Monday, December 1, 2008

ఒక మంచి పుస్తకం ... డాక్టర్ కేశవరెడ్డి నవల మునెమ్మ





డాక్టర్ కేశవ రెడ్డి గారు చాలాకాలం తర్వాత 'మునెమ్మ ' నవల రాశారు. ఈ నవల 2007 అక్టోబర్ నెల చతురగా వచ్చింది. కేశవరెడ్డి గారు అద్భుతమైన రచనలు చేసారు. సిటీ బ్యూటిఫుల్, అతడు అడవిని జయించాడు,రాముడుండాడు.రాజ్జివుండాది, మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ మునెమ్మ.(ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు ) రాసి కంటే, వాసి ముఖ్యమని ఇలాంటి వాళ్ళ రచనల గురించే అంటారు కాబోలు.

రాయలసీమ మాండలికాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసింది స్వర్గీయ పులికంటి క్రిష్ణారెడ్డి గారైతే, దాన్ని తెలుగు సాహితీ ప్రియుల ఇళ్ళలోకి సరఫరా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది నామిని, కేశవ రెడ్డి గార్లు.

ఇక మునెమ్మ నవల విషయానికొస్తే, కథాకాలం మొదటి ప్రపంచ యుద్ధం నాటిది. కథని ఒక పదేళ్ళ కుర్రా డు (మునెమ్మకు మరిది వరస) చెపుతూ ఉంటాడు. భర్త చావుకి కారణమైన కొంతమంది వ్యక్తుల ఆచూకీ కనుక్కుని, వారిని అంతమొందించడానికి బయలు దేరిన ఒక భార్య కధ. వినగానే, ఇదేదో ఫాక్షన్ సినిమాలా ఉంది గానీ...కాదు!

మునెమ్మ ఒక పాతికేళ్ళ పడుచు. రైతు భార్య. ఆమె భర్త జయరామిరెడ్డి తన బండికి కట్టే బొల్లి గిత్తను రక్తం కారేలా కొట్టడంతో కథ ప్రారంభమవుతుంది. అతడలా కొట్టడానికి కారణం ఏమిటంటే, గడ్డి కోస్తున్న మునెమ్మ వీపుమీద బొల్లి గిత్త రెండు కాళ్ళతో గీరడంతో, ఆమె రవిక చిరిగి పోతుంది. దానితో జయరాముడు అగ్గిరాముడై పోతాడు.

తల్లి, మునెమ్మ, ఎంత చెప్పినా వినక జయరాముడు దాన్ని మద్దిపాలెం పశువుల సంతలో తెగనమ్మి పారేసేందుకు మర్నాడే బయలు దేరతాడు. దారిలో పోటు మిట్ట గ్రామంలో, 'తరుగులోడు 'గా పేరుపడ్డ పశువుల దళారీతో కలిసి మద్దిపాలెం వెళ్ళాలని జయరాముడు నిర్ణయిస్తాడు. అప్పట్లో బస్సులూ, అవీ అరుదు గనక, కాలి నడకన బయలు దేరతాడు.

రెండు రోజులయ్యక, జయరాముడు లేకుండా, బొల్లి గిత్త ఒక్కటే రొప్పుకుంటూ ఇల్లు చేరుతుంది. దానితో, మునెమ్మ, ఆమె అత్త నిర్ఘాంతపోతారు. ఒక రోజంతా చూసినా జయరాముడు తిరిగి రాడు. పైగా ఆ రాత్రి మునెమ్మకి ఒక పీడ కల వస్తుంది. ఆ కలలో మునెమ్మ గిలక బావి నుండి నీళ్ళు తోడుతుండగా, బకెట్ కి బదులుగా జయరాముడి శవం పైకొస్తుంది. అతడి మెడకి బొల్లిగిత్త మెడలో ఉండాల్సిన వెంట్రుకల తాడు బిగించి ఉంటుంది.(ఆ తాడు మునెమ్మ వెంట్రుకలతో పేనిందే) దానితో జయరాముడు ఇక లేడని మునెమ్మ నిర్థారణకొస్తుంది. బారెడు పొద్దెక్కేదాక ఏకధాటిగా ఏడుస్తుంది. తర్వాత లేచి కర్తవ్య నిర్వహణకు సన్నాహమవుతుంది. జయరాముడి ఆచూకీ కోసం వూళ్ళోని మగవాళ్ళు ఎవరు వెళతామన్నా, ఒప్పుకోదు. 'కనబడకుండా పోయింది నా వాడేగదా, నేనే వెదకాల ' అని మరిదితో ( ఈ కథ చెప్పే కుర్రాడు) కలిసి బయలు దేరుతుంది.

బొల్లి గిత్త కొమ్ములకున్న మద్దిపాలెం సంత చీటీ ఆధారంగా వారి అన్వేషణ ప్రారంభమవుతుంది.
మొదట వాళ్ళు తరుగులోడిని కలుస్తారు. వాడు ఎటూ చిక్కకుండా సమాధానాలు చెపుతాడు. పైగా ' ఏవమ్మా, జయరాముడు పైకంతో మంచి గొడ్డుని పట్టుకున్నాడా...జల్సా చేస్తా వున్నాడా ' అని అడుగుతాడు కూడా! జయరాముడు బొల్లిగిత్తను సంత దాకా తీసుకెళ్లకుండానే, దార్లోనే అమ్ముడైపోయిందని చెప్తాడు. సంత చీటీ తమ దగ్గరున్న సంగతి చెప్పకుండా , వాడిచ్చిన సమాచారం ఆధారంగా ముందుకు సాగుతారు. ఒక పూట కూళ్ళ ఇంట్లో వారికి మరింత విలువైన సమాచారం లభిస్తుంది.

సంతలో మరికొంత మంది చెప్పిన విషయాల ఆధారంగా పశువైద్యుడి ఇంటికి వెళతారు. కాని అప్పటికే అతడు మరణ శయ్య మీద ఉంటాడు. వైద్యం చేస్తుంటే ఆవు కుమ్మిందని ఇంట్లో వాళ్ళు చెపుతారు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో అన్నట్లున్న అతడు, మునెమ్మ చేతిమీద బొల్లి గిత్త పచ్చ బొట్టు చూడగానే, వెర్రికేక పెట్టి ప్రాణం వదిలేస్తాడు.

జయరాముడి హత్యలో తరుగులోడికి, పశువద్యుడుకి భాగం ఉందని గ్రహిస్తుంది మునెమ్మ! అప్పుడు వెళుతుంది పోలీస్ స్టషన్ కి...ఏదైనా అనాధ శవం దొరికిందా అని తెల్సుకోవడానికి. ఒక రోజు ముందే జయరాముడి శవ దహనం జరిగిందని తెల్సుకుంటుంది.ఒక వెంట్రుకల తాడుతో జయరాముడి గొంతు బిగించి చంపారని తెలిసి వణికి పోతుంది. ఆ తాడుని జయరాముడే స్వయంగా మునెమ్మ తల దువ్వుకునేటపుడు రాలిన వెంట్రుకలతో పేనాడు.

మునెమ్మ బొల్లి గిత్తను తోలుకు రమ్మని మరిదిని పంపుతుంది. బొల్లిగిత్తతో పాటు తరుగులోడి ఇంటికి వెళుతుంది. తరుగులోడిని నిలదీసి, వాడు తనకేమీ తెలీయదని బుకాయిస్తుండగా , బొల్లి గిత్తను వదులుతుంది. అది ఉగ్రరూపం దాల్చి తరుగులోడి పేగులు తీసి కొమ్ములకు చుట్టుకోవడంతో కథ ముగుస్తుంది.

ఇక్కడ మీకు ఆసక్తికరంగా అనిపించిందో లేదో కాని, చదవడం మొదలెట్టాక ఆపకుండా చదివించే నవల ఇది. కేశవ రెడ్డి గారి శైలి అదే! అద్భుతమైన కథనం ఊపిరి తిప్పుకోనివ్వదు.

మునెమ్మ మనోభావాల చిత్రణ చదువుతుంటే, అతడు అడవిని జయించాడు లోని ముసలివాడి పాత్ర గుర్తొసుంది.ఆమె కర్తవ్య నిర్వహణ, అలుపెరుగని ప్రయాణం, పంది పిల్లల్ని కాపాడె ప్రయత్నంలో ముసలివాడు పడే తాపత్రయాన్ని గుర్తు చేస్తుంది.

'వదినా, జయరామన్న అంత్యక్రియలు ఎక్కడ చెయ్యా ల? " అని మరిది అడిగితే ' ఇప్పుడు నేనేం జేస్తున్నాను? ఆయన అంత్యక్రియలేగా! జయరాముడిని పడగొట్టిన వాళ్ళ నోట్లో రూకలు పడాల! ఆయన అంత్యక్రియలు పూర్తైనట్టే " అని మునెమ్మ చెప్పే మాటలు గగుర్పాటు కలిగిస్తాయి.
లైబ్రరీలో తప్పక ఉండవలసిన పుస్తకం ఇది.

(మనసులో మాట సుజాత గారి సౌజన్యంతో )
http://manishi-manasulomaata.blogspot.com/2008/04/blog-post_13.html

డా.కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టారు. తిరుపతిలో పియుసి, పాండిచ్చేరిలో ఎంబిబిఎస్‌ చేశాక నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి విక్టోరియా మెమోరియల్‌ ఆసుపత్రిలో స్కిన్‌ స్పెషలిస్టుగా కుష్టు రోగులకు సేవలందించారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో వుంటూ ఆర్మూరులో వైద్య సేవలు అందిస్తున్నారు. కుష్టువ్యాధిపై ఆయన రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.

వీరి ఇతర రచనలు:

బానిసలు
భగవానువాచ
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌
స్మశానం దున్నేరు
అతడు అడవిని జయించాడు
రాముడుండాడు రాజ్జిముండాది
మూగవాని పిల్లనగ్రోవి
చివరి గుడిసె
సిటీ బ్యూటిఫుల్‌
నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌వారు అతడు అడవిని జయించాడు నవలను 14 భారతీయ భాషల్లోకి అనువదించారు.
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ నవల మరాఠీలోకి అనువాదమైంది.
తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి, హృదయాలను తేలికపరచటం, అనివార్యమైన జీవిత పోరాటానికి ఉపక్రమింపజేయటమే తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం. కొడుకూ కూతురూ సంతానం.

మునెమ్మ ... నవల
రచన: డా. కేశవరెడ్డి

తొలి పలుకు: జయప్రభ
మలి పలుకు: అంబటి సురేంద్రరాజు

ముఖచిత్రం: కాళ్ళ

111 పేజీలు, వెల రూ.40

......................

విలక్షణ నవల మునెమ్మ … రచన డా. కేశవరెడ్డి






మునెమ్మ నవలపై ఈనాడులో వెలువడిన పుస్తక సమీక్ష



విలక్షణ నవల

ఏదో ఒక ప్రత్యేకత గల రచనలు చెయడంలో పేరుపొందిన కేశవరెడ్డి గారి నవల మునెమ్మ.
స్త్రీ పురుష సంబంధాలపై మాజిక్ రియలిజం పద్ధతి లో రాసారు దీన్ని.


కధన పద్దతి లో ఆసక్తిగా చదివించె శైలి ఉంది.

రాయలసీమ మాండలికం (కొంచం కష్టపడితే) ఆహ్లాదం కలిగిస్తుంది.
కొందరి లో ఉండె మౄగత్వ లక్షణాలను కూడా వెల్లడి చెస్తుంది.

కథా నాయకుడు జయరాముడి హత్య దానికి ప్రతిగా మునెమ్మ చేసిన హత్య -
అప్పటి మానసిక ప్రవ్రుత్తులూ విశిష్ఠ భావనలూ పాఠకుడిని చకితుణ్ణి చెస్తాయి.

జయప్రభ, అంబటి రాసిన వ్యాసాలు రచయిత హౄదయాన్ని తెలియ జేస్తాయి.

కధాంశంతో గాని, రచయిత ఆలోచనా విధానంతో గాని ఏకీభవించకపొవడమూ కద్దు.

అంటె చర్చకి అవకాశం ఉన్న నవల.


మునెమ్మ నవల
రచన డా. కేశవరెడ్డి
పేజీలు 111, వెల : రూ.40


ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ఫ్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్,
హైదరాబాద్ -67

(ఈనాడు ఆదివారం 30-11-2008 సౌజన్యంతో)

............................

Sunday, November 30, 2008

ఏది హీనం? బానిసత్వమా ... లేక ... అంటరానితనమా ?? -డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ... తెలుగు అనువాదం పృథ్వీరాజ్‌





అంబేడ్కర్‌ ఆలోచన


అన్ని జాతుల్లో కెల్లా తామే అధికులమని నిరూపించుకోవటానికి హిందువులు చాలా కారణాలు చెప్తుంటారు.
భారతదేశంలో హిందువుల మధ్య బానిసత్వం లేదు,
అంటరానితనం బానిసత్వమంత ప్రమాదకరమైంది కాదు
అన్నవి వాళ్లు చెప్పే రెండు ముఖ్యమైన కారణాలు.

మొదటి వాఖ్యానం అసత్యం.
బానిసత్వం అనేది హిందువుల్లో అనాదిగా కొనసాగింది.
హిందూ ధర్మశాస్త్ర నిర్మాత మనువు బానిసత్వానికి గుర్తింపు నిచ్చాడు.
మనవు తరువాతి స్మృతికారులు బానిసత్వాన్ని విస్తరించి వ్యవస్థీకరించారు.

హిందువుల్లో బానిస వ్యవస్థ ఎప్పుడో పురాతన కాలంలో మాత్రమే ఉండి అంతరించిపోయిన వ్యవస్థ కానేకాదు.
భారత దేశ చరిత్ర ఆదినుంచీ మొన్న మొన్నటివరకూ బానిస వ్యవస్థ కొనసాగింది.
1843లో బ్రిటీషు ప్రభుత్వం కనుక చట్టం ద్వారా బానిసత్వాన్ని నిర్మూలించక పోయి వునట్టయితే అది ఇప్పటికీ కొనసాగుతూనే వుండేది.

బానిసత్వం కొనసాగినప్పుడు అది అటు అంటగలిగినవారికీ ఇటు అంటరానివారికీ ఇద్దరికీ వర్తించింది.
అయితే అంటగలిగిన వారికన్నా అంటరానివారే ఎక్కువగా బానిస వ్యవస్థకు బలయ్యారు.
అందుకు ప్రధాన కారణం వారి పేదరికమే.

1843వరకూ భారతదేశంలో అంటరానివారు
బానిసత్వం, అంటరానితనం
అనే రెండు రకాల దాస్య శృంఖలాలలో బందీలయ్యారు.

... ... ...

అంటరానితనం - బానిసత్వంల మధ్య మరో భేదం ఏమిటంటే బానిసత్వం ఎన్నడూ తప్పనిసరైనది కాదు.
కానీ అంటరానితనం తప్పనిసరిగా వుంటుంది.
ఒక వ్యక్తి మరొకరిని బానిసగా ఉంచుకోవటానికి '' అనుమతి '' వుంటుంది.
కానీ, అతడు అట్లా చేయదలచుకోకపోతే అతడిపై ఎట్లాంటి బలవంతం వుండదు.
మరోవైపు ఒక హిందువు మరొకరిని (ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాడిని) అంటరానివాడిగా పరిగణించి దూరంగా వుంచాలన్న నిర్దేశం (కుల/మతపర కట్టుబాటు) వుంటుంది.
అతడి వ్యక్తిగత భావాలు ఏవైనా సరే ఆ నిర్బంధం నుంచి అతడు తప్పించుకోలేడు.

... ...

అంటరానితనమనేది బానిసత్వమంత హీనమైనది కాదా?
బానిసత్వం కన్నా అంటరానితనం తక్కువ హానికరమైనదా?
అంటరానితనం కన్నా బానిసత్వం తక్కువ అమానవీయమైనదా?
అంటరానితనం కన్నా బానిసత్వమే ఎక్కువగా అభివృద్ధిని ఆటంకపరిచిందా?

?????


ఏది హీనం? బానిసత్వమా ... లేక ... అంటరానితనమా ??
-డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌

ఆంగ్ల మూలం: Slaves and Untouchables, Chapter 3, Vol V, Dr.B.R.Ambedkar's Writings and Speeches, Education Department, Govt of Maharashtra, 1989.

తెలుగు అనువాదం : పృథ్వీరాజ్‌

17 పేజీలు, వెల: రూ.8
..................

Saturday, November 29, 2008

హిందూ నాగరికత - అంటరానివాళ్లు ... హిందువుల ఇళ్లు ...డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ... తెలుగు అనువాదం: సుందర వర్ధన్‌, జిలుకర శ్రీనివాస్‌.





అంబేడ్కర్‌ ఆలోచన


మనిషికి, ప్రకృతి జ్ఞానానికి హిందూ నాగరికత అందించేదేమిటి?

ప్రపంచంలో హిందూ లేదా వేద నాగరికత ప్రాచీనమైనదని ప్రతి దేశభక్త హిందువూ ప్రగల్భాలు పలుకుతాడు.

మిగతా ప్రదేశాల్లో మనుషులు నగ్నంగా సంచరిస్తూ ఆదిమ జీవనం సాగిస్తున్నప్పుడే భారతదేశంలో నాగరికత అత్యున్నత దశలో వుండేదని దురహంకారంతో గర్విస్తుంటాడు.

ఈజిప్టు, బాబిలోనియా, జూడియా, రోమ్‌, గ్రీసు నాగరికతలు నాశనమవుతున్నప్పుడు హిందూ నాగరికత సజీవంగా వుందని అందుకు వారసత్వ శక్తి కారణమని హిందువులు చెప్పుకోవటం కూడా వినవచ్చు.

అయితే అట్లాంటి దృష్టి ఒక కీలకమైన అంశాన్ని జారవిడుస్తుంది.
నాగరికత ప్రాచీనమైనదా, మనగలిగిందా అన్నది మౌలిక అంశం కాదు.
ఒక వేళ అది మనగలిగితే దేనిమీద?
దాని విలువలేమిటి?
ఈ హిందూ నాగరికత సామాజిక వారసత్వం ప్రయోజనకరమైనదేనా?
లేక మన సామాజానికి అది ఒక గుదిబండా?
వివిధ తరగతులకు, వ్యక్తులకు విస్తరించడం ద్వారా, ఎదగడం ద్వారా అది మనకేం అందివ్వనుంది?
.... .... ....

ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1. హిందువులది నాగరికతేనా?
2. హిందూ నాగరికత
3. కులం - బ్రాహ్మణుల సమర్థన
4. హిందూ ధర్మం

.....

హిందూ నాగరికత - అంటరానివాళ్లు ... హిందువుల ఇళ్లు
- డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

ఆంగ్ల మూలం: Dr.Baba Saheb Ambedkar's Writings and Speeches, Vol. V, Ps.127-191, 272-286, Govt. of Maharashtra, Mumbai, 1989

తెలుగు అనువాదం: సుందర వర్ధన్‌, జిలుకర శ్రీనివాస్‌.

76 పేజీలు, వెల: రూ.25
..................

Friday, November 28, 2008

'ఆధునిక' భారతంలో అంటరానితనం ... డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ... తెలుగు అనువాదం: కాత్యాయని





భారతదేశంలోని గ్రామీణ వ్యవస్ణను ఆదర్శవంతమైన సామాజిక నిర్మాణానికి ఒక నమూనాగా భావించేవాళ్లు ఎందరో వున్నారు.
ఐతే, ఈ ఆదర్శీకరణ కేవలం హిందువుల అభూతకల్పనే తప్ప, ఎంతమాత్రమూ వాస్తవం కాదని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఈ రచనలో ప్రతిపాదించారు.
తన వాదనకు రుజువులుగా ఇందులో ఆయన లెక్కలేనన్ని సాక్ష్యాలను మనముందుంచారు.

ప్రాచీన హిందూమత గ్రంథాలూ, ధర్మ శాస్త్రాలూ నిర్దేశించిన వర్య వ్యవస్థ ఆధునిక భారతదేశంలోని గ్రామాల్లో నేటికీ యధాతథంగా కొనసాగుతూనే వుంది.

ఈ దేశంలోని ప్రతివ్యక్తికీ పుట్టుకతోనే ఏదో ఒక కులం నిర్ణయమైపోయి వుంటుంది.

కులాల స్థాయినిబట్టి వ్యక్తుల ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక జీవితం నిర్దేశితమవుతుంది.

ఈ కులాల సరిహద్దులను దాటటానికి ప్రయత్నించినప్పుడల్లా దారుణమైన హింసాకాండ అమలవుతున్నది - ఈ సత్యాలన్నీ సోదాహరణంగా ఈ రచనలో మన కళ్లకు కడతాయి.

భారతదేశంలోని పల్లెసీమలు అగ్రవర్ణాలకు స్వర్గధామాలు కావొచ్చునేమో గానీ దళితులకు మాత్రం అవి నరకకూపాలని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఈ రచనలో స్పష్టంగా ప్రకటించారు.

.........

అంబేడ్కర్‌ ఆలోచన

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రచనలు, ప్రసంగాలు, నివేదికలు భారత సమాజ గతిలోనే కొత్త శకానికి నాందిపలికాయి. కులాల దొంతరలో అట్టడుగున పడిపోయి, తరతరాలుగా అవమానాలకు, అన్యాయాలకు, అకృత్యాలకు, అమానుషాలకు బలైపోయిన అంటరాని కులాల విముక్తి ప్రదాతగా అంబేడ్కర్‌ అందరికీ తెలుసు.

అయితే ఆయన భావాలు, ఆలోచనల లోతులు చాలా తక్కువ మందికి తెలుసు. సమకాలీన సమాజ ఆర్థిక, రాజకీయ, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన అశంబిలన్నింటినీ ఆయన తడిమారు. కేవలం పైపైన మాత్రమే తాకి వదలలేదు. సమగ్రమైన పరిశోధన స్వభావం ఆయన సొంతం.

...

అంబేడ్కర్‌ రచనలను ఎన్నో రకాల విషయాల కింద విభజించవచ్చు. ఆవిధంగా చిన్న చిన్న పుస్తకాలుగా తీసుకురాగలిగితే పాఠకులకు వాటి అధ్యయనం పట్ల ఆసక్తి పెరుగుతుందని, విద్యావంతులకు, సామాజిక కార్యకర్తలకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందని భావిస్తున్నాం.

ఇటువంటి ప్రయత్యాలు గతంలో కూడా కొన్ని జరిగాయి. మరికొన్ని సంస్తలు, సొసైటీలు, ట్రస్ట్‌లు ఇప్పటికే అప్పుడప్పుడు ఇటువంటి పుస్తకాలు ప్రచురిస్తున్నాయి.

అయితే నిరంతరంగా, ఒక కార్యక్రమంగా ఈ ప్రయత్నాలు తెలుగు పాఠకుల ముందుకు తేవాలని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ సంస్థలు సంయుక్తంగా '' అంబేడ్కర్‌ ఆలోచన'' సిరీస్‌ పేరుతో ఈ పుస్తకాల ప్రచురణ కొనసాగించాలని భావిస్తున్నాయి.

ఇందులో అంబేడ్కర్‌ స్వయంగా చేసిన రచనలతో పాటు, అంబేడ్కర్‌ ఆలోచనను ప్రతిబింబించే గత, వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టే ఇతరుల రచనలను కూడా భాగం చేయాలని ఆశిస్తున్నాం.
ఈ ప్రయత్నంలో తెలుగు పాఠకుల, సామాజిక ఉద్యమ కార్యకర్తల దళితేతర విద్యావంతుల, ప్రజాస్వామికవాదుల సహాకారాన్ని ఆశిస్తున్నాం.
మా ఈ కార్యకర్మంలో సూచనలు, సలహాలు, ఇతర రకాలైన సహాయాలు అందించి భాగస్వాములు కావాలని హృదయపూర్వకంగా కోరుతున్నాం.

- హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (ఫోన్‌:+040-2352 1849)

- సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ (ఫోన్‌:+040-2344 9192)



'ఆధునిక' భారతంలో అంటరానితనం
- డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

ఆంగ్ల మూలం: Untouchables or The Children of India's Ghetto, Vol.5,Pg.19-73, Dr. Babasaheb Ambedkar, Writings and Speeches, Govt. of Maharashtra, Bombay, 1989.

తెలుగు అనువాదం: కాత్యాయని

72 పేజీలు, వెల: రూ.25

.....

Wednesday, November 26, 2008

దాస్య విముక్తి కోసం మతమార్పిడి ... డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌... తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార




అంబేడ్కర్‌ ఆలోచన


''నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చచ్చిపోను''
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1935లో చేసిన ప్రకటన యిది.

అన్నట్టుగానే ఆయన 1956లో హిందూమతాన్ని విసర్జించి ఐదు లక్షల మంది అనుచరులతో కలసి మరీ బౌద్ధమతంలో చేరారు.

ఆ మధ్య కాలంలో ఆయన దళితుల దాస్య విముక్తి గురించీ, మతమార్పిడి ఆవశ్యకత గురించీ వివిధ సభల్లో చేసిన ఉపన్యాసాల సంకలనమే ఈ పుస్తకం.

చతుర్‌ వర్ణ వ్యవస్థ పునాదులు ఏమాత్రం చెక్కు చెదరకుండా అంటరానివాళ్లకు ... ''హరి జనులు'' ... అనే ఓ కొత్త పేరును అంటగట్టి దళిత సమస్యకు పైపై పరిష్కారం చూపబోయారు గాంధీజీ.

అయితే ఆ పేరు మార్పు వల్ల దళితులకు ఒరిగేదేమీ లేదనీ, తమను అంటరానివాళ్లుగా, అధములుగా పరిగణించే హిందూమతాన్ని వదిలించుకుని బయటకు వచ్చినప్పుడే దళితులకు నిజమైన విముక్తి లభిస్తుంది అంటారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌.

స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు హిందూ మతంలో స్థానం లేదు.
మిమ్మల్ని సాటి మనుషులుగా చూడని మతంలో,
మీకు చదువుకునే స్వేచ్ఛ లేకుండా చేసిన మతంలో,
చివరికి సమాజంలో గుక్కెడు మంచినీళ్లు కూడా పుట్టుకుండా చేసిన మతంలో,
మిమ్మల్ని జంతులవుకంటే హీనంగా చూసే ఈ హిందూ మతంలో
ఇంకా మీరెందుకు పడివుండాలి???
అని ప్రశ్నిస్తారు అంబేడ్కర్‌.

ఇవాళ ప్రపంచ శాంతికి దోహదం చేయగల మతం ఏదైనా వుందీ అంటే
అది బౌద్ధ మతం మాత్రమే అంటారాయన.

డాక్టర్‌ అంబేడ్కర్‌ మరాఠీలో చేసిన ఈ ప్రసంగాలను వసంతమూన్‌ తన సహచరులతో కలిసి అంగ్లంలోకి అనువదించారు. ఇవి అంబేడ్కర్‌ రచనల మూడో సంపుటంలో 17వ వాల్యూంలో పొందుపరచబడ్డాయి. వాటి వివరాలు:

1.మీరు విముక్తిపొందాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మతం మార్చుకోక తప్పదు.
(17 మే 1936 నాడు కళ్యాణ్‌లో చేసిన ప్రసంగం)

2. మన దాస్య విముక్తికి మార్గమేది?
(13 మే 1936 నాడు దాదర్‌లో చేసిన ప్రసంగం)

3. బానిస బంధాల నుంచి బయట పడేందుకే బౌద్ధమత స్వీకారం
(15 అక్టోబర్‌ 1956 నాడు నాగపూర్‌లో చేసిన ప్రసంగం)

4. అనుబంధం: బుద్ధ ధమ్మమే ప్రపంచాన్ని రక్షిస్తుంది (డాక్టర్‌ అంబేడ్కర్‌ బౌద్ధ మత స్వీకార విశేషాలు)



దాస్య విముక్తి కోసం మతమార్పిడి
- డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌

ఆంగ్ల మూలం : Coversion as Emancipation, Critical Quest, New Delhi 2004; Dr.B.R.Ambedkar's Speeches in Marathi, reported in JANATA and Translated by Vasant moon and colleagues, Dr.B.R.Ambedkar Writings and Speeches, Vol 17 Part 3 Govt. of Maharashtra, 2003 @ Sr. Bos 28,29 and 158.

తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార

60 పేజీలు, వెల: రూ.15

...........................
...

Tuesday, November 25, 2008

కుల నిర్మూలన ... డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ... తెలుగు అనువాదం: బోయి భీమన్న





హిందూ సమాజం నుంచి కుల వ్యవస్థను నిర్మూలించడానకి తనకు చివరగా మరొక అవకాశం ఇవ్వవలసిందని గాంధీ ప్రాధేయపడడటమే గాక, కొద్ది సంవత్సరాలలోనే కుల వ్యవస్థను, అస్పృశ్యతను అంతం చెయ్యడానికి తాను ఇతర హిందూ నాయకులతో కలిసి తీవ్రంగా ప్రయత్నించగలనని ''పూనా ఒడంబడిక'' సందర్భంగా డాక్టర్‌ అంబేడ్కర్‌కు హామీ యిచ్చారు.
అది 1932 సెప్టెంబర్‌లో జరిగింది.
ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు 1936లో డాక్టర్‌ అంబేడ్కర్‌ ఈ కుల నిర్మూలన వ్యాసాన్ని గ్రంథ రూపంలో వెలువరించారు.
అంటే ఏమిటి?
హిందూ సమాజాన్ని మార్చడానికి ఆ నాలుగు సంవత్సరాలలో ఎట్టి ప్రయత్నమూ జరగలేదన్నమాటే కదా!

అతి ప్రధానమైన ఒక ఒడంబడిక సందర్భంగా చేయబడిన వాగ్దానాలను కూడా హిందూ అగ్రకుల నాయకులు పట్టించుకోకపోతే ఇక అట్టి మతంలో వుండి ఏం ప్రయోజనం?
అందుకే తన ఈ వ్యాసంలో అంబేడ్కర్‌ మతం మార్చే ప్రస్తావనను తేవడం తప్పనిసరి అయింది.
''అత్త పెట్టదు అడుక్కు తిననివ్వదు'' అన్న సామెతలాగా
హిందూ నాయకులు కులాన్ని వదలరు.
అంటరానితనాన్ని నిర్మూలించరు.
దళితుల్ని మతం మారనివ్వరు.
ఇంత అన్యాయం మరెక్కడైనా వుంటుందా?

పోనీ నాలుగు సంవత్సరాలలో మార్పు సాధ్యం కాదని అనవచ్చు. మరి పూనా ఒప్పందం జరిగి ఇప్పటికి 76 సంవత్సరాలైంది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 61 సంవత్సరాలు దాటింది.
అయినా ఏమంత మార్పు జరిగింది?
అందరూ ముఖ్యంగా హిందూ అగ్ర నాయకులు తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది.
హిందూ సమాజానికి ఆధిపత్యం వహిస్తున్న బ్రాహ్మణులు తమ వర్గ ప్రయోజనాల కొసమే తప్ప మొత్తం ప్రజల యోగక్షేమాలను గురించి ఆలోచించలేడంలేదు అన్నారు అంబేడ్కర్‌.
ఆ దురదృష్టం ఇంకా కొనసాగుతూనే వుంది.

- బోయి భీమన్న (ఐదవ ముద్రణకు రాసిన ముందుమాట నుంచి)

కుల నిర్మూలన
- డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

తెలుగు అనువాదం: బోయి భీమన్న

మొదటి ముద్రణ: 1969
మలిముద్రణలు: 1969, 1981, 1990, 1992, 1994, 1998, 2001, 2006

103 పేజీలు, వెల: రూ.30
....

Sunday, November 23, 2008

దళితులు - రాజ్యం ... బొజ్జా తారకం







ఒకే చోట నివసిస్తూ,
ఒకే భాష మాట్లాడుతూ,
ఒకే దేవుణ్ణి పూజిస్తూ,
ఒకే జీవన విధానాన్ని పాటిస్తూ వున్న ప్రజలలో...
కొందరిని ముట్టుకోవడానికి కూడా వీలులేని మనుషుల్ని చేసిన దేశం భారతదేశం తప్ప మరొకటి ఎక్కడా కనపడదు.
కలిసి కూర్చుని మాట్లాడుకోకుండా,
కలిసి ప్రయాణం చేయటానికి వీలు లేకుండా,
కలిసి మంచినీళ్లు త్రాగడానికి గానీ
కలిసి భోజనం చేయడానికి గానీ వీలులేకుండా
పెళ్లి చేసుకుని జీవనాన్ని సాగించటానికి వీలులేకుండా
కోట్లాది ప్రజలను ఊరవతలకు తరిమేసి అంటరానివారిగానే కాక
చూడరానివారుగా కూడా చేసిన దేశం
భారతదేశం తప్ప మరొకటి ఎక్కడా కనపడదు.

దళితులు అని ప్రస్తుతం ఎవరినయితే అంటున్నామో
వారిని దళితులుగానే ఉంచటం కోసం,
కేవలం ఉంచటమేకాదు అదిమిపట్టి ఉంచటం కోసం,
తొక్కిపెట్టి ఉంచటంకోసం
ప్రస్తుత రాజ్యం వ్యవహరిస్తున్న తీరును విశ్లేషించిన పుస్తకమిది.

ఈ పుస్తక రచయిత బొజ్జా తారకం వృత్తిరీత్యా న్యాయవాది. కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే ఆయన
హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సహ వ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలంపాటు వెన్నుదన్నుగా నిలిచారు.
అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే బొజ్జా తారకం ఇప్పటికీ దళితులను సంఘటితపరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని
వెచ్చిస్తున్నారు.
మానవ హక్కుల, పౌర హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది.
బొజ్జా తారకం రచనల్లో ... పోలీసులు అరెస్టు చేస్తే (1981), ... కులం-వర్గం (1996), ... నది పుట్టిన గొంతుక (1983) ప్రముఖమైనవి.

దళితులు - రాజ్యం

- బొజ్జా తారకం

78 పేజీలు, వెల: రూ.25

...

Friday, November 21, 2008

మన తత్వం ... దళిత బహుజన తాత్వికత ... కంచ ఐలయ్య



నేను హిందువు నెట్లయిత? (వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ?) అనే పుస్తకంద్వారా భారత దేశంలోని అసమానతలకు అణచివేతకు, దోపిడీకి... ముఖ్యంగా కులం, వర్గం ప్రాతిపదికగా జరిగే దోపిడీకి పరిష్కారం దళితీకరణలోనే వుందని ప్రతిపాదించి దేశవ్యాప్త చర్చకు తెరలేపారు కంచ ఐలయ్య.

ఆ చర్చకు కొసాగింపుగా అసలు దళితీకరణ అంటే ఏమిటి, దానిని సాధించడానికి ఏం చేయాలి అనే మౌలిక ప్రశ్నలకు సమాధానంగా దళిత బహుజన తాత్వికతను వివరిస్తూ ఆయనే రాసిన పలు వ్యాసాల సంకలనమే ఈ మనతత్వం.

మన సమాజంలో రెండు తత్వాలున్నాయనీ ఒకటి దళిత బహుజన తత్వం కాగా రెండవది బ్రాహ్మణీయ తత్వ మనీ మొదటిది అణచివేతకూ, దోపిడీకికీ, పతనానికీ లోనైన మెజారిటీ ప్రజల తత్వమైతే ...రెండవది ఆదిపత్యం, అణచివేత, దోపిడీ, రాపిడీలను కొనాగిస్తూ పబ్బం గడుపుకునే మైనారిటీ ప్రజల తత్వమని అంటారాయన.

ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో 28 వారాలపాటు వెలువడిన ఈ వ్యాసాలు అచ్చవుతున్న రోజుల్లోనే పెద్ద దుమారాన్ని లేపాయి.

ఈ దేశంలో బ్రిటిష్‌ పాలనా కాలంలో విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాక దళిత బహుజన తాత్వికతను రాసిన అగ్ర కుల ఉపాధ్యాయులు ఎవరూ లేరు. విద్యను ఉత్పత్తి పనితో, ఉత్పత్తి కుల జీవన విధానంతో ముడేసి నేర్పాలని అగ్రకుల మేధావులెవరూ భావించలేదు. మన విద్య అంతా బ్రాహ్మణవాద సాహిత్యంతో నిండుకొని వుంది. అది ఉత్పత్తి కులాల వారిని చాలా అవమానాలకు గురిచేసింది. బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌, పెరియార్‌ ఇ.వి. రామస్వామి నాయకర్‌ వంటి తత్వవేత్తలు రాసిన రచనలకు నిన్నమొన్నటి వరకు విశ్వవిద్యాలయాల్లో స్థానం వుండేదికాదు. ఇప్పుడిప్పుడే వారి తాత్వికతకు కొంత చోటు లభిస్తోంది. వారి దారిలో నడుస్తూనే తను ఈ వ్యాసాలు రాసినట్టు ఆయన చెబుతారు.

ఇందులోని అధ్యాయాలు: 1. మనతత్వం: ఆధ్యాత్మిక భౌతికవాదం - భౌతిక ఆధ్యాత్మిక వాదం, 2. మన చరిత్ర తత్వం 3. మన ఆస్తి తత్వం 4. మన రాజ్య తత్వం 5. మన చట్ట తత్వం.

మన పాట

చేప పిల్లల కోడి పిల్లల
గొర్రె పిల్లల జింక పిల్లల
కాయగడ్డల ఆకుకూరల
పండు ఫలముల పాలుపెరుగుల
తిండి తత్వం నేర్పినోళ్లం !

రాళ్లు రాకి నిప్పు జేసి
చర్మ మొలిచి తోలు జేసి
మట్టి పిసికి కుండ జేసి
నూలు వడికి బట్ట నేసి
ప్రాణ రక్షణ జేసినోళ్లం !

ఆవులకు ఈన నేర్పి
కోడెలకు దున్న నేర్పి
బంజర్లకు పంట నేర్పి
తాడిచెట్లకు పార నేర్పి
వ్యవసాయం చేసినోళ్లం !

ఆటపాటల ఆనందం
పూలతోటల అందచందం
వర్రె వాగుల నీటి బంధం
చెట్టు చేమల స్నేహ బంధం
ఉగ్గుపాలతో నేర్చినోళ్లం !

అండ పిండాల అనుబంధం
పశుపక్షుల జీవబంధం
తల్లిపిల్లల ప్రేమబంధం
సాలు సాలుకు సంబంధం
తత్వరీతులు తెలిసినోళ్లం !!




మన తత్వం
(దళిత బహుజన తాత్వికత)

- కంచ ఐలయ్య

64 పేజీలు, వెల: రూ.15

Tuesday, November 18, 2008

భారత ఆర్థికాభివృద్ధి - సాంఘిక అవకాశాలు ...జా ద్రెజ్‌, అమర్త్య సేన్‌ ... తెలుగు అనువాదం: మానేపల్లి




అమర్త్య కుమార్‌ సేన్‌ శాంతినికేతన్‌ (కలకత్తాలో, 1933 లో) జన్మించారు. 1959 లో కేంబ్రిడ్జిలో ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్‌ పట్టా తీసుకున్నారు. ఆక్స్‌ర్డ్‌లో కొన్నాళ్లు ఉన్నత స్థాయి
ప్రొఫెసర్‌ పదవి చేపట్టారు. 1960 లలో ఐక్యరాజ్య సమితి - అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలో పరిశోధనలు చేశారు. ఆయన రాసిన పావర్టీ అండ్‌ ఫామిన్‌ (1981) అనే గ్రంథం
చాలా ప్రసిద్ధి చెందింది. ఆర్థిక శాస్త్రంలో అమర్త్య సేన్‌కు నోబెల్‌ బహుమతి (1997) వచ్చింది.

జా ద్రెజ్‌ ఫ్రెంచ్‌ మేధావి. అభివృద్ధి చెందుతున్న తృతీయ ప్రపంచ దేశాల ఆర్థిక సమస్యలపై విస్తృత పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో సెంటర్‌ ఫర్‌
డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమర్త్య సేన్‌తో కలిసి ఆర్థిక శాస్త్రంపై అనేక గ్రంధాలు రాశారు.

వారిరువురు కలిసి రాసిన ప్రస్తుత గ్రంథమే ఈ భారత ఆర్థికాభివృద్ధి, సాంఘిక అవకాశాలు.
భారత ఆర్థిక అభివృద్ధిని తృతీయ ప్రపంచ దేశాల ఆర్థిక అభివృద్ధితో సరిపోల్చి సమకాలిక అవసరాలకు అనుగుణమైన విశ్లేషణ చేస్తుందిది. మన దేశంలో విద్య, ఆరోగ్యం స్త్రీ పురుష వివక్ష, శిశు మరణాలు - మొదలైన వివరాల్ని చర్చించి సామాన్య ప్రజలకు తగిన సాంఘిక అవకాశాలు లేకపోవడాన్ని ఎత్తి చూపుతుంది.

ఈ గ్రంథంపై విస్తృతంగా చర్చ జరగాలని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ భావిస్తున్నది.


ఇందులోని అధ్యాయాలు:


1. పరిచయం
... స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ భారతదేశం, ...ఇతరుల నుంచి నేర్చుకోవడం, ...సాంఘిక అవకాశం పబ్లిక్‌ పాలసీ.

2. ఆర్థిక అభివృద్ధి - సాంఘిక అవకాశం
... అభివృద్ధి, స్వేచ్ఛ, అవకాశాలు, ...విద్య, ఆరోగ్యం, ...ప్రభుత్వం, రాజ్యం, మార్కెట్‌, ...మార్కెట్లు, ప్రభుత్వాలు పరస్పర సంబంధాలు, ...మార్కెట్‌ మినహాయింపు, మార్కెట్‌
పూరకం, ...విశాల దృష్టి.

3. భారతదేశం - తులనాత్మక పరిశీలన
... భారతదేశమూ ప్రపంచమూ, ...ఇతర దేశాల నుంచి పాఠాలు, ...మానవ పెట్టుబడి, మౌలిక విలువలు, ...అంతర్గత వైరుధ్యాలు, ...వివిధ రాష్ట్రాల పరిస్థితుల అధ్యయనం.

4. భారత దేశం - చైనా
... చైనా దృష్టి కోణాలు, ...జీవన మరణ పరిస్థితులు, ...మౌలిక విద్య, ...సంస్కరణ పూర్వకాలపు విజయాలు, ...సంస్కరణ అనంతర అభివృద్ధి, ...చైనా నుంచి నేర్చుకోవలసిన
నిజమైన గుణపాఠాలు.

5. సాంఘిక అసమానత
... ప్రజాసముదాయం దాని పాత్ర, ...సాంఘిక అసమానతలు ఆర్థిక సంస్కరణలు, ...స్థానిక పాలన, సంఘ సంస్కరణ.

6. రాజకీయ సమస్యగా విద్య
... విద్య సాంఘిక మార్పు, ...పాఠశాల విద్యా పరిస్థితి, ...ప్రాధాన్యాలూ సవాళ్లూ, ...స్త్రీ విద్య, ...విద్య రాజకీయ కార్యాచరణ.

7. స్త్రీ పురుష అసమానత, స్త్రీల పాత్ర
... స్త్రీల అణచివేత, ...స్త్రీ పురుష నిష్పత్తి, ...స్త్రీ పురుష వివక్ష - కులం, ...గర్భధారణ - స్త్రీ విముక్తి, ...వైధవ్యం - స్త్రీ పురుష సంబంధాలు, ... స్త్రీ పురుష సమానత - సాంఘిక
ప్రగతి.

8.అర్థిక సంస్కరణల తరవాత
... ప్రజలే మన లక్ష్యాలూ సాధనాలూ, ...మౌలిక అవసరాలూ సంస్కరణలూ, ...ప్రభుత్వం - ప్రజలు, ... స్త్రీలు - సాంఘిక మార్పు, తులనాత్మక దృక్కోణం...


భారత ఆర్థికాభివృద్ధి - సాంఘిక అవకాశాలు
- జా ద్రెజ్‌, అమర్త్య సేన్‌

ఆంగ్ల మూలం: INDIA : Economic Development and Social Opportunity, Jean Drese and Amartya Sen, Oxford University Press, Delhi, 1995,

తెలుగు అనువాదం: మానేపల్లి

110 పేజీలు, వెల రూ.30

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌