Tuesday, February 23, 2010

నేను హిందువు నెట్లయిత? పునర్ముద్రణ ... మరో కొత్త అధ్యాయం తో ...


నేను హిందువు నెట్లయిత? ఆరో ముద్రణ మరో కొత్త అధ్యాయంతో వెలువడింది. ఆ కొత్త అధ్యాయం లోంచి కొంత భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాము:


….. “గత తొమ్మిదేళ్లలో ఈ పుస్తకంపై వివిధ పత్రికల్లో ఎన్నో సమీక్షలు వచ్చాయి. కొందరు సమీక్షకులు ఇందులోని కొన్ని అస్పష్టతలను, చిన్న చిన్న లోటుపాట్లను ఎత్తి చూపారు. అవి సహజమైనవి కూడా. అయితే ఈ దశలో నేనీమీ మార్పులూ చేర్పులూ చేయదలచుకోలేదు. ఈ పుస్తకం ఇప్పటికే అనేక విజయాలను సాధించింది. తీవ్రమైన విమర్శలను కూడా ఎదుర్కొంది.

1996వ సంవత్సరంలో నాన్‌ఫిక్షన్‌ విభాగంలో బెస్ట్‌ సెల్లరైంది. యావత్‌ ప్రపంచం నూతన సహస్రాబ్దిలో అడగుపెడ్తున్న సమయంలో అంటే 2000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి వెలువడే 'ది పయనీర్‌' అనే సుప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక 'వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ' (''నేను హిందువు నెట్లయిత'') పుస్తకాన్ని ఈ మిలీనియంలో దళిత బహుజన దృక్పథంతో వెలువడిన ఐదు అత్యుత్తమ రచనల్లో ఒకటిగా ప్రకటించింది. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ సుప్రసిద్ధ రచన ''కుల నిర్మూలన'' సరసన నా పుస్తకం చోటు సంపాదించుకోవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది.

అంతేకాకుండా ఈ పుస్తకం అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయింది. ఒక విధంగా హిందూత్వ శక్తులు (బిజెపి, నేషనల్‌ డెమోక్రాటిక్‌ అ లయెన్స్‌) దేశాన్ని ఏలుతున్న నేపథ్యంలో ఈ పుస్తకం దళితుల, బహుజన కార్యకర్తల చేతుల్లో ఒక ఆయుధంగా మారింది.

ఈ పుస్తకం వల్లనే ఈ మధ్య భారత దేశంలోని ప్రధాన స్రవంతి పత్రికల్లో కొన్ని ముఖ్యమైన, సిద్ధాంతపరమైన వ్యాసాలు రాసేందుకు నాకు అవకాశం లభించింది. భారతీయులకు పనికొచ్చే సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రత్యామ్నాయాలను అర్థం చేసుకునేందుకు నేను విదేశాలలో కూడా పర్యటించగలిగాను.

ఈక్రమంలోనే నేను మరో రెండు పుస్తకాలను - ''గాడ్‌ యాజ్‌ ఎ పొలిటికల్‌ ఫిలాసఫర్‌; బుద్ధాస్‌ ఛాలెంజ్‌ టు బ్రాహ్మణిజం'' (దీనిని 'దేవుడి రాజకీయ తత్వం - బ్రాహ్మణత్వం పై బుద్ధుడి తిరుగుబాటు' అనే పేరుతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌వ తెలుగులో వెలువరించింది), ''బఫెల్లో నేషనలిజం: ఎ క్రిటిక్‌ ఆఫ్‌ స్పిరిట్యువల్‌ ఫాసిజం'' రాశాను. వాటిని కూడా ''వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ''ని ప్రచురించిన 'సామ్య' వారే ప్రచురించారు.

ఆధునిక కాలంలోని హిందూ మతంపై నేను చేసిన విమర్శకు మూలాలు ప్రాచీన కాలంనాటి బౌద్ధ పోరాటంలోనే వున్నాయి. నేనేమీ హిందూమతాన్ని విమర్శ కోసమని విమర్శించడంలేదు. హిందూ ఆధ్యాత్మిక నియంతృత్వానికి ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని ప్రయత్నిస్తున్నాను. ''నేను హిందువు నెట్లయిత?''లో దళితీకరణను ఒక ఆదర్శ ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన నేను ఆతరువాత అసలు హిందూ బ్రాహ్మణీయ శక్తుల 'ఆవు మార్కు' జాతీయవాదం స్థానంలో 'బర్రె మార్కు' జాతీయవాదంను ముందుకు తెచ్చే స్థాయికి చేరుకున్నాను.

ఇట్లాంటి పుస్తకం రాస్తున్నప్పుడు నేను సైద్ధాంతికంగా, భౌతికంగా ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసివచ్చిందో ఈ చివరి మాట కొంతవరకు వివరిస్తుంది. అదేవిధంగా నేను రచనా వ్యాసంగాన్ని ఓ 'ఆలోచనలను సంస్కరించుకునే ప్రక్రియ'గా ఎంచుకున్న వైనాన్ని కూడా ఇది వివరిస్తుంది.

భారతదేశం అనేక సంస్కృతులకు నెలవు కావడం, సామాజిక సాంస్కృతిక విప్లవాలూ, దళితబహుజన, మహిళా పోరాటాలు అనేకం జరుగుతుండటం వల్ల నా పని ఒకింత సులువయింది. అయితే, భారత దేశంలో ఆలోచనా సంస్కరణ నిమిత్తం ప్రచారం సాగిస్తున్న సమయంలో నేను ఎన్నో దాడులనూ, దూషణలనూ ఎదుర్కొన్నాను. కాగా అటు బ్రాహ్మణీయ శత్రువుల దాడులు, ఇటు శ్రేయోభిలాషుల పొగడ్తలు నన్ను భయపెట్టనూలేదు, సంతృప్తిపరచనూలేదు. నేను ''సంతృప్తిచెందిన మనిషి కంటే అసంతృప్తితోవున్న పంది మేలు'' అన్న లోకోక్తిని నమ్ముతాను. ముఖ్యంగా నా శరీరం మీద కంటే మనసు మీద జరిగిన దాడులు నా కృషిని మరింత పట్టుదలగా కొనసాగించాలనే దీక్షను పెంచాయి.

సిద్ధాంత రచన చేసే హక్కు నిరాకరించబడ్డ వాళ్ళు ఇవాళ తమ చరిత్రనీ, ఇతర్ల చరిత్రనీ కూడా రాసేస్తున్నారు. దానిని వారు తమ సాంఘిక-రాజకీయ ఉద్యమంగా చేసుకుంటున్నారు. ఈ రాసే ఉద్యమానికి కొన్ని పరిమితులు వున్నప్పటికీ, రాసే హక్కులేని వాళ్ల సంకెళ్లను అది ఛేదించింది. బలహీనుల చేతుల్లో రచన ఒక ఆయుధంగా మారింది. కులతత్వ సమాజంలో బ్రాహ్మణీయ శక్తులు దళిత బహుజనులను రాయకుండా అడ్డుకుని వారి అసంఖ్యాక భౌతిక పోరాటాలు మరుగునపడిపోయేట్టు చేశాయి. చారిత్రక పోరాటాలు కనుమరుగైపోతే స్వేచ్ఛా పిపాస రాజుకోవడం సాధ్యపడదు. తీవ్రమైన ప్రతిఘటనల మధ్య రాయడమనే ప్రక్రియను కొనసాగించడం చాలా కష్టం. అయినప్పటికీ అది నిర్విరామంగా కొనసాగితీరాలి. ఒక హిందువు కాని భారతీయుడిగా నేను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

వేధింపులు

మండల్‌ ఉద్యమం జరిగి, బాబ్రీ మసీదు కూల్చివేతకు గురై ఇప్పటికే దశాబ్దం దాటింది. ఈ రెండు ప్రధాన ఘటనల నేపథ్యంలోనే నేను ''వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ?'' (నేను హిందువు నెట్లయిత?) పుస్తకాన్ని రాశాను. ఈ దేశంలో హిందువులు, అధికసంఖ్యాక వర్గాలు అనే వాదాన్ని తిప్పి కొట్టడానికే నేను దీన్ని రాశాను. సూద్రుల హిందూ మూలాల వాదాన్ని నిర్ద్వంద్వంగా ఖండించిన మొట్టమొదటి వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తిని నేనే. అది నా పుస్తకం శీర్షికలోనే ప్రస్ఫుటమవుతుంది.

మహాత్మా జ్యోతిరావు ఫూలే, పెరియార్‌ ఇ.వి. రామస్వామి నాయకర్‌ సూద్ర కోణం నుంచే హిందూమతం పై విమర్శలు చేశారు. కానీ వారు 'సూద్రులు పుట్టుకతోనే హిందువులన్న' సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. దారుణమైన అంటరానితనపు అణచివేతకు గురవుతూ వచ్చిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ''నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చచ్చిపోను'' అని ప్రకటించాడు. హిందూ మతం తాలూకు బ్రాహ్మణీయ నిర్వచనాన్ని అంబేడ్కర్‌ ఆమోదించాడు. తత్సంబంధ కులం, హిందూమతం సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే ఆయన దానిపై విమర్శ చేశారు. హిందూ సిద్ధాంత గ్రంథాల ప్రాతిపదికతోనే ఆయన కులాన్నీ, హిందూ మతాన్నీ విశ్లేషించాడు.

హిందూ మత నియంతృత్వ స్వభావాన్ని పరిశీలించేందుకు నేను విభిన్న మార్గాన్ని అనుసరించాను. దళితబహుజన ప్రజానీకపు రోజువారీ జీవిత విధానాన్ని లోతుగా పరిశీలిస్తే వారి హిందువేతరత్వానికి కావలసినన్ని ఆధారాలు లభిస్తాయి. బాపన, కోమటి, క్షత్రియ కులాలవారితో దళితబహుజనులకు ఎలాంటి పోలిక లేదని నిరూపించేందుకు నేను ఈ పుస్తకంలో హిందూమతాన్ని ఒక జీవిత విధానంగా, ఒక మతంగా రెండు విధాలా పరిశీలించాను. మానవ జీవితాన్ని నిర్దేశించే సాంప్రదాయక ఆచారవ్యవహారాల్లో, సంస్కృతుల్లో దళితబహుజనులకూ బ్రాహ్మణీయ శక్తులకూ మధ్య ఎన్నో స్పష్టమైన తేడాలు మనకు కనిపిస్తాయి.

ప్రస్తుతం నేనొక హిందువును కాని భారతీయుడిని. నా సూద్ర వ్యక్తిత్వాన్ని, సూద్ర చైతన్యాన్ని బ్రాహ్మణీయ శక్తులు అసహ్యించుకుంటాయి. ఆవిధమైన చైతన్యానికి చారిత్రకంగా హిందూమత పునాదులను పెకలించే సామర్థ్యం వుందని వారికి తెలుసు. దళిత మేధావుల్లో ఒక వర్గం నా వాదనని కొంత అనుమానంగా చూస్తుంటే, మరొక వర్గం ఇది దళిత-వెనుకబడిన వర్గాల (ఓబీసీ) చారిత్రక ఐక్యతకు దోహదం చేస్తుందని ఆశిస్తోంది. వెనుకబడిన తరగతులలో (ఓబీసీ), సూద్ర అగ్రకులలో (వీరిని నా పుస్తకంలో నయా క్షత్రియులు అని అభివర్ణించాను) కుల, మత తాత్విక చర్చలలో పాల్గొనగలిగే మేధోవర్గం చాలా తక్కువ. వారు ఈ పుస్తకాన్ని పూర్తిగా స్వీకరించనూలేరు, గట్టిగా వ్యతిరేకించనూ లేరు. వారిలో విద్యావంతులు ఎక్కువగా అధికారం మీదా, సంపాదన మీదా దృష్టిని కేంద్రీకరిస్తారు. వారికి ఈ చర్చ గురించే పట్టింపులేదు. ఈ పరిస్థితుల్లో వారికి అత్యున్నత అధికారంలో గానీ గుత్తాధిపత్య పెట్టుబడిలో గానీ తమ వంతు వాటా లభించదు. వాళ్ల ఆలోచనలు బ్రాహ్మణీయ సిద్ధాంతాల ప్రభావంతో మసకబారిపోయి వున్నాయి.

నా ఉద్దేశం ప్రకారం ఆధ్యాత్మిక వాస్తవికత, నిత్య జీవన విధానం ఈ రెండు పోరాటాల్లో విజయం సాధిస్తేతప్ప వారి లక్ష్యం నెరవేరదు. మొద్దుబారిన మనసు ఈ వాస్తవాన్ని లేదా ఇందులో దాగివున్న నిజాన్ని గుర్తించలేదు. ఇ.హెచ్‌.కార్‌ ''వాట్‌ ఈజ్‌ హిస్టరీ'' అనే తన సుప్రసిద్ధ గ్రంథంలో ఇలా అంటాడు : 'చారిత్రక వాస్తవం అనేది ఒక తిత్తి లాంటిది దానిని మనం సిద్ధాంతంతో నింపివేయాలి'. భారతీయ జ్ఞాన తిత్తుల నన్నింటినీ దళితబహుజన ఉత్పత్తితత్వంతో నింపాల్సిన అవసరం వుంది. ఉత్పత్తి వ్యతిరేక బ్రాహ్మణిజం తిరుగులేని పెత్తనాన్ని చెలాయిస్తున్న దేశంలో ఉత్పత్తితత్వం గురించీ, సామాజిక- సైద్ధాంతిక సమానత్వం గురించీ ప్రచారం చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.


హిందూ ఆధ్యాత్మిక నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న క్రమంలో నాకు హిందూత్వ బ్రాహ్మణీయ శక్తుల నుంచి అనేక విద్వేషపూరిత బెదిరింపులు వచ్చాయి. సుప్రసిద్ధ వార్తా పత్రికలలో ఆధ్యాత్మిక నియంతృత్వం- దళితబహుజనులపై దాని ప్రభావం గురించి నేను రాసిన రచనలకు ప్రతిస్పందనగా ఆ శక్తుల నుంచి భారతీయ మీడియాలో తిట్లూ శాపనార్థాలతో కూడిన లేఖలు అనేకం వచ్చాయి. ముఖ్యంగా గుజరాత్‌ జాతిహత్యాకాండ గురించి రాసిన ''అయోధ్య: వాట్‌ స్టేక్స్‌ డూ ఓబీసీస్‌ హావ్‌?'' (హిందూ 18 మార్చి 2002) తర్వాత హిందూ కార్యాలయానికి ఒక బెదిరింపు లేఖ అందింది. దానిని వాళ్లు నాకు పంపారు. ఊరూపేరూ లేని ఆ లేఖలో నీచమైన తిట్లతో పాటు - ''ఇష్టమొచ్చిన చెత్త ఏం రాసినా నాకేం కాదని అనుకుంటున్నావేమో - ఈ రాతలను ఇట్లాగే కొనసాగిస్తే నీ తలకాయ హైదరాబాద్‌లోని సాలార్‌ జంగ్‌ మ్యూజియంలో వేలాడదీస్తాం జాగ్రత్త'' అన్న బెదిరింపు వుంది.

హిందుత్వ శిబిరం, బాపన, కోమటి సంస్థలు నా ఆలోచనా విధానంమీదా, నా రచనలమీదా విరుచుకుపడుతూ బహిరంగంగానూ, అంతర్గతంగానూ అనేక లేఖలు రాసి తమ ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని చాటుకున్నాయి. నన్ను ఉద్యోగంలోంచి తొలగించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యానికి వారు ఎన్నో లేఖలు రాశారు. అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.సి.రెడ్డి తన రిజిస్ట్రార్‌ ద్వారా నాపై రచనలు చేయడం ఆపివేయమంటూ ఒత్తిడి తెచ్చిన వైనాన్ని ''బఫెల్లో నేషనలిజం'' అనే నా పుస్తకం ముందుమాటలో ప్రస్తావించాను. అట్లాంటి ప్రతి సందర్భంలో నేను గట్టిగా నిలబడ్డాను. నా రచనా వ్యాసంగాన్ని మరింత పట్టుదలగా కొనసాగించాలని తీర్మానించుకున్నాను. అంతకంతకూ దాడులూ, బెదిరింపులూ ఎక్కువవడంతో అనేకమంది దళితబహుజన యువకులు ముందుకొచ్చి నాకు అండగా నిలబడ్డారు.

బ్రాహ్మణిజం ఆధ్యాత్మిక నియంతృత్వ కట్టడాల సముదాయాన్ని ఎంత పకడ్బందీగా నిర్మించుకుందంటే ఇప్పుడది స్వయంగా కావాలని కోరుకున్నా అందులోంచి బయటపడం సాధ్యం కాదు. హిందుత్వ బ్రాహ్మణీయ శక్తులు ఎందుకు భయపడుతున్నాయంటే - దళితులకు ఆధ్యాత్మిక విముక్తికి సంబంధించినంతవరకు తమంటూ ఒక స్పష్టమైన ఎజెండా ఎలాగూ వుంది (వారిలో చాలామంది క్రైస్తవ మతంలోకో, బౌద్ధ మతంలోకో మారిపోతున్నారు); మరి తమ హిందూత్వ వ్యవస్థకు భౌతిక శక్తిగా వున్న వెనుకబడిన వర్గాల వారు (ఓబీసీలు) కూడా తమ ఆధ్యాత్మిక విముక్తి మార్గాన్ని రూపొందించుకుని వెళ్లిపోతే బ్రాహ్మణిజం, హిందూమతం కాస్తా పేకమేడలా కుప్పకూలిపోతుంది.

సిద్ధాంత గ్రంధాల రచనా ప్రక్రియ ఎక్కడ తమ ఆధిపత్యానికి తూట్లు పొడుస్తుందోనన్నది వారి భయం. అది నిజం కూడా. ఎందుకంటే ఈ రచనలు వారి చారిత్రక దుర్మార్గాలను ఎండగడ్తాయి. అందుకే వారి నిరాశా నిస్పృహలు అంతకంతకూ ఎక్కువగా బయటపడుతున్నాయి. సమానత్వ సిద్ధాంతం అంటే బ్రాహ్మణిజానికి ఎప్పుడూ గుండెల్లో దడగానే వుంటుంది. ఎందుకంటే వారిది అసమానత్వ సిద్ధాంతం.

ఈ అసమానతలు దైవనిర్ణయమని వారి వేద గ్రంథాలు ఉద్ఘోషించాయి. వాళ్లు తమ దేవుణ్ని తమ రూపంలో ప్రతిష్ఠించుకున్నారు. అందుకే దేవుడి శరీరం కుల వ్యవస్థకు మూలాధారంగా మారింది. వారి దేవుడు ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించాడు. ఆయుధాలను ఉపయోగించి కింది కులాల వాళ్లను చంపడమే వారి దేవుడి పవిత్ర కార్యక్రమంగా మారింది.

హిందూ బ్రాహ్మణీయ దేవుడు విశ్వజనీన దేవుడికి భిన్నంగా వుంటాడు. విశ్వజనీన దేవుడు ప్రయోజనకారుడు. కాయకష్టం చేసే ప్రజానీకం వర్ణం, కులం, జాతి, స్త్రీపురుష వివక్షలేకుండా అంతా ఆ దేవుడిని తమ వాడిగా స్వీకరిస్తారు. దేవుడు హంతకుడు కాదు. ఆయనొక సంస్కర్త. వ్యక్తులనూ, సామాజిక వర్గాలనూ, జాతులనూ వారి నేరాలతో, ప్రవర్తనతో, వైఖరులతో నిమిత్తంలేకుండా సంస్కరించడమే ఆయన విధి. కానీ హిందూ దేవుళ్లంతా ఈ విశ్వజనీన దైవ సిద్ధాంతానికి, ఆ ప్రయోజనాలకూ పక్కా వ్యతిరేకులు. వారు ఈ అమానవీయ దేవుడిని సృష్టించడం వల్ల సమాజానికి తీరని నష్టం వాటిల్లింది. ఆ దేవుడిని బ్రాహ్మణీయ రూపంలో సృష్టించినమాట నిజం. ఏ ఉత్పత్తిపనులూ చేయని బ్రాహ్మణుల ఉనికినీ, పెత్తనాన్నీ కాపాడడానికి అట్లాంటి దేవుడి సృష్టి తప్పనిసరి అయింది.

దళితబహుజనుల భావనలోని దేవుడికీ, బాపనవర్గాల భావనలోని దేవుడికీ మధ్య వున్న తాత్విక తేడాని నేను ఈ పుస్తకంలో వివరించాను. అంతర్జాతీయంగా విస్తరించిన క్రైస్తవం, ఇస్లాం వంటి మతాల్లో మాదిరిగా దేవుడిని ప్రతిష్టించుకోలేకపోయినప్పటికీ దళిత బహుజనులకు దేవుడు తమ ఉనికిలో ఒక అంతర్భాగం. ఏసుక్రీస్తు, మహమ్మదు ఇరువురూ మూఢనమ్మకాలలో కూరుకుపోతున్న ఆనాటి తమ సమాజాలను ఉద్ధరించారు.

భారతదేశంలోని దళితబహుజన ప్రజానీకం మాత్రం ఆధ్యాత్మిక వాస్తవికత విషయంలో అన్ని ఆధునిక సమాజాలలోని సానుకూల అంశాలను పాటిస్తూనే విగ్రహారాధన స్థాయిలో ఆగిపోయారు. మానవీయ లక్ష్యం కలిగిన దేవుడిని అంటే మనుషులను ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని దళితబహుజన దేవుడిని పరిశోధించాల్సిన అవసరం వుంది. ఆ పరిశోధనలో భాగంగానే 'నేను హిందువు నెట్లయిత?' రాయడం జరిగింది. ఆధ్యాత్మిక సమానత సాధించటం కేవలం ఆధ్యాత్మిక చర్య ద్వారా మాత్రమే సాధ్యం కాదు. దానికి ఒక రాజకీయ చర్య కూడా కావాలి. ఆధ్యాత్మిక, రాజకీయ సంస్థల మధ్య చాలా దగ్గరి సంబంధాలు వున్నాయి. అవి పరస్పరం పెనవేసుకుపోయాయి కూడా. ఆ సంబంధం జీవితంలోని అన్ని రంగాలకూ విస్తరిస్తుంది.

నా రచనలు, ప్రత్యేకించి ''నేను హిందువు నెట్లయిత?'' పుస్తకం సూద్ర/ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీల) జీవనవిధానాన్ని వారి పరిభాష, పలుకుబడుల్లోనే విశ్లేషిస్తాయి. బ్రాహ్మణీయ సంస్కృతి, నాగరికత, చరిత్ర సారాన్ని నేను నిలదీస్తున్నాను కాబట్టి బాపన శక్తులు తప్పనిసరిగా నా రచనలపై విరుచుకుపడతాయి.

నేనివాళ రాస్తున్నది గేదెల/బర్రెల చరిత్ర. కానీ ఇన్నాళ్లూ అన్ని రకాల బ్రాహ్మణిజాలూ రాస్తూ వచ్చింది కేవలం ఈ దేశ ఆవుల చరిత్ర. నిజానికి ఆవు ఇచ్చే పాలు చాలా తక్కువ. ఆవు మహా పవిత్రమైనది అని కొందరు వాదిస్తే మరి కొందరు ఆ వాదనను వ్యతిరేకిస్తారు. ఆవు లౌకిక (సెక్యులర్‌) జంతువు అని కొందరంటే, కాదు సామాజిక జంతువని మరికొందరంటారు. అయితే ఎవరూ కూడా బర్రెల గురించి మాట్లాడరు.

విచిత్రం ఏమంటే వీళ్లంతా ఈ వినాశకర వాదోపవాదాలు చేసేటప్పుడు తాగే కాఫీ టీలు, పెరుగూ మజ్జిగా (సల్ల) అన్నీ కూడా కచ్చితంగా కేవలం బర్రెపాలతోనే తయారైవుంటాయి. కాబట్టి నా ముందూ, దళితబహుజన మేధావుల ముందూ వున్న పెద్ద సవాలు ఈ చర్చలో బర్రెను కేంద్రబిందువుగా చేయడం ఎలా అన్నదే. బర్రె ఎలాగైతే హిందువు కాదో నేనూ అంతే. అట్లాగే నేను ఎట్లాగైతే భారతీయుడినో బర్రె కూడా భారతీయ జంతువే. చారిత్రకంగా ఆలోచిస్తే ఆవు భారతీయత అనుమానాస్పదంగా వుంటుంది కదా? అట్లాగే బాపన శక్తుల దేశభక్తి కూడా నిజంగా అనుమానాస్పదమైనదే కదా?

ఆధ్యాత్మిక నియంతృత్వం

ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాల్లో హిందూమతం ఒకటి. ఆ నాలుగు ప్రధాన మతాల్లో అతి తక్కువ సంఖ్య కలిగిన మతం కూడా హిందూ మతమే. ఈ మతం విస్తరించిన భౌగోళిక ప్రాంతం కూడా చాలా తక్కువ. హిందూ మతం అతి ప్రాచీనమైనదని బాపన రచయితలు ఎంతగానో ఘోషిస్తుంటారు. కానీ ఇటీవలి మత దృక్పథం ప్రకారం చూస్తే మాత్రం హిందూమతం నిన్నమొన్నటిదే.

''హిందూ'' అన్న పదాన్ని మత దృష్టితో మొట్టమొదటగా వాడిన వాడు 'అ ల్‌్‌ బెరూనీ'. ఆయన రాసిన పుస్తకం శీర్షిక ''అల్‌ హింద్‌''. హిందూమతం అన్న భావనకు మొట్టమొదటగా ప్రాతిపదికను కూర్చింది ఆ పుస్తకమే అనిపిస్తుంది. అ ల్‌ బెరూనీ భారతదేశంలోని ముస్లిమేతరుల్ని సంబోధించేందుకు 'హింద్‌' అనే పదాన్ని వాడారు తప్ప 'హిందువు' అన్న పదాన్ని కాదు. ఆవిధంగా హిందూమత నిర్మాణానికి హిందువు కాకుండా ఒక ముస్లిం మేధావి మొట్టమొదటగా ప్రయత్నించాడు. ఆయన 'హింద్‌' అనే పదాన్ని మత దృష్టితోనే వినియోగించినట్టు అనిపిస్తుంది.

భారతదేశంలోని ముస్లిమేతర జనాభాలో జరిగిన ఈ చర్చలో అనేకమంది ముస్లిం మేధావులు భౌగోళిక దృష్టితో ఈ ప్రాంత ప్రజల్ని హింద్‌ అనే సంబోధించారు. వాళ్లు నివసించే ప్రాంతాన్ని హిందూస్థాన్‌ అన్నారు. అయితే 'హిందుస్థాన్‌' అన్న పదం వాడుకలోకి వచ్చింది 'సింధుస్థాన్‌' అన్న పదంలోంచి. అంటే సింధూనదీ పరీవాహక ప్రాంతమన్నమాట. అ ల్‌ బెరూనీ వాడిన 'హింద్‌' అన్న పదం కూడా కచ్చితంగా 'సింధ్‌' లాగే వుంటుంది.

వలసవాద కాలంలో ప్రాచ్య మేధోవర్గం క్రైస్తవులను ఏవిధంగానైతే ఒక మతంగా పరిగణించిందో అదేవిధంగా భారతదేశంలోని ముస్లిమేతరుల నందరినీ అది హింమతస్తులుగా పరిగణించింది. క్రైస్తవ మతంలో పుస్తకం చదివే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించారు.
అంటరానితనం, ఒక మనిషిని ముట్టుకోకూడదన్న భావన వారిలో లేదు. అయితే పైకి కనిపించే శరీర రంగులోని తేడాపై ఆధారపడిన జాతి విభజన మాత్రం వారిలో వుంది.

పాశ్చాత్య మేధావులు అల్‌ బెరూనీ వంటి ముస్లిం విద్యావేత్తల రచనల నుంచి భాషను అరువు తెచ్చుకున్నారు. హెగెల్‌ తన సుప్రసిద్ధ గ్రంధం ''ఫిలాసఫీ ఆఫ్‌ హిస్టరీ'' లో వివిధ దేశాలలో సాగిన నాగరికతా ప్రక్రియను సమీక్షించాడు. ఆయన భారతీయ నాగరికత సొంత స్ఫూర్తితో, సొంత చరిత్రపై ఆధారపడి ఏర్పడింది కాదన్నాడు. ఈ దేశంలో ప్రతీదీ - సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గంగా, సింధూ తదితర నదులూ, జంతువులూ పూలూ అన్నీ కూడా వాళ్లకు దేవుళ్లు కావడమే అందుకు కారణం అన్నాడు. కుల వ్యవస్థ వల్లనే భారతీయుల 'ఆత్మ' ఎదగలేకపోయిందని హెగెల్‌కు తెలుసు. అయితే, భారతదేశంలో అంటరానితనం వుందని ఆయనకు కచ్చితంగా తెలుసోలేదో చెప్పలేం. ఆయన అన్ని కులాలనూ ఒకేగాటనకట్టి హిందువులుగా పరిగణించాడు. అందుకే ఆయన ''ప్రతి ఒక్క హిందువుకూ నిర్దిష్టమైన వృత్తి కేటాయించబడి వుంటుంది'' అన్నాడు.

హిందూ మతం - బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం మతాల మాదిరిగా సొంతగా ఒక విశ్వజనీన ఆత్మను రూపొందించుకొని ఎదగలేకపోయింది. అట్లాగే భారతదేశాన్ని ఒక చారిత్రక జాతిగా అది ఎదగనివ్వలేదు. ఎందుకంటే హిందూమతం పౌర సమాజ పునాదినుంచే ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని ప్రతిష్టించుకుంది. కానీ, మిగతా మూడు మతాలూ పౌర సమాజం అట్టడుగునుంచీ ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నాయి. అందువల్లే వాటికి తమదంటూ ప్రత్యేకమైన చారిత్రకత ఏర్పడింది. హిందూ మతం మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని బాపనోళ్లకు, కోమట్లకు, క్షత్రియులకు కట్టబెట్టింది. 'బ్రహ్మదేవుని అరికాలి నుంచి పుట్టుకొచ్చిన' సూద్రులను/ఇతర వెనుకబడిన తరగతులవారిని అది తాత్వికంగా పూర్తిగా ఉపేక్షించింది, అణిచివేసింది. … “



నేను హిందువు నెట్లయిత?
హిందూ తత్త్వం, సంస్కృతీ, రాజకీయ అర్థ శాస్త్రం పై సూద్ర విమర్శ
రచన : కంచ ఐలయ్య

English Original: Why I Am Not A Hindu?
Kancha Ilaiah
SAGE Publications
www.sagepublications.com

తెలుగు అనువాదం : ఎ సురేంద్ర రాజు
కొత్త అధ్యాయం అనువాదం : ప్రభాకర్ మందార
పేజీలు : 155
వెల: రూ. 55

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌