత మంది టీచర్లు, తల్లులు గొంతులు చించుకుంటూ పిసివాళ్ళని కొట్టరూ?! ఓ సారి మన టోటో చాన్ కూడా ఛెయ్యద్దన్న . చెయ్యకూడని పని చేస్తుంది. ఓ వస్తువు పోగొట్టుకుంటుంది. పోయిందని ఏడ్వకుండా ఆ వస్తువు వెతకడానికి మరో పని చెయ్యటం మొదలెడుతుంది. దాని వల్ల చాలా చెత్త చెత్తగా మారుతుంది ఆ ప్రదేశం. ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలు కనిపిస్తే వాళ్ళని కసిరి, అక్కడి నుండి పంపించేసి, ఆనక నాలుగైదు దెబ్బలు పడేలా చేస్తారు. కానీ ప్రిన్సిపాల్ టోటోని చూడగానే “నీ పని అవ్వగానే ఇదంతా శుభ్రం చేసేస్తావు కదూ” అంటూ వెళ్లిపోతారు. వస్తువూ దొరకదూ, ప్రదేశాన్ని శుభ్రమూ చెయ్యాలి. అంతా అయ్యేసరికి టోటోకి ఆయాసం, నీరసంతో పాటు బుద్ధికూడా వస్తుంది, “ఎందుకా పని చెయ్యటం? ఎందుకు వస్తువు పోగొట్టుకోవడం? ఎందుకు వెత్తుక్కోవటం?” అని.

మరో విషయమేమిటంటే, ఈ స్కూల్ పిల్లలు రోజూ మధ్యాహ్న భోజన విషయంలో ఒక సూత్రం పాటించాలి. దాని పేరు “కొండ నుండి కొంచెం, సముద్రం నుండి కొంచెం”. దీని ప్రకారం పిల్లలకి పెట్టే భోజనంలో నేల పై దొరికే ఆహారం, సముద్రంలో దొరికే ఆహారం సమతుల్యంగా ఉండి పిల్లలకు పౌష్ఠికాహారాన్ని అందివ్వాలని. ఏ కారణాల వల్లనైనా ఏ విద్యార్థి అయినా సరైన ఆహారం తెచ్చుకోకపోతే ప్రిన్సిపల్ భార్యే వాళ్లకి వడ్డిస్తారు. తినడం కూడా “కొన్ని నిమిషాలలో చేసే పని”గా భావించి, పిల్లలు తిన్నా తినకున్నా కొంత వ్యవధిలో మరలా క్లాసుకు వచ్చేయాలని భావించే పాఠశాల్లో చదివుండడం వల్ల అనుకుంటా, నాకీ పాఠశాల ఇంతగా నచ్చింది.

ప్రపంచ యుద్ధం వల్ల ఈ పాఠశాల పూర్తిగా నాశనమయ్యిపోయినా, దాని అవశేషాల్లా మిగిలిన విద్యార్థుల వల్ల పాఠశాల ప్రపంచ ప్రసిద్ధం అయ్యింది. టోటో చాన్ ప్రముఖ టివి ప్రెజంటర్‍గా పేరు తెచ్చుకుంటుంది. అలానే ఆ బడిలో చదివిన తక్కిన పిల్లలు కూడా. వారందరి విశేషాలు పుస్తకం చివర్న జతపరిచారు.

“ఓహ్.. ఇలాంటి బడొకటి ఉంటే ఎంత బాగుణ్ణు” అనిపించేంత అందంగా రాశారు కథని. తెలుగులో వాసిరెడ్డి సీతాదేవిగారి అనువాదం.

నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ మాత్రం తీవ్ర నిరాశ కలిగించింది. బొమ్మలు కనిపించేలానే లేవు. అచ్చు తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఇక ఫాంటూ, పేపరు సంగతి సరే సరి. వెల ఎంతో నాకు గుర్తు లేదు కానీ, ఇదో అరుదైన రచన, దాచుకోవాల్సిన పుస్తకం. అందుకని అన్నీ బాగున్న పుస్తకాన్నే కొనుక్కోండి. స్కూల్‍కి వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకి మాత్రం ఈ పుస్తకం.. MUST READ. తక్కిన వారు కూడా ఓ మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతికోసం ఈ పుస్తకం చదవచ్చు. ఇదే రచన “రైలు బడి” అన్న పేరుతో కూడా వచ్చిందని విన్నాను.

నా చేత పుస్తకం కొనిపించినవారికి మాత్రం బోలెడంటే బోలెడు థాంక్స్!

- పూర్ణిమ (పుస్తకం డాట్ నెట్)

(( టె ట్సుకో కురోయనాగి రచించిన ఈ పుస్తకం జపాన్ భాషలో ప్రచిరించబడిన వెంటనే 45 లక్షల కాపీలు అమ్ముడై చరిత్ర సృష్టిం చింది. ఆ తరువాత దాదాపు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువాదమైయింది. ఒక్కో భాషలో రెండేసి మూడేసి అనువాదాలు వెలువడిన సందర్భాలు కూడా వున్నాయి. అలాగే తెలుగు లో కూడా టోటోచాన్ ను "రైలు బడి" పేరిట హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఈశ్వరి, ఎన్. వేణు గోపాల్ లు తెలుగు అనువాదం చేసారు.
పూర్ణిమ గారి స్ఫూర్తి దాయకమైన పుస్తక సమీక్షను మా బ్లాగు వీక్షకులకు సదా అందు బాటులో ఉంచాలని తిరిగి పొందు పరుస్తున్నాము. ఈ పుస్తక సమీక్ష పై వచ్చిన స్పందనల కోసం ఇక్కడ pustakam.net నొక్కండి.
పూర్ణిమ గారికీ, పుస్తకం డాట్ నెట్ వారికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. )

.

Wednesday, February 10, 2010

పనిపై కనువిప్పు - మనకాలపు పిల్లలకు కొత్త సిలబస్ : సారె తిప్పు … సాలుదున్ను రచన: కంచ ఐలయ్య ..


సారె తిప్పు … సాలుదున్ను
మనకాలపు శ్రమ గౌరవ పాఠాలు
పుస్తక సమీక్ష - అల్లం నారాయణ

సాలు వెనక సాలు తీర్చిదిద్దినట్టుగా, సోలుపుగా, వంకర టింకర పోకుండా మీరెవరైనా దుక్కిదున్నగలరా! మట్టిముట్టిన ఉత్తచేతులతో గుత్తులు గుత్తులుగా వరినాటు వరసబెట్టి, మునుం తప్పకుండా నాటెయ్యగలరా! ఒరం జెక్కగలరా! తూర్పార పట్టగలరా! గాలికి వాలు చూసి చాటెయ్య గలరా! బంతికొట్టగలరా! నోటికాడికింత కొచ్చెటి మెతుకుల బువ్వముద్దను అందించగలరా! ఇదేదీ మీరు చెయ్యలేరు. వరిధాన్యమా! బియ్యమా! తెలియని అజ్ఞానంలో పెరుగుతున్న కంప్యూటర్‌ బ్రాయిలర్‌ కోడిపిల్లల తరం ఈ పనులు అసలే చెయ్యలేరు. కానీ ఒకటి మాత్రం చెయ్యగలరు. ‘సాలుదున్నిన’ క్రియాశీలి, సృజనశీలి, సంపద సృష్టికర్తను ‘ఉత్త బైతు’ … ‘ఎర్రబస్సు’ ఎక్కొచ్చినోడు అని ఈసడించుకోగలరు. అదీ సమస్య.

ఒక్క రైతునే కాదు. ఆదివాసులను, పశులమందలను ఏలే పసుల కాపర్లను, చెప్పులు కుట్టిచ్చే తోలుపని వాళ్ళను, సారె తిప్పి కుండలు కూజాలు గురుగులు మట్టి కళాఖండాలు చేసే కుమ్మరులను, సన్నపోగుపెట్టి అగ్గిపెట్టెలో ఇమిడే కళాత్మక నేత దుస్తులు నేసే సాలోళ్ళను, మురికి కంపును ఒదిలించి తాము మురికి మింగి చలువ దుస్తులందించే చాకలోళ్ళను, బొచ్చుతో ఉంటే కోతులను తలపించే మీ ముఖారవిందాలను అద్దంలో మెరిసేలా చేసే క్షురకులను, చివరకి ఇంటి పని, పాచిపని, పనిచేసే మన తల్లులను, అక్కలను, చెల్లెళ్ళను కూడా ఈసడించుకోగలరు.

శ్రమను హీనంగా చూసే సంస్కృతిలో పుట్టి, అదే సంస్కృతిలో తరతరాలుగా ఒదిగి, ఎదుగుతున్న భారత సమాజంలో శ్రమకు విలువలేకపోవడం వెనక సామాన్యమైన కుట్ర ఏమీలేదు. అతి పెద్ద కుట్రే ఉంది. అది అగ్రవర్ణాల వారు మొత్తం మానవ సంబంధాలను పుట్టుకతోనే శాసించే నిచ్చెనమెట్ల వ్యవస్థను ఏర్పరచడంలో ఉంది. కొంచెం కూడా చెక్కుచెదరని కులవ్యవస్థ ‘స్థిరీకరణ’లో ఉంది. పురుష సూక్తాల్లో, వేదాల్లో, మనువు ప్రవచించిన అనాది సిద్ధాంతాల్లో ఉంది.

కంచ ఐలయ్య అనే ఒక ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఆధిపత్య భావజాలాలపై పోరాటం చేస్తున్న యోధుడు. ఇప్పుడున్న దాన్ని తలకిందులుగా చూసి, అసలు సత్యాల్ని శాస్త్రీయంగా, తాత్వికంగా, సహేతుకంగా చెప్పగలుగుతున్న బుద్ధిజీవి. హిందూమతం పైన, అది శూద్రులు, పంచముల మీద రుద్దిన భావజాలంపైన ఆయన రాతలన్నీ అందుకే తలకిందులుగా ప్రశ్నించడంతో ప్రారంభమై ఒక గొప్ప తాత్విక దృష్టిని కలిగిస్తాయి. ‘నేను హిందువునెట్లయిత’ అనే ఒక సాదాసీదా మాటతో ఒక గొప్ప తాత్విక ప్రపంచాన్ని గతంలో ఆవిష్కరించిన కంచ ఐలయ్య శ్రమ గౌరవ పాఠాలకు సంబంధించి ఇప్పుడు ‘సారెతిప్పు … సాలుదున్ను’ అనే అద్భుతమైన పుస్తకం రాశారు. మానవీయ విలువల పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఏమాత్రం నమ్మకమున్న ఏ వర్ణాల వారికైనా, ఏ వర్గాల వారికైనా ఈ పుస్తకం ఇప్పటిదాకా నెత్తురులో పాతుకుపోయి ఉన్న భావాలను చెల్లాచెదురు చేసి కనువిప్పు కలిగించగల గొప్ప సాధనం.

మానవ నాగరికతకు మూలమైన శ్రమకు సంబంధించిన వివక్ష మూలాలు కుల, మత భావనల్లో ఉన్నాయన్న విషయం గురించిన కొత్త సిలబస్‌ ఈ పుస్తకం. ఈ ప్రపంచం ఎట్లా నిర్మితమయింది? దాని నిర్మాతలెవరు? పనికీ ‘జెండర్‌’కూ గల సంబంధం ఏమిటి? అది విలోమంగా ఎందుకున్నది? అసలు పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? వారికి గౌరవం ఎందుకు దక్కదు … శానిపని (నైపుణ్యం) ఏమిటి? సన్నపని ఏమిటి? ఈ శ్రమ ఎట్లా పుట్టింది? ఎన్ని మార్పులు చెందింది? ఒళ్ళు వంచి, చెమట కక్కుతూ పనిచెయ్యడం అనే ఒక గొప్ప విషయం … ఎందుకు అగౌరవంగా తయారయ్యింది. చదువు పెరిగిన కొద్దీ ఉత్పాదక శక్తుల పట్ల ఏవగింపు, చిన్నచూపు ఎందుకని వస్తున్నది? ఇది పరిణామ క్రమంలో భాగంగా వస్తున్నదా? దీనివెనక కుల, మత వ్యవస్థల ప్రమేయం ఉన్నదా? ఇలా … సహస్ర వృత్తుల సమస్త రహస్యాలు, అద్భుతాలు, ఇన్వెన్షన్లూ అన్నీ కలగలిపి నేర్పుతుంది ఈ పుస్తకం.

ఇది వర్తమాన భారతంలో శ్రమకూ, శ్రమకు సంబంధించిన అన్ని వ్యాపకాలకూ ఆమడ దూరమై పోతున్న ఈ తరపు పిల్లలకు నేర్పాల్సిన విషయాలు. ఉత్తభూమి నుంచి బంగారం పండించగల నేర్పు, బట్టలు నేసే నేర్పు, సబ్బుకు మూలమైన సోడా కనిపెట్టిన నేర్పు, తోలుపనిలో వాడిన రసాయనాల నేర్పు, సారె తిప్పి కళాఖండాన్ని వేళ్ళకొనలమీద చేయగల నేర్పు, అందుకు సంబంధించిన విజ్ఞానం, దాని కారణంగా ఏర్పడిన ఇవ్వాల్టి సౌకర్యాల గురించి చాలా చిన్నచిన్న విషయాలతో, ఎక్కడా ‘జార్గన్‌’ వాడకుండా, అద్భుతంగా మలిచారు ఐలయ్య.

ఇంగ్లీషులో Turning The Pot, Tilling The Land – Dignity of Labour in Our Times గా వచ్చిన ఈ పుస్తకానికి చంద్రిక అనువాదం చాలా సరళంగా తెలుగులోనే రాసినట్టుగా ఉంది.

ఐలయ్య ఈ పుస్తకం ఎందుకు రాశారు? ఐఐటీల్లో, ఐఐఎంలలో, కేంద్ర వైద్య సంస్థల్లో చదువుతున్న అగ్రకులాల పిల్లలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎన్నో ర్యాలీలు చేశారు. వీపీసింగ్‌ బీసీల కోసం మండల్‌ కమిషన్‌ సిఫారసులు అమలుపరచాలనుకున్నప్పుడు కూడా విద్యార్థులు పెద్ద గొడవ చేశారు. ఈ ఆందోళనలో వాళ్ళు రోడ్లు ఊడ్చారు. బూట్లు పాలిష్‌ చేశారు. కూరగాయలు అమ్మారు. అంటే అర్థం ఏమిటి? డాక్టర్లై ఉండీ, మేం రోడ్లు ఊడుస్తున్నామని, ఇంజనీర్లమై ఉండీ బూట్లు పాలిష్‌ చేశామని … అంతేనా? కాదు. రోడ్లు ఊడ్వడం, బూట్లు పాలిష్‌ చెయ్యడం, కూరగాయలు అమ్మడం చిన్న పని. అగౌరవమైన పని అని.

కానీ వాళ్ళు ఆ పనులు నిజంగానే చెయ్యగలరా? సహజ శస్త్ర చికిత్సలు చేసే మంత్రసానులు, మంగలి పనివారు లేకుండానే మానవ నాగరికతలో శస్త్ర చికిత్సలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? లేదు. అందుకే ఐలయ్యను ఈ విద్యార్థుల కార్యాచరణ చికాకు పరిచింది. ఆ మాటకొస్తే ఆ విద్యార్థులట్లా బయటపడ్డారు కాని మన ఇంట్లో, ప్రతివాళ్ళ ఇంట్లో వాళ్ళు శూద్రులైనా, అగ్రవర్ణాల వారైనా శ్రమ పట్ల కొద్దిపాటి గౌరవం కూడా లేకపోవడం మనకు నిత్యానుభవమే.

అందువల్లే మన కాలపు ఈ మిడిమిడి జ్ఞానపు, మిడిమేళపు తరానికి మన కాలపు శ్రమ గౌరవ పాఠాలను కంచ ఐలయ్య అందించారు. ఆదివాసుల తెలివితేటలు ఏ పండు తినాలో, ఏది కూడదో మనకు నేర్పింది. అట్లాగే చాకలి వారి పని, మంగలి వారి పని, వ్యవసాయం. అన్ని వృత్తులూ విజ్ఞానానికి సంబంధించిన కొనసాగింపుగానే చూడాలనే విషయం ఈ పుస్తకంలో అనేక ఉదాహరణలతో ఉంది.

ఒక్క పిల్లలకే కాదు శ్రమను మరచిపోయి, మూలాలు మరచిపోయి త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న పెద్దలకు కూడా ఇది కనువిప్పు కాగల పుస్తకం. సింగరేణిలో సమ్మె జరిగినప్పుడు గోడల మీద ఒక నినాదం ఉండేది. అది శాశ్వతమైన సత్యం. ‘కంప్యూటర్లు బొగ్గు తవ్వగలవా’ … తవ్వలేవు. బొగ్గు లేకుండా ప్రపంచం బతకగలదా? లేదు. అందువల్ల శ్రమకు సంబంధించి మౌలికాంశం భౌతిక శ్రమ, దానికి సంబంధించిన మేధోశ్రమ. దీనికి మినహాయింపు లేదన్న సత్యాన్ని కంచ ఐలయ్య పుస్తకం ఆవిష్కరించింది.

భారతదేశంలో శ్రమగౌరవం లేకపోవడానికి, అశాస్త్రీయ, అభివృద్ధి నిరోధక భావజాలం ఉండడానికి కారణమైన మత, కుల వ్యవస్థల పాత్రపై, శ్రమలో ‘జెండర్‌’ వివక్షపై కూడా ఈ పుస్తకం కొంత సైద్ధాంతికంగా వివరించింది. ఇది అన్ని పాఠశాలల్లో … అన్ని గ్రంథాలయాల్లో ఉండాల్సిన పుస్తకం. ముఖ్యంగా శ్రమను గౌరవించే వారికి ఇది ‘హ్యాండ్‌బుక్‌’ కాగలిగిన విలువైన పుస్తకం.

దీనికి బొమ్మలు వేసిన దుర్గాబాయ్‌ వ్యామ్‌ను ప్రత్యేకంగా పేర్కొనాలి. పెద్దగా చదువులేని దుర్గాబాయ్‌ వ్యామ్‌ ఫోనులో పాఠ్యాంశాలను విని కేవలం పది రోజుల్లో వేసిన బొమ్మలు ఈ పుస్తకానికి అదనపు అందాన్ని, అదనపు విలువనూ తెచ్చాయి.
ఐలయ్యకు అనేక అభినందనలు.
ఈ పుస్తకం ముద్రించిన హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌కు కృతజ్ఞతలు.

సారె తిప్పు … సాలుదున్ను, మనకాలపు శ్రమ గౌరవ పాఠాలు
రచన: కంచ ఐలయ్య

బొమ్మలు: దుర్గాబాయ్‌వ్యామ్‌
తెలుగు: చంద్రిక

ప్రతులకు: హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, హైదరాబాద్‌ – 500 067.

పేజీలు: 108, వెల: రూ. 80.


Courtesy: Andhrajyothy

( అల్లం నారాయణ గారు ఆంధ్ర జ్యోతిలో రాసిన ఈ పుస్తక సమీక్షను పుస్తకం డాట్ నెట్ వారు ఏప్రిల్ 2008 లో తమ వెబ్ సైట్ లో ప్రచురించారు. మా బ్లాగు సందర్శకులకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము. అల్లం నారాయణ గారికీ, ఆంద్ర జ్యోతి వారికీ, పుస్తకం డాట్ నెట్ వారికీ మా కృతజ్ఞతలు. )

Saturday, January 30, 2010

మోతె - తెలంగాణ బతుకుబాట - ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌.లింబాద్రి ...

ఇది ఒక తెలంగాణా గ్రామం కథ.
ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు లేక తెలంగాణా గ్రామాలు ఎట్లా తిప్పలు పడుతున్నాయో తెలియజేసే కథ.

ఆ గ్రామం పేరు మోతె.
నిజామాబాద్‌ జిల్లా, వేల్పూరు మండలంలో వుంది.
తొమ్మిదేళ్ల క్రితం ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌. లింబాద్రి మోతె వెళ్లి అక్కడి స్థితిగతులపై చేసిన అధ్యయన సారాంశమే ఈ చిరు పుస్తకం.

మోతె విరాట్‌ స్వరూపమే తెలంగాణ. ఆ గ్రామానికి ఉత్తర దక్షిణాలలో వాగులున్నట్లే తెలంగాణాకు ఉత్తరాన గోదావరి, దక్షిణాన కృష్ణా నదులున్నాయి. రెండు వాగులుండీ మోతె గ్రామం నీళ్లకు ఏడ్చినట్టే, తెలంగాణా కూడా రెండు నదులుండీ నీటి ఎద్దడితో బాధపడుతున్నది. అంకెలు గణాంకాలు కూడా తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని రుజువు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదలకు చేసిన కేటాయింపుల్లో 90% భారీ మధ్య తరహా ప్రాజెక్టులకే వెచ్చించారు. అందువల్ల వచ్చిన ఫలితాలు కోస్తా ఆంధ్రకే ఎక్కువగా దక్కాయి. చిన్న నీటి పారుదలను విస్మరించడం వలన మోతెలో ఎండిపోయినట్టే తెలంగాణా అంతటా చెరువులు ఎండిపోయాయి. మోతె చిత్రం తెలంగాణాకు జరిగిన అన్యాయానికి ఒక మచ్చుతునకగా భావించవచ్చు.

మోతెకి రెండు వాగులే కాదు దక్షిణాన ఐదు చెరువులు కూడా వున్నాయి. వాటిలో పెద్ద చెరువు ప్రధానమైనది. అది నిండి అ లుగు పారితేనే మిగతా నాలుగు చెరువులకు నీరొస్తుంది. ఆ అ లుగు నీరు నాలుగు చెరువుల్లోకి పారడానికి నిజాం కాలంలోనే గ్రామస్తులు శ్రమదానంతో కాలువలు తవ్వుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చెరువులకు వరదనీరు వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో అవి ఎండిపోతున్నాయి.

నలభై ఏళ్ల క్రిందటి వరకూ ఆ ఊళ్లో దాదాపు 300 బావులుండేవి. అవి కూడా ఎండిపోతుండటంతో 1969 నుంచి వాటిలో ఇన్‌వెల్‌ బోర్లు వేయడం మొదలుపెట్టారు. అయినా ఫలితం అంతంతమాత్రమే కావడంతో 1976 నుంచి బోర్లు వేయడం ప్రారంభించారు.

తెలంగాణాలో మొట్టమొదటి బోరు వేసింది మోతె లోనే అంటారు. ఇప్పుడు అక్కడ వ్యవసాయం ప్రధానంగా బోరు బావులపై ఆధారపడే సాగుతోంది. మొతేలో నేడు 900 బోర్లు, 25వ వరకు ఫిల్టర్లు వున్నాయి.

గత పది సంవత్సరాలుగా బోర్లలో కూడా నీళ్లు తగ్గిపోయాయి. గతంలో 150 అడుగులకే నీరు వస్తే ఇప్పుడు దాదాపు 300 అడుగుల కంటే లోతుగా బోర్లు వేయించాల్సి వస్తోంది.

బోర్లు ఒకసారి వేస్తే ఎప్పటికీ నీళ్లుంటాయన్న గ్యారెంటీ వుండదు. నీళ్లు ఎండిపోయినప్పుడు బావుల మాదిరిగా పూడిక తీయడం కుదరదు. బోరు ఎండి పోయిందంటే మరో కొత్త బోరు వేయించుకోవాల్సిందే. ఇక్కడ ఆవిధంగా ఒక్కొక్క రైతు గత పదేళ్లలో సగటున ఐదారు సార్లు బోర్లు వేయించారు. బంగ్ల భూమయ్య అనే రైతైతే యాభై బోర్లు వేయించారు.

బోరు వేయిస్తే నీరు పడుతుందని, ఆ నీరు చాలాకాలం వుంటుందని ఎలాంటి భరోసా వుండదు. ఈ ఊళ్లో గత పదేళ్లలో పది కన్నా ఎక్కువ బోర్లు వేయించిన కుటుంబాలు 30 వున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. రైతులు వేలకు వేలు బోర్లకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దానికి తోడు ఓల్టేజీ సమస్య వల్ల మోటార్లు కాలిపోయి వారిపై అదనపు భారం పడుతూ వుంటుంది. మరో దారిలేక తెలంగాణా రైతులు ఇన్ని కష్టాలు పడుతూనే వ్యవసాయం చేస్తుంటారు.

ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన వాళ్లు రైతు కూలీలుగా, కార్మికులుగా మారి వలస పోతుంటారు. ఈ చిన్న ఊరి నుంచి ఇప్పటి వరకు 355 మంది దుబాయికి వలసపోయారు. మరెందరో బొంబాయి, భివాండీలకు వలస పోయారు.

మొత్తం తెలంగాణా అంతటా ఇదే పరిస్థితి.

తెలంగాణాలో బావుల కింద సాగయ్యే భూమి 1955 లో 2,56,809 ఎకరాలు కాగా, ఇప్పుడు బావుల కింద సాగయ్యే భూమి 25,26,451 ఎకరాలు!

చెరువులు ఎండి పోయాయి. కాలువలు రాలేదు. కనుక తెలంగాణా రైతులు అనేక వ్యయప్రయాసలకోర్చి మరో గత్యంతరంలేక బావులపై ఆధారపడవలసి వస్తున్నది. 53 ఏళ్ల ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో తెలంగాణా సాధించిన ప్రగతి ఇది!

కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతం తెలంగాణా లోనే అత్యధికంగా వున్నప్పటికీ ఇక్కడి రైతులకు కడగండ్లు తప్పడం లేదు. ఇక్కడి ప్రజలకు తాగు నీటికి కూడా దిక్కులేకుండా పోతున్నది. ఉన్నది పోయింది. ఉంచుకున్నది పోయింది అన్నట్టు తయారైంది పరిస్థితి.

నికరమైన సాగునీటి వనరులు లేక ఇటు కరెంటు దేవుడు, అటు వాన దేవుడు ఈ ఇద్దరు దేవుళ్లపై ఆధారపడి తెలంగాణా భారంగా బతుకీడుస్తున్నది. ఆ ఇద్దరు దేవుళ్లు కనికరిస్తేనే తెలంగాణాలో వ్యవసాయం సాగుతుంది. లేకుంటే లేదు. ఈ నేపథ్యం నుండే ఇవ్వాళ తెలంగాణా రైతులు న్యాయాన్ని కోరుతున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

మోతె - తెలంగాణా బతుకు బాట
-ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌. లింబాద్రి

ప్రథమ ముద్రణ : 2001
24 పేజీలు, వెల: రూ.5


.

Sunday, January 24, 2010

మహారణ్యం సమక్షంలో మహామానవుడి సాక్షాత్కారం - చినవీరభద్రుడు ...

ప్రసిద్ధ బెంగాలీ రచయిత బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ (1884-1950) రాసిన పథేర్‌ పాంచాలిని సత్యజిత్‌ రాయ్‌ సినిమాగా మలిచి ప్రపంచ ప్రసిద్ధం చేశాడు.

ఆ స్థాయిలో ప్రసిద్ధి చెందనప్పటికీ, బిభూతి భూషణ్‌ రాసిన మరో నవల ''అరణ్యక'' (1938) కూడా ఎంతో విశిష్టమైన రచన.

దాన్ని సాహిత్య అకాడెమీ కోసం సూరంపూడి సీతారాం ''వనవాసి'' (1961) పేరిట తెలుగు చేశారు. ఎంతో కాలంగా ఆ పుస్తకం ప్రతులు ఎక్కడా దొరకడం లేదు. ఆ లోటు తీర్చడం కోసం ఇప్పుడు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ఈ పుస్తకాన్ని మళ్లా తెలుగు ప్రజలకు అందించడం నాకెంతో సంతోషం కలిగించింది.

ఇప్పటికి దాదాపు ముఫ్ఫై ఏళ్ల కిందట ఎనభైల ప్రారంభంలో ఈ పుస్తకాన్ని మొదటిసారి నేనే కనుగొన్నట్టుగా ఎందరికో పరిచయం చేశాను. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత ఆ పుస్తకాన్ని చూడగానే, పేజీలు తిప్పగానే- మహాలిఖారూప పర్వత శ్రేణి, మోహన్‌పురా రిజర్వు ఫారెస్టు, జ్యోత్స్నా పులకిత జలరాశి మయమైన సరస్వతీహ్రదం, వన్యశేఫాలికాపుష్పాల సౌరభం, పసుపు పచ్చని దూధలి పుష్పాల పరాగం
నన్నొక్కసారిగా ముంచెత్తాయి.

ప్రాచీన సంతాల్‌ రాజకుటుంబం, చకుమికి టోలాలో వాళ్ల ఇల్లు, బోమాయి బూరు పచ్చికబయళ్లు, నాఢా, లటులియాల్లో అ ల్లుకుంటున్న నూతన జీవన సంరంభం; నా జ్ఞాపకాల్లో మరుగుపడ్డవి ఒక్కసారిగా మేల్కొనడంతో, నా నిద్రాణ స్వప్నాల్నీ, నా చుట్టూ వున్న నగర జీవితాన్నీ సముదాయించుకోలేక నేను చాలా అవస్థపడ్డాను.

వనవాసి కథాంశం చాలా సరళం.
కలకత్తాలో నిరుద్యోగిగా వున్న సత్యచరణ్‌ అనే యువకుడు అవినాశ్‌ అనే మిత్రుడి కోరిక మీద బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో వున్న దాదాపు పదివేల ఎకరాల ఎస్టేట్‌ వ్యవహారాలు చూసే పనికి ఒప్పుకుంటాడు.
నగరాన్ని వదిలిపెట్టి, ఆ అడవిలో దాదాపు ఆరేళ్లపాటు వుండిపోతాడు. అక్కడ అడవి నరికించి, భూమిని సాగులోకి తెచ్చి ఎస్టేటు ఆదాయం పెంచలవలసిన పని ఒకవైపూ, నెమ్మదిగా తనను లోబరుచుకున్న అడవి సౌందర్యం ముందు వివశుడైపోవడం మరొకవైపూ అతణ్ణి లాగుతుంటాయి. ఆ క్రమంలో దీన దరిద్ర భారతదేశ ముఖచిత్రమొకవైపూ, ప్రాచీన అరణ్య సీమల మహా సౌందర్యం మరొకవైపూ అతడికి సాక్షాత్కరిస్తాయి.

ఈ అనుభవాలన్నిటినీ ఎన్నాళ్ల తరువాతనో ''కలకత్తా నగరంలో క్షుద్రమైన ఒక గొందిలో, అద్దె కొంపలో మధ్యాహ్నవేళ కూర్చుని భార్య కుట్టుపని సూది చేసే సవ్వడి వింటూ వున్న సమయంలో తలచుకుంటూ మనకి చెప్తాడు. 'ఆ నిగూఢారణ్య సౌందర్యం, తెల్లవారు ఝామున చంద్రాస్తమయ దృశ్యం, కొండల పైన ఆకులు లేని గోల్‌గోలీ చెట్లపై కొమ్మకొమ్మకూ పూసిన పచ్చని పూలరాశి, శుష్కకాశవనం వ్యాపింపచేసిన కసరువాసనలు 'గుర్తొస్తూంటే' మళ్ళీ ఎన్ని పర్యాయాలు ఊహాకల్పనలోనే గుర్రమెక్కి, వెన్నెల రాత్రిలో పూర్ణియా ప్రయాణం చేశానో గుర్తులేదు' (పే.106) అంటాడు.

కథకుడు పూర్ణియా అడవులకు వెళ్లిన మొదటి రోజుల్లో అతడి కచేరీ ఉద్యోగి ఒకడు 'అడవి మిమ్మల్ని ఆవహిస్తుంది, అప్పుడింక ఎలాటి కోలాహలమూ జనసమ్మర్థమూ రుచించవు' అంటాడు.
అడవి ఆవహించిన అనుభవం ఎలా వుంటుందో కథకుడు నెమ్మదిగా మనకు వర్ణించడం మొదలుపెట్టడంతో మనని కూడా అటవీ సౌందర్యం ఆవహించడం మొదలుపెడుతుంది. అందుకు బిభూతి భూషణ్‌ వాడిన భాష, చిత్రించిన సన్నివేశాలూ, వాటికి సూరంపూడి సీతారాం వాడిన తెలుగూ మనల్ని గాఢంగా సమ్మోహపరుస్తాయి. అది ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చేదిగా వుంటుంది.

అయినా కూడా కథకుడు తాను చూసిన సౌందర్యాన్ని మనకు పూర్తిగా చెప్పలేకపోయాననే అనుకుంటాడు. ''పూల్కియా భైహార్‌ల''లో ఆ వెన్నెల రాత్రులను వర్ణించడానికి ప్రయత్నించను. ఆ సుందరలోకాన్ని, ఆ రూపంలో ప్రత్యక్షంగా చూడనంతకాలం, దాని గురించి చెప్పగా వినీ, రాయగా చదివీ గ్రహించడం అసంభవం... అంటువంటి వెన్నెల రాత్రిని జీవితంలో ఒక్కసారైనా చూడటం ఉచితం. అ లా చూడని వారికి ఈశ్వర సృష్టిలో ఒకానొక సౌందర్యానుభూతి నష్టమైపోయిందన్న మాటే' (పే.21) అంటాడొకచోట.

కానీ, కేవలం అడవి అందాన్ని వర్ణించడానికే బిభూతి భూషణుడు ఈ నవల రాయలేదు.
అడవి ఒక నెపం మాత్రమే. వనవాసం వల్లనే అతడు ప్రపంచమంటే ఏమిటో తెలుసుకుంటాడు.
అడవికి వెళ్లిన తరువాతనే మనుషుల్ని ప్రేమించడం మొదలుపెడతాడు.
అడవికి వెళ్లిన మొదటి రోజుల్లో కలకత్తాను తలచుకుంటూ ''మనుషుల మధ్య వుండడం అంటే, అంత ప్రియమైనదని ఇంతకు ముందు తెలియలేదు. మనుషుల పట్ల నా కర్తవ్యాన్ని సర్వదా నిర్వర్తించలేకపోయినమాట నిజమే.; అయినా ఎంత ప్రేమ!'' (పే.10) అనుకుంటాడు. ఈ వాక్యాలు ఈ నవల మొత్తానికి ప్రాతిపదిక.

కథకుడు కలకత్తాలో వున్నప్పుడు తన చుట్టూ మనుషులుండడంలోని ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించాడు. కానీ వాళ్ల పట్ల తన కర్తవ్యం నిర్వహించే విషయంలో అతనికప్పుడేమీ ప్రాధాన్యత లేదు. కానీ అడవికి వెళ్లిన తరువాత అతడి చిత్తప్రవృత్తిలో వచ్చిన మార్పు సుస్పష్టం. అతడు మనుషుల కోసం ఆర్రులు చాచడమే కాదు, తనకు తారసపడ్డ ప్రతి ఒక్కరి పట్లా అతడెంతో ఉదారంగా, ఆప్యాయంగా, సుస్నేహంగా ప్రవర్తించడం కనిపిస్తుంది మనకి. తను కలిసిన ప్రతి ఒక్కరి భౌతిక, మానసిక, సాంఘిక అవసరాలు గుర్తించడంలో, వాటిని తీర్చడానికి ప్రయత్నించడంలో అతడి వ్యక్తిత్వంలో ధీరత్వం మన ముందు ఆవిష్కృతమౌతూ ముగ్ధుల్ని చేస్తుంది.
నవదాలక్ష్మీపురం సరిహద్దుల్లో మిఛీనది ఒడ్డున కనిపించే ధన్‌ ఝరి కొండ ఎంత గంభీరంగా కనిపిస్తుందో కథకుడి జీవితానుభవం కూడా అంతే గంభీరంగా కనిపిస్తుంది. అతడికి తారసపడ్డ రకరకాల మనుషులు కథకుడు జీవితంలో ప్రవేశించినట్లే మన జీవితంలోకి నెట్టుకొచ్చేస్తారు.

కథంతా చదివాక మనకేమనిపిస్తుంది?
కథకుడొకచోట ఇలా అంటాడు. ''నాఢా అరణ్యమూ, అజామాబాద్‌ విస్తృత మైదానాల్లో గోధూళివేళ రక్తరాగ రంజితమైన మేఘాలనూ, దిగంచలాల వరకూ వ్యాపించి జ్యోత్స్నాప్లావితమైన నిర్జన మైదానాలనూ చూచినప్పుడల్లా తోచేది ఈ స్వరూపమే. ప్రేమ ఇదే రోమాన్స్‌, కవిత, సౌందర్యం శిల్పం, భావుకత- ఈ దివ్య మంగళ రూపమే మనం ప్రాణాధికంగా ప్రేమించేది, ఇదే లలితకళను సృష్టించేది. ప్రీతి పాత్రులైన వారికోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుని నిశ్శేషంగా మిగిలి పోయేది'' (పే.230). ఒక మహారణ్య సమక్షంలో కథకుడు తనలోని మహామానవుణ్ణి సాక్షాత్కరించుకున్నాడనీ, గొప్ప సౌందర్యం మనలోని మనిషిని మేల్కొల్పుతుందనీ, అదే సౌందర్య ప్రయోజనమనీ, సాహిత్య ప్రయోజనమనీ చెప్పకుండానే చెప్తుందీ రచన.

- చినవీరభద్రుడు
ఆదివారం ఆంద్రజ్యోతి 24 జనవరి 2010 సౌజన్యంతో.



వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం

తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి ముద్రణ: సెప్టెంబర్‌ 2009

278 పేజీలు, వెల: రూ.120


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849


...

Sunday, January 10, 2010

అడవి బిడ్డల జీవితం - ఈనాడు సమీక్ష ...



బెంగాలీ నవలల అనువాదాలు రెండుమూడు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, మధ్యతరగతి జీవుల్లో పఠనాభిలాషను పెంపొందించాయి.

శరత్‌ నవలలైతే తెలుగువారికి ఎంత హృదయగతమయ్యాయో చెప్పనవసరమే లేదు.

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ వంటి బెంగాలీ రచయితలు తెలుగు పాఠకులకు పరిచయమైంది అప్పుడే.

ఆయన రాసిన ''అరణ్యన్‌'' గిరిజన జీవితాల లోతుల్లోకి వెడుతూ ప్రకృతితో మమేకమై అరణ్య ప్రాంతాల స్థితిగతులతో మమేకం చేస్తుంది.

బెంగాలీలో 1938లోనే ముద్రితమైన ఈ నవలను ''వనవాసి'' పేరుతో సూరంపూడి సీతారాం అనువదించారు.

1961లో సాహిత్య అకాడమీ తొలి అనువాదాన్ని వెలువరించింది.

దాదాపు యాభై ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పునర్ముద్రించింది.


- ఈనాడు ఆదివారం 09 జనవరి 2010 సౌజన్యంతో


వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం

తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి ముద్రణ: సెప్టెంబర్‌ 2009

278 పేజీలు, వెల: రూ.120


ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Monday, January 4, 2010

పుస్తకం డాట్ నెట్ లో సుజాత గారి వనవాసి నవలా సమీక్ష ...



పుస్తకం డాట్ నెట్ లో బిభూతి భూషణ్ బందోపాధ్యాయ "వానవాసి" నవలపై 'మనసులో మాట' సుజాత గారు చక్కని సమీక్ష రాశారు. పుస్తకాభిమానుల స్పందనలతో సహా ఆ సమీక్షను ... ఇక్కడ ... చూడవచ్చు.
మా బ్లాగు సందర్శకుల సౌలభ్యం కోసం పుస్తకం డాట్ నెట్ వారికి, సుజాత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ సమీక్షను తిరిగి ఇక్కడ పొందు పరుస్తున్నాం.
కొందరు ఈ ప్రచురణ అసలు నవలకు సంక్షిప్త రూపమా అని అడుగుతున్నారు. ఇది 1961 నాటి తొలి ముద్రణకు యధాతధ రూపమని గమనిచగలరు.
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్

........

"వానవాసి"

కొన్ని పుస్తకాలు చదువుతున్నపుడు అంత ఆసక్తిగా అనిపించకపోయినా పూర్తయ్యేసరికి ఒక గాఢమైన నిట్టూర్పు వెలువడక మానదు. కనీసం ఒక పదినిమిషాలన్నా అప్పటికప్పుడు ఆలోచనల్లో పడెయ్యక మానదు. ఆ తర్వాత పదే పదే గుర్తుకు రాకా మానదు.ఆ కోవలోదే “వనవాసి” నవల!

ఇది నవలా? సామాజిక ప్రయోజనం కోసం రాసిన డాక్యుమెంటరీ రచనా? ఒక ఏకాంత స్వాప్నికుడి జీవిత ప్రయాణంలో భాగమా? అని తలెత్తే ప్రశ్నలకు ఎవరికి వారు సమాధానం చెప్పుకోవలసిందే!

అప్పుడెప్పుడో పథేర్ పాంచాలి నవల చదువుతుంటే ముందు మాటలో భిభూతి భూషణ్ వంద్యోపాధ్యాయ గారి మరో నవల ‘అరణ్యక” గురించి చదివి దానికోసం ప్రయత్నిస్తే అది దుర్లభమని తేలింది.
అనుకోకుండా ఆ మధ్య విజయవాడలో పాత పుస్తకాల షాపులో వనవాసి మొదటి ప్రచురణ కాపీ,(1961 లో సాహిత్య అకాడేమీ తరఫున అద్దేపల్లి అండ్ కో రాజమండ్రి వారు వేసింది) దొరికింది. చాలా జాగ్రత్తగా చదవాల్సి వచ్చింది. కొన్ని పేజీలు పట్టుకుంటే పొడి అయిపోయేలా ఉన్నాయి.

ఇందులో కథంటూ పెద్దగా ఏమీ ఉండదు. ఉండేవల్లా ఆలోచనలే! రచయిత కథకుడిగా మారగా అతని మెదడులో ప్రాణం పోసుకుని హృదయం ద్వారా మనలోకి ప్రవహించి మనలో కూడా ఆలోచనల్ని రేకెత్తించే ఆలోచనలు!

విద్యావంతుడై ఉన్నత సంస్కారం కలిగిన ఒక బెంగాలీ యువకుడు సత్యచరణ్ బాబు!ఉద్యోగార్థియై తిరుగుతుండగా పాత స్నేహితుడు కనపడతాడు. మాటల మధ్యలో తమకు పూర్ణియా జిల్లాలో 30 వేల బిఘాల (బిఘా అంటే సుమారు 40 సెంట్ల నేల)ఎస్టేట్ అడవి ఉందనీ దాని బాగోగులు చూస్తూ అడవిని వ్యవసాయానికి కౌలుకిస్తూ వసూళ్ళు చూసే మేనేజర్ అవసరం ఉందని చెప్తాడు. ఏ పనికైనా సిద్ధంగా ఉన్న సత్యచరణ్ తాను ఆ ఉద్యోగం చేస్తానని ఒప్పుకుని అడవికి ప్రయాణమవుతాడు. ఒకవైపు కలకత్తా నగరాన్ని “మిస్”అవుతానేమో అన్న బెంగతోనే, అయిష్టంగానే పొట్టకూటికోసం అడవికి వెళతాడు.

ఎటుచూసినా అడవి, నిశ్శబ్దమైన అడవి, జన సంచారం లేని అడవి,కొద్ది మంది జనం ఉన్నా.. గిరిజనులు! వారి భాష అర్థం కాదు! బంధుమిత్రులు, పాటకచేరి, లైబ్రరీ,సాహిత్యం లేని జీవితాన్ని ఎన్నడూ ఎరగని సత్యచరణ్ ఈ జీవితాన్ని చూసి కుంగిపోతాడు.

కానీ రోజులు గడిచేకొద్దీ,అరణ్య సౌందర్యం అతన్ని వ్యామోహంలా ఆవహిస్తుంది.ఎంతగా అంటే కొన్నాళ్ళకి తిరిగి కలకత్తా నగరానికి పోలేనేమో అని భయం వేస్తుందతనికి!

అపూర్వ రక్తారుణ రాగరంజిత మేఘమాలలు ధరించిన సంధ్యలూ,ఉన్మాదిని అయిన భైరవీ స్వరూపం ధరించిన ఉగ్ర మధ్యాహ్నాలు,హిమస్నిగ్ధ వనకుసుమపరిమళంతో జ్యోత్స్నాలంకారాలతో ఎన్నో గంభీర నిశీధులు అతన్ని కట్టి పడేస్తాయి.అడవి కాచిన వెన్నెలే సార్ధకం అని నిర్ధారిస్తాడు అతడు.ఏకాంతంలో దిగంతాల వరకూ వ్యాపించిన వెన్నెల్ని అనుభవించి అడవిలో వెన్నెల రాత్రిని చూడని వారి జీవితంలో ఈశ్వర సృష్టిలో ఒకానొక అద్భుత సౌందర్యానుభూతి నష్టపోయినట్లే అంటాడు.

ఒకపక్క అడవిని నరికించి కౌలుకిస్తూనే ఆ చుట్టుపక్క పల్లెల్లో పేద జీవితాల దరిద్రం వికృత స్వరూపాన్ని చూసి నిర్ఘాంతపోతాడు. ఆకలితీర్చుకోడానికి పచ్చి మినప్పిండి తినేవారిని చూస్తాడు.పిల్లల ఆకలి తీర్చడానికి ఎంగిలాకుల కోసం ఆశపడుతూ, రేగుపళ్ళు దొంగతనం చేసి శిక్షకు సిద్ధమయ్యే అద్భుత సౌందర్యరాశిని చూస్తాడు. డబ్బుతో తనను కొనాలని చూసే భూస్వామిని చూస్తాడు. గొర్రెలు కాస్తూ ఒక ఆటవిక తెగకు రాజుగా పరిచయమయ్యే ముసలివాడిని కలుస్తాడు.

మొక్కలమీద ప్రేమతో ఎక్కడెక్కడినుంచో పూలతీగలు తెచ్చి సరస్వతీ మడుగు వద్ద నాటి అడవిని సప్తవర్ణ శోభితం చేయాలనుకునే బన్వారీని చూసి ముగ్ధుడవుతాడు.అతడితోపాటు మడుగు చుట్టూ అద్భుత పుష్ప వనాన్ని సృష్టిస్తాడు.పూలతో పందిరి వేస్తాడు.కోతల సమయంలో ఎక్కడెక్కడినుంచో వచ్చి పని చేసే కూలివాళ్లను, వాళ్ల కష్టాన్ని దోచుకునే చిల్లర వ్యాపారులనీ పరికించి నిశ్చేష్టుడవుతాడు.

కొన్నాళ్ళకి…మొత్తం అడవంతా నరికి కౌలుకివ్వడం పుర్తవుతుంది. ఇక సరస్వతి మడుగు ప్రాంతాన్ని ఇవ్వడానికి ఎంతో దుఃఖపడినా లాభం లేకపొతుంది.ఇక అతడికి అక్కడ పనేముంది?

భారమైన మనసుతో ఇరుకు వీధుల కలకత్తా నగరానికి తిరుగు ప్రయాణమవుతాడు.
తిరిగి వచ్చాక కూడా అతన్ని అడవి జ్ఞాపకాలు వదిలిపెట్టవు. వేధిస్తాయి.

అడవుల మనుగడ, వాటిమీద ఆధారపడి బతికే ఆదిమజాతుల మనుగడ,కరువైపోతున్న ప్రాణవాయువు…పచ్చదనం, వీటన్నిటిగురించీ రచయిత ఏమీ మాట్లాడడు. ఉపన్యాసాలివ్వడు. గగ్గోలుపెట్టడు.ప్రశ్నించడు.

కానీ ఆ పని మనచేత చేయిస్తాడు!

ఒక కల్లోలాన్ని రేకెత్తిస్తాడు మెదడులో!
“అడవులంతరించిపోతే?” అని నెమ్మదిగా పాకే ఆందోళనని మనలో సృష్టిస్తాడు.
కుంత,బన్వారీ,భానుమతి,రాజూపాండే,థాతురియా,నక్ఛేదీ, కవి వెంకటేశ్వర ప్రసాద్…వీళ్ళందరినీ మనకు అంటగట్టి తను మాత్రం నిశ్చింతగా ఉంటాడు.

అడవిలోని ప్రతి చిన్న సౌందర్యానికీ ముగ్ధుడయ్యే భిభూతి ప్రసాద్ ని ఈ నవల్లో చూడొచ్చు. వెన్నెల రాత్రుల వర్ణన పుస్తకంలో చాలా చోట్ల ఉంటుంది.

ఏకాంతంలో తనకు మాత్రమే గోచరమయ్యే ఆ అద్భుత వన సౌందర్యానికి పరవశుడై కవితావేశంతో స్పందిస్తాడు.రాగరంజితమైన మేఘాలను,దిగంతాల వరకూ వ్యాపించి జ్యోత్స్నా ప్లావితమై నిర్జనమైన మైదాన ప్రాంతాలనూ చూసి” ఈ స్వరూపమే ప్రేమ!ఇదే రొమాన్స్! కవిత, సౌందర్యం,శిల్పం, భావుకత. ఈ దివ్యమంగళ రూపమే మనం ప్రాణాధికంగా ప్రేమించేది.ఇదే లలిత కళను సృష్టించేది. ప్రీతిపాత్రులైన వారికోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుని నిశ్శేషంగా మిగిలిపోయేది. తిరిగి విశ్వ జ్ఞాన శక్తినీ, దృష్టినీ వినియోగించి గ్రహాలను, నక్షత్ర లోకాలనూ, నీహారికలనూ సృష్టించేది ఇదే..” అంటాడు.

విద్యావంతుడైన సత్యచరణ మూఢనమ్మకాలకు విలువనివ్వడు. అడవి దున్నలకు ప్రమాదం రాకుండా ఎప్పుడూ కాపాడే ఒక దేవుడి గురించి ఆదివాసీలు చెపితే కొట్టిపారేస్తాడు. కలకత్తా వచ్చాక ఒకసారి రోడ్డు పక్కన నడుస్తూ….బరువు ను లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక దున్నపోతుని బండివాడు చెర్నాకోలాతో ఛెళ్ళున కొట్టడం చూసి చలించి “ఆ వనదేవత ఇక్కడుంటే ఎంత బావుండు”అని అప్రయత్నంగా అనుకుంటాడు.

ఇలాంటి అద్భుత సన్నివేశాలు, అపూర్వమైన వనసౌందర్య వర్ణనలూ, ఆదివాసీల జీవితంలో దరిద్ర దేవత విశ్వరూపం,
ప్రతి పేజీలో కనపడతాయి.

ఈ పుస్తకం చదవాలంటే కేవలం పుస్తకం చదవాలన్న ఆసక్తి చాలదు. ఆ తర్వాత వెంటాడే యదార్థ జీవిత వ్యథార్త దృశ్యాలు,అడవుల మనుగడ పట్ల రేగే ఆలోచనలు, మనసంతా ఆక్రమించే ఆదివాసీ పాత్రలు, అన్నానికి, రొట్టేలకూ కూడా నోచుకోక గడ్డిగింజలూ, పచ్చి పిండీ తినే దృశ్యాలు, ఒక్క రొట్టె కోసం పన్నెండు మైళ్లు నడిచి వచ్చే పేదలూ..వారిని దోచే భూస్వాములూ..వీటన్నింటినీ భరించగలిగే శక్తి మనసుకు ఉండాలి. ఒక హాయిని, వేదనను ఒకేసారి కలిగించే భావాన్ని భరించగలగాలి. అప్పుడే ఈ పుస్తకం కొనాలి. ఇది కాఫీ టేబుల్ బుక్ కాదు. మస్ట్ రీడ్ బుక్!
ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. ప్రకాశకులు చెప్పినట్లు ఈ పుస్తకం అవసరం రచనాకాలం కంటే ఇప్పుడే ఎక్కువ. మరీ ఎక్కువ.

స్వర్గీయ శ్రీ సూరంపూడి సీతారామ్ గారు అనువదించిన ఈ పుస్తకం ఇప్పుడు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది. వెల నూట ఇరవైరూపాయలు!
..................
వ్యాసం రాసిపంపినవారు: సుజాత(మనసులో మాట) – నా స్వపరిచయం ప్రత్యేకంగా ఏమీ లేదు. జర్నలిజం చదువుకుని కొద్ది రోజుల పాటు పని చేసాను. రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబరావు,నామిని గారి రచనలంటే బాగా ఇష్టపడతాను. జీవితాన్ని నిజాయితీగా ఆవిష్కరించే ఏ రచనైనా నా అభిమాన రచనే! ఇంకా చదవని, వెదుకుతున్న పుస్తకం క్రిస్టఫర్ రీవ్(హాలీవుడ్ సూపర్ మాన్) రాసిన still me! ఏ పనైనా చేస్తూ సరే పుస్తకాలు చదవగలను. వంట చేసేటపుడు కూడా పుస్తకం చేతిలో ఉండాల్సిందే! రాయడం అంటే బద్ధకం, చదవడం అంటే ఎక్కడ లేని ఉత్సాహం!
- pustakam.net


......

...............

Sunday, December 20, 2009

సాంఘిక వికాసానికి తోడ్పడే నవల - ఆంధ్రజ్యోతి సమీక్ష ...



హిందీలో ప్రముఖ రచయిత ధర్మవీర్‌ భారతి రాసిన ''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' ను శ్యామ్‌ బెనగల్‌ సినిమాగా తీశారు.

హిందీ సాహిత్యరంగం, చిత్ర పరిశ్రమల్లో సంచలనం సృష్టంచిన ఈ నవలను ''సూర్యుడి ఏడో గుర్రం'' పేరిట వేమూరి ఆంజనేయ శర్మ అనువాదం చేయగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టువారు ప్రచురించారు.

ఇది చాలా చిన్న నవల.
1950ల నాటి సాంఘిక జీవనాన్ని అక్షరబద్ధం చేశాడు రచయిత.
రైల్వేలో చిన్న ఉద్యోగి అయిన మాణిక్‌ ముల్లా మూడు ప్రేమ కథల సమాహారం ఇది.

మాణిక్‌ ముల్లాకు పదేళ్ల వయసు నుంచి వివిధ వయసుల్లో జమున, లిల్లీ, సత్తి అనే స్త్రీలతో పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ ముగ్గురి స్త్రీలతో తనకున్న అనుబంధాన్నీ, వారి జీవితాలలో జరిగిన పెనుమార్పులనూ మాణిక్‌ ముల్లా మనకు కథలు కథలుగా చెబుతాడు.

ఈ కథల్లోని జీవితాలేవీ సుఖవంతమైనవి కావు. అయితే అతడు చెప్పే విషాదాంతం వెనక చమత్కారం వుంటుంది. ఆ చమత్కారం మాటున మళ్లీ అంతులేని విషాదం వుంటుంది. జమున తను కోరుకున్న వాడికి భార్య కావడం, సత్తి అర్థాంతరంగా చావడం వెనక దాగున్న దారిద్య్రం, మూఢనమ్మకాలను చెప్పీ చెప్పకనే వివరంగా చెప్తాడు రచయిత. అందుకే మాణిక్‌ ముల్లా ''ఏ ప్రేమ సాంఘిక వికాసానికి తోడ్పడదో అది నిరర్థకం'' అంటూ ప్రేమను నిర్వచిస్తాడు.

ఏడు కథల సమాహారంగా సాగిన ఈ నవలను సూర్యుడి ఏడు గుర్రాలతో పోల్చుతాడు. ఇప్పటికే నైతికంగా భ్రష్టమైన జీవితపు సందుల్లో నడవడం వలన సూర్యుని రథం శిధిలమై పోయిందని, ఆరు గుర్రాలు కాళ్లు విరిగిపోయి అస్థిపంజరాలుగా మారాయని అంటాడు. మిగిలిన ఒక్క గుర్రమే మన భవిష్యత్తును సూచించేది. మన పిల్లల జీవితాల్లో వెలుగూ, అమృతం నిండిపోవాలంటే మిగిలిన ''సూర్యుడి ఏడో గుర్రం'' పరుగులు తీయడానికి సరైన తోవను ఏర్పాటు చేయాలంటాడు.

ఈ నవల ద్వారా రచయిత ఆశించిన నైతికత, సామాజిక న్యాయం, విలువలు ఈ ఆరు దశాబ్దాలలో మరింతగా పతనమై పోయాయి. బహుశా ఆ ఏడో గుర్రం కూడా మిగిలిన గుర్రాల వరుసలో చేరిపోయిందేమో!
- సుంకోజి
( ఆదివారం ఆంధ్రజ్యోతి, 20 డిసెంబర్‌ 2009 సౌజన్యంతో )
..........................................


సూర్యుడి ఏడో గుర్రం (నవల)
ధర్మవీర్‌ భారతి
పేజీలు : 115
వెల : రూ.50


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85,
బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040-2352 1849

Wednesday, December 9, 2009

ప్రగతిశీల సమ్యక్‌ దృష్టే కథావరణం ,,,


సుప్రసిద్ద మళయాళ రచయిత, సాహితీ వైతాళికుడు వైక్కం మొహమ్మద్‌ బషీర్‌ కథలకి తెలుగు అనువాదం ఈ సంపుటి.
బషీర్‌కు దక్కిన గౌరవాదరాలు, పాఠకాభిమానం, ఆయన సాధించిన అనేక విజయాలు-లోక విదితం. సాహితీవేత్తగా బషీర్‌
లోచూపు, ముందుచూపు - రెండూ కూడా - ఆయన లక్ష్యశుద్ధిని తెలియజేస్తాయి. ముస్లిం సమాజంలోని ఛాందసత్వం
తెలివిలేమితనం వీటిపట్ల ఆయనకు గల సంవేదన ఆయన్ని ఆ సమాజంలోని వైకల్యాల్ని గురించి రాయటానికి
పురిగొల్పింది. ఆ సమాజ అభ్యుదయాన్ని కాంక్షించిన చిత్తశుద్ది కల రచయిత బషీర్‌.

ముస్లింలలో చైతన్యం తేవటమేకాక, అనేక అపోహల కారణంగా ముస్లిం సమాజంతో 'ఎలియనేట్‌' అయిపోయిన హిందువుల
మనోభావనల్లో సైతం మార్పు తేవటానికి ప్రయత్నించిన సాహితీకారుడు బషీర్‌. భిన్న వర్గాల మధ్య పరస్పర సహకారం,
సర్దుబాటు అవసరమనే ప్రగతిశీల భావ ప్రచారానికి కథానికని ఒక వాహికగా ఎన్నుకున్న రచయిత ఆయన.

ఈ సంపుటిలో 20 కథలున్నాయి. ఎక్కువ కథల్లో అంతర్లీనంగా అవాంఛనీయ సమాజిక స్థతిగతుల మీద సంధించిన వ్యంగ్యం ధ్వనిస్తూ వుంది. 'అదిగో పులి అంటే ఇదుగో తోక' తంతుగా సాగే 'విశ్వ విఖ్యాత ముక్కు' కథ చదివినా, 'ఒక ప్రేమ లేఖ', 'టైగర్‌' వంటి కథలు చూసినా ఈ వాస్తవం అర్థమవుతుంది. పరపీడన, దోపిడీ వర్గ సంఘర్షణ వంటి భావజాలం ....... వాస్తవికతలోకి దిగకుండా కళాత్మకతగా, బషీర్‌ కథాశిల్పగతం అయింది. అదే ఈ కథలకి వన్నె కూరుస్తున్న ప్రత్యేకాంశం.

'ఒక మనిషి' వంటి కథలోని మానవీయ కోణం చప్పున తెలుగులో బాలగంగాధర తిలక్‌ కథ 'దొంగ'ని స్ఫురింపజేస్తుంది.
చిన్నకథ. హోటల్లో కడుపు నిండా తిన్నాడు. పర్సు పోయింది. దారుణంగా అవమానించారు. చివరికి దాన్ని
కొట్టేసినవాడిలోనే మానవత్వం మేల్కొంది. బిల్లు కట్టటమే కాక, అతని పర్స్‌ అతనికిచ్చేశాడు. 'వెళ్లు. దేవుడు
చల్లగాచూడాలి' అన్నాడతను. 'నిన్ను దేవుడు చల్లగా చూడాలి' అన్నాను నేను!అంటూ కథ ముగుస్తుంది. అద్భుతమైన,
కరుణార్ద్రమైన కథానిక. నిష్కపటంగా, నిర్మలంగా హిందూ-ముస్లింల మతసామరస్యానికి దిశానిర్దేశం కూర్చే కథల్ని
అందించిన బషీర్‌ని చదవటం, ఈ సంక్షోభ వర్తమానంలో ఒక అనివార్య అవశ్యకత!

- విహారి
వార్త , ఆదివారం 8 నవంబరు 2009

Thursday, December 3, 2009

వనవాసి, సూర్యుడి ఏడోగుర్రం నవలా రచయితలు


ప్రముఖ బెంగాలీ నవల ''అరణ్యక''ను 'వనవాస'ి పేరుతో,
ప్రముఖ హిందీ నవలిక ''సూరజ్‌ కా సాత్వా ఘోడా''ను 'సూర్యుడి ఏడో గుర్రం' పేరుతో ఈ మధ్యే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పునర్ముద్రించిన విషయం విదితమే.

ఆ నవలా రచయితల గురించి క్లుప్తంగా ...



బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ:
1894లో కలకత్తాకు ఉత్తరంగా వందమైళ్ల దూరంలో వున్న మరాఠీపూర్‌ గ్రామంలో పుట్టిన బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ బాల్యమంతా బీదరికంతోనే గడిచిపోయింది.
చదువు స్థానిక పాఠశాలలో సాగింది.
1918లో కలకత్తాలోని రిప్పన్‌ కాలేజీ నుండి డిగ్రీపొందారు.
మధ్య మధ్యలో రకరకాల వృత్తులు చేసినా ఎక్కువ భాగం మాత్రం ఉపాధ్యాయుడిగానే కొనసాగిన ఆయన తొలి కథ 1922లో కలకత్తా జర్నల్‌లో ప్రచురితమైంది.
అప్పటి నుంచీ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ 17 నవలలు, 20 కథా సంకలనాలతో సహా 50 వరకూ పుస్తకాలు ప్రచురించారు. ఆయన విఖ్యాత రచన, ఆయనకు గొప్ప కీర్తిని ఆర్జించి పెట్టిన రచన ''పథేర్‌ పాంచాలీ''. దీనికి కొనసాగింపుగా రాసింది ''అపరాజిత''. వీటిని ప్రముఖ దర్శకులు సత్యజిత్‌ రే చలనచిత్రాలుగా మలచి ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు.
దట్టమైన ప్రకృతితో మమేకమై అంతరించిపోతున్న అరణ్యాల గురించి మనసులకు సునిశితంగా హత్తుకునేలా రాసిన అరణ్యక (వనవాసి) బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ విశిష్ట రచనగా విణుతి కెక్కింది.
ఆయన 1950లో మరణించారు.

ధర్మవీర్‌ భారతి:
హిందీ సాహితీరంగంపై బలమైన ముద్రవేసిన విశిష్ట రచయిత ధర్మవీర్‌ భారతి.
1926 లో అ లహాబాద్‌లో జన్మించారు.
కవిగా, నాటక రచయితగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా హిందీ సాహిత్యంలో ఆధునిక పోకడలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనది.
ఆయన రచించిన ''గునహోంకా దేవతా'' భారతీయ సాహిత్యంలో ఎన్నటికీ నిలిచిపోయే క్లాసిక్‌. మహాభారత యుద్ధం పరిసమాప్తమైన ఆఖరి రోజు పరిణామాలను సమకాలీన దృక్పథం నుంచి విశ్లేషిస్తూ రాసిన నాటకం ''అంధయుగ్‌'' భిన్న తరాలకు చెందిన ప్రయోక్తల సారథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికి కొన్ని వేలసార్లు ప్రదర్శితమైంది.

శైలీపరంగా ఓ అసాధారణ ప్రయోగం ''సూరజ్‌కా సాత్వా ఘోడా'' (సూర్యుడి ఏడో గుర్రం).

అ లహాబాద్‌ విశ్వవిద్యాలయం నుంచి హిందీ సాహిత్యంలో ఎంఎ. పట్టా తీసుకున్న ధర్మవీర్‌ భారతి 1950లలో విస్తృతంగా రాశారు.
హిందీ అధ్యాపకుడిగా పనిచేశారు.
1960 నుంచీ 1987 వరకూ ప్రముఖ హిందీ వార పత్రిక ''ధర్మయుగ్‌'' కు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు.
పద్మశ్రీతో సహా పలు అవార్డులు అందుకున్నారు. ఆయన 1997లో గుండెపోటుతో మరణించారు.

సూరజ్‌ కా సాత్వా ఘోడా నవలను 1992 లో ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్‌ అదే పేరుతో హిందీలో చలన చిత్రంగా తీశారు. ఆ చిత్రానికి వివేష ప్రజాదరణతో పాటు జాతీయ అవార్డు లభించింది.

Soorampoodi SitaRam





హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌