Sunday, March 27, 2011

మార్పు జెండా - విరాట్, ఈనాడు


మార్పు జెండా 
అమెరికాలో బానిస విధానం రద్దయింది. బానిసల మీదే ఆధారపడ్డ భూస్వాములు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతర్యూద్ధం మొదలైంది. "గాన్ విత్ ది విండ్" నవల  నేపధ్యం ఇది. పాత పధ్ధతుల్ని వదులుకోలేకా కొత్త మార్పులు మింగుడు పడకా అప్పటి ప్రజలు పడ్డ సంఘర్షణ నవలలో దర్శనమిస్తుంది. ఆ పరిణామ క్రమంలో అంతర్మధనానికి గురయ్యే ప్రధాన పాత్ర స్కార్లెట్. మిగతా పాత్రలూ సన్నివేశాలూ కూడా మారుతున్న సామాజిక పరిస్థితులకు అద్దంపడతాయి. మార్గరెట్ మిచ్చెల్ రాసిన ఈ నవల అప్పట్లో  ఓ సంచలనం. దానికి తెలుగు అనువాదమే  "చివరకు మిగిలింది?" అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన పుస్తకాన్ని తెలుగు పాఠకులకు  అందించాలన్న ప్రయత్నం ప్రశంసనీయం,.
- విరాట్
ఈనాదు ఆదివారం, 27-3-2011 సౌజన్యంతొ    

  

Thursday, March 24, 2011

చంద్రగిరి పై సాహసయాత్ర-2 ... కాత్యాయని ...

చంద్రగిరి పై సాహసయాత్ర-2 ... 

ఆ తర్వాత శంకర్‌ సాగించిన ఒంటరి ప్రయాణాన్నీ, అతనికి ఎదురైన ప్రమాదాలనూ ఒళ్లు గగుర్పొడిచేలా వర్ణిస్తాడు రచయిత. వజ్రాలగని కనబడినా గుర్తించలేకపోతాడు శంకర్‌. వజ్రాలను గులకరాళ్లుగా పొరబడి, దారి పొడవునా గుర్తుపెట్టుకునేందుకు వాడుతుంటాడు. చివరికి రెండు మాత్రమే అతని జేబులో మిగులుతాయి. తమలాగే వజ్రాల వేటకు బయల్దేరి, దిక్కులేని చావుకు గురైన అటీరియో అనే ఇటాలియన్‌ యువకుడి అస్థిపంజరమూ, అతను రాసి ఉంచిన లేఖా కంటబడటంతో వజ్రాలపై పూర్తిగా విరక్తి కలుగుతుంది అతనికి.  అతి కష్టంపై కలహారి ఎడారిని దాటి, కొన ప్రాణాలతో రొడీషియాకు చేరి కోలుకుని, భారతదేశానికి బయల్దేరటంతో కథ ముగుస్తుంది.

బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయ అనే భావుకుడూ, తాత్వికుడూ, మానవతావాదీ అయిన రచయిత చేతిలో పడకపోయి వుంటే ఈ కథ ఒక మామూలు సాహస గాథగా మిగిలిపోయేది. కానీ, సంపదల కోసం పరుగులు తీయటం మానవ జీవితాన్ని ఎంత విషాదంగా అంతం చేస్తుందో చెప్పటానికి ఈ కథను ఉపయోగించుకున్నాడు రచయిత. జిమ్‌కార్టర్‌, అ ల్వరెజ్‌, అటీరియో లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన తీరును చూస్తుంటే ''గోల్డ్‌ రష్‌'' తాలూకు అమానవీయ పరిణామాలను చిత్రించిన జాక్‌ లండన్‌ కథలు గుర్తొస్తాయి. పాశ్చాత్య దేశాల పెట్టుబడిదారీ సమాజాలకు చెందిన ఆ యాత్రికులూ, నిరుపేద భారతీయ యువకుడు శంకర్‌ ప్రయాణించిన మార్గం ఒకటే అయినా లక్ష్యాలు ఒకటి కావనీ, కాకూడదనీ ఎంతో సున్నితంగా చెప్తాడు రచయిత. శంకర్‌నొక సూపర్‌మాన్‌గా- సాహసాలు చేసే, డబ్బు సంపాదించే యంత్రంగా ఆయనెక్కడా చూపలేదు. సాహసం, భావుకత్వం, సౌందర్య దృష్టి, మానవ సంబంధాలపై గౌరవం, తన గ్రామంతో అనుబంధం, సత్యాన్వేషణ- అన్ని గుణాలూ కలబోసిన సహజమైన పాత్ర శంకర్‌. ఖండాంతరాల్లో పర్యటిస్తున్న అతని హృదయమెప్పుడూ మానవీయంగా ఉంటుంది. వజ్రాలగని దొరికితే తను ఎంత సంపన్నుడవుతాడో, జీవితం ఎంత సుఖవంతమవుతుందోననే ఊహకు బదులుగా- ఎందరు పేదల కన్నీళ్లు తుడవగలనో, ఎందరు నిరుపేద యువతులకు పెళ్లిళ్లు చెయ్యగలనో, ఎందరు వృద్ధులకు రక్షణ కల్పించగలనో అనే ఆలోచిస్తాడు శంకర్‌. వజ్రాల వేటకు బయలుదేరిన ఇతరులకూ. అతనికీ ఉన్న భేదం అదే.

'పథేర్‌ పాంచాలి', 'అపరాజితో', 'వనవాసి' వంటి నవలల్లో బిభూతి భూషణ్‌ తిరిగిన ప్రాంతాల, ఆయన జీవితానుభవాల చాయలు స్పష్టంగా వ్యక్తమవుతాయని ఆయన జీవిత చరిత్రను రాసిన సునీల్‌ కుమార్‌ ఛటోపాధ్యాయ చెప్పారు. కానీ, తానెన్నడూ చూడని ఆఫ్రికా గురించి ఇంత వివరంగా రాయగలగటమే 'చందేర్‌ పహార్‌' (చంద్రగిరి శిఖరం) లోని విశేషం. ప్రపంచం నలుమూలల్లోని భౌగోళిక, ప్రకృతి విశేషాలనూ-సాహస గాథలనూ ఎంతో ఆసక్తిగా చదువుతుండేవాడు బిభూతి భూషణ్‌. కెన్యాలోని రైల్వే కంపెనీలో పనిచేసిన జాన్‌ హెన్రీ పాటర్సన్‌ అనే బ్రిటీష్‌ అధికారీ, బాబూ పురుషోత్తం హర్‌బీ అనే భారతీయుడూ రాసిన అనుభవాల నుండీ, 'వైడ్‌ వరల్డ్‌ మాగజైన్‌' అనే పత్రికలో వచ్చిన సాహస గాథలనుండీ ఆ నవలకు కావలసిన సమాచారాన్ని సేకరించాడట రచయిత. అ లాగే ఆఫ్రికాలోని వృక్ష, జంతుజాతులను గురించీ, గిరిజన తెగల సంస్కృతుల గురించీ అధ్యయనం చెయ్యటం కూడా ఆయనకు ఎంతగానో ఉపయోగపడింది. ఆ వివరాలన్నిటినీ క్షుణ్ణంగా అర్థం చేసుకుని, తనదైన దృక్పథంతో మేళవించి పునసృష్టించటమే ఆయన ప్రతిభ. తను స్వయంగా చూసి, కొన్నాళ్లు నివసించిన లవటురియా, మోహన్‌పురా అరణ్యాలను గురించి ''వనవాసి''లో, ''చంద్రగిరి శిఖరం''లో వర్ణించగలగిన నేర్పరి బిభూతి భూషణ్‌. శంకర్‌కు అ ల్వరెజ్‌తో ఏర్పడిన అనుబంధాన్ని, అటీలియోపై కలిగిన సానుభూతి కరిగిస్తుంది.

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ రచనల్లో ప్రకృతి వర్ణన ఎంత హృద్యంగా సాగుతుందో తెలుగు పాఠకులకు కొత్తగా చెప్పనవసరం లేదు. ''వనవాసి''లో ప్రధానంగా ప్రకృతి ముగ్ధ సౌందర్యాన్ని చిత్రించిన రచయిత, ఈ నవలలో దాని భయద సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేస్తాడు. ''ఎలిఫెంట్‌ గ్రాస్‌ మైదానాల్లో పరుచుకున్న వెన్నెల వణికిపోయే సింహగర్జన''లనూ, ''ఆకాశ మధ్యాన బాణసంచా ప్రదర్శనలా'' ప్రారంభమై ''దిగంతాలకు అరుణవర్ణాన్ని పులిమి, మేఘాలను నిప్పు ముద్దలుగా మార్చి... పర్వతం మొత్తం ఒకే అగ్ని జ్వాలలా దగ్ధమైపోయిన అగ్నిపర్వతపు విస్ఫోటనాన్నీ'' కళ్లముందు నిలిపి పాఠకులను విభ్రాంతి పరుస్తాడు.

ప్రకృతిలో బిభూతి భూషణుడికున్న గాఢమైన అనుబంధానికీ, తాదాత్మ్యతకూ ఒక ప్రతీక శంకర్‌. తన అంతిమ క్షణాలు సమీపిస్తున్నాయన్పించిన సమయంలో కూడా శంకర్‌కు భయం తప్ప, పశ్చాత్తాపం లేదు. ఏ మలేరియాతోనో రోగగ్రస్తుడై నిస్సహాయంగా ఆస్పత్రిలో చావటంకన్నా ఎంచుకున్న మార్గంలో సాహసిగా మరణించటం మేలనుకుంటాడు. ''తారలతో నిండిన నీలాకాశపు కప్పుకింద ఈ పర్వతారణ్య సీమలలో, ఈ రేయి నిశ్శబ్ధ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ'' మరణాన్ని ఆహ్వానించడానికి సిద్ధపడతాడు. మృత్యు బీభత్సాన్నీ, సౌందర్య దృక్పథాన్నీ అతి నైపుణ్యంతో గాఢమైన అనుభవాన్ని అందిస్తాడు ఈ నవలతో బిభూతి భూషణ్‌.
''మూన్‌ మౌంటెన్‌'', ''మౌంటెన్‌ ఆప్‌ ది మూన్‌'' పేర్లతో మూడు నాలుగు ఇంగ్లీషు అనువాదాలు వచ్చాయి. ''చందేర్‌ పహార్‌'' నవలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ''చంద్రగిరి శిఖరం'' పేరిట  తెలుగు పాఠకులకు అందించింది.

......

బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయ.
ఆయన పేరు తలచుకుంటే చాలు - స్వచ్ఛమైన ఆడవి గాలి మనసును చల్లగా తాకుతుంది. బెంగాల్‌ పల్లెసీమలూ, పంట పొలాలూ, లవటూరియా, మోహన్‌పురా  అటవీ ప్రాంతాలూ, మహాలిఖారూప పర్వతారణ్యాలూ ... మనో నేత్రం ముందు ఆకుపచ్చ సముద్రం ఉప్పొంగుతుంది. అడవిగాచిన వెన్నెల దారుల్లోంచి మార్మికమైన సౌందర్య లోకాల్లోకి నడిచిపోతున్నట్టుగా ఉంటుంది. బిభూతి భూషణ్‌ను చదివాక ప్రకృతిలో కొత్త అందాలూ, కొత్త అర్థాలూ మనకు గోచరించకపోతే, మన హృదయగత సంస్కారాన్ని శంకించాల్సిందే.
- కాత్యాయని
(చినుకు, మాసపత్రిక, జూలై 2010 సౌజన్యంతో) 



Wednesday, March 23, 2011

చంద్రగిరి పై సాహస యాత్ర-1 ... కాత్యాయని ...

చంద్రగిరి పై సాహస యాత్ర-1 ...


ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రించిన రచయితల్లో బిభూతి భూషణ్‌ మొదటివాడేమీ కాదు. కానీ, ఆయన రచనల్లోని ప్రకృతి చిత్రణకు ప్రత్యేకమైన స్వభావమున్నది. ఆయన దృష్టిలో ప్రకృతి సౌందర్యమంటే మానవులకు తీరిక సమయాల్లో ఆహ్లాదాన్నిచ్చే వినోద సాధనం కాదు - ఒక జీవితావసరం. మానవ స్వభావంలోని సహజాతాలకూ, బాహ్య ప్రకృతికీ అవినాభావ సంబంధాన్ని ఆరోపిస్తాడాయన, ప్రాచీన సంస్కృత కవుల్లాగా. సాధారణమైన ప్రకృతి ప్రేమికుల్లాగా ప్రకృతిలోని కొన్ని పార్శ్వాలను మాత్రమే ప్రేమించే దృష్టి కాదాయనది. వసంతశోభను ఎంత ఆహ్లాదంగా వర్ణిస్తాడో- నిప్పులు కురిసే గ్రీష్మ సౌందర్యానికీ అంతే అబ్బురపడతాడు. వెన్నెల వానలో తడిసి ఎంత పరవశించిపోతాడో చీకటి రాత్రుల నిగూఢ లోకాల్లోకీ అంతే ఆసక్తితో అడుగుపెడతాడు. ప్రకృతిపై ప్రేమ ఆయన్నొక తీరని దాహంలా, మోహంలా ఆవిరించుకుని ఆయన అక్షరాలకు అపూర్వమైన అందాన్ని అద్దింది. బిభూతి భూషణుడి ''వనవాసి''తో ముగ్ధులైన తెలుగు పాఠకులకు ఇదంతా అనుభవమే. ఆ నవల ఇచ్చిన అనుభూతిలోకి మరింత లోతుగా ప్రయోగించాలంటే ఆయనే రాసిన ''మూన్‌ మౌంటెన్‌'' (బెంగాలీలో ''చందేర్‌ పహార్‌''/తెలుగులో ''చంద్రగిరి శిఖరం'') ను చదివి తీరాల్సిందే.

''అరణ్యక'' (తెలుగులో ''వనవాసి''), ''చందేర్‌ పహార్‌'' (తెలుగులో ''చంద్రగిరి శిఖరం'')  లను దాదాపుగా ఒకే కాలంలో అంటే 1930ల చివర్లో రాశాడు భిభూతి భూషణ్‌, రెండింటిలోనూ ప్రధానాంశం ప్రకృతి చిత్రణే అయినప్పటికీ కథావస్తువులు పూర్తిగా భిన్నమైనవి. భారతదేశంలోని అరణ్య ప్రాంతాల ప్రకృతినీ, అక్కడి ప్రజల జీవితాలనూ, ప్రకృతికి దూరమవుతున్న మానవుల భౌతిక ఆత్మిక జీవితాల్లోని క్షీణతనూ విస్తృతమైన కేన్వాస్‌పై చిత్రించిన రచన ''వనవాసి''. దీనితో పోల్చినప్పుడు ''చందేర్‌ పహార్‌ (చంద్రగిరి శిఖరం)'' లోని జీవిత చిత్రణ పరిథి తక్కువనే చెప్పాలి. ఈ నవల టీనేజ్‌ పాఠకులను ఉద్దేంశించి రాసినది కావటమే అందుకు కారణం అయ్యుండొచ్చు. బెంగాలీలో ఇటువంటి రచనలు ''కుమార్‌-సాహిత్య'' అనే విభాగం కిందికి వస్తాయట. శంకర్‌ అనే బెంగాలీ యువకుడు ఆఫ్రికాలోని అరణ్యాల్లో, ఎడారుల్లో చేసే సాహసయాత్ర ఇందులోని కథంశం. ఐతే గాఢమైన తాత్విక దృక్పథంగల రచయిత ఎంత చిన్న జీవిత శకలాన్నయినా ఒక గొప్ప సత్యాన్ని నిరూపించటానికి సాధనంగా ఉపయోగించుకోగలడు. అందుకే కేవలం పద్దెనిమిది నెలల జీవితానుభవాలతో పదేళ్ల పరిణితిని పొందగలిగానంటాడు శంకర్‌ నవల చివరిలో.

''పథేర్‌ పాంచాలి''లోని అపూ, ''వనవాసి''లోని సత్యచరణ్‌ వంటి తన ప్రాత్రలన్నింటిలోనూ అంతులేని జీవన తృష్ణను నింపాడు. బిభూతి భూషణ్‌. అది వాళ్లను ఒకచోట నిలవనివ్వదు. ముగింపులేని దారుల్లో ప్రయాణమంటే వాళ్లకు ఆకర్షణ. చంద్రగిరి శిఖరంలోని శంకర్‌ కూడా అ లాంటివాడే. ఎఫ్‌.ఎ పరీక్షలు రాసి గ్రామానికొచ్చిన ఆ యువకుడికి ఉత్తేజకరమైన జీవితం గడపాలని ఎన్నో కలలు. క్రీడలన్నా, సాహస గాథలన్నా ప్రాణమిచ్చే శంకర్‌ను ఇంటి ఆర్థిక పరిస్థితులు నిస్సారమైన గుమాస్తా ఉద్యోగంలోకి నెట్టాయి. అందులో ఇమడలేక దిగాలు పడిన అతనికి, ఒక పరిచయస్తుడి ద్వారా ఆఫ్రికాలోని ఓ రైల్వే కంపెనీలో ఉద్యోగం దొరకటంతో పొంగిపోయాడు. ఆఫ్రికాలోని మూన్‌ మౌంటెన్‌ (చందేర్‌ పహార్‌/చంద్రిగిరి శిఖరం) అనే పర్వతాన్ని గురించీ, దాన్ని అధిరోహించిన ఒక జర్మన్‌ పరిశోధకుడి సాహసం గురించీ పుస్తకాల్లో చదివిన శంకర్‌కు ఆఫ్రికాపై ప్రత్యేకమైన ఆకర్షణ.

గుంపులుగా తిరిగే సింహాలతో, నిశ్శబ్దంగా మృత్యుపాశాలు విసిరే పచ్చికబయళ్లతో నిండిన ఆఫ్రికన్‌ అరణ్యాల్లోకి శంకర్‌తోబాటు మనల్నీ నడిపిస్తాడు రచయిత. సమ్మోహనకరమైన ప్రకృతి సౌందర్యానికీ, అడుగడుగునా వెంటాడే మృత్యు భయానికీ మధ్యన శంకర్‌లో చెలరేగే భావోద్వేగాలను అద్భుతంగా వర్ణిస్తాడు భిభూతి భూషణ్‌. ''ఈ ఆఫ్రికా ఒక భయద సౌందర్య సీమ'' అనుకుంటాడు శంకర్‌. ''వెన్నెల వానలో తడుస్తున్న పచ్చికబయళ్ల మార్మిక సౌందర్యాన్ని'' చూసి ముగ్ధుడౌతూ ఉండగానే, వాటిలోంచి నిశ్శబ్దంగా వచ్చిన సింహం  తన కళ్ల ముందునుండే తోటి ఉద్యోగిని నోటకరచుకుపోయిన దృశ్యాన్ని చూసి వణికిపోతాడు. ఐనా, ఈ అరణ్యాల్లో ''ఎన్ని పేరు తెలియని మానవ జాతులూ, ప్రకృతి సోయగాలూ, ఎవరూ చూడని ప్రాణులూ, ఎవరూ వినని పక్షుల కలకూజితాలూ దాగి వున్నాయో'' అనే ఆసక్తి అతన్ని ముందుకే నడిపించింది.


(ఇంకా వుంది)
(  "చినుకు " మాస పత్రిక జూలై 2010 సౌజన్యం తో )

Monday, March 21, 2011

అక్షరాలా కళావతి - డా. గోపరాజు నారాయణరావు ...

అక్షరాలా కళావతి  ....
పుట్టాక అరవై సంవత్సరాలు జీవిస్తే షష్టిపూర్తి.
మరణానంతర జీవితానికీ అరవై ఏళ్లు నిండితే ఆ సందర్భానికి ఏమని పేరు పెట్టాలి ?!
త్యాగరాజు భక్తి సంగీతానికి పాఠాన్ని కట్టి, ముద్దుపళని రక్తి కావ్యానికి పునర్జన్మనిచ్చిన ఆ స్త్రీ 'రత్నం' పరిపూర్ణ మానవ జీవితానికో ప్రమాణం.
ఆమె మరణానంతర జీవితం 'షష్టిపూర్తి చేరుకున్న సందర్భంగా ...

బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్రపై గోపరాజు నారాయణరావు గారు రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.
జీవం ఉట్టిపడేలా అన్వర్‌ వేసిన చిత్రం కూడా చూడవచ్చు.
సాక్షి దిన పత్రిక 21 మార్చి 2011 సౌజన్యంతో 

...







Sunday, March 20, 2011

నేను దేవదాసీని... నేను నాగరత్నమ్మను - స్పెషల్‌ స్టోరీ - ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

నేను దేవదాసీని... నేను నాగరత్నమ్మను -  స్పెషల్‌ స్టోరీ 

1941... తిరువయ్యూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉదయాన్నే మొదలైన కచ్చేరీలు అర్థరాత్రి దాకా సాగేవి.
జనం కదిలేవాళ్లు కాదు.
ఐదు రోజుల ఉత్సవాల్లో వందమంది సంగీతకారులు పాటలు పాడాలి. నిష్ణాతులైన సంగీతకారులకు సైతం

ఒక్కొక్కరికీ అరగంటకు మించి పాడే అవకాశం లేదు.
అప్పుడొక లావుపాటి స్త్రీ ధన ధన చప్పుడు చేసుకుంటూ వేదిక ఎక్కింది. నల్లని శరీరం.. పెళపెళలాడే

పట్టుచీర .. ధగధగలాడే నగలు .. మైకు ముందు నిలబడి,
''నాన్‌ దేవర్‌ అడియాళ్‌ (నేను దేవదాసీని), నాన్‌ నాగరత్నమ్మాళ్‌'' అని దిక్కులు పిక్కటిల్లేలా

ఘీంకరించింది.
దిగ్గున మెరుపు మెరిసిన కొన్ని క్షణాల తర్వాత పిడుగు పడినట్లుగా చప్పట్లు మిన్ను ముట్టాయి.

ఆమె గొప్ప గాయని.
ఆమె గానం తిరువయ్యూరుకు కొత్త కాదు.
తమిళ, కన్నడ, తెలుగు ప్రాంతాలకూ ఆమె పాట పరిచితమే.
అయితే, ఆ క్షణం ఆ ఆఖరి దేవదాసి చేసిన యుద్ధనినాదం వెనుక ఉన్న వేదన, దు:ఖం , ఆగ్రహం,

అసహ్యం, ఛీత్కారం అక్కడున్న సంగీతప్రియుల్లో చాలామందికి అర్థం అయివుండకపోవచ్చు. ...

... ... ...
ఆదివారం ఆంధ్రజ్యోతి 20 మార్చి 2011 సంచికలో వెలువడిన
''బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర'' స్పెషల్‌ స్టోరీ
ఇక్కడ చదవండి.
రచయిత: ఆర్‌.ఎం.ఉమామహేశ్వరరావు.

 ...














...








మతతత్వంపై పాతికేళ్ల పోరు - ఎ.యం.ఖాన్‌ యజ్దానీ (డానీ)

మతతత్వంపై పాతికేళ్ల పోరు

ప్రతి ఉద్యమంలో అంతర్గతంగా రెండు సమూహాలు ఉంటాయి.
ఒకటి కార్యకర్తలది.
ఇంకోటి ఆలోచనాపరులది.
కార్యక్షేత్రాల రీత్యా ఈ రెండు సమూహాల మధ్య నిరంతరం ఒకరకమైన ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూ వుంటుంది. నిజానికి వీళ్లద్దరూ లేకుండా ఏ ఉద్యమం కూడా ముందుకు సాగదు. కార్యకర్తలు లేకపోతే అసలు ఉద్యమాలే మొదలు కావు.
మేధావులు లేకపోతే ఉద్యమాలకు దశ-దిశ అర్థం కాదు.

కష్టపడేది తామైతే కీర్తి ప్రతిష్టలు మేధావులకు దక్కుతున్నాయని కార్యకర్తలు అసంతృప్తితో వుంటే; బండ చాకిరీ చేస్తారు గానీ భూత భవిష్యత్తుల గురించి బొత్తిగా ఆలోచించరని మేధావులు కార్యకర్తల పట్ల అసహనంతో వుంటారు. చాలా చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ రెండు సమూహాల మధ్య సయోధ్య సాధ్యమవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్‌లో అ లాంటి అరుదైన సయోధ్య పేరే బాల గోపాల్‌.
ఆయన మేధావుల్లో కార్యకర్త.
కార్యకర్తల్లో మేధావి. ....
...


ఆదివారం ఆంధ్రజ్యోతి 20 మార్చి 2011 సంచికలో ''మతతత్వంపై బాలగోపాల్‌'' పుస్తక విశ్లేషణ ఇక్కడ చదవండి. విశ్లేషకులు : ఏ.యం.ఖాన్‌ యజ్దానీ (డానీ)





హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌