Thursday, April 18, 2013

దాచేస్తే దాగదు చరిత్ర - సారంగ సాహిత్య వారపత్రిక ( ఏప్రిల్ 18, 2013 )...

దాచేస్తే దాగదు చరిత్ర
సారంగ సాహిత్య వారపత్రిక 
(ఏప్రిల్ 18, 2013)

ప్రజోద్యమం ప్రజ్వరిల్లిన్నప్పుడు సహజంగానే ఉద్యమ సాహిత్యం వెల్లువెత్తుతుంది. ఆ ప్రాంత చరిత్ర, నేపథ్యం ఒక్కసారిగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. గత పది పదిహేనేళ్లుగా సాగుతున్న మలిదశ ప్రత్యేక తెలంగాణా ఉద్యమమే ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణా అస్తిత్వ ఆకాంక్షను, సంస్కృతీ సంప్రదాయాలను, చారిత్రక విశేషాలను చాటిచెప్పే పుస్తకాలు ఇప్పటికే వందల సంఖ్యలో వెలువడ్డాయి. వాటిలో ఈ ఏప్రిల్‌ 7న ఆవిష్కరించబడ్డ మహమ్మద్‌ హైదర్‌  రచన ”1948: హైదరాబాద్‌ పతనం” ఎంతో విలక్షణమైనది.

నిజానికి ఈ పుస్తకానికీ ఇప్పటి తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికీ సంబంధం లేదు. కానీ ఆనాడు ఉస్మానాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మహమ్మద్‌ హైదర్‌ 1947-48లో జరిగిన సంఘటనల గురించి ఎప్పుడో 1952లో రాసిన పుస్తకం ఇన్నాళ్లకి వెలుగు చూడటానికి మాత్రం కచ్చితంగా ఆ ఉద్యమమే కారణమని చెప్పవచ్చు. మొదట్లో భారత ప్రభుత్వంతో తన ఉద్యోగం విషయమై జరుపుతున్న సంప్రదింపులకు విఘాతం కలుగుతుందేమోనన్న భావనతో రచయితే ఈ పుస్తక ప్రచురణను పక్కన పెట్టారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో కొంత సాహిత్యం వెలువడింది. 70వ దశకంలో పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి వంటి హేమాహేమీలు ఆనాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట అనుభవాలను వివరిస్తూ పలు పుస్తకాలు ప్రచురించారు.

ఆ సందర్భంగా 1972లో మహమ్మద్‌ హైదర్‌ కూడా తన పుస్తకాన్ని పాఠకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ 1973లో 58 ఏళ్ల వయసులోనే ఆయన హఠాన్మరణం పాలయ్యారు. చివరికి ఆయన కుమారుడు మసూద్‌ హైదర్‌ ”అక్టోబర్‌ కూ – ఎ మెమైర్‌ ఆఫ్‌ ది స్ట్రగుల్‌ ఫర్‌ హైదరాబాద్‌” పేరిట తండ్రి పుస్తకాన్ని 2012లో వెలుగులోకి తెచ్చారు. దాని తెలుగు అనువాదమే 1948: హైదరాబాద్‌ పతనం.

ఈనాడు తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాలని ఆకాంక్షిస్తోంది… కాగా ఆనాడు తెలంగాణాతో కూడిన హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర దేశంగా కొనసాగాలని ఆశించింది. ఈనాటిది మెజారిటీ ప్రజల ఆకాంక్ష అయితే – ఆనాటిది కేవలం పాలకుల ఆశ. దానివల్లనే హైదరాబాద్‌ సంస్థానానికి పదమూడు నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్‌ 17న స్వాతంత్యం లభించింది.

బ్రిటిష్‌ వలస పాలకులు ”స్వాతంత్య్రం ఇచ్చేశాం ఇక తన్నుకు చావండి” అన్న రీతిలో వ్యవహరించడం వల్ల, కావాలని విభజన చిచ్చును రగిలించడం వల్ల ఆనాడు దేశమంతా అల్లకల్లోలంగా తయారయింది. గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమం సుదీర్ఘకాలం అహింసాయుతంగా సాగింది కానీ తీరా స్వాతంత్య్రం సాకారమయ్యే వేళ దేశంలో కనీవిని ఎరుగనిరీతిలో హింస ప్రజ్వరిల్లి రక్తం ఏరులై ప్రవహించింది. బ్రిటిష్‌వాళ్లు తమ ప్రత్యక్ష పాలనలో వున్న ప్రాంతాలకు స్వాతంత్య్రం ప్రకటించి పరోక్ష పాలనలో వున్న 565 సంస్థానాలకు ఉద్దేశపూర్వకంగా స్వయం నిర్ణయాధికారాన్ని ప్రసాదించారు. పాకిస్థాన్‌లో చేరతారో, భారతదేశంలో చేరతారో, స్వతంత్రంగా వుంటారో మీ ఇష్టం అని వాళ్లని రెచ్చగొట్టారు. అన్ని సంస్థానాల్లోనూ అతి పెద్దది హైదరాబాద్‌ సంస్థానమే. సొంత సైన్యం, ప్రత్యేక కరెన్సీ వంటి అన్ని హంగులతో కూడిన సుసంపన్నమైన రాజ్యం. (ఆనాడు ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడు నిజాం రాజే అని ప్రతీతి).

రెండువందల ఏళ్లుగా తమ వంశస్థుల ఆధిపత్యంలో వున్న రాజ్యాన్ని వదులుకునేందుకు నైజాం నవాబు ససేమిరా అన్నాడు. కానీ మెజారిటీ ప్రజల ఆకాంక్ష వేరుగా వుంది. రాచరిక వ్యవస్థనుంచి, కరడుగట్టిన భూస్వామ్య విధానాలనుంచి ప్రజలు విముక్తిని కోరుకున్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో ................


... పూర్తీ సమీక్ష " సారంగ " లో చదవండి . ......

http://www.saarangabooks.com/magazine/?p=1999









Sunday, April 7, 2013

పోలీసు చర్య అనంతరం జరిగిన భయోత్పాతాలను ఎక్కువచేసి చూపించాలన్న కోరిక నాకు లేదు. కాకపోతే..... - మొహమ్మద్‌ హైదర్‌



... పోలీసు చర్య అనంతరం జరిగిన భయోత్పాతాలను ఎక్కువచేసి చూపించాలన్న కోరిక నాకు లేదు. కాకపోతే ఈ విషాద ఘటనలను కచ్చితంగా నివారించివుండవచ్చు. భారత సైన్యం ముందంజ వేస్తున్నప్పుడు చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విజయకేతనం ఎగరేసిన భారత సైన్యం ఛిన్నాభిన్నం చేస్తూ దూసుకువచ్చే బదులు స్థానిక పాలనాయంత్రాంగాలను పునరుద్ధరించడమొ లేదా మిలటరీ యంత్రాంగాలను నెలకొల్పడమో చేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఆ రెండూ చేయలేదు.

అదే అదనుగా దోపిడీ దొంగలు సరిహద్దులు దాటి వచ్చారు. హింసాయుత ఘటనలు యాదృచ్ఛికంగానే కాదు అవకాశవాదంతో పెట్రేగాయి. దోపిడీ దొంగల్లో సరిహద్దు శిబిరాలకు చెందిన వేలాది మంది యువకులు కలిసిపోయారు. వాళ్లు హింసాయుత దాడుల్లో ... ప్రత్యేకించి ప్రతీకార దాడుల్లో శిక్షణ పొందారు.

అరాచకత్వం కొన్ని వారాలపాటు కొనసాగింది. గుంపులు గుంపులుగా వచ్చిన జనం జైళ్లను పగలకొట్టి ఖైదీలను విడిపించుకుపోయారు ఉస్మానాబాద్‌ తరహాలో. హత్యలు, లూటీలు, గృహదహనాలు కొనసాగాయి. రజాకార్లుగా అనుమానించినవాళ్లను, సైన్యంతో కలిసిమెలసి వున్న గుంపులను దోపిడీ దొంగలు ఊచకోత కోశారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి.

తల్లిదండ్రుల నుంచి పిల్లల్నీ, భర్తల నుంచి భార్యల్నీ దూరం చేశారు. మహిళలనూ బాలికలనూ వెంటాడి అత్యాచారాలు చేశారు.
ఇలాంటి ఎన్నో సిగ్గుమాలిన దారుణాలు జరిగాయి ఆ రోజుల్లో. వాటి గురించి ఇప్పటికీ నేను రాయలేను.

ఉస్మానాబాద్‌ నుంచి తిరిగి వచ్చిన రోజునుంచీ నా మిత్రులూ బంధువులూ నన్ను పాకిస్తాన్‌ వెళ్లిపోవలసిందిగా ఒత్తిడి చేశారు. పరిస్థితులు రానురానూ మరింత అధ్వాన్నంగా తయారవడంతో
.... .... ...

- మొహమ్మద్‌ హైదర్‌ 
''1948 : హైదరాబాద్‌ పతనం'' పుస్తకం నుంచి
(హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ)

ఈ పుస్తకావిష్కరణ సభ, చర్చ ఈ రోజే హైదరాబాద్‌ సారస్వత పరిషత్‌ హాల్‌ లో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.


Thursday, April 4, 2013

భారత దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విలీనం ఒక వివాదాస్పద అధ్యాయం ... ఆంధ్రజ్యోతి నవ్య 4 4 2013 ...



 

1948 హైదరాబాద్ పతనం


భారత దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విలీనం ఒక వివాదాస్పద అధ్యాయం. దీనికి సంబంధించిన వివరాలు అనేకం అందుబాటులో ఉన్నా- ఇంకా వెలుగులోకి రాని కొన్ని ముఖ్యమైన కోణాలున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఆ నాటి సంఘటనల గురించి రాసిన ముస్లింలు తక్కువ. ఆ సమయంలో ఉస్మానాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన మొహమ్మద్ హైదర్ రాసిన "October coup' అనే ఆంగ్లపుస్తకాన్ని ఇటీవల '1948-హైదరాబాద్ పతనం' పేరిట తెలుగులోకి అనువదించారు. ఈ నెల 7వ తేదీన విడుదల కానున్న ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీ కోసం..

సెప్టెంబరు 17...శుక్రవారం ఉదయం ఖాసిం రజ్వీ నుంచి నాకు ఫోను వచ్చింది. అతనితో ఫోనులో మాట్లాడ్డం అదే మొదటిసారి. "లోపలే ఉండండి'' అతను సలహా ఇచ్చాడు. ఇంటి నుంచి బయటకు రాకండి. శుక్రవారం ప్రార్థనల సమయంలో నివారించలేని కొన్ని పరిణామాలు జరగవచ్చు'' అన్నాడు.
"అప్పటికి భారత సైన్యం నగరంలోకి ప్రవేశిస్తుందని అనుకుంటున్నారా?'' అని నేను అడిగాను.
"అబ్బే అదేం కాదు అన్నాడు.
"అది కాకపోతే ఇంకేమిటి?'' నేను ఆరా తీశాను.
"అనివార్యమైనది'' అని మళ్లీ నొక్కి చెప్పాడు. "మన వాళ్లు ఆయుధాలు చేపడతారు'' అన్నాడు.
జరిగిందేంటంటే అతను అప్పటికే తన అనుచరులకు వేలాది తుపాకులు పంచి పెట్టాడు. ఆరోజు మధ్యాహ్నం తర్వాత హిందువులను ఊచకోత కోయాలని వాళ్లకి ఆదేశాలు కూడా ఇచ్చాడు.

నేను చాలా భయపడ్డాను. ఇది చాలా తప్పు అని నేనతనికి చెప్పాను. భారత బలగాలు నగరానికి చేరుకుంటే మొత్తం హైదరాబాదే సర్వనాశనం అయిపోతుందని చెప్పాను. అయితే అతను వినే పరిస్థితిలో లేడు. రాజకీయాల నుంచి రిటైరయ్యే ముందు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించాలని నేను అభ్యర్థించాను. అతను వినిపించుకోకుండానే ఫోన్ కట్ చేశాను. నేను నవాబ్ దీన్‌యార్ జంగ్ దగ్గరకు పరుగు తీశాను. ఖాసిం రజ్వీ అంటువంటి ఆలోచనతో ఉన్నట్లు ఆయనకు అప్పటికే సమాచారం అందింది. వెంటనే రిజ్వీకి ఫోన్ చేశారు. వాళ్లిద్దరూ అరగంటకు పైగానే మాట్లాడారు. దీన్‌యార్‌జంగ్ పాతికేళ్లకు పైగా ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆయన ఎవ్వరినైనా దేని గురించి అయినా ఒప్పించగల నేర్పరి. అలాంటి దీన్‌యార్‌జంగ్‌కు అతని మొత్తం జీవితంలోనే ఎన్నడూ ఎదురుకాని విధంగా- 1948 సెప్టెంబరు 17 న ఆ అరగంట అతని నైపుణ్యానికి ఓ అగ్ని పరీక్షే అయ్యిందని చెప్పాలి. ఆ రోజు అతను సాధించింది హైదరాబాద్ ప్రజలకు అతను చేసిన అతి గొప్ప సహాయంగా మిగిలిపోయింది.

అరగంట మాటలూ పూర్తికాగానే ఖాసిం రజ్వీ తన అనుచరులను ఆయుధాలు అప్పగించాల్సిందిగా ఆదేశించాడు. అదే రోజు మరికొంతసేపటి తర్వాత లాయక్ అలీ, ఆయన మంత్రి వర్గం (సెప్టెంబరు 17 ఉదయాన) రాజీనామాలు సమర్పించి ప్రభుత్వ పాలనా పగ్గాలు నిజాంకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. లాయక్ అలీ యే ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల్లో మాట్లాడుతూ నిర్ధారించాడు.

ఆరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ సంస్థానమంతటా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. జనరల్ ఎల్ ఇద్రూస్ అంతకు ముందురోజే నిజాం రాజును కలిసి మరింతగా ప్రతిఘటించడం వల్ల ప్రయోజనం ఉండకపోగా ప్రాణనష్టం భారీగా ఉండే ప్రమాదముందని సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఆ సాయంత్రమే ఖాసిం రజ్వీ తన వాణి వినిపించాడు. అతని గొంతు డెక్కన్ రేడియోలో చివరి సారి వినిపించింది. ఇచ్చిన హామీల మేరకు పనిచేయలేకపోయానని ఒప్పుకున్న రజ్వీ -పరిస్థితులే తనకు వ్యతిరేకంగా కుట్రపన్నాయని అన్నాడు. ఎవరెంతగా రెచ్చగొట్టినా ముస్లింలంతా ప్రశాంతంగా ఉండాల్సిందిగా రజ్వీ ఉద్బోధించాడు. హిందూ ముస్లింల మధ్యనున్న సంప్రదాయ ఐక్యత ఎట్టి పరిస్థితిల్లోనూ అలాగే కొనసాగాలని రజ్వీ ఆకాంక్షించాడు. గతంలో జరిగిన ఘటనలన్నీ మర్చిపోవాలని విజ్ఞప్తి చేశాడు. ఆ ప్రసంగం విన్న వారంతా కూడా అతని మొత్తం జీవితంలో అంత రాజనీతిజ్ఞతతో చేసిన ప్రసంగం మరోటి లేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.
* * *

మరొక పెద్ద విషయాన్ని మీకు చెప్పి ముగిస్తాను. హైదరాబాద్‌కు, భారత దేశానికి మధ్య జరిగిన సంఘటనలను మనం ఎంత వరకు అర్థం చేసుకోగలం? 1947 -48 మధ్య జరిగిన సంఘటనలను సామాన్యంగా మనం భారతదేశం దృష్టి నుంచి, జాతీయోద్యమం దృష్టి నుంచి చూస్తాం. అది అంత ప్రయోజనకరమైన పద్ధతని నేను అనుకోను. ఎందుకంటే, దృష్టితో చూడడం ప్రారంభిస్తే హైదరాబాద్ తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయమని, అంచనాలకు అందని నిర్ణయమని, ఐక్య భారతదేశ ఆవిర్భావమనే ఒక మహా కెరటానికి వ్యతిరేకంగా ఒక చిన్న రాష్ట్రం తన శక్తికి మించి పోరాడి, ఓడిపోయిందని భావించవచ్చు. ఇప్పటికే ఆ భావన స్థిరపడిపోయింది. హైదరాబాద్ అప్పట్లో తీసుకున్న చర్య చాలా అసంబద్ధ నిర్ణయమని, చివరికది తాను చేసిన తప్పుడు అంచనాలకు తానే ఫలితాన్ని అనుభవించిందని సాధారణ ప్రజానీకం చాలామంది భావించవచ్చు.

నిజానికి హైదరాబాద్ పిచ్చిదా? చెడ్డదా? దిద్దుకోలేని తప్పులు చేసిందా? ఒక శత్రువుకు సంబంధించి సాధారణంగా మనం ఎప్పుడూ తప్పుగానే ఆలోచిస్తుంటాం. కానీ తనను కలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న ఒక వర్గం చర్యలను అర్థరహితంగా, దాన్ని కలుపుకోవడానికి రెండో వర్గం చేస్తున్న ప్రయత్నాలకు ఎప్పటి నుంచో ఆమోదం ఉన్నట్లు మనం భావించడం సరైనదేనా? ఈ విధంగా మనం చరిత్రను విజేతల వైపు నుంచే చూస్తూ, దానికి వక్రభాష్యం చెప్పడం లేదా? దానికి బదులుగా ఒక చిన్న రాష్ట్రమైన హైదరాబాద్, తన కన్నా శక్తివంతమైన ప్రభుత్వంతో పోరాడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినపుడు మనం పరిస్థితిని కొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు. ఆ పోరాటానికి సంబంధించిన వివరాల్లోకి ఇప్పుడు వెళ్లడం అప్రస్తుతం. కానీ అప్పటి సంఘటనల్లో రెండు అసమాన ప్రభుత్వాల మధ్య జరిగిన పోరులో మనం అవి వ్యవహరించిన సాధారణ తీరుని పరిశీలించడం బాగుంటుంది.

1948: హైదరాబాద్ పతనం
మొహమ్మద్ హైదర్
పేజీలు: 204
ధర: 100
ప్రచురణ, ప్రతులకు: హైదరాబాద్ బుక్‌ట్రస్టు
ఫోన్: 040 -23521849 

ఆంధ్రజ్యోతి నవ్య 4 ఏప్రిల్ 2013 


 

Monday, April 1, 2013

1948: హైదరాబాద్ పతనం ... రచన: మహమ్మద్ హైదర్, తెలుగు అనువాదం: అనంతు ...


1948: హైదరాబాద్ పతనం

హైదరాబాద్‌ విమోచన, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్‌ పోలో ...
1948లో భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానంపైకి దండెత్తినప్పటి ఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడతుంటాయి.

నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగానీ వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్భంలోనూ లేనంతటి తీవ్ర వైవిధ్యం, పరస్పరం సంఘర్షించుకునే భావ వైరుధ్యాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయి. ఈ ఉద్వేగపూరిత కథనాల మధ్య చాలాసార్లు అసలు జరిగిందేమిటో గ్రహించటం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది.

నాటి ఘటనల చుట్టూ పేరుకున్న ఆ మాయనూ, మబ్బుతెరలనూ తొలగించి చూపిస్తుందీ మొహమ్మద్‌ హైదర్‌ రచన.

నాటి ఉద్రిక్త కాలంలో ఉస్మానాబాద్‌ కలెక్టర్‌గా పని చేశారు హైదర్‌.
ఏడాది తిరగక ముందే ఆయనను తన జిల్లా జైలుకే పంపించారు.

జైలులో గడుపుతూనే ఓ పరిపాలనాధికారిగా 1948 ఘటనలకు సంబంధించి తన ప్రత్యక్ష అనుభవాలను, జ్ఞాపకాలను కాగితంపై పెట్టారాయన. ఎంతో హుందాగా, అక్కడక్కడ చెణుకులతో సాగిపోయే ఈ రచన- ఎటువంటి ఆవేశకావేశాలకూ లోనుకాకుండా సాగిపోవటమే కాదు- చివరకు మన కళ్లు తెరిపిస్తుంది కూడా !

    ''స్వతంత్రం అనంతరం దేశంలో చోటుచేసుకున్న ఓ పెద్ద కూహకం గురించి దేశ పౌరులకు తెలియకుండా కప్పిపుచ్చటం, పైగా విదేశీ వర్గాలు దీన్ని బయటపెట్టిన తర్వాత కూడా దాచిపెట్టాలనే చూస్తుండటం దారుణం.
1948 మారణహోమం గురించి ముస్లిం మీడియాకూ తెలుసు. కానీ ఎక్కడా మాట్లాడదు. పైగా తన మౌనానికి హిందూ వర్గాల అణిచివేతే కారణంగా చూపిస్తోంది. ఓ ఉదారవాద ప్రజాస్వామ్యం పనిచేసే తీరు ఇది కాదు. నివేదికలను తొక్కి పెట్టటం, పాఠ్యపుస్తకాల్లో ఇటువంటి ప్రస్తావనలు కూడా రాకుండా తుడిచెయ్యడం ద్వారా భారత్‌ ఎన్నటికీ నిజమైన సమైక్య జాతిగా అవతరించ జాలదు.

                        - స్వామినాధన్‌ అయ్యర్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, 2012 నవబంరు, 26




ఈ నెల 7న (2013 ఏప్రిల్ 7) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సారస్వత పరిషత్ హాల్ లో
ఈ పుస్తకం ఆవిష్కరించ బడుతోంది.

1948: హైదరాబాద్ పతనం
- మహమ్మద్ హైదర్  
ఇంగ్లీష్ మూలం : October Coupe: A Memoir Of The Struggle For Hyderabad - Mohammad Hyder, Published by Roli Books, New Delhi, 2012.

తెలుగు అనువాదం : అనంతు 
ప్రధమ ముద్రణ : ఏప్రిల్ 2013
 వెల : రూ 100/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

.










హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌